[dropcap]మ[/dropcap]న దేశాన్ని ‘మహోన్నత భారతం’ అని చెప్పుకుంటున్నాం కనుక దాని గురించి మనం తెలుసుకోవాలి. భారతజాతి గొప్పతనం తెలుసుకోవడం, తరతరాలకి అందించడం ప్రతి భారత పౌరుడి బాధ్యత. ఎంతోమంది తపస్సంపన్నులు, జ్ఞానవంతులు, త్యాగధనులు, పరాక్రమవంతులు తమకోసం కాకుండా ప్రజల కోసమే జీవించినవాళ్ల గొప్పతనాన్నీ, సంస్కృతీ సంప్రదాయాల్నీ తెలుసుకోకపోతే భారతీయుడు అని ఎలా అనిపించుకుంటాడు?
కుటుంబంలో ఉండే ప్రతి సభ్యుడు తన తాతముత్తాల గురించి తన వంశ చరిత్ర గురించి తెలుసుకుని ఆ వంశ గౌరవం నిలబెట్టాలి కాబట్టి, మన భారతదేశం మొత్తం ఒక కుటుంబం అని చెప్పుకుంటున్నాం కాబట్టి, మన దేశానికి ఆ పేరు ఎలా వచ్చింది? మనదేశ సంస్కృతి సంప్రదాయాలు ఏమిటి? మనదేశ ప్రముఖులు ఎవరు? అనే విషయాలు మొత్తం తెలుసుకుని తీరాలి!
ఇంత మంచి పేరు, పవిత్రత, ఆధ్యాత్మికత, దయాగుణం, పరాక్రమం, పెద్దలయందు పూజ్యభావం, ప్రకృతి ఆరాధన, క్రమశిక్షణ ఇలా ఎన్నో విషయాలతో కలగలిసిన మన సంస్కృతీ సంప్రదాయాల్ని గురించి మనం అన్ని తరాలకి అందించగలగాలి. అప్పుడే మనదేశ ఔన్నత్యం భవిష్యత్తులో కూడా ఈ విశాల విశ్వంలో మహోన్నతంగా నిలుస్తుంది. ఇప్పుడు ఈ మహాభారత కథలు చదవడం వల్ల అనేకమంది పెద్దలు రాసిన ఎన్నో గ్రంథాలు చదవాలన్న ఆసక్తి కూడా పెరుగుతుంది.
మహాభారతాన్ని సంస్కృత భాషలో వేదవ్యాసుడు వేగంగా అవలీలగా చెప్తుంటే.. అప్పటికప్పుడే అర్థం చేసుకుంటూ, తెలియనివి అడిగి తెలుసుకుంటూ శివశక్తుల కుమారుడు విఘ్నేశ్వరుడు అంతే వేగంగా రాశాడు.
పూర్వం వేదం మొత్తం ఒక్కటిగా ఉండేది. అలా ఉన్న వేదాన్ని వ్యాసమహర్షి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము అని నాలుగు భాగాలుగా విభజించాడు. అలా చెయ్యమని వ్యాసుడికి బ్రహ్మ చెప్పాడు. వేదాలు విభజించాడు కనుక వ్యాసుణ్ని ‘వేదవ్యాసుడు’ అని పిలిచారు.
తరువాత దాన్ని తన శిష్యులు పైలుడు, వైశంపాయనుడు, సుమంతుడు, జైమిని అనే మహర్షులకి బోధించాడు. వరుసగా ఒక్కొక్క వేదాన్ని ఒక్కొక్కళ్లకి చెప్పి నాలుగు వేదాల్ని నలుగురితో అధ్యయనం చేయించాడు. నలుగురు శిష్యులూ ఎవరికి బోధించిన వేదాన్ని వాళ్లు సంపూర్ణంగా నేర్చుకున్నారు.
తపస్సంపన్నుడైన వేదవ్యాసుడు పద్ధెనిమిది పురాణాలు; నీతిశాస్త్రము; అర్థశాస్త్రాల అర్థాలు, స్వభావాలు; నాలుగు వేదాలు, వాటి ఉపనిషత్తుల భావాలు; దర్మార్థకామ మోక్షాలతో అరిషడ్వర్గాలకు సంబంధించిన చక్కటి కథలు; ఇతిహాసాలు; కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగాల్లో ఉన్న గొప్ప మహర్షుల, రాజుల వంశ చరిత్రలు; బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అని పిలవబడే నాలుగు వర్ణాలు; బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం అనే ఆశ్రమాల్లో ఉండే ధర్మాలు వాటి విధానాలు; నాలుగు ముఖాలున్న బ్రహ్మ మొదలైన దేవతలు; మహర్షులతో పూజించబడే శ్రీకృష్ణుడి మహత్యం; పాండవులు మొదలైన భారత శూరుల గుణగణాలు పరిపూర్ణమైన జ్ఞానంతో అందరికీ అర్థమయ్యేలా రచించాడు.
ఆ మహాభారత కథల్ని ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం!
అంత మంచి పని చెయ్యమని ఎవరు సలహా ఇచ్చారు అని కదా మీ సందేహం? విమలాదిత్యుడు, రాజరాజచోళుడి కుమార్తె కుందవాంబ దంపతులకి కుమారుడు, పవిత్రమైన మనస్సు, అస్త్రవిద్యలో గొప్ప నేర్పరితనము కలిగి చాళుక్య వంశానికి దీపంలా ప్రకాశించిన మహారాజు రాజరాజనరేంద్రుడు.
ఒకరోజు నన్నయని పిలిచి “నాకు ఎప్పుడూ భారత కథలు వినాలనే ఉంటుంది. గొప్ప పండితుడవైన నన్నయకవీ! వ్యాసమహర్షి మహాభారతంలో చెప్పిన విషయాల్ని అందరికీ అర్థమయ్యేలా మీకు గల పాండిత్యంతో తెలుగులో వ్రాయండి” అని చెప్పాడు.
మహాభారత కథలు ఎలా మొదలయ్యాయో తెలుసా.. పూర్వం లోకాలకి మంచి జరగాలని బ్రహ్మర్షులందరు సేవిస్తుండగా మహాముని శౌనకుడు పన్నెండు సంవత్సరాలు జరిగే ‘సత్రము’ అనే యాగాన్ని చెయ్యడం మొదలుపెట్టాడు. అక్కడికి ‘రోమహర్షుడు’ అనే మహర్షి కుమారుడు ‘ఉగ్రశ్రవసుడు’ వచ్చాడు. ఉగ్రశ్రవసుణ్ని ‘సూతమహర్షి’ అని కూడా అంటారు. ఆయన పురాణ కథలు బాగా చెప్పగలడు.
ఉగ్రశ్రవసుడు వచ్చి అక్కడ ఉన్న మహర్షులకి నమస్కారం చేశాడు.“నేను వ్యాసమహర్షి శిష్యుడైన రోమహర్షణుడు అనే గొప్ప పురాణికుడికి కుమారుణ్ని. పురాణాల్లో ఉన్న పుణ్య కథల్ని అన్నింటినీ చెప్పగలను. మీరు ఏ కథ వినాలని అనుకుంటున్నారో ఆ కథని నేను చెప్తాను” అని తనని తను పరిచయం చేసుకున్నాడు.
మహర్షులందరికీ ఆయన చెప్పే కథలు వినాలని కోరిక కలిగింది. ఆయన్ని శ్రద్ధగా పూజించి “ఏ కథ బాగుంటుందో; ఏ కథ కొత్తగా, వింతగా ఉంటుందో; ఏ కథ వింటే సంపూర్ణమైన జ్ఞానం కలుగుతుందో; ఏ కథ పాపాలన్నింటినీ పోగొడుతుందో అటువంటి కథని వినాలని ఉంది” చెప్పమని అడిగారు.
కథలు చెప్తుంటే వినాలని పెద్దవాళ్లకి కూడా ఉంటుందన్నమాట. మహర్షులతో “మీకు ఇష్టమైన, పవిత్రమైన ఒక కథ చెప్తాను శ్రద్ధగా వినండి” అన్నాడు సూతమహర్షి. శౌనకుడు మొదలైన మహర్షులందరు సూతమహర్షి చెప్పే కథ వినడానికి సిద్ధంగా కూర్చున్నారు.
మహాభారత కథ చెప్పుకుంటూ మొదట సంస్కృతంలో మహాభారతాన్ని రచించిన శ్రీవేదవ్యాస మహర్షుల వారిని గురించి, మహాభారత కథ వినిపించడానికి మూలకారకుడైన పరీక్షిత్తుమహారాజు గురించి, సంస్కృతంలో రచింపబడిన మహాభారతాన్ని తెలుగులోకి అనువదించాలని సంకల్పించిన శ్రీ రాజరాజనరేంద్రుడి గురించి తెలుసుకుందాం. తరువాత వరుసగా పర్వాల అనుక్రమణికని అనుసరించి మహాభారతాన్ని తెలుసుకుందాం.