Site icon Sanchika

మహాప్రవాహం!-43

[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘మహాప్రవాహం!’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[సన్యాసం స్వీకరించాలని నిర్ణయించుకున్న కేదార ‘రినన్సియేషన్ ఓత్’ తీసుకుంటాడు. ‘నిశ్చలానంద మహారాజ్’ అని పేరుతో, కటక్ ఆశ్రమానికి ఇన్‍ఛార్జ్‌గా నియమిస్తారు ప్రభుదత్త మహరాజ్. ఒకసారి తల్లిదండ్రులను చూసొస్తానని అనుమతి తీసుకుని అనంతపురం వస్తాడు కేదార. సన్యాసం తీసుకున్నందుకు తల్లిదండ్రులు మొదట ఖిన్నులవుతారు. తర్వాత అర్థం చేసుకుని, ఆమోదిస్తారు. అపరాధభావన లేకుండా మమత్వాన్ని దాటుతాడు నిశ్చలానంద మహారాజ్. ఖాజా హుసేన్ శాపులో పండ్లపై నీళ్లు జల్లి వాట్ని సర్దుతుండగా, గద్వాలలో పౌరోహిత్యం చేసే పరాశరమూర్తి వచ్చి, తమ కూతురికి పెళ్ళి కుదిరిందనీ, పెండ్లికొచ్చినవారికి తాంబూలంలో పెట్టి ఇవ్వడానికి ఐదొందల కమలాపండ్లు కావాలని, తెప్పించమని చెప్తాడు. అలాగేనంటాడు ఖాజా. ఆయన అడ్వాన్సు ఇవ్వబోతే తీసుకోడు. సంచీ లోంచి శుభలేఖ తీసి ఖాజాకిచ్చి కుటుంబ సమేతంగా పెళ్ళికి రావాలని ఆహ్వానించి వెళ్ళిపోతాడు పరాశరమూర్తి. ఇంతలో కొడుకు జహంగీర్ వేగంగా రావడం కనిపిస్తుంది. ఏంటింత హడావిడి అని అడిగితే, తండ్రిని కిందకి దిగమని చెప్పి, ఆయన కాళ్ళకి మొక్కి, తనకి ఉద్యోగం పర్మనెంటు అయిందని చెప్తాడు జహంగీర్. తనకి జీతం పెరుగుతుందనీ, క్వార్టర్స్ ఇస్తారనీ చెప్తాడు. పండ్ల కొట్టు మూసేసి, అమ్మానాన్నలను తన వద్దకు వచ్చేమంటాడు. ముందు నీకు నిక్కా జేయాలి, మాకింకా ఒంట్లో శక్తి ఉందనీ, కొన్నాళ్ళు పని జేసుకోగలమని చెప్తాడు ఖాజా. అమ్మకి, అక్కకి బావకి కూడా ఈ శుభవార్త చెప్తాడు జహంగీర్. ఆ రాత్రి అందరూ ఖాజా ఇంట్లో విందు చేసుకుంటారు. హసీనా రెండోసారి కడుపుతో ఉంది. ఏడో నెలలో పుట్టింటికి తీసుకువస్తారు. నెలలు నిండుతాయి. గద్వాలలోని ప్రభుత్వాసుపత్రిలో ప్రసవానికి చేరుస్తారు. మగబిడ్డను ప్రసవించి, హసీనా చనిపోతుంది. వాండ్ల దుఃఖానికి అంతుండదు. ఫాతింబీ ఆవుపాలు వర్తన పెట్టుకుని, చంటిపిల్లాడికి తాగిస్తూ ఉంటుంది. పది రోజులు యాపారాలు మానేస్తారు మామ, అల్లుడు. ఇక చదవండి.]

[dropcap]ఈ[/dropcap] కాలముండాదే, దీనమ్మ, దాన్నిమించిన మందు లేదు దుక్కానికి. ఎంతటోల్లు సచ్చిపోయినా, క్రమంగ మర్సిపోతారు. ల్యాకపోతే ఇంకేమయినా ఉన్నాదా! పెపంచము అల్లకల్లలము ఐపోదూ! దేవుడే ఆ విదంగ కాలాన్ని ఏర్పాటు చేసినాడు.

పిల్లోనికి మూడు నెలలు నిండినాయి. అందర్ని గుర్తు పడ్తాడు. పక్కన గూసోని పలకరిస్తే నవ్వుతాడు. చాందినీ అమ్మ మింద ఎదారు బెట్టుకోని శిక్కిపోయినాది. మధ్య రాత్రి లేసి అమ్మ గావాలని ఏడుస్తది.

ఖాదర్ మియా మెల్లగ మనుసుల్లో బడినాడు. ఎర్రవల్లికి బోయి శాపు చూసుకోబట్నాడు. ఖాజా హుసేను గుడ్క మల్ల పండ్ల దుకానము శురూ చేసినాడు. వర్తనగ ఆయప్ప దగ్గర పండ్లు తీసుకకునేటోల్లు “పాపం, బిడ్డ సచ్చిపాయెనంట గదా సాయిబూ, ఏం చేస్తాం. ఆయమ్మకు కాలం తీరి ఎల్లిపోయినాది. అల్లున్ని, పిల్లలను మీరే జూసుకోవాల మరి. ఈ వయిసులో రావాల్సిన కష్టం కాదు మీకు ఖాజా మియా” అని ఓదార్చబట్నారు.

ఎన్ని రోజులు అల్లునింట్లో ఉంటామని, వాండ్లింటికి వాండ్లు వచ్చేసినారు. పిల్లలను అల్లుడు సాకలేడని ఈడికే తెచ్చుకున్నారు. ఒక్కనివేం చేస్తావని అల్లున్ని గుడ్క ఇంటికి తెచ్చుకున్నారు.

ఒక సంమచరం గడిసినాది. జహంగీరుకు నిక్కా చెయ్యాలని అనుకొన్నారు. కార్టెడు ఫ్యాక్టరీలోనే పనిచేసి నేస్తుడు జాఫర్ తన చెల్లెలిని చేసుకోమని గద్వాలకు వచ్చి ఖాజా హుసేనును అడిగినాడు. పాప పేరు అయేషా. టెంతు పాసయినాది. చిన్నటేకూరులో అంగన్‌వాడి టీచరుగా పని చేస్తాన్నాది. వాండ్లది చిన్న టేకూరే. ఇద్దరే పిల్లలు. వాండ్ల నాయిన కర్నూల్లో జట్కాబండి తోలేవాడంట. సచ్చిపోయి రెండేండ్లయినాది. చిన్నటేకూరు మల్లెతోటలకు పేరు. వాండ్లమ్మ పూలు ఎత్తండం (హోల్‌సేల్) కొనుక్కుని, దండలు గట్టి, విడిమొగ్గలు గంపల బెట్టుకోని, చిన్నటేకూరు, దూపాడు, దిన్నిదేవరపాడులల్లో అమ్ముతాదంట. టేకూరులో వాండ్లకు సొంత యిల్లు కూడా ఉంది.

జహంగీరుకు గుడ్క ఆయేషా నచ్చినాది. వాండ్ల శగితి మేరకు పెండ్లి చేసి, సారె పెడ్తామన్నారు.

మంచిరోజు దర్గాలో నిక్కా జరిగినాది. జహంగారు, ఆయేయా దిన్నె దేవరపాడు దగ్గర కంపెనీ క్వాటర్సులో కాపురం పెట్టినారు. ఆయమ్మి  రోజు టేకూరుకు వచ్చి అంగన్‍వాడి ఉద్యోగం చేసి ఇంటికి పోతాది. దగ్గరే. ఆర్డినరీ బస్సులే కాకుండా ‘టాటా మాజిక్’ అని సెవెన్ సీటరు వ్యాన్లు గుడ్క ఈమధ్య తిరగతాండాయి.

చాందినీ రెండో తరగతికొచ్చినాది. పిల్లోనికి చాన్నాల్లు పేరు పెట్టల్యా. జహంగీరు బార్యే ఆకిరికి వానికి ‘అబ్దుల్లా’ అని పేరు పెట్టినాది. ‘అబ్బూ’ అని పిలిస్తే ఉరికి వస్తాడు. అమ్మమ్మ, తాత వాన్ని, తల్లిలేని పిల్లోడని శానా గోము చేస్తారు. చాందినీ తమ్మున్ని శానా ముద్దు చేస్తాది.

ఒక దినము రాత్రి భోజనాలయింతర్వాత ఖాజా అల్లున్ని కూచ్చబెట్టి చెప్పినాడు – “బేటా, పోయిన బేటీ ఎట్టాగూ పోయింది. మాకా తగ్గే వయసేగాని వచ్చే వయసు గాదు. కొన్నేండ్ల వరకూ పరవాల్యా. తర్వాత? నీవొక్కనివే ఇద్దరు పిల్లలను సంబాలించుకోలేవు. మల్లా నిక్కా చేసుకో నాయినా, పిల్లలకు అమ్మ జరూరత్ ఉంటాది, నీకు ల్యాకపోయినా. నీకు ఇంకా ముఫై ఏండ్లు గుడ్క ని౦డల్యా బేటా!”.

ఖాదర్ మియా కండ్ల నిండా నీల్లు నింపుకొని మామ దిక్కు చూసినాడు. “మామూ, ముఝే మాఫ్ కర్నా. హసీనా కీ జగా మే మై కోయీ ఔర్ ఔరత్ సోచ్ నై సక్‍తా” అన్నాడు.

ఫాతి౦బీ అన్నది “బేటా, హసీనా అంటే నీకెంత ప్యార్ ఉందో మాకు తెలుసు. దాని నసీబ్ అట్ల ఉంది. ఎల్లిపోయింది. నాకు గుడ్క ఈ మధ్య శాతగావడంల్యా నాయినా.”

ఖాదర్ మియా ఏం మాట్లాడాల్యా. లేచి ఎల్లిపోయినాడు. ‘బతికున్న పెండ్లాలనే తలాక్ చెప్పి వదిలేస్తున్న ఈ కాలంలో ఈ ఖాదర్ బీబీ మింద ఎంత మమకారం పెంచుకున్నాడు! ఇటువంటి మొగునితో బతికేందుకు మన పిల్లకు అదురుస్టము లేకపాయెనే’ అని బాదపడినారు ముసిలాండ్లు.

ఖాజా అన్నాడు “ఫాతిమా, వీనికి తెలిసిరావాలంటే మనం కొన్ని దినాలు పిల్లల్ని వదిలేసి జహంగర్ కాడికి పోదాము. ఆయేషా గూడ్క ఫోను చేసినప్పుడంతా పిలుస్తాది పాపము.” ఫాతింబీ సరేనన్నాది.

కొడుకు దగ్గరికి పోతామంటే వద్దని ఎట్లంటాడు? పిల్లలను దీసుకోని తనింటికి బోయినాడు ఖాదర్. రెండు రోజుల్లో వానికి చుక్కలు చూపించబట్నారు. వంటకు, ఇంట్లో పనికి ఉశేనమ్మ అనే పెద్దామెని మాట్లాడుకున్నాడు. ఆ మాతల్లి పిల్లలకు బెట్టకుండా తానే దినేసేది. సన్న పిల్లోడని గూడ చూడకుండా అబ్దుల్లాను కొట్టేది. చాందినీ జడలు పట్టి గుంజేది.

పదిరోజులకే చిక్కి సగమయినా రిద్దరూ. ఏమయినా అంటే ఎదురు తిరిగేది – “నీ పిల్లలు దయ్యప్పిల్లలు. వీండ్లను నేను గాబట్టి చూసుకుంటున్నా” అనిందొకరోజు. ఇంట్లో స్టీలు గిన్నెలు, బియ్యము, పప్పులు మాయం కాబట్నాయి. ఉశేనమ్మను మానిపించినాడు ఖాదరు.

పిల్లలను బండి మింద కూచోపెట్టుకోని దిన్నెదేవరపాడుకు పోయినాడు. పిల్లలు అమ్మమ్మను, తాతను కరుచుకుని ఒకటే ఏడవబట్నారు. వాండ్ల ఒళ్లంతా తడిమి చూసి ఫాతింబీ కండ్ల నిండా నీల్లు పెట్టుకున్నాది. ఖాజా అల్లుని దిక్కు చూడకుండా కోపంగా ముకం తిప్పుకున్నాడు.

“మామూ, అట్టా ఉండద్దు. అత్తా నన్ను చమించు. మీరు జెప్పినట్లే ఇంటా” అన్నాడు అల్లుడు.

ఆయేషా అనింది – “అన్నా, అబ్దుల్లాను మా కాడ పెట్టుకుంటాము. కొన్నేండ్లు చాందినీని యాదన్నా ఆస్టలున్న స్కూల్లో జేరుద్దాము.”

“అంత చిన్న పిల్లను ఆస్టల్లోనా?” అన్నాడు.

“మరి వదినెను తెచ్చుకో.”

“సరే అమ్మా.”

బొమ్మిరెడ్డి పల్లెలో బడేమియాకు ఇదంతా తెలుసు. ‘కోడుమూరులో తనకు తెలిసిన రహమాన్ అనే ఆయప్ప ఉన్నాడనీ, కటికంగడి నడుపుతాడనీ, పెండ్లాము లేదనీ, బిడ్డకు పెండ్లి జేస్తే, రెండేండ్ల కిందట యాక్సిడెంటులో అల్లుడు చచ్చిపోయినాడనీ, ఆయమ్మికి ఇరవై తొమ్మిదేండ్లనీ, పిల్లలు లేరనీ, ఎవురయినా మంచోడు ముందుకొస్తే మల్లా పెండ్లి చెయ్యనీకె చూస్తాండాడ’నీ ఫోను చేసినాడు. ఖాదర్‌కు చెబితే, తనకేమీ అభ్యంతరము లేదన్నాడు.

అందురూ కోడుమూరికి బోయి పిల్లను చూసినారు. ఆయమ్మి పేరు జాస్మిన్. చక్కని పుట్టు. ఖాదర్ చెప్పినాడు వాండ్లతో – “నా పిల్లల కోసరమే ఈ పెండ్లి. వాండ్లను తల్లి మాదిరి చూసుకున్నావంటే నెత్తిన బెట్టుకుంట నిన్ను. సవితి తల్లి బుద్ధి చూపిస్తే తలాక్ చెప్త, దీనికి ఒప్పుకొంటే నేను రడీ. ఇద్దరం ఒక దావ కొస్తాము.”

“నాకిష్టమే” అనింది జాస్మిన్. పిల్లలను దగ్గరకు తీసుకునింది. పెండ్లయిన తర్వాత గూడ్క తానిచ్చిన మాట నిలబెట్టుకోని, మంచి తల్లిగా వాండ్లను సాకింది!

కాలానికి దుక్కాన్ని మాన్పించడమే గాదు, ప్రేమలను గూడ మరిపిస్తాది. ఉన్న బందాల కోసరం కొత్త బందాలను తగిలిస్తాది. బతుకులను సర్దుబాట్లతో నడిపిస్తాది.

***

కర్నూలు గిబ్సన్ కాలనీలో ఒక పెద్ద బిల్డింగు. గేటు దాటంగనే అంతా సన్‌షేడు కప్పిన పెద్ద వరండా. పైన కొక్కానికి యాలాడదీసిన గొలుసుకు కట్టిన పేము ఉయ్యాల కుర్చీలో కూసోని పేపరు సదవుతండాడు రుక్మాంగదరెడ్డి. వంటాయమ్మ సునందనమ్మ ఎండి గలాసు తోన కాపీ చెచ్చిచ్చినాది. తాక్కుంట ఊగుతాంటే ఇంటి ముందల ఇన్నోవా కారు వచ్చి నిలబడినాది. దాంట్లోంచి కేశవరెడ్డి దిగినాడు.

లోనికి వచ్చి సిన్నాయన కెదురుగా కుశను కుర్చీ జరుపుకుని కూచున్నాడు. సునందనమ్మ కేశవరెడ్డికి గుడ్క కాపీ తెచ్చిచ్చినాది. “నేను గుడ్క టిపను ఈడనే జేచ్చామ్మా. మా పిన్నమ్మకు చెప్పు” అన్నాడు.

“హరియాన నుంచి లోడు వచ్చినాది సిన్నాయనా. దింపిచ్చి, గోడవున్లోన బెట్టించి వచ్చినా. పదకొండు లచ్చలకు ఇన్‍వాయిస్ దెచ్చినాడు. ఇయ్యాల ట్రాన్స్‌పరు చెయ్యాల వాండ్లకు.”

“మంచి పని చేసినావురా కేశవా” అన్నాడు రుక్మాంగద రెడ్డి.

“ఈ పంజాబు నాకొడుకులు వచ్చి కర్నూల్లో ఆటోమొబైల్ స్పేరు పార్టుల శాపులు పెట్టబట్నాక మనకు కాంపిటీసను పెరిగింది సిన్నాయనా. మనం ఉత్త ట్రాకటరు స్పేరు పార్టులే పెట్టుకోకుండా, లారీలవి గుడ్క పెట్టడం మంచిదయినాది.”

వీండ్లిద్దరూ కలిసి ఏదెనిమిదేండ్ల కిందటే పాతబస్టాండు కాడ సెబాస్టియన్ రోడ్‌లో ‘యశోదా ఆటోమొబైల్ అండ్ టాక్టర్ స్పేరు పార్ట్స్’ అని పెద్ద శాపు పెట్టినారు. ఈమధ్య రెండేండ్ల కిందట యాక్టివా స్కూటరు డీలర్‌శిప్పు దీస్కోని, పార్కు రోడ్డులో శోరూము దెరిసినారు.

“టిపనుకు రాండి పెద రెడ్డి” అని పిలిసినాది సునందమ్మ.

యశోదమ్మ కేశవను జూసి నవ్వినాది. “ఏమిరా ఇయ్యల మా కోడలు నీకు టిపను పెట్టనన్నాదా ఏంది?” అనింది.

కేశవ గూడ్క నవ్వి “అదేం లేదు పిన్నమ్మా, నేనే పొద్దున్నే లోడు దింపిచ్చనీకె గోడవును కాడికి బోయింటి. అన్నించి ఇక్కడ కొస్తి” అన్నాడు. ఇంతలో అయప్ప సెల్‌ఫోను పాట బాడబట్నాది ‘దాయి దాయి దామ్మ’ అంటూ. ఎత్తి, “హలో, అనసూయా, ఆఁ. ఆఁ, లేదు నేను మా సిన్నానాయన కాడికొచ్చినా. టిపను ఈడనే జేస్తుండా. రానని నీకు చేసి చెబ్దామంటే నీ ఫోను ఎంగేజు వచ్చినాది. ఏమి, నిరంజను చేసిండెనా. బాగుండారంటనా ఆడ అందురూ? సరే, నేను మద్యాన్నం బోజనానికొస్తాలే. ఈడ్నించి శోరూముకు బోతా. పెట్టేస్తాండా” అన్నాడు.

“నీ కోడలు పిన్నమ్మా” అని యశోదమ్మతో చెప్పినాడు కేశవ.

డైనింగు టేబిలు మింద పింగాని ప్లేట్లలో పెసర దోసెలు చెరొకటి ఏసి పోయినాది సునందమ్మ. వాండ్లు తింటాంటీ మల్లా నాలుగు దోసెలు తెచ్చినాది. “నాకు ఇంకోటి సాలమ్మా. అదేందో ఉద్ది పిండి అరిగినట్టు పెసర పిండి అరిగి సావదు నాకు” అన్నాడు పెదరెడ్డి. “వానికెయ్యి. చిన్నపిల్లాడు” అన్నాడు. మిగిలిన మూడూ కేశవరెడ్డి ప్లేట్లో ఏసి, బుడ్డల చట్నీ మల్లా ఇద్దరికీ ఏసినాది.

కేశవరెడ్డి చిన్నపిల్లోడేం కాదు. యాభై వస్తాండాయి. నల్ల ప్యాంటు, రామరాజు కాటన్ షర్డు ఏసుకున్నాడు. మీసాలకు, జుట్టుకు రంగేసినాడు. నల్ల కండ్లద్దాలు, సెల్‌ఫోను పక్కనే టేబులు మింద పెట్టుకున్నాడు. కేశవరెడ్డి నాయిన నాగశయనారెడ్డి కాలం జేసి ఐదేండ్లయితాంది. మొగుడూ పెండ్లాము ఇద్దరే ఉండేది. కొడుకు నిరంజను హైదరాబాదులో సి.బి.ఐ.టి.లో ఇంజనీరింగు జేసి, అమెరికాలో ఎమ్.ఎస్. చేసి ఆడనే ఉద్యోగము చేస్తాండాడు. పెండ్లి గుడ్క అయినాది. ఆళ్ళగడ్డ శేఖర్రెడ్డి బిడ్డే. ఆయమ్మి గుడ్క అదే సదివి ఉద్యోగము చేస్తాది. శిన్నాయనకు దగ్గరుండాలని పక్కనే బాస్కరనగర్‌లో ఇల్లు కట్టిచ్చుకున్నాడు కేశవ.

రుక్మాంగదరెడ్డికి డెబైఆరేండ్లు. మీసాలు, కనుబొమ్మలు గుడ్క తెల్లగా నెరిసినాయి. ఎమ్మెల్లే అంచు అడ్డపంచ కట్టుకుని, చేతుల బనియను తెల్లది ఏసుకున్నాడు. బుజం మింద టర్కీ తువ్వాల కప్పుకున్నాడు. ముసిలి సింహము మాదిరుండాడు పెదరెడ్డి. యశోదమ్మకు గుడ్క దెబై దాటినాయి. ఇద్దరికీ ఆరోగ్యాలు బాగానే ఉండాయి.

యాపారాలన్నీ కేశవరెడ్డే చూసుకుంటాడు. కాని మెయిన్ పెట్టుబడంతా పెదరెడ్డిదే. శానా మటుకు రోడ్డుకు ఆనుకొని ఉన్న సేన్లను ఇండ్ల స్తలాల వెంచర్లకు అమ్మినాడు. ఊర్లో బోయ శెన్నప్ప ఇల్లు చూసుకుంటుంటాడు. ఇంకా కొన్ని శేన్లుండాయి. ట్రాకటరు తోని సాగు చేయిస్తాంటారు. నెలకొకసారి ఇద్దురూ బోయి రెండ్రోజులుండి చూసుకోని వస్తారు. ఎంట సునందనమ్మ ఉండాల్సిదే. ఆడ గుడ్క ఆయమ్మ వీండ్లకు వండి పెడతాంది.

పోయొస్తానని చెప్పి ఎల్లిపోయినాడు కేశవరెడ్డి. తొగర్చేడులో తమ భూములు శానా మటుకు అమ్మేసినాడు. అమ్ముడుపోనివి గుత్తకిచ్చినాడు. వాండ్ల పాత శత్రువు సంజీవరెడ్డి గూడు శేన్లు అమ్ముకొని, బెంగులూరులో కొడుకు దగ్గరికి పోయినాడు.

***

హైదరాబాదు హిమయతునగరు. సుజాత హాస్పిటల్. డా. ఎమ్ నరసింహారెడ్డి, ఎం.బి.బి.ఎస్, ఎమ్.ఎస్ (కార్డియాలజీ OSM) – అన్న పెద్ద బోర్డు. ఆసుపత్రి శానా పెద్దది. మొత్తం మూడంతుస్తులుంటాయి. దాని ముందు ఒక బల్ల మింద వెడల్పుగా ఉన్న ఇత్తడి పల్లెములోన నీల్లు పోసి రకరకాల పూలు ఏసినారు. అవి తేలతా ఉండాయి. పేశంట్లు టెస్టులు చేయించుకునే ల్యాబు, ఆఫీసు కిందనే ఉంటాయి.

రెండో అంతస్తులో రూములు, ఐ.సి.యు, మామూలు వార్డులుంటాయి. మూడో అంతస్తులో ఆపరేశను జేసే థియేటర్లుండాయి. ‘పోస్టు సర్జికల్ కేర్’ అని ఒక విభాగము కూడా ఉండాది. ఆపరేషన్లు చేసిన తర్వాత పేశంట్లను ఒకటి రెండు రోజులు అడ పెడ్తారు.

డాక్టరు నరసింహరెడ్డికి నలబై ఏండ్లు దాటింటాయి. అప్పుడే బట్టనెత్తి వచ్చినాది ఆయప్పకు. ఒక ఆపరేషను చేసి కింద తన రూముకొచ్చినాడు. బాయి వచ్చి, గలాసుతో మంచి నీల్లు టేబులు మింద బెట్టి, ఎ.సి. ఆన్ చేసి, నిలబడుకునుండాడు.

“గెట్ మి సమ్ బిస్కట్స్ అండ్ టీ, యాదగిరీ” అని చెప్పినాడు డాక్టరు.

బిస్కట్లు తిని టీ తాగాతాంటే సెల్ ఫోను మోగినాది. ఎత్తి, “హలో! సుకన్యా! ఇప్పుడే థియేటరు నుంచి వచ్చి రిలాక్స్ అయితున్నా. నీవు ఫ్రీయేనా? ఓ. నీవు కూడ ఇప్పుడే ఒక సిజేరియన్ చేసి వచ్చినావా? వెరీ నైస్. నేను అరగంటలో బయలుదేరి నీ దగ్గర కొస్తాను. లెటజ్ గో టు ది వెన్యూ టుగెదర్. పిన్నమ్మను కూడ తీసుకోపోదాము. ఓ.కె. బై” అని పెట్టేసినాడు.

పి.ఎ.ను పిలిచి రేపటి అపాయింటుమెంట్లు, ఆపరేషన్లు ఏమున్నాయో కనుక్కున్నాడు. బోయ్‍ని పిలిచి డ్రైవర్‌ని కారు తీసి గేటు ముందు రడీగా పెట్టమన్నాడు. సెల్‌ఫోన్ జేబులో పెట్టుకుని, కళ్లద్దాలు పెట్టుకున్నాడు. బయట కారు రడీగా ఉంది. డ్రైవరు డాక్టరు గారికి నమస్కారము చేసి ఎనక డోరు తెరిచి పట్టుకున్నాడు. సారు కూచున్నాక కారు స్టార్టు చేసినాడు. “మైసయ్యా! మేడం హాస్పిటల్‌కు పోనియ్యి” అన్నాడు నరసింహరెడ్డి. కారు ఇరవై నిమిశాలు ప్రయానం చేసి, ముషీరాబాదు లోని ఒక హాస్పిటల్ ముందు నిలబడినాది.

‘అంజనా నర్సింగ్ హోమ్. డా. సుకన్య. ఎంబిబిఎస్, డిజి.ఓ’ అన్న బోర్డు ఉంది. ఆస్పిటల్ అంత పెద్దది గాదు. కింద ప్లోరు లోనే ఉంది. డయాగ్నిస్టిక్స్, ఫార్మశీ, రిసెప్షను, రూములు, వార్డు, ఆపరేశను దియేటరు అన్నీ ఒక చోట ఉన్నాయి.

“కారు పార్కింగులో పెట్టొద్దు. ఇప్పుడే ఐదు నిమిషాల్లో వస్తాము” అని లోపలికి బోయినాడు నరసింహారెడ్డి. సుకన్య ఈయప్ప కోసరము చూపెట్టుకోని ఉంది. మొగున్ని జూసి నవ్వింది. తెల్లగా, కొంచెము పొట్టిగా ఉంది. గోదుమరంగు చుడీదార్ ఏసుకోని, ఎర్రని దుపట్టా కప్పుకున్నాది. మెడలో తాలిబొట్టు చెయిను తప్ప ఏ ఆబరనమూ లేదా యమ్మకు. శానా నిరాడంబరముగా ఉన్నాది. టేబులు మిందనున్న వ్యానిటీ బ్యాగులో సెల్ పోనును బెట్టుకోని, “షల్ వుయ్ గో?” అన్నాది.

ఇద్దరూ బయటికి వచ్చినారు. బయట రిసెప్షనిస్టుకు తన కారు యింటికి తెమ్మని డ్రైవరు శంశుద్దీన్‌కు చెప్పమన్నాది. ఇద్దరూ ఎక్కినంక కారు కదిలించినాడు మైసయ్య.

“నారాయనగూడ తాజ్‍మహలు హాటలుకు బోనీ మైసయ్య” అన్నాడు డాక్టరు.

“తెలుసు సార్! మన బేబమ్మ బర్త్ డే గద ఇయ్యల” అన్నాడు డ్రైవరు.

ట్రాఫిక్‍లో వాండ్లు హోటలు చేరుకొనేసరికి అర్ధగంట పట్టింది. వాండ్లు సుజాతమ్మని ఎందుకు పికప్ చేసుకోలేదంటే ఆయమ్మ సుకన్యకు పోను జేసి, ‘నేను పిల్లలను తీసుకోని డైరెక్ట్‌గా వస్తాన’ని చెప్పినాదంట.

లోపలికి పోయినారిద్దరూ. రెండో ప్లోరులో బర్త్ డే ఫంక్సను. కొందరు డాక్టర్లు, ఇంకా ఫ్యామిలీ ఫ్రెండ్సు వచ్చినారు. బేబమ్మ క్లాసుమేట్లు, వాండ్ల పేరెంట్సును పిలిచినారు. కర్నూలు నుంచి కేశవరెడ్డి, అనసూయ వచ్చినారు. హైవే విస్తరణ తర్వాత కర్నూలు నుంచి హైదరాబాదుకు గట్టిగా మూడు గంటల ప్రయానము. సిటీ లోనే ట్రాపిక్ వలన ఎక్కువ తీసుకుంటాంది.

(ఇంకా ఉంది)

Exit mobile version