Site icon Sanchika

మహాప్రవాహం!-29

[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘మహాప్రవాహం!’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[‘శిన్నాయనా, నీవే ఏదో ఓ దారి చూపించాల’ని వీర గౌసుమియని అడుగుతాడు. బెంగపడద్దనీ, నెమ్మదిగా పని నేర్పిస్తానని ముందు ఓ వారం పది రోజులు అన్నీ గమనించుకోమని చెప్తాడు గౌసు. శెడ్దులోనే ఓ మూల ఉంటామని అంటాడు వీర. తర్వాత శిన్నాయన – దస్తగిరిని, వీరని ఇంటికి తీసుకువెళతాడు. వీరని భార్య కాశింబీకి పరిచయం చేసి, దస్తగిరితో పాటు మనింట్లోనే తింటాడని చెప్తాడు. ఆమె ముఖం చిట్లిస్తే, కసురుతాడు. తర్వాత దస్తగిరితో పాటు శెడ్దుకు వచ్చి అక్కడ నిద్రపోతాడు వీర. మర్నాడు ఉదయం దగ్గరలోని ఓటలులో టిఫిన్ తిని, పనిలోకి దిగుతారిద్దరూ. వీరకి మొదట ఉడ్ పాలిష్ చేయడం నేర్పిస్తాడు గౌసుమియా. ఓ రోజు ఉల్లిపాయల వ్యాపారం చేసే భైరవయ్య అనే శెట్టి వచ్చి దేవుడి మందిరం తయారు చేయమని ఆర్డరిస్తాడు. మందసం ఎలా ఉంటుందో బొమ్మ వేసి ఆయనకు చూపిస్తాడు గౌసు. ఎంతవుతుందని శెట్టి అడిగితే, మొత్తం ఎనిమిది వందలవుతుందని చెప్తాడు గౌసు. ఆయన అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళిపోతాడు. వీరకు చిత్రిక పట్టడం, మిశినుతో చెక్కకు బెజ్జాలు ఎయ్యడం, తోపడా పట్టడం, పెద్ద రీపర్లను మిసిను రంపముతో శిన్నవి కోయడం నేర్పిస్తాడు గౌసు. శెట్టి గారి మందసం తయారవుతూ ఉంటుంది. దాని ఒక స్తంభాన్ని వీరకి ఇచ్చి నగీషీలు జెయ్యమంటాడు. బావుంటే, మిగతా మూడూ కూడా వీరతోనే చేయిస్తనాంటాడు. వీర చేసినదాన్ని బావుందని చెప్పి కొన్ని సూచనలు చేసి, మిగతా మూడు స్తంభాలు కూడా అప్పగిస్తాడు గౌసుమియా. మొదటి పని దేవుని మందసంతో మొదలైంది కాబట్టి నిలబడుతావులే అంటాడు దస్తగిరి. ఇక చదవండి.]

[dropcap]ఇం[/dropcap]దిరానగరులో లాండ్రీ డ్రైక్లీనింగు షాపు పెట్టినాయన వచ్చినాడు ఒక రోజు. ఆ యప్పది ఆలూరంట. సాకలోల్లు. పేరు మాదన్న.

“అజరత్, మా శాపు లోన అద్దాలతోని షెల్పులు చెయ్యాల. డ్రైక్లీనింగు చేసిన బట్టల యాలాడదీయనీకె హ్యంగర్ల తోని. అట్నే లాండ్రిపనికి ఇస్త్రీ చేసే టేబులు పెద్దది జెయ్యాల. కొత్తగా షాపు పెడతాన్నాము” అన్నాడు.

“అన్నా, జరూర్ కరేంగే. అద్దాల షెల్పులు ఈడ జేసుకోని వచ్చి ఆడ బిగించేకి కుదరదు. షాపులోనే జేస్తాము. లాండ్రీ టేబులు గావాలంటే మాత్రము ఈడ జేసుకోని పోవచ్చు”

“అద్దాల షెల్పులకు ఫ్లయివుడ్డు రీపర్లు ఏసి డికొలాము శీటు కలిపిద్దాము. అద్దాలు, జరుపుకునే విదంగ వస్తాయి. చెక్కతోని జేస్తే బాగుండదు. మా వాండ్లిద్దరు నాలుగు రోజులు పని జెయ్యాల.”

మాదన్న రేటు మాటాడుకోని అడ్మాన్సు ఇచ్చి ఎలబారినాడు. గౌసుమియ రాగవేంద్ర అనే పొట్టిగాన్ని బిలిచి, “నీవూ, మన వీరా కలిసి ఈ షాపులలో జేయండి. పోయిన నెల ఎస్.కె.డి కాలనీలో రెడీమేడ్ బట్టల శాపులో షెల్పులు చేసినావు గదా దస్తగిరితో కలిసి? ఇప్పుడు వీర గాన్ని దోలకపో. వాడూ నేర్చుకుంటాడు” అన్నాడు.

“ముందునే నొచ్చి, కొలతలు దీసి, ఎట్ల జేస్తే బాగుంటాదో సూపించి వస్తా.”

రాగవీంద్ర, వీర కలిసి లాండ్రీ, డ్రైక్లీనింగు షాపులో ఐదు రోజులు పని చేసినారు. ఈ లోపల శెడ్డు లోనే ఇస్త్రీ టేబులు మద్ది చెక్కతో చేసిచ్చినాడు గౌసుమియ.

నెలకిచ్చే ముఫ్ఫై రూపాయలు గాకుండా, యాదయిన పని పూర్తయినంక పొట్టిగాల్లకు మజూరీ డబ్బుల్లోంచి ఎంతో కొంత యిస్తాంటాడు గౌసు శిన్నాయన. పొట్టగాండ్లందరికీ ఆ యప్ప శిన్నాయనే.

తన మంచితనముతో, ఇనయముతో కాశింబీ మనసు గుడ మార్చుకున్నాడు వీర. “పిన్నమ్మా” అంటూ బోరింగు నీళ్లు కొట్టి అవుత్ కాన (పెద్ద నీల్లతొట్టి)లో బోస్తాడు. కటికె అంగడి కాడికి బోయి మటన్ గొట్టిచ్చుకొస్తాడు. ఆ యమ్మకు తలకాయ నొప్పి వస్తే మందులంగడికి బోయి గోలీ తెచ్చి ఏస్తాడు.

ఒకసారి కాశింబీకి జరమొచ్చింది. డాక్టరు కాడికి దీస్కపోయి ఇండీసనేయించినారు. శిన్నాయన ఓటలు నుంచి భోజనం తెప్పించుకోని తిందామన్నాడు. వీర ఇనల్యా! జరముతో ఉన్న పిన్నమ్మకు ఓటలు తిండి పెట్టడం మంచిది కాదన్నాడు. “పొద్దున నాస్త ఇడ్లీ వరకు పరవాల్యా” అన్నాడు. “నీకెందుకు శిన్నాయన! నేను వంట జేస్తా గద” అని చెప్పినాడు. “మా ఊర్లో మా యమ్మకు జరమొస్తే నేనే వంట జేస్తుంటి” అని చెప్పినాడు.

పదకొండున్నరకే శెడ్డు పని నిలబెట్టి ఇంటికి బోయినాడు. సొజ్జ (బొంబాయి రవ్వ ఉడికించి, పలాసగ జేసి, దాంట్లో కొంచెం పాలు, శక్కెర గలిపి, పిన్నమ్మకు ఇచ్చినాడు.

కిరసనాయిలు స్టవ్వు మీద ఎసరుకు నీళ్లు బెట్టి, నీళ్ళు కాగినాక నానబెట్టుకున్న బియ్యము అందులో ఏసినాడు. ఇరువై నిమిశాలలో అన్నం అయినాది. టమేటలు పిసికి శారు గాసినాడు. పిన్నమ్మకు అరగనీకె, దావలో పాలకూర కట్టలు పది దెచ్చుకోని, సన్నగా తరుక్కోని; ఉల్లిగడ్డలు, టమేట, మిరపకాయలు సన్నగా తరిగి తిరగమాతేసి అందులో ఆ పాలకూర ఏసి మగ్గించినాడు. గోగాకు ఊరిమిండి నూరినాడు.

శిన్నాయన, దస్తగిరి రాకముందే పిన్నమ్మకు అన్నం పెట్టినాడు. పాలకూర తాలింపు, టమేట శారుతోని నాలుగు ముద్దలు తిని, గోలీ ఏసుకోని పండుకున్నాది కాశింబీ.

గౌసుమియ వచ్చి, అయిగా నిద్రబోతున్న బీబీని జూసి నిమ్మలపడినాడు. ముగ్గురూ బోజనానికి కూసున్నారు. స్టీలు ప్లేట్లలో అన్నం బెట్టి పాలకూర తాలింపు, గోగాకు ఉరిమిండి  ఏసినాడు.

శిన్నాయన ఊరిమిండి కలుపుకోని ఒక ముద్ద తిని బాగుందన్నట్లు తలూపినాడు. పాలకూర తాలింపు తిని “నీ పాసుగూల వీరా! ఆడోండ్లు నీ ముందల ఎందుకూ పనికి రారు” అని మెచ్చుకొన్నాడు. శారు గుడ్క బాగుందన్నాడు

“పిన్నమ్మ జరం మనిసి గదా, సులబంగ అరుగుతాదని పాలకూర జేస్తి” అన్నాడు. వాని తల నిమిరి శిన్నాయన అన్నాడు “మా దస్తగిరి గాడంటే సొంత అన్న కొడుకు. యా తల్లి గన్నబిడ్డవో, మా యింటిమనిషివై పోయినావు, జీతే రహో బేటా!”

కొన్ని రోజుల తర్వాత ఒక పెద్ద ఆడ్డరు వచ్చినాది. ప్రభాకర్ టాకీసుకివతల మెయిను రోడ్డులో కిన్నెర బార్ అండ్ రెస్టారెంట్ అని బెడతుండారు. దాని ఓనరు దినకర రెడ్డని, గుంతకల్లు సొంతూరు. ఆడ గుడ్క ఆయనకు పెద్ద ఓటలుండాదంట. మంచి కార్పెంటరెవరు ఆదోనిలో అని ఇశారిచ్చుకుంటే.. అందరూ గౌసుమియ పేరు జెప్పినారంట. ఆ యప్ప శానా పెద్దాడు. ఆ యప్ప తమ్ముడు బళ్లారిలో పెద్ద కాంట్రాక్టరంట. ఆ యప్పకు పిల్లనిచ్చిన మామ ఒకప్పుడు ఆలూరు ఎమ్మెల్యేగా చేసినాడంట. ఇప్పుడు రైల్వే టేసను కాడ ‘ఇంపీరియల్ లాడ్జి’లో దిగినాడంట. ఒకసారి వచ్చి మాట్లాడి బొమ్మని మనిసిని పంపించినాడు దినకరరెడ్డి.

దస్తగిరిని, వీరను దీసుకోని లాడ్జికి బోయినాడు గౌసుమియ. కింద రిసెప్సను కాడనే వీండ్లను ఉండమన్నారు. కుంచేపటికి దిగొచ్చినాడు దినకర్ రెడ్డి. చేయెత్తు మనిసి. ఎమ్మెల్నే అంచు ధోతీ, పైన తెల్లని జుబ్బా ఏసుకున్నాడు. తాగుతాడేమో ఆ యప్ప కండ్లు మంకెనపూల మాదిరి ఎర్రగా ఉండాయి. రెండు చేతుల వేళ్ళకు ఎనిమిది ఉంగరాలుండాయి. మెళ్లో పులిగోగారు బంగారు గొలుసు. శేతికి బంగారు చెయినున్న వాచీ. ఆ యప్ప చెప్పులు గూడ్క నల్లగా మెరుస్తాన్నాయి.

‘ఎంతయినా రెడ్డిగారి రాజసము, ఆ టీవి, వేరే’ అనుకున్నాడు వీర. దినకర్ రెడ్డి వచ్చి సోపాలో గూచున్నాడు. “ఏందప్పా, మీరేనా కార్పెంటర్లు? గౌసుమియా ఎవరు మీలోన?” అని అడిగినాడు. ఆ యప్ప గొంతు గంభీరంగ ఉండాది.

“నేనే రెడ్డి గారో!” అన్నాడు గౌసు.

“ఏమప్పా సాయిబూ, ఆదోనిలో ఎవర్నడిగినా నీ పేరే సెబుతుండారే!”

“ఏదో మీ మాదిరి పెద్దల దయ రెడ్డిగారు!”

“మేం జేసిందేముందిలే గాని, పనిమంతుడు యాడయినాగాని బయటికొస్తాడు. గుంతకల్లులో మా కార్పెంటరుండాడు గాని వాండ్లందరు ఇక్కడి కొచ్చి చెయ్యడం ఎందుకని ఇక్కడొండ్లనే మాట్లాడదామని, మిమ్మల్ను బిలిస్తి.”

“మంచిది నాయినా” అన్నాడు గౌసు.

“నిలబడే ఉండారేంది? కూసోండి” అన్నాడు రెడ్డి. అక్కడ సోపాలు తప్ప ఇంకేం లేవు. తన ఎదుట కూచోడానికి జంకుతున్నారని గ్రయించి, రిసెప్షన్‍లో ఉన్నోనితో “మూడు కుర్చీలో, బెంచీనో యాదో ఒకటి తెప్పించు. అట్నే అందరికీ టీలు గుడ్క” అన్నాడు రెడ్డి.

రూం బాయ్ ఒకడు మూడు గాడ్రేజ్ కుర్చీలు దెచ్చి ఏసినాడు. వాండ్లు ఇంకా ఆలోశిస్తాంటే “సాయిబూ ఆ కాలాలు బోతాన్నాయి. ఏం పరవాల్యా. కూసోండి!” అని కూచోబెట్టినాడు. కుంచేపటికి టీలు వచ్చినాయి. తాగిన తర్వాత జేబు లోంచి గోల్డు ప్లేకు సిగరెట్టు పెట్టి తీసి నోట్ల పెట్టుకున్నాడు రెడ్డి. పక్కనున్నాయన లైటరుతో ఎలిగిస్తే తాగబట్నాడు.

ఒక సిగిరెట్టు గౌసు కిస్తే, తరవాత తాగతానని చెవి ఎనక బెట్టుకున్నాడు. “మన బార్ అండ్ రెస్టారెంటు ఆదోనిలో కంతా పెద్దది. మొత్తం ఏడు సెంట్లు. బిల్డింగంతా రినోవేశను జేయిచ్చినాము. వడ్డె మేస్త్రీల పని ఐపోయింది. ఇప్పుడు మీ పని. బారులో కౌంటరు, మందు సీసాలకు అద్దాల షెల్పులు జెయ్యాల. రెస్టారెంటులో పై రూఫింగంతా వుడ్ వర్కుతో కప్పాల బెంగులూరులో చూసినానప్పా, దాన్ని ఏమో అంటారు.. ఏందిరా అది?” అని సిగిరెట్టు వెలిగించినోన్ని అడిగితే వాడు “పాల్సు సీలింగంటారు నాయినా” అని చెప్పినాడు. “ఆ అదే అదే. దాన్ని శానా పనితనంగ జెయ్యాల. బల్లారిలో గుడ్క జూసినా, కావాలంటే మీరు బోయి ఒకతూరి చూసి రాండి. ఒక అయిడియా వస్తాది. దాంట్లో లైట్లు వస్తాయి. ఇంక మెయిను పని కుర్చీలు, టేబుల్లు. కుర్చీలు మొత్తం రోజ్ వుడ్డు వాడాల. కుచ్చోనీకి, అనుకోనీకి గూడ్క కుశన్లు ఎయ్యల. కుర్చీల కాళ్లు, ఎనక శానా సోకుగా ఉండాల. టేబుల్లు గూడ్క రోజువుడ్డుతో చేయాల. కోడిగుడ్డు శేపులో ఉండాల. పినిశింగు ఎట్లుండాలంటే వచ్చినోనికి మతిబోవాల. తర్వాత మెయిన్ డోరు టేకుతో జేసి లక్ష్మీదేవి బొమ్మను ‘కార్వింగ్’ జేపియ్యాల.

నెలా రెండు నెలలు ఈ పని మిందే ఉండల్ల. మీరందరూ డబ్బులకేవీ ఆలోచించాల్సిన బనిల్యా. నాకు పని ముక్యము. పనిలో నాన్యత ముక్యం. పలానా దినకర రెడ్డిది ‘కిన్నెర బార్ అండ్ రెస్టారెంటు’ అంటే ఆదోనిలో పేరు మారు మాగిపోవాల అంతే!” అన్నాడు ఆ యప్ప. మల్లా ఇంకో సిగిరెట్టు ముట్టించుకొన్నాడు.

వీండ్లు ముగ్గురికీ నోర్లు తడారిపోయినాయి. “రోజువుడ్డంటే శానా కరీదు గుంటాది. ఈడ దొరకదు. తిరపతికి బోయి ఏస్కరావాల” అన్నాడు గౌసు.

“ఎంత కరీదయితే ఏముండాది? నీవు మంచిది తెచ్చుకో. వచ్చి బిల్డింగు జూసి కొలతలు దీసుకో. వీండ్లు గాక ఎంత మందుండారు నీ కాడ?”

“వీండ్లు ముగ్గురే నాయినా! కాని వీండ్లు సాలరు. ఇంకా ఇద్దరు పొట్టిగాండ్లను పెట్టుకుంటాలే.”

“సరే, శానా జాగ్రత్తగా ఉండాల నా కాడ. ఆదోని డి.యస్.పి. శంకర్రెడ్డి మా బందువే. తేడా వచ్చిందంటే ఆ యప్పే చూసుకుంటాడు.”

“అంతవరకు బోతామా రెడ్డిగారో! మీ అంత పెద్దోల్లు మమ్మల్ను పిలిసి పని చేయిచ్చికుంటామంటే అంతకంటె బాగ్యమా! మీ కాడ మాట పోగొట్టుకుంటే మాకేం మరేదుంటాది. మీరు మెచ్చుకునేటట్లు పనిచేస్తాము” అన్నాడు గౌసు.

జుబ్బా జేబుతోంచి నూర్రూపాయల కట్ట తీసి గౌసుమియ కిచ్చినాడు దినకర్ రెడ్డి. “ఇది అడ్డుమాన్సు. రోజ్‍వుడ్డుకు బోయినపుడు మల్లా యిస్తాను. ఈ సాయిబుకు మన పోను నెంబరియ్యండిరా. నేను గుంతకల్లులో ఉన్నా మీరు నాతో మాట్లాడొచ్చు. వారానికికొకతూరి వచ్చి చూస్తాంటా. ఇది అక్టోబరు. నవంబరు. డిసెంబరు.. సంక్రాంతికి ఓపనింగ్ జెయ్యాలని ప్లాను. ఇంక చిల్లరమల్లర పనులు ఒప్పుకోగాకండి. పోయి రాండి” అని లేచినాడు.

ఆ యప్పకు మొక్కి, ముగ్గురూ బయటకు వచ్చినారు.

“మనకు మంచి మోకా (అవకాశం) వచ్చినాది. కష్టపడి చేసుకోవాల. ఇట్లా డబ్బులు లెక్కచేయని పెద్దోల్లు దొరకరు. మంత్రాలయంలో మనోండ్లున్నారు. మంచి పనిమంతులు – వాండ్లిద్దర్నీ పిలిపిద్దాము. ఈ మూడు నెల్లు శెడ్డులో మామూలు పనులు నిలబడగూడ్దు. అందుకని కోసిగి నుంచి ఇద్దరు పొట్టెగాండ్లనీ రమ్మని శెడ్డులో పనులప్పచెపుదాము. ఒరేయ్ వీరా, ఈ పని మొదులయితే సంక్రాంతి పండగ వరకు మనకు పురసత్తు దొరకదు. నీవు పోయి మీ అమ్మను నాయినను జూసిరా. రెండ్రోజులుండు” అని కట్ట లోంచి మూడు నూర్రూపాయల కాయితాలు తీసి వీర కిచ్చినాడు సిన్నాయన. దస్తగిరికి గూడా రెండు నూర్లిచ్చినాడు. వీరబ్రెమ్మం ముకం ఒక నమ్మకంతో ఎలిగిపోబట్నాది.

“అట్నే శిన్నాయనా, రేప్పొద్దున్నే బోయి, ఎల్లుండి సాయంత్రానికొస్తా” అన్నాడు.

మర్సటి రోజు పొద్దున కర్నూలు బస్సెక్కి కోడుమూరులో దిగి అక్కడినుంచి ఉళిందకొండ బస్సులో ఊరు చేరుకున్నాడు వీర. ముందు రోజు సాయంత్రము డజను కమలాపండ్లు, పావుకిలో మైసూరుపాకు, పావుకిలో మిక్చరు కట్టించుకోని చేతి సంచిలా పెట్టుకున్నాడు. ఊరు చేరేతలికి పదయ్యింది. కోడుమూరులో తాను ప్లేటు పూరి తిని, అమ్మకు నాయినకు రెండు ప్లేట్లు కట్టించుకున్నాడు. శిన్నాయన యిచ్చిన మూడు నూర్లు గాక ఇంకా నూట నలభై రూపాయలుంది వీర దగ్గర.

వీరను జూచి అమ్మ నాయిన శానా ఆనందపడినారు. కొడుకు ఊరు గాని ఊర్లో శిక్కి పోకుండా బాగుండాడని, మొగంలో కల వచ్చిందని అనుకున్నారు. కాలుసేతులు కడుక్కోని వచ్చి సంచిలో తెచ్చినవి అమ్మకిచ్చినాడు. “ముందు పూరీలు తినండి” అని వాండ్లతో టిపను చేయించినాడు. నాయనకు రెండు నూర్లు రూపాయలు ఇచ్చినాడు.

గౌసు శిన్నాయన, పిన్నమ్మ కాశింబీ శానా మంచోల్లనీ, పని బాగా నేర్చుకున్నాననీ, కడుపునిండా అన్నం బెట్టి, పనిని బట్టి ఎంతో కొంతయిస్తాండారనీ చెప్పినాడు.

సిద్దమ్మ కొడుకొచ్చినాడని నాలుగు కోడిగుడ్లు తెచ్చి ఉడికించి, టమేటాలు, ఉల్లిగడ్డ తీసి కూర చేసినాది. రెండు కట్టలు గోలికూర ఉంటే కందిబ్యాడలు ఏసి పప్పు చేసినాది. ముగ్గురూ తిన్నారు. ఎందుకో కాశింబీ పిన్నమ్మ మతికొచ్చినాది వీరకు.

పెద్దగా పనులు రావడం లేదనీ, మొన్న నేశే ఎల్ల సామి ఇంటి కాడ మామిడి సెట్టు పడిపోతే దాన్ని కొనుక్కోని రీపర్లు కోయించుకోనీకె కంబగిరిరెడ్డి దగ్గర నూటయాభై దీస్కొని, సిన్నపిల్లోండ్లు నడిచే దానికి చక్రాల బండ్లు పప్పుగుత్తులు, మజ్జిగ శిలికే కవ్వాలు, ఎద్దులనదిలించే శెలకోలలు, శిన్న పిల్లలు తాడు కట్టి ఇగ్గుకుంట ఆడుకొనే శక్కబొమ్మలు చేసి, తాను వాండ్లమ్మ పోయి సంతల్లో అమ్ముతాన్నామని, పెట్టుబడి వచ్చేసి కంబగిరిరెడ్డికిచ్చేసినామనీ, ఇంకా మామిడి శక్క శానా మిగిలిందనీ, శానా వస్తువులు తీయొచ్చనీ, ఇప్పుడు కొడుకిచ్చిన దుడ్డుతో గుడ్క – ఉళిందకొండ టింబరు డిపోకు బోయి పనికి రాని శెక్క తుంటలు తూకానికి దెచ్చుకోని, ఇంకా ఇట్లాంటివన్నీ జేసి సంతల్ల-అమ్ముకోంటాడామని జెప్పినాడు రామబ్రమ్మం.

నాయిన వైపు అబ్బురంగా జూసినాడు వీర. సేద్దం కొరముట్ల పని తగ్గిపోయిందని బాద పడకుండా ఏదో ఒక ఆలోశన జేసి ఎంతో కొంత సంపాయిచ్చకుంటాండారు. తానింత వరకు ఒక్క రూపాయ గుడ్క యియ్యలేకపోయినాడు. “నాయినా, ఒక్క సంమచ్చరం తాలండి. నాతో దస్తగిరితో పతికొండలో గాని, గుంతకలు గాని శెడ్డు పెట్టిస్తానన్నాడు శిన్నాయన. అప్పుడు మిమ్మల్ని గుడ్క నాతో దీస్కపోత” అన్నాడు.

మర్సటి రోజు రాత్రికి ఆదోనికి చేరుకున్నాడు వీర.

(ఇంకా ఉంది)

Exit mobile version