మహాప్రవాహం!-9

0
2

[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘మహాప్రవాహం!’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[కొండారెడ్డి పొలంలో తక్కువ లోతులోనే నీరు పడుతుంది. బోరు వేసిన ఆ రోజున గంగమ్మ తల్లి కరుణించిందని నాగరత్నమ్మ పొటేలు మాంసం, ఉద్ది వడలు, వరన్నం జేస్తుంది. అయితే బోరు వెయ్యగానే సరిపోదు కదా, బోరుకు తగినట్లు మోటారు పంపు, కరెంటు మీటరు, మోటారు వెయ్యడానికీ, ఆపడానికీ స్టార్టరు, మోటారు పెట్టడానికి ఒక రేకుల షెడ్డు కావాలి. వీటి కోసం ఉళిందకొండ స్టేటు బ్యాంకులో లోను ఇస్తారని తెల్సుకున్న కొండారెడ్డి మంచిరోజు చూసి ఉళిందకొండకు వెళ్తాడు. బ్యాంకు తమ ఊరివాళ్ళే ఐదారుమంది కనబడతారు. ముందు ఫీల్డ్ ఆఫీసర్‍ని కలిసి పేరు రాయించుకుంటాడు. తరువాత బ్యాంకు ముందర ఉన్న ఓ హోటల్లో కాఫీ తాగుదామని వెళ్తాడు. అక్కడ కుంటి సుబ్బారెడ్డి కనబడతాడు. పలకరింపులయ్యాకా, టీ తాగుదామని అంటాడు సుబ్బారెడ్ది. మళ్ళీ అంతలోనే ఏమన్నా తిందామని అని, అలసందల వడలు తెప్పిస్తాడు. వడలు తిన్నాకా టీ వస్తుంది. జీవితంలో టీ తాగడం అదే మొదటిసారి కొండారెడ్డికి. బ్యాంకు లోను శాంక్షన్ చేయించేందుకు గురప్ప అనే మధ్యవర్తిని పరిచయం చేస్తాడు సుబ్బారెడ్డి. నాలుగు వేలు లోను వస్తుందని, తన కమీషన్ నాలుగు వందలని అంటాడు. వస్తువలన్నీ కర్నూల్లో ఎక్కడ కొనాలో చెప్తాడు. అన్నీ కొనుక్కొచ్చి బిల్సు చూపిస్తే లోన్ ఇస్తారని చెప్తాడు. అవన్నీ కొనాలంటే డబ్బులుండాలిగా అని అంటాడు కొండారెడ్డి. షాపు వాళ్ళు అరువు ఇస్తారని అంటాడు గురప్ప. కాసేపయ్యాక, ఫీల్డ్ ఆఫీసర్ దగ్గరకి తీసుకెళ్తాడు గురప్ప. సోమవారం రమ్మంటాడాయన. బస్సులో ఇంటికి చేరిన కొండారెడ్డి జరిగినదంతా భార్యకి వివరిస్తాడు. నాలుగువేల లోనుకి నాలుగు వందలు లంచమా అని ఆమె విస్తుబోతుంది. అందరూ ఇస్తున్నారు తప్పదు అంటాడు. సంజన్న గౌడు ఇంటి ముందు మంచం మీద కూర్చుని మారుతున్న పరిస్థితుల గురించి ఆలోచిస్తుంటాడు. చుట్టుపక్కల ఊర్లలో వైను షాపులు వచ్చకా కల్లు వ్యాపారం బాగా పడిపోయిందని అనుకుంటాడు. తాటితోపుని అమ్మేసి కోడుమూరులోనో, డోన్ లోనో ఒక వైన్ షాప్ పెట్టుకోవాలని భావిస్తాడు. భార్యని అడిగితే, నీకేది బాగనిపిస్తే అది చెయ్యి మామా అంటుంది. చివరికి తాటివనం అమ్మేస్తాడు. డోన్‍కు వెళ్ళి భోగట్టా చేస్తాడు. డోన్‍లో చిన్న హోటల్ నడుపుతున్న తమ ఊరతను రామగిరి గుర్తొస్తాడు. వెళ్ళి ఆయన్ను కలుస్తాడు. ఆయన బజ్జీలు తినిపించి, టీ తాగించి అప్పుడు వివరాలు అడుగుతాడు. జరిగినదంతా చెప్తాడు సంజన్న గౌడు. తమతో పాటే ఉండి మళిగె వెతుక్కోమంటాడు రామగిరి. ఇక చదవండి.]

[dropcap]రా[/dropcap]మగిరి పెండ్లము అనంతమ్మ గూడ్క శానా మంచిది. సంజన్నను ఆదరంగా పల్కరించినది.

“మేం బొమ్మిరెడ్డిపల్లెలో ఉన్నప్పుడు నీవు సిన్నోనివి. మీ నాయిన శానా మంచోడు. నీవేం ఎదారు పడగాకు. మీ సిన్నాయనకు డోనులో శానా మంది తెలుసు.” అనింది.

మర్సటి దినం కాడ్నించే మళిగె కోసరం బుడుకులాట (వెతకడం) మొదలు బెట్నారు. బస్టాండు కాడ ఇప్పటికే శాపు ఒకటి ఉంది కాబట్టి ఆడ వద్దనుకున్నారు.

మొత్తానికి వారం రోజులకు బేతంచెర్ల రోడ్డులో ఒకటి దొరికింది. ఆడంతా సుద్ద ప్యాక్టరీలు, తేనె రాయి ప్యాక్టరీలు ఉండాయి. డోన్ నుంచి రంగాపురం, బేతంచెర్ల మిందుగా నంద్యాలకు బోయే రోడ్డది. నంద్యాల రైలు గేటుకు శానా దగ్గర. ఆడ రెండు మూడు కిరానా అంగల్లు, పాన్ బీడ, సిగిరెట్లు, బీడీల బంకులు ఉండాయి. ఒక టీ టిఫిన్ అంగడి గూడ్క ఉంది.

మళిగె అంత పెద్దది గాదు అంత చిన్నది గాదు. పది ఫీట్ల ఎడల్పు, పద్నాలుగు ఫీట్ల పొడుగుంటాది. పైన యాజ్‍బెస్టాస్ రేకులు ఏసినారు. చుట్టూ పక్కాగోడలున్నాయి. పలకల తలుపులుండాయి. అంటే ఒక దాని తర్వాత ఒకటి కింద గాడిలో దింపుకోవాల. పలకలు ఒకటొకటి ఒకటింబావు అడుగున్నాయి. తలకిందులు కాకుండా, ఎనకాముందు కాకుండా పెయింటు తోని ఒకటి నుండి ఏడువరకు నంబర్లు ఏసిఉన్నారు. మళిగె ముందు రెండు యినప రాడ్లు దించి వాటి మింద ఇనప రేకులతోని వారపాగు దించినారు. అదిగాక ముందు స్తలమున్నాది.

డోను మెయిను రోడ్డు మీంద రెండు రైలు గేట్లు తగులుతాయి. ఒకటి నంద్యాల గేటు, ఇంకోటి కర్నూలు గేటు. డోను ఊర్లోకి రాకుండా బైపాస్ రోడ్డు అప్పటికి లేదు. లారీలు, బస్సులు అన్నీ లోనకు రావల్సిందే. జన్సను కాబట్టి గంటకోసారి రైలో, గూడ్సో పోయినపుడల్లా గేటు పడతాది. గేటు ఎయ్యనీకె తియ్యనీకె ‘గేటు మ్యాన్’ ఒకాయనుంటాడు. ఆయన ఉండనీకె చిన్న రాతి క్యాబినుంటాది.

రామగిరి అన్నాడు – “ఈ మళిగె మనం తీసుకుంటే లాబమేందంటే, నంద్యాల గేటు రెండు పగ్గం పట్లు గూడ్క లేదు. గేటు పడినప్పుడంతా రెండు పక్కల లారీలు, బస్సులు, బండ్లు నిలబడి పోతాయి. మన వైను శాపు ఉందని తెలిస్తే, అట్ల గూడ యాపారముంటాది.”

సంజన్న నిజమేనన్నాడు.

ఆ మళిగె ఒక కోమటాయనది. ఆయనది పక్కనే ఉన్న జలదుర్గం. మొన్నటి వరకు దాంట్లో ఒక ఉల్లిగడ్డల మండీ ఉండేది, సాయబులది. ఆ యప్పతో వాండ్లకు పొందక కాలీ జేపిచ్చినాడు.

ఇద్దరూ ఆ యప్పకాడికి పోయినారు. ఆయన పేరు పి గోవిందరాజులు శెట్టి. డోను లోనే ఉంటాడు. కొత్తపేట లోనే ఆయిన యిల్లు.

ఆయిన కాలీ గోనే సంచుల యాపారం చేస్తాడు. రామగిరి మాట్లాడినాడు – “శెట్టిగారో, ఈ యప్పది మా ఊరే. బొమ్మిరెడ్డిపల్లె, ఈదిగోల్లు, డోన్‌లో వైన్ షాపు పెట్టనీకె చూస్తాండాడు. బేతంచెర్ల రోడ్డులో మన మళిగె కాలీ అయినాదని చెప్తే పోయి చూసినాము. బీగం సెవులు పక్కన బీడీ బంకాయన కచ్చినావు గదా! ఆయన సూపించినాడు.”

“వైనుషాపుకైతే ఆలోశించాల మరి! తాగుబోతు నాయాల్లు చేరతారు గద!” అన్నాడు శెట్టి.

సంజన్న అన్నాడు “శెట్టిగారు, మనం ఆడనే తాగనిస్తే నీవన్నట్టు రగడలయితాయి గాని, మన కాడ కొనుక్కోని ఎల్లిపోయేటోల్లే గాని, తాగి అరుసుకునేటోల్లుండరు గద! ఎట్టయినా మళిగే యిచ్చినారంటే మీ పేరు చెప్పుకోని బతుకుతాము.”

శెట్టి మెత్తబడినాడు. “సరే, నీవంతగా అడుగుతుంటే లేదననీకె నోరు రావడం లేదు. మరి నెలకు నూటయాభై రూపాయలు బాడిగ. కరెంటు శార్జీ మీరే కట్టుకోవాల. అడ్డుమాన్సు నెలరోజులది ఇయ్యాల. మీకు సమ్మతమైతే తీసుకోండి.”

రామగిరి అన్నాడు “కొంచెం తగ్గించుకోండి పున్యముంటాంది!”

శెట్టి ఆలోచించి అన్నాడు “సరే, పది తగ్గించి ఇయ్యండి!”

ఇద్దరూ బయటికి బోయి మాట్టాడుకున్నారు.”ఆ మాత్రం బాడిగ పల్కుతాది లేరా ఆ ఏరియాలో. ఇంగేం ఆలోసించకుండా ‘సంచకారం’ (అడ్వాన్సు) ఇచ్చేయి.”

శెట్టి గారికి నూట నలబై రూపాయలు ఇచ్చేసినాడు సంజన్న గౌడు!

***

కమ్మరిసాల. వడ్లాయిన రామబ్రమ్మం సాల ముందున్న శింత మొద్దు మింద గూసోని బీడీ తాగుతుండాడు. రైతులతో సందడిగా ఉండాల్సిన సాల సిన్నబోయినాది. అదునులో పదునులో కొరముట్లను సరిపిచ్చడం, టయానికి అందియ్యడంలో మొనగాడని పేరు దెచ్చుకున్న వడ్లాయిన ముకంలో యాదో ఎదారు గనపడతుండాది. ఆ యప్ప పెండ్లాము సిద్దమ్మ బైటికి వచ్చినది. వారపాగుకు సాలకు మధ్యన గోడకున్న సిచ్చి నొక్కినాది. అరవై క్యాండిలు బల్బు ఎలుతురు సాలంతా పరుసుకున్నాది.

వడ్లాయిన లైటు దిక్కు తిరిగి దండం పెట్టుకున్నాడు. దావన పోతూన్న కంబగిరి రెడ్డిని జూసి “అల్లుడూ! మామను పలకరిచ్చికుండ పోబడ్తివి. ఇదేమన్న న్యాయంగా ఉండాదా?” అనరిసినాడు

కంబగిరిరెడ్డి తిరిగి సూసి సాల లోనకు వచ్చినాడు. “అదేం లేదు మామా! యాదో కయాస (ఆలోచన) లోబడి పోతాండాలే.” అని “అంతా బాగుండారా?” అనడిగినాడు.

ఒక పొడుగెన నిశ్వాస వదిలినాడు రామబెమ్మం. “అదే బాగు! సూస్తాండావు గదా!” అన్నాడు.

“శానా పురసత్తు (తీరిక) దొరికినట్టుండాదే.” అన్నాడు రెడ్డి.

“పురసత్తు కాదు అల్లుడూ, పని దొరకడం ల్యా. సరేగాని నీ ఎద్దుల బండి తీసుకొస్తానంటివి. గాన్లకు కమ్మీలు సరిపిచ్చాల, గాన్ల ఆకులు, నొగలు, నాటు కట్టెల బెజ్జాలు అన్నీ ఒక తూరి సరిజూసి, వదులయిన కాడ బిగించాలంటివి! త్యాలేదేమి?”

కుంచేపు కంబగిరి రెడ్డి మాట్లాడలేదు. తల వంచుకుని, వడ్లాయిన పక్క సూడకుండా అనినాడు.

“మామా, నీ కాడ అపద్దమెందుకు. ఆ బండి పాతదయి పోయినాది. దాని మింద ఏం పెట్టుబడి పెట్టినా వేస్టే అనిపిస్తాంది. సేద్దాలు గిట్టుబాటు గాక రెండేండ్లు దాటె. రుక్మాంగద రెడ్డన్న ట్రాకటరు దెచ్చిం తర్వాత రైతులకు పని తగ్గిపాయె గద! ఎరువు తోలాలన్నా, సెరువు మట్టి తోలాలన్నా, సేన్లకూ, మన ఎద్దుల బండ్లతో పది సార్లు తిరిగేది, ట్రాకటరు ఒక్కసారి తోల్తాది. జీతగాన్ని గుడ్క మానిపించినా. ఈ సంమచ్చరం జూసి, ఎవులైనా శేన్లు గుత్తకు తీసుకుంటే ఇచ్చి కర్నూలు జేరదామనుకుంటాండా. నా బిడ్డ, కొడుకు హైస్కూలు సదువు పూర్తి గావచ్చె”

వడ్లాయన ఆ యప్పను మద్యలో నిలబెట్టి అన్నాడు. “కర్నూల్లో ఎట్ట బతుకుదామని?”

“కోల్లపారం పెట్టాలని ఆలోశన. దూపాడు టేసనుకు కార్బైడు ఫ్యాక్టరికి మధ్యన మా బావమరిదిది ఎకరా మొరుసు సేనుండాది. ఇప్పుడాడంతా కోల్లపారాలే గద! పిల్లలను కాలేజీలో జేర్చుకోని, నేను, నీ బిడ్డ కర్నూల్లోనే బతకదామని ఆలోశన చేస్తాండాం. యాదయినా అంత సులబం కాదు గదా మామా! బావమరిది రమ్మని పిలుస్తుండాడు.”

“ఏందో, అందురూ ఊరిడిసిపెట్టి పోనీకె జూస్తండారు. రైతువారీతనమంతా సేద్ధాలు మానేస్తే, నా మాదిరి కమ్మరోడు బతికాడెట్లనో మల్ల!” అన్నాడు వడ్లాయన.

కంభగిరి రెడ్డి ఆ యప్ప పక్క యిశారంగ జూసి, “సరే, పోయెస్తమల్ల” అని ఎలబారి పోయినాడు.

సిద్దమ్మ వీండ్ల మాటలు అన్నీ యినింది. మొగుని కాడికి వచ్చి కూచునింది.

“వాడు యాడికి పోయినాడమ్మే! మద్యాన్నం నించి కనబడల్యా”

“ఈమధ్యన కోడుమూరికి ఎక్కువ బోయొస్తుండాడు పిల్లోడు. వాడు నీ మాదిరే యాదో ఎదారు బెట్టుకోనుండాడు.”

“నీకు మాత్రం లేదామ్మే, ఎదారు? మనకా ఈ కమ్మరి పని తప్పరాదు. మూడేండ్లాయె, సేద్దాలు తగ్గబట్టి. ఊర్లో ఒకటికి రెండు ట్రాకటర్లు వచ్చినాయి. బాడిగ డబ్బులు ఎక్కవయినా, దుక్కులు, గుంటకలు, గొర్రులు జేసీ పనులన్నీ అవి నిమిసాల మింద జేసి పారేస్తుంటాయి. దానెమ్మ, ఇసిత్రం సూడమ్మే, బురదమళ్ళల్లో గూడ్క అవి పనిజేచ్చాయి. కూలీల రేట్లు నాలుగింతలాయె. కొర్రు గాని, గుంటక బ్లేడు గాని సరిపిచ్చకునే నాతుడేడి?”

“ముగ్గురం పనిచేస్తే గాని అదునులో పని తెమలకపోయేది. అప్పుడు రైతు లిచ్చిన దాన్యం, లెక్కతో, యాడాదంతా హాయిగా గడచిపోయేది. ఈ మాగ మాసంలో మన వీరబ్రెమ్మానికి మనువు జేయాల్సిన మాట! పిల్లాడు ముదిరి పోబట్నాడు. మనకు పని తగ్గినంక మా తమ్మడు గుడ్క గమ్మునుండాడు. పిల్లనియ్యనీకె ఎవరైనా ఆలోశిస్తారు మల్ల.” అన్నది సిద్దమ్మ.

“ఆ యప్ప ఏం జేచ్చాడులేమ్మీ, బిడ్డను సాకెటోనికే గద ఏ అబ్బయినా ఇచ్చేది.” అన్నాడు.

ఈలోన కొడుకు వచ్చినాడు. ఏం మాట్లాడకుండ లోనికిబోయి కాలుసేతులు కడుక్కున్నాడు.

“అమ్మా, మీరు బువ్వ దిన్నారా, యింకా లేదా?” అనరిసినాడు.

“లేదురా నాయినా, నీవొచ్చినంక అందరము తిందామని వుండాము” అంటూ “పాయ్యా,” అని వడ్లాయనను లేపినాది.

ముగ్గురూ పడసాలనానుకొని ఉన్న చిన్న వారపాగు కింద గూసున్నారు. తండ్రీకొడుకులకు రెండు సిల్వరి తట్టలిచ్చిందాయమ్మ.

“ఈయాల నివ్వే కలిపి ముద్దలు బెట్టమ్మా” అని అడిగినాడు కొడుకు.

“అదే సేత్తో నాకు గూడ్క” అన్నాడు తండ్రి

సిద్దమ్మ ముకం తంగేడు పువు లెక్క మురిసినాది. కానీ బీదోండ్ల యిల్లల్లో పెతి తల్లి మాదిరిగనే మొగునికి, కొడుకుకు బెట్టి, ఉన్నది తాను తిందామనుకున్నది. అట్లా చేస్తాదనే వాండ్లు కలిపిపెట్టమన్నారు.

రామబ్రెమ్మం అన్నాడు “ఒకే తూరి బువ్వ సట్టి లోనే కలుపు. ఏం జేసినావు?”

“జొన్నలు దంచి ఉడికించినాను. రెడ్డమ్మ పొద్దున బోసిన మజ్జిగుండాది. సింతకాయ తొక్కు నూరినాలే, ఉల్లిగడ్డ లేసి,” అన్నాదాయమ్మ.

బువ్వసట్టి లోని జొన్నన్నాన్ని ముందు బాగా పిసికినాది సిద్దమ్మ. దాంటో సింతకాయ తొక్కు రెండు గరిటె లేసినాది.

“నేను కలుపుతానుండు” అన్నాడు వడ్లాయిన. అన్నం, తొక్కు బాగ పిసికి కలిపినాడు. అరసేతులకు పేరుకున్న దాన్ని సట్టి అంచులకు రాసినాడు గట్టిగ.

“మజ్జిగతో దిననీకె కొంచెం తీసిపెట్టాల్సింది” అన్నాడు కొడుకు.

“దీంట్లనే ఆకర్న మజ్జిగ బోసుకుందాములే నాయినా” అన్నాది తల్లి. ఎలక్కాయలంత ముద్దలు గలిపి, వాండ్లకు పెడుతూ, తాను తినబట్నాది సిద్దమ్మ.

“ఈ జొన్నకూటికి ఈ సింతకాయ తొక్కే గురువు!” అన్నాడు పెద్దాయన. కొడుకన్నాడు “కొర్రన్నమన్నా కుంచెం తియ్యగుంటాది గాని, దీనమ్మ ఈ జొన్నన్నం సప్పగుంటాది. సింతకాయ తొక్కయితేనే దీనికి బాగుంటాది.” “ఉన్నోల్లయితే దీంట్లో’కి మాంసం కూర జేసుకుంటారు జారుగ” అన్నది సిద్దమ్మ.

“నీవెంత తిక్కదానివమ్మే! ఉన్నోల్లు జొన్నకూడెందుకు తింటారు? వరన్నమే తింటారు. పొద్దుగాల జొన్నరొట్టె, కొరివికారం దినే మనుసులు గూడ్క శానా తగ్గిపోయినారు. ఇడ్డిలీలు, ఉప్పమాలు, పూరీలు, దోసెలు ఇట్టాంటివి మరిగినారు. ఓటల్లు గూడ పెరిగినాయి.” అన్నాడు తండ్రి.

“అమ్మా ఒగ రోజు మనమూ దోసెలు బోసుకుందామె” అన్నాడు కొడుకు.

“మినప బ్యాడలు, బియ్యం కొననీకె మన తోన యాడయితాది నాయినా!” అన్నాది సిద్దమ్మ.

“నా కాడ రూపాయండాది. రేపు పొద్దున్న బోయి తిరుపాలు మామ ఓటల్లో దోసె దినుపో నాయినా” అన్నాడు తండ్రి. ఆ యప్ప గొంతులో కొడుకు మిందున్న ప్రేమంతా రంగరిచ్చుకున్నాది.

“నేనొక్కన్ని తిననీ కెనా? ఏమొద్దు” అన్నాడు కొడుకు.

మిగతాది మజ్జిగ బోసుకుని తిన్నారు. ముగ్గురూ పడసాలలో ఈత సాప మింద గూసున్నారు.

“నాయినా, శానా రోజుల్నుంచి ఒక ముక్య యిసయం చెప్పాలనుకుంటాండా. అమ్మా, నివ్వు కూడ యినవే” అన్నాడు వీరబ్రమ్మం.

“మనకు ఊర్లో పనులు బాగా తగిపోయినాయి. ట్రాకటర్లు వచ్చి వడ్లోల్ల నోల్లు కొట్టినాయి. మనమనే గాదు కూలోండ్లు, బాడిక్కి గెడాలు కొట్టెటోల్లు, ఎరువులు దోలెటోండ్లు అందురూ ఈ బాద పడుతూండారు. పెద్ద పెద్ద రైతులు దప్ప శిన్నాశితకా సేద్దగాండ్లు తట్టుకోలేక, సేన్లను గుత్తలకిచ్చో, సరికోరు కిచ్చో, ల్యాకపోతే అమ్ముకోనో, ఊరిడిసి పోతాండారు.”

రామబమ్మం అన్నాడు – “సాయింత్రం కంబగిరి రెడ్డి వచ్చిండె. సేను గుత్తకిచ్చి కర్నూలులో కోల్లపారం పెట్తాడంట, దూపాడు టేసను కాడ.”

“ఆ యప్పే గాదు నాయినా, అందరి పరిసీతి అట్టే ఉండాది. మనం గుడ్క ఇంక ఆలస్యం జేయగూడ్దు. మనకా సెంటు భూమి లేదు. ల్యాకపోవడమే మేలయిందేమో అనిపిస్తోంది. మన యిల్లు అమ్మేద్దాము. సాలతోసా, మూడున్నర అంకనాలుంటాది. దొంగలకిచ్చినా, ఇరవై వేలు వస్తాది. కోడుమూరులో నా నేస్తుడు దస్తగిరి ఉంటాడు గదా! వాండ్లు కులానికి దూదేకులోండ్లయినా, వాడు వడ్రంగి పని నేర్చుకున్నాడు.

వాండ్ల సిన్నాయన ఆదోనిలో కార్పెంటరు శెడ్డు పెట్టుకున్నాడంట. ఆదోని శానా పెద్ద టవును నాయినా. సేద్దం కొరముట్లు, శెక్క పనులు గాకుండా, కురిసీలు, టేబుల్లు, ఇండ్లకు షెల్పులు ఇవన్నీ జేచ్చారంట. మళిగెలకు, అదేందబ్బా దస్తగిరి గాడు చెప్పినాడు, ఆ.. వుడ్ వర్కు జేచ్చారంట. బాడిశె పట్టడం, రీపర్లు కోయడం ఇట్టాంటివన్నీ మిసన్లే జేస్తాయి. మనం కమ్మరోల్లం. మనకు నేర్చుకుంటే వడ్రంగి పని ఎంత సేపొస్తాది? నేను రోజూ బోయి దస్తగిరి తోని దిరిగి కొంచెం కొంచెం ఆ పని నేర్చుకుంటాండా. నాయినకు చెప్తే తిడ్తాడని చెప్పల్యా.

దస్తగిరి, నన్ను గూడ్క ఆదోనికి దీస్కపోతానని చెప్పినాడు. వాండ్ల సిన్నాయన గౌసుమియ గూడ్క సరేనన్నాడంట. ముందు నేను బోయి గౌసు సిన్నాయన శెడ్దులో చేరి పని నేర్చుకుంటా. ఒక ఆరు నెలలు పడతాదంట. ఆ ఆరునెలలూ మూడుపూట అన్నం బెట్టి దిన రోజుకి ఇరువై రూపాయలు కూలిస్తడంట. దస్తగిరిగాడంటే సొంత అన్న కొడుకు. శెడ్దులోనే ఒక మూలన రాత్రి పండుకోవచ్చంట.

పని నేర్చుకున్నంక నేనూ దగ్గగిరిగాడూ ఏరే శెడ్డు పెట్టుకుంటాము. మీరు ఇద్దరు ఒప్పుకుంటే పద్మనాబయ్య సామి కాడ మంచి రోజు చెప్పించుకోని ఆదోనికి బోతా. నేను కుదురుకున్నంక మిమ్మల్ని దీసుకుపోతా. నాయినను మించిన పనోడు యాడుండాడు. ఆయన గుడ్క ఇదే పనిలో దిగితే మనకు లోటుండదు”అని తల్లి తండ్రీ మొగాలు జూసినాడు కొడుకు. ఆ పిల్లని మొగంలో నాయన ఏమంటాడోనని తొక్కులాట.

పెద్దాయన పెద్ద నిశ్వాసం ఇడిసి, “ఆకిరికి దూదేకులోల్ల కాడ కూలిపని జేసీ గాశారం (గ్రహచారం) బట్టె” అన్నాడు.

కొడుక్కు కోపం వచ్చినది. “అదే తప్పు నాయినా, రెడ్లు గూడ్క టవున్లు జేరి స్వీటు అంగళ్లు, బట్టలంగళ్లు పెట్టుకుంటాండారు. కులాన్ని బట్టి పనులు జేసే కాలము యానాడో బోయ. ఈడ నీ మొగం నేను నా ముగం నీవు జూసుకుంట ఎన్ని రోజులుంటాము. గౌసు సిన్నాయన మనోడు కాకపోయినా, తమ్ముని కొడుకుతో బాటు నన్ను గుడ్క తీస్కపోయి, అన్నం పెట్టి పని నేర్పిస్తానంటుంటే. ఆ యప్పను తీసిపారేసినట్టు మాట్టాడుతుండావు. నీకు చెప్పనీకె నాతోన గాదులే. నా కర్మ ఇంతే అని ఈడ్నే బడి ఏడుచ్చా” ఆ పిల్లోని గొంతులో దుక్కం వనికినాది.

సిద్దమ్మ కల్పించకునినాది “య్యోవ్, నిజం నిట్టూరంగ ఉంటాదని మన పెద్దలు ఊరికీ సెప్పల్యా! ఊర్లో అందురూ, మామా, బావా, సిన్నాయనా అని వరసలు పెట్టి పిలిసెటోల్లే గానీ, పాపం వడ్లాయనకు పనుల్లేవే అని ఎవురయినా సాయం చేసెటోల్లుండారా? పాపం వాండ్లను కూడ అననీకె ఏముండాది? పిల్లోడు పని నేర్చుకోని బాగుపడతా నాయినా అంటుంటే, వర్రెగ మాట్లాడితే ఎట్టా? నాకేమొ మన వీరబెమ్మం జెప్పింది బాగుందనిపిస్తోంది.”

వడ్లాయిన నవ్వినాడు. “తల్లీ కొడుకులకు నా మింద ఎంత కోపమొచ్చింది? తరాల నుండి అలవాటయిన పనిని ఒదులుకోనీకె మనసొప్పల్యా. అట్లని పిల్లోని జీవితం ఆగం కాకూడదని నాకూ తెలుసు. కానీ, కానీ, ఆ సీరామచెంద్ర పెబువు ఎందుకీ ఆలోశన దెచ్చినాడో! మంచి రోజు చూసి ఎలబారు నాయినా” అన్నాడు.

కొడుకు ముకంలో ఎలుగొచ్చినాది. అంతవరకు తైతెమని నాయిన మీద ఎగిరినోడు ఒక్క ఉదుటున బోయి పెద్దాయనను రెండు చేతుల్తోని కరుసుకున్నాడు “మా నాయిన మంచోడు!” అంటా.

పెద్దోండ్లు ఇద్దరూ ఆయిగా నవ్వినారు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here