మహాప్రవాహం!-18

0
2

[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘మహాప్రవాహం!’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[మర్నాడు డోన్‍కు వెళ్ళి జరిగినవన్నీ రామగిరికి వివరంగా చెప్తాడు సంజన్న. సంజన్న ఊరెళ్ళాకా, తాను అన్నీ బోగట్టా చేశాననీ చెప్పి, వైను షాపు పెట్టడానికి నియమ నిబంధనలు చెప్పి, ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలో చెప్తాడు. ఎవరెవరికి నెల నెలా మామూళ్ళివ్వాలో కూడా చెప్తాడు. అవన్నీ విని సంజన్న మనతో అవుతుందా అని సందేహపడితే, రామగిరి ధైర్యం చెబుతాడు. ఆ పనులన్నీ చేసిపెట్టేందుకు తాసీల్దారు ఆఫీసులో ఏసురాజనే అతను ఉన్నాడనీ, అతనికివ్వాల్సింది ఇస్తే ఈ పనులన్నీ చేసిపెడతాడని చెప్తాడు. ముందుగా ఒక కార్పెంటరును మాట్లాడుకుని షాపులో చెక్క అరలు, కౌంటర్ చేయించాలనీ, మళిగె యజమానితో అగ్రిమెంటు రాయించుకోవాలని చెప్తాడు రామగిరి. మాటల్లో తాను తిరుపాలు వాళ్ళని డోనుకు వచ్చి తన షాపు ముందు బండి పెట్టుకుని బజ్జీలవీ అమ్ముకోమన్నానని చెప్తాడు. అయ్యో, నేను వేరే వాళ్ళకి చెప్దామనుకున్నానే అంటాడు రామగిరి. అయినా పర్లేదులో, బీదోళ్ళు అంటున్నావు కదా అలాగే ఇవ్వు అంటాడు. మర్నాడు ఇద్దరు కలిసి తాసీల్దారు ఆఫీసుకు వెళ్తారు. అక్కడ ఉన్న టీ హోటల్ యజమాని మునిసామిని పలకరిస్తాడు రామగిరి. సంజన్న గౌడును పరిచయం చేసి వచ్చిన పని చెప్తాడు. మునిసామి అమ్మ గురించి, భార్య గురించి, వాళ్ళిద్దరి మధ్య గొడవల గురించి ఆరా తీస్తాడు రామగిరి. కాసేపయ్యాకా అక్కడికి ఏసురాజు వస్తే అతనితో మాట్లాడుతారు. వైను షాపు పెట్టుకోడానికి ఏం చేయాలో, ఎలా చేయాలో అన్నీ వివరంగా చెప్తాడు ఏసురాజు. ఎవరికెంత ఇవ్వాలో, తనకెంతివ్వాలో కూడా చెప్తాడు. కాస్త తగ్గించమంటే, సరేనంటాడు. ఎల్లుండి అదే సమయానికి రమ్మని చెప్తాడు. బయల్దేరుతూ అమ్మని చక్కగా చూసుకో అని మునిసామికి చెప్తాడు రామగిరి. ఇక చదవండి.]

[dropcap]దా[/dropcap]వలోనే పోటో స్టూడియోలో పోటో దీయించుకున్నాడు సంజన్న. ఐదు కాపీలు నెగెటివ్ తోసా ఇరవై రూపాయలు. రేపు సాయంత్రం ఇస్తానన్నాడు.

ఆడ్నించి టేసను రోడ్డులో ఉండే కార్పెంటరు దగ్గరికి పోయినారు. అది ఒక శెడ్డు. అంతా శెక్క పలకలతోనే ఏసుకున్నారు. శెడ్డులో ముగ్గురు పని చేస్తున్నారు. ఒకాయన ‘తోపడా’ బడ్తన్నాడు. ఇంకొకాయన కిటికీలకు ‘చౌకట్లు’ దిగ్గొడుతున్నాడు. ‘చౌకట్టు’ అంటే చతురస్రం ఆకారంలో, లేదా దీర్ఘచతురస్రాకారంలో ఉండే చెక్క ప్రేము. కిటికీలకు ద్వారబంధాలకు అవి ముందుగా కొలతలు దీసుకొని, తయారు చేస్తారు.

మూడో ఆయన తలవాకిలి మింద చిత్రిక బడుతూ, నగిషీలు చెక్కుతున్నాడు. అన్నీ మిసిన్ల మీదే జరుగుతుండాయి.

వీండ్లను జూసి, బయట ‘తోపడా’ పడుతున్నాయన లేచి, “ఏం కావాలప్పా మీకు?” అనడిగినాడు.

రామగిరి చెప్పినాడు – “నంద్యాల గేటు కాడ ఒక వైను శాపు పెడతాన్నాము. మళిగె లోన వుడ్ వర్కు, షెల్పులు చెయ్యాల. దాని నిమిత్తము మాట్లాడనీకె వస్తిమి.”

“అన్నా, నీతో మాట్లాడనీకె వీండ్లు వచ్చినారు జూడు!” అనరిసినాడు తోపడా పట్టేటాయన.

చిత్రిక బట్టేటాయన, సూస్తాంటే ఆ యప్పే శెడ్డు ఓనరు మాదిరుండాడు, శెయ్యి ఊపి లోనకు రమ్మని పిలిసినాడు వీండ్లను.

లోపల శిన్న జాగా శెక్కల పలకలు పాతి వేరు చేసినారు. ఆడ ఒక చెక్క కుర్చీ, ఒక టేబులు దాని ముందర ఒక బెంచీ ఏసి ఉండాయి.

“రాండప్పా, లోపల గూసోని మాట్లాడుకుందాము” అన్నాడా యప్ప. ఆ యప్ప కురిసీలో గూసుంటే, వీండ్లిద్దరు బెంచీ మీన గూసున్నారు.

రామగిరి ఇసయం చెప్పినాడు. కార్పెంటరు పేరు వరదాచారి. ఆ యప్పది కంబాలపాడంట.

“పెద్దాయనా, ఈ యప్ప అంటే కొత్తడు గాని, నిన్ను జూసినాలె. శేగు టాకీసు కాడ ఓటలుంది గదా నీకు. మీ ఓటల్లో సాయింత్రం ఏసే మిరపకాయ బజ్జీలు శానా బాగుంటాయి” అన్నాడు రామగిరితో.

“ముందు మళిగె కొలతలు దీసుకోవాల. అరలు గోడల౦బడి వస్తే చాలా ల్యాక మళిగె మద్యన గుడ్క ఒక వరస రావాల్నా? రూఫుకు ప్యాకింగ్ శెక్క పలకలు గొట్టాల్నా ల్యాక ప్లయివుడ్డని కొత్తగా దిగినాది. శానామందికి తెలియదు. అదైతే శానా కరీదు.

గోడలకు అరలు జేయనీకె యా కట్టె వాడాల? టేకుదా, మద్దిదా? అరలకు తలుపులు గుడ్క జెయ్యాల్నా, అవి అద్దాలతో జేయాల్నా, అరల్లో రీపరుకు రీపరుకు అడుగున్నరన్నా ఎడముండాల. పెద్దవి బ్రాందీ సీసాలు పట్టాల కదా.”

రామగిరి అన్నాడు “మళిగె పది పట్లు ఎడల్పు, పద్నాలుగు పట్ల పొడుగుంటాది ఆచారీ!’

“మల్ల హైటు?”

“అది గుడ్క పన్నెండడుగులుంటాది. ఎక్కువే గాని తక్కువుండదు”

వరదాచారి ఒక నోటుబుక్కు టేబులు పొరుగు అనుంచి దీసినాడు. ఒక పెన్ను గుడ్క. బుక్కులో ఒక పేపరు మింద ‘సంజన్నగౌడు వైను శాపు, నంద్యాల గేటు కాడ’ అని రాసుకున్నాడు. పది నిమిశాలు యావో లెక్కలు వేసినాడు.

“గౌడు గారో, ముక ద్వారం వదిలేసి, గోడలకు మూడు పక్కల అరలు బిగిస్తాము. ఒక్కో అర అడుగున్నర ఎత్తు, మూడడుగులు పొడువు, రెండడుగులు లోపలికుంటాది. అట్లా ఒక్క గోడకు పన్నెండు అరలొస్తాయి. పూర్తి పైన అటక మాదిరి వదిలేద్దాము. మందు సీసాల అట్టపెట్టలు పెట్టుకోవచ్చు. రూఫు కిందికి అర్ధడుగు కింద ప్లయివుడ్ లోని సీలింగు జేద్దాము.

మళిగె మధ్యలోన గుడ్క అరలు జేపిచ్చుకుంటే ఇరకటం అయితాంది. మనుసులు మొసలనీకె కస్టము. కుడి గోడ ముందు బాగాన కౌంటరు వస్తాది. అంటే మూడు అరలు తగ్గుతాయి. మెయిన్ తలుపు కాడ నాలుగడుగుల ఎత్తున కొనా మొదులు అడుగున్నర ఎడల్పు తోనీ ఒక షెల్పు జేపిచ్చుకోండి. దానికి అద్దాల తలుపులు బిగిద్దాము. కస్టమర్లు అడిగిన సరుకు తెచ్చి దాని మింద బెట్టొచ్చు.”

అని మల్లా కుంచీపు లెక్కలు ఏసినాడు వరదాచారి.

“మొత్తం శెక్క, టేకుదే ఏద్దాము. శానా ఏండ్లు మన్నుతాది. పైన ప్లయివుడ్డు, అద్దాలు, మిగతా మెటిరియలంతా రెండు వేలయితాది. మా మజూరీ పన్నెండు వందలు. ఇద్దురు మనుసులు వచ్చి ఆడనే పని చేస్తారు. మిసిన్లు ఆడికే తెచ్చుకుంటాము. పది పన్నెండు రోజుల్లో వుడ్ వర్క్ అంతా పూర్తి జేసి అప్పజెపుతాము. మీరు కొంచెం సంచకారమిస్తే ఈయాలే కొలతలు తీసుకోనీకి మావాన్ని పంపిస్తా.”

“ఆచారీ! కొంచెం చూసి చెప్ప దర. ఈ యప్ప పాపం బతకనీకె వచ్చినాడు. ముందు ఫ్లోరింగు మార్పించి, గోడలకు ప్లాస్టరింగు చేయించి, రంగు లేయించినంక వుడ్ వర్కు మొదులు బెడ్దాము” అన్నాడు రామగిరి.

ఇంతలో ఒక పొట్టెగాడు ఇనప స్టాండులతో నిమ్మకాయ సోడా గ్లాసులు పెట్టుకుని వచ్చి, తలా ఒకటి యిచ్చినాడు.

“ఎండగా ఉండాదని టీ కి బదులు ఇది తెప్పించింటారు మా వోల్లు!” అన్నాడు వరదాచారి.

“ఇదే బాగుంటాది లే” అన్నాడు సంజన్న. ముగ్గురూ సోడాలు తాగినంక గ్లాసులు తీసుకోని ఆ పిల్లగాడు ఎల్లిపోయినాడు

“సరే పెద్దాయిన! వారం పదిరోజుల్లో వడ్డె పని చేయించుకోని రాండి. చెక్క, మెటీరియలలో ఏమీ తగ్గదు. అవన్నీ నేను గుడ్క కొనాల. మా మజూరీలో రెండు నూర్లు తగ్గిస్తా లెండి” అన్నాడు ఆచారి.

రామగిరి సంజన్న దిక్కు చూసి తల ఊపినాడు. పోయొస్తామని చెప్పి ఎలబారినారు అప్పటికే పైటాల అయింది.

“సిన్నాయనా, నా పని మింద తిరగతా, నీ ఓటేలు వదిలేస్తివి. పర్వాలేదా?”

“మన రమేసు గాడుంటాడు లేరా! సూస్కుంటాడు. అయినా, దినరోజు నీ పని మింద తిరగతానేంది? శాపు ఒక తీరుకొచ్చే వరకేగద! నీవా ఎదారు బెట్టుకో గాకు!”

సాయంత్రము వడ్డె మేస్త్రిని బిలిపించినారు. ఆ యప్ప పేరు ఎంకటప్ప. పక్కన కొత్తపల్లెలో ఉంటాడంట. డోనులో వచ్చిన పనులు చేసుకొని సాయంత్రం ఎల్లిపోతాడంట ఊరికి.

ఎంకటప్ప మలిగె చూసినాడు. “చ్చొచ్చొచ్చొ” అని నోటితో సౌండు చేసినాడు.

“రామగిరన్నా, పందికొక్కులు బాగా తవ్వేసినాయి నేలను. మొత్తం బండలన్నీ తీసేసి కంకర బోసి సమం చేసి, బేతంచెర్ల పాలీసు బండలు పరుద్దాము. అవి శానా కరీదనుకుంటే సలీసుగ ప్లాస్టరింగు జేసుకుంటే అగ్గవలో పోతాది.

గోడలన్నీ శివికి పోయినాయి. అంగులం మందంగ రేసినటుగా ప్లాస్టరింగ్ చేసుకుంటే పేయింటు ఎయ్యనీకె బాగుంటది. ముందల వారపాగు కింద గుడ్క ప్లోరింగు దెబ్బదినినాది. అదంతా తవ్వేయబనిల్యా గాని, పాడయిపోయిన సోట కొంచెం తవ్వి, సిమెంటు పూస్తే సరిపోతోంది. ఎట్ట చేసేది?”

సంజన్న అన్నాడు “సిన్నాయనా, పాలిష్ బండలు పరిసే బదులు ప్లాస్టరింగ్ చేయిస్తే సరిపోదా?”

“బాగుంటాది రా, ఎందుకు బాగుండదు? అట్టే జేయిస్తాము లే.”

ఎంకటప్ప లెక్కఏసి, “ఆరు సంచులు సిమెంటు, టిప్పరు కంకర, ఒక టాకటరు ఇసక బడతాది. మా కూలీతో సా వెయ్యి రూపాయలయితే పని ఒక దావ కొస్తాది” అన్నాడు. “లేదు మెటీరియల్ మీరు కొనిస్తామంటే మా కూలీ మూడు నూర్లియ్యండి సాలు. ఇద్దురు మనసులం వారం పాటు జేస్తేగాని తేలదు.”

“అవన్నీ మేము తెచ్చియ్యలేమప్పా. మొత్తం మీద నీవే ఎంతో కొంత తగ్గించు.”

“సరే పెద్దాయన, పనయినంక చూసి మీరే ఇయ్యండి. మీ దయ, నా ప్రాప్తము” ఆ యప్ప మాటలకు వీండ్లు గుడ్క సంతోసించినారు.

“కాన్లేప్పా, బాగ జైయ్యాల పని! కష్టపడినోనికి లోటు చేస్తామా?” అన్నాడు రామగిరి.

“ఒక ఐదు నూర్లు ఇప్పించండి. ఇసక తోలిస్తా, సిమెంటు సంచులెయ్యిచ్చుకుంటా, కంకర పోయిస్తా.”

సంజన్న ఐదు నూరు రూపాయిల నోట్లు తీసి ఎంకటప్పకిచ్చినాడు. ఆ యప్ప ఎల్లిపోయినాడు. వీండ్లిద్దరు గుడ్క ఓటలు కాడికి బోయిరి.

***

రమేసు గాడు వీండ్లకు టీ తెచ్చి యిచ్చినాడు.

“పొద్దున బ్యారాలు బాగనే అయినాయారా?” అనడిగినాడు పెద్దాయన.

“ఓ. ఉగ్గాని బజ్జీ ఏం మిగలల్యా. పూరీ మూడు ప్లేట్లు మిగిలినాది. సరుకు మాస్టరు ఇప్పుడే మిరపకాయ బజ్జీ ఏసి, ఎల్లిపాయ. ఇంతలో మీరొస్తిరి. సరేగాని రామగిరీ, ఈ యప్ప వైను శాపులో పని చెయ్యనీకె ఒక పొట్టెగాడు కావద్దూ?” అన్నాడు రమేసు.

“ఏంది సిన్నాయనా, వీడు నిన్ను పేరు బెట్టి పిలిస్తా౦డాడు. వాని వయసేంది, నీ వయసేంది దొమ్మ పొగురు కాకపోతే?” అన్నాడు ఆశ్చర్యంగా సంజన్న.

పకాపకామని నవ్వినాడు రామగిరి. “మొదుట్నించీ అంతే రా వాడు! నన్ను పేరు బెట్టే పిలుస్తాడు దొంగనాయాలు! ఈడే నాకు బొడ్డు కోసి పేరు బెట్నోని మాదిరి! నాకు అలవాటయి పోయినాది. మల్ల యింటికాడ మీ పిన్నమను మటుకు ‘అవ్వా’ అంటాడు రోయ్! పానీలే దిక్కులేనోడు! నేనన్నా, మీ పిన్నమ్మన్నా పానం బెడతాడు పాపం.”

“ఏందోబా మరి శానా ఇచిత్తరంగా ఉండాది నాకు!”

“రొండు బజ్జీలు తింటావా మామా! ఏడిగా ఉండాయి!” అని సంజన్ననడిగినాడు వాడు, నోరంతా తెరిచి నవ్వుతూ.

సంజన్న గుడ్క నవ్వి “త్యా పోరా, తిందాము” అన్నాడు. రామగిరి దిక్కు చూస్తూ, “నా అదురుట్టము బాగున్నాది సిన్నాయనా, ల్యాకపోతే, నన్ను పట్టుకోని ‘ఒరే సంజన్నా’ అనలేదు.”

“ఛాఛా, అందర్నీ ఎందుకుంటాడు రా, నన్కొక్కన్నే పేరుబెట్టి పిలుస్తాడు. సరుకు మాస్టర్ను గుడ్క ‘అన్నా’ అంటాడు.”

బజ్జీలు తిన్నంక, సంజన్న అన్నాడు “నాకాడ ఉన్న దుడ్డు సరిపోయేటట్టు లేదు సిన్నాయనా. నా సిల్లర కర్చులకీ మూడు నూళ్లయిపాయ. తాటివనము అమ్మితే వచ్చింది, నీ కాడ దాచిపెట్టింది పద్ముడు వేలు. వడ్డె వేస్త్రీకి ఐదు సూరిస్తిమి. ఇంకా సిల్లర కర్చు రెండు నూర్లు తీసినా, పన్నెండుండాదనుకో. ఏసురాజు ఎనిమిది నూర్లియ్యాల. కార్పెంటరుకు మూడు వేల రెండునూర్లు. ఆడికి ఎంతబాయ?”

“నాలుగువేలు” అన్నాడు రామగిరి.

“ఏసురాజుకు, వడ్డే మేస్త్రీకి ఇయ్యాల్సింది కలుపు”

“అదో ఎనిమిది, మేస్త్రీకి అయిదు. ఐదేల మూడు నూర్లయితది. ఇంకా పెయింటింగు, బోర్డు, ఇంకా తెలియని కర్చులుకు ఆ ఏడు నూర్లు కలిపితే ఆరువేలు పాయ. ఇంక ఏడు వీలుంటాది మన కాడ.”

రామగిరి అన్నాడు “సంజన్నా, ఓల్‌సేల్‌లో బ్రాంది సీసాలు, విస్కి సీసాలు, రమ్ములు, బీర్లు ఇవన్నీ తెచ్చిపెట్టుకోవల్ల. సరుకు ఎన్నాల్లున్నా సెడిపోయేదు గాదు కాబట్టి మరీ మంచిది. ఏడువేలు సరిపోతాదా లేదా అనేది మనం, ఊర్లో యింకా రెండు శాపులుండాయి గదా, వాండ్లను అడిగితే చెప్తారు, శాపు మింద తొలి పెట్టుబడి ఎంతయితాదో?”

“అయితే రేపు పోయెద్దాం వాండ్ల కాడికి!”

“మల్ల రేపెందుకురా. పోదాం పా యిప్పుడే. ఒకేల సాలకపోతే తగిలేది ఎట్టా సగేసుకోవాల్నో (సమకూర్చుకోడం) సూసుకోవాలగద!”

ఇద్దరూ గుత్తి రోడ్డులో అయివే మిందున్న ‘మద్దిలేటి సామి వైన్స్’ దగ్గరికి పోయినారు. శాపు కాడ మంది బాగానే ఉన్నారు. జనం శాపు లోకి తీసుకు రాకుండా కటాంజనం గుడ్క ఉంది. అది రెండు పక్కల జరిపితే జరిగేట్టుంది.

వాండ్లను జూసి మొదుట కస్టమర్లు అనుకుండాడు శాపాయన. కాదని తెలిసి కూసోబెట్టినాడు. సంజన్ననే చెప్పమన్నాడు రామగిరి.

“అన్నా, నమస్కారం. నా పేరు సంజన్న గౌడు. మాది బొమ్మిరెడ్డిపల్లె. ఈ యప్ప మా సిన్నాయన. శేగు టాకీసు కాడ ఈయనకు చిన్న ఓటలుండాది”

“అదే, యాడో సూసినానే యీ యప్పను? అనుకుంటాండా”

“నంద్యాల గేటు కాడ నేను గుడ్క వైను శాపు పెడతాండా అన్నా. మళిగె గుడ్క బాడిక్కు దీసుకున్నా. ఓం పెతమం మనం శాపులో సరుకు త్యానీకె ఎంతయితాది? కనుక్కుందామని వస్తిమి నీ కాడికి. నీ పేరేందన్నా, ఏ వూరు నీది?”

“నా పేరు సుంకిరెడ్డి. మాది ప్యాపిలి. మనకు ఓల్‌సేల్ సరుకు ఈ పక్క కర్నూలులో గాని, ఆ పక్క అనంతపురములో గాని దొరుకుతాది. బళ్లారికి గాని, బెంగులూరికి గాని బోయి తెచ్చుకుంటే అగ్గవ బడతాది గాని, వాండ్ల కాడ సరుకు ఎక్కువ దీసుకోవాల. మనకు కర్నూలు చాల దగ్గర. ఆడ ఇద్దరు ముగ్గురు ఓల్‌సేల్ డీలర్లుండారు. నేను మా శాపుకు కర్నూల్లోనే తెస్తా. వన్ టౌన్‌లో చాంద్ టాకీసు దాటినంక వస్తాది. పెద్ద గోడవును గుడ్క ఉండాది. మీ యీడిగొల్లదే. వాండ్లది రాయచూరనుకుంటా, శ్రీశైలం గౌడ అని అంటారు.

మనం కొంచెం యాపారంలో డీలింగు జేసినంక అరువు మింద గుడ్క సరుకిస్తారు. శాపులో సేల్సు జేసుకోని నెలనెలా కట్టొచ్చు. యా మందు ఎంత కమ్మాల్లో రిటైలున, డ్రాము కాడినించి క్వాటరు హాపు పుల్లు – ఇట్లా ఇవరంగా వాండ్లే చెబుతారు. మనం గుడ్క ఒక దరల పట్టీ రాయించి శాపులో బెట్టుకోవాల. ఎక్సయిజోల్లు చెకింగుకొచ్చినపుడు అడుగుతారు. మనం అన్నీ సక్రమంగా చేసినా వాండ్లు తినేది వాండ్లు తింటారు.”

సుంకిరెడ్డి గొంతు తగ్గించి అన్నాడు “మనం రూపాయ ఎక్కువనే అమ్ముతాము. కస్టమర్లు ఎవరూ పట్టించుకోరు. నాది ఊరిబయట ఉన్నాది గాబట్టి శాపు ఎనక శిన్న శెడ్డు ఏసి నాలుగా టేబుల్లు కుర్చీలు వేయించినా. లారీలోల్లు ఈడనే తాగిపోతారు. నీకట్ల కుదరదు. నీ శాపు ఊర్లో నడిబొడ్డున ఉండాది. ఆడ దొరకడం నీ అదురుస్టం గౌడూ! జాగ్రత్తగ చేసుకుంటే మంచిదే!”

‘సుంకిరెడ్డి మంచోడే’ అనుకున్నాడు సంజన్న. తనకు పోటీగా శాపు పెడతన్నాడనుకోకుండా   ఇవరమంతా శెపుతున్నాడు.

అది గ్రయించినట్లు సుంకిరెడ్డి అన్నాడు – “అన్నా, ఎవరి యాపారం వాండ్లది.. నా కస్టమర్ల వేరు, నీ కస్టమర్లు వేరు. యాపారంలో మనం ఒకరికొకరు సాయం జేసుకోవాల. ఒకేల సరుకు అర్జంటుగా యాదయిన రకం అయిపోతే నీ కాడికి నేను రావాల, నా కాడికి నీవు రావాల.”

“అదీ మొగోని మాట” అన్నాడు రామగిరి. “మావోని కాడ శాపు సంతరిచ్చినంక సరుకు బెట్టనీకె ఏడు వేలుండాయి. సరిపోతాయా?”

నోరు సప్పరిచ్చినాడు సుంకిరెడ్డి. “అవి యామూలకు రావు పెద్దాయనా! కనీసం ఇరువై వేలన్నా ల్యాకపోతే శాపు నిండుగ కనబడదు. అయినా.. మీకా ఎదారు లేదు. బ్యాంకోల్లు లోనిస్తారు. మనకు శాపులోని సరుకంతా వాండ్లకీ తాకట్టు బెట్టాల. పలాన బ్యాంకుకు ఈ శాపులోని స్టాకు ‘ప్లెడ్జి’ చేయబడిందని ఇంగ్లీషులో ఒక బోర్డు రాసి పెట్టుకోవాల మనం. బయట వడ్డీ యాపారం జేసెటోల్ల కంటే శానా తక్కువ బడతాది వడ్డీ. నేను గుడ్క లోను దీసుకున్నా. డోనులో మూడు బ్యాంకు లుంటాయి. సిండికేటు బ్యాంకు మేనేజరు నాకు దెలుసు. పోదాం లే.”

సంజన్న కృతజ్ఞతగా చూసినాడు ఆ యప్ప దిక్కు.

“రెండు మూడు నెల్లు తర్వాత దుడ్డు రొటేశన్ అయితుంటుంది. ఓల్‌సేల్ డీలరు గుడ్క మనమింద నమ్మకం కలిగినంక ఐదారువేల వరకు సరుకు అరువు మింద ఇస్తాడు.”

“అయితే ఎప్పుడు బోదాము బ్యాంకుకు?”

“నాకు మద్యాన్నం వరకు పురసత్తుంటాది. రేపు ఊరికి బోతాండా, ఎల్లుండి రండి. మాట్లాడి వద్దాము.”

“శానా సంతోశమన్నా. మా నెత్తిన పాలు పోసినావు, పోయొస్తాం” అని సంజన్న అంటే, ఆ యప్ప నవ్వినాడు అదేమంత పనిగాదన్నట్లు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here