Site icon Sanchika

మహాప్రవాహం!-5

[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘మహాప్రవాహం!’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[మంగలి శరభయ్య పొద్దున్నే నిద్ర లేస్తాడు. రెండు చేతులు రుద్దుకుని, అరచేతుల్లో ‘శ్రీరామ’ చుట్టుకుని కండ్ల కద్దుకుంటాడు. వాళ్ళ ఇల్లు చాలా చిన్నది. ఊరి చివరకి వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకుని, వాగులో స్నానం చేసి, సూర్యభగవానుడికి దండం పెట్టుకుని ఇంటికి బయల్దేరుతాడు. దారిలో తిరుపాలు హోటలు దగ్గర ఆగి బెల్లం కాఫీ తాగుతాడు. తిరుపాలు భార్య రాజమ్మ – కాసేపు ఉంటే ఉగ్గానీ బజ్జీ సిద్ధమవుతాయి, తిని వెళ్ళమంటుంది. పొద్దున్నే తింటే, పని చేయలేనని, మళ్ళీ వస్తానని, తన వాటా పక్కకి పెట్టి ఉంచమని చెప్తాడు. ఇంటికి వెళ్ళి తన సామాన్లు అన్నీ తీసుకుని బయల్దేరుతాడు. అప్పటికింకా మంగలి షాపులు రాలేదు బొమ్మిరెడ్డిపల్లెలో. ఊరి కంతటికి శరభయ్యే మంగలాయన. పెద్ద వీధిలో నడుస్తూంటే, సంజన్న గౌడ్ పిలిచి, గడ్డం చేయించుకుంటాడు. అతనిచ్చిన రూపాయి తీసుకుని అక్కడ్నించి కదుల్తాడు. కిరాణా అంగడిలో ఉన్న రామానుజ శెట్టి – తన కొడుక్కి క్రాఫ్ చెయ్యాలంటూ పిలుస్తాడు. అంగడి వెనకే ఇల్లు. వెనక దొడ్లోకి వెళ్తాడు శరభయ్య. శెట్టి భార్య కొడుకుని తీసుకువచ్చి శరభయ్య ముందు కూర్చోబెడుతుంది. ఆ పిల్లాడు శరభయ్యను ముప్పతిప్పలు పెట్టి, మొత్తానికి క్రాఫ్ చేయించుకుంటాడు. శెట్టి అర్ధ రూపాయి ఇవ్వబోతే, గడ్డం చేస్తేనే రూపాయి ఇస్తున్నారని, చెప్పి, డబ్బు వద్దు, నాకు సరుకులియ్యి అంటూ తనకి కావల్సినవి చెప్తాడు. శెట్టి లెక్కలేసుకుని, అవన్నీ ఇస్తే ఐదు రూపాయలవుతుందని గ్రహించి, సరేనని వచ్చేవారం వచ్చి తనకు క్రాఫు, గడ్డం చేయాలంతాడు. ఇలా రెండు మూడు చోట్ల గడ్డాలు చేసి, ఓ పాపకి గుండు చేసి ఐదారు రూపాయలు సంపాదిస్తాడు. తిరుపాలు హోటల్లో ఉగ్గాని బజ్జీ తిని, పెండ్లానికి, కొడుక్కు రెండు పొట్లాలు కట్టించుకుని యిల్లు చేరుతాడు. బొమ్మిరెడ్డి పల్లె లోని ఒకే ఒక్క రెండంతస్తుల మహాడీ రుక్మాంగద రెడ్డిది. ఆయన పడసాలలో ఉయ్యాల బల్లలో కూర్చుని రేడియోలో వార్తలు వింటూంటాడు. ఇంతలో అతని అన్న కొడుకు కేశవ రెడ్డి వస్తాడు. లోపలికి పోదాం చిన్నాయనా అని పక్క గదిలోకి తీసుకు వెళ్తాడు. టిఫిన్ చేశావా అని అడిగితే, చేయలేదు, నాన్న ముఖ్యమైన విషయం మీద పంపించాడు అంటాడు కేశవ. తమ ఇద్దరికీ టిఫిన్లు పంపమని కబురుపెడతాడు రెడ్డి. ఇక చదవండి.]

రెడ్డెమ్మ రూము లోనికి వచ్చినది. గద్దువాల నేత చీర కట్టుకున్నాది. మనిసి నిండుగా కలకలలాడుతుండాది నుదుటన ఎర్రని కుంకుమ పెట్టుకుని ఉండాది. మెడలో పగడాల దండ, తాలి బొట్టు చెయిను ఉండాయి. ఒక్కో సేతికి ఎనిమిది బంగారు గాజు లేసుకున్నాది.

“ఏం నాయినా? ఎంతసేపయినాది వచ్చి? అందరు బాగుండారా?” అనడిగినాది.

కేశవ లేచి నిలబడి, “అందరం బాగుండాం పిన్నమ్మా” అన్నాడు.

“వంటామెతో టిపను బంపిచా ఉండు” అని లోపలికి బోయినాది రెడ్డెమ్మ.

ఐదు నిమిషాలలో రెండు వెండిపేట్లలో జూన్న రొట్టెలు, పొట్టేలు మాంసం తీసుకుని వచ్చినాది వంటాయమ్మ. జాగర్తగా బల్ల మీద ప్లేట్లుబెట్టి, మల్లా బోయి స్టీలు జగ్గుతో నీల్లు, లోటాలు దెచ్చినాది.

“మ్మేవ్, ఉల్లిగడ్డలు త్యాపో నంచుకున్నేకి” అన్నాడు రెడ్డి.

“అట్నీ రెడ్డీ!” అని అవి గూడ్క దెచ్చి పెట్టినాదాయమ్మ.

ఇద్దురూ టిపన్ చేయడం పూర్తి కాంగనే, వెండి గ్లాసులతో కాపీ వచ్చినాది. ఇద్దురూ తాగినారు. పనిమనిషి వచ్చి ప్లేట్లు గ్లాసులు అన్నీ తీసేసి పోయేంతవరకు మౌనంగా ఉండినారు.

“ఇప్పుడు సెప్పు”

“ఆ సంజీవ రెడ్డి రేపు చిన్నటేకూరు యాదో పెండ్లికి బోతాడంట. పెండ్లి తెలవారు జాము నంట. బోజనాలు రాత్రి. పెండ్లి చూసుకొని అల్లుగుండు మీదుగా తొగర్చేటికి వస్తాడంట!” అన్నాడు కేశవరెడ్డి గొంతు తగ్గించి.

“ఎంబడి ఎవరెవరుంటారో కనుక్కున్నావా?”

“జీపులో ఒక జీతగాడుంటాడంట. పెండ్లాం పిల్లలు ఎవరూ ఉండరంట”

“ఆ నా కొడుకును ఏసెయ్యనీకె ఇదీ మంచి చాన్సు! నాయనకు జెప్పినావా?”

“ఆ! అందుకే నీ దగ్గరికి బోయి రమ్మన్నాడు”

కుంచేపు ఆలోశనలో మునిగినాడు రుక్మాంగద రెడ్డి. బయట జీతగాన్ని పిలిసి, “సుంకరి మద్దయ్యను నేను బిలుస్తాండానని బెరీన తోలుకురా” అని చెప్పినాడు.

“మన రమణరెడ్డిని ఆ నాయండ్లు సంపి అప్పుడే ఆరు నెల్లు ఐపాయె. ఇన్నాల్లకు ఆ సంజీవ రెడ్డిని మట్టుబెట్టనీకె అదును దొరికినాది.”

రమణారెడ్డి రుక్మాంగద రెడ్డికి తమ్ముడు. ఆ యప్పను గోరంట్ల పసరాల ఆర్నాలలో బాంబులేసి సంపినారు సంజీవ రెడ్డి మనుసులు.

“పాపం సుజాతమ్మ పిన్నమ్మను జూస్తే నా కడుపులో దేవినట్లయితాది సిన్నాయనా!” అన్నాడు కేశవ రెడ్డి. సుజాతమ్మ రమణారెడ్డి బార్య.

“ఆ సంజీవ రెడ్డి పెండ్లాం ముండమోస్తేగాని నా తమ్ముని ఆత్మ శాంతించదు రా కేశవా!” అన్నాడు రుక్మాంగద రెడ్డి.

ఇంతలో సుంకరి మద్దయ్య వచ్చినాడు. వాకిలి కాడ్నే నిలబడి “నాయినా, రమ్మన్యావంట!” అన్నాడు. రెడ్లను ‘నాయినా’ అని బిలుస్తారు. తండ్రిలాంటి వాడని అర్థం. పేరుతో గూడ్క కలిపి, రామిరెడ్డి నాయిన, సుంకిరెడ్డి నాయిన.. ఇలా అంటారు. ఏమాటకామాట. రెడ్లు గూడ వాండ్లను ఆశ్రయించుకున్నోల్లను కన్నబిడ్డల్లెక్క జూసుకుంటారు. ఒకేల వాండ్ల కోసం సచ్చిపోతే, వాండ్ల సంసారాలను కొనా మొదులు సాకుతారు.

“లోనకి రా” అన్నాడు రెడ్డి. ఆ యప్పవచ్చి ఇద్దరికి మొక్క కింద కూసున్నాడు. మన్సి శావ బారిన తుమ్మమొద్దు లెక్కఉండాడు. మోకాల్లు దాటిన సల్యాడం, పైన సేతులు బనియను ఏసుకొని ఉండాడాయప్ప. ముకం మీద అమ్మవారు పోసిన మచ్చలుండాయి. ఎడమ సెవి సగం తెగిపోయి ఉండాది. గడ్డం బిరుసుగా, సగం పెరిగి ఉండాది. తలకు చుట్టుకున్న తువ్వాలు తీసి ఒళ్లోన పెట్టుకున్నాడు. రుక్మాంగద రెడ్డికి నమ్మిన బంటు మద్దయ్య.

సెప్పమన్నట్టు కేశవ రెడ్డి పక్క జూసినాడు. ఆ యప్ప గొంతు తగ్గించి “సంజీవ రెడ్డి గాడు..” అని మొదులు బెట్టి ఇసయమంతా ఇవరించినాడు.

“యాడ కాపుగాస్తే బాగుంటదో ఆలోశన జెయ్యండి. నా కొడుకు ఈతూరి బ్రతకగూడ్దు.” అన్నాడు రుక్మాంగద రెడ్డి.

మద్దయ్య తన ప్లాను వాండ్ల కిట్లా చెప్పినాడు

“సిన్నటేకూరు నుండి అల్లుగుండు వరకు మెయిన్ రోడ్డు గాబట్టి ఆడ ఏమీ సెయ్యనికె గాదు. అల్లుగుండు నుంచి తొగర్చేటికి పోయే దావతోనే ఏదైనా..” అని కుంచేపు నిలబడె (ఆగడం).

“తొగర్చేడు ఇంకా నాలుగు మైల్లుందనగా మన వంక వస్తాది నాయనా. అది తెల్లవారు జాము కాబట్టి ఇంకా సీకటుంటాంది. ఇసకలోన ఎట్టైనా గాని జీపు స్లోగా బోవాల్సిందే. నేను, మన మాదిగ మద్దిలేటి వంకలో ముందేబోయి కాసుకునుంటాము. రెండు బాంబు లేచ్చే ఐపాయ.”

“వద్దు! బాంబులు వద్దనేవద్దు. ఆ నా కొడుకును ఎరుకల కొడవండ్ల తోనే నరకాల! కండ కండాలు జెయ్యాల. జీతగాడుంటాడన్నారు కాబట్టి ఇద్దరు సాలరు. మన ఉప్పరి రాజలింగాన్ని కూడ కొండబోండి (తీస్కపోండి). జీతగాడు బయపడి పారిపోతే సరే! వాడుగన ఎదురుమల్లితే వాన్ని గూడ్క ఏసేయండి. పెద్దతలకాయ మాత్రం తప్పించుకోకూడదు.”

“నేను గూడ్క బోతా సిన్నాయనా!” అన్నాడు కేశవరెడ్డి.

“ఎందుకు? ఏమొద్దు! మన మద్దయ్య ఉంటాడు సాలు! ఒరే! మిగతా యిద్దరికీ నేను పిలిపించి సెప్పాల్నా, నీవు చెప్తావా?”

“అగత్యం లేదు నాయినా, నేను జూస్కుంటాంలే!”

రుక్మాంగద రెడ్డి జేబు లోనుంచి నూర్రూపాయల కట్ట దీసి మద్దయ్యకిచ్చినాడు. ఆ యప్ప దానిని సల్యాడం జేబులో పెట్టుకున్నాడు “పనయింతర్వాత మిగతాది!” అన్నాడు రెడ్డి. ఆయన లెక్క యియ్యకపోయినా మద్దయ్య అడిగేటోడు గాదు. ఇద్దరికి మొక్కి ఎల్లిపోయినాడు.

“నేను గూడ్క పోయొస్త మల్ల!” అన్నాడు కేశవ రెడ్డి.

“కూసో పోదువు” అన్నాడు సిన్నాయన. “ఈ మాదిగ మద్దిలేటి ఉండాడే, వాండ్ల నాయిన ఉరుకుందప్ప గూడ్క మన కాడనే ఉండేటోడు. ఒకసారి ఏమయినాదంటే..”

ఆ యప్ప మొగంలో ఒక ఎలుగు. “మా నాయిన సెప్తాండె. ఇరవై సంవచ్చరాల కిందటి మాట. ఈ ఉరుకుందప్ప పెండ్లి జేసుకుంటుండాడంట. బండల సేనుకు గొర్రు తోలలేదంట పెండ్లికొడుకు. నాయినకు కోపమువచ్చి, ఆ యప్పను పిలువనంపితే, ‘నాయినా, పెండ్లి అయితూండాది మారెమ్మ దేవులంలో’ అని చెప్పినారంట.

నాయిన నరసింహుని లెక్క బోయి పెండ్లి పీటల మింద కూకున్న ఉరుకుందప్పను దిగనూకి, ‘నా కొడకా, నా సేనుకు గొర్రు దోలటం కంటే నీకు నీ పెండ్లి ముక్యమా రా’ అని తన్నుకుంట మన మడికి దీసుకొచ్చినాడంట. ఆడగాని, ఊర్లోగాని నరమానవుడెవ్వడు నోరెత్త లేదంట. అమ్మ జూసి, ‘పాపం పెండ్లికొడుకును అట్టకొట్టగాకు’ అని నచ్చచెప్పి పంపితే, పోయి పెండ్లి చేసుకున్నాడంట వాడు. అట్లుండేవి ఆ రోజులు.”

“ఇప్పుడయినా మనల్ను గాదని ఏం జేస్తార్లే సిన్నాయన!” అన్నాడు కేశవ రెడ్డి.

“ఔననుకో, కాని కాలాలు మారుతుండ్ల్యా! మన పార్టీ అధికారంలో ఉంటే ఒక రకం, ల్యాకపోతే ఒక రకం!”

***

కొమ్మిరెడ్డిపల్లెలో మాదిగ గేరి శానామటుకు కొట్టాలే ఉండాయి. కొన్నిమాత్రం చవిటి మట్టమిద్దెలు. మాదిగ గేరికి పోవాలంటే ఎరుకలోల్ల యిండ్లను దాటుకొని పోవాల. ఎరుకలోల్లు ఈత బర్రెలు సన్నగా శీల్చి బుట్టలు, గంపలు, జల్లలు అల్లుతారు. పందులు పెంచుతారు. ఇండ్ల ముందు పందులు ఉండనికె దడి గట్టిన దొడ్లుండాయి. ఎరుకలోల్ల ఇండ్లకు మాదిగ గేరికి మజ్జ సారాయంగడుందాది.

దావీదు సారాయంగడి కాడకొచ్చినాడు. పగలంతా గెడం కొట్టి, కుంట సుబ్బారెడ్డి సేను దున్నినాడు. ఆ యప్ప కాడనే జీతగాడు దావీదు. సారాయంగడి కాడ పగలంతా కాయకష్టం చేసి ఒల్లు నొప్పులు తగ్గనీకె నాలుగు డ్రాములు సారాయి తాగనీక ఒచ్చినోల్లే ఉండారు. ఆ అంగడి కూడ పెద్ద కొట్టమే. దాన్ని నడిపే ఎంకటయ్య ఒక గోనె సంచీ పర్సుకోని వాకిలి కాడనే కూర్సుని ఉంటాడు. లోపల ఆయన పెండ్లాము సుంకమ్మ వచ్చినోండ్లకు సారాయి బోసి, ఎంత తీసుకోవాల్నో మొగునికి గట్టిగా అరిసి సెబుతూండాది. కొందరు డబ్బులు, కొందరు జొన్నలు, కొర్రలు, కందులు ఎంకటయ్య కిస్తాండారు. కొందరు “ఇయ్యాల నాకాడ ఏం లేవు ఎంకటయ్య మామా! రేపు తెచ్చిచ్చా, సారాయి పోయించు” అని ఆ యప్పను బంగపోతుండారు (బ్రతిమిలాడటం).

దావీదు కుంటి సుబ్బారెడ్డి కాడ జీతానికి పనిచేస్తాడు. సంమచ్చరానికి నాలుగు గోనె సంచుల వడ్లు, అరగోనె కందులు కొలుచ్చాడు సుబ్బారెడ్డి. అవిగాక సాలుకు ఆరు నూర్ల లెక్క, ఒక జాడు (కంబడి), రెండు జతల చెప్పులు, దిన రోజు ఒక బీడీ కట్ట ఇస్తాడు. పైటాల బువ్వ కూడ రెడ్డమ్మే సద్ది గట్టిచ్చాది.

దావీదుకు ఎంకటయ్య కాడ వర్తనుండాది. అంటే దిన కాతా అన్నమాట. ఆ యప్పను జూసి ఎంకటయ్య “ఏం రా తమ్ముడూ! ఇయ్యాల బెరీన పని అయిపోయినట్టుండాదే!” అని పలకరిచ్చినాడు.

“మా రెడ్డెమ్మ లేదులే ఎంకటన్నా! వాండ్ల పుట్టింటికి బోయినాది. ఆ యమ్మ ఉంటే సేను కాన్నించి వచ్చిన యాల నుండి ఏదో పని సెపుతానే ఉంటాది, తెమలనియ్యదు. అందుకే బెరినా రావడమాయ” అన్నాడు దావీదు. ఆడనే గోనెసంచి మీద కూసున్నాడు. సుంకులమ్మ గలాసు తోన సారాయి దెచ్చి ఆ యప్పకిచ్చింది. దావీదు జూచి నవ్వి, “మా దావీదు మరిది ముకం ఇయ్యాల త్యాటగా ఉండాదే, రెడ్డెమ్మ ఊరికి బోయినాదా?” అనడిగినాది.

దావీదు గుడ్క నవ్వి, “ఔమ్మే!” అన్నాడు. సారాయంగడి బైట సీకుల కాలుస్తున్న గిడ్డయ్యకు ఇనపడేటట్టు “ఒరే, గిడ్డిగా, నాలుగు సీకులు తెచ్చియ్యి!” అని అరిసినాడు.

దావీదు మితంగానే తాగుతాడు. మత్తు మిడిమ్యాలమైపోయి, ఇంటికి చేరినంక పెండ్లాన్ని పట్టుకోని తన్నడం, అరచడం – ఇట్లాంటి పనులేవీ తీయడాయప్ప.

దావీదు సారాతంగడి కాడ్నించి ఇంటికి పోబట్నాడు. దావలో రేతిరి ఒండుకోనికె ఎండుశ్యాపలు రెండు రూపాయలకు కొనుక్కున్నాడు.

ఎరుకుల్ల యిండ్లు దాటుతాంటే మారెన్న ఇంటి ముందర పందిని గోచ్చాండారు. ‘యాదన్న దూము (రోగం) దగిలినాదేమో అందుకే కోసుకుంటుండారు’ అని అనుకున్నాడు.

మారెన్న తమ్ముడు బీరప్ప దావీదును జూసి, “దావీదు మామా! పంది మాంసం కుంచేపుట్లో వంతు లేచ్చాం. నీవూ ఒక వంతు తీస్కపోదువుగాని రా మల్ల!” అని అరిసినాడు. ఆడ ఉన్న ఎరుకలోల్లందరూ గట్టిగా నవ్వినారు. దావీదు కూడ నవ్వి, “రే బీరిగా, నీ కుశాల (చురుకుదనం) అంతా నా మీద జూపిచ్చనీకె గాకపోతే మేం పంది మాంసం యానాడయినా తిన్నామా! మీరు కానియ్యండి ఇలే!” అన్నాడు. ‘ఇలే!’ అన్న మాట పెద్దోల్లు సిన్నోల్లను ప్రేమతోన పిలిచే పిలుపు. కర్నూలు జిల్లా లోనే ఈ మాట ఎక్కువ వాడుక లోన ఉండాది.

మాలోల్లు, మాదిగోల్లు అంతా హరిజనులైనా, శానా తేడాలుండాయి. మాలోల్లలో వైష్ణవ మతం తీసుకున్నోల్లను మాలదాసరలోల్లంటారు. వాండ్లు హరి భక్తులు. నీసు తినరని చెబుతారు. ధనుర్మాసం వంటి ప్రత్యేక దినాలలో వాండ్లు తిరు నామము దరించి, జుట్టు బాగ ముడేసి, కాల్లకు గజ్జెలు, సేతిలో చిరతలు దరించి, బిచ్చాటన జేస్తారు. మంచి కీర్తనలు పాడడం కూడ వాండ్లకు వచ్చును. సినిమాల్లోని భక్తి పాటలు గుడ్క పాడతారు.  చిత్తూరు నాగయ్య పాటలు ‘మన్నన చేయవే మనసా! ఆపన్నశరణ్యుని హరినీ’, సక్కుబాయి సినిమా లోని ‘జయపాండురంగ ప్రభో విఠలా! జగదాధారాజయవిఠలా’ మాదిరి పాటలు పాడతారు.

వాండ్ల గొంతులు కూడ ఇననీకె బాగుంటాయి. మాదిగోల్లలో కూడ డొక్కలోల్లు, బైనేనోల్లు ఇట్టా ఉంటారు. బైనీని మాదిగోల్లంటే తప్పెట గొట్టడంలో శానా నైపున్యం గలిగినోల్లు. సాయబులు పీర్ల పండగ జేసుకున్నపుడు గుండం తొక్కుతారు. అప్పుడు వీండ్లే తప్పెట (డప్పు) గొడతారు. హిందువుల పండగల్ల, తిర్నాలు, దేవుడు రతం మింద ఊరేగేటప్పుడు గూడ్క వీండ్ల తప్పెట ఉండాల్సిందే.

ఇంక డొక్కలోల్లంటే పెద్ద జంతువులు సచ్చిపోతే, ఆవులు, ఎద్దులు, ఎనుములు అట్లాంటివి; వీండ్లు తీసుకుబోయి చర్మాలు వలిచి ఆ మాంసాన్ని తింటారు. దాన్ని కర్నూలు జిల్లాలో ‘పెద్ద కూర’ అంటారు. ఈ ఇవరణ అంతా కర్నూలు జిల్లాకే, అందునా కొన్ని తాలూకాలకే పరిమితం.

మామూలు మాదిగోల్లు పెద్ద కూర తినరు. మాల మాదిగలకు పెండ్లిండ్లు జరగవు. మల్ల వీండ్లల్ల శానామంది కిరస్తానీ మతంలోకి మారి, కిరస్తానీ పేర్లు పెట్టుకుంటారు. చర్చికి పోతారు. కాని ప్రభుత్వ వ్యవహారాల్లో మటుకు హిందువుల పేర్లతో చెలామని అయితుంటారు. ఎందుకంటె క్రైస్తవులకు సర్కారు మినగాయింపులుండవు గదా! మాదిగ, బైనేని, డొక్కలి అందరూ మాదిగోళ్లయినా వాండ్లల్లో ఒకరికొకరికి పెండ్లిండ్లు జేసుకోరు. పోనీ అందరూ ఒకే దేవున్ని కొలుస్తారా అంటే మల్లా రెండు చర్చిలు. రెండు రకాలు. బొమ్మిరెడ్డిపల్లెలో చర్చి లేదు. పాస్టరొకాయన ఉళింద కొండ నుంచొచ్చి ప్రతి ఆదివారం పార్తన జాయించిపోతాడంతే.

‘చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః’ అని గీతలో కిస్న పరమాత్ముడు చెప్పినాడు గానీ, నాలుగు కులాల్లో ఎన్నిరకాలుండాయి? ‘గుణాన్ని బట్టి, చేసే పనిని బట్టి..’ అన్నాడు దేవుడు. అది త్రేతాయుగం, ద్వాపర యుగాల్లో ఉండేదేమో గానీ, గుణాన్ని బట్టి కులం యాడుంటాంది. అన్ని కులాల్లో మంచోల్లుంటారు, సెడ్డోల్లుంటారు. బాపనోల్లు కత్తి బట్టి యుద్ధాలు చేసి రాజ్యాలేలినోరు లేరా? శానామంది రెడ్లు తర్వాత్తర్వాత మిటాయి దుకానాలు బెట్టి పేరుకెక్కలేదా? కోమటోల్లు రాజకీయల్లోని రానించలేదా? శూద్దరోల్లు బాగా సదువుకొని పెద్ద పదవులు పొందలేదా? కాబట్టి పలాన కులమోల్లు పలాన పనే జేయాలనేది కూడ ఈ కాలంలో కుదరదు.

బాపనోల్లనే తీసుకుంటే వాండ్లలో ఉన్నన్ని రకాలు యాడా ఉండవు. కాలాన్ని బట్టి మారుతాండారుగాని, మొన్నటివరకు మెలక నాడు, తెలగాణ్య, వెలనాడు, ద్రావిడ, నియోగి, నందవరీకులు ఇట్లా వాండ్లు వేరే శాక వాండ్లను పెండ్లిండ్లు జేసుకోరు. ఒరిస్సా, బెంగాలు ప్రాంతాలలో బ్యాపనోల్లు శాపలు గుడ్క తింటారంట. వాండ్లకు తప్పగాదంట.

ఇంక కోంటోల్లు గూడ్క రకాలుండారు. ఆర్యవైశ్యులు నీసు దినీరు. ఆచారం, సంప్రదాయాలు బాపనోల్ల మాదిరే పాటిస్తారు. ఉత్తరాంద్ర జిల్లాలో కలింగ కోమట్లు, గోరి కోమట్లు అని వుంటారు. వాండ్లు నీసు తింటారని చెబుతారు.

సాయబులన్నా ఒక్కటిగా ఉంటారా అంటే అదీ లేదు. ఏరే దేశాలలో, అందరూ సాయిబులున్నా, షియ అని సున్ని అని భేదాలతో కొట్టుకొంటుంటారు. కర్నూలు జిల్లాలో దూదేకులోల్లని ఒక కులముంటాది. వాండ్ల అసలు వృత్తి ఇంటింటికి బోయి, దూదిని చేతిమిసను తోన ఏకి, దూది పరుపులు, దిండ్లు కుడ్తారు. దాంతోనే బతకలేరు కాబట్టి, కూలీ పనులు చేస్తారు. సేద్యాలు చేస్తారు. వాండ్ల పేర్లు అన్నీ తురకోల్ల పేర్లే. రహము, సులేమాను, వలీ – ఇట్టా అన్నమాట. కానీ వాండ్లు మహమ్మదీయ మతాన్ని ఎక్కువగా పాటించినట్టు కనపడదు. మామూలుగా తురకొల్లు మాట్లాడే తెలుగు ఒక యాసగా ఉంటాది. ఉర్దూ ప్రభావం దాని మింద ఉంటాది.

కాని, దూదేకులోల్లు మాట్లాడే తెలుగు అట్టా ఉండదు. వాండ్లు హిందువుల పండుగలు కూడ చేసుకుంటారు. బ్రామ్మని దగ్గరికి పోయి మంచి రోజులు, మూర్తాలు గూడ్క పెట్టించుకుంటారు.

ఇంక తిండి సంగతికొస్తే, మొదట్నించి యాదలవాటయితే అదే నచ్చుతాది. అంత మాత్రాన వేరే రకం తిండి తినేటోల్లను అసయ్యించుకోకూడదు. అది తప్పు. “మేము పలానా కూరగాయ తినం! ఆ వాసన మాకు పడదు” అని గర్వంగా చెప్పుకుంటుంటారు. బాపనోల్లు యిస్టంగా తినే ఇంగవ వాసన సూద్రోల్లకు పడదు మరి.

అన్ని మతాల్లో దేవుండ్లు దేవతల్లో శానామంది మాంసం తినేవాండ్లే. అట్లని వాండ్లు దేవుండ్లుగా కుండా బోయినారా? కన్నప్ప అనే భక్తుడు శివునికి మాంసం తుంటలు నైవేద్దెం బెట్టి “తినవా కరుకుట్లు, పార్వతీశ్వర చెపుమా!” అంటే ఆ యప్ప తినలేదా!

సృష్టిలో ఎన్నోరకాల తిండి పదార్తాలు సృష్టించబడినాయి, ఎవరి ఇష్టం కొద్ది వాండ్లు తినాల అంతే! వేరే తిండి తినేట్లోల్లను ఇమర్సించకూడదు.

కులం కూడ అంతే. బారతదేశంలో పేర్లు కూడ బయటికి రాని శానా కులాలుండాయంట! ఏ కులమూ గొప్పది కాదు. ఏ కులమూ తక్కువది కాదు. దేని పద్దతి దానిది! కులానికి, మతానికి అతీతంగ అందర్ని సమానంగ జూసే పెద్ద మనుసు ఎవరికుంటాదో వారే యోగులు! ‘సర్వత్ర సమదర్శినః’ అని కిస్నుడే గద అన్నాడు మల్ల! దేవుని దృస్టిలో ప్యాడలో లుకలుకలాడే ప్యాడ పురుగైనా, సరస్సుతో ఈదులాడే రాజహంసైనా ఒకటేనంట! రెండింటిలో ఆయనే ఉంటాడు గద!

కత దావీదును దాటుకొని యాటికే బోయినాది. సరే, దావీదు తన గుడిసెకు బోయి ఎండు సేపల పొట్లం పెండ్లాం చేతి కిచ్చినాడు. ఆ యమ్మ పేరు మార్తమ్మ.

“ఎండు శాపల్చెచ్చినావు బాగానే ఉందిగాని, ఈ రోన్ని (కొంచెం) ఎవురి ముక్కు కొచ్చాయి” అనిందాయమ్మ.

“అవిట్ని అట్టట్టనే ఏపుడు చేస్తే సాలవుగాని, కంది బ్యాడలు ఉడికించి, పప్పుశారు జేసి దాంట్లో ఎయ్యి. ‘పిల్ల మామా’ అనకపోతే సూడు!” అన్నాడు మొగుడు.

శానా నవ్వు వచ్చినాది మార్తమ్మకు. “యా పిల్ల! యా మామ!” అనీ మల్లీ మల్లీ నవ్వినాది.

‘నీ గ్యానం అంతమటుకుండాది. ‘పిల్ల మామా’ అంటాదంటే శానా బాగుంటాదని అర్థం” అన్నాడు దావీదు.

“సర్లె! కంది బ్యాడలు గుప్పెడే ఉండాయి. సరిపోతాయిలే. మల్ల కొరబియ్యం జేద్దునా, జొన్న సంగటి జేద్దునా?”

“యాదయిన పరవాల్యామ్మే! పప్పుశారు ముక్యం. రెండు మూడు రోజుల్లో మాయమ్మ మేరీ వస్తాది శనాదివారాలకు. నా తల్లికి మంచి గౌన్లు కొనియ్యాల. మా రెడ్డిని యాభై రూపాయలడిగినా. మాయమ్మకు సన్నకారాలంటే యిస్టం. రెడ్డి డబ్బులిచ్చినంక శనగపిండి, నూనె తెస్తా. చేసి పెట్టు, తింటాంది!”

“మాయత్త మనకు బిడ్డగా పుట్టి సచ్చిగుడ్క సాదించబట్టె. ముసిల్ది పోయేంతవరకు ‘నోరు సప్పగుండింది అది సెయ్యి, ఇది సెయ్యి’ అని సతాయిస్తాండె. ఇప్పుడు ఈయమ్మ వచ్చినప్పుడంతా అట్లే అడుగుతాది” అనింది తల్లి. ఆ యమ్మ గొంతులో అత్త మింద కోపం లేదు బిడ్డ మింద ఇసుగు లేదు. అంతా మురిపెమే. అత్తను మార్తమ్మ జూసుకున్నట్టు యా కోడలు జూసుకోల్యా అని యీ నాటికి మాదిగ గేరంతా సెప్పుకుంటారు.

వీండ్ల బిడ్డ మేరీ కోడుమూరు హరిజన సంచేమ పాటశాలలో ఏడు చదువుతుండాది. ఐదు వరకు బొమ్మిరెడ్డిపల్లె లోనే ఉండే. అయిస్కూలు అటు వెల్దురికి గాని, ఇటు కోడుమూరికి గాని పోవాల. ఉళింద కొండలో అప్పర్ ప్రయిమరీ బడి ఉంది. మల్ల ఎనిమిది తర్వాత ఆలోశనే గదా అని కోడుమూరులో జేర్చినారు. అదీ గాక కోడుమూరులో మార్తమ్మ అన్న డానియల్ కుటుమానం ఉండేది. ఆ యప్ప ఒక బుడ్డల నూనెమిల్లులో పనిజేచ్చాడు. ముక్కో మొగమో నొచ్చినా ఆ యప్ప జూసుకుంటాడని గూడ్క ఆలోశన చేసి ఆడ జేర్చినారు.

(ఇంకా ఉంది)

Exit mobile version