Site icon Sanchika

మహాప్రవాహం!-27

[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘మహాప్రవాహం!’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[పుండరి బయల్దేరబోతుంటే, అన్నం తిని వెళ్ళమంటుంది వదినె. ఆమె మాట కాదనలేక భోం చేసి వెళతాడు. ఆమె చేసిన వంటలతో, అమ్మ గుర్తొంచిదంటాడు. రెండ్రోజుల తర్వాత సోమనాధనగరులో ఒకరింట సత్యనారాయణ వ్రతము చేయిస్తాడు పద్మనాభయ్య. కొత్త దంపతులతో బాటు, వారి వారి తల్లిదండ్రుల్ని కూడా కూర్చోబెట్టి పూజ చేయిస్తాడు.  వ్రతములో వచ్చే ప్రతి విధానాన్ని అది ఎందుకో వివరంగా చెప్పి చేయిస్తాడు. చివరలో అక్కడున్న వారితో దేవుడి పాటలు పాడిస్తాడు. తాను కూడా ‘కస్తూరీ తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం..’ అన్న శ్లోకాన్ని రాగయుక్తంగా పాడతాడు. ఆ ఇంటివారికి ఎంతో సంతోషం కలుగుతుంది. ముందు అనుకున్న సంభావన కన్నా కొంత ఎక్కువే ఇస్తారు. వాళ్ళందరినీ ఆశీర్వదించి ఇల్లు చేరతాడు పద్మనాభయ్య. రెండు నెలల్లో పద్మనాభయ్య గురించి ఊరంతా తెలిసిపోతుంది. ఉన్నోళ్ళు, లేనోళ్ళు అని తేడా చూపకుండా అందరికీ శ్రద్ధగా పూజలు చేయిస్తాడనే అందరూ చెప్పుకుంటారు. ఒక రిక్షాతను పక్కా ఇల్లు కట్టుకుంటే, గృహప్రవేశం జరిపిస్తాడు పద్మనాభయ్య. అనుకున్న మాట ప్రకారం రామానుజశెట్టి మిగతా ముపై వేలు పంపుతాడు. కేదార ఫైనలియర్ పూర్తి చేసి మద్రాసు యూనివర్సిటీలో న్యూక్లియర్ ఫిజిక్స్‌లో చేరుతాడు. కేదారతో పాటు పుండరి వెళ్ళి అక్కడ ఏర్పాట్లన్నీ చేసి వస్తాడు. ఒకసారి బెంగుళూరులో రామలింగారెడ్డి పెద్ద భూస్వామి ఇంటి గృహప్రవేశం జరిపిస్తారు పద్మనాభయ్య, పుండరి. పద్మనాభయ్య విద్వత్తును మెచ్చి వాళ్ళు ఘనంగా దక్షిణ ఇచ్చి పంపుతారు. ఓ రోజు సాయంత్రం పుండరి అన్నగారి దగ్గరకు వచ్చి రాప్తాడు లోని భాస్కర చౌదరి అనే మోతుబరి గారి ఆయిల్ మిల్లులో ఎప్పుడూ ఏవో సమస్యలు వస్తున్నాయనీ, పరిహారంగా ఆయన ఏదైనా క్రతువు చేయించాలనుకుంటున్నాడనీ, ధర్మవరానికి చెందిన ప్రతాపరెడ్డి మన గురించి వాళ్ళకి చెప్పారనీ, వీలయితే వచ్చి కలవమన్నారని చెప్తాడు. మిల్లులో జరిగిన అగ్నిప్రమాదం సమయం కనుక్కుని, ఏవో లెక్కలు గణించి, రాహుగ్రహ దోషమని చెప్పి, నివారణగా చండీయాగం చెయ్యాలని తమ్ముడికి చెప్తాడు పద్మనాభయ్య. ముందు వెళ్ళి మాట్లాడి వద్దామనీ, పది పన్నెండు రోజులు సమయం తీసుకుని, ఈ లోపు చండీయాగం గురించిన పరిజ్ఞానం సంపాదిద్దామని చెప్తాడు. వస్తామని వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాడు పుండరి. ఇక చదవండి.]

[dropcap]రెం[/dropcap]డు రోజుల్లోనే చౌదరిగారు కారు పంపించినారు. ముందు రాప్తాడులోని వాండ్ల యింటికి బోయినారిద్దరూ. ప్రతాపరెడ్డి, చౌదరి, వీండ్లను ఎంతో గౌరవముగా ఆహ్వానించి సోఫాల్లో కూర్చోబెట్టినారు. పద్మనాభయ్యను చూస్తూనే చౌదరిగారి కండ్లల్లో ఒక నమ్మకం కనపడినాది.

“సామీ, మిమ్మల్ను గురించి మా ప్రతాపరెడ్డి శానా ఇదిన జెప్పినాడు. మాది ఆయిలు మిల్లు శానా కష్టాల్లో ఉండాది. లక్షల్లో పెట్టుబడి పెట్టినాము. ఎందుకో – మీరే దాన్ని ఏవైనా దోషాలుంటే సరిజేయనీకె తగుదురనిపిస్తా ఉంది.”

“నాయనా, అధైర్యపడవాకు. అన్నీ సర్దుకుంటాయి. నీ నామ నక్షత్రాన్ని బట్టి ప్రస్తుతం రాహుగ్రహ దోషమున్నది. నీ జన్మనక్షత్రము?”

“పుబ్బ”

“పాదము?”

“నాల్గో పాదము సామీ”

“మంచిది” అని పద్మనాభయ్య మళ్లీ మనసులో గణించినాడు. “సందేహము లేదు నాయినా. రాహువే నిన్ను పట్టి పీడిస్తున్నాడు. మిల్లులో జరిగిన అగ్నిప్రమాదములో కూడ మీ శత్రువుల పాత్ర ఉండవచ్చునని తోస్తూ ఉన్నది.”

“అవును సామీ. పోలీసు కేసు గూడ పెట్టినాము.”

“దీనికి పరిహారము చేయవలెనంటే చండీ యాగము చేయాల. అది చానా పెద్దఎత్తున నిర్వహించాల. ఒకసారి నేను, మా తమ్ముడు ప్యాక్టరీకి పోయి చూస్తాము. అక్కడే పందిళ్లు వేసి చేయిస్తే శానా మంచిది.”

“పెద్ద మిల్లు సామి, శానా స్తలముండాది. శామియానాలు ఏయించ వచ్చును. మీరెంత మంది బ్రామ్మలు వచ్చినా అందరికీ ఆడనే సౌకర్యము జేయిస్తాను.”

“మొత్తం మూడు రోజుల కార్యక్రమము. ఏడెనిమంది రుత్విక్కులు వస్తారు. వంట బ్రాహ్మనునితో సహా పదిమందిమి.”

“ఏం పరవాల్యా సామి. మీరు పోయి మిల్లు చూసి రాండి.”

“ఎందుకంటే మిల్లులో వాస్తు దోషాలుంటే ఒకేసారి వాస్తుశాంతి, వాస్తుహోమము గూడ చేయించుకోవచునని.”

ప్రతాపరెడ్డి అన్నాడు “బాస్కరన్నా, అట్నే ఏకాదశ రుద్రాభిషేకము గుడ్క చేయించుకోండి. మా యింట్ల ఈ సామి చేయిస్తాంటే సాచ్ఛాత్తు కైలాసమే దిగి వచ్చినాదనుకో”

“అన్నీ చేద్దాము నాయనా. ఆందోళన ఏ మాత్రం అవసరము లేదు.”

కారులో ఫ్యాక్టరీ అంతా చూసి వచ్చి మళ్లీ రాప్తాడులో దిగినారు. వీండ్ల కోసరము శానా ఇదిగా ఎదురు చూస్తాన్నాడు భాస్కర చౌదరి. “రాండి సామీ, చూసాచ్చినారా?” అన్నాడు.

“చూసినాము నాయినా. వాస్తులో ఏ లోపమూ లేదు. కాబట్టి వాస్తుహోమాలు, శాంతులు పనిలేదు. రుద్రాభిషేకము చేయించుకోండి. అది సర్వమంగళకారి.”

చౌదరి లోలోపల ఆశ్చర్యపోయినాడు. ‘ఇంకొకరయితే వాస్తు దోషాలని మరింత ఖర్చుపెట్టించి, ఇంకా సంభావన అడిగేవారు. ఈన తిక్క బాపనయ్య మాదిరి ఉండాడు’ అనుకున్నాడు. .

“మాకు పక్షం దినాలు సమయమివ్వండి. చండీయాగానికి కావలసిన పరిజ్ఞానము ముందు మేము సమకూర్చుకుంటాము. మాకు ఇది తొలి ప్రయత్నము. నేను కొన్ని రోజులు అమ్మవారిని ఉపాసించి అమె అనుగ్రహము పొందవలసి ఉన్నది.”

ఆ వినయము చౌదరిగారిని అబ్బురపరచింది. ‘అన్నీ నాకు తెలుసు’ అనకుండా ‘ముందు నేను నేర్చుకుంటాను’ అని చెబుతున్నాడు!

“మొత్తం ఎంత ఖర్చు రావొచ్చును సామీ! మీ సంభావనలు?” అని చేతులు జోడించుకొని అడిగినాడు చౌదరి.

“అదంతా వారం తర్వాత తెలుపుతాము. కావలసిన ద్రవ్యాలు, సంబరాలు, అన్నీ వివరంగా వ్రాసి ఇస్తాము. మీరు తెప్పించుకోవడమే. ఇక మా సంభావన గురించి మీరు ఆలోచించవద్దు. ముందు కార్యక్రమమంతా సక్రమముగా జరిగితే, అది అంత ప్రధానము కాదు.”

చౌదరి పద్మనాభయ్య కాళ్లకు మొక్కి, నూటపదార్లు సమర్పించినాడు. పుండరి ఒక విషయము గమనించినాడు. ప్రతి సందర్భము లోను తనను కూడ కలుపుకొని చెబుతున్నాడు పద్మన్నయ్య; చేస్తాము; చెబుతాము అని. చండీయాగములో తన పాత్ర చాలా తక్కువ. కానీ ఆయన సంస్కారం ఎంత గొప్పది!

కారులో ఇంటి దగ్గర విడిచిపెట్టిపోయినాడు చౌదరిగారి డ్రయివరు. మరుసటి రోజునుంచీ అమ్మవారి ఉపాసన పారంభించినాడు పద్మనాభయ్య. మహాకాళీ, మహాసరస్వతీ మహాలక్ష్మీ స్వరూపియైన దుర్గాదేవి మూల మంత్రాన్ని పొద్దున సాయంత్రం సహస్రము జపం చేస్తున్నాడు.

శృంగీరి పీఠము, గోరఖ్‍పూర్ ప్రెస్ వారి నుండి చండీయాగ కల్పము తెప్పించి అధ్యయనము చేసినాడు. కర్నూలు బాల సరస్వతీ బుక్ డిపోలో అవి దొరికినాయి. హైదరాబాదు ‘వేదభారతి’ వారి చండీ వేద సమాఖ్య వనస్థలిపురంలో ఉందని తెలిసి, రంగశాయిని పంపించి వారి గ్రంథాన్ని కూడ తెప్పించుకున్నారు.

పుండరిని, మార్కండేయ పురాణములోనున్న, దేవీభాగవతములో ఉన్న చండీ యాగమునకు సంబంధించిన కల్పమును ఒక నోటుబుక్కులో వ్రాసి పెట్టమన్నాడు.

నవచండి, శతచండి, అయుతచండి (వేయి) అని మూడు విధానాలున్నాయి. శత చండీయాగము భాస్కర చౌదరిగారికి అనువైనదని నిర్ణయించినాడు. పుండరిని తాడిపత్రికి పంపి, మహాపండితులు, దేవీ ఉపాసకులు బ్రహ్మశ్రీ జోస్యము జనార్దన శాస్త్రి గారి వద్ద, వారు రచించిన ‘దేవీ మహత్యము’ అనే గ్రంథాన్ని తెప్పించుకున్నారు. అందులో ఆ వేద వేదాంగవేత్త చండీయాగ కల్పమును వివరించినారు.

పదిరోజుల్లో, చండీయాగమునకు సంబంధించిన పరిపూర్ణ పరిజ్ఞానము పద్మనాభయ్యస్వామికి అవగతమైంది. ప్రతి విషయము తమ్ముడు పుండరితో చర్చించి, అతనికి గూడ అవగాహన కల్పించినాడు. ఒక పదిమంది రుత్విక్కులను మాట్లాడుకున్నారు. మూడు రోజులపాటు అందరికీ వంట చేసి పెట్టడానికి ‘నార్పల’ నుండి వరాహమయ్యను, ఆయన భార్యను కుదుర్చుకున్నారు.

చౌదరిగారి మనిషి వచ్చి కావలసినవన్నీ రాయించుకొని పోయినాడు. దుర్గాసప్తశతిలో మొత్తం పదమూడు అధ్యాయాలుంటాయి. ఒక్కో అధ్యాయము అనంతరము హోమములో వ్రేల్చవలసిన అహుతులు వేరుగా ఉంటాయి. ఇప్పపూవు, బిల్వ కాయలు, మాదీఫలాలు ఇట్లా.

ముందురోజు రాత్రి అందరూ ఫాక్టరీ చేరుకున్నారు. మధ్యలో విశాలంగా పామియానాలు వేయించినారు చౌదరి గారు. ఒక పెద్ద గోడౌనును శుభ్రము చేయించి, లైట్లు, టేబిలు ఫాన్లు పెట్టించి, క్రింద జంపఖానాలు పరిపించి, బ్రాహ్మలకు వసతి ఏర్పాట్లు చేసినారు. ఒక మూల దూరంగా వసారాలో వంటశాల ఏర్పాటు అయింది.

తొలుత కలశస్థాపన చేసి, దుర్గాదేవిని ఆవాహన చేసినాడు పద్మనాభయ్య. అర్చన, పారాయణ హోమాలు శాస్త్ర సమ్మతంగా జరిగినాయి. రాహువు దోషనివారణార్థము లక్ష జపం జరిగింది.

చుట్టుపక్కల గ్రామాల నుంచి జనం వచ్చి, చౌదరి గారి మిల్లులో జరుగుతున్న చండీయాగం దూరంగా నిలబడి చూసినారు. చివరిరోజు మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము జరిగింది. తర్వాత పూర్ణాహుతితో క్రతువు ముగిసింది.

రుద్రాభిషేకం జరుగుతుండగానే చౌదరిగారికి ఫోను వచ్చింది. అగ్నిప్రమాదానికి కారకులైన వారు పట్టుబడినారని. చౌదరిగారి ప్రత్యర్థి నాదమునిరెడ్డి మనుషులే వాండ్లు.

పరమానందభరితులైనారు భాస్కర చౌదరి దంపతులు. ఎమ్మెల్లే గారి దంపతులు కూడా మూడు రోజులు అక్కడే ఉన్నారు. పద్మనాభయ్య సామి ఆదేశము మేరకు పేదలకు అన్నదానము జరిగింది.

భాస్కర చౌదరి పద్మనాభయ్యకు పాదాక్రాంతుడైనాడు. రుత్విక్కులకు, వంట బ్రామ్మనికి తలా వెయ్యి రూపాయలు సంభావన ఇచ్చినాడు. చివరన పద్మనాభయ్యను, పుండరిని కూర్చోబెట్టి ఇట్లా చెప్పినాడు. “సామీ! మీ రునం ఎట్ల దీర్చుకోవాల్నో తెలియదు. అది డబ్బులతో తీరేది గాదు. అయినా ఏదో మా తృప్తి కోసరం ఈ పదివేల రూపాయలు సమర్పించుకుంటున్నాము” అని పట్టువస్త్రాలతో బాటు దక్షిణ, తాంబలము, పండ్లు ఇచ్చి కాళ్లకు మొక్కినారు.

 ఈ చండీయాగముతో పద్మనాభయ్య పేరు మార్మోగిపోయింది.

ఎంత చెప్పినా వినకుండా తమ్మునికి ఐదువేలు ఇచ్చినాడు.

“పద్మన్నయ్యా, నేను చేసిందీముంది? అంతా ఒంటి చేత్తో నడిపించినావు” అన్నాడు పుండరి.

“అసలు నన్ను తీసుకొచ్చిందే నీవు కదరా!’ అన్నాడాయన నవ్వుతూ.

పద్మనాభయ్య గ్రంథాలను అధ్యయనం చేసి, దేవాలయ ప్రతిష్ఠలు, ధ్వజస్తంభ స్థాపన, రుద్రయామీళ తంత్రంలో వరపాశుపత, కన్యా పాశుపత హోమాలను నిర్వహించినాడు. శివలింగాన్ని పుట్టమన్నుతో చేసి, పాశుపతమంత్రాన్ని, నమక చమకములను చిన్న చిన్న పనసలుగా విభజించి సంపుటీకరణము చేస్తూ, అభిషేకము చేయడం ఒక అద్భుతమైన ప్రక్రియ. పుట్టమన్ను బంక ఉంటుంది కాబట్టి అభిషేకముచేసినా కరగిపోదు. పాశుపత మంత్రాన్ని ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పినాడు. కలకండ పొడితో స్వామిని అభిషేకించి గన్నేరుపూలతో అర్చన చేసి, బెల్లం పొంగలి నైవేద్యము పెట్టాల. ఆడపిల్లలకు మంచివరులు, మగపిల్లలకు మంచి వధువులు ఈ హోమాల వల్ల లభిస్తారు. మృత్యుంజయ పాశుపతము ద్వారా, దీర్ఘరోగగ్రస్తులు విముక్తులై, ఆయురారోగ్యాలను పొందుతారు. ఇట్లాంటి కార్యక్రమాలను ఆయన అవలీలగా చేయించబట్నాడు.

పద్మనాభయ్య రోజా సహస్రగాయత్రి జపం చేస్తాడు. ఆయనకు డబ్బు మీద ఆశ లేదు. రెండేండ్లలో ఆయన చిన్న చిన్న కార్యక్రమాలకు దొరకనంతటి వాడయినాడు. మరింత మంది శిష్యులను తయారు చేసినారు. వాండ్లకు పుండరి నాయకుడు.

తపోవనము లోనే ఐదు సెంట్ల ఇంటి స్థలము తీసుకున్నారు. క్రమంగా యిల్లు కట్టుకోవాలని అనుకున్నారు.

కేదార పి.జి. చదువు పూర్తయింది. బంగారుపతకము తెచ్చుకోన్నాడు. ఢిల్లీ విశ్వవిద్యాలయములో న్యూక్లియర్ ఫిజిక్స్‌లో పరిశోధన చేయడానికి సీటు వచ్చింది. ఆర్థికంగా ఏ సమస్యా లేదు కాబట్టి అమ్మా నాయినా సంతోషంగా ఒప్పుకున్నారు.

మరొక యాడాదిలో ఒక చక్కని సొంత యిల్లు కట్టుకుని గృహప్రవేశము చేసుకున్నారు పద్మనాభయ్య దంపతులు. మహశక్తిమంతుడైన కాలపురుషుడు పద్మనాభయ్య కుటుంబాన్ని ఊహించని మార్పులకు గురిచేసినాడు.

***

వడ్లాయిన రామబ్రమ్మం కోడుకు వీరబ్రమ్మం మంచి రోజు చూసుకోని ఆదోనికి బోయినాడు. వాని దోస్తు దస్తగిరి శానా సంతోశించినాడు. “మీ నాయిన ఇంత సులబంగ ఒప్పుకుంటాడనుకోలేదురా వీరా” అన్నాడు

“ముందల కాదు కూడ్దన్నాడులే.  మాయమ్మ తిట్టేతలికి గమ్మునుండాడు.”

“ఎనకటి తరమాయన గదా మీ నాయిన. ఎంతైనా చెప్పు, ఆయన భయం ఆయన కుంటాది లేరా” అన్నాడు దస్తగిరి.

దస్తగిరి సిన్నాయన గౌసుమియది ఆదోనికి దగ్గరే ఉన్న కోసిగి. వాండ్ల నాయిన నజీరు ఆడ వడ్రంగం పని చేసెటోడు. అది అంత పెద్దూరు కాదు. వాండ్ల నాయిన చచ్చిపోయినంక గౌసుమియ బతకనీకె ఆదోని జేరినాడు. ఎమ్మిగనూరుకు బోయే రోడ్డులో ‘తిక్కసామి దర్గా’కు ఇవతల శెడ్డు పెట్టుకొన్నాడు. ఆ యప్ప గుడ్క కొన్నేండ్లు మౌలాలీ అనే ఆయన దగ్గర పని చేసినాడు. పిల్లాడు పనోడనీ, మంచోడనీ, మౌలాలి గౌసుమియకు తన బిడ్డ కాశిం బీ నిచ్చి నిక్కా చేసినాడు. మామ అత్త కాలం తీరి సచ్చిపోయినారు.

గౌసుమియకు ఒక్కడే కొడుకు. వాని పేరు మునీరు. వాడు ఐ.టి.ఐ ఫిట్టరు కోర్సు చదివి బళ్లారిలో ఒక కంపెనీలా పనిజేస్తాడు. వానికి పెండ్లి గుడ్క అయింది. వాని ఎదారు గౌసుకు లేదు. వాదు ఈ యప్పకు బెట్టేది లేదు, ఈ యప్ప వాన్ని అడిగేది లేదు.

గౌసుమియ అంటే చెక్కపని శానా నైపున్నెంగ జేస్తాడని ఆదోనిలో పేరు. ద్వార బంధాలు, కిటికిలకాన్నించి షాపుల్లో షెల్పులు, కుర్చీలు, టేబుల్లు, సోపాలు అన్నీ చేస్తాడు. కావలసిన చెక్కను శిరుగుప్ప, ఆలూరు, దేవనకొండ నుండిచి టోకున తెచ్చుకోని, సామిల్లులో కావల్సిన సైజులు కోయించుకుంటాడు.

ఇప్పుడు వడ్రంగం పనిలో శ్రమ తగ్గినాది. రీపర్లు కోయడం, తోపడా పట్టడం, చిత్రిక బట్టి చెక్క మింద డిజైన్లు వేయడం, చెక్కలో స్క్రూలు దించడం అన్నీ మిసిన్లే చేస్తాన్నాయి.

దస్తగిరి తన దోస్తు వీరబ్రెమ్మాన్ని దీసుకోని సిన్నాయన దగ్గరకు బోయినాడు. ముందే చెప్పినాడు కాబట్టి గౌసుమియకు తెలుసు. “రాండి రా” అని పిలిచినాడు. అప్పుడు ఆ యప్ప ఒక డస్సింగ్ టేబులుకు అరలు జేస్తాన్నాడు.

“వీని పీరు ఏందిరా దస్తగిరీ!” అనడిగినాడు.

“వీరబ్రమ్మము, సిన్నాయనా, వడ్లోల్లు!”

“ఇప్పుడు ఎవలయినా ఒకటే. కస్టపడి పనిచేసేది ముక్యము. మనం దూదేకులోల్లము. యానాడయిన దూది ఏకినామా సచ్చినామా!” అని నగినాడు.

“కాని వీండ్ల నాయిన, వీడు బొమ్మిరెడ్డిపల్లెలో ఇంకా కమ్మరి పని చేస్తాండ్రి సిన్నాయనా! కొన్నేండ్లుగా సేద్దాలు గిట్టుబాటు గాక, రైతులు పనుల కోసరము రావడము బాగా తగ్గిపాయ. అందుకని నేనే..”

“ఔ. ఔ. చెప్పినావు గదా! ఇప్పటికీ మన దగ్గర ఇద్దరు పొట్టిగాండ్లుంటారు. నీవు చెప్పబట్టి వీన్ని చేర్చుకోనీకె సరే అంటిని” అన్నాడు గౌసుమియ.

(ఇంకా ఉంది)

Exit mobile version