మహాప్రవాహం!-17

0
2

[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘మహాప్రవాహం!’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[తిరుపాలు హోటల్‍లో టిఫిన్ తిని సంజన్న గౌడు బయల్దేరబోతుంటే టీ తాగమంటుంది రాజమ్మ. తనకీ కూడా టీ ఇవ్వమంటాడు తిరుపాలు. సంజన్నతో మాట్లాడుతూ, తమకి కూడా ఈ మధ్య బేరాలు తగ్గాయనీ, తమ దగ్గర పనిచేసే లింగయ్యకు సరిగ్గా జీతం కూడా ఇయ్యలేకపోయామని, అతను కర్నూల్లో ఓ మిలిటరీ హోటల్లో చేరాడనీ చెప్తూ, పాడు కాలం దాపురించిందని అంటాడు. వ్యాపారం బాగా తగ్గినట్టుందని అంటాడు గౌడు. రాజమ్మ టీ తెచ్చి ఇద్దరికీ ఇస్తుంది. హైవే మీద పెట్టిన హోటల్ వల్ల జనాలు తమ దగ్గరకి రావడం లేదని అంటుంది. తాము కూడా డోను వచ్చేస్తామనీ, అక్కడే ఏదైనా హోటల్లో పని చూడమని అంటుంది. డోనులో తను పెట్టబోయే వైను షాపు ముందు బండి మీద సాయంత్రం నుండి మిరపకాయ బర్సీలు, పుగ్యాలు, మసాలా వడలు, అన్నీ చేసి అమ్ముకోవచ్చనీ, పగలు దోసెలో, ఉగ్గాని బజ్జో ఏసుకోవచ్చని చెప్పి, డోన్ వచ్చేయమంటాడు సంజన్న. వాళ్ళిద్దరూ చాలా సంతోషిస్తారు. మాంసం తినాలనిపించి, వలీ దగ్గర పొట్టేలు మాంసం పొట్లం కట్టించుకుని ఇంటికి వెళ్తాడు సంజన్న. భార్య విమలమ్మని ముందు టిఫిన్ తినమని చెప్తాడు. కొడుకు ప్రదీపు బడి నుండి భోజనానికి వచ్చాకా ముగ్గురు అన్నం తింటారు. తమ ట్యూషన్ సార్ పార్వతీశం గారు వచ్చి తనని కలవమన్నారని ప్రదీపు తండ్రికి చెప్తాడు. కొడుకు మీద ఏవైనా ఫిర్యాదులేమో అని భయపడుతూ వెళ్తాడు సంజన్న గౌడు. పార్వతీశం సార్ సంజన్న కూర్చోబెట్టి, ‘కొడిగెనహల్లి’ రెసిడెన్సియల్ స్కూలు గురించి చెప్పి, ప్రదీపుని దానిలో చేర్చేందుకు ఎంట్రన్స్ రాయించమని, తాను గైడెన్స్ ఇస్తానని చెప్తాడు. ఆ స్కూల్లో చేరితే భవిష్యత్తుకు ఢోకా ఉండదని చెప్తాడు. తండ్రీ కొడుకులిద్దరూ ఆయనకు నమస్కరించి ఇంటికి వస్తారు. ఇంటికి వెళ్ళాకా భార్యకీ విషయం చెబితే, ఆమె వెంకటేశ్వర స్వామి పటానికి నమస్కరించి, పిల్లాడికి ఆ స్కూల్లో సీటోస్తే, కొండకి నడిచొచ్చి, తలనీలాలిస్తామని మొక్కుకుంటుంది. ఇక చదవండి.]

[dropcap]మ[/dropcap]ర్సటి రోజు పొద్దున్నే డోన్‍కు ఎలబారి పోయినాడు సంజన్న- రామగిరి సిన్నాయనకు ఇసయమంతా చెప్పినాడు. ఆ యప్ప శానా సంతోసించినాడు.

“నీవు బోయినంక నేను ఇశారించినాను రా. ముందల వైను శాపు పెట్టనీకె లైసెన్సు తీసుకోవాల. అది తాసిల్దారు ఇస్తాడంట. దానికి నూరు రూపాయలు చలానా కట్టాలంట. అదిగాక నాలుగైదు నూర్లు పైన సదివిచ్చి కోవాలంట. మనం శాపు పెట్టే సోట, గుడి గాని, మసీదు గాని, చర్చి గాని, బడి గాని ఇన్నూరు గజాల సుట్టుపక్కల లేవని కాయితం తీస్కోవాలంట. దానికి ఏరే.

పోలీసు టేసనులో గూడ్క మనం శాపు పెట్టడానికి పర్మీశను దీసుకోవాలంట. మామూలు శాపుల కంటె వైను శాపుకు ఎక్కువ ‘మామూలు’ యియ్యాలంట. అదిగాక నెలనెలా పోలీసోల్లకు ఇంతని మామూలుంటాదంట. సమితి ఆపీసులోని శానిటరీవోల్లకు గుడ్క నెలనెలా గాక పోయినా అప్పుడపుడు మామూల్లియ్యాలంట. ఇంకాఎక్సైజోట్లు, కమర్సియల్ టాక్సోల్లు వీండ్లందరూ మనకు రంకు మొగుండ్లే. ఎవనిది వానికి తినిపిస్తే మన జోలికి రారు. ల్యాకపోతే మనకు సుక్కలు సూపిస్తారు.”

సంజన్న మనసు బెంబేలెత్తినాది. “సిన్నాయనా, ఇదంతా మనతోన అయితాదంటావా?” అన్నాడు బేలగ.

“ఒరే, అంతా దుడ్డుతో పని వీండ్లందరితో మనకు డీలింగు చేయించనీకే తాసిల్దారు ఆపీసులో ఏసురాజుని ఒకడుండాడులే. వాడు చేసేది అటెండరు ఉద్యోగమైనా, దగ్గరుండి ఇవన్నీ చూసుకుంటాడు. వానికియ్యాల్సింది వాని కియ్యాలనుకో!” అన్నాడు రామగిరి.

“అయితే సరే” అన్నాడు సంజన్న.

“ముందుగాల మనం ఒక కార్పెంటరును మాట్లాడుకోవాల. శాపుకు టేకు రీపర్ల తోని అరలు జేపించాల మందు సీసాలు, అట్టపెట్టెలు పెట్టనీకె. నీవు గూసోనీకె ఒక కౌంటరుండాల. ఒక కురిసీ, టేబులు, లెక్క ఏసుకోనీకె ఒక సొరుగు, దానికి బీగం అన్నీ తయారు చేయిచ్చాల. పైకప్పు మలిగెకు అసయ్యంగ ఉండాది. పైన సెక్కపలకలు గొట్టించి బారు లైట్లు వేయించాల. గోడలు, క్రింద నేల గూడ్క బాగలేవు. గోడలు ప్లాస్టరింగు చేయించి పెయింటింగ్ చేయించాల.

నేల మిందున్న పాత నాప బండలు తీసేసి, బేతంచెర్ల పాలిస్ బండలు పరిపించాల. ఎందుకయినా మంచిది శెట్టిగారి కాడ అగ్రిమెంటు రాయించుకోవాల, ఇరవై ఏండ్లకయినా. ఇంత పెట్టుబడి పెడతాండాము, రేపు పొద్దున శాపు బాగా జరుగుతాండాది, ఈ నాకొడుకు బాగుపడతాండాడని కుల్లుకోని, శాపు కాళీ చెయ్యమనో, బాడిగ మీది మ్యాలంగ బెంచమనో గొంతు మిద గూసుంటే చచ్చే చావయితాది” అన్నాడు రామగిరి.

ఆ యప్ప ముందు సూపుకు శానా ఆశ్చర్యమైనాది సంజన్నకు. అదే మాట అంటే,”అదేంలేదు లేరా, ఒక సంమచ్చరం డోన్‌లో యాపారం జేసినంక నీవు గుడ్క నా మాదిరి ఇంకోల్లకు సెప్తావు” అన్నాడా యప్ప నవ్వి. “నేను ఓటలు పెట్టినాను గాని దాని కంత కత లేదు. నీది వైనుశాపు గాబట్టి ఇంత రామాన్యము.”

తర్వాత ఓటలు తిరిపాలు గురించి, వాండ్లు గుడ్క డోనులో బతకనీకె వస్తామని అడిగినారనీ చెప్పినాడు రామగిరికి. వైనుశాపు ముందర తోపుడు బండి మింద కారపు సరుకులు జేసుకుంటే బాగుంటాదని, రమ్మనమని చెప్పినానన్నాడు. దానికి రామగిరి,

“ఓర్నీ, ఎంత పని జేసినావురా? నేనే ఇద్దరు మనుసులను చెట్టి నీ శావు ముందర బజ్జీలంగడి పెట్టిస్తా మనుకొంనుంటినే. సర్లే, వాండ్లు బీదోల్లు అంటున్నావు, ఆడ బతకలేక పోతాండారంటన్నావు. నాకు ఏదో ఒక ఆదారముంది లే – మా యిద్దరి పొట్టలకు బోను మిగలతానే ఉండాది. వాండ్లకే ఇద్దాములీ నాయినా. నీవు మంచోనివి గాబట్టి వాండ్లకు ఊరికే యిస్తాండావు. ఇంకోడయితే శాపు ముందర బండి పెట్కున్నందుకు నెలకింతని వసులు చేసెటోల్లు. ముందుగాల ఇంతని దుడ్డు గుడ్క కట్టిచ్చుకొనేటోల్లు.” అన్నాడు.

“పోన్లేసిన్నాయినా, మనూరోల్లు! కావల్సినోల్లు!” అన్నాడు సంజన్న.

“నీ మంచితనమే నిన్ను కాసుకుంటాది లేరా నాయినా” అన్నాడు రామగిరి. “సిన్నాయినా, నీవేమీ అనుకోగాకు. ఒక మాట సెబుతాను కాదనగాకు. యాపారం కుదురుకొని, నీ కోడల్ని, మనుమన్ని తెచ్చుకోని నేను ఈడ కాపరం బెట్టేవరకు నీకు నెలకింతని ఇస్తా. నీవు తీసుకోవాల. ల్యాకపోతే నాకు శానా ఇదిగా ఉంటాది. ఒక నూట యాభై రూపాయలు ఇద్దామనుకుంటాండా. నీకు అగత్యము లేదని నాకు తెలుసు. నన్ను సెమించు” అన్నాడు.

రామగిరి కుంచేపు మాట్లాడల్యా. “నీ కాడ దుడ్డు తీసుకుని అన్నం బెడితే ఏం బాగుంటాది రా, మీ పిన్నమ్మకు చెబితే నిన్ను నన్ను పొరక్కట తిరగదిప్పి తంతాది రోయ్” అన్నాడు.

ఆ సంగతి తల్సుకొని నవ్వుకున్నారు ఇద్దరూ.

“ఒక నూర్రూపాయలు యియ్యి లేరా, సాలు. మద్యాన్నం రాత్రి బోజనమే కదా. టిపన్లు అందరం మన హోటలువే తింటాము.”

సంజన్న కండ్లల్లో కృతజ్ఞత! “అట్నేలే సిన్నాయినా” అన్నాడు.

మర్సటి దినం తాసిల్దారు ఆఫీసుకు పోయినారిద్దరు. బస్టాండు పక్కనే రాజా టాకీసు; దాన్ని దాటినంక హైస్కూలు, దాన్ని దాటిపోతే, తాసిల్దారు ఆపీసు, బ్లాకు డెవలప్మెంటు ఆపీసరు ఆపీసు, మున్సిప్ మెస్ట్రీటు కోర్టు, పోలీసు డి.యస్.పి. ఆపీసు అన్నీ ఒకసోటే ఉండాయి. అన్నీ బ్రిటిష్ కాలంలో కట్టినవే. రాతి కట్టడాలు. ప్రతి బిల్డింగు ముందర వారపాగులు దింపినారు. చెక్క రీపర్ల మింద పెంకులు పరిసినారు. లోన పై కప్పు గుడ్క అట్లనే ఉంది. ఒక గుమ్మటం మాదిరి ఉండి కప్పు మింది నుండి వాలుగా చిన్న దూలాలు దింపినారు గోడల మీదికి. గవర్నమెంటు ఆపీసులు ఉన్నంత మేరా పెద్ద పెద్ద వృచ్చాలున్నాయి. యాపవి, చింతవి, మద్దివి కొమ్మలు పరుసుకోని ఉన్నాయి. వాటి దెబ్బకు ఆదంతా సల్లగా ఉన్నాది. బిల్డింగుల ముందరి వారపాగులు ఆపీసులకు  పనుల మింద వచ్చినోండ్లు కూసోడానికి శానా సౌకర్యంగ ఉండాయి. వాటి మింద పరిసిన నాప బండలు నల్లగా మెరుస్తాండాయి. మనుసులు వాటి మింద కూసోని, పండుకొని, నున్నగా అయినాయి.

‘తాసిల్దారు గారి కార్యాలయము, డోన్, కర్నూలు జిల్లా’ అని రాసిన పోతపోసిన అచ్చరాల బోర్డు ఇనప గేట్ల పైన దిమ్మల మింద అర్ధచందున్ని బోర్లించి పెట్టనట్లు కట్టినారు. దాని కిందనుంచి లోనకు బోతే కుడిపక్క పెద్ద మర్రి చెట్టుండేది. దాని బోదె సుట్టూ అరుగు కట్టించినారు.

వారపాగు కింద శానామంది ఉంటారు. ఎడం పక్క చిన్న టీ ఓటలుండాది. గాజు సీసాలలోన బిసికెట్లు, చాకిలెట్లు, బుడ్డల గట్టాలు, నూల గట్టాలు, పెట్టుకొని ఉండాడు ఓటలాయన. అది ఒక బంకు. ఒక పక్కన అంటిగెల యాలాడ దీసి ఉండాది. ఇంకో పక్కన బీడీలు, సిగిరెట్లు ముట్టించుకొనేకె ఒక టెంకాయ తాడు యలాడుతుండాది. దాని శివర నిప్పు ఉండేది. రెండు బేసిన్లలో మసాలా వడలు, మిరపకాయ బజ్జీలు ఉన్నాయి. రామగిరి ఆ టీ బంకు దగ్గరికి పోయినాడు. బంకులో పంపు స్టవ్వు మింద టీ ఉడికిస్తూన్న మనిసి ఈ యప్పను జూసి స్టవ్యు మంట తగ్గించి బంకు లోంచి బయటకు వచ్చినాడు. బంకు బయట ఒక చెక్క బెంచీ ఏసి ఉన్నాది.

“రా మామా, శాన్నాల్లకు” అంటూ రామగిరిని పలకరించినాడు ఓటలాయన.

“కూసోండి” అంటూ బెంచీ సూపించినాడు

‘ఏమిరా మునిసామీ, బాగుండావా?” అని అడిగినాడు రామగిరి.

“బాగుండా మామా, మా యత్త ఎట్లుండాది? ఈ యప్ప ఎవురు?” అని అడిగినాడు మునిసామి.

“అందరం బాగుండాం నాయినా. ఈ యప్ప సంజన్న గౌడని మా ఊరే. మన నంద్యాల రైలు గేటు కాడ బేతంచెర్ల రోడ్డులో ఒక వైను శాపు పెడతాన్నాడు. దాని లైసెన్సు కోసరం వచ్చినాము. ఈ ఆపీసులో ఏసురాజని ఉండాడంట గదా. నీకు తెలుసునా?” అనడిగినాడు రామగిరి .

“ఎందుకు తెలియదు మామా! నా కాడే గద ఆ యప్ప ఆపీసులో అందరికీ టీలు దీస్కబోయేది. మాట్లాడదాములే. మన మాట కాదనేటోడు గాదు. ముందు టీ తాగండి. సంజన్నగారో, ఏమయిన తింటారా? మా రామగిరి మామ మాకు శానా కావల్సినోడు లే.” అన్నాడు మునిసామి.

“వీండ్లది బనగాని పల్లె కాడ రేవనూరు. వీండ్ల నాయిన శానా ఏండ్ల కిందనే డోను కొచ్చేసినాడు. మొదట తేనెరాయి ఫ్యాక్టరీలో పని చేసెటోడు. క్రషర్ కాడ పనిజేస్తూంటే రాయి ఎగిరివచ్చి కంటికి తగిలి ఒక కన్ను పాయ. అప్పటికి ఈ ముని సామి శానా శిన్నోడు. వీండ్ల నాయిన మూలబడితే వీండ్ల అమ్మే వీన్ని, వీని శెల్లెని సాకి సంతరిచ్చినాది. అప్పుడు బనగానిపల్లె ఆయనే రహమాన్ అని తాసిల్దారుగా వచ్చె . ఆ యప్ప పెండ్లానిది రేవనూరే. ఆ యప్పకు వాండ్లు తమ బాదలు చెప్పుకుంటే, దయ తలిసి, ఈ ఆపీసు ముందర టీ బంకు పెట్టిచ్చినాడు. వీడు పెద్దోడయినంక అదే పని జీవనాదారమయినాది” అన్నాడు రామగిరి సంజన్నతో.

“అమ్మ ఎట్టుండాది రా?” అని మునిసామిని అడిగినాడు.

“సెల్లెలికి పెండ్లి జేసినా మామా! మా బావ బోగాలు రైలు టేసనులో లైను మ్యాను పనిచేస్తాడు. వాండ్లకు టేసను బయట కాటరు ఇచ్చినారు. ఆ యమ్మికి ఒక కొడుకు అమ్మ వాండ్ల దగ్గరే ఉంటాది.” అని తల వంచుకున్నాడు మునిసామి.

“ఏం? నీ పెండ్లాము మీ యమ్మను పొందనిచ్చినట్లు లేదే?”

“ఔ మామా! నీకు తెలియనిదేముంది. అది కొంచెం కశరది (మొండి). మా యమ్మ గూడ్క మాటపడే మనిసి గాదు. ఇద్దరికి అస్సలు పొందల్యా. మా బావ శానా మంచోడు గాబట్టి సరిపాయ.”

“నీకు పిల్లలా?”

“ఒక బిడ్డ మామ. కొండపేట ఎలిమెంటరీ స్కూలులో రెండు సదువుతాంది. నా పెండ్లాము గుడ్క సుద్ద ప్యాక్టరీలో పనికి బోతాది.”

“ఈ కోడలు ముండలుండారే శానా కాని బుద్దులవి. మొగుడు యాడి నుంచి వచ్చినాడనే గ్యానం ఉండదు. నీకు బిడ్డ పుట్టినది కాబట్టి బతికిపోయినావురా మునిసామీ! కొడుకయింటే బాగుండె, రేపు వానికి పెండ్లయి, నీ పెండ్లాన్ని ఎల్లగొట్టితే తెలిసేది దానికి. తూ, దర్బేసి ముండలు!” అని తిట్టినాడు రామగిరి. పెండ్లాన్ని అట్లా తిడుతున్నా గమ్మునున్నాడు మునిసామి. రామగిరి మింద గౌరవం సగం, ఆయన చెప్పిన దాంట్లో నిజముండడం సగం, కారణం.

‘ఈ యప్ప పెండ్లాము ఎంత గయ్యాలు. ఈ యప్పను నోరెత్తనిచ్చేట్టు లేదు’ అనుకున్నాడు సంజన్న. ‘అత్త దిక్కు గుడ్క కొంత రాజీ వుండాల. బిడ్డ, అల్లుడు ఆదరించకపోయి ఉంటే ఏం చేసును?’ అనుకున్నాడు. ఆ యప్పకు తన పెండ్లాము యిమలమ్మ మతికొచ్చినాది. సచ్చిపోయేంతవరకు నాయినను ఎంత బాగా జూసుకున్నాది. ఆ యప్ప మాట మాటికి గయ్యిమని లేచేవాడు. నోరెత్తేది కాదు. శివరిరోజుల్లో రెండుమూడు నెలలు అన్ని మంచంమీదనే. అసయ్యించుకోకుండా చేసింది యిమలమ్మ. పోనీ మేనమామనా అంటే అదీ గాదు. పెండ్లాము మింద శానా ప్రేమ అనిపించినాది సంజన్నకు.

ఇద్దరూ టీలు తాగినంక, పోయి, ఏసురాజును పిల్చుకొచ్చినాడు మునిసామి. ఆ యప్ప శిన్నోడే. ముపై ముప్పై ఐదు ఉంటాయేమో? కాకీ పాంటు, కాకీ షర్టు ఏసుకున్నాడు. గవర్నమెంటు బంట్రోతులు ఏసుకోవాల గదా ఒక ఆకుపచ్చరంగు పట్టీ భుజల మింది వాలుగా ఏసుకున్నాడు. పాన్ బీడాలు ఎక్కువ నములుతాడేమో నోరు ఎర్రగా ఉంది. బీడీలు బాగ తాగుతాడేమో పెదిమలు నల్లగా ఉన్నాయి. మెడలో గొలుసుంది. దానికి శిలువగుర్తు యాలాడుతోంది. ఆ యప్పను చూస్తానే ఇద్దరూ బెంచీ మించి లేసి నిలబడబోతే, “కూసోండి, కూసోండి! పెద్దోలు మీరు” అన్నాడు.

మునిసామి ఇసయం అంతా చెప్పినాడు. “రామగిరి మామ మాక్కావల్సినోడన్నా. ఈ యప్పది ఆ ఊరే. నీవే దగ్గరుండి అన్నీ చూడాల.”

“మనముండేదే అందుకైతే” అన్నాడు ఏసురాజు.

“ఈ యప్పకు శేగు టాకీసు కాడ ఓటలుండాది గదా! మనం రెండుమూడు సార్లు పోయినాము.” అన్నాడు.

“గౌడుగారూ, ముందుకె మళిగ ఓనరు తోన అగ్రిమెంటు రాయించుకోండి. ఆ కాయితం, మీది రేసను కార్డు తీసుకురావాల. ఒక పోటో తీయించుకోవాల పాసుపోర్టు సైజుది. మొత్తం మూడు కాపీలు గావాల. జడ్.పి. హైస్కూలు ముందరే పోటో స్టూడియో ఉండాది, ‘మునీర్ స్టూడియో’ అని. ఇప్పడు పోయేటపుడే తీపిచ్చికొనిపోతే రేపటికిస్తాడు. నూట ముపై రూపాయలు ట్రెజరీలో చలానా గట్టాల. అది నేను కడతాలే.

ఇవన్నీ ‘సబ్మిట్’ చెయ్యాల ముందు. వెంకటసుబ్బయ్యని ఉంటాడు. యల్.డీ.సీ. క్లర్కు. ఆయనికిచ్చి రశీదు దీసుకోవాల. తర్వాత రెవిన్యూ ఇనిస్పెక్టరు వచ్చి సుట్టుపక్కల దేవులాలు గాని స్కూల్లు గాని ఉన్నాయా లేవా అని చూసి వస్తాడు. మీ మళిగె కాడ లేవులెండి. పైలు తాసిల్దారు టేబులు మిందికి బోనీకె వారం దినాలు పడతాది. యుడిసి గారు దాని మింద అనుకూలంగా రాసినంక డిప్టీ తాసిల్దారు కాడికెళ్తాది. ఆకర్మ పెద్ద సారు సంతకమైనంక లైసెన్సు ఇస్తారు. దాన్ని పోటోప్రేము గట్టించుకోని షాపులో బెట్టుకోవాల. అందరికీ ఎంతో కొంత ముట్టజెబితేగాని పైలు కదలనియ్యరు.”

“ఎంతయితాదన్నా” అన్నాడు మునిసామి.

“ఒక ఐదు నూర్లేసుకో” అన్నాడు.”నాకిచ్చేది మీ సంతోసం బట్టి.”

రామగిరి అన్నాడు. “అట్టగాదులే నాయినా, ఇంకా పోలీసోల్ల కాడ, శానా తతంగముండాదంట గదా, అవన్నీ నీవే చూసుకోవాల. నీ రునం పెట్టుకోము. ఒక కుటుమానం నిలబడతాది నీ వలన.”

“అంత మాటనగాకు పెద్దాయనా!” అన్నాడు ఏసురాజు.”టేసనులో రైటరు నా నేస్తుడేలే. సి.ఐ గారికి చెప్పి పర్మీశను ఇప్పిస్తాడు. ఇంక శానిటరీ, ఎక్సైజు, కమర్సియల్ టాక్సు, వీండ్లందరి దగ్గరకూ బోవాల, అర్జీలు పెట్టాల, సర్టిఫికెట్లు తీసుకోవాల. సరే నేనన్నీ జూసుకుంటా. వెయ్యి రూపాయ లియ్యండి. నాకిచ్చీ దాంతోసా.”

“కొంచెం తగ్గించుకో నాయినా” అన్నాడు రామగిరి .

“సరే నూరు తగ్గించియ్యండి”

“ఎనిమిది నూర్లు దీసుకో. నీకు పున్యముంటాది.”

“అందరికీ యిచ్చినంక నాకేమీ పెద్దగా మిగలదు పెద్దాయనా. సరేలెండి. నేను చెప్పినవన్నీ తీసుకుని ఎల్లుండి రాండి ఇదే టైముకు”

“ఇప్పుడీమయినా..”

“వద్దు వద్దు. ఎల్లుండి వచ్చినపుడు నాలుగు నూర్లు యివ్వండి. మిగతాది పనయిం తర్వాత తీసుకుంటాను.” అని ఆపీసు లోకి వెళ్లిపోయినాడు ఏసురాజు.

“రెండునూర్లు బాగానే తగ్గిచ్చినాడు. ల్యాకుంటే ఒప్పుకోడు” అన్నాడు మునిసామి.

“మా సిన్నాయన మాట్లాదినంక కాదు అనలేకపోయినాడు. మంచోడే!” అన్నాడు సంజన్న.

“అమ్మకు నెలనెలా ఏమయినా ఇస్తున్నావా లేదారా పనికిమాలినోడ! ఆడపిల్ల సొమ్ము దినినీకె సిగ్గుశరంల్వా?” అన్నాడు రామగిరి .

“దానికి తెలియకుండా నెలకు నూరు రూపాయలిచ్చి అమ్మను చూసుకోని వస్తాండాఅ మామా!” అన్నాడు మునిసామి తల వంచుకుని.

“అదీ! బాదపడగాకు. నూటికి ఎనభై ఇండ్లల్లో ఉండేదేలే ఈ రామాన్యం! సరే పోయొస్తాము, ఎల్లుండి వస్తాము” అని చెప్పి ఎలబారినారు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here