Site icon Sanchika

మహాత్మా.. మళ్ళీ జన్మించు!

[శ్రీ విడదల సాంబశివరావు రచించిన ‘మహాత్మా.. మళ్ళీ జన్మించు!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]ఆ[/dropcap]నాడు శత్రువుతో పోరాడటానికి
కుల మతాల కతీతమైన
ఐక్యతా భావన..!
జాతీయతా స్ఫూర్తి..!!
భారతమ్మ ముద్దుబిడ్డలుగా
ఏకాత్మతా స్ఫూర్తిని గుండెల్లో నింపుకొని
అలుపెరగని పోరాట పటిమతో
తెల్లదొరల గుండెల్లో నిద్రపోయాము!

శాంతి అహింసల ఆయుధాలతో
బ్రిటిషు ముష్కరులకు
నిదుర లేకుండా చేసిన ఘన చరిత్ర –
మన జాతి సంపదగా నిక్షిప్తమై
‘గతమెంతో ఘనకీర్తి’ నానుడిని
ఓ జ్ఞాపకంగానే మిగిల్చివేసింది!

దేశభక్తిని శ్వాసగా..
స్వాతంత్ర్య కాంక్ష ఊపిరిగా..
ప్రజల సంక్షేమం కోసమే
బ్రతికిన జాతి నేతలు..
పోరాడి గెలిచిన యోధులు..
నైతిక విలువల త్యాగధనులు..
నడయాడిన ఈ నేలపై
స్వార్థపరత్వం.. దొంగతనాలు.. దోపిడీలు
స్వైర విహారం చేస్తున్నాయి..!
కుట్రలు.. కుత్సితాలు
మానభంగాలు.. మారణహోమాలు
నిత్యకృత్యమై పోయాయి ఇక్కడ!

బాపూ..!
నువ్వు కలలు గన్న సమతాభావన..
శాంతి సామరస్యాల జీవన సరళి..
జాతి జనులందరి ఐక్యతా ధోరణి..
నేతి బీరకాయ చందాన అలరారుతోంది!

కులాలుగా మతాలుగా
విభిన్న రకాల జాతులుగా
మమ్మల్ని విడదీసి పాలన చేస్తూ
పలురకాల తాయిలాలతో ఊరిస్తూ
అధికారమే పరమావధిగా పాలన చేసే
దుష్ట సంస్కృతికి తిరదీశారు పాలకులు!

ఒకనాడు..
పేద ధనిక వర్గాలుగా విభజించబడిన జాతి..
కులాలుగా మతాలుగా జాతులుగా
రూపాంతరం చెంది..
సభ్య సమాజం నుండి వెలివేయబడింది!

అధికారం కోసం..
రాజకీయ నేతలు ఆడే వికృత క్రీడలో
పావులుగా మారిపోయి, ఊపిరాడక
ఉక్కపోతతో అలమటిస్తున్నాము!

ఈ నల్ల దొరల నీచ నికృష్ట పాలన నుండి..
మాకు విముక్తిని కలిగించు!!
ఓ మహాత్మా..
మళ్ళీ జన్మించు!!

Exit mobile version