[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘మహాప్రవాహం!’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[మంగలి శరబయ్య తిక్కయ్య షాపులో పనిచేయడం మొదలుపెడతాడు. తిక్కయ్య కూడా వయసు రీత్యా శరబయ్యను గౌరవంగానే చూస్తాడు. శరబయ్య తమ్ముడు సుంకన్న మళ్ళీ వచ్చి ఇంటి సంగతి ఏ చేశావని అన్నని అడుగుతాడు. ఇద్దరూ కలిసి రుక్మాంగద రెడ్డి దగ్గరకు వెళ్ళి విషయం చెప్తారు. తమ్ముడికి కాల్వబుగ్గ దేవస్థానంలో పని దొరికిందనీ, కొడుకు వెల్దుర్తిలో చెప్పుల షాపు పెట్టుకోవాలని అనుకుంటున్నాడనీ, అందుకని ఇంటిని అమ్మాలని ప్రయత్నిస్తున్నామని చెప్తాడు శరబయ్య. తాను కూడా అన్న కొడుకుతో కలిసి కర్నూల్లో వ్యాపారం పెట్టబోతున్నాననీ, తాను కొనలేనని అంటాడు రెడ్డి. నువ్వే ఏదైనా దారిచూపాల అని అన్నదమ్ములిద్దరూ బ్రతిమాలితే, గొల్ల మద్దిలేటి పిండిగిర్ని పెట్టుకోవాలని అనుకుంటున్నాడనీ, అతను మీ ఇల్లు కొనుక్కుండామే అడుగుదాం అని చెప్పి, డ్రైవరు నబీని పిల్చి – గొల్ల మద్దిలేటినీ, అతని భార్య శేషమ్మను పిలుచుకుని రమ్మంటాడు. వాళ్ళు వచ్చాకా, శరబయ్య వాళ్లు ఇల్లు అమ్ముదామని అనుకుంటున్నారనీ, మీకు పిండిగిర్ని కోసం ఇల్లు కావాలి కదా, అది కొనుక్కోండి అని మద్దిలేటికి చెప్తాడు. పరస్పర అంగీకారంతో, రెడ్డి నిర్ణయించిన ధరకి ఇంటిని అమ్మేస్తారు శరబయ్య, సుంకన్న. వచ్చి డబ్బుని ఇద్దరూ సమానంగా పంచుకుంటారు. శరబయ్య తన ఖర్చులకు వెయ్యి రూపాయలు ఉంచుకుని, పదివేలు కొడుకు మాదవకి ఇస్తాడు. సుంకన్న కాల్వబుగ్గ దేవళంలో పనిలో చేరతాడు. గుడి ముందున్న హోటలు యజమాని, నన్నూరుకి చెందిన రత్నంశెట్టి సలహా మేరకు భార్యాపిల్లలతో నన్నూరులో కాపురం పెడతాడు. రత్నంశెట్టి హోటల్లోనే సుంకన్న భార్య పనికి కుదురుతుంది. కూతురిని నన్నూరులోనే ఎలిమెంటరీ స్కూల్లో చేరుస్తారు. ఇల్లమ్మిన డబ్బులో తన వాటాని బ్యాంకులో దాచుకుంటాడు సుంకన్న. ఇక చదవండి.]
మాదవ వెల్దుర్తికి బోయి చలమేశ్వర్‌ను కలిసినాడు. ఊర్లో ఇల్లు అమ్మేసినామనీ, చెప్పల శాపు పెట్టనీకె మలిగె మాట్లాడదామనీ అన్నాడు.
“మలిగె రడీగ ఉండాది రా. దానోనరుది ఈ ఊరే గద, ఆ యప్పది కూరగాయ ల్యాపారము. తోటల కాడ కూరగాయలు ఎత్తండం (హోల్‌సేల్) మింద కొనుక్కోని, గంపలోల్లకు అమ్ముతాడు. అది గాక ఉల్లిగడ్డలు మద్రాసు మార్కెట్టుకు దోల్తాడు. మొన్ననే గలిసినాడులే. ‘ఏమిరా చలమయ్యా మీ దోస్తుకు మళిగె కావాలని అనింటివి. కావాల్నా వద్దా? శానామంది అడుగుతాండారు’ అన్నాడు.
‘మామా, నాల్రోజులు నిలబడు. మావాడు వాండ్ల ఊర్లో ఇల్లమ్ముతుండాడు. వస్తాడు, ఎవురికీ మాటియ్యగాకు నాకు చెప్పకుండా’ అని చెప్పినా ఆ యప్పకు.”
“మల్ల ఆ యప్పకాడికి ఎప్పుడు బోదామురా?”
“పగలు దొరకడు. యాపారం మింద తిరుగుతాంటాడు. నివ్వు యియ్యాల మా యింట్లోనే ఉండు. రాత్రి బోయి మాట్లాడదాము.”
చలమేశ్వర్ వాండ్లు జంగమోల్లు. వాండ్ల నాయన పినాకయ్య ‘బ్రహ్మగుండం’లో పూజారి పని జేసేటోడు. వెల్దుర్తికి నాలుగు మైళ్ళ దూరంతో రామలకోటకు బోయే రోడ్డులో ఉంటాది బ్రహ్మగుండం. శానా పురాతన శివచ్చిత్రమది. దర్మాంగద మారాజుకు పాము రూపం బోయి మనిషి రూపం వచ్చింది; ఆడ కోనేట్ల ఆ యప్ప పెండ్లాము ఆ యప్పను ముంచి తీసినాకనే అని పురానం.
వంశపారంపరగా ఆడ జంగమోల్లే పూజార్లు. కానీ ఈ చలమేశ్వరు వాండ్లు నాయినెంత మొత్తుకున్నా శివునికి పూజ చేసే యిదానం, అబిశేకం, అర్చన ఇట్టాంటివి నేర్చుకోకపాయ. దర్మకర్తలు పినాకయ్య సచ్చిపోయినంక ఆ యప్ప బావమరిది బూతపతికి ఆ పనిచ్చినారు. చలమయ్యగాని సంగతి తెలిసీ, బూతపతి, బావ కాడ అన్నీ నేర్చుకున్నాడు.
చలమయ్య తన పేరు స్టైలుగా ఉండాలని చలమేశ్వర్ అని మార్చుకుండాడు. వాండ్ల సొంతూరు కలుగొట్లయితే, తాతలకాలం నాడే వెలుదుర్తి చేరినారు. వీడు ముక్కమూలిగీ టెంతు వరకు ఇగ్గు కొచ్చినాడు, బ్రమ్మానందరెడ్డి పున్యమా అని తొమ్మిది వరకు పరీచ్చ పాసుగాక పోయినా ఇబ్బంది గాల్యా. దాన్ని అందురూ ‘కాసు పాసు’ అనేటోల్లు ఆస్యానికి. టెంతులో వీని ఆటలు సాగల్యా. ఇంగ్లీషు, లెక్కలు, సైన్సు, మాడు తన్నినాయి.
‘జీవత్తాతపాదుండు’ అని తెనాలి రామక్రిష్ణ కవి అన్నట్లు, వాండ్ల నాయిన పినాకయ్య ఉన్నంత వరకు వానికి ఎట్లా బతకాలా అనే కయాస లేకపాయ. వాండ్ల అక్క హైమవతికి పినాకయ్య ఉండంగనే పెండ్లి జేసినాడు. దేవుని మాన్యం రెండెకరాలు పూజారి కిచ్చినారు. బ్రమ్మగుండం పాత కోనేటి కింద అది సాగవుతోంది. చలమయ్యకు కులవృత్తి రాక అదీపాయ. వాండ్ల మామ బూతపతి తెలివైనోడు. ఆ యప్ప దూరుకొని బతుకుతెరువు చేసుకున్నాడు.
హైమవతి మొగుడు ‘మానంది’ దేవస్తానంలో పనిజేస్తాడు. వాండ్లది గాజులెపల్లె. గాజులపల్లె సర్పంచు నీలకాంతప్ప ‘మానంది’ ధర్మకర్తల్లో ఒకడు. ఆయనే ఈ పిల్లోనికి మానందిలో ఉద్యోగమేయించినాడు. రోజూ గాజులపల్లె నుంచి మానందికి బస్సుల పోయి డూటీ చేసుకుని వస్తాడు.
పినాకయ్య బార్య ఈశ్వరమ్మ మెతకమనిసి. కొడుకు ఎందుకూ పనికి రాకుండాపోతాడేమోనని ఆయమ్మ మనేద బడేది. “మాకాడ ఉందువు రా అత్తా” అని అల్లుడు బిలిసినాడు గాని బిడ్డ కాడ ఉంటే కొడుక్కు మాటొస్తాదని ఆయమ్మ బోల్యా. వాండ్లకు నేశెగౌరి (వీధి) లోన ఒక పాతమిద్దె ఉండాది.
చలమయ్యను చలమయ్య అంటే వానికి శానా కోపం వస్తాది. ‘చలమేశ్వర్’ అనే అనాల. ‘ఎవుని పిచ్చి వాని కానంద’ మని అన్నారు గదా. ‘ఈ సదువు మన తోన గాదు తీయ్’ అని వాడు పోలీసు టేసను ముందు ఓటలు పెట్టుకున్నాడు. అంతకముందు ఆడ ఒక సైకిలు రిపేరు శావుండినాది. వాడు కాళీ జేసినాడని దెల్సి చలమేశ్వర్ దాన్ని తీసుకున్నాడు. అది పెద్దదే. ఓటలు కోసరమని కొంచెం మార్పులు చేయించుకున్నాడు. క్లీనింగుకు ఒక పొట్టిగాన్ని పెట్టుకున్నాడు. సరుకు మాస్టర్ను గుడ్క. పొట్టిగాని పేరు కుశ కుమారు. వానిది ప్రక్కనే మదారుపురము. పొద్దన్నే వచ్చి సాయంత్రము ఎల్లిపోతాడు. సరుకు మాస్టరుది పుట్లూరు. ఆ యప్ప ఒంటిగాడు. ఓటల్లోనే పండుకుంటాడు. ఆ యప్ప పేరు సుందరయ్య.
ఎదురుగ్గా పోలీసు టేసనుండాది. టేసను కొచ్చి పొయ్యేటోల్లు బాగానే ఉంటారు. ఇటుపక్క కొంచెం దూరంలో టూరింగు టాకీసు ఉండాది. దాన్నట్టా అంటారు గాని అది పర్మనెంటుదే. వెల్దుర్తి నుంచి డోనుకు బోయే రోడ్డది. డోను పక్క దశరతరామిరెడ్డిది పెట్రోలు బంకుండాది రైలు టేసను గుడ్క దగ్గరే. దాన్నానుకోని బైపాసు రోడ్డు బోతాది. అర్ద కిలోమీటరు దూరంలో రైల్వే గేటుంటాది. దాన్ని మదారుపురం గేటంటారు. దాన్ని దాటంగనే ఈ రోడ్డుపోయి అయివేలా కలుస్తాది.
వెల్దుర్తి మేజరు పంచాయితి. అయివే మింద ఉండడం, రైలు టేసనుండడం, అటు పక్క లద్దగిరి మిందుగా కోడుమూరుకు బోయే రోడ్డు, ఇటుపక్క బ్రమ్మగుండం రామలకోట మిందుగా నంద్యాలకు బోయే రోడ్డు ఉంటాయి. సుట్టుపక్కల ముపై గ్రామాలకు సెంటరు. బ్రమ్మగుండం దాటినంక ఇనుప కనిజం గనులుంటాయి. ఐరన్ వోర్ అంటారు దాన్ని. గవర్నమెంటు దాన్ని ప్రయివేటోండ్లకు లీజుకిస్తాది. వాండ్లు కూలీలను పెట్టి కనిజం తవ్వించుకుంటారు. సొంత లారీలతో టేసనుకు తోలించుకుంటారు. సుమారు పది పన్నెండు లారీలు ఉండాయి. అవిటి ఓనర్లు శెట్టిగారు, రెడ్డిగారయితే, డ్రైవర్లు, క్లీనర్లు అందురూ సాయిబులే.
పోలీసుస్టేషను నుంచి మదారుపురం గేటు వరకు కుడివైపక్క రైలు కట్ట, బైపాసు, ఎడంపక్క బంజరు భూమి ఉండాది. దాన్ని గవర్నమెంటు బీదోల్లకు పట్టాలిచ్చింది. మొదట వాండ్లు అందరూ కొట్టాలు ఏసుకున్నారు. ఆ ప్రాంతాన్ని’ కొత్త కొట్టాలు’ అంటారు.
కాబట్టి వెల్దుర్తి ఇప్పుడిప్పుడే పెరుగుతుండాది. శానా మంది బతకనీకి వస్తాండారు. కూలీ పనుల కాడ్నించి, శిన్నా శితకా యాపారాలు చేసుకొనేటోల్లకు గుడ్క వెల్దుర్తిలో జీవనాదారం దొరుకుతుండాది.
చలమేశ్వర్ ఓటలుకు పెట్టిన పేరు జూస్తే శానా నవ్వు వస్తాది. వానికి యన్టీరామారావంటే ఈరాభిమానం. ఆ యప్ప సినిమా రిలీజైన రోజే డోనుకు బోయి, ఆ రష్టులో అంగీ శింపుకోని, టికెట్టు సంపాయిచ్చి, సూడకపోతే వానికి నిద్ర బట్టదు. అందుకే వాడు తన ఓటలకు ‘పిడుగు రాముడు ఓటల్’ అని పేరు పెట్టుకున్నాడు. లోపల గోడలకు యన్టీ రామారావు సినిమాల వాలు పోస్టర్లు ‘పిడుగు రాముడు’, ‘కంచుకోట’. ‘లవకుశ’, ‘క్రిస్నపాండవీయం’ ఇట్లాంటివి కరిపించి ఉంటాయి.
చలమేశ్వర్ తాను గుడ్క ఓటల్లో పనిచేస్తాడు. సర్వింగ్ కాడ్నించి, బజ్జీలెయ్యడం, పూరీపిండి పిసకడం, దోశలు బోయడం అన్నీ వచ్చు. పొద్దు మూకులా యాదో ఒక యన్టీ రామారావు పాటలోని నుడుగులు రాగాలు తీస్తాంటాడు. వాని గొంతు గుడ్క బాగనే ఉంటాది.
వాండ్లమ్మ ఈశ్వరమ్మకు కొడుకంటే పానము. ఆ యమ్మకు పానం బాగలేకపోతే మన యన్టీ రామారావే అన్నం, పప్పు చేస్తాడు. ఆ యమ్మకు పెద్ద రోగాలేమీ లేవు గాని, ఉండాయేమో తాను సచ్చిపోకముందే కొడుక్కు పెండ్లి చెయ్యాలని తనకలాట. జంగమోండ్ల యిండ్లల్లో ఆడపిల్లలు తెల్లగా బాగుంటారు. ఇద్దరు ముగ్గురు పిల్లలను జూసింది పాపం! వీడు సోకులోడు గదా! దేవిక మాదిరి ల్యాకపోయినా కడాకు రాజశ్రీ మాదిరన్నా ఉండాలంటాడు, వీనంత ఎచ్చుల నాయాలు యాడా వుండడంటారు వాని నేస్తులు.
సోకులోడే గాని మనిసి మంచోడు చలమేశ్వరు. వాండ్లమ్మను బాగా చూసుకుంటాడు. ఎవురైనా తమాశకు “పెండ్లయినంక ఆ వచ్చేదానికి మీ యమ్మకు పడకపోతే ఏం జేస్తావురా” అంటే యన్టీ రామారావు తన ‘తల్లా? పెళ్లామా?’ సినిమాలో పడిన బాద మతికి దెచ్చుకుంటాడు.
“ఆ యప్ప అంతటోనికి దప్పల్యా ఈ ఎదారు? అంతగా ఆ వచ్చేది కశరది (గయ్యాలి) ఐతే, నేనే ఎదిగల (వేరు) బోయి, అమ్మను మా యింట్లోనే బెడ్తా. మా యమ్మ ముక్యం! అట్లని చేసుకున్న బార్య గుడ్క ముక్యమే గదా!” అని గోడ మీద పిల్ల మాదిరి చెపుతాడు.
ఇంకో తమాశ ఏందంటే అందరు వాని ఓటలును యన్టీ రామారావు ఓటలని అంటారు.
ఆ రోజు రాత్రి మాదవను పిల్చుకోని ఓనరింటికి బోయినాడు. ఆ యప్పపేరు నారయ్య. కూరగాయల యాపారంలో బాగానే సంపాయిచ్చి నట్టుండాడు. కాంక్రీటు మిద్దె లేపినాడు. ఇంటి ముందర ‘లూనా’ బండి ఉండాది. ఈది లోకే తలవాకిలి. దాటంగానే పడసాల, పడసాలలో మూడు గొద్రెజ్ మడతకుర్చీలు ఏసి ఉండాయి. ఒక మూలన నవారు మంచం, పక్కన కూరగాయల స్టోరు రూము ఉండేమో, కమ్మని పచ్చివాసన వస్తోందాది.
ఆయప మంచం మింద గూసోని, బీడీ తాగుతా, రేడియోలో వార్తలు యింటన్నాడు. వీండ్లను జూసి లేచి కూసున్నాడు.
“ఏమిరా చలమయ్యా, ఈ పొద్దప్పుడొస్తివి? ఈ పిల్లోడు ఎవరు? రాండి నాయినా కూసోండి” అని పిల్సినాడు.
“పగలు నీవు యాపారం మింద తిరుగుతాంటావని, ఈ యాలప్పుడైతే మేలని వస్తిమి, మామా!” అన్నాడు చలమేశ్వర్.
“ఓటలు బాగా జరుగుతుండాదా? మీ యమ్మ ఎట్టుందాదిరా? బెరీన పెండ్లి జేస్కోని, ఆ యమ్మకు సెయ్యి కాల్చుకునే బాద ఎప్పుడు తప్పిస్తాండావు?” అన్నాడు నారయ్య.
“ద్యానికైనా టయిము రావాల గదా మామా” అన్నాడు చలమేశు. “నేను మొన్న జెప్పిన దోస్తు వీడే. వీని పేరు మాదవ. నాకు చానా కావల్సినోడు. వీనికే మన మలిగె అడిగింది” చెప్పాడు.
“యా వూరు నాయినా మీది?” అన్నాడు నారయ్య
‘మాది బొమ్మిరెడ్డి పల్లె మామా” అన్నాడు మాదవ.
“ఏంటోల్లో?”
“మంగలోల్లము. మా నాయిన మా కులవృత్తే చేస్తాడు. నాకు యిస్టం ల్యాక, మా ఊర్లో బరకతు ల్యాక, ఈడ బ్రతుకుదామని..”
“ఏం యాపారం జెయ్యాలని?”
“వెల్దుర్తి లోన సరైన చెప్పుల షాపు లేదని, అదయితే బాగ జరుగుతాదని మా దోస్తుడు చెప్పినాడు. నీవు ఆ మలిగి ఇప్పిస్తే నీ పేరు చెప్పుకోని బతకతాను.”
నారయ్య పకాపకా నవ్వినాడు. “దీనమ్మ కాలము! ఇంత శేటుగ అయితాదనుకోలేదు రా! వీడేమో జంగమయ్య. గుల్లో పూజ చేసుకోవాల్సినోడు, ఓటలు పెట్టుకునె. నీవేమో మంగలాండ్ల యింట్లో బుట్టి, శెప్పు లంగడి పెడతాన్నావు. దీన్ని బట్టి ఏ మర్తమాయ? ఎవుని కులాన్ని బట్టి ఆ వృత్తి అనేది పోతా ఉంది. అందురూ అన్ని పనులూ చేసుకుంటా ఉండారు. అంతెందుకు నాయినా, మేము నేశోల్లము. యానాడు నేను నేత నేశింది లేదు. ఎప్పుడో మా తాతల కాలంలో మగ్గముండేదంట. మా నాయిన ఎద్దులు ఎనుములు పశువుల సంతల్లోన, తిర్నాలల్లోన మారుబేరాలు జేసెటోడు. నా కాడి కొచ్చే తలికి ఈ కూరగాయ ల్యాపారము!”
చలమేశ్వర్ అన్నాడు “మనూరి కోంటాయనే గద మామా, ఆయన పేరేందబ్బా, మతికి రాదు? ఆఁ, కనకదాసు! ఆ యప్పే గదా నంద్యాల లోన ‘బాటా’ చెప్పుల శోరూము బెట్టింది. దానికే లచ్చ రూపాయలైందంట.”
“కాలము మనుసుల జీవితగతి మారుస్తాది రా చలమయ్యా! బాపనోండ్ల పిల్లలు, రెడ్డి పిల్లలు పెద్ద సదువులు సదువుకోని రకరకాల ఉద్యోగాలు సేస్తాన్నారు. పనిచేసే కాడ పై అధికారి తక్కువ కులమోడైనా, మరేద యిస్తున్నారు. అంతెందుకు నేను ఉల్లిగడ్డలు మద్రాసుకు తోల్తాను గద. ఆ లారీ ఓనరు కమ్మాయన. చంద్రాయుడు. లారీ డ్రయివరేమో సాకలాయన. ఆ యప్ప పేరు యల్ల శేషు. ఇప్పుడు జనాలు కులాల గురించి కాకుండా బతికేదాని గురించి ఆలోచిస్తాండారు.”
(ఇంకా ఉంది)