[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘మహాప్రవాహం!’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[దావీదు కుటుంబం ప్రస్తుతం మైదుకూరులో ఉంది. ఓ రోజు పొద్దున్నే లేచి మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళి సెంటరులో ఉన్న టీ కొట్టుకు వెళ్ళి అక్కడ బెంచీ మీద కూర్చుంటాడు దావీదు. టీ కొట్టతను హాస్యమాడి టీ ఇస్తాడు. టీ తాగి ఇంటికి బయల్దేరుతుంటే – ఒకాయన అక్కడికొచ్చి తన పేరు శశాంక్ అనీ, మేరీ మేడం ప్రిన్సిపాల్‍గా ఉన్నా కాలేజీలోనే లెక్చరర్‍గా చేసున్నానని చెప్పి, బండి మీద ఇంటి దగ్గర దింపేస్తాడు దావీదును. ఇంతలో పాలు రావడంతో గిన్నెలో పోయించుకుంటుంది మార్తమ్మ. బ్రష్ చేసుకుని వచ్చి బోర్నవిటా కలుపుకుని తాగుతుంది. దావీదు అది తాగడని తెలుసు కాబట్టి అతన్ని అడగదు. మేరీ లేచి ప్రభువికి దండం పెట్టుకుని బ్రష్ చేసుకుని వచ్చేసరికి తల్లి టీ పెట్టిస్తుంది. అమ్మానాన్నలిద్దరూ కూతురిని పెళ్ళి చేసుకోమని పోరుతుంటారు. సహాయకురాలు ముంతజు బేగం ఇంటిపని పూర్తి చేసి వంట చేయడానికి సిద్ధమవుతుంది. తాను మధ్యాహ్నం భోజనానికి రానని, కడపలో మీటింగ్ ఉందనీ, వంట అమ్మానాన్నలకి మాత్రమే చేయమని ఆమెకి చెబుతుంది మేరీ. టిఫిన్ తినడం పూర్తయ్యేసరికి డ్రైవర్ కారుతో సిద్ధంగా ఉంటాడు. సీనియర్ అసిస్టెంటు కోసం కొద్ది సేపు చూద్దాం అనే లోపు ఆయన ఆయాసపడుతూ వచ్చేస్తాడు. అన్నీ సరిజూసుకుని తల్లిదండ్రులకి బై చెప్పి వెళ్ళిపోతుంది మేరీ. ముంతాజు వంట చేసి వెళ్ళిపోతుంది. మధ్యాహ్నం అన్నం తిన్నాక దావీదు తన గదిలో కునుకు తీస్తాడు. మధ్యాహ్నం నిద్ర అలవాటు లేని మార్తమ్మ సోఫాలో వాలి గతం గుర్తు చేసుకుంటుంది. బియిడి పరీక్షా ఫలితాలు వచ్చేవరకూ ఖాళీగా ఉండడం ఇష్టం లేని మేరీ, కర్నూలు వెళ్ళి శ్రీపాద రావు గారిని కలిసి ఆయనకు తెలిసిన స్కూళ్ళలో ఏదైనా టీచర్ పోస్ట్ ఉంటే ఇప్పించమని అడుగుతుంది. ఆయన తన ఫ్రెండ్ శౌరి నడిపే స్కూల్లో మాత్స్ టీచర్‍గా ఉద్యోగం ఇప్పిస్తాడు. ఆ స్కూల్లో మేరీ మంచి పేరు తెచ్చుకుంటుంది. ఈ లోపు డియస్సీకి నోటిఫికేషన్ రాగా, శ్రీపాద రావు గారు, శౌరి గారు ఇచ్చిన గైడెన్స్‌తో ప్రిపేరయి పరీక్ష బాగా రాస్తుంది, నెలన్నరలో ఫలితాలు వస్తాయి. మేరీకి శ్రీశైలం దగ్గర సున్నిపెంటలో పోస్టింగ్ వస్తుంది. అక్కడ శకుంతల అనే కొలీగ్‍తో కల్సి ఓ గది అద్దెకు తీసుకుని ఉంటుంది. ఇక చదవండి.]
[dropcap]శ[/dropcap]కుంతల వాండ్లు కంసాలి కులానికి చెందినవారు. రెండు నెలలకే ఆ యమ్మికి పెండ్లి కుదిరింది. పిల్లోడు గూడ టీచరే. వాండ్లది శిరువెళ్ల. ఆ పిల్లోనికి నందికొట్కూరు దగ్గర మిడుతూరు హైస్కూలుకు వేసినారు. తర్వాత ట్రాన్సఫర్‍లలో మొగుడూ పెండ్లాలను ఒకచోట చేరుస్తారు.
మెల్లగా బుడుకులాడితే ఒక యిల్లు దొరికింది మేరీకి. పాతదే గాని బాగుంది. వరాసగ మూడు రూములు. ముందు కటాంజనమున్న చిన్న వరండా. మధ్యలో రూము బాగా పెద్దది. హాలు అన్న మాట. దాంట్లో రెండు మంచాలు ఏసుకొన్నా ఇంకా రెండు మూడు కుర్చీలు ఏసుకోవచ్చు. చివరది వంటిల్లు. దాంట్ల గ్యాస్ స్టవ్ పెట్టుకొనీకె గట్టు, సింకు ఉన్నాయి. చుట్టూ డబ్బాలు గిన్నెలు పెట్టుకోవడానికి షెల్పులున్నాయి. వెనక కొంచెం స్తలమిడిసినారు. ఒక పక్క బాత్రూము, లెట్రిను, ఒక పక్క గిన్నెలు కడుక్కోడానికి బట్టలుతకడానికి గట్టు. పైన ఓవర్ హెడ్ బ్యాంకు పెట్టి అన్ని చోట్ల కొళాయిలు పెట్టినారు. మంచినీల్ల కొళాయి గూడ యింట్లోనే ఉంది.
మేరీకి అన్నీ కలుపుకోని పద్నాలుగు వేలు వస్తుంది. ఇంటి బాడిగ ఆరువందలు – మూడు ప్యాన్లు వేయించింది. హాలులో రెండు చెక్క మంచాలు, పరుపులు, కుర్చీలు కొనింది. గ్యాస్ స్టవ్వు, కుక్కరు, మిక్సీ ఒక్కొక్కటి సగీసుకుంది.
దసరా సెలవులిచ్చినారు. అమ్మకు నాయినకూ మంచి బట్టలు తీసినాది, తాను గూడ మంచి చీరలు కొనుక్కున్నాది. కర్నూలుకు బస్సులో పోయి, ఊరు చేరినది. బిడ్డను గుర్తుపట్టలేకపోయినారు దావీదు, మార్తమ్మ. కొంచెం ఒల్లు చేసి రంగు తేలినది. చెంపలు పుష్టిగా అయినాయి. ఆత్మవిశ్వాసంతో ఆ పిల్ల ముకం కలకలలాడతన్నాది.
వచ్చిన మర్సటి రోజే చెప్పినాది “అమ్మా, రీఓపనింగుకు నేను పోయేటపుడు మిమ్మల్ని గూడ దీస్కబోతా. అక్కడ ఇల్లు, సామాన్లు అన్నీ ఏర్పాటు చేసినా. మీరు ఇంక ఈ ఊర్లో ఉండాల్సిన పనిలేదు. అందరం ఆడే ఉందాము.”
పిల్ల పెండ్లయ్యి పోయేంతవరకు ఉంటాములే అనుకున్నారు. సున్నిపెంట ఇల్లు శానా నచ్చినాది వాండ్లకు. గ్యాస్ స్టవ్వు, కుక్కరు, మిక్సీ ఎట్లా వాడాల్నో అమ్మకు నేర్పించినాది మేరీ. యాడ తిప్పినా నీల్లు రావడము శానా విచిత్రంగా ఉండాది వాండ్లకు.
ఒక సంమచ్చరం గడిసినాది. ఒకరోజు స్టాఫ్ రూములో ‘సాక్షి గణపతి’ అనే సారు ఏదో పుస్తకము చదువుతాన్నాడు. మేరీ పోయి “ఏంది సార్ ఎప్పుడూ ఏదో ఒకటి చదువుతానే ఉంటారు?” అని అడిగినాది.
“ఎమ్.ఎ. ఇంగ్లీషుకు కట్టినానమ్మా ఈ మధ్యనే. అదే లీజరులో చదువుకుంటా” అన్నాడు ఆయన.
“మనము పి.జి. రెగ్యులర్‌గా గద చెయ్యాల? మరి?..”
“ఫిజిక్సు, కెమిస్ట్రీ లాంటివి చేయలేముగాని, బియస్సీ వాండ్లము మాత్స్, ఇంగ్లీషు, తెలుగు చేయవచ్చమ్మా. మాత్స్ ప్రయివేటుగా కష్టము. తెలుగు అంటే అంత పాండిత్యం మనకుండదు. ఇంగ్లీషు మనం హాయిగా చదువుకోవచ్చు. మన యస్వీ యానివర్శిటీ లోనే చేయొచ్చు. కర్నూల్లో ముక్తేశ్వరశర్మ అని ఒక రిటైర్డు ఇంగ్లీషు ప్రొఫెసరన్నా రు. ఆయన స్టడీ మెటీరియల్ తయారుచేసి మనలాంటి వాండ్లకు ఇస్తారు. ఎండాకాలం సెలవుల్లో కావాలంటే గైడెన్సు కూడా యిస్తారు”
“కస్టం కాదా సార్?”
“ఏముందమ్మా, పెద్ద కస్టమేమీ కాదు. అన్నీ ఎస్సే టైపు ప్రశ్నలే. ‘రెఫరెన్సెస్ టు ది కాంటెక్స్ట్’ ప్రశ్నలే కష్టము. అది కంపల్సరీగ రాయాలి. మొత్తం పది ప్రశ్నలు. రెండు సెక్షన్లు. A,B! రెఫరెన్సులు గాక దాంట్లో రెండు దీంట్లో రెండు రాస్తే చాలు. ఐదు ఇరవైలు, వందమార్కులు. శర్మగారు ప్రతి పేపరుకు ముపై ఎస్సేలు ఇస్తారు. సబ్ హెడింగ్స్, కొటిషన్లతో సహా. రెఫరెన్స్ ప్రశ్నలకు మనం టెక్స్ట్ బుక్కులు కొనుక్కోవాల. Paraphrase అంటే మామూలు ఇంగ్లీషులా మనకు అర్థమయ్యే మాదిరి ఎడం పక్క పేజీలో టెక్స్ట్, కుడి పక్క ఎక్స్‌ప్లనేషన్ ఉంటాయి. చదివేటప్పుడు లిటరేచర్ కాబట్టి ఇంటరెస్టింగ్‌గా ఉంటాది.”
“దీనివలన మనకు కెరీర్లో ఏం ప్రయోజనాలుంటాయి సార్?”
“అక్కడికే వస్తున్నా. యాభైశాతం మార్కులు వస్తే జూనియర్ లెక్చరర్‌గా, 55 శాతం వస్తీ డిగ్రీ లెక్చరర్‌గా పోవచ్చు. మనకు జేయల్ ప్రమోషన్లలు కోటా ఉంది అది శానా లేటవుతుంది. నీవింకా చిన్నదానివే కాబట్టి సర్వీసు కమిషన్ పరీక్ష రాసి డైరెక్ట్‌గా జెయల్‍గా పోవచ్చు. 55 పర్సెంటు తెచ్చికున్నావనుకో, డిగ్రీ లెక్చరర్‌గా పోవచ్చును. నీవు కూడ చెయ్యి మేరీ, బాగుంటుంది!”
మేరీకి ఉత్సాహము వచ్చింది. “ఇప్పడు టైముందాసార్” అని అడిగింది.
“ఇంకా పదిహేను రోజులు ఉందమ్మా లాస్ట్ డేట్. అప్లికేషను తెప్పించుకుంటే సర్టిఫికెట్లు పోటోలు, ఫీజు చలానా కట్టి పంపించవచ్చు. తిరుపతిలో నీకు తెలిసిన వాండ్లెవరైనా ఉన్నారా?”
మేరీకి వ్యాసమూర్తి సారు గుర్తొచ్చినారు. “ఉన్నారు సార్. అప్లికేషను తెప్పిస్తా” అంది.
సారుకు ఫోను చేసి విషయం చెబితే ఆయన శానా సంతోషించి అప్లిప్లికేషను పంపిస్తానన్నారు. నాలుగు రోజుల్లో వచ్చింది. సున్నిపెంట స్టేటు బ్యాంకులో చలానా కట్టి ఫోటోలు, సర్టిఫికెట్లు జత చేసి పంపించినాది యూనివర్సిటీకి. కర్నూలుకు ఒక ఆదివారం పోయి ముక్తేశ్వరశర్మ గారి దగ్గర స్టడీ మెటీరియల్
కొనుక్కొచ్చుకున్నాది. అక్కడే లక్ష్మినారాయణ బుక్ డిపోలో రెఫరెన్సీ ప్రశ్నల కోసం డిటెయిల్డు టెక్స్ట్లులు కొనుక్కున్నాది.
శర్మగారి స్టడీ మెటీరియల్ ఎంత బాగుందంటే, అరటిపండు వలిచి నోట్లో పెట్టనట్లు తయారు చేసినాడా మహానుభావుడు. కస్టపడి చదివి పరీక్షలు రాసి నాది. ఫైనలియర్ గూడ పూర్తిచేసినాది. అగ్రిగేట్ 52 శాతము తెచ్చుకొన్నాది.
అమ్మా నాయినా పెండ్లి చేసుకోమని పోరుబెట్టబట్నారు. “ఎమ్మే అయిపోనియ్యండి” అని చెప్పి వాయిదా వేసినాది. అది గూడ అయిపాయ. ఫైనల్ ఇయర్ రాసిన సంమచ్చరానికి. సర్వీసు కమిషన్ నోటిఫికేషను వచ్చింది. దానికి గూడ బాగా ప్రిపేరయి వ్రాసివచ్చింది. సెంటరు అనంతపురమిచ్చినారు.
నాలుగు నెలల్లో ఇంటర్వ్యూకు పిలిచినారు. ఇంటరవ్యూ హైదరాబాదు, నాంపల్లి ఎ.పి.పి. యస్సీ ఆఫీసులో జరిగింది. తర్వాత రెండు నెలలకు సెలెక్ట్ అయినట్లు, జె.యల్. ఇన్ ఇంగ్లీష్‌గా నియమిస్తూ, చిత్తురు జిల్లా పలమనేరు జూనియర్ కాలేజీకి వేసినట్లు APPSC నుంచి, కడప ఆర్‌జెడి ఆఫీసు నుంచి ఆర్డర్లు వచ్చినాయి. రాయలసీమ నాలుగు జిల్లాలు ఫోర్త్ జోన్ కిందికి వస్తాయనీ, ఎక్కడైనా పనిచేయాలనీ తెలుసుకున్నాది.
పలమనేరులో జాయినైంది. టీచరు ఉద్యోగానికి ముందే రిజైన్ చేసింది. ఫ్యామిలీ షిఫ్ట్ చేసింది మేరీ. అక్కడ కూడ మంచి ఇల్లు దొరికింది. ఐదేండ్లు అక్కడ పని చేసిన తర్వాత అనంతపురము జిల్లా ముదిగుబ్బ కాలేజికి ట్రాన్సఫరయింది.
మధ్యలో పెండ్లి సంబంధాలు శానా వచ్చినాయి. పాప బాగుంది. లెక్చరరు, గెజిటెడ్ ర్యాంకని వచ్చినారు. కాని మేరీ షరతు ఏందంటీ, మా అమ్మా నాయినా గూడ నా దగ్గరే ఉండాల. అందుకొప్పుకుంటేనే పెండ్లి అని. ఇది నచ్చక శానా మంది ఎనిక్కిబోబట్నారు.
“అది లోకరీతి గాదమ్మా, నీవు పెండ్లి చేసుకొని హాయిగా కాపురం చెయ్యి. మేము బొమ్మిరెడ్డి పల్లెలలో మన యిల్లుంది కదా. దాంట్లో ఉంటాము” అని మొత్తుకున్నారు దావీదు, మార్తమ్మ.
“మీకు కొడుకునైనా బిడ్డనైనా నేనే. మిమ్నల్ని ఒంటరిగా వదిలేసే ప్రసక్తి లేదు” అని బీశ్మించుకొని కూచున్నాది. వయసు దాటిపోతూంది బిడ్డ బతుకు తమ వలన ఆగమైపోతుందే అని ఎదారు పెట్టుకొని కుమిలిపోబట్నారు అమ్మా నాయినా.
ఎప్పుడో దావీదు తాత కాలంలో క్రైస్తవమతం తీసుకున్నారు గాని సర్టిఫికెట్‌లో ఎస్.సి. అనే ఉంది. మేరీకి ప్రమోషన్లలో గూడ రిజర్వేషను ఉండడంతో చేరిన ఎనిమిదేండ్లకే జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్‍గా ప్రమోషనిచ్చి కడప జిల్లా నందలూరు జూనియర్ కాలేజికి వేసినారు.
అక్కడ ఎమ్మెల్లే తాను చెప్పినట్లు వినలేదని మేరీ మీద కోపం తెచ్చుకున్నాడు. ఆమె చాలా స్ట్రిక్టు. ఎక్కడా రాజీపడే ధోరణి లేదు.
క్లాసులు, హజరు, స్కాలర్షిప్పుల నుంచి పరీక్షలు జరపడం వరకు కట్టుదిట్టంగా, పక్షపాతం తీకుండా జరిపించబట్టింది. పిల్లలు, తల్లిదండ్రలు ప్రిన్సిపాలు గారిని ఎంతో మెచ్చకోనేవారు. కానీ స్టాఫ్ కొందరు ఆమె క్రమశిక్షణను భరించలేకపోయినారు. ఒక రోజు పరీక్షలో కాపీ కొడుతున్న విద్యార్థిని డిబార్ చేస్తే, మాల్ ప్రాక్టీసు కేసు బుక్ చేయవద్దని ఎమ్మెల్లే పూర్ణచంద్రారెడ్డి కాలేజికి వచ్చి బెదిరించినాడు. మేరీ వినలేదు. తన రాజకీయ పలుకుబడి ఉపయోగించి ఆమెని ట్రాన్సఫర్ చేయించినాడు. మైదుకూరుకు వేసినారు. ఇక్కడికి వచ్చి సంవత్సరం దాటింది. ఇక్కడా మంచి పేరు తెచ్చుకుంది. రెండు ఒకేషనల్ కోర్సులు శాంక్షన్ చేయించింది. ఆడపిల్లలకు మరుగుదొడ్లు కట్టించింది.
శశాంక్ సారు బాటనీ చెపుతాడు. ముపై నాలుగేండ్లుంటాయి. ఇంకా పెండ్లి కాలేదు. ఆయన అనాథ. మదనపల్లెలోని అనాథాశ్రమములో పెరిగినాడు. అక్కడే ఇంటరు చదివి, ఒక దాత సహాయముతో డిగ్రీ, ఎమ్మెస్సీ చేసినాడు. ప్రిన్సిపాల్ మేడం అంటే ఒక ఆరాధన పెంచుకున్నాడు. ఆమెతో తన ప్రేమను వ్యక్తము చేయాలంటే అనాథనని జంకు.
ఒక ఆదివారము ప్రిన్సిపాల్ గారింటికి వచ్చినాడు. మేరీ ఆశ్చర్యపోయినా, ఆదరంగా లోపలికి పిలిచి, సోఫాలో కూర్చోబెట్టింది. బిస్కెట్లు, టీ, ఇచ్చింది. అమ్మనూ నాయిననూ పిలిచి పరిచయము చేసింది. దావీదు గుర్తుపట్టినాడు.
“ఆ రోజు పొద్దున నన్ను బండి మింద దింపింది మీరే కదా సారూ!”అన్నాడు. కొంచెం సేపు కాలేజి విషయాలు మాట్లాడుకున్నారు. దావీదు, మార్తమ్మ లేచి వెల్లిపోతాంటే – “మీరు కూడా ఉండండి. మీతోనే మాట్లాడాల” అన్నాడు. ఇద్దరూ కూర్చున్నారు.
కొంచెం సేపు మానముగా ఉండిపోయి, గొంతు సవరిచ్చుకోని చెప్పబట్నాడు శశాంక్ సారు. “దావీదుగారూ, నేను మేరీ మేడమ్ గారిని ఇష్టపడుతున్నాను. ఆమెకు కూడా ఇష్టమయితే పెండ్లి చేసుకుంటాను. నేను అనాథను. నా తల్లితండ్రులెవరో నాకు తెలియదు. ఆశ్రమంలో పెరిగినాను. ఒక పుణ్యాత్ముడు, వాసవీ ప్రసాద్ అని, మదనపల్లెలో పెద్ద వ్యాపారస్థుడు. వైశ్యులు. అతనే నన్ను ఎమ్.ఎస్.సి. వరకు చదివించినాడు. ఉద్యోగము వచ్చింది. ఆశ్రమములో హిందూ మతమే ఉండేది. హిందూ దేవతలనే పూజ చేసేవారు. నాకు కూడ అదే నేర్పినారు.
మీరు క్రిస్టియన్లనీ, యస్.సి.లనీ తెలుసు. నా కులమేమిటో నాకు తెలియదు. సర్టిఫికెట్‍లో ‘ఆర్ఫన్’ అనే ఉంది. గార్డియనుగా వాసవీ ప్రసాద్ గారి పేరే రాయించినాను. ‘ఇండియన్, హిందూ’ అని రాసినారు. నాకు మీ మతం పట్ల ఏ అభ్యంతరము లేదు.
మేడం గారు ఎందుకు పెండ్లి చేసుకోలేదో నేను కర్ణాకర్ణిగా విన్నాను. విన్న తర్వాత ఆమె మీద ప్రేమ, గౌరవం ఇంకా పెరిగినాయి. పెండ్లయితే మా దగ్గరే మీరు నిర్యంతరముగా ఉండచ్చు. లేదా నన్నే వచ్చి మీ దగ్గర ఉండమన్నా నాకు సమ్మతమే. మేడం గారి జీతము కూడ నాకు ఇవ్వనవసరము లేదు. ఎవరి మతాన్ని వాల్లు అనుసరించుకోవచ్చు.
నేను ఆమె కంటే తక్కువ క్యాడర్‍లో ఉన్నాననే భావన లేదు. నేను వయసులో పెద్దవాడినైనా, ఆలస్యంగా చేరడం వలన ఆమెకు జూనియర్‍ను. మేడం గారు త్వరలో డి.వి.ఇ.ఓ. అవుతారని అనుకుంటున్నారు. ఆమె హోదాను నాకు గర్వకారణముగా తల్చుకుంటాను.
నా మనసు విప్పి మీ ముందు పెట్టినాను. మేడం! మీ మనసు నొప్పించి ఉంటే మన్నించండి” అని ముగించినాడు శశాంక్ సారు.
దావీదు, మార్తమ్మల ముకాల్లో కాంతి వచ్చినాది. మేరీ ముగము కూడ ప్రసన్నముగా ఉంది.
“శశాంక్ గారూ, మీరు చెప్పినదాంట్లో తప్పేమీ లేదు. మేము ఆలోచించుకొని రెండు మూడు రోజులల్లో మీకు చెబుతాము” అన్నది.
నమస్కారము చేసి, పోయెస్తానని చెప్పి వెళ్లిపోయినాడు.
దావీదు అన్నాడు “అమ్మా, మేరీ! ఏసుప్రభువే ఈనను నీ కోసరం పంపించినాడు. అనాద అయితే నేమి? బాగా చదువుకున్నాడు. లెక్చరర్‌గా చేస్తున్నాడు. నీ మీద నిజంగా ప్రేమ ఉన్నట్లే కనబడుతూంది.”
మార్తమ్మ అనింది “తల్లీ, నీవు ఇంత వరకు మా కోసరమే బతుకును బలి చేసుకున్నావు. ఆయనే అందరం కలిసి ఉందాము అంటున్నాడు. ఎంత వినయము? నీతో గాకుండా పెద్దోల్లతాన మాట్లాడంతోనే ఆ పిల్లోని సంస్కారము తెలుస్తున్నాది కదా! నీవు పెండ్లి చేసుకోకుండా నిలబడిపోతావేమో, దానికి మేమే కారణము కదా అని కుమిలిపోతాండాము. నీవేమి ఆలోశించగాకు. అదృస్టమే మన తలుపు తట్టినాది.”
“మా యమ్మ బంగారు తల్లి. ఒప్పుకోమ్మా” అని బంగపోబట్నారు.
మేరీ నవ్వినాది. కండ్ల నిండా మెరుపు. చెంపలు కందిపోయినాయి. పెదిమెలు అదురుతూండగా అన్నాది “సరే నాయినా, శశాంక్ సారుకు రేపే చెబుతాను. ఇన్నేండ్లకి నా మనసును అర్తం చేసుకున్నవారు దొరికినాడు. మిమ్మల్ని వదిలేసి నా సుఖం నేను చూసుకోని వెళ్లిపోవడానికి నా మనస్సు ఒప్పుకోలేదు. నన్ను కని, పెంచి, కూలీ పని చేసి చదివించి ఇంతదాన్ని చేసినారు. తల్లిదండ్రుల రునము తీర్చుకునే అవకాశము నాకు శశాంక్ సారు ఇస్తున్నాడు.”
బిడ్డ మొగంలో ఒక విదమైన సిగ్గును, మొదటి సారి చూసినారు ఇద్దరూ. ఆ యమ్మిని దగ్గరికి తీసుకోని శానా సేపు ఉండినారు.
మర్సటి రోజునే, “శశాంక్ గారూ, రేపు మా యింటికి సాయంత్రం టీ కి రావాలి మీరు” అని పిల్చినాది మేరీ. తలెత్తి ఆయనను చూడలేకపోయినాది; బిడియముతో, శశాంక్ గుండె కొట్టుకున్నాది వడిగా. చూచాయగా అర్తమయినాది. “సరే మేడమ్” అన్నాడు సంతోశంగా.
సాయంత్రం ఎప్పుడయితుందా అని చూపెట్టుకోని ఉండారు ముగ్గురూ. శశాంక్ వస్తూనే “నమస్తే సార్. నమస్తే మేడం” అన్నాడు చిరునవ్వుతో.
దావీదు అన్నాడు “ఇంక సారెందుకు నాయనా, మామా అనల్ల ఇప్పట్నుంచి.”
“మేడమ్ అనవద్దు ప్లీజ్” అన్నది మేరీ.
మార్తమ్మ “అల్లునికి టిపను తెచ్చియ్యమ్మా” అన్నాది.
సింపులుగా రిజిస్టరు పెండ్లి చేసుకోని, మైదుకూరులో చిన్న రిసెప్షను ఇచ్చినారు. శానా మంది లెక్చరర్లు, ప్రిన్సిపాల్లు వచ్చినారు. కడప డి.వి.ఇ.వో, ఆర్.డి.ఓ, ఆర్.జె.డి గారు కూడ వచ్చినారు.
మోడయిపోతుందేమోనన్న మేరీ బ్రతుకు చిగురించి, మొగ్గ తొడిగి, అందమైన పూలు పూయబట్నాది.
కాలం చేసే గమ్మత్తులు అంతుబట్టవు. అమ్మనూ నాయిననూ చూసుకొనేవాడే కావాలని పట్టుబట్టున మేరీ మంచితనానికి, కాలం కొంచెం ఆలస్యమైనా, మంచి బహుమతిని ఇచ్చినాది శశాంక్ రూపములో. శశాంక్ కూడ అదృష్టవంతుడే! చక్కని బార్యతో బాటు తల్లిదండ్రులు గూడ దొరికినారు మరి!
కాల మహాప్రవాహములో మరొక కుటుంబం ఆటుపోట్లను తట్టుకోని సాగిపోతూ, మంచీ మానవత్వం ఏ కాలాన ఐనా నిలబడతాయని నిరూపన చేసినాది.
***
పద్మనాభశాస్త్రి అనంతపురంలోనే గాకుండా, బెంగుళూరు, బళ్లారి, హైదరాబాదులో మాదిరి ఊర్లలో గూడా కార్యక్రమాలు జరిపిస్తున్నాడు. తమ్ముడు పుండరి ఆయనకు చేదోడుగా ఉన్నాడు. తాను తీసుకొచ్చిన అన్నయ్య తననే మంచిపాయెనే అన్న అసూయ మాత్రమూ లేదు. యారాండ్లు (తోడికోడండ్లు) గూడా.. అట్నే ఉన్నారు.
కారు కూడా కొనుక్కున్నారు అన్నాతమ్ములిద్దరు. పుండరి నడపడం నేర్చుకొన్నాడు గాని, పద్మనాభయ్య మాత్రం డ్రైవర్‍ను పెట్టుకున్నాడు. రెండు నెలలు ముందుగా చెప్పకపోతే వాండ్లు దొరకని పరిస్తితి.
కేదార రీసర్చి పూర్తయింది. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి పి.హెచ్.డి. పట్టా అందుకున్నాడు. పద్మనాభయ్య దంపతులు, పుండరి దంపతులు, బెంగుళూరుకు పోయి, అక్కడినుంచి విమానంలో ఢిల్లీకి పోయినారు. స్నాతకోత్సవము చాలా బాగా జరిగింది. ఉపరాష్ట్రపతి ముఖ్యఅతిథిగా హజరైనారు. ప్రముఖ అణుశాస్త్రవేత్త ఇంద్రజిత్ మహన్తి చేతుల మీదుగా పట్టాల ప్రదానం జరిగింది.
నాలుగు రోజులుండి, ఢిల్లీలో చూడాల్సినవన్నీ చూసినారు. కేదార కూడ వీండ్లతో బాటు అనంతపురానికి వచ్చి పది రోజులుంటి వెళ్లిపోయినాడు. వెళ్లిన వారానికే ఫోన్ చేసి శుభవార్త వినిపించినాడు. “నాన్నా, నాకు పుణె న్యూక్లియర్ రియాక్టర్ సెంటర్‌లో జానియర్ సైంటిస్టుగా ఉద్యోగం వచ్చింది. చేరడానికి రేపే బయలుదేరుతున్నాను.” అమ్మా, నాయినా శాన సంతోషించినారు.
పుణె అని పేరే గాని, నగరానికి శానా దూరంలో ఉంది సెంటరు. అది ఒక పెద్ద ప్రభుత్వరంగ సంస్థ. అణుశక్తిని రకరకాలుగా మానవాళికి ఉపయోగకరంగా, పర్యావరణానికి హాని కలగకుండా, ఎలా వాడుకోవాలో పరిశోధనలు చేస్తుంది. దానికి డైరెక్టరు ఉత్తరాది వాడు. ఆయన పేరు ఉదాస్ చతుర్వేది.
అక్కడే సిబ్బందికి మంచి క్వార్టర్సు ఇచ్చినారు. స్టాఫ్ క్యాంటీను ఉంది. టిఫన్లు, బోజనాలు అన్నీ దొరుకుతాయి. కేదారకు వండుకునే బాధ తప్పింది. క్వార్టర్సు సెంటరుకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి . సైంటిస్టులకు కంపెనీయే కార్లు పంపిస్తుంది. ఇతర సిబ్బందికి ఒక మినీ బస్సు ఉంది.
కేదారకు సీనియర్ సైంటిస్టు తమిళియన్. కేదార కంటే ఐదారేండ్లు పెద్దవాడు. ఆయన పేరు వైద్యనాథన్ పిళ్లై. ఆయనకు ఇంకా పెండ్లి కాలేదు. క్యాడర్ ఇగో లేకుండా కేదారతో శానా బాగా మాట్లాడతాడు. కేదారను ‘తంబీ’ అంటాడు. తనను ‘అన్నా’ అనమంటాడు. ఇద్దరూ మంచి నేస్తులైనారు.
శనాదివారాలు సెలవు. ఒక రోజు వైద్యనాథన్ – “ఈ రోజు నిన్ను ఒక చోటికి తీసుకొని వెళతాను. యు విల్ లవ్ ది ప్లేస్!” అన్నాడు. కేదార సరే అన్నాడు.
ఇద్దరూ కారులో లోనావాలా రోడ్డు నుంచి ఐదు కిలోమీటర్లు లోపలికి ప్రయాణించినారు. చుట్టారా పచ్చని కొండలు, లోయలు. ఆ పచ్చదనాన్ని చూసి పరవశించినాడు కేదార.
(ఇంకా ఉంది)