మహాప్రవాహం!-35

0
2

[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘మహాప్రవాహం!’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[కొండారెడ్డి కాఫీ తాగుతుండగా, కొడుకు కంబిరెడ్డి లేచి వస్తాడు. నాన్నకి ఎదురుగా కూర్చుని పలకరిస్తాడు. కాసేపటికి కోడలు వినీత లేచి వస్తుంది. మామకేసి చూడను కూడా చూడకుండా, భర్తకి గుడ్ మార్నింగ్ చెప్తుంది. కోడలు తనని ఓల్డ్‌మ్యాన్ అని సంబోధించడం కొండారెడ్డికి ఇష్టం ఉండదు, కానీ ఏమీ చేయలేక ఊరుకుంటాడు. టిఫిన్లు ఆర్డర్ చేస్తూ, నీకేం కావాలి అని కొడుకు అడిగితే, ఏదో ఒకటి అని చెప్పి, తాను కాసేపు నడిచి వస్తానని క్రిందకి దిగుతాడు కొండారెడ్డి. ప్రస్తుతం కొండారెడ్డికి 73 ఏళ్ళు. అయినా ఆరోగ్యంగానే ఉంటాడు. సెల్లారులో వేసిన సిమెంట్ బాట మీద వాకింగ్ చేస్తాడు. కాసేపటికి 903 లో ఉండే విష్ణువర్ధన రెడ్డి అనే ఆయన కనబడి పలకరిస్తాడు. అరవై రెండేళ్ళ వయసు ఆయనకి. పెద్ద పొట్ట, షుగరు, బిపి అన్నీ ఉన్నాయి. కొండారెడ్ది నడిచినంత వేగంగా నడవలేకపోతాడు. అదే మాట కొండారెడ్డితో అంటే, తాను నలభై ఏళ్ళ పాటు సేద్యం చేశాననీ, తన వృత్తే తనకి వ్యాయామమైందని చెప్తాడు. తానిక నడవలేనని విష్ణువర్ధన రెడ్డి వెళ్ళిపోతాడు. కాసేపు మరికొన్ని వ్యాయామాలు చేసి ఇంటికి వెళ్తాడు. స్నానం చేసి పూజ చేసుకుని టిఫిన్ తింటాడు. కాసేపటికి వంటావిడ వచ్చి, కోడలు చెప్పినట్టు వంట చేసి వెళ్ళిపోతుంది. మధ్యాహ్నం అన్నం తిని తన గదిలో మంచం మీద వాలి గతం గుర్తు చేసుకుంటాడు. కూతురు సుజాత చదువు పూర్తయ్యాక, టీచరుగా ప్రభుత్వోద్యోగం తెచ్చుకోవడం, తల్లిదండ్రులకి ఇష్టం లేకపోయినా, తాను ప్రేమించిన మేథ్యూ అనే సహోద్యోగి పెళ్ళి చేసుకోవడం, ఆ బాధతోనే నాగరత్నమ్మ చనిపోవడం గుర్తొస్తాయి. వాళ్ళకి కూతురు పుడితే నాగమణి అని పేరు పెట్టుకుంటుంది సుజాత. ఎప్పుడైనా ల్యాండ్ లైన్‍కి ఫోన్ చేసి తండ్రితో మాట్లాడుతుంది. చిన్న కొడుకు కంబిరెడ్డి సివిల్ ఇంజనీరింగ్ చదివి, ఉద్యోగం చేస్తుంటే, వినీత వాళ్ళ సంబంధం వస్తుంది. తమ కన్నా ఆస్తిపరులని సందేహించినా, కొడుకు చేసుకుంటానని పట్టుపట్టడంతో ఏమనలేకపోతారు అమ్మానాన్నలు. పెళ్ళయ్యాకా, కొడుకు కేరాఫ్ మామగారు అవుతాడు.  పెద్ద కొడుకు లింగారెడ్డి చదువబ్బక, చిన్నా చితక పనులు చేస్తుంటే, వరసకు తమ్ముడయ్యే మాదవ రెడ్డి బిడ్డనిచ్చి కొడుక్కి పెళ్ళి చేసింది నాగరత్నమ్మ. కానీ లింగారెడ్డి వ్యసనాలకు మరిగితే, మామ మాదవరెడ్డి వచ్చి పంచాయితీ పెట్టించి, ఆస్తిలో వాటా రాయించి, తమ ఊరికి తీసుకెళ్ళి అక్కడ పురుగుల మందుల షాపు పెట్టిస్తాడు. అలా ముగ్గురు పిల్లలకీ దూరమవుతారు. పంజరంలోని ముసిలి చిలక మాదిరి ఈ అపార్టుమెంటులో ఉంటున్నాడు కొండారెడ్డి! రామబ్రెమ్మం, సిద్దమ్మ బెంగుళూరులో కొడుకు వీర దగ్గర ఉంటున్నారు. వీర దుబాయిలో షేకు పనులన్నీ పూర్తి చేసుకుని ఇండియా వస్తాడు. కానీ అంతకు ముందర దుబాయి షేకు కోసం ఓ రిసార్టులో చెక్కతోటి గొప్ప గొప్ఫ కళాఖండాలు చెక్కుతాడు వీర. ఇక చదవండి.]

[dropcap]రి[/dropcap]సార్ట్ పూర్తయినాది. షార్జా మినిస్టరు ఒకాయన వచ్చి చూసి, సుల్తానేటులో ఒక భవనములో ఇట్లా చేసిచ్చి పొమ్మన్నాడు. వీర వాండ్ల షేకు గూడ ఈ పని అయ్యింది కదా ఇంక నీ యిష్టమన్నాడు.

ప్రారంభోత్సవానికి ఇండియా నుంచి హిందీ సినిమా సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ వచ్చినాడు. ఆయన్ను సూడనీకె అరబ్ దేశాల నుంచి అక్కడ సెటిలయిన ఇండియన్లు శానా మంది వచ్చినారు.

సల్మాన్ ఖాన్ కూడా రిసార్టు లోని చెక్క కలాఖండాలను చూసి నివ్వెరబోయినాడు.

“యా అల్లా! బహుత్ ఖూబ్!” అన్నాడు. వీరకు షేక్ హ్యాండిచ్చినాడు.

“వీర్ జీ! ఆప్ బొంబాయి ఆయియే. ఫిల్మోం మే ఆర్ట్ డైరెక్టర్ బనావూంగా ఆప్కో” అన్నాడు. వీరకివన్నీ యిష్టం లేదు. తొందరగా పనులు ముగించుకోని ఇండియాలో అమ్మానాయినల దగ్గరికి బోయి ఉండాలని వాని తపన.

కేవలం రిసార్టు పనికే ఇరవై లచ్చలిచ్చినాడు దుబాయి షేకు వీరకు. అంటే ఆయన ఇచ్చిన దుబాయి కరెన్సీ, మన ఇండియాలో ఇరవై లక్షలకు సమానమయితాది.

షార్జా సుల్తానేట్‌లో పనంటే చిన్న విషయం కాదనీ, ఒక ఆరు నెల్లు వాండ్లకు కావల్సించి చేసి పెట్టి ఇండియాకు వెళ్లిపొమ్మనీ చెప్పినాడు షేకు. షార్జాలో ఎనిమిది నెలలు పనిచేసినాడు రాజభవనములో వీర. సుల్తానులు తాగే పానపాత్రలను కూడ చెక్కతో మలిచినాడు. పైకప్పు నుంచి యాలాడదీసే షాండిలియర్లను చెక్కతో చేసి ఉండడం మినిస్టరు రిసార్టులో చూసినాడు. అక్కడి కంటి బాగా చెయ్యమని అడిగి చేయించుకున్నారు. షార్జా బవనంలో వీర చేసిన రెక్కల గుర్రము శానా అపురూపయినది. గుర్రానికున్న జూలును గూడ చెక్కలో ఇమిడించిన వీర పనితనాన్ని అందరూ పొగిడినారు.

మీటింగు హలులో చుట్టూరా చిన్న చిన్న గుమ్మటాలు చెక్కి, వాటి మింద నగిశీలు దిద్దినాడు. కొనలకు బంగారు తొడుగులేసినారు. దాంట్లోని కుర్చీలు, టేబులు గూడ రోజువుడ్డుతో శానా అందంగా చేసినాడు. మక్‍మల్ కుశను ఏసినాడు కుర్చీలకు. ఇదంతా ఒక్కడే చేసినాడని కాదు.. ఆ యప్ప కింద శానామంది కార్పెంటర్లు పని చేసినారు.

తన మాట నిలబెట్టినందుకు షార్జా మినిస్టరు వీరను శానా మెచ్చుకున్నాడు. మూడు తులాల బంగారు గొలుసు, రెండు తులాల బ్రాస్‌లెట్టు, తులం ఉంగరము సుల్తాను చేత బహుమతి ఇప్పించినాడు. పనిచేసినందుకు ముఫైలక్షలు ముట్టినాది వీరకు. డబ్బు అంతా ఆదోని లోని ‘స్టేటు బ్యాంకు’లో ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాడు.

బొంబాయిలో విమానం దిగి అదోనికి రైల్లో వచ్చినాడు. టేసనుకు వీరబ్రెమ్మము, సిద్దమ్మ, గౌసుమియ, కాశింబీ, దగ్గగిరి, వాని పెండ్లాము రమిజాబీ, రాగవేంద్ర ఇంకా కొందరు వచ్చినారు. వీర మెడలో పెద్ద పూల దండ వేసినారు. అది తీసి గౌసుమియ మెడలో ఏసినాడు వీర. అమ్మ, నాయినలకు, గౌసుమియ, కాశింబీలకు ప్లాటుఫారం మీదనే కాళ్లకు దండం పెట్టినాడు.

గోదుమ రంగు ప్యాంటుతో తెల్లని పుల్ షర్టు లోపటికి దోపి, పైన లేత నీలం రంగు కోటేసుకొని, నీట్‌గా షేవింగ్ చేసుకున్న సినిమా హీరో మాదిరున్న కొడుకును చూసి మురిసిపోయినారు వడ్లాయిన, సిద్దమ్మ.

“నీకు ఇంపీరియల్ లాడ్జిలో రూము బుక్ చేసినాము. పోదాం పా” అన్నాడు దస్తగిరి.

“లాడ్జి లేదూ గీడ్జి లేదు. మా గౌసుమియా సిన్నాయన ఇంటికే పోదాం. మా పిన్నమ్మ సేతి తిండి తినక శానా కాలమాయ” అన్నాడు వీర. కాశింబీ ఆ మాట అని కండ్ల నిండా నీల్లు పెట్టుకున్నాది.

“నా కొడుకును సొంత కొడుకు మాదిరి సూసుకున్నావు బూబమ్మా” అన్నాది సిద్దమ్మ. ఆమె కండ్లల్లో గుడ్క నీల్లు.

అందరూ గౌసుమియ్య యిల్లు చేరుకున్నారు. గౌసుమియ్య కాశింబీ కూడ మెత్తబడినారు. ఆ లెక్కన రామబ్రెమ్మం, సిద్దమ్మ గట్టిగా ఉండారు.

బిర్యానీ, ఇంకా ఏమేమో చేయాలనుకున్నాది కాశింబీ. “పిన్నమ్మా, బిర్యానీలు, చికిన్లు, మటన్లు దిని బోరు కొట్టినాది. జొన్న రొట్టెలు చేసి, వంకాయ నించుడుకాయ జెయ్యి. అన్నం చేసి, గోగాకు ఊరిమిండి నూరు. టమేట చారు చెయ్యి, మిరియాలు దంచేసి. నీకు పున్యముంటాది. నోరు సవి సచ్చినాది” అన్నాడు వీర. వంటలో సిద్దమ్మ గుడ్క సాయం చేసినాది. అందరూ బోజనాలు చేసినారు. కడుపునిండా తిన్నాడు వీర.

మర్సటి దినం బొమ్మిరెడ్డిపల్లెకు బయలుదేరినారు. దస్తగిరి కారు మాట్లాడతానంటే వద్దన్నాడు వీర. “కార్లలో, ఎ.సి.లలో తిరిగి మొగం మొత్తినాది. కర్నూలు బస్సెక్కి కోడుమూరులో దిగి, ఆడ్నించి ఉళిందకొండ బస్సులో మా ఊరికి బోవాల. అప్పుడే మజా వస్తాది” అన్నాడు.

‘వీడిందిరా ఇట్లుంటా’డని అందరూ నగినారు.

బొమ్మిరెడ్డిపల్లెలో వీరను చూడనీకె శానామంది వచ్చినారు. రెండ్రోజులు అమ్మతో ఉగ్గాని, బజ్జీ, అలసంద వడలు, మటిక్కాయ తాలింపు అన్నీ చేయించుకొని తిన్నడు. ఎందుకో వానికి నాన్-వెజ్ వంటలంటే వాకర (అసయ్యం) పుట్టింది.

మళ్లీ ఆదోనికి పోయినాడు. కిన్నెరకు బోయి దినకరరెడ్డిని, ఎమ్మెల్లే రత్నరాజప్పను కలిసినాడు. వాండ్ల కాల్లకు మొక్కినాడు.

“వీని వినయమే వీన్నింత వాన్ని చేసింది” అన్నాడు ఎమ్మెల్లే. యాడకుబోయినా  పక్కన గౌసుమియ సిన్నాయన, దస్తగిరి ఉండాల్సిందే.

“మన ఆదోని పేరు నిలబెట్నావురా వీరా!” అన్నాడు దినకర్ రెడ్డి. “ఇప్పుడు ఏం చేద్దామని మరి?” అనడిగినాడు.

“మన ఆదోని లోనే..” అంటున్న వీరను ఆపి ఎమ్మెల్యే అన్నాడు – “ఒరేయి నాయినా, నీ స్తాయికి ఈ ఊరు చాలదు. ఏ అయిదరాబాద్, బెంగుళూరో పోయి సెటిల్ కావడం మంచిది. అట్లాంటి సిటీల్లో ఐతే ‘ఇంటీరియర్ డెకరేషన్’కు  అవకాశాలుంటాయి.

బెంగులూరులో మా తోడల్లులుండాడు. బిల్డరు. ఆ యప్పను కలుసు. సొంతం ఆపీసు పెట్టుకో. మన పిల్లలను దీస్కపో. ఆకాశమే నీకు హద్దు ఆడ” అన్నాడు.

బెంగుళూరుతో మీనాక్షి మాల్ ఉన్న రోడ్డులో ఎమ్మెల్లీ తోడల్లుడు మంజునాతప్ప ఒక షాపు మాట్లాడినాడు. అది ఆపీసు. ఆ యప్పే పేరు సూచించినాడు. ‘ఇన్నోవేటివ్ ఇంటీరియర్ డికొరేటర్స్’, కింద ‘స్పెషలిస్ట్ ఇన్ క్రియేటివ్ వుడెన్ ఆర్ట్’ అని బోర్డు రాయించినారు. షాపుకు నెలకు ఆరువేలు బాడిగ. వర్కుషాపు కోసం కొంచెం దూరంగా మూడువందల గజాల స్తలం లీజుకు దీస్కోని షెడ్డు వేసినారు.

ఐదారు నెలల్లోనే ‘ఇన్నోవేటివ్’ మంచి పేరు తెచ్చుకుంది. మైసూరు నుంచి గవర్నమెంటు వారి శాండల్ వుడ్ (మంచి గంధపు చెక్క) వేలంలో పాడుకొని అద్భుతమైన కళాకృతులు చేసి ఇంటీరియర్ డెకొరేషన్సులో అక్కడక్కడ అమర్చడం ‘వీర’ షాపు ప్రత్యేకత. డబ్బున్నోళ్ళు ఎక్కువగా ఉండే కూరమంగళ, జయనగర్, మార్తల్లి, ఇందిరానగర్, జె.పి.నగర్ కాలనీలలో వీర పనితనం మార్మోగిపోయింది.

సంవత్సరంలోపే బన్నీరుఘట్ట రోడ్డులో మంచి యిల్లు కొనుక్కున్నాడు. దానికి మాత్రం ఇంటీరియర్ డెకరేషను నిరాడంబరంగా చేసుకున్నాడు.

దస్తగిరితో బాటు ఆదోని దోస్తులు ఇంకా ముగ్గురు, లోకల్‌గా ఇంకా పదిమంది కార్పెంటర్లు వీర దగ్గర పని చేస్తున్నారు. ఆఫీసు పని చేయడానికి ఇద్దరు చదువుకున్న అసిస్టెంట్లను ఎమ్మెల్లే గారి తోడల్లుడు పంపించినాడు.

దుబాయిలో సల్మాన్ ఖాన్ షేక్‍హ్యండిస్తున్న ఫోటో, షార్జా సుల్తాను వేలికి ఉంగరం తొడుగుతున్న ఫోటోలను ఎన్‍లార్జ్ చేయించి, ఫ్రేము కట్టించి ఆఫీసులో తగిలించినాడు.

పెండ్లి జేసుకొమ్మని ఒక్క తీరుగ సతాయించడంలేదు సిద్దమ్మ.

గౌసుమియ కొడుకుకు ఎందుకో వీర అంటే సరిపోదు. వాండ్ల నాయిన కంత దగ్గరయినాడే అని అసూయ. వాడు తల్లి తండ్రి మొగము చూడడం మానేసినాడు.

ఒకసారి ఆదోనికి పోయినప్పుడు కొడుకు సంగతి చెప్పి బాదపడినాడు గౌసుమియ. వీర ఆ యప్పను ఓదార్చినాడు.

“నీవు, పిన్నమ్మా నా దగ్గరికి బెంగుళూరుకు రాండి సిన్నాయనా. నీవు ఊరికే మన వర్కుషాపులో కుర్చీ ఏసుకోని వర్కు ఎట్లా చేస్తాన్నారో చూసుకో సాలు. ఈ దినము నేనింతటోడినైనానంటే అది నీ సలవే. కాదనగాకు” అని చేతులు బట్కోని బంగపోయినాడు.

ఇల్లు, శెడ్డు అమ్మేసి ఆ డబ్బులు కొడుక్కిచ్చినాడు గౌసుమియ. వీర తోని బెంగలూరుకు పోయినాడు. తనింట్లోనే పెట్టుకోని శానా గౌరవంగ జూసుకుంటున్నాడు వాండ్లను.

తన పెండ్లి సంగతి అమ్మా నాయినలకే వదిలేసినాడు వీర. సిద్దమ్మకు సిన్నాయన వరస ఒకాయన ఉండాడు. వాండ్లది జలదుర్గము. ఆ యప్ప మనమరాలు చంద్రమ్మ. తల్లి లేని పిల్ల. తాతగారింట్లోనే పెరిగినాది. టెంతు పాసయినాది. సక్కని సుక్క మాదిరుంటాది.

ఆ పిల్లను చూపించింది సిద్దమ్మ. వానికి గూడ నచ్చినాది. అందరిముందే ఆ పిల్లతో చెప్పినాడు –

“నేను బెంగులూరులో పని చేసుకుంటాను. మా అమ్మ, నాయిన పెండ్లయినంక మనతోనే ఉంటారు. అదేమంత విషయం గాదని నీవనుకోవచ్చు. వీండ్లు నాకు పుటక నిచ్చినోల్లెతే, బతుకు దిద్దిన తల్లిదండ్రులు వేరే ఉండారు. వాండ్లు మన కాడనే ఉంటారు. వాండ్లు తురుకోండ్లు. కానీ నాకు దేవుండ్లు. తీరా పెండ్లయినాక కాదు కూడదంటే బాగుండదు. ఆలోశన చేసుకోని చెప్పు.”

ఆ పిల్ల ఒక మాట అన్నాది “నీకు దేవుండ్లయినపుడు నాకు గుడ దేవుండ్లే.” వీరకు శానా సంతోశమయినాది.

జలదుర్గములో వీర చంద్రమ్మల పెండ్లి జరిగినాది. బెంగులూరులో అందరినీ పిలిచి ఒక రిసెప్షను ఇచ్చినాడు వీర. ఎమ్మెల్లే గారు, దినకర రెడ్డి, ఇంకా పెద్ద పెద్ద కస్టమర్లు వచ్చి దీవించినారు.

మరొక ఐదేండ్లలో ఇద్దరు ఆడపిల్లలు పుట్టినారు వీరకు. వాండ్లకు మానస, పారిజాత అని పేర్లు పెట్టింది, దస్తగిరి పెండ్లాము రమీజా బీ!

పిల్లలకు రామమ్మం, సిద్దమ్మల కాడ ఎంత సేరికో, గౌసుమియ కాశింబీల కాడ అంత సేరిక.

ఆదోనిలో పని నేర్చుకుంటున్నపుడు ఎట్లా ఉన్నాడో, ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్నా అట్లే ఉన్నాడు వీర. పిసరంత దొమ్మపొగురు రాల్యా. భగవద్గీతలో చెప్పిన ‘దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః’ అన్న మాట వీరకు సరిగ్గా సరిపోతుంది.

కాల మహప్రవాహంలో కొట్టుకుపోకుండా, కస్టపడి పని నేర్చుకోని, దాంట్లో తనంతవాడు లేడనే పేరు తెచ్చుకోని, పని నేర్పించిన గురువును దేవునిగా చూసుకుంటూ, దస్తగిరి వంటి దోస్తులను దగ్గర తీస్తూ విజయానికి మారు పేరుగా నిలిచినాడు వీర!

***

బెంగులూరు యలహంకలో ఒక వృద్ధాశ్రమము. ‘జీవన సంధ్య’ దాని పేరు. నాలుగంతస్తుల బిల్డింగు. యల్ అచ్చరం శేపులో కట్టినారు. మద్యన చెట్లు బెంచినారు. చెట్ల కింద బెంచీలు ఏసి ఉన్నాయి, ముసిలోల్లు దిగొచ్చి కూచోడానికి.

వరండాల పొడుగూతా రెండు పక్కలా స్టీలు రెయిలింగులు బిగించినారు. పెద్ద వయసోల్లు అవిట్ని పట్టుకోని నడస్తారు. వర్సగా రూములు. మామూలువి, ఎ.సి.వి. గుడ్క ఉన్నాయి. ప్రతి అంతస్తులో రెండు డార్మిటరీలు గుడ్క ఉన్నాయి. ఒక్క దాంట్లో ఇరవై మంచాలు, అవిటి మింద ఫ్యాన్లు. ఇరవైమందికి కలిసి ఒక ప్రక్కన నాలుగు బాతురూములు, నాలుగు లెట్రిన్లు ఉన్నాయి. లెట్రిన్లన్నీ వృద్ధాశ్రమములో, గొంతుకూచ్చొనేవి గాకుండా ఎత్తు సీటువే ఉన్నాయి. అవిట్ని కమోడు లంటారు. వయసు మల్లినోల్లకు మొకాల్ల నొప్పలుంటాయి. గొంతుకూచోలేరు కద!

రెండో అంతస్తులో డైనింగు ఆలుందాది. శానా పెద్దది. ఒకేసారి నూరుమంది టిపను గాని, బోజనము గాని చేయవచ్చు. రెండడుగుల ఎడల్పున వర్సగా స్టీలు టేబుల్లు, కూచోనీకె ప్లాస్టిక్ కుర్చీలు ఏసినారు. డైనింగు ఆలుకు నాలుగు పక్కలా శేతులు కడుక్కున్నీకె వాష్ బేసిన్లు బిగించి ఉన్నారు.

ఎవురెవురి ఆర్తిక స్తోమతను బట్టి ఆశ్రమములో రేట్లుండాయి. తిండి మాత్రం అందరికీ ఒకటే. నలుగురు కలిసి ఉండే రూములు గూడ ఉండాయి. ఇద్దరు బార్యాభర్తలు మాత్రమే ఒక రూము లోన ఉండొచ్చు.

రాత్రి ఎనిమిదిన్నరయింది. ఆశ్రమములో ఎనిమిది లోపలే భోజనాలు అయిపోతాయి. అన్నం కావాల్సినోల్లకు అన్నం, టిపను గావల్సినోల్లకు టిపిను పెడతారు.

సంజన్న గౌడు, ఇమలమ్మ ఇడ్లీలు తిని మూడవ అంతస్తు లోని తమ రూముకు వచ్చినారు. మొత్తం బిల్డింగుకు ఎనిమిది లిఫ్టులున్నాయి. వీండ్లిద్దరూ ఈడ జేరి సంమచ్చరం దాటినాది. ఇద్దరూ శానా మెత్తపడినారు. సంజన్న గౌడుకు రెండేండ్ల కిందట పచ్చవాత రోగమొచ్చినాది. ఎడం చెయ్యి, ఎడం కాలు అదవ (handicap) అయినాయి. కట్టె బట్టుకోని నడుస్తాడు. ఎడం కాలు కొంచెం ఈడుస్తాడు. ఇమలమ్మకు గుండె ఆపరేసనయ్యి, స్టెంటు వేసి మూడేండ్లయితుంది.

“కుంచేపు టి.వి పెట్టమ్మే” అనడిగినాడు సంజన్న. గోడకే ఇరవైనాలుగించిల టీవీ బిగించి ఉంటారు. “అదే సేత్తో ప్యాను కుంచెం తగ్గించు” అన్నాడు

టి.వి.లో యాదో పాత సినిమా వస్తాండాది. చూస్తా గూసున్నారు. అదే అంతస్తు లోని డార్మిటరీ నుంచి రాజమ్మ వచ్చి కూచున్నాది.

“ఆడ గుడ్క టి.వి. ఉంటాది గాని, దూరమైతాది. సూపానదు యిమలమ్మా” అనింది రాజమ్మ.

“బోజనం కాడ కనబడల్యా! ముందే గీన తినిపోయినావా” అనడిగినాడు సంజన్న.

“లేదు నాయినా, ఈయాల కడుపు కొంచెము మందం చేసినాది. ఒకపూట మాడుస్తే అదే సద్దుకుంటాది గదాని, గలాసు మజ్జిగ దాగితి.”

“మంచి పని చేసినావులే అత్తా” అన్నాడు సంజన్న.

ఇంతలో సంజన్న కాడున్న సెల్‌ఫోను మోగినాది. తీసి చూసి ఆన్ నొక్కినాడు. కొడుకు ప్రదీపు! అమెరికా నుంచి. ‘వాండ్లకిప్పుడు పొద్దున పూట అయింటాది’ అనుకున్నాడు.

“నాన్నా, ఎట్లున్నారు? ఆరోగ్యాలు బాగున్నాయా?” అని కొడుకు అడగతాండాడు అటు పక్కనించి.

“బాగుండాము రా ప్రదీపూ! మీరు బాగుండారు గద! కోడలు ఎట్లున్నాది? మనుమరాలు బడికి పోయినాదా?”

“ఆ ఇప్పుడే తయారయితున్నాది. బేబీ! టాక్ టు గ్రాండ్ పా” అని, “ఇదిగో నాన్నా, పింకీతో మాట్లాడు” అన్నాడు.

“బంగారు తల్లీ! బాగుండావా అమ్మా” అన్నాడు తాత. సైగ చేసి యిమలమ్మను గూడ పిలిసినాడు.

“హాయ్ గ్రాండ్ పా! అయామ్ ఫైన్.. హౌ ఆర్ యు బోత్?” అనడిగినాది ఆ పిల్ల. దానికి నాలుగేండ్లుంటాయి. ప్రీ స్కూలింగ్‌లో ఉంది.

ఇమలమ్మ ఫోను తీసుకోని “పింకమ్మా, బాగుండావా!” అనడుగుతుండగానే ఆ పిల్ల ఫోను వాండ్ల నాయిన కిచ్చి ఎల్లిపోయినాది.

“అమ్మ ఉందా లైన్లో?” అనడిగినాడు ప్రదీపు.

“మాట్లాడురా” అన్నాడు తండ్రి.

“అమ్మా! భోం చేసినారా? డాక్టరు వచ్చి చూసిపోతున్నాడా?”

“ఇప్పుడే ఇడ్లీ తిని వచ్చినాం. డాక్టరు వారం దినాలకొకసారే గద వచ్చేది! నర్సమ్మ దినం మార్చి దినం వస్తాది. బి.పి చూస్తాది. నాకు మీ నాయినకు శుగరు లేదు కాబట్టి బాద లేదు. మందులు అయిపోతే తెచ్చిస్తోంది.”

“మీరు టిపిను జేసినారా నాయినా?”

“ఇప్పుడే బ్రెడ్ టోస్ట్ తిన్నాములే.. నేనూ, మాధురీ బయలుదేరుతున్నాము ఆపీసులకు. పింకీని సూల్లో వదిలిపెట్టిపోవాల గదా!”

“కోడలికియ్యి నాయినా ఒకసారి.”

“అత్తయ్యగారూ, బయలుదేరే హడావిడిలో ఉన్నాం. ఆరోగ్యాలు జాగ్రత్త. ఏం కావాలన్నా పోను చేయండి. హోమ్ వాళ్లతో చెప్పి అరేంజి చేస్తాము. ఉంటాను మరి” ఆ యమ్మి తెలుగు అదో మాదిరుంటాది.

పోను పెట్టేసినారు

‘మీరు ఎన్ని అరేంజి చేసినా, ఈ వయసులో దిక్కు లేనోల్ల మాదిరి ఉండాల్సొచ్చె గదా అనే ఎదారు మాత్రం ముల్లు లెక్క గుచ్చుకుంటుంటాది’ అనుకుంది ఇమలమ్మ.

పది పదైదు రోజులకొకసారి పోను జేసి మాట్లాడతారు అమిరికా నుంచి. ఆ ఫోను కోసరం చూపెట్టుకొని ఉంటారు. చూసినంతసేపు పట్టదు. అయిపోతాంది. వీండ్లకేమో ఇంకా మాట్లాడదామని ఉంటాది. వాండ్లు ఎక్కువ సేపు మాట్టాడరు.

వీండ్ల కతే గాదు. ఆశ్రమంలో ఉన్న శానామంది కత ఇది. శానామంది పెద్ద సదువులు సదువుకొని ఇదేశాలకు ఎగిరిపోయి స్తిరపడినారు. కొందరు మన దేశము లోనే దూరాభారంలో ఉంటారు. అమ్మనూ నాయిననూ దగ్గర బెట్కోని చూసుకొనే వెసులుబాటు ల్యాక, వీండ్లు బోయి ఆడ ఇమడ లేక, ఇట్టాంటి ‘హోము’లు పుట్టుకొచ్చినాయి.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here