Site icon Sanchika

మహాప్రవాహం!-16

[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘మహాప్రవాహం!’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[రెండో రోజు కూడా కరెంటు ఇబ్బంది పెడుతుంది. సాయంత్రానికి మిరపతోట తడుస్తుంది. రాత్రికి కొండారెడ్డి యల్లసామిని తోడు తీసుకుని పొలానికి వెళ్తాడు. మడిలోకి నీళ్ళు వదిలి అటుగా వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు గురించి మాట్లాడుకుంటారు. ఇంతలో మళ్ళీ కరెంటు పోతుంది. అర్ధరాత్రి దాటాకా వస్తుంది. ఆ తర్వాత రెండు గంటలకి టమాటా చేను కూడా తడుస్తుంది. షెడ్డుకు తాళం వేసుకుని ఇద్దరూ ఇంటికి బయల్దేరుతారు. వ్యవసాయంలో వస్తున్న మార్పుల గురించి మాట్లాడుకుంటూ వెళ్తారు. పొద్దున్నే వచ్చి కూలి డబ్బులు తీసుకెళ్ళమని చెప్తాడు కొండారెడ్డి. డోనులో వైను షాపు కోసం అడ్వాన్స్ ఇచ్చాక, బొమ్మిరెడ్డి పల్లెకు వస్తాడు సంజన్న గౌడ్. జరిగినదంతా భార్య విమలమ్మకు చెప్తాడు. అంతా మంచే జరుగుతుందని అంటుందామె. పెద్ద పరీక్షలయ్యాక, భార్యాపిల్లల్ని డోనుకు తీసుకువెళ్తానని చెప్తాడు గౌడు. ఆ మాటలు విన్న ప్రదీప్, నాన్నా, నేను ఎనిమిదో క్లాసు డోనులో చదవాలా అని అడుగుతాడు. అవునంటాడు తండ్రి. ఆ రాత్రికి భర్తకి ఇష్టమైన వంటకాలు చేస్తుంది విమలమ్మ. భవిష్యత్తు ఎలా ఉండబోతోందో అన్న ఆలోచనతో ఎప్పటికో నిద్రపోతారా దంపతులు. మర్నాడు ఉదయం ఊర్లోని వారందరినీ కలిసి తన పొలం గుత్తకిద్దామని అనుకుంటున్నాననీ, చేసేవారైనవా ఉంటే చెప్పమని అడుగుతాడు. మానుకింది మద్దయ్య తీసుకోవచ్చు, ఆయన్ని అడగండని చెప్తాడు దాసప్ప. సంజన్న గౌడు మద్దయ్య ఇంటికి వెళ్ళి అతన్నీ, అతని కొడుకూ కోడల్ని పలకరిస్తాడు. కుశల ప్రశ్నలు అయ్యాకా తన పొలం గుత్తకు తీసుకోమని అడుగుతాడు. ‘గుత్త యింతని నివ్వు పట్టుబడితే యియ్యలేను. దేవుని దయవల్ల పంట పండితే నీకూ కొదవ ల్యాకుండా ఎంతో కొంత ఇస్తా’ అంటాడు మద్దయ్య. సరేనంటాడు సంజన్న. అక్కడ్నించి తిరుపాలు హోటల్‍కి వెళ్ళి తాను తిని, భార్యకీ, కొడుక్కీ వడలు పార్సెలు కట్టించుకుంటాడు. టీ తాగమంటుంది తిరుపాలు భార్య రాజమ్మ. ఇక చదవండి.]

“నాకు గుడ్క జెయ్యమ్మే” అన్నాడు తిరుపాలు. “ఈ మధ్య కాపీ మానేసినారు జనాలు – అందురు టీ నే”

“సరే గాని బావా, లింగయ్య గాడేడి? కనబడడు!”

“వాడు మానుకొని బోయిండ్ల్యా! మాకు గుడ్క ఈ రెండు మూడేండ్లాయ బ్యారాలు తగ్గినాయి. శానామంది ఊరిడిసిపోతుండారు గద!”

ఆ మాటలకు సంజన్న గౌడు తలవంచుకొనినాడు. “నేను గుడ్క బావా!” అన్నాడు. “నీవని కాదు నాయినా! పాడు కాలం దాపురిచినాది. సేద్దాలు తగ్గిపాయ. కూలీ పనులు దొరకవు. మన్సులు ఏం చేస్తారు పాపం! లింగయ్యకు నెలనెలా జీతం ఇయ్యనీకె గూడ్క బరకతు ల్యాకపాయ. వానికీ ప్రాయం వచ్చినది. కర్నూల్లోన ఏదో మిలిటరీ ఓటలంట. దాంట్లో పని చేస్తాండాడంట. తిండి పెట్టి నెలకు మూడు నూర్లిస్తారంట. పెండ్లి గుడ్క అయింది వానికి. వాని పెండ్లాము గుడ్క అదే ఓటల్లో గిన్నెలు కడగడం, కసువు ఊడ్చటం జేస్తాదంట. ఆ యమ్మిది గార్గేయపురమంట. పోనీ వాడయినా బాగుపడినాడు”

“యాపారం బాగా తగ్గిపోయినట్టున్నాది!”

“అవునప్పా, పొద్దున అరగోనె బొరుగులు నానబెత్తాంటిమి ఉగ్గానికి. బజ్జీలు పెద్ద జల్ల (గంప) నిండా ఏస్తాంటిమి. ఇప్పుడు పావు గోనెడు ఏసినా కర్చు గావడంల్యా. మనుసులు తగ్గిపోయినంక యాపారం తగ్గిపోక ఏం జేస్తాది. ఐదు కేజీల అలచందలు నానబోసి రుబ్బుతాంటిమి వడలకు. ఇప్పుడు రెండు కేజీల కేసినా ఇగ్గడంల్యా”

రాజమ్మ గాజు గలాసుల్తో ఇద్దరికి టీ తెచ్చిచ్చినది.

“ఈ మధ్య అయివే మింద ఎవరో సాయిబు, ఆ యప్పది పాన్యమంట, వచ్చి ఓటలు బెట్టినాడు. గోడలు తీపి షెడ్డు ఏసి, కురిసీలు, టేబుల్లు, పింగాని ప్లేట్లు, కప్పలు – శానా వైబోగంగ ఉంటాదటలే. ఇడ్లీ, పూరి, మసాల దోశ, మద్యానం పలావు, రాత్రి పరోట, శపాతీ అన్నీ చేస్తారంట. మనూరోల్లందరూ ఆ యప్ప కాడికే ఎగబడతాండారు. ఈ కొట్టం ఓటలు వాండ్ల కండ్ల కానడం లేదు గౌడూ!” అనింది.

“ఔ. నేను డోను నుంచి వచ్చేటప్పుడు బస్సు దిగి నంక చూసినా. శానా జనముండారు. లారీలోల్లు గుడ్క ఆడ నిలబెట్టుకుని ఉండారు. కొన్ని బస్సులు గుడ్క ఆడ నిలబెట్టుకోని టిపన్లు చేస్తారంట. ఈ ఓటలొచ్చి సంమచ్చరం దాటల్యా?”

“రేపు పెత్తాల్ల అమాసకు రెండేండ్లయితాది. వాని మింద మాకేమి కోపం లేదు నాయినా, వానికి పెట్టుబడి పెట్టే తాగతుండాది. మా మాదిరి ఊరి మిందనే ఆదారపడకుండా అయివే మింద పెట్టుకున్నాడు. మనలాంటోల్ల తోని అయితాదా సెప్పు!”

“నిజమే బావా! ఇంతకు ముందు మాదిరి కాదు. జనానికి సోకులు గావాల. నీవు మా అక్క ఇంత రుసిగా చేసిన వడలు ప్లేటు ఐదు రూపాయల కిస్తాన్నారు. నేను డోనులో జూసినా, యా టిపను జూసినా పది పన్నెండు రూపాయలకు తక్కువ లేదు”

రాజమ్మ అనింది – “తమ్ముడా, మాకు గుడ్క డోనుల యాదన్న ఓటలులో పని జూడు. ఇద్దురం కష్టపడతాము. ఈ కొట్టం, జాగా అమ్మేసి వస్తాము. మాకూ ఒక దావ జూపు. నీకు పున్యముంటాంది”

సంజన్న కుంచేపు ఆలోశన చేసినాడు. “బావా! నాకొకటి అనిపిస్తొంది. నేను వైను శాపుకు బాడిక్కి తీస్కున్న మళిగె ముందర రేకులతో వారపాగుండాది. దానికీ రోడ్డుకు గూడ్క పగ్గంపట్టు దూరముండాది. మీరు వచ్చి, ఒక తోపుడు బండి మీద సాయంత్రం నుండి మిరపకాయ బర్సీలు, పుగ్యాలు, మసాలా వడలు, అన్నీ చేసి అమ్ముకోవచ్చు. వైన్ శాపు యాపారం రాత్రి రెండో ఆట ఇడిసేవరుకుంటాది. శాపులో కొనుక్కోనీకె వచ్చి నోల్లందరు మీకాడ తినుబండారాలు కొనుక్కుంటారు.

శాపు అనే గాదు అది రోడ్డు, రైల్వే గేటు శానా దగ్గర. గేటు పడినప్పుడు గుడ్క బ్యారాలవుతాయి. గేటు పడినప్పడు లారీలు, బస్సులు, మోటారుసైకిల్లు, బస్సులు రెండు పక్కల నిలబడి పోతాయి. ఎవర్నయినా పొట్టిగాన్ని పెట్టుకున్నామంటే వాడు స్టీలు బేసినలో మనం జేసినవి పెట్టుకోని బోయి అమ్ముకొని వస్తాంటాడు. మీరు ఉండనీకె మాత్రం యాదన్నా ఒక రూము బాడిక్కు తీసుకుంటే సరిపోతాది.

పొద్దున్నపూట అదే బండి మింద దోసెలో, ఉగ్గాని బజ్జో ఏసుకోవచ్చు. బొమ్మిరెడ్డిపల్లెలో మీరు బతకడం కస్టమే. నేను పోయి మా రామగిరి సిన్నాయినతో ఈ సంగతి గుడ్క మాట్లాడ్తా. మల్ల పది దినాల కొస్తా. అప్పడు ఏ సంగతీ తెలిసిపోతాది లే” అన్నాడు.

తిరిపాలు, రాజమ్మల ముకాలు ఇచ్చుకున్నాయి. తిరిపాలు సంజన్న శేతులు బట్టుకొని అన్నాడు. “ఈడిగాయనా, అదేగిన జేసినావంటే మా నెత్తిన పాలుపోసినట్టే, ఎట్టయినాగాని అయ్యేట్టు సూడప్పా”

“సరే బావా, ఒక ఊరోల్లం, ఆ మాత్రం సాయం జేస్కోకపోతే ఎట్లా? అక్కా పోయొస్తా. ఏ ఎదారు పెట్టుకోగాకండి” అని ఇద్దరికీ చెప్పి సంజన్న గౌడు ఇంటి దిక్కు నడవబట్నాడు. ‘మల్లా రేపు డోను కెల్లిపోవాల గదా, యిమలమ్మ తోని యాదన్నా నీసు కూర జేపిచ్చుకోని తిందాము’ అనిపిచ్చింది.

కటికె వలీ యింటి కాడికి బోయినాడు. వలీ యింటి ముందల అరుగు మింద శెక్క మొద్దు మింద సియ్యలు కొడతాన్నాడు. సంజన్నను జూసి, “రాన్నా, రా” అని పిలిసినాడు.

“సాయిబూ అర్ధకేజి మటను గొట్టియ్యి; మంచిది” అన్నాడు.

“సద్ది సియ్యలు అమ్మే గునం మాకాడ యాడన్నా జూసినావా అన్నా, యారోజు జీవాలు ఆ రోజే సెల్లిపోతాయి మాకాడ. ఈ మధ్య బ్యారాలు ల్యాక రోజూ నాలుగైదు జీవాల నేసెటోల్లం రెండు, మహా అయితే మూడు తెగుతే కస్టము” అన్నాడు వలీ.

“అయితే నీ పరిస్తితీ అట్లా ఉందన్నమాట”

“అందురితో బాటు నేనూ, నేనేమన్నా అడ్డం బుట్టినానా ఏమి?” అంటూ మాంసం కొట్టే కత్తితో పొట్టేలు మాంసాన్ని శెక్క మొద్దు మింద తుంటలు తుంటలుగా కొట్టి, ఒక యిస్తరాకు తడిపి, దాంట్లో పొట్లం గట్టి ఇచ్చినాడు వలీ. ఆ యప్పకు పోయొస్తానని జెప్పి ఇంటికి బయినాడు.

అప్పటికి పదకొండు దాటినాది. వడల పొట్లము, సియ్యల పొట్లము ఇమలమ్మ కిచ్చినాడు.

“నేనే సెప్తామనుకోనుంటిలేయ్యా! నీవే దెస్తివి. పిల్లోడు గుడ్క మొన్న అడిగినాడు. ‘నాయిన వచ్చినప్పుడు తెచ్చకుందాము లే ప్రదీపూ’ అని చెప్పినాను. గోగాకు తీసుకున్నా పొద్దున్న. గోగాకు, సియ్యలు కలిపి చేద్దునా?” అనడిగింది.

“గోగాకు వద్దమ్మే, మామూలుగ గసాలు, ఎండు కొబ్బెర, గరంమసాల నూరి ఎయ్యి. బాగా కడిగి, మెత్తగా ఉడికించు. వరన్నంతో బాటు నాలుగు జొన్నరొట్టెలు గుడ్క చెయ్యి. సియ్యల కూరలోని బాగుంటాయి. ముందల నివ్వు నాలుగు వడలు తిను” అన్నాడు సంజన్న. “భోజనం లేటవుతుండ్ల్యా.”

“నీవు తిన్నావా మల్ల”

“నేను ఆడనే తినేసి వచ్చినా లే”

తర్వాత తానం చేసినాడు. ఇమలమ్మకు మసాలా రోట్లో నూరి ఇచ్చినాడు. ఓటలు తిరుపాలును గుడ్క డోనుకు వచ్చేయమన్న సంగతి పెండ్లానితో చెప్పినాడు. ఇమలమ్మ గుడ్క శానా సంతోసించినది. మద్యానం ప్రదీపు ఇంటికొచ్చినాడు. భోజనాల టైము గంట ఉంటాది. ముగ్గురూ భోజనానికి వారపాగులో గూసున్నారు. టమేటాలు పిసికేసి, మిరియాల శారు గుడ్క చేసింది, మొగునికిష్టమని. సియ్యల కూర రేత్రికి గుడ్క మిగిలినది. అన్నాలు తిన్నాక ప్రదీపు అన్నాడు. “నాయనా, నేను సాయంత్రం టూసనుకు బోతానే, ఆ పార్వతీశం సారు నిన్ను ఒక తూరి యింటికి రమ్మన్నాడు. నీతో మాట్లాడాలంట”

“నీవు ఎనిమిది డోనులో జేరుతున్నట్లు ఆ యప్పతో జెప్పినావా ఏంది?”

“సారుకే గాదు నాయినా, మా నేస్తులందరికి చెప్పేసినా”

“వీని కుశాల పాసుగూల. నోట్ల నువ్వు గింజ నానదు గదా!”

“సెప్పనీ లేయ్యా, తప్పేముంది. ఎట్టా పోతుండాము గదా!” అనింది తల్లి.

“సర్లే, నీవు బడికిపో. నేనొచ్చి సారును కలుస్తాలే” అన్నాడు తండ్రి.

కుంచీపు నిద్రబోయి లేసినాడు. ఇమలమ్మ ‘టీ’ చేసి యిచ్చినాది. మొగుడు పెండ్లాము శానా సేపు కస్టం సుకం మాట్లాడుకున్నారు. సంజన్న గౌడు పార్వతీశం సారు ఇంటికి పోయేసరికి పడసాల నిండా బడిపిల్లలను గూసోబెట్టుకోని టూసను చెబుతున్నాడు సారు. సంజన్నను జూసి, ఒక మూలనున్న బెంచీ సూపిచ్చి, “కూసొప్పా, వీండ్లకు చేసుకోనీకె యాదన్నా వర్కు యిచ్చి నీ కాడ కొస్తా” అన్నాడు.

పిల్లల్లో ఉన్న ప్రదీపు మాటి మాటికి తన నాయిన దిక్కే చూస్తా ఉన్నాడు. పది నిమిసాల తర్వాత పార్వతీశం సారు సంజన్న దగ్గరకొచ్చి, ఆ యప్ప పక్కనే గూసున్నాడు.

“ఒరే, ప్రదీపూ! ఇక్కడికి రా” అని ఆ పిల్లాన్ని పిల్సినాడు. వాడు వచ్చి కింద గూసున్నాడు.

“సారూ, ఎందుకో రమ్మన్నావంట!” అన్నాడు సంజన్న.

“గౌడు, మీ పిల్లోని సదువు గురించి మాట్లాడదామని రమ్మంటి”.

‘ఈ నాకొడుకు సరిగా సదువుకోకుండా సయ్యాటలాడు తూండాడేమో, అది సెప్పనీకెనే పిలిపించినాడేమో’నని సంజన్నకు కుంచేపు బయమైనాది.

“వీడు బాగనే సదువుతుండాడా అయ్యవారూ?” అనడిగినాడు.

“వానికేమప్పా, బంగారు మాదిరి సదువుతాడు.” అన్నాడు సారు. సంజన్న మనసు ఈ మాటతో నిమ్మలపడినాది.

“వీన్ని వచ్చే యాడాది డోనులో జేరుస్తాండావంట”

“ఔ సారు. నీకు తెలియని దేముంది. కల్లు యాపారం జరుగుబాటు ల్యాక, తాటివనం అమ్మేస్తి – డోనుల శిన్న వైను శాపొకటి పెట్టుకుంటున్నాసారు. పెద్ద పరీచ్చలైనంక కుటుమానం డోనుకు మారుస్తా.”

“మంచి పని జేస్తాండావు గౌడు! యాపారంలో గూడ కులవృత్తిని వదిలిపెట్టకుండా ఉన్నావు సూడు, అదీ గొప్ప సంగతి” అన్నాడు సారు.

“మీ ప్రదీపు శానా తెలివైనోడు. వాని ముందర మెచ్చుకోకూడదు. కానీ చెబుతున్నా. హిందూపురం కాడ ‘కొడిగెనహల్లి’ అని ఒక రెసిడెన్సియల్ స్కూలున్నాది. గవర్నమెంటుది. ఏడు పాసయిన పిల్లల్లో స్కూలు ఫస్టు, సెకండు వచ్చిన వాండ్లకు మల్లా ఒక ఎంట్రన్సు పరీక్ష పెడ్తారు. దాంట్ల ఎనభై శాతం దాటి మార్కులు తెచ్చుకుంటే ఆ స్కూల్లో ఎనిమిదిలో జేర్చుకుని టెంత్ వరకు చదివిస్తారు.”

“మనోనికి శాతనయితుందా సారు? పీజులు శానా ఎక్కువుంటాయేమో!”

“తిక్కోని మాదిరున్నావే. ఫీజులేవీ ఉండవు. పైగా స్కూలు పక్కనే మంచి ఆస్టలుంటాది. ఎటువంటి బోజనం పెడతారనుకున్నావు మన పిల్లండ్లకు? ఆ కతనే వేరుగా ఉంటాదిలే. పుస్తకాలు, యూనిఫారం, అన్నీ ప్రభుత్వమే చూసుకుంటాది.

నేను మీ వానితోబాటు మరో యిద్దరికి ప్రతిరోజూ ఒక గంట, ఆదివారాలు రెండుమూడు గంటలు, ఏడో తరగతి పబ్లిక్ పరీక్షలతోబాటు ‘కోడిగెనహల్లి’ ఎంట్రన్సుకు కోచింగ్ యిస్తాను. దాని మాడల్ కొశ్చన్ పేపర్లు అన్నీ తెప్పిస్తాను. మనకు పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ రెండవ వారానికి ఐపోతాయి. జూన్ మొదటివారంతా ఈ ఎంట్రన్సు ఉంటుంది. అంటే ఎంట్రన్సు కోచింగుకు నెలన్నర పైన టైముంటాది. ఆ టైంలో వీండ్లను బాగా తయారుచేస్తాను. అదృష్టం బాగుంటే సీటు వస్తాది. ఆ స్కూల్లో చదివి నోల్లంతా పెద్ద పెద్ద పదవుల్లో ఉండారు.”

“సారూ, దీనికి ట్యూసను పీజు..” అని నసిగినాడు గౌడు.

“నాకేమీ అవసరం లేదప్పా గౌడు! ఇట్టాంటి మెరికలు ప్రతి సంవత్సరం తగలరు. వీండ్లను తయారు చేసి పంపితే, పలాన పార్వతీశం సారు శిష్యులం అని చెప్పుకుంటారు కదా! ఆ సంతోషమే మా టీచర్లకు పెద్ద నిధి!” అన్నాడు సారు. గబుక్కున వంగి సారుపాదాలకు మొక్కినాడు గౌడు. ప్రదీపు గుడ్క అది జూసి సారుకు తానూ మొక్కినాడు.

“ఏందప్పా, ఇది? వాడంటే సరే, నా స్టూడెంటు, నీ వెందుకు..” అన్నాడు సారు.

“మా పాలిటి దేవునివి నివ్వు సారు! నా కంటె వయసులో సిన్నాడివయినా, నీలోని ఆ సరస్వతి దేవికి మొక్కినా. మా ఇద్దరి పానాలన్నీ వీని మీదే. వీన్ని ఒక మంచి దావకు తీసుకొస్తన్నావు. నీ రునం తీర్చుకోలేము సారు!” అన్నాడు సంజన్న. ఆ యప్ప గొంతు పెగలల్యా, కండ్ల నిండా నీల్లు! సారు మింద కృతజ్ఞత!

“ఛా, అదేం పెట్టుకోవద్దు. తెలివైన పిల్లలకు సాయం చెయ్యకపోతే ఎట్లా? నివ్వేం ఎదారు పెట్టుకోవద్దు.” అని, “ఒరే ప్రదీపూ, చూస్తివారా మీ నాయిన ఎట్టా ఇదవుతున్నాడో నీ కోసరము? నీవు కష్టపడి చదివి ఆ యప్ప పేరు, నా పేరు నిలబెట్టాల మరి!” అన్నాడు పిల్లోనితో.

“బాగ చదువుతా సార్. మీకు మాట రానియ్యను!” అన్నాడు ప్రదీపు. వాని గొంతులో ఒక సొంత నమ్మకం పలికినాది.

“గుడ్! అట్లా ఉండాల!” అని వాని తల నిమిరినాడు పార్వతీశం సారు.

“మంచినీల్లు ఏమైనా తాగుతావా గౌడు” అని యిసారించినాడు.

“వద్దు సారు!” అని “మరి నేను పోయొద్దునా?” అని సెలవు తీసుకున్నాడు సారు కాడ. ఆ యప్ప మొగం కలకలలాడుతున్నాది. ఇంటికి బోయి యిమలమ్మతోని సారు చెప్పినదంతా చెప్పినాడు. ఆ యమ్మ గోడ మందనున్న ఎంకటేసులు పటం దిక్కు తిరిగి మొక్కినాది.

“పిల్లోన్ని మంచి దావ బెట్టనీకె ఆ ఎంకటేసులే పార్వతీశం సారు మాదిరి వచ్చినాడు. తండ్రీ! పిల్లోనికి ఆడ సీటొస్తే, నీ కొండకు నడిచి మెట్లెక్కి వచ్చి, తలనీలాలిస్తాము సామీ!” అని మొక్కుకున్నాది.

ఇద్దరూ ఒకరి సేతులొకరు పట్టుకోని శానాసేపు ఉండిపోయినారు.

(ఇంకా ఉంది)

Exit mobile version