[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘మహాప్రవాహం!’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[ఖాదర్ కొడుక్కి మూడు నెలలు నిండుతాయి. చాందిని అమ్మ మీద బెంగపెట్టుకుని చిక్కిపోయింది. మధ్య రాత్రి నిద్రలేచి అమ్మ కావాలని ఏడుస్తుంది. ఖాదర్ మెల్లగా మనుషుల్లో పడ్తాడు. మామా అల్లుళ్ళిద్దరూ ఎవరి వ్యాపారాలు వాళ్ళు చూసుకుంటుంతారు. ఖాజా దగ్గర పళ్ళు కొనుక్కునే వాళ్ళు విషయం తెలిసి, అతన్ని ఓదారుస్తారు. పిల్లల్ని అల్లుడు పెంచలేడని, తమ ఇంటికి తెచ్చేసుకుంటారు ఖాజా, ఫాతింబీ. ఒక్కనివేం చేస్తామని అల్లుడిని కూడా తమ దగ్గరకే వచ్చేయమంటారు. ఓ ఏడాది గడుస్తుంది. జహంగీరుకు అతని ఫ్యాక్టరీలోనే పనిచేసే జాఫర్ తన చెల్లెల్ని చేసుకోమని సంబంధం అడుగుతాడు. ఇరువైపులా అంగీకారం కుదిరి జహంగీర్, అయేషాల నిక్కా జరుగుతుంది. వాళ్ళు దిన్నె దేవరపాడు దగ్గర కంపెనీ క్వార్టర్సులో కాపురం పెడతారు. ఖాదర్ కొడుక్కి చాన్నాళ్ళు పేరు పెట్టరు. అయేషానే వాడికి ‘అబ్దుల్లా’ అని పేరు పెడుతుంది. కొన్నాళ్ళయినాకా, ఖాదర్‍ని మరో వివాహం చేసుకోమని చెప్తాడు ఖాజా. హసీనా స్థానంలో మరొక స్త్రీని అంగీకరించనంటాడు ఖాదర్. ఫాతింబీ కూడా నచ్చజెబుతుంది. తాను పిల్లల పనులు చేయలేకపోతున్నానని అంటుంది. అయినా మాట వినడు ఖాదర్. చివరికి, తాము కొన్నాళ్ళు కొడుకు దగ్గర ఉండి వస్తామని చెప్పి, ఊరెళ్తారు ఖాజా, ఫాతింబీ. పిల్లల్ని తీసుకుని తన ఇంటికి వెళ్తాడు ఖాదర్. ఒకామెను పనికి పెట్టుకుంటాడు. ఆమె బిడ్డల్ని సరిగా చూడదు, ఇంట్లోని వస్తువులు మాయం చేస్తుంది. చివరికి ఆమెను పని మాన్పించేస్తాడు ఖాదర్. చివరకు మరో పెళ్ళి చేసుకోడానికి ఒప్పుకుంటాడు. బొమ్మిరెడ్డిపల్లెలోని బడేమియా ద్వారా ఓ సంబంధం వస్తుంది. అందరికీ నచ్చడంతో ఖాదర్, జాస్మిన్‍ల వివాహం జరుగుతుంది. మంచి తల్లిగా పిల్లల్ని పెంచుతుంది జాస్మిన్. కర్నూలులో రుక్మాంగద రెడ్డి ఇంటికి వస్తాడు కేశవరెడ్డి. చిన్నాయనతో – వ్యాపారం విషయాలు మాట్లాడుతూ, అక్కడే టిఫిన్ తింటాడు. కాసేపు అవీ ఇవీ మాట్లాడి వెళ్ళిపోతాడు. హైదరాబాద్‍లో హిమాయత్ నగర్‍లో డా. నరసింహారెడ్డి ఓ ఆపరేషన్ చేసి తన గదికి వస్తాడు. టీ తాగుతుంటే, అతని భార్య డా. సుకన్య ఫోన్ చేస్తుంది. కారులో బయల్దేరి ఓ అరగంటలో ఆమె హాస్పటల్‍కి వెళ్తాడు నరసింహారెడ్డి. అక్కడ్నించి ఇద్దరు కల్సి నారాయణగూడ లోని తాజ్‍మహల్ హోటల్‍కి బయల్దేరుతారు. ఆ రోజు వాళ్ళమ్మాయి బేబి పుట్టినరోజు. బంధువులని, స్నేహితులని పార్టీకి పిలుస్తారు. కర్నూలు నుంచి కేశవరెడ్డి, అనసూయ వస్తారు. ఇక చదవండి.]
[dropcap]య[/dropcap]శోద పిన్నమ్మకు కొంచెం పానము బాగలేదనీ, ఆయమ్మను ఒక్కదాన్ని ఇడిసిపెట్టి రాలేక రుక్మాంగద సిన్నాయన నిలబడి పోయినాడనీ చెప్పినాడు కేశవ.
సుజాతమ్మ బేబీని దీసుకోని వచ్చినాది.
“రుక్మిణి ఏదీ? ఇంకా రాల్యా?” అనడిగినాది నరసింహరెడ్డిని.
“ఉండు పిన్నమ్మా, పోను జేస్తా దానికి” అన్నాడు. “పిన్నమ్మా ట్రాపిక్కులో ఉందంట. పావుగంట పడతాదంట” అని చెప్పినాడు.
రుక్మిణి ఇంటరు తర్వాత బి. పార్మసీ చేసింది జి. పుల్లారెడ్డి కాలేజిలో. తర్వాత కర్నాటక లోని మణిపాల్‌లో ఎమ్. ఫార్మసీ చేసింది. ఆయమ్మ మొగుడు గూడ్క అక్కడే చదివినాడు. ఇద్దరూ రెడ్డి ల్యాబ్స్‌లో పని చేస్తారు; హైటెక్ సిటీలో. రుక్మిణి మొగుడు కర్నాటకవాడు. ఆయప్ప పేరు మురుడేశ్వర గౌడ! ఇద్దరూ మణిపాల్‌లో చదివినపుడు ప్రేమించుకున్నారు. ఇంటరు క్యాస్టు పెండ్లిండ్లు మామూలయిపోయిన ఈ రోజుల్లో ఎవ్వరూ ఏమీ అనలేదు. సుజాతమ్మ, పెదరెడ్డి, యశోదమ్మ కొంచెం సంకోచించినారు. నరసింహరెడ్డి వాండ్లకు నచ్చచెప్పినాడు. మురుడేశ్వర ఇప్పుడు ఊర్లో లేడు. ట్రయినింగు కోసరం కంపెనీ వాండ్లు అమెరికాకు పంపిచ్చినారు. ఆయప్ప అమ్మా నాయినా వీండ్ల దగ్గరే ఉంటారు. కూతురికి పంజాగుట్టలో త్రి బెడ్ రూము అపార్టుమెంటు కొనిచ్చినాడు పెద్దరెడ్డి.
కుంచేపటికి రుక్మిణి కూడా వచ్చినాది. బేబమ్మ – అనబడే బేబీకి ఈ నాటితో ఆరేండ్లు నిండుతాండాయి. అక్షర ఇంటర్‌నేషనల్ స్కూల్లో ఒకటో క్లాసు చదువుతున్నాది. ఆ పాప పేరు మణిచందన అని పెట్టుకున్నారు గాని అందరూ బేబీ అనే అంటారు. డాక్టర్లు ఇద్దరూ బంజారాహిల్స్ రోడ్డు నంబరు ఏడులో బంగళా కట్టుకున్నారు. మెహదీపట్నము లోని సుజాతమ్మ యిల్లు అమ్మేసి ఆయమ్మను గూడ వాండ్ల దగ్గరే పెట్టుకున్నారు. కొన్నాట్లు బిడ్డ దగ్గరికి పోయి ఉండి వస్తాంటాది.
డాక్టరు సుకన్య వాండ్లది రాయచోటి. కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ చదివి, తిరుపతిలో గైనకాలజీలో డిప్లొమా చేసినాది ఆయమ్మ. వాండ్ల నాయిన అవినాశ రెడ్డి గూడ రాయచోటిలో డాక్టరే. వీండ్ల పెండ్లి పెద్దలు కుదిర్చినదే.
గులాబిరంగు గౌనులో బేబీ మెరిసిపోతున్నాది. తల్లి రంగు, తండ్రి హైటు వచ్చినాయి ఆ పాపకు. ఎనిమిదేండ్ల పిల్ల మాదిరి ఉండాది సూన్నీకె.
కేకు కట్ చేసినాది బేబమ్మ. అందరూ చప్పట్లు కొట్టినారు. పైన కట్టిన బెలూనులు పగిలి రంగు కాయితాల తుంటలు అందరి మింద పడినాయి. ‘హ్యపీ బర్త్ డే టూ యూ బేబీ’ అని అందరూ పాడినారు. అమ్మకు నాయినకూ, నాయనమ్మకూ, అత్తకూ, కేశవరెడ్డికీ, అనసూయకూ కేక తినిపించినాది. అందరూ పాపకు కేకు తినిపించినారు. తర్వాత బఫె డిన్నరు మొదులయినాది.
ఫంక్షన్ పూర్తయింది. రుక్మిణినీ, కేశవరెడ్డి వాండ్లని గూడ ఇంటికి రమ్మన్నారు. ఇంటికి చేరేసరికి పదయింది. సుజాతమ్మ మనుమరాలికి దిష్టి తీసి పడుకో బెట్నాది.
సుజాతమ్మకూ యాభై దాటినాయి. కేశవరెడ్డి కంటే సంవత్సరమే పెద్దదాయమ్మ. నరసింహరెడ్డి ఆయమ్మ కాడనే ఉండి చదువుకున్నాడు. యశోదమ్మ కంటే సుజాతమ్మే ఆయప్పకు మాలిమి. నిరంజన్ రెడ్డికి గూడ ఆయమ్మంటే శాన యిది. పొద్దున ఎవరి పరుగు వాండ్లది కాబట్టి కుంచేపు హాలులో అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు.
కేశవరెడ్డి అన్నాడు “ఒరేయి నరసింహ, వచ్చే నెలలోనే సిన్నాయన పిన్నమ్మల పెండ్లిరోజు. ఇరవైమూడు జూను. దాంట్లో ఒక విశేసమున్నాది. చెప్పుకోండి చూద్దాము.”
ఎవురికీ అ విశేశమేదో అంతు బట్టల్యా.
“నీవే చెప్పు చిన్నాయనా, సస్పెన్సు బరించలేకపోతున్నాం” అనింది రుక్మిణి. కేశవరెడ్డి నవ్వుతా, “సరిగ్గా వాండ్ల పెండ్లయి ఆ రోజుకు యాభై ఏండ్లవుతాది” అన్నాడు.
“వావ్!” అని అరిచింది రుక్మిణి. “వాట్ ఎ గ్రేట్ ఈవెంట్ అన్నయ్యా! హాఫ్ సెంచరీ ఆఫ్ సక్సెస్‌ఫుల్ మ్యారీడ్ లైఫ్! కుడోస్ టు ఇండియన్ కల్చర్ అండ్ ట్రెడిషన్! దిస్ షుడ్ బీ సెలబ్రేటెడ్ వెరీ గ్రాండ్‌లీ!” అంది.
“అదేందో తెలుగులో చెప్పవే” అన్నాడు కేశవ రెడ్డి. సుకన్య వివరించింది. “దీన్నే గోల్డెన్ జుబ్లీ అంటారు మామా” అనింది.
“నిరంజన్ వాండ్లను గూడ రమ్మంటాను. రుక్మిణీ, మీ ఆయన వచ్చేస్తాడు కదా. బొమ్మిరెడ్డిపల్లెలో, వాండ్లిద్దరు కలిసి కాపురం చేసిన యింట్లో ఫంక్షను చేయాలని చిన్నాయనకు, పిన్నమ్మకు ఇష్టము. అక్కడయితే శానామంది కలుస్తారు. ఏమంటారు?” అన్నాడు కేశవ.
అందరూ సరే అన్నారు. అదే సరైన వెన్యూ అని ఒప్పుకున్నారు.
ఫ్యాక్షనిసుల కుటుంబాన్ని కాల మహా ప్రవాహము డాక్టర్లుగా ఇంజనీర్లుగా మార్చి పారేసినాది. ఎవరికీ అంతుపట్టనివి దాని పోకడలు చూడాల మరి, ఇంకా ఏం చేయబోతున్నాదో!
***
నాలుగు రోజుల్లో అందురూ కర్నూల్లో పెదరెడ్డి ఇంట్లో కలుసుకున్నారు, వాండ్ల యాభయ్యవ పెండ్లి రోజు ఎట్లా చేస్తే బాగుంటది అని మాటాడుకోడానికి.
కేశవరెడ్డి అన్నాడు – “సరిగ్గా నలభై రోజులుండాది. బొమ్మిరెడ్డి పల్లెలో మనింటికి చిన్న చిన్న రిపేర్లు జేపించి, పెయింట్లు ఏయించాల. ముందున్న పెద్దరుగుల మింద, కాలీస్తలం లోన శామియనాలు ఏయిస్తే సరిపోతాది. నిరంజను, వాని పెండ్లాము వస్తాందారంట. నిన్న పోను జేసినాడు వాడు. ఇమానం టిక్కట్లు గడ్క బుక్కయినాయంట. అమెరికాలో వాని ప్రెండ్సందరూ, ఇదేంది, యాభై ఏండ్లయినాదా? శానా గొప్ప సంగతి!” అని మెచ్చుకుంటుందారంట”
రుక్మాంగద రెడ్డి అన్నాడు – “యాదన్నా మంచిపని చేయాలనిపిస్తోందిరా. ఇన్నాల్లు మన కోసరం మనం బతికినాంగాని, మంది కోసరమేం జేసినాం? అట్లాంటిదేదైనా ఆలోశన జెయ్యండి.”
సుజాతమ్మ అన్నాది “బావా, బోదోండ్లకు అన్నదానము జేస్తే?”
“అదెట్లాగైనా చేస్తాము. నాలుగు కాలాలు నిలబడేది సూడంది” అన్నది యశోదమ్మ.
సుకన్య “నాకొకటనిపిస్తోంది మామా!’’ అనింది.
“చెప్పు తల్లీ!” అన్నాడు మామ.
“పెద్ద పెద్దటవున్లు, సిటీల్లో వృద్ధాశ్రమాలు ఉన్నాయి గాని, మన రూరల్ ఏరియాల్లో లేవు. టవున్లలో ఉన్న వాటిని అందరూ భరించలేరు కదా! పల్లెలో మన బిల్డింగు శానా పెద్దది. సపరేటు రూములు గాకుండా, నాలుగయిదు పెద్ద డార్మిటరీలు చేసి, బాత్‍రూములు దగ్గరగా కట్టించితే సరిపోతుంది. వంట చెయ్యడానికి, పెట్టడానికి నలుగురు మనుషులను పెట్టాల. కర్నూలు, డోను శానా దగ్గర గాబట్టి కొందరు విజిటింగ్ డాక్టర్లను వారానికొకసారి వచ్చి చూసిపొమ్మని రిక్వెస్టు చేస్తే సరి. పైసా కూడ తీసుకోకుండా అంతా ఉచితంగా చెయ్యాల. మెయినుగా పిల్లలు చూసుకోకుండా వదిలేసినోళ్లు, ఒంటరి ముసిలాల్లు పల్లెల్లో శానా మంది ఉంటారు. అందరికీ చెయ్యలేము గానీ, మరీ పరిస్తితి బాగ లేనోండ్లకు మనం ఇట్లా సాయం చేయొచ్చు. మనందరం తలా ఒక చెయ్యేసి మొదలు బెడితే, ఇంకా కొంతమంది ఆర్థికంగానో, ఇంకో రకంగానో సాయం చేయడానికి ముందుకొస్తారు.”
అందరూ సుకన్య పక్క మెచ్చుకుంటా చూసినారు. రుక్మిణి ఉద్వేగము కంట్రోలు చేసుకోలేక చప్పట్లు కొట్టింది. “మా వదినె సూపర్” అని సుకన్య చెంప మీద ముద్దిచ్చింది.
“మీ ఆయన ఎప్పుడొస్తున్నాడు?”
“ఈశ్వర్ ఈ నెలాఖరుకు వచ్చేస్తున్నాడు. నో ప్రాబ్లం” అనింది రుక్మిణి. “మా అత్తామామ కూడ వస్తామన్నారు.”
“వెరీ గుడ్” అన్నాడు నరసింహరెడ్డి. “రాయచోటి నుంచి సుకన్యా వాండ్ల పేరెంట్స్ కూడ వస్తారు.”
సుజాతమ్మ పెదరెడ్డితో అన్నాది – “బావా, నీవేమనుకోను అంటే ఒక మాట. బెంగుళూరులో ఉన్న సంజీవరెడ్డిని, ఆయప్ప కొడుకును కోడల్ని గూడ పిలుద్దాము”
రుక్మాంగద రెడ్డి కదిలిపోయినాడా మాటలకు. “తల్లీ! నీ మంచితనమే మనల్నందర్నీ ఇయ్యాల ఇంత బాగుండేటట్లు చేసింది. ల్యాకపోతే వాండ్లను మేమూ, మమ్ముల్ను వాండ్లూ సంపుకోని సస్తాంటమి. తప్పకుండా పిలుద్దాము. ఆయప్ప నాకంటె రెండేండ్ల చిన్నాడు. ఇంకా వైరాలు పెట్టుకోని ఏం జేస్తాము” అన్నాడు.
“మమ్మీ, యు ఆర్ గేట్ రిఫార్మర్!” అనింది రుక్మిణి. లేచి వచ్చి తల్లిని ‘హగ్’ చేసుకుంది.
“దీనికి యదొచ్చినా పట్టుకోలేము!” అన్నాడు కేశవరెడ్డి నవ్వుతా.
నరసింహారెడ్డి అన్నాడు “మన బందువులు, స్నేహితులూ సరే, అన్నదానమూ ఓ.కె.. ఓల్డేజ్ హోమ్ ప్రపోజలు బ్రహ్మాండం..”
“అసలు విషయం చెప్పండి డాక్టర్! “అన్నాది రుక్మిణి నవ్వుతా.
“మన ఊరిని వదిలిపెట్టి శానామంది బతుకు తెరువు వెతుక్కుంటా పోయినారు. అందరూ కాదుగాని కొందరు బాగుపడి మంచి పొజిషన్‌లో ఉన్నారని విన్నాను. వాండ్ల ఫోన్ నంబర్లు సంపాయించి, వాండ్లనూ పిలుద్దాము. పుట్టి పెరిగిన ఊరును చూసిపోతారు. వీలైతే ఎంతో కొంత మన ‘మిషన్’కు సాయం చేస్తారు.”
రుక్మిణి అన్నది “ఇప్పుడు ఫేస్‌బుక్, వాట్సాప్ వాడని వాళ్ళు ఇంచుమించు ఉండరు. పేర్లు తెలిస్తే ఫోను నంబర్లు తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.”
“యు ఆర్ రైట్” అన్నాడు నరసింహారెడ్డి.
వంటాయమ్మ సునందమ్మ ఒకపక్కన నిలబడుకోని అంతా ఇంటుంది. “పెదరెడ్డీ..” అని చెప్పొచ్చు లేదో అని చూస్తున్నాది.
“చెప్పమ్మా. నీకు తోచింది గూడ చెప్పు. అనుమానమెందుకు?”
“మనూర్లో రాముని దేవళము శానా పాడయినాదంట. మన బోయ చెన్నయ్య చెప్పినాడు. పూజారి సచ్చిపోయినాక కొడుకు కర్నూలు జేరి ఆటో నడుపుకుంటున్నాడంట. ఈరన్నగట్టు కాడ గుడిమాన్యము రెండెకరాలు తుప్పులు లేసి, పిచ్చి శెట్లతో నిండిపోయినాదంట. హెహరీ గోడ శానా చోట్ల పడిపోయి, ఇస్పేటాకులు ఆడేటోల్లకు నెలవైనాదంట.
దేవలానికి రిపేర్లు జేయించి, ఎవరన్నా బీద బ్రామ్మన్ని పూజ చేయనీకె తీసుకొచ్చి, దేవళం లోనే వాండ్లకు ఉండనీకె రెండు రూములు ఏసిస్తే బాగుంటాది. మాన్యాన్ని గూడ సాగు చేయిస్తే బాగు. నా జీతము డబ్బులు శానా ఏండ్ల నుంచి మీ దగ్గరే ఉన్నాయి. అన్నీ మీరు చూసుకుంటుండారు. డబ్బులతో నాకేంది పని? రాముల దేవళం ఒక దావకు త్యానికి ఆ డబ్బులు కర్చు చేయండి.”
కేశవరెడ్డి అన్నాడు “సిన్నాయనా సునందమ్మ చెప్పింది శానా బాగుంది.”
“నీ డబ్బులెందుకు లేమ్మా అవి అట్లా ఉండనీ. నీవు చెప్పినట్లు దేవళాన్ని ఒక్కొలిక్కి తెప్పించే బాద్యత మాది. సరేనా?” అన్నాడు పెదరెడ్డి.
సునందనమ్మ తన మాట ఇన్నందుకు శానా సంతోశించినాది.
బోయ చెన్నయ్య వచ్చి, “నాయినా, బడేమియా, సరెడ్డి అనుమంత రెడ్డి, మానుకింది మద్దయ్య, రామానుజశెట్టి కొడుకు, కుంటి సుబ్బారెడ్డి కొడుకు, గొల్లమద్దిలేటి అందురు వచ్చినారు. నీతోనే మాట్లాడాలంట.”
“రమ్మను, రమ్మను” అంటూ పెదరెడ్డి లేచి బైట అరుగుల వరకు బోయినాడు. పది ప్లాస్టిక్ కుర్చీలు చెన్నయ్యతో అరుగుల మీద ఏయించినాడు.
అందురు కూర్చున్నారు. కాపీలు తెమ్మని చెన్నయ్యకు చెప్పినాడు పెదరెడ్డి.
“ఏమప్పా, అందరూ బాగుండారా?” అనడిగినాడు.
“బాగుండాము నాయినా” అన్నారంతా.
అనుమంతరెడ్డి అన్నాడు – “అన్నా, మీ పెండ్లయ్యి యాభై ఏండ్లయితుందని పెద్ద పంక్షను జేస్తున్నారని ఇన్నాము. మన ఊరికే పెద్దోనివి నీవు. ఇది మీ యింటి పండగే కాదు, మా అందరిది.”
పెదరెడ్డి ముకం ఇచ్చుకున్నాది. “శానా సంతోషము అనుమంతూ” అన్నాడు ఆయప్పకు కొడుకు అన్న మాట మతి కొచ్చింది.
“నరసింహ, ఒక తూరి బయటికి రా నాయినా” అని పిలిచినాడు.
డాక్టరుకు అందరూ నమస్కారం బెట్నారు.
‘మన ఊరి నించి పోయి, సదువుకోని, యాపారాలు జేసి, బాగుపడినోల్లను గూడ పిలుస్తామంటున్నాడు నా కొడుకు. మీకు తెలిసినవాండ్లవరైనా ఉంటే చెప్పండి. ఫోన్ నంబర్లు, అడ్రసులు.”
బదేమియా అన్నాడు “అందరివీ కస్టము గాని కొందరు మాత్రము తెలుసును.”
నరసింహరెడ్డి, “ఒక్క నిమిషం” అని లోపలికి పోయి చిన్న డైరీ, పెన్ను తెచ్చుకున్నాడు. “చెప్పండి మామా!” అన్నాడు బడేమియాతో.
“అంత పెద్ద డాక్టరయినా ఈ మామను మర్చిపోల్యా మా నరసింహ” అన్నాడు బడేమియా.
“కొండారెడ్డి కొడుకు కంబిరెడ్డి, హైదరాబాదులోనే ఉండాడు. బిల్డరు, మన స్కూల్లో పని చేసిపోయిన హెడ్మాస్టరు శివకోటీశ్వరరావు సారు, ఆయన కర్నూలులో సెటిలయినాడు; తర్వాత.. సంజన్న గౌడు కొడుకు ప్రదీపు అమెరికాలో ఉన్నాడు. వాడు వచ్చేది నమ్మకం ల్యా. సంజన్నోండ్లు బెంగులూరులో వృద్దాశ్రమంలో ఉండారు. ఇంక వడ్లాయిన రామబ్రెమ్మం కొడుకు వీరబ్రెమ్మం బెంగులూరులో శానా పెద్ద కార్పెంటరంట. దాని పేరేందో అంటారబ్బా.”
శెట్టి కొడుకు అందిచ్చినాడు “ఇంటీరియర్ డెకొరేషన్”
“ఆఁ, అదే. మంగలి శరభయ్య సచ్చిపాయ. ఆయప్ప కొడుకు మాదవ వెల్దుర్తిలో రియల్ ఎస్టేటు వ్యాపారం చేసి శానా సంపాయించినాడు..”
“మన అల్లుగుండు సేను వెంచరేసింది వాండ్లే గద!” అన్నాడు పెదరెడ్డి.
“తర్వాత మన దావీదు బిడ్డ మేరీ, చిత్తూరు జిల్లాలో వొకేషనల్ ఆఫీసరంట. అరటిపండ్ల సాయిబు ఖాజా హసేను కొడుకు జహంగీరు కర్నూలు కార్బైడు ఫ్యాక్టరీలో పని చేస్తాడు. అల్లుడు ఖాదర్ మియ, గద్వాల. మన పద్మనాబయ్య సామి వాండ్లు అనంతపురములో సెటిలైనారు. వాండ్ల కొడుకు శానా పెద్ద సదువు డిల్లీలో సదివి, పూనాలో పెద్ద ఉద్యోగములో ఉండగా, సన్యాసుల్లో కలిసిపోయినాడంట.”
శెట్టి కొడుకు “ఎవరు చెప్పింది? కేదార హైస్కూల్లో నా క్లాసుమేటు.”
“పూనాల ప్రభుదత్త మహారాజ్ అని పెద్ద స్వామిజీ ఉన్నాడు. ఆయన ఆశ్రమాలు ఉన్నాయంట. కేదార ఒరిస్సాలో ఒక ఆశ్రమానికి గురువంట. పేరు గూడ్క మార్చుకున్నాడంట.”
“ఇంతేనా, ఇంకా..” అన్నాడు నరసింహరెడ్డి.
“ఇంత మంచి పొజిషన్లో ల్యాకపోయినా, కొంతమంది ఉన్నారు లే నరసింహ, నేను కనుక్కొని చెబుతాను” అన్నాడు అనుమంత రెడ్డి. “నా కొడుకుల పేర్లు రాసుకో. మారుతి రెడ్డి, మహిపాల్ రెడ్డి. పెద్దోడు ఉళిందకొండలో సిమెంటు డీలరు. చిన్నోడు బెంగుళూరులో ఐటి ఉద్యోగం.”
“గుడ్” అన్నాడు నరసింహ. అందరూ పోయొస్తామని చెప్పి ఎలబారిపోయినారు.
బడేమియా ఎనిక్కి వచ్చి, “పార్వతీశం సారును మర్చిపోయినాము అల్లుడూ. ఆయన పేరు రాసుకో. ఆయన రిటైరైనాడో, యాడన్న పనిచేస్తున్నాడో కనుక్కోని చెబుతాలే నీకు” అన్నాడు.
“సరే మామా” అన్నాడు డాక్టరల్లుడు.
అందరు హైదరాబాదుకు ఎల్లిపోయినారు. కేశవరెడ్డి నాల్రొజుల కొకసారి వచ్చి మహడీకి చిన్న చిన్న రిపేర్లు చేయించబట్నాడు. అరుగుల మింద నేల పగులిచ్చింటే ప్లాస్టరింగు చేయిచ్చినాడు. ముందు పక్క కాళీ స్థలములో గుంతలన్నీ మొరుసుతో పూడ్పించినాడు.
పెయింటింగు జేసేటోల్లను పిలిపించి మొత్తం బిల్డింగుకు రంగులు వేయించినాడు. ఫంక్షను పది రోజుల్లో కొచ్చినాది. మధ్యలో నరసింహ రెడ్డి, రుక్మిణి వచ్చి లిస్టులో ఉన్న వాండ్లందరికీ ఫోన్లు చేసి విషయం చెప్పి, తప్పకుండా రావాలని పిలిచినారు. అందరూ వస్తామని బదులిచ్చినారు.
రుక్మాంగద రెడ్డి కేశవరెడ్డిని అనంతపురానికి పంపించి, పద్మనాభయ్య స్వామిని స్వయముగా పిలిచి రమ్మని చెప్పినాడు. ఆయన శానా సంతోషించి “తప్పక వస్తానురా, ఒక్కసారి పెదరెడ్డికి ఫోను కలుపు” అని అడిగినాడు.
“స్వామి, నమస్కారము. అమ్మయ్య వాండ్లు బాగున్నారా? కొడుకు మాదవ యాడ ఉండాడు?”
“రుక్మాంగదా, బాగున్నాము నాయనా. కొడుకుది పెద్ద కథ, పోనులో చెప్పేది కాదు. అక్కడికి వచ్చినపుడు వివరంగా చెబుతాలే. సరే గాని, పెద్ద ఉత్సవము జరిపించుకుంటున్నావు. అక్కడ ఎవరయినా పురోహితుని పిలిపించుకోని, ఆయుష్య హోమము, నవగ్రహశాంతి, ఏకాదశరుద్రాభిషేకము చేయించుకో నాయనా. నీ కుటుంబానికి మంచి జరుగుతుంది.”
“తప్పకుండా చేయిస్తాను సామీ. అట్నే అందరు బాగుండాలని గూడ యాదన్న క్రతువు చేయించాలని అనుకుంటున్నాను.”
“అది చాలా గొప్ప సంకల్పము నాయనా. విశ్వకల్యాణము కొరకు చేసేవి ఎంతో మహిమ గలవి”
“సామీ, ఎవరో ఎందుకు, మీరే వచ్చి జరిపిస్తే మాకు బాగుంటుంది. కాదనకుండ రావాల మీరు.”
“సరే. సొంత ఊరిని చూసినట్లుంటుంది. మీ కార్యక్రమము చేయించినట్లు ఉంటుంది. జాగ్రత్తగా విను. లోకక్షేమము కోసరము మహాసుదర్శన యాగము చేయడం అత్యంత శ్రేయస్కరము. మహావిష్ణువు దాని వలన సంప్రీతుడై ప్రజలను చల్లగా చూస్తాడు. ముందు నేను చెప్పినవి కూడా చేద్దాము. సుదర్శనయాగానికి ప్రత్యేకముగా యాగశాల ఏర్పాటు చేయవలె. హోమకుండము ఇటుకలతో కట్టించవలె. పదకొండుమంది రుత్విక్కులు అవసరము. 11 వేల జపము, దానిలో దశాంశము – 11 వందలు హవనము చేయవలె. మొత్తం మూడు రోజులు కార్యక్రమము. గత నెలలో చిక్కబళ్లాపురలో ఒక శ్రేష్ఠిగారు చేయించినారు మాతో.”
“అట్నే సామీ, రుత్విక్కులను గూడ దయచేసి మీరే తెచ్చుకోండి.”
“అంతే మరి! మా వాండ్లే ఒక బృందమున్నారు. మాకు బస ఏర్పాటు చేస్తే చాలు, మాకు మడిగా వండటానికి వంటబ్రాహ్మలు కూడ మాతో వస్తారు. మీ పెండ్లిరోజు ఎప్పుడురా?”
“జూన్ 23 న సామీ.”
“గట్టిగా పదిరోజులుంది. మామూలుగా అయితే ఇంత తక్కువ వ్యవధిలో ఒప్పుకోము. మన బొమ్మిరెడ్డిపల్లి మీదున్న అభిమానము కొద్దీ..”
“నాకు తెలియదా సామీ! అంతా మా అదృష్టము!”
“సరే మేము ఇరవై ఒకటి సాయంత్రము అక్కడికి చేరుకుంటాము. నాకు కారున్నది కాని బ్రాహ్మలకు ఏదైనా వాహనము ఏర్పాటు చేయండి.”
“తప్పకుండా సామి”
“ఇరవై రెండు అంతా ఏర్పాట్లు చేసుకుంటాము. 23న పూర్ణాహుతి.”
“సామీ, బీదోండ్లకు అన్నదానము?”
“అది ఇరవై మూడునే చేయండి.”
“సామీ, సెలవు. ఉందునా మరి.”
***
హైదరాబాదు నుంచి అందరూ పద్దెనిమిదో తేదీనే కర్నూలు చేరుకున్నారు. పిలిచిన వాండ్లకు బస కర్నూలులో ఇరవై రూములు బుక్ చేసినారు, మార్య ఇన్ హోటల్‍లో! ఎందుకైనా మంచిదని నాలుగయిదు రూములు ఎక్కువే తీసుకున్నారు. పంతొమ్మిదిన పొద్దున్నే బయలుదేరి బొమ్మిరెడ్డిపల్లె చేరుకున్నారు.
పద్మనాభయ్య స్వామి మీనాక్షమ్మను గూడ వెంటబెట్టుకొని ఇరవై సాయంత్రము వచ్చినాడు. రుత్వికులు అందరూ ఒక మినీ బస్సులో వచ్చినారు. వంట బ్రాహ్మలు వంటపాత్రలతో సహా దాంట్లోనే వచ్చినారు.
రాములవారి దేవళం పునరుద్ధరణ కూడ పూర్తయినాది. అమకతాడు గ్రామానికి చెందిన పేరిశాస్త్రి అనే బ్రాహ్మడు పూజారిగా చేరినాడు. ఆయనకు నెలకు ఐదు వేలు జీతము. దేవళం వెనక రెండు రూము లేసి ఇచ్చినారు. గుడిమాన్యము శుభ్రము చేయించి మానుకింది మద్దయ్యకు గుత్తకిచ్చినారు. ఆ గుత్త డబ్బులు పూజారికే.
పద్మనాభయ్య వాండ్లకు మహాడీలోని పెద్ద హాలులో బస. జంపఖానాలు పరిచినారు. వంటవాండ్లు గాడిపొయ్యి లాంటి పాత పద్ధతులు ఎప్పుడో వదిలేసినారు. గ్యాస్ స్టవ్ పెద్దది తెచ్చుకున్నారు చెట్టు కింద పందిళ్ళు వేసి యాగశాల తయారు చేసినారు. హోమగుండము కట్టినారు .గ్రహశాంతి, ఆయుష్య హోమము, రుద్రాభిషేకము దీనికది సపరేటు పందిరి.
(ముగింపు వచ్చే వారం)