Site icon Sanchika

మహాప్రవాహం!-38

[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘మహాప్రవాహం!’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[చలమేశు, మాదవ రియలెస్టేటు వ్యాపారంలో దిగి, లోతుపాతులు తెలుసుకుని రాణిస్తారు. బెంగుళూరు హైవేని ఆనుకున్న ఉన్న పొలాలను కొని వెంచర్లు వేస్తున్నారు. అలా ఓ పొలాన్ని చూడ్డానికి వెళ్తారు మిత్రులిద్దరూ. ఆ పొలం యజమాని రామసుబ్బన్న చేను దగ్గరే ఉంటాడు. విస్తీర్ణం వివరాలన్నీ కనుక్కుంటాడు చలమేశు. పొలాన్నంతా చూసిన మాధవ – కార్నర్లు చాలా పోతాయని, రెండున్నర సెంట్లు ఒక్క ప్లాటు చేస్తే సమంగ యాబై ప్లాట్లు వస్తాయని, రోడ్లకు ముపై సెంట్లన్నాబోతుందని చెప్పి – ధర ఎంత చెప్తున్నారని అడుగుతాడు. కూచొని మాట్లాడుకుందాం అంటూ హైవే మీదున్న తమ ధాబాకు తీసుకెళ్తాడు చలమేశు. అక్కడ కూర్చుని ఆ పొలాన్ని రేటు ఫైనల్ చేస్తారు. తర్వాత, అక్కడ్నించి పిడుగురాముడు హోటల్‍కి వెళ్ళి టిఫిన్ తింటారు మిత్రులిద్దరూ. వ్యాపారంలో ఎంత ఎదిగినా, పిడుగురాముడు హోటల్‍ని వదలడు చలమేశు. సుందరయ్యకే ఇచ్చేశాడా హోటల్‍ని. మాధవ కూడా తన చెప్పుల షాపుని తన వద్దే నమ్మకంగా పనిచేసిన కుర్రాడికి ఇచ్చేస్తాడు. తరువాత మిత్రులిద్దరూ తమ ఆపీసుకు వెళ్ళి అక్కడి పనులు చూసుకుంటారు. మధ్యాహ్నం భోజనాలకి ఇళ్ళకి వెడతారు. మాధవ అమ్మ రామక్కకి వినికిడి తగ్గింది. ఏం చెప్పాలన్నా అరిచి చెప్పాలామెకు. మాధవ వెళ్ళేసరికి ఇంకా భోజనం చెయ్యకుండా ఎదురుచూస్తూ ఉంటుంది. అందరూ అన్నం తింటారు. మాధవకి కూతురు, కొడుకు. కూతురికి కలిమి అనీ, కొడుక్కి, చనిపోయిన తండ్రి పేరు కలిసొచ్చెలా శరభ కుమార్ అనీ పెట్టుకుంటాడు. చలమేశు ఇంటికి వెళ్ళేసరికి భార్య శర్వాణి ఎదురుచూస్తుంటుంది. ఇద్దరూ భోంచేస్తారు. శివరాత్రి రోజు తల్లి ఈశ్వరమ్మ చనిపోయింది. ఆమె కోరిక ప్రకారం తన తండ్రి మిత్రుడయిన ఉరుకుందప్పను తమ ఇంట్లో పెట్టుకుంటాడు చలమేశు. శర్వాణి కూడా ఆయనను చాలా గౌరవంగా చూస్తుంది. చలమేశుకు ఒక కొడుకు. తాము వేసిన ఓ వెంచరులో స్థలం కొని దత్తాత్రేయ స్వామికి గుడికట్టిచ్చిన దత్తదేవానందస్వామి శిష్యరికం చేస్తారు మిత్రులిద్దరూ. మంచిపనులు చేస్తూ కాలం గడుపుతారు. ఇక చదవండి.]

[dropcap]క[/dropcap]డప జిల్లా, మైదుకూరు. కర్నూలు – తిరుపతి హైవే మింద ఉంటాది. శానా పెద్ద జంక్షను. నేరుగా బోతే కడప, ఇటు పక్క కర్నూలు, నంద్యాల. ఎడంపక్కకు బోతే బద్వేలు, బ్రహ్మంగారి మఠము, నెల్లూరు. కుడిపక్కకు పోతే పొద్దుటూరు, జమ్మలమడుగు. అంతే గాకుండా చుట్టు పక్కల ఇరవై ఊర్లకు సెంటరు.

అప్పటి తెలవారుతుండాది. దావీదు మెల్లగా నడుసుకుంటా వచ్చి, సెంటరులో ఉన్న ఒక టీ అంగడి ముందల ఏసిన బెంచీ మింద గూసున్నాడు.

టీ అంగడాయప్ప దావీదును జూచి “ఏమి తాతా! ఈ సలికి ఇంత పొద్దున్నే వచ్చి టీ తాగకపోతే, ఆయిగ దుప్పట్ల కాల్లు ముడుసుకొని పండుకోవచ్చు గదా!” అన్నాడు నవ్వుతా.

“ఒరే ఇస్మాయిలూ! నీవు వగసు (వయసు) పొట్టిగానివి. నాకు నాలుక్కే మెలకువ వస్తాది. నిద్రబట్టి చావదు. ఇంట్లో వాండ్లను లేపడం ఎందుకని, ఇంత మొకం కడుక్కోని, నీ దగ్గరికొచ్చి, ఏడిగా టీ తాగితే నాకు బాగుంటాది” అన్నాడు దావీదు.

గాజు గ్లాసులో టీ తిరగ దిప్పి, నురగ తేలింతర్వాత దావీదు కిచ్చినాడు ఇస్మాయిలు.

“సక్కెర ఎయ్యల్యా గద!”

“ఇంకెందుకు? నీ ఒంట్లోనే కావల్సినంత ఉండాది గద! ఇది తాగితే లోపలికిబోయి దాంతో కలిసిపోతాది లే!” అన్నాడు వాడు కుశాలగా.

“నా రోగము నీకు కుశాల ఐనాది రా సాయిబూ! కానీ, కానీ, నీవూ ముసిలోనివి గాకపోతావా..” అని, తప్పుగా మాట్లాడుతున్నట్లు గ్రయించి, “ఏమనుకోగాకు నాయినా, యా రోగాలు ల్యాకుండా పదికాలాలు ఆయిగా ఉండు” అన్నాడు.

“పెద్దోనివి. నీవు నన్ను ఏమన్నా పరవాల్యా” అన్నాడు ఇస్మాయిలు.

టీకి డబ్బులిచ్చి, పక్కన బంకులో బీడీ కట్టు కొనుక్కొని, ఒకటి ఎలిగించి ముట్టించుకొని తాగబట్నాడు దావీదు. ఆళ్లగడ్డనుంచి నెల్లూరుబోయే ఎక్సుప్రెస్సు బస్సు వచ్చి టీ బంకు ముందు నిలబడినాది. “ఎవురయినా టీ, కాపీ తాగెటోల్లుంటే రాండి. పది నిమిశాలుంటాము ఈడ” అని కండక్టరు అరిచి, దిగినాడు. ముందు ఆర్‌టిసి బస్టాండుంది గాని ఇంత పొద్దున్నే ఆడ ఏమీ దొరకదు.

దావీదును జూచి ఒకాయన బండి మీద వచ్చి, కాలు కింద బెట్టి నిలబడి, “సార్! రాండి ఇంటి దగ్గర దింపుతా” అన్నాడు.

“పరవాలేదులే నాయినా, దగ్గిరే గదా, కొంచెం కాల్లు జాపినట్టుంటాది” అన్నాడు.

“వద్దు వద్దు. శానా సలిగా ఉండాది. రాండి ఎక్కండి. ఒకవైపు ప్రక్కక్కూచోండి” అని బలవంతంగా ఎక్కించుకున్నాడు.

“మా ప్రిన్సిపాల్ మేడంగారు ఈ రోజు కడపకు బోతారేమో? ఆర్.జె.డి గారితో మన నాలుగు జిల్లాల ప్రిన్సిపాళ్లందరికీ మీటింగుండాది.”

“నాకు తెలియదు నాయినా.”

పొద్దుటూరు రోడ్డులో కొంచెం లోపలికి ఉంది ఇల్లు. ఇంటి ముందు బండాపి “మెల్లగ దిగండి” అన్నాడాయప్ప.

“మీరు..” అని దావీదు అంటుండగానే, “నేను మేడంగారి వద్ద బాటనీ లెక్చరర్‌గా పని చేస్తున్నానండి. నా పేరు శశాంక్. ఆమె శానా మంచిదండి. గందరగోలంగా ఉన్న ఈ కాలేజీని ఒక దావకు తీసుకచ్చినారు మేడం” అని చెప్పి, నమస్కారము చేసి ఎల్లిపోయినాడు.

దావీదు తండ్రి మనసు గర్వముతోనిండి పోయినాది. అంతలోనే ఆ ముసిలోని ముకంలా ఎదారు మబ్బులు కమ్ముకున్నాయి. గేటు తీసుకొని లోపలికి బోయినాడు. వరండాలో కట్టేసిన బొచ్చుకుక్క స్నూపీ దావీదును చూసి అరిచింది. పెనగులాడబట్నాది.

“నీవు బయటికి బోవాల గదా! ఉండుండు” అని దాని మెడకున్న కొక్కీ ఇడిపించినాడు. అది ఒక్క ఉరుకురికి గేటు దాటిపోయి దావీదు రావాలని నిలబడినాది. వీదిలోకి తీస్కపోయి పది నిమిశాలు తిప్పినాడు. పొద్దున్నే దాని కడుపు బరువు దింపుకుని కుశాలగా ఎగరబట్నాది.

“ఇంక సాలు. రా” అని పిలిసిన వెంటనే ఇంట్లోకి వచ్చినాది. పాలాయన వచ్చి క్యాను లోంచి పాలు బోయనీకె రడీగా ఉండాడు. బండి ఆరను కొట్టినాడు. మార్తమ్మ లోపలినించి ఒక స్టీలు గిన్నె తెచ్చి పాలు పోయించుకున్నాది. స్నూపీ ఆ యమ్మ కాల్లకు అడ్డం పడుతూ గోము చేయబట్నాది.

వరండాలనే ఉన్న దాని ప్యాస్టిక్ గిన్నెలో పావులీటరు పాలుబోసి లోపలికి పోయినాది మార్తమ్మ. స్నూపీ కొంపలు ములిగిపోతున్నట్లు పాలను కతకబట్నాది.

మార్తమ్మ పాలు పొయ్యి మింద బెట్టి, బాత్రూంకు బోయిముకం కడుక్కోని వచ్చి, పాలల్లో బోర్నవిటా కలుపుకోని తాగినాది. దావీదు అట్లాంటివి తాగడని తెలుసు. అందుకే అడగల్యా.

ఆరున్నరైంది. ఇంట్లో పనులు, వంట చెయ్యనీకె పెట్టుకున్న బూబమ్మ ముంతాజు బేగము లోపలికొచ్చి ఇంటిముందల కల్లాపేసి, ముగ్గేసినాది. తర్వాత ఇల్లంతా కసువూర్చి, తడిగుడ్డతో తుడిచినాది.

బాత్‍రూమ్‍లో ఇడిసిన బట్టలను తీసి ఎనక వరండాలో ఉన్న వాషింగ్ మిషన్‌లో ఏసి, ఆన్ చేసినాది. దొడ్లో ఆరిపోయిన బట్టలన్నీ దెచ్చి మడతలు బెట్టి, అలమారల్లో సర్దినాది.

ఏడున్నరకి మేరీ లేచింది. హల్లో సిలువ మింద ఉన్న ఏసుప్రభువుది పెద పటము ముందు నిలబడి క్రాస్ చేసుకోని, కండ్లు మూసుకోని రెండు నిమిశాలు ప్రార్తన జేసినాది. సుమారు ముపై రెండేండ్లుంటాయి మేరీకి. నైటీలో ఉంది. ముకం కడుక్కుని వచ్చేతలికి మార్తమ్మ టీ పెట్టి తెచ్చింది.

టీ తాగుతూ నాయిన పక్కన సోపాలో కూచుంది.

“ఈయ్యాల కడపకు బోవాలంట గదమ్మా” అన్నాడు దావీదు.

“అవును నాన్నా. నీకెట్లా దెలుసు?”

“నీకాడ పని చేసే సారు ఒకాయప్ప ఆ.. బాటనీ సారంట. నన్ను పొద్దన టీ తాగివస్తాంటే బండి మింద దింపిపోయినాడు. ఆ యప్ప చెప్పినాడు.”

“శశంకా, ఇంకా ఏమన్నా చెప్పినాడా? వాండ్లందరికి నేను పాఠాలు సరిగ్గా చెప్పక పోతే స్ట్రిక్ట్‌గా పని చేయిస్తానని కోపము.”

“చ్చొచ్చొచ్చొ” అని నాలికతో సప్పుడు చేసి, “అదేం లేదులేమ్మా, నీవు శానా మంచిదానివంట. నీవొచ్చినంకనే ఈ ఊరి కాలేజి ఒక దావ కొచ్చి నాదంట. మా యమ్మ యా ఊర్లో పని చేసినా..”

“సర్లే, కాకి బిడ్డ కాకికి ముద్దు. మా యమ్మ అంతటిది ఇంతటిది అని నాకు ఊహ తెలిసిన కాన్నించి మెచ్చుకుంటానే ఉన్నావు. ఏనాడూ ఒక తిట్టు తిట్టు ల్యా, ఒక దెబ్బ ఎయ్యల్య” అనింది మేరీ నాయిన వైపు అభిమానంగ చూస్తూ.

అంతా వింటున్న మార్తమ్మ అనింది “అట్ట చేసినా బాగుండేది. తన మాటే నెగ్గించుకోని, ముపై రెండేల్లు వస్తున్నా యింకా..” అంటుంటే ఆ యమ్మ గొంతు దుక్కముతో వనికింది.

“మొదులు బెట్నావా పొద్దన్నే” అని ఇసుక్కున్నాది మేరి. ముంతాజు దొడ్లో అంట్ల గిన్నెలు తోమి, వంటిట్ల సర్ది, “టిపనేం చెయ్యమంటారు మేడమ్” అని అడిగింది.

“అమ్మకు నాయినకు ఏం కావాలో అడుగు.”

దావీదు “అంతే, బతుకంతా అమ్మకూ నాయినకు ఏం కావాల; అమ్మకూ, నాయినకూ ఏం చెయ్యాల, ఇదే కయాస గానీ, నాకేం గావాల అనే ద్యాస లేదు కదా” అన్నాడు.

“నీవూ తందాన పాడబట్నావా అమ్మకు” అనింది మేరీ. “ఇప్పటికి శానా సార్లు చెప్పినాను. అట్లాంటోడు దొరికితే తప్పకుండా చేసుకుంటాను.”

ముంతాజు బేగము నవ్వినాది. “ఎట్లాంటాడు గావాల మేడమ్ మీకు?” అనడిగినాది.

“నీ కెందుకు? పోయి పని జూసుకో పో” అనింది మేరీ.

మార్తమ్మ అన్నాది “పెండ్లయినంక మమ్మల్నిద్దర్ని గూడ తన కాడ పెట్టుకోనీకె ఎవరొప్పుకుంటే వాండ్లను చేసుకుంటాందంటనే మీ మేడము! అట్లా యాడన్నా లోకరీతి ఉండాదా, నీవే చెప్పు.”

“పెద్ద మనసమ్మా మా మేడంది! కొడుకులే ఇయ్యాల్రేపు కన్నోండ్లను కాదని ఎల్లి పోతాండారు. అంతెందుకు దువ్వురులో మా అమ్మా నాయినా మెత్తబడినారు. పదిరోజులు తెచ్చి నా కాడ పెట్టుకుందామంటేనే నా మొగుడు ఇనడు.”

ముంతాజు మొగుడు కాలేజీ లోనే స్వీపరు కమ్ నైట్ వాచ్‍మన్. పోస్టు రెగ్యులర్ కాకుండా ఏండ్ల తరబడి పనిచేస్తూంటే, మేరీనే కమీషనరుకు రాసి, రెగ్యులర్ స్కేలు కాకపోయినా కన్సాలిడేటెడ్ వేజెస్ వచ్చేటట్టు చేసినాది.

“సరే టిపనేం చెయ్యమంటారు?”

“ఏమో, నాకేం తెలుసు?” అన్నది మార్తమ్మ కోపంగా. అమ్మ అలిగిందని గ్రయించి మేరీ బోయి అమ్మను కరుసుకొని, “మమ్మీ, మై మమ్మీ ఈజ్ వెరీ స్వీట్” అని పాడి చెంప మింద ముద్దుపెట్టుకొన్నాది.

మార్తమ్మ నవ్వినాది “తూ, సిగ్గు లేని పిల్లా!” అని మురిపెంగా తిట్టినాది. వాతావరనము తేలికయినాదని గ్రయించి ముంతాజు “ఈయాల దోసెల పిండి గ్రయిండరులో వేస్తాను. రేపట్నించి కారందోసెలు రెండు మూడు రోజులు ఏసుకుందాము. ఈ రోజుకు తపీలాంటు ఒత్తుదునా?” అంది.

“ఆ. చెయ్యి. ఎల్లిపాయలు కొంచెం దంచి ఎయ్యి” అన్నాడు దావీదు.

“మరి భోజనంలోకి?”

“ముంతాజూ, నేను మద్యాన్నం రాను. కడపలో మీటింగుండాది. వీండ్లిద్దరికీ చెయ్యి” అని స్నానానికి వెళ్లిపోయింది మేరీ.

“నాలుగు మునక్కాయలున్నాయి సాంబారు చేద్దునా పెద్దమ్మా” అని అడిగి ‘సరే’ అనిపించుకోని వంటింట్లోకి పోయినాది.

మేరీ రడీ అయినాది. లేత గోదుమరంగు చీర మింద నీలంపూలు వర్క్ చేసిన ఆర్గండీ చీర కట్టుకున్నాది. ఎర్రని జాకెట్టు. పెదిమలకు లిప్‌స్టిక్. కండ్లకు గోల్డు ప్రేము అద్దాలు. భుజాల వరకు ఒత్తుగా యాలాడే బాబ్డ్ హెయిర్. వ్యానిటీ బ్యాగులో సెల్ ఫోన్, డెయిరీ ఉన్నాయో లేదో చూసుకోన్నాది.

ఎనిమిదిన్నరకు పింగానీ ప్లేటులో తపేలాంటు ఒకటి తెచ్చిపెట్టినాది డైనింగు టేబులు మీద ముంతాజు. డైనింగ్ టేబులు హల్లోనే ఉంది. హలు, వంటిల్లు గాక రెండు పెద్ద రూముల ఇల్లు అది. ఒక దాంట్లో అమ్మానాయిన, ఇంకో దాంట్లో ఒంటిపిల్లి రాచ్చసి! కడప జిల్లాలో ఎండలు మీడిమ్యాలంగా గాస్తాయి. రెండు రూముల్లో ఎ.సిలు బెట్టించినది మేరీ. చిన్న పిల్లలను సాకినట్లు ఇద్దరినీ చూసుకుంటోంది.

ఒక చిన్న కప్పులో పెరుగు వేసి ప్లేటు పక్కన పెట్టినాది ముంతాజు. తపేలాంటును పెరుగుతో నంచుకొని తినింది మేడం.

తొమ్మిదికి డ్రైవర్ పుల్లారెడ్డి వచ్చి నమస్కారం బెట్నాడు. “పోదామా మేడం?” అని అడిగినాడు.

“ఫైవ్ మినిట్స్ చూద్దాము రెడ్డి! సీనియర్ అసిస్టెంటు గూడ రావాల గద! నైన్ టెన్ వరకు రాకపోతే..” అంటుండగానే ఆ యప్ప గసబోసుకుంటూ వచ్చి “సారీ మేడమ్..” అని ఏదో చెప్పనీకె జూస్తుంటే..

“ఓకె. ఇట్సాల్ రైట్ సాంబమూర్తిగారూ. లెటజ్ మేక్ ఎ మూవ్! వాండ్లడిగిన ప్రొఫార్మాలు, రిపోర్టులు అన్నీ డౌన్‍లోడ్ చేసుకున్నారా? గర్ల్స్‌కు వేరే సైకిలు షెడ్డు కోసం మనం తయారుచేసిన రెప్రెజెంటేషను?”

“అన్నీ బ్యాగులో పెట్టుకున్నా మేడం.”

“పదండయితే” అని వాండ్లకు చెప్పి, అమ్మానాయినలకు బై చెప్పి వెళ్లిపోయింది ప్రిన్సిపాల్ మేడం మేరీ.

పెద్దోండ్లకు టిపిను పెట్టింది ముంతాజు. మల్ల టీ తాగినాడు దావీదు.

“పెద్దమ్మా, మునక్కాయల సాంబారు చేసి, పొద్దు తిరుగుడు పువ్వు ఇత్తనాల పొడి కొట్టినా. అన్నం హాటు ప్యాకు లోన ఏసినా. మల్ల సాయంత్రమొత్తా. ఏదైనా అవుసరం బడితే పోను చేయండి” అని చెప్పి ముంతాజు ఎలచారి పోయినాది.

ఇల్లంతా నిశ్శబ్దం అయిపోయినాది. టివి పెట్టమన్నాడు మార్తమ్మను. గోడకున్న క్యాబినేట్ మీద యాభై అయిదు అంగుళాల సోనీ బ్రేవియా టీవీ బిగించి ఉండాది. కుంచేపు సువార్త కూటములు లైవ్ వస్తుంటే చూసినారు. “ఈటివీ సినిమా పెట్టు” అన్నాడు దావీదు. దాంట్ల ‘శ్రీకృష్ణ పాండవీయం’ సినిమా వస్తుంది. ఇద్దరూ శానాసేపు చూసినారు. రుక్మిణీ కల్యాణము నడుస్తుంది.

పన్నెండుకు సినిమా అయిపోయింది. ఒంటిగంటకు బోజనాలు చేసినారు. దావీదు రూములోకి పోయి నిద్రపోయినాడు. మార్తమ్మ మద్యాన్నము పండుకోదు. ఊరికెనే సోపాలో మేను వాల్సినాది. “రుక్మిణమ్మ తన వాండ్లందరిని కాదనుకోని, కృస్నునితో లేశిపాయ. మా మేరమ్మ మా కోసరమని తన బతుకును త్యాగము చేస్తా ఉన్నాది” అని నిట్టూర్పు ఇడిచినాది. పదేండ్ల కిందట సంగతులన్నీ ఆమె కండ్ల ముందు కదులాడబట్నాయి.

***

తిరుపతిలో బి.యిడి పరీచ్చలు రాసి ఊరికి వచ్చినాది మేరీ. వ్యాసమూర్తి సారు పున్యమా అని కర్చులకు బుడుక్కోకుండా (వెతుక్కోకుండా) ట్యుటోరియల్ కాలేజీ వాండ్లు ఇచ్చే డబ్బులు సరిపోయినాయి.

రిజల్టు రావడానికి రెండు నెలలు పడ్తాది. “నాల్గుదినాలు అయిగ అమ్మ చేసి పెట్టింది తిని ఉండు తల్లీ!” అన్నాడు దావీదు. .

ఆయనన్నట్లు సరిగ్గా నాలుగంటే నాలుగు దినాలున్నాది. ఒక రోజు రాత్రి బోజనాల దగ్గర చెప్పినది వాండ్లతో.

“నాయినా, రిజల్టు వస్తాది. తప్పకుండా డిస్టిన్షన్ వస్తాది, దాంట్లో అనుమానం లేదు. కాని ఉద్యోగము రావాలంటే డి.యస్.సి. అనే పరీక్ష రాయాల. దానికి గవర్నమెంటు నోటిఫికేషన్ ఇస్తాది. అదింకా ఆరు నెల్లు పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు. అన్ని రోజులు ఇంట్లో తిని కూచోలేను.

అందుకే, రేపు కర్నూలుకు బోయి శ్రీపాద రావు సారును కలుస్తా. ఏదైనా స్కూలులో అంతవరకు టెంపరరీగా దొరికితే బాగుంటుంది. మొన్ననే స్కూల్లు తెరిచినారు కాబట్టి సారుకు తెలిసినాండ్లు ఎవరయినా ఉంటే పని ఐపోతుంది. నెలకు ఐదారు వందలిచ్చినా మనకు సరిపోతాది.”

నిజమే అనిపించింది వాండ్లకు గూడ. “సరే పోయి రామ్మా” అన్నారు. కోచింగు సెంటరుకు బోయి సారును కలిసింది మేరీ. వ్యాసమూర్తి సారు చేసిన సహయము గురించి చెప్పింది. డి.యస్సీ వచ్చి ఉద్యోగము చేరేంత వరకు కర్నూల్లోనే ఏదైనా స్కూల్లో చేరదామని వచ్చినానని, ఆయన సహాయము కావాలని అడిగినాది.

“లెటజ్ ట్రై, మేరీ! యు ఆరె బ్రయిట్ స్టూడెంట్. ఐ ఎల్ బి హ్యాపీ టు రెకమెండ్ యు” అన్నాడాయన. “థాంక్యూ సార్” అనింది.

లంచ్ టైములో రైల్వేస్టేషను రోడ్డులో ఉన్న ‘రాక్‍వుడ్ మెమోరియల్ హైస్కూల్’కు తీసుకొని బోయినాడు మేరీని. దాని హెచ్.ఎం. శ్రీపాద రావు మిత్రుడే. సాదరముగా పిలిచి కూర్చోబెట్టి చెరుకురసం తెప్పించినాడు. ఆయన పేరు శౌరి.

మేరీ గురించి చెప్పినాడు సారు. శానా తెలివైనదనీ, డి.యస్సీ వచ్చేంతవరకు సాయం చెయ్యమనీ రిక్వెస్టు చేసినాడు శౌరిని.

“నీవు చెప్పింతర్వాత తిరుగేముంది శ్రీపాదు! మాది ఎయిడెడ్ స్కూలు. గత నెలలో దేవదానమని మాత్స్ అసిస్టెంటు రిటైరయినాడు. ఆ పోస్ట్ గవర్నమెంటు గ్రాంటు చేయడానికి ఎలాగూ ఏడెమిది నెలలు పడతాది. కాని స్కేలు ఇవ్వలేము. కన్సాలిడేటెడ్‍గా..”

“సో ప్రాబ్లమ్ శౌరీ! బట్ ఐ అస్యూర్ య్ ఉ దట్ షి విల్ డూ అట్మోస్ట్ జస్టిస్ టు ది జాబ్.”

“నెలకు వెయ్యిరూపాయల కంటే ఇవ్వలేమమ్మా, పరవాలేదా?” అనడిగినాడు ఆయన. అంత ఆఫర్ చేస్తాడని మేరీ ఊహించలేదు. మెరుస్తున్న కండ్లతో – “వెరీ కైండ్ ఆఫ్ యు, సార్!” అనింది.

“ఈ రోజు ఇరవై ఏడు. ఫస్టు ఆదివారమైంది. సెకండ్ నుంచి వచ్చేయమ్మా. ఎయిత్, సైన్స్, టెంత్ పిల్లలకు మ్యాథ్స్, సైన్సు చెప్పాల. అవసరమైతే ఇంగ్లీషు క్లాసు కూడ ఇస్తాము. రోజుకు ఐదు పీరియడ్లు. మార్నింగ్ సెషనులో మూడు, నూన్ సెషనులో రెండు. పావు తక్కువ నాలుగుకు నీవు వెళ్లిపోవచ్చు.”

‘ఇంకేమి మేరీ! ఆర్యూ హ్యాపీ?” అన్నాడు శ్రీపాద సారు.

ఆయన కాళ్లకు నమస్కారం చేసింది. మేరి శౌరికి కూడ చేస్తే, ఆయన మహదానంద పడి “గాడ్ బ్లెస్ యు మై చైల్డ్” అని నెత్తిన చేయిపెట్టి దీవించినాడు.

రాక్‍వుడ్‌లో మంచి పేరు తెచ్చుకుంది మేరీ. బొమ్మరెడ్డిపల్లె నుండి హైవే మీదకు వచ్చి కర్నూలు బస్సు ఎక్కేది. అక్కడ ఆర్డినరీ బస్సులు నిలబడతాయి. పొద్దున్న టిఫను చేసి, అమ్మ కట్టిచ్చిన క్యారేజీ తీసుకొని పోయి, సాయంత్రం ఆరు గంటలలోపే ఇంటికి వచ్చేది. మేరీ టీచరయిందని తెలిసి కొందరు పిల్లల ట్యూషను చెప్పమని అడిగినారు. సాయంత్రము ఆరున్నర నించి ఎనిమిదిన్నర వరకు ట్యాషను చెప్పేది. పద్దెనిమిది మంది, ఆడమగ కలిసి. ఒక్కొక్కరు నెలకు నలభై రూపాయలిచ్చేవారు.

అమ్మనూ నాయిననూ కూలిపనులకు వెళ్లొద్దని కచ్చితంగా చెప్పి, మానిపించింది మేరీ. మూడు నాలుగు నెలల తర్వాత ఇంటికి చిన్న చిన్న రిపేర్లు చేయించి సున్నాలు వేయించినారు.

ఎనిమిది నెలల తర్వాత డి.యస్.సి నోటిఫికేషన్ వచ్చింది. మ్యాథ్స్ పోస్టులు ఎక్కువే చూపించినారు. ఆ పరీక్షకు కూడ శ్రీపాద సారు, శౌరి సారు గైడెన్స్ ఇచ్చినారు మేరీకి. కష్టపడి ప్రిపేరయినాది. కర్నూల్లోనే సెంటరు ఇచ్చినారు. ఆరోజు పొద్దునే చర్చికి పోయి ప్రేయరు చేసి పరీక్షలు వ్రాసినాది.

నెలన్నరలో రిజల్టు వచ్చింది! మేరీ సెలెక్టయినాది. కౌన్సిలింగులో, శ్రీశైలం దగ్గర సున్నిపెంట హైస్కూలుకు అలాట్ చేసినారు. అది కర్నూలు జిల్లా లోనే ఉంది గాని శానా దూరము. నాయినను తీసుకోని పోయి జాయినయినాది. హెడ్ మిస్ట్రెస్ మేడం చానా మంచిది. ఆమె పేరు హేమలత. వాండ్లది కోవెలకుంట్ల దగ్గర బీమునిపాడంట.

పెండ్లి కాని ఇంకో టీచరు కూడా చేరింది మేరీతో పాటు.

ఆ అమ్మి పేరు శకుంతల. వాండ్లది చాగలమర్రి. సోషల్ అసిస్టెంటు. సున్నిపెంటలో శ్రీశైలం ప్రాజెక్టు సిబ్బంది శానామంది క్వార్టర్సులో ఉంటారు. కొందరు ఒక రూము బాడిక్కిస్తారు. అట్లాంటిది దొరికింది. శకుంతల మేరీ కలిసి ఒక రూము తీసుకున్నారు. స్కూలుకు దగ్గరే. అక్కడే కేరళ వాండ్లది ఒక హోటలుంది. ‘పాల్‍ఘాట్ భవన్’ దాని పేరు. దాంట్లో టిపిన్లు, బోజనం దొరుకుతాయి.

(ఇంకా ఉంది)

Exit mobile version