Site icon Sanchika

మహాప్రవాహం!-34

[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘మహాప్రవాహం!’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[అనుకున్నట్టుగానే అనుమంత రెడ్డి, ఆయన కొడుకు మారుతి రెడ్డి వచ్చి ఖాజా హుసేను ఇల్లు చూస్తారు. బాగానే ఉంది కానీ చిన్న చిన్న రిపేర్లు చేయించుకోవాలని అంటారు. మీరు కొనుక్కున్నాక మీ ఇష్టమని అంటాడు బడేమియా. బేరాలయి చివరికి ఇరవై ఐదు వేలకి ఒప్పుకుంటారు. పదివేలు అడ్వాన్సు ఇస్తారు. మిగతాది పదిహేను రోజుల్లో చెల్లించి, అగ్రిమెంటు చేసుకుందామనుకుంటారు. బడేమియాకి నమస్కరించి, గద్వాల వచ్చేస్తాడు ఖాజా హుసేను. పండ్ల అంగడికి కూడా అవసరమైన చిన్న చిన్న రిపేర్లు చేయించుకుంటారు. జహంగీరు పరీక్షలయిపోయి నంద్యాల నుంచి వచ్చేస్తాడు. జహంగీరు రంగు కాయితాలు తెచ్చి మైదా పిండి ఉడికించి తాటి దూలాలకు, వెదురు బొంగులకు అతికిస్తాడు. సున్నం వేయిస్తారు. ‘హసీనా ఫ్రూట్ స్టాల్’ అని తెలుగులో బోర్డు రాయిస్తారు. ఎన్నాళ్ళు బిడ్డ ఇంట్లో ఉండాలని ఫాతింబీ గొణుగుతూండడంతో, పూలబజారుకు దగ్గరలోనే ఓ సందులోని ఇంట్లో అద్దెకి దిగుతారు ఫాతింబీ, ఖాజా హుసేను. మున్సిపాలిటీ నుంచి లీజు కాయితం, లైసెన్సు తెచ్చిస్తాడు యాదగిరి. కార్బైడ్ ప్యాక్టరీలో ఆరునెలలు అప్రెంటీసు చేయడానికి జహంగీరుకు అవకాశం వస్తుంది. పండ్ల అంగండి ప్రారంభం చేసేముందు అందరు కలిసి రాయిచూరు కాడ మాసుం బాషా దర్గాకు వెళ్ళి దర్శనం చేసుకుంటారు. శాపు బాగా జరగాలనీ, కొడుక్కు ఉద్యోగం రావాలనీ, బిడ్డ కడుపు పండాలనీ మొక్కుకున్నారు ఫాతింబీ, ఖాజా. పండ్లు హోల్‍సేల్‍గా ఎక్కడ్నించి తెచ్చుకోవాలని భోగట్టా చేస్తే, మహబూబ్‌నగర్‍లో హనీఫ్ మండీ గురించి తెలుస్తుంది. ఖాజా, ఖాదర్, జహంగీర్ వెళ్ళి తమని పరిచయం చేసుకుని, సరుకు కొంటారు. ఖాదర్ మాట్లాడిన పద్ధతి హనీఫ్ సాబ్‍కు నచ్చుతుంది. పండ్ల వ్యాపారం లోని కిటుకులని కొన్ని చెప్పి, వ్యాపారం బాగా సాగితే, ముందు రోజుల్లో అరువిస్తానంటాడు. సరుకు తెచ్చుకుని వస్తారు. అనుకున్న రోజున పండ్ల అంగడి తెరుస్తారు. కొద్ది రోజుల్లోనే వ్యాపారం ఊపందుకుంటుంది. జహంగీర్ అప్రెంటిస్ అయిపోతుంది, కర్నూలు కార్బైడు ఫ్యాక్టరీలోనే తీసుకున్నారు. హసీనా గర్భవతి అవుతుంది. ఫాతింబీ, ఖాజా ఎంతో సంతోషిస్తారు. కొడుకు ఇంట్లో ఉంటున్న కొండారెడ్డికి పీడకల వచ్చి మెలకువ వస్తుంది. లేచి కూచుంటాడు. పనిమనిషి వచ్చే బెల్ కొడితే తలుపు తీస్తాడు. ఆమె అతన్ని పలకరించకుండా, తన పని తాను చేసుకుపోతుంది. కొండారెడ్డి ముఖం కడుక్కుని బ్రష్ చేసుకుంటాడు. గుమ్మం దగ్గరున్న పాలపాకెట్లు తీసుకుని కిచెన్ లోకి వస్తాడు. ఒక ప్యాకెట్ ఫ్రిజ్ లో పెట్టి, రెండో దాన్ని కట్ చేసి, గిన్నెలో పోసి స్టవ్ వెలిగిస్తాడు. పాలు కాగేవరకూ అక్కడే ఉంటాడు. తరువాత స్టవ్ కట్టేసి, ఓ గ్లాసులో పాలు పోసుకుని, దగ్గరలో ఉన్న బ్రూ పౌడర్, కొద్దిగా చక్కెర వేసుకుని కాఫీ కలుపుకుంటాడు. ఆ రుచి నచ్చకపోయినా తాగుతాడు. ఎనిమిది గంటలకు మనుమడు హిమాంశు రెడ్డి లేచి వచ్చి తాతని పలకరిస్తాడు. దగ్గరకు రమ్మంటే రాడు. ఇక చదవండి.]

[dropcap]కుం[/dropcap]చేపటికి కొడుకు కంబిరెడ్డి లేచొచ్చి తండ్రి, కెదురుగా కూచున్నాడు. పక్కనే కూచోవాలని ఉన్నా, బార్య చూసిందంటే..

“నాన్నా, కాఫీ తాగుతున్నావా?” అని అడిగినాడు కొడుకు.

“ఔరా” అన్నాడు తండ్రి. అంత కంటే మాటలు ముందుకు సాగల్యా. కంబిరెడ్డి టీపాయి మింద ఉన్న ఇంగ్లీషు పేపరు తీసి చూడబట్నాడు.

తర్వాత కోడలు లేచి వచ్చింది. మామ దిక్కు చూడనన్నాలేదా యమ్మ. “కాంబీ, గుడ్ మార్నింగ్!” అన్నది మొగునితో.

“గుడ్ మార్నింగ్ విన్నూ” అన్నాడు కాంబి. ఆ అమ్మాయి పేరు వినీత.

‘సుబ్రంగా ఉన్న పేర్లు బ్రస్టు పట్టించుకుంటాన్నారు. అదేందో! పిల్లన్ని గుడ హిమ్మూ! అని పిలుస్తారు’ అని మనసులో అనుకున్నాడు.

రెండు మగ్గులతో కాఫీ కలుపుకొచ్చి ఒకటి మొగునికిచ్చి, ఇంకో దాంట్లోంచి తాను తాగబట్నాది కోడలు. ఒక్క మగ్గులో అద్దలీటరు కాపీ పడ్తాదేమో! అనుకున్నాడు కొండారెడ్డి.

“నేనట్లా తిరిగి వస్తారా నాయినా” అని చెప్పి చెప్పులేసుకోని ఎలబార్నాడు. కోడలు “లెటజ్ ఆర్డర్ సమ్ బ్రేక్‍ఫాస్ట్. ఆస్క్ ది ఓల్డ్‌మ్యాన్ వాట్ హి వాంట్స్” అనింది.  ఓల్డ్‌మ్యాన్ అంటే తానే అని కొండారెడ్డికి తెలుసు.

“నాన్నా, టిఫిన్ తెప్పిస్తున్నా. నీకేం కావాలి?” అని అడిగినాడు కొడుకు.

“యాదో ఒకటి” అని బయటికి పోయినాడు. లిఫ్ట్ లోకి బోయి ‘జి’ అని ఉన్న చోట ఒత్తినాడు. వీండ్ల అపార్టుమెంటు తొమ్మిదో ప్లోరు లోన ఉంది. కిందికి దిగి, సెల్లారులో చుట్టూ ఏసిన సిమెంటు బాట మింద మెల్లగా నడవబట్నాడు.

కొండారెడ్డికి యిప్పడు డెబైమూడేండ్లు. ఒక్క పన్నురాలల్యా. చత్వారం వచ్చి పోయినాది. సన్నగా బారుగా ఉంటాడు. మోకాలి నొప్పులు లేవు. మెల్లగా నడక వేగము పెంచినాడు. 903 లో ఉండే విస్నువర్ధన రెడ్డి ఎదురైనాడు. ఆ యప్పది నెల్లూరు జిల్లా వేదాయపాల్యము. గవర్నమెంటులో ఏదో పెద్ద ఉద్యోగమే జేసి రిటైరైనాడు.

“ఏం కొండారెడ్డన్నా, ఏందబ్బా యింకా రాలేదే అని చూస్తాంటి. పా, నీతో బాటు నడుస్తా” అని వెనక్కు తిరిగి నడవబట్నాడు. ఆ యప్పకు అరవై రెండేండ్లు. బారీ మనిషి. పెద్ద పొట్ట ఉంటాది. శుగరు, బిపి, మోకాల్ల నొప్పులు ఉంటాయి. పోయినేడు బైపాస్ సర్జరీ అయింది. ఇద్దరు పిల్లలు. బిడ్డ అల్లుడు అమెరికాలో, కొడుకు కోడలు న్యూజిలాండ్ ఉంటారు. ఆలూమొగుడూ ఇద్దరే ఉంటారు. తనకు గుండె ఆపరేశనయినప్పుడు ఎవ్వరూ రాలేదని గర్వముగా చెబుతుంటాడు.

‘తు! ఎదవ బతుకు. దిక్కుమాలిన బతుకు!’ అనుకుంటాడు కొండారెడ్డి.

“ఏందో అన్నా, డెబ్బై దాటినా గూడ నీవు బాగానే నడుస్తున్నావు. నాకు నాలుగు రౌండ్లకే కాల్లు పీకుతాయి. ఇదే నడక మొదటనుంచి చేసింటే బాగుండునని ఇప్పడనిపిస్తోంది” అన్నాడు విష్ణువర్ధన.

కొండారెడ్డి నగినాడు. “నలబై సంవత్సరాల పాటు సేద్దెం జేసినా. నా వృత్తే నాకు వ్యాయామము. నీ కట్ల కాదు కదా!” అన్నాడు.

“నిజమే అన్నా” అని, “నేను నడువలేను, నీవు గానీయి” అని ఎల్లిపోయినాడు. పది పన్నెండు రౌండ్లు నడిసి, ఎండలో నిలబడి, ఎనిక్కీ ముందుకు వంగడం, పక్కలకు చేతులు వంచడం, రెండు చేతులతో నడుము పట్టుకోని శరీరాన్ని తిప్పడం, వంగి రెండు చేతులతో కాలి బొటన వేల్లు తాకడం ఇట్టాంటివి పావుగంట చేసి, పది నిమిశాలు ఆడున్న సిమెంటు బెంచీ మింద కూసున్నాడు.

ఇంటికి బోయేటప్పటికి తొమ్మిది దాటింది. కొడుకు, కోడలు మనుమడూ డైనింగ్ టీబులు దగ్గర కూసోని యిడ్లీలు తింటాన్నారు.  “తొందరగా స్నానం చేసిరా నాన్నా, టిఫను చేద్దువుగాని” అన్నాడు కొడుకు. “నీవు చెప్పకపోతే తినడా?” అనింది కోడలు. ముసలాయప్ప మనసు చివుక్కుమనింది. కొడుకు “గుడ్ జోక్!” అని భార్యను మెచ్చుకున్నాడు.

స్నానం చేసి, పంచ, అంగీ మార్చుకోని దేవుని దగ్గర దీపారాదన చేసి యావో శ్లోకాలు చదివినాడు కొండారెడ్డి. టేబులు మింద హాట్ ప్యాక్‍లో నాలుగిడ్లీలున్నాయి. పార్సలు కాయితం క్రింద చట్నీ ఉన్నాది. అది ప్రిజ్ లోనిదేమో సల్లగా ఉన్నాది. ఊరగాయ సీసా తీసి, కొంచెం ప్లేటులో ఏసుకోని, ఇడ్లీలు తిన్నాడు.

మనుమడు బడికి పోయినాడు. వాడు చదివేది ‘ఆక్రిడ్జి ఇంటర్నేషనల్ స్కూల్’. అది వరంగల్ అయివే మింద ఉంటాది. రాను పోనూ మూడు గంటల ప్రయానము – ఏ.సి. బస్సు, ఏసి క్లాసురూము, ఇంట్లో గూడ ఏసి. వానికి ఎండ తగిలే పని లేదు. ఇంతకు వాడు చదివేది యల్.కె.జి. దానికి పీజు నెలకు లచ్చ రూపాయలంట. బోజనము గుడ్క బడిలోనే పెట్టి, సాయంత్రము కుంచేపు సదివించి, పంపిస్తారు. పిల్లోడొచ్చేటప్పటికి ఏడు దాట్తాది.

కోడలు గచ్చిబౌలిలో ఒక యమ్.యన్.సి.లో పని చేస్తాది. సొంతంగా తన కారు తాను నడుపుకోని పోతాది. కంబిరెడ్డికి సొంత కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఉంది. అపార్టుమెంట్లు, బిల్డింగులు కట్టించి అమ్ముతాడు. ఆ యప్ప ఆపీసు పంజాగుట్టలో. వీండ్లుండేది చైతన్యపురిలో. ఆ యప్ప డ్రైవర్ను పెట్టుకున్నాడు. పేరు రహమాన్.

కోడలు పన్నెండుకు బోయి రాత్రి పన్నెండుకొస్తాది. కొడుకుది సొంత యాపారమని పేరే గాని యాలా పాలా ఉండదు.

అందరూ పోయినంక కొండారెడ్డికి పొద్దుపోదు. తలుపులు తీయనేకూడదు. వాండ్లందరూ బయట తింటారు. పన్నెండుకు వంటమనిసి వస్తాది, వనస్తలిపురం నుంచి. ఆ యమ్మపేరు జోగులాంబ. యాబై ఏండ్లుంటాయి. వస్తూనే, “ఏం వంట చెయ్యమంటారు రెడ్డిగారూ” అనడుగుతాది. కొండారెడ్డికి జొన్న రొట్టెలు తినాలనుంటాది. దాంట్లోకి గోగాకు పప్పు నంచుకోవాలని ఉంటాది. బుడంకాయ పప్పు తినాలని ఉంటాది. చాపల పులుసు తినాలని ఉంటాది. కానీ ఏదీ చెప్పడు. చెప్పినా చెయ్యదు వంటాయమ్మ. ఏం చేయాలో ఆమెకు కోడలు ఫోనులో చెపుతోంది. కానీ ఏం చెయ్యమంటారని అడుగుతాది. అదో ఆట ఆమెకు ముసలాయనతో.

“ఫిజ్జులో సాంబారుంది. ఏదయినా కూర..”

“వంకాయలుంటే నించుడు కాయ చెయ్యి” అనబోయి ఆగినాడు.

“నాలుగు అప్పడాలు వేయిస్తాను. నువ్వుల పొడి ఉన్నట్లుంది. చాలు కదా?” – అని లోపలికి వెళ్లింది. కుక్కరు విజిల్స్ శబ్దాలు వినబడుతున్నాయి.

‘నా అదురుష్టము. అన్నము ఫ్రిజ్జులో పెట్టుకోరు’ అనుకోని నవ్వుకున్నాడు.

“రాత్రికి నాలుగు చపాతీలు చేస్తాను లెండి. నువ్వులపొడి ఉంది. చూసినా. అదేసుకోని తినండి” అని చెప్పింది

అన్నము హాట్ ప్యాకుల వేసి, సాంబారు వేడి చేసి, అప్పడాలు వేయించి టీబుల్ మీద డిష్‌లో పెట్టి వెళ్లి పోయింది.

ఒకటిన్నరకు కొండారెడ్డి బోంచేసినాడు. “పెరుగు పాకెట్టు కట్ చేసి ఒక గిన్నెలో పోసి పోమ్మా తినేటప్పటికి బాగుంటాది” అని చెప్తాడు గాని ఏనాడూ ఆ పని చెయ్యదు.

ప్రిజ్జులోంచి తీసి వేడి చేసిన సాంబారు నచ్చదాయప్పకు. నువ్వుల పొడి స్వగృహ పుడ్స్ నుంచి తెప్పించింది. అదీ కొంచెం నోటికి హితవనిపిచ్చింది. దాంతో, అప్పడాలు నంచుకొని, ఊరగాయతో తిన్నాడు నాలుగుముద్దలు. పెరుగు తినడానికి బయము. ఐసుక్రీము మాదిరుంటాదని. తన యింట్లో పెరుగు మతి కొచ్చినాది. పైన మందంగ మీగడ కట్టి, పెరుగన్నం తిన్నంక చెయ్యంతా జిడ్డుగా అయ్యేది.

తలుపు ఒకసారి చూసుకోని తన రూములోకిపోయి పండుకున్నాడు. పగటినిద్ర అలవాటు ల్యా. పొరపాటున నిద్రపోతే, రాత్రి నిద్రపట్టక సావాల.

కండ్లు మూసుకుంటే ఈ పది పదిహేనేండ్లలో జరిగినవన్నీ మతికొచ్చినాయి.

బిడ్డ సుజాత డోనులో ఇంటరయినంక ఇంజనీరింగు సీటు రాక, బి.యస్సిలో చేరినాది అనంతపురములో. తర్వాత పెండ్లి చేసుకోమంటే యింకా చదువుతానన్నాది. తిరుపతిలో ఎమ్మెస్సీ జేసినాది. అప్పడు సుంకులమ్మ గుడి సీను ఎకరా అమ్మి చదివించినాడు. పి.జి. తర్వాత సర్వీసు కమిషన్ పరీక్ష సెలెక్టు అయి, ఫిజిక్సు లెక్చరర్‌గా గవర్నమెంటు డిగ్రీ కాలేజీలో చేరినాది. మొదట నందికొట్కూరుకు ఏసినారు. నాగరత్నమ్మ పోయి కొన్నాళ్ళు వండిపెట్టినాది. పెండ్లి సంగతెత్తితే గయ్యిమని లేచేది.

తర్వాత తెలిసింది, ఎవరో క్రిస్టియన్ పిల్లవాన్ని ప్రేమించిందనీ, పేరు మేత్యూ అనీ, అతడు గూడ్క డిగ్రీ కాలేజీలో ఇంగ్లీషు లెక్చరరనీ. ఇద్దరూ తిరుపతి యానివర్సిటీలోనే జతయినారంట.

వీండ్లిద్దరూ మొత్తుకున్నారు. వినలేదు. ఒక్క బిడ్డ పెండ్లి గనంగా చేద్దామనుకున్నాడు. ‘గాశారమట్లుంది’ అనుకున్నాడు. అటువైపు వాండ్లు కూడ ఒప్పుకోల్యా. రిజిస్టరు పెండ్లి చేసుకున్నారు. ఒక ఆడపిల్ల. విచిత్రమేమంటే వాండ్లమ్మ పేరు కలిసేటట్లు ‘నాగమణి’ అని పెట్టుకున్నాదట. ఇద్దరూ మదనపల్లె డిగ్రీ కాలేజీలో పని చేస్తున్నారు.

వాండ్లమ్మ చచ్చిపోయినప్పడు వచ్చి పోయినాది. భర్తను, బిడ్డను తీసుకో రాల్యా. తిరుపతిలో అపార్టుమెంటు కొనుక్కోని బాడిక్కిచ్చినారు. ట్రాన్స్‌ఫర్ల ఉద్యోగాలు కదా! ఇద్దరికి ఒక కాలేజీలో ఇస్తాంటారు. కుదరకపోతే దగ్గర్లో ఏదో కాలేజి. వస్తు పోతా ఉండే వీలున్నది.

ఎప్పుడన్న పోను జేస్తది. లాండులైనుకు, ఇంట్లో ఎవరూ లేనప్పుడు. “బాగుండావా నాయినా” అని అడగతాది. “నాకాడికొచ్చి నెల రోజులుండచ్చు కదా” అంటాది పాపము.

మొదుట శానా కోపము బెట్టుకోని ఉండినారు ఇద్దరూ. నాగరత్నమ్మ ఆ దిగులు తోనే సచ్చిపోయినాది. తర్వాత కొండారెడ్డికి బిడ్డ మీద కోపం తగ్గిపోయినాది. ‘దాని కిస్టమైనవాన్ని చేసుకున్నాది. బిడ్డను కన్నాది. మొగుడు కూడా శానా మంచోడని చెబుతోంది. ఎవురి మతము, ఎవురి పూజలు వాండ్లవేనంట.’

సొంత కులం లోంచి తెచ్చుకొన్న కోడలు ఏముద్దరిస్తాన్నాది? కనీసం పలకరించదు. వియ్యంకుడు మహిపాలరెడ్డి పెద్ద కాంట్రాక్టరు. వాండ్లది బళ్లారి.

కంబిరెడ్డి యింటరు కర్నూలు యస్.టి.బి.సి. కాలేజీలో చదివినాడు. స్టేట్ పద్నాలుగో ర్యాంకు. ఇంజనీరింగు చదువుతానంటే సరే అన్నాడు. ఎంట్రన్సులో మంచి ర్యాంకే వచ్చింది. జి.పుల్లారెడ్డి కాలేజీ, కర్నూలులోనే సీటు వచ్చింది. ‘సివిలు’కు అప్పడు మంచి డిమాండుందని అది తీసుకున్నాడు. ఇంజనీరింగు తర్వాత బెంగుళూరుతో ఒక పెద్ద కంపెనీలో చేరినాడు. కోడలు కూడా ఇంజనీరే. కంప్యూటరు. ఆ యమ్మికి పెండ్లి సంబంధాలు చూస్తోంటే కంబిరెడ్డి వాండ్ల సంబంధం తెలిసింది. అప్పటికి నాగరత్నమ్మ బతికే ఉంది. “అంత పెద్ద సంబందము మనకెందుకు? వియ్యానికైనా కయ్యానికైనా సరిసమానంగ ఉండాల” అనింది.

కొడుకు వినలేదు. వాని చదువుకు ఇంకో రెండెకరాలు అమ్ముకున్నాడు. ఇంక ఎకరన్నర మిగిలింది. ఇల్లు.

పెండ్లయినాక ‘కేరాఫ్’ మామ’ అయినాడు కంబిరెడ్డి. ఒక్కతే బిడ్డ. ఆస్తంతా ఆ యమ్మికే. ఆ యమ్మికి హైదరాబాదులో ఉద్యోగం వచ్చింది. మామ సలహా మేరకు బెంగుళూరులో ఉద్యోగం మానేసి, హైదరాబాదులో తనే సొంతంగా కన్స్ట్రక్షన్ కంపెనీ పెట్టినాడు. దాని పెట్టుబడి గూడ్క ఆయనే. మామ ఎదురుగా పిల్లి మాదిరుంటాడు అల్లుడు. వాండ్లు గూడ హైదరాబాదు లోనే యస్.ఆర్.నగర్‌లో ఉంటారు. వీండ్లు ఆడికిపోతాంటారు, వాండ్లు ఈడికి వస్తాంటారు.

కంబిరెడ్డి నాయినను ఏమీ అనడు. భార్య ఆ యప్పను తీసేసి మాట్లాడినా ఏమనడు. మామ పల్లెటూరోడనీ, నాగరికత తెలియదనీ కోడలికి లోకువ. వాండ్ల కంటే తక్కువ స్తాయి వాండ్లని చిన్న చూపు!

ఇంక పెద్దకొడుకు లింగారెడ్డి. కొండారెడ్డి వాండ్ల నాయిన పేరు పెట్టుకున్నాడు. పెద్దవాడంటే ప్రానమే. కాని వాడు చదువుకోలేదు. టెంతు తర్వాత చదవనన్నాడు. సేద్దెంలోకైనా వంచుదామంటే వంగల్యా. పెండ్లి చేస్తేనన్న ఒక దావకు వస్తాడని నాగరత్నమ్మకు వరుసకు తమ్ముడయ్యే మాదవ రెడ్డి బిడ్డను ఇచ్చి చేసినారు. వాండ్లది గోనెగండ్ల, కోడలు ఎనిమిది వరకు చదివింది. పేరు దమయంతి. ఒక సంవత్సరము బాగానే ఉన్నారు. ట్రాక్టరు డ్రైవింగు నేర్చుకోని, పనులకు వెళ్లేవాడు. వెల్దుర్తిలో ఇనప కనిజం తోలే లారీడ్రైవరుగా చేరినాడు. ఇంటికి పైసా యిచ్చేవాడు కాదు. ఎట్లా అలవాటయిందో, వీండ్ల యింటా వంటా లేదు, తాగడం మలిగినాడు. తాగొచ్చి, పెండ్లాన్ని కొట్టడం. అమ్మా నాయినా అడ్డంబోతే తోసిపారేయడం..

మాదవ రెడ్డి, అంటే వియ్యంకుడొచ్చి, మా పాప మీ వానితో సంసారము చెయ్యలేదు, తీస్కబోతాము అని కూచున్నాడు. రుక్మాంగద రెడ్డి కాడ పంచాయితీ అయింది. తాగడం మానేసి, వాంట్లింటికి వచ్చేయాలనీ, అల్లుని బాగం శేనమ్మి డబ్బులిస్తే, గోనెగండ్లలో ఏదైన యపారము పెట్టిస్తాననీ వియ్యంకుడు అన్నాడు. రుక్మాంగద రెడ్డి గూడ ఆ యప్ప చెప్పిందాంట్లో న్యాయముందన్నాడు.

మిగిలిన ఎకరన్నర అమ్మి వియ్యంకునికిచ్చినాడు కొండారెడ్డి. గోనెగండ్లలో ఎరువులు, పురుగు మందులు, స్ప్రేయర్లు, అమ్మే అంగడి పెట్టించినాడు అల్లునితో. అమ్మా నాయినంటే బయము లేదు గాని, మామంటే కొంచెము బయముండాది లింగారెడ్డికి. అట్లా మామ సాటు అల్లుండ్లయినారు కొండారెడ్డి ఇద్దరు కొడుకులు.

బిడ్డకేమీ యివ్వలేదని ఇల్లమ్మి సుజాతకిచ్చినాడు. ఆ యమ్మి వద్దనింది. “నీ సొమ్ము తినే అర్హత నాకు యాడుంది నాయినా” అనింది. “అదేంది తల్లీ! నీవు బిడ్డవు గాకపోతావా, నేను మీ నాయినను గాకపోతానా, తీసుకోమ్మా, నా సంతోషం కోసరం” అన్నాడు. అల్లుడు కూడా “తీసుకో పాపం!” అన్నాడంట. వాండ్లకేమీ లోటు లేదు గానీ యానాడు పిల్లకు ఇంత వడి బియ్యము పెట్టి, చీర రవికె యియ్యలేకపోతిమే! ఇట్లన్నా వాండ్లకు చేద్దామని కొండారెడ్డి తపన.

బిడ్డ దగ్గరికి పోలేడు. పెద్దకొడుకో, వాడే మామ పంచన బడినాడు. ఉన్నంతలో చిన్నాడు కంబిరెడ్డి మేలు. కొండారెడ్డికి ఒక బెడ్రూము, దాంట్లోనే బాత్రూము, చిన్న టీవీ కూడా పెట్టించినాడు కొడుకు.

కోడలు సూటీ పోటీ మాటలంటాది. అనొద్దనే దైర్యం కొడుకులేదు. వీని దగ్గర కొచ్చి ఉండక తప్పల్యా. ఇల్లమ్మేంత వరకు ఒక్కడే బొమ్మిరెడ్డిపల్లె చెయ్యి గాల్చుకునేటోడు. తర్వాత చిన్న కొడుకొచ్చి తన దగ్గరికి తెచ్చుకున్నాడు. మంచోడు కాదా అంటే, చెడ్డోడు కాదు మరి.

తన పాత జీవితాన్ని నెమరేసుకుంటా పంజరంలోని ముసిలి చిలక మాదిరి ఈ అపార్టుమెంటులో ఉంటున్నాడు కొండారెడ్డి!

***

రామబ్రెమ్మం, సిద్దమ్మ బెంగులూరులో కొడుకు దగ్గర ఉంటాన్నారు. బన్నరుగట్ట రోడ్డులో వీరబ్రమ్మం ఇల్లు కొనుక్కున్నాడు. అమ్మను నాయినను తన కాడికి తీసుకొచ్చుకున్నాడు. కోడలిది ఆదోని. సిద్దమ్మకు సిన్నాయన మనమరాలే. పేరు చంద్రమ్మ. వాండ్ల కిద్దరు ఆడపిల్లలు. మానస, పారిజాత.

వీర దుబాయికి బోయి ఎమ్మెల్లే రత్నరాజప్ప బంధువు చేస్తున్న కంపినీలో జేరినాడు దస్తగిరితో పాటు. షేకు కడుతూన్న పెద్ద పెద్ద బిల్డింగుల్లో కార్పెంటరు పని చేసినారిద్దరూ. వాని కెట్లా అచ్చిందో గాని చెక్కను కలాత్మకంగా మలచడంతో వాడు మొనగాడని పేరు చెచ్చుకున్నాడు ఒక్క సంవత్సరంలో. అందరు కార్పెంటర్లు జేసే పని గాక, ‘ఇంటీరియర్ డెకరేశన్’లో శానా అనుభవము గడిచ్చినాడు.

దుబాయి షేకు వీండ్లకేమీ లోటు చెయ్యలా.. ఎమ్మెల్యే బంధువు గూడ వాండ్లకు శానా సపోర్టుగా ఉన్నాడు. నెలనెలా అమ్మకు నాయినకు వెయ్యి రూపాయలు పంపిచ్చిటోడు. వెయ్యి రూపాయలు వాండ్లేం తింటారు? వాండ్లిద్దరికీ నాల్గుగెడు నూళ్లయితే శాన. మిగిలింది పోస్టాఫీసులో దాపెట్టుకొనేటోల్లు. దుబాయి నుంచి కొడుకు రాసే జాబు కోసరం కండ్లలో కాయలు కాచేటట్లు ఎదురు చూసేటోల్లు.

తిండికి తిప్పలు తీకుండా చేసినాడు కొడుకు. కానీ వాండ్లు తిని కూచోకుండా యాదో ఒకటి వాండ్లకో చాతనయింది చేస్తానీ ఉండెటోల్లు.

మూడేండ్ల కాంట్రాక్టు ముగిసినాది. దస్తగిరీ, వీరా, చెరో ఎనిమిది లచ్చలు సంపాయిచ్చుకున్నారు; వాండ్లు ఖర్చులు, ఇంటికి పంపించేది పోను. దస్తగిరి వాండ్ల నాయిన పానం బాగలేక మంచాన బడినాడనీ, కొడుకును కలవరిస్తాందాడనే వాండ్లమ్మ పోను చేపించింది. దస్తగిరి “నాయన కంటేనా” అని మన దేశానికి ఎలబారి వచ్చేసినాడు.

రామబ్రెమ్మం, సిద్దమ్మ బాగానే ఉండారు. ఈ లోపల షేకు షార్జాలో తాను ఒక పెద్ద రిసార్టు కట్టాలని అనుకుంటున్నానని, అది బయట గోడలు తప్ప అంతా వుడ్ వర్కే ఉంటుందనీ, ఎన్ని కోట్లయినా గుమ్మరించనీ సిద్ధంగ ఉన్నాననీ, అది పూర్తయ్యేంత వరకు ఉండమనీ అడిగినాడు.

తాను కూడ పోవల్లని మనసు పీకినాది వీరకు. దోస్తు ఎల్లిపోతాన్నాడు మరి. ఎమ్మెల్నే రత్నరాజప్ప, గౌసుమయనీ పిలిపించి, వీరకు పోను చేయించినాడు. ఆ రిసార్టు పనేదో చేసుకోని రమ్మని.

గౌసుమియా మాట తీసెయ్యలేక నిలబడిపోయినాడు వీర. రిసార్టుల తన పనితనమంతా చూపించినాడు. రిసార్టు ముందర ఒంటెను పట్టుకోని నిలబడిన అరబ్బును టేకుతో చెక్కినాడు. లోపల గోడలకు గుర్రాలను చెక్కతోనే తాపడం చేసినాడు. ముందు కాళ్లెత్తి సకిలిస్తున్న గుర్రం బొమ్మలు, తొండాలెత్తుకోని ఎదురెదురు నిలబడిన ఏనుగులు, పంజా యిసురుతున్న పులి, నోరు తెరిచి గాండ్రిస్తున్న సింహము, గడ్డిలో పడగిప్పుకోని ఆడుతున్న పాము.. ఇట్లా వీర సృష్టించని బొమ్మలు లేపు చెక్క తోని.

లోపల టూరిస్టులు కూచోనీకి నాలుగు స్తంబాల మంటపాలు వేసినాడు. రెస్టారెంటైతే దేవేంద్ర భవనము మాదిరి చేసినాడు. పెద్ద పెద్ద షార్జా షేకులు, అబుదాబి షేకులు వచి చూసి వీర పనితనానికి అబ్బురపడి ఎంత డబ్బయినా ఇస్తాము మా కాడికి రమ్మని అడిగినా వీర పోలేదు. దుబాయి షేకుకే కట్టుబడినాడు.

(ఇంకా ఉంది)

Exit mobile version