Site icon Sanchika

మహాప్రవాహం!-6

[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘మహాప్రవాహం!’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[రెడ్డమ్మ లోపలికి వచ్చి కేశవని పలకరించి, టిఫిన్లు పంపిస్తానని చెప్పి వెళ్లిపోతుంది. కాసేపటికి వంటావిడ పలహారాలు తెస్తుంది. టిఫిన్ తినీ, కాఫీలు తాగుతారు. పనిమనిషి వచ్చి ప్లేట్లు, గ్లాసులు తీసేవరకూ ఇద్దరూ మౌనంగా ఉంటారు. విషయం చెప్పమని అడిగితే, తన శత్రువు సంజీవ రెడ్డి ఏదో పెళ్ళికి వెళ్తున్నాడని, వెంట ఒక్క జీతగాడు తప్ప ఎవరూ ఉండరని, అతన్ని చంపడానికి ఇంతకంటే మంచి అవకాశం రాదని అంటాడు కేశవ. రుక్మాంగద రెడ్డి తన మనిషిని పంపించి సుంకరి మద్దయ్యను పిలిపిస్తాడు. మద్దయ్య వచ్చకా, అతన్ని కూడా గదిలోకి పిలిచి మంతానాలు చేస్తారు. మద్దయ్య తన ప్లాను చెప్తాడు. సంజీవ రెడ్డి తప్పించుకోకూడదని హెచ్చరించి, సరేనంటాడు రుక్మాంగద రెడ్డి. తానూ కూడా వెళ్తానని కేశవ అంటే, వారిస్తాడాయన. బొమ్మిరెడ్డిపల్లెలో కుంటి సుబ్బారెడ్డి జీతగాడయిన దావీదు పగలంతా సేను దున్ని సాయంత్రానికి సారాయంగడి చేరుతాడు. అతనికి అక్కడ ఖాతా ఉంటుంది. దావీదు మితంగా తాగి దారిలో రెండు రూపాయలకు ఎండు సేపలు కొనుక్కుని ఇంటికి వెళ్తాడు. ఎండు సేపల పొట్లం భార్య మార్తమ్మకి ఇస్తాడు. అవి ఎవరికీ సరిపోవని అంటుందామె. వాటిని వేపుడు చేస్తే చాలవు గానీ, పప్పుచారు చేసి దాంట్లో వెయ్యమంటాడు దావీదు. కంది పప్పు కొంచెమే ఉందని చెప్పి, సరిపోతుందిలే అంటుందామె. వాళ్ళిద్దరూ కాసేపు మాట్లాడుకుంటారు. కోడుమూరులో హరిజన సంక్షేమ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న కూతురు మేరీని తలుచుకుంటారు. ఆ ఊర్లో ఆ పిల్ల మేనమామ ఉంటాడు. ఏదన్నా సమస్య వస్తే ఆయన చూసుకుంటాడని అక్కడ చేర్చారు. ఇక చదవండి.]

[dropcap]గు[/dropcap]డిసె యెనకాతల దడి గట్టిన దొడ్డి ఉండాది. దొడ్లోకి బోయి గాబు లోని నీల్లతో కాల్లుసేతులు కడుక్కున్నాడు దావీదు. గుడిసెలోకి వచ్చి చూరుకు సపోర్టుగా ఉన్న తాటి దూలానికి మేకుగొట్టి పెట్టిన ఏసుక్రీస్తు పొటోకు నమస్కారం చేసుకున్నాడు.

గుడిసె బయట నులక మంచం మీన బొంత పరుసుకొని మోచేయి నెత్తి కింద బెట్టుకొని పండుకున్నాడు. బిడ్డ మతికొచ్చి ఆయను మనసంతా ఆయిగా ఐనాది.

మేరీ శానా తెలివైన పిల్ల. ఇంగ్లీసు వాచకం గుడ్క గడగడ సదివేస్తాది. వాండ్ల వార్డెను, స్కూలు అయ్యవార్లు బాగ మెచ్చుకుంటరా యమ్మిని.

‘మా యమ్మను బాగ సదివించాల. టీచర్నుగాని నర్సును గాని చెయ్యల’ అనుకున్నాడా తండ్రి. ఆ యప్పకు వాటికి మించి పెద్ద ఉద్యోగాలు తెలియవు మరి.

“బువ్వ తిందాం రాయ్యా” అని లోపల్నించి అరిసినాది పెండ్లాము.

“వస్తాందా తాలు (ఆగు)” అని లోపలికి బోయినాడు.

సిల్వరి తట్టలో కొరబియ్యం అన్నం పెట్టి, దాని మీద ఎండు శాపల పప్పుశారు బోసినాది. గుమగుమలాడుతుండాది శారు వాసన.

“మల్ల నీవు?” అన్నాడు మొగుడు.

“నాకింకా ఆకలిగాల్యా. నీవు తిను. పగులంతా కష్టపడి వచ్చినావు” అన్నాదామె. ఆమె గొంతుతో మొగుని మింద ఉన్న ‘ఇదం’తా పలికినాది.

‘నీ నైచికాలు (నాటకాలు) నాదగ్గర పనిజెయ్యవమ్మే! కందిబ్యాడలు గుప్పెడే ఉండాయన్నప్పుడే నాకనుమానం వచ్చినాది. ఏదీ శారు సట్టి చూపించు.”

“ఉంది లేయ్యా! నీకు మారేసినంక గుడ్క యింకా ఉంటాది.”

దావీదు లేసి పొయ్యి మిందున్న సట్టి మూతదీసి జూసినాడు. దాంట్లో అడుక్క రొండు గరిటల శారు మటుకు ఉంది.

ఎనిక్కివచ్చి, “అందుకే నీ మింద నాకు కోపం వచ్చాది. ఉన్నదంతా నాకు బోసి నీవేం తిందామనుకుండావే మూడుగాసుల్దానా?” అని పెండ్లాన్ని తిట్టినాడు.

మార్తమ్మ తల దించుకున్నాది. “పొద్దున్న జేసిన కొరివికారముండాది లేయ్యా” అనింది.

“మ్మేవ్! అదంతా కుదరదు. నీవు మాత్రం కష్టపడల్యా! దినమంతా కంబగిరిరెడ్డి యింటి కాడ యిత్తనం బుడ్డలు గొట్టినావుగదా! నాకేమో పప్పు శారు, నీకు కొరివికారమా!” అంటు మరి కొంచెం అన్నం బెట్టి, తట్టు మిగిలిన శారు గూడ్క పోసినాడు దావీదు.

“దా! ఇద్దరం తిందాం! మిగిలిన అన్నం కొరివికారంతో తిందాం” అని బలవంతంగా ఆమెతో గూడ తినిపించినాడు.

తింటాంటే మార్తమ్మ కండ్లలో నీల్లు!

“పెతిదానికీ ఈ ఏడుపొకటి నేర్చుకున్నావు” అన్నాడు పై తువ్వాలతో ఆమె కండ్లు తుడుస్తూ.

ఆ యమ్మ తడి కండ్లతో సంతోసంగా నవ్వినాది. తాటిదూలమ్మీద కొలువుదీరిన ఏసయ్య ఆ మొగుడు పెండ్లాల సక్యతకు శానా ముచ్చటపడినాడు!

***

మల్లా రొండు పదును వానలు బడినాయి. ‘ముసురు గనబడితే’ బుడ్డలిత్తనం ఎయ్యనికె అదును దాటిపోతాది. రైతులందరూ అటకల మీన్నుంచి గొర్లు దించినారు. వాటికున్న మొన కర్రులను వడ్లొయన కాడ సరిపిచ్చుకున్నారు. ఇత్తనమేసే చెక్క గొట్టాలను, గరాట్లను సుబ్రం జేసుకున్నారు. పద్మనాభయ్య స్వామి కాడికి బోయి ఇత్తనం వేయనీకె పేరు బలాలను బట్టి, మంచి మూర్తాలు చెప్పించుకున్నారు.

ఎర్ర న్యాలలున్నాండ్లందరూ బుడ్డలే ఏస్తారు. ముందుగాల్నే సెరువులోన ఒండ్రు మట్టిని సేన్లకు దోలుకున్నారు. పసరాల ప్యాడనంతా ఎరువు దిబ్బలలో ఏస్తారు. అది బాగా మగ్గి సేనుకు బంగారు మాదిరి ఎరువైతాది. పసరాల మూత్రాలను సాలలోనే ఒక రొచ్చుగుంటలో పోస్తారు. దాన్ని పొద్దున్నే లొట్టి కుండల్లోకి ఎత్తుకోని, ఎరువు దిబ్బతో పోసి వస్తారు. పసరాలు మ్యాత దిన్నాక మిగిలిన శెత్త శెదారమం గూడ్క దిబ్బలోకే బోతాది. అదంతా బాగ శివికి పోయి, రొచ్చులో నాని, ప్యాడలతో కలిసిపోతాది.

బుడ్డలిత్తనం వెయ్యనీకె ముందే ఎరువును సేన్లకు దోల్తారు. ఎరువు, శెరువు మన్ను తోలుకోనీకె ఎద్దుల బండి మింద, బండి పొడుగూత పెద్ద జల్లలు జేపిచ్చుకుంటారు. అవి ఎరుకలోల్లు, దొమ్మరోల్లు చేయలేరు. సంమచ్చరానికి ఒకతూరి జరిగే పసరాల తిర్నాలలో అమ్ముతారు. లద్దగిరికి కోడుమూరుకి మజ్జన గోరంట్ల అనే ఊరుండాది. ఆంద్రీ నది పారుతాది ఆడ. సదుకున్నోండ్లు దాన్ని హంద్రీ అని, చంద్రావతి అని పిలుస్తారు. అది తుంగబద్ర నదికి ఉపనది. బొమ్మిరెడ్డిపల్లె కాడ, ఇంకా శానా తావుల కాడ బారే వంకలన్నీ అంద్రీ లోనే గలిసేది.

గోరంట్ల మాదవసామి దేవళం శానా పెద్దది. ఆ యప్పను నమ్ముకుంటే శానా మంచి జరుగుతాదని అందరూ నమ్మతారు. దేవళం గోపురం శానా ఎత్తుంటాది. దొజస్తంబం గూడ్క పెద్దదే. ఎండాకాలం అంద్రీలో నీల్లు బాగా తగ్గిపోతాయి. నది ఇసుక పర్రలు శానా యిశాలంగా పరుసుకోనంటాయి. అప్పుడే గోరంట్ల తిర్నాల జరిగేది. ఎరువు తోలుకునే జల్లలు, మూకులు, పగ్గాలు, నాగేండ్లు, గుంటకలు, గొర్రులు, మేడి తోకలు, పంట మధ్యన కలుపు తీసేసే మూడో నాలుగో పండ్ల గుంటకలు, ఇత్తనమేసే గొట్టాలు, గరాట్లు, గంపలు అమ్ముతారు ఆ తిర్నాలలో. సుమారుగ పదైను రోజులు జరుగుతాయి సంబరాలు.

యడాడ నుండో ఎద్దులు, దున్నపోతులు తెచ్చి గోరంట్ల తిర్నాలలో అమ్ముకుంటారు, కొనుక్కుంటారు. పసరాల నాన్నెం కనిపెట్టి చెప్పేటోల్లు, బోకర్లు వస్తారు. పసరం ఎన్ని పండ్లేసినాది, యాయా సడులుండాయి, దాన్ని బట్టి దర పలుకుతాది.

ఇసకలలోనే ఎద్దుల పంద్యాలు గూడ్క జరుగుతాయి. రెండు మూడు టన్నులున్న బండలను సులీసుగ గుంజుతాయి. గెలిసిన గిత్తలకు తులం బంగారం బగుమానం ఇస్తారు.

ఎరువు తోలే జల్లలనే సుబ్రం చేసి, తిరగ దీప్పి బండి మీద ఏస్కుంటే ఆడోల్లు, పిల్లలు పెయానం జెయ్యనీకి గూడు మాదిరయితాది. దాన్నే రాత్రిల్లు సేన్లల్లో గొర్లాపుకున్నపుడు, జొన్న శేన్ల కాడ ఎద్దులను జాడు మేపటాని కిడిసినప్పుడు, దాన్యం నూర్చే కళ్లాల కాడ ఆ జల్లలను తిరగదిప్పి ఏస్కునే చలి నుంచి, ఎండ నుంచి కాపాడుకుంటారు.

సెరువు మట్టి, ఎరువు శానా బరువుంటాయి. జల్లలో నది మజ్జన ఇరవై గంపల కంటె ఎక్కువేస్తే ఎద్దులు గుంజలేవు. సలికెల (పార) తో గంపల్లోకి ఏసుకొని, జల్లలో పోసుకుని, సేన్లకు దోలతారు. సేన్లల్లో వరుసలుగా, ఒక పగ్గం పట్టు ఎడమిడెసి రెండు మూడు గంపలు కుప్పబడేటట్టు దిగనూకుతారు. అప్పుడు ఎద్దుల క్రమశిచ్చన సూడాల. రైతునొగలమీద పగ్గాలు పట్టుకోని అవిటిని అదుపు జెయ్యడు. ఒక కుప్ప నూకినంక ‘ధేయ్’ అంటే కదిలి సరిగ్గా పగ్గం పట్టునడిసి నిలబడతాయి. సేనంతా దోలుకున్నంక ఆడ కూలీలు వచ్చి ఆ ఎరువు మన్ను కుప్పలను సేనంతా పరుసుకునేట్టు ఎదజల్లుతారు. ఇదంతా తొలకరి వానలు పడి, దుక్కి దున్నకముందే జరగాల. మల్లా నాగండ్లతో దున్నితే అదంతా సేనులో కలిసి పోతాది. దుక్కి తర్వాత కురిసే వర్సపు నీల్లు పారిపోకుండా నాగేట్టి సాల్లలో నిలిచి, ఇంకిపోయి, సేను మెత్తగ నాంతాది.

***

రొండు రోజుల కిందట మంచి వర్సం కురిసినాది. ఎర్రన్యాలల్లోన ఉండే గునం ఏందంటే, నీల్లను బెరీనీ పీల్చుకోని ఆరిపోతాయి. అదే నల్ల ర్యాగడి భూమైతే నీల్లు ఇంకవు. ఒక్కోసారి ర్యాగడి న్యాలలో పైన తడిగా ఉంటాది. ఆడాడ నీల్లు కూడ నిలబడి ఉంటాయి కాని పారతోన మన్ను పెల్లగిస్తే, తన పొడి మన్ను తగుల్తది! ఇట్టాటి యవారాన్ని దొంగ పదునంటారు.

కొంచెం సవుడు కలిసి, సన్నపూసల మాదిరి, రాల్లు కలిసిన తెల్ల న్యాలలు అని వుంటాయి. అవిటిని మొరుసు న్యాలలంటారు. నీల్లను బాగనే పీల్చుతాయిగాని, ఎర్రన్యాలలంత గాదు. అవిటికి దుక్కికి ముందు సెరువు మన్ను ఎక్కువగా దోలాల. ‘జిప్సమ్’ అనే సీమఎరువు సేనంతా జల్లి దున్నాల. అట్లయితే గాని సవిటిగునం సావదు.

కొండారెడ్డి యింటికాడ పొద్దున్నే శానా సందడి గుండాది. సుంకులమ్మ గుడి సేను ఈయాల ఇత్తనం ఏస్తాండారు మల్ల! మొన్ననే బుడ్డలిత్తనాల్లో నట్టలు, పుచ్చులు, పురుగుబట్నివి ఏరి పారేసి, గోమూత్రం, మైలుతుత్తి ద్రావణం (కాపర్ సల్ఫేట్) కొంచెం శిలకరించి ఆరబెట్టుకున్నారు. నాగరత్నమ్మ తెల్లవారు జామున లేసి జొన్నరొట్టెలు, కొరివికారం, రాగి సంగటి ముద్దలు, ఉల్లి గడ్డల పులుసు చేసి సద్దులు గట్టినాది.

ముగ్గురు పిల్లలు గుడ్క పొద్దున్న లేసి తయరైనారు. మళ్లీ బడి యాలకు వచ్చేయాల సూడండని వాండ్లమ్మ ముందే ఒప్పందం జేసుకున్నాది.

కొండారెడ్డి గిత్తల కొమ్ములకు పసుపు బూసి కుంకం బొట్లు బెట్టినాడు. చెండుపూల దండలు ఏసినాడు. అవిటి నుదుట్న పెద్ద నామంబొట్టు బెట్టినాడు. నిన్న రేత్తిరే నాలుగు పండ్ల ఇత్తరం గొర్రు, నాలు సెకంగరాట్లు, నాలుగు సెక్క గరాట్లు కిందికి దించి పెట్టుకున్నారు. గొర్రు కాడిమాను మిందేసి మోకు తోన గట్నాడు. మిగతావి ఒక గోనె సంచి లోన బెట్టి, దాని మూతి పురికోస తోన బిగించినాడు. ఇత్తనం బుడ్డలు రెండు గంపల్లో బోసి పెట్టుకున్నారు.

“మనం గాక యిద్దరు కూలోల్లను రమ్మన్నావు గదాయ్యా, ఇత్తనానికి?” అనడిగినాది నాగరత్నమ్మ.

“మన నేశోల్ల (వీవర్స్ కులం) యల్లసామికి, ఆ యప్ప పెండ్లాన్ని గుడ్క తోలుకుని రమ్మని మొన్ననే చెప్పినాను లేమ్మేవ్. వాండ్లు నేరుగ సేనికాడికే వస్తండారు. ఇత్తనాల అదును శానా కస్తిగ జరుగుతుండ్ల్యా? ల్యాకపోతే మన్సులు దొరకడమే కష్టం.” అన్నాడు కొండారెడ్డి

ఆ యమ్మ యింటికి బీగమేసి, బీగం సెవులు (తాళాలు) మొగుని కిచ్చినాది, బనియన్ జేబులో వేసుకుంటాడని.

“కాయ కర్పూరము తీసుకున్నావు గదా!”

“ఊదికడ్డి, దోసెడు పూలు గుడ్క వుండయి లేయ్యా!”

కాడి కదిలింది. వీండ్లు బోయేట్యాలకు యల్లసామి, ఆయన పెండ్లాము సత్తమ్మ వచ్చుండారు. యల్లసామి గెడం మించి గొర్రు దించినాడు.

“మొన కర్రులు సరిపిచ్చినట్టుంటావే కొండారెడ్డన్నా! శానా కొశ్శగ ఉండాయి!” అన్నాడు మెచ్చుకుంటూ.

“ల్యాకపోతే భూమి తెగుతాదా ఏంది? ఇత్తనం అడుగు లోపలికైన బడాలగదా!”అన్నాడు కొండారెడ్డి.

“ఏం సత్తెమ్మా! బాగుండావా?” అని పలకరిచ్చినాది నాగరత్నమ్మ.

“బాగుందామొదినే, అంతా సుంకులమ్మ తల్లి దయ!”

అందరూ దేవలంకి బోయి అమ్మవారికి దండం బెట్టుకున్నారు.

యల్లసామిది పక్కనే ఉన్న అల్లుగుండు. నేశోల్లు. నేశోల్లంటే పేరుకు నేతపని జేస్తారు అని గానీ, కర్నూలు జిల్లా, ముక్యంగా డోను, కోడుమూరు తాలూకాల్లో చేనేతపని చేసేటోల్లు ఎవరూ ఉండరు. వాండ్లు గుడ్క కూలిపనులు, కాయకష్టం చేసుకొనేటోల్లే.

కానీ ఎమ్మిగనూర్లో మాత్రం నేశోల్లు శానామంది ఉండారు. వాండ్ల కులవృత్తి మగ్గం నేయడం జేస్తారు. మూసాని సోమప్ప, మూసాని గంగప్ప లాంటాల్లు శానా పెద్ద సావుకార్లు ఆ వూర్లో. మూసాని గంగప్పవే ‘ఎం.జి. బ్రదర్సు’ అనే పేరున్న పెద్ద పెద్ద కంపెనీలు. వాండ్లకు దచ్చిన బారతదేశమంతా లారీ పార్సలు సర్వీసుంది. కర్నూల్లో రాయల్ ఎన్ఫీల్డు, హిందుస్తాన్ ట్రాక్టరు షోరూములుండాయి. ఆదోని, బళ్లారి, బెంగుళూరు, అయిదరాబాదుల్లో బ్రాంచీలుండాయి. వాండ్లు తిరుపతికిగానీ, కొడైకెనాలుకు గాని బోతే ఉండనీకె గెస్టుహవుసులు గూడ్క ఉండాయంటారు.

ఇవిగాక ఇంటర్ స్టేట్ బస్సులు కూడ తిప్పుతారు. కర్నూలు – నెల్లూరు, కర్నూలు బల్లారి, కర్నూలు- బెంగుళూరు ఇట్టా. ‘నీలకంటేశ్వర బస్ సర్వీస్’. ఆ బస్సుల్లో శార్జీలు శానా ఎక్కువనీ, మన మాదిరి బీదోల్లు ఎక్కిపోనీకె అలవి గాదనీ అనుకుంటుంటారు.

గొర్రు నొగల శివర్లు కాడిమానుకు మోకుతో గట్నాడు కొండారెడ్డి. గోనెసంచి లోంచి ఒక చెక్క ఫ్రేము తీసి దానికున్న బెజ్జాలకు ఆరు సెక్క గొట్టాలు బిగిచ్చినాడు. గొట్టాల మింద గరాట్లు నార తాళ్లతో బిగించినాడు. మజ్జలో తప్ప మిగతా గొట్టాలన్నీ వాలుగా భూమినానుకొని నిలబడినాయి. గొర్రు తోలతాంటే అవి సుమారు అర్దడుగు లోతుకు ఉంటాయి. ఇవన్నీ గొర్రు ఎనక బాగంలోనే ఉంటాయి

గొర్రునొగల మింద ఐదు కేజీలుండే బండరాయి పెట్టినాడు యల్లసామి. గొర్రు మధ్యన మేడితోక దిగ్గొట్టినాడు. తోలేటోడు పట్టుకునేకె పిడిగుటం గుడ్క ఉన్నాది.

నాగరత్నమ్మ గొర్రు మింద టెంకాయ కొట్టినది. టెంకాయనీల్లు సేనిలో జల్లినాది. గొరు మింద పూలు ఏసి, ఊదికడ్లు గుచ్చినాది. అందరూ గొర్రుకు దండం బెట్టుకున్నారు.

సద్దిగంప తుమ్మచెట్టు కింద బెట్టుకున్నారు. కుక్కలొచ్చి సద్దులు పీకకుండా చూస్తూండమని పిల్లలకు సెప్పినారు. పిల్లల్లో పెద్దది సుజాతకు పదేండ్లుంటాయి. దానికి గూడ్క యిత్తనం ఎయ్యనీకె వచ్చు. అందుకే ఇద్దర్ని పిల్చుకున్నారు. అదున్లో మస్సులు దొరికేదీ కష్టం.

నాగరత్నమ్మ, సుజాత, యల్లసామి, సత్తెమ్మ ఇత్తనాలను తువ్వాలల్లో బోసికొని, ఒడిగట్టుకున్నారు. శేతులు సులబంగ ఒడిలోకి బోయేట్టు! నలుగురూ నాలుగు గరాట్ల ఎనకాల నిలబడుకోనుండారు. గెడం తూరుపు ముకంగా నిలబెట్టి ఉన్నాది.

గిత్తల్ని అదిలించి గొర్రు కదిలిచ్చినాడు కొండారెడ్డి. నిదానంగా కదిలినాయవి. గొర్రుకున్న నాలుగు మొన కర్రులూ భూమిని శీల్చుకుంటా పోతాన్నాయి. భూమి ఎన్నముద్దలాగ మాదిరి మెత్తగా వుండాది. లోపల ఆ మాత్రం పచ్చి ఉండాది. గొట్టాలు, గొర్రు చేసిన చాళ్లలో అర్దడుగు లోతుకు దిగినాయి.

నలుగురూ ఒడిలోంచి ఇత్తనాలు గుప్పెట్లోకి తీసుకొని శానా జాగ్రత్తగా గరాట్లోకి గుప్పెట సందు లోంచి ఇడుస్తాండారు. ఎవ్వరూ మాట్లాడడం లేదు. శానా ఏకాగ్రత గావాల మరి. గిత్తలు రుషుల మాదిరి నడుస్తాండాయి. చాల్లు ఎక్కడా వంకబోకండా, దారిబట్టి గీసినట్లు వస్తండాయి.

ఇత్తనాలు చాళ్లల్లో రెండిమ్చుల కొకటి పడుతుండాయి. ఇత్తనం బోసేటోల్లు జారిడిసే దాన్నిబట్టి ఉంటాడది. ఒకేసారి గబుక్కున ఇత్తనం జేయిజారినాదంతే అంతే. అన్నీ ఒకసోట బడి ఆగం అయితాది పని.

ఒక గంట తర్వాత ఏడెనిమిది సార్లు గొర్రు తిరిగినాది.

“గుంటక పోయనీకె ఎవ్వరు దొరకలేదంటివి. మరెట్టా?” అనడిగింది నాగరత్నమ్మ.

“మన ఉప్పర రామాంజులుకు చెప్పినా మల్ల. కుంచేపు జూసి మనమే పాసుకోవాల. భూమి ఆరకముందే ఇత్తనం మీద మన్ను మూసుకోవాల.”

దూరంగా బండి బాటలో ఒక గెడం రావడం గనపడినాది. అది రామాంజులుదే. మనసు లోనే సుంకులమ్మకు మొక్కుకున్నారు. రామాంజులు వచ్చి గెడం నిలబెట్టినాడు కాడిమాను మీంచి గుంటక దింపినాడు. అది సుమారు ఎనిమిది అడుగులుండాది. గొర్రు రెండుసార్లు చేసిన సాల్లను ఒక్కసారి మూసేస్తాదది.

“వస్తావో లేదోనని ఎదారు (దిగులు) బడుతుంటిలే, రామాంజులూ!” అన్నాడు కొండారెడ్డి.

“అట్టెట్టయితాది అన్నా, ఇత్తనమా మజాకా? రాలేకపోతే రాలేనని చెప్తాగాని..” అన్నాడు రామాంజులు.

“కానీ, కానీ, బూమి ఆరకముందే గుంటక దోలు.”

“నీవు రెండు సార్లు దోలింది నాకు ఒకసారికి సరిపోతాది. అర్దగంట తర్వాత నా గెడం నిలబెట్టుకోవాల సూడు” అని గుంటకను అమర్సినాడు. దాని మింద బరువు పెట్టి అగత్యం లేదు. ఊరికే సాల్లను సమం జేసి ఇత్తనాల మింద మన్ను గప్పడమే.

రామాంజులు కోడెలు శానా న్యాతవి. రెండున్నరేండ్లు దాటనాయో లేదో! అవిటికి కొమ్ములు కూడ సరింగ మొలవలేదింకా. ఈ ముజ్జనే కాడి మరిగి నట్టుండాయి! శానా ఉశారుగ నడుస్తుండాయి. పైగా బరువైన సేద్దం కాదు.

గొర్రు తోలిన సాల్లన్నీ నీటుగా మూసుకు బోయినాయి. ఆ యప్ప జెప్పినట్టు అర్దగంటలనే కొండారెడ్డి గొర్రు కాడికొచ్చేసినాడు.

మల్లా పావుగంటగ్గాని ఆ యప్పకు పని ఉండదు.

“ఒదినే, నేనియ్యాల సద్ది దెచ్చుకోల్యామరి, నీవే దయ జూడాల” అన్నాడు రామాంజులు.

“అందరికి సరిపొయ్యేట్టు తెచ్చినాలే మరిదీ, ఎదారు బడమాకు” అన్నదాయమ్మ నవ్వుతూ.

రామాంజులు ఒక బీడీ అంటించుకొని గుంటక మీన గూసున్నాడు. కోడెలు నిలబడకుండా తొక్కులాడతుండాయి.

కర్నూలు – డోన్ ప్యాసింజరు ఎల్లిపోయినాది. “అంబటి పొద్దయినాది గడాలు నిలబెట్టండి! బువ్వలు తిందాము” అన్నాది నాగరత్నమ్మ.

అందరూ తుమ్మచెట్టు కింద చేరినారు. బోరింగు కాడ లొట్టితో నీల్లు గొట్టకొచ్చినాడు యల్లసామి. అందరూ కాల్లు సేతులు గడుక్కోని నాగరత్నమ్మ సుట్టూరా కూర్చొన్నారు.

నాగరత్నమ్మ ముందుగా అందరికి సత్తు తట్టలు యిచ్చినాది. జొన్నరొట్టె, కొరివికారం ఏసినాది. సత్తెమ్మ అన్నాది “మా వదినోల్ల కాడికి పనికివస్తే సద్ది దెచ్చుకునే పనుండదు”

“ఏదో బగమంతుడిచ్చిన దాంట్లోనే నలుగురికి పెట్టాల మరి!” అన్నాడు కొండారెడ్డి.

తర్వాత రాగి సంగటి ముద్ద తలా ఒకటి ఏసినాది. వాటి మజ్జన గుంతలు జేసుకున్నారు. గుంతల్లో ఉల్లిగడ్డల పులుసు బోసినాది.

రామాంజులు శేతిఏల్లు నాక్కుంటా అన్నాడు “ఒదినే, అన్నపూర్ణమ్మ తల్లివి నీవు! ఏం రుసి, ఏం రుసి?”

“సేన్ల కాడ తినే సద్దులకు ఇంకా రుసి కలుస్తాది లేరా! మీ వదినె గొప్పదనమేం గాదు” అన్నాడు కొండారెడ్డి.

అందరూ నవ్వినారు.

పైటాల కంతా గొర్రు తోలడం, గుంటక పోయడం ఐపోయినాయి. సద్దులు తిని పిల్లలు బడికి పోయినారు. పుస్తకాల సంచులు ముందే తెచ్చుకున్నారు. సుజాత బదులు రామాంజులు ఇత్తనం ఏసినాడు.

యల్లసామికి, సత్తెమ్మకు కూలీ డబ్బులు ఆడనే యిచ్చేసినాడు కొండారెడ్డి. రామాంజులుకు గూడ్క గెడం బాడుగ యిచ్చేసినాడు. పోయెస్తామని చెప్పి వాండ్లంతా ఎల్లబారినారు.

అలూ మొగుడూ ఇంటి దారిపట్టినారు.

“రేపంతా తెరిపిచ్చి ఎల్లుండిగాని, అవులెలుండి గాని ఒక పదునాన గురిసినాదంటే బాగ మొలకలొస్తాయమ్మే” అన్నాడు కొండారెడ్డి.

“పడతాది, పడతాది. ఎందుకు పడదు?” అన్నాది నాగరత్నమ్మ.

(ఇంకా ఉంది)

Exit mobile version