మహాభారత కథలు-10: గరుత్మంతుడి కథలు

1
3

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

గరుత్మంతుడు-అమృతము

[dropcap]గ[/dropcap]రుత్మంతుడు తన తల్లిని దాసీతనం నుంచి విముక్తురాల్ని చెయ్యాలని అనుకున్నాడు. పాములతో సంప్రదించాడు. విముక్తుల్ని చెయ్యాలంటే తమకి అమృతం తెచ్చి ఇవ్వాలని చెప్పాయి. గరుత్మంతుడు అందుకు అంగీకరించాడు. పాములకి ఇవ్వడానికి అమృతం తీసుకుని వస్తానని చెప్పి తల్లికి నమస్కరించి ఆమె ఆశీర్వాదం తీసుకున్నాడు. “నాయనా! నీ పెద్ద శరీరరాన్ని సూర్యుడు రక్షిస్తాడు. పెద్ద పెద్ద రెక్కల్ని వాయువు, వీపుని చంద్రుడు, తలని అగ్ని రక్షిస్తారు. విజయాన్ని కీర్తిని పొందుతావు!” అని దీవించింది తల్లి వినత.

తల్లి దగ్గర ఆశీర్వాదం తీసుకుని వెడుతున్న గరుడుడు తల్లితో “అమ్మా! నేను చెయ్యబోతున్న పని చాలా కష్టమైంది. నాకు చాలా బలం కావాలి కనుక, తినడానికి ఏదేనా చూపించు!” అని అడిగాడు. వినత “నాయనా! సముద్రగర్భంలో ఉన్న బోయల సమూహం వల్ల ప్రజలకి హాని కలుగుతోంది. వాళ్లని నువ్వు ఆహారంగా తీసుకో! దాని వల్ల నీకు ఆకలి తీరుతుంది. ప్రజలకి మేలు కలుగుతుంది. వాళ్లని తినేప్పుడు నువ్వు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్లల్లో ఎవరికీ హాని తలపెట్టని బ్రాహ్మణులు ఉంటారు. వాళ్లని మాత్రం తినకుండా విడిచిపెట్టు!” అని చెప్పింది.

అది విని గరుత్మంతుడు “అమ్మా! వాళ్లల్లో బ్రాహ్మణుడు ఎవరో తెలుసుకోవడం ఎలా?” అని అడిగాడు. “నాయనా! గాలం అనే సాధనం మింగేటప్పుడు కంఠం దగ్గర గుచ్చుకుని బాధ పెడుతుంది కదా! అలాగే బ్రాహ్మణుడు కంఠం దగ్గర గుచ్చుకుంటూ నిప్పులా వేడిగా కాలుస్తుంటాడు. కోపం వచ్చినప్పుడు బ్రాహ్మణుడు పదునైన ఆయుధంగాను, విషంగాను, నిప్పుగాను మారిపోతాడు. బ్రాహ్మణుణ్ని గౌరవంగా చూస్తే ప్రజలకు మంచి కలిగేలా చేస్తాడు, గురువుగా ఉంటాడు, ఇష్టాన్ని నెరవేరుస్తాడు!” అని బ్రాహ్మణుడి లక్షణాల్ని అతడికి అర్థమయ్యేలా చెప్పింది వినత. తల్లి చెప్పినట్టు గరుత్మంతుడు సముద్రం మధ్యలో ఉన్న బోయల్ని అందర్నీ తినేసి మళ్లీ అమృతం కోసం బయలుదేరాడు. అతడికి ఆకలి మాత్రం తీరలేదు.

గరుత్మంతుడు-ఏనుగు-తాబేలు

అమృతం కోసం వెడుతున్న గరుత్మంతుడు మధ్యలో తపస్సు చేసుకుంటున్న తండ్రి దగ్గరికి వెళ్లి “తండ్రీ! నాకు చాలా ఆకలిగా ఉంది. తినడానికి ఏదయినా కావాలి!” అని అడిగాడు. అతడి తండ్రి కశ్యపబ్రహ్మ “నాయనా! అగ్నితో సమానమైనవాడు, నియమనిష్ఠలు కలిగినవాడు విభావసుడు అనే పేరుగల బ్రాహ్మణుడు ఉన్నాడు. అతడు తన పెద్దలు సంపాదించి పెట్టిన ధనంతో సుఖంగా జీవిస్తున్నాడు. అతడి తమ్ముడు సుప్రతీకుడు. ఒకరోజు అతడు తన అన్న విభావసుడి దగ్గరికి వెళ్లి తాత తండ్రులు సంపాదించి ఇచ్చిన ధనంలో తనకు కూడా భాగం పంచి ఇమ్మని అడిగాడు.

ధనం మొత్తం తనకే కావాలని తమ్ముడికి ఇవ్వకూడదని అనుకున్న విభావసుడు తమ్ముణ్ని ఏనుగుగా మారమని శపించాడు. తమ్ముడు సుప్రతీకుడు అన్నని తాబేలుగా మారిపొమ్మని శపించాడు. ఇద్దరూ ఒకళ్లని ఒకళ్లు శపించుకోవడంవల్ల సుప్రతీకుడు మూడు ఆమడల పొడవు, పది ఆమడల పరిధితో తాబేలుగాను, విభావసుడు ఆరు ఆమడల పొడవు, పన్నెండు ఆమడల వెడల్పుతో ఏనుగుగాను మారిపోయారు. మారినవెంటనే ఏనుగు అడవిలోకి, తాబేలు చెరువులోకి వెళ్లిపోయాయి.

పూర్వజన్మలో ఇద్దరి మధ్య ఉన్న విరోధం వల్ల వాళ్లిద్దరూ ఇప్పటికీ పోట్లాడుకుంటూనే ఉన్నారు. వాళ్లిద్దరి వల్ల వాళ్లకే కాదు ఎవరికీ ఉపయోగంలేదు. వాళ్లని తినేసి నీ ఆకలి తీర్చుకో!” అని చెప్పాడు. వెంటనే గరుత్మంతుడు తన బలమైన రెక్కలతో ఏనుగుని, తాబేల్ని వెతికి పట్టుకుని రెండింటినీ ఒకేసారి పైకి ఎత్తి పాదాలతో బంధించి ఆకాశంలోకి ఎగిరిపోయాడు. ఆకాశ మార్గంలో వెడుతున్న అతడికి సంపంగి పూల తీగలు చుట్టుకుని, దేవతా వృక్షాలతో ఎంతో మనోహరంగా ఉన్న ‘అలంబ’ అనే పర్వతం కనిపించింది. ఆ పర్వతం మీద ‘రోహిణము’ అనే పెద్ద దేవతా వృక్షం ఉంది. ఆ దేవతా వృక్షం గరుత్మంతుణ్ని గౌరవంగా పిలిచి “వినతకుమారా! వంద ఆమడల పొడవుతో ఉన్న నా చెట్టు కొమ్మ మీద ఆగి ఏనుగుని, తాబేలుని తిని నీ ఆకలిని తీర్చుకుని వెళ్లు!” అని చెప్పింది.

గరుత్మంతుడు అది చెప్పినట్టు ముందు కొమ్మ మీద కూర్చుని ఆకలి బాధ తీర్చుకుని వెడదామనుకుని కొమ్మ మీద కాలు మోపాడు. అతడి బరువుకి ఫెళ్లుమని పెద్ద శబ్దం చేస్తూ కొమ్మ విరిగిపోయింది. ఆ ధ్వనికి దిక్కులు కంపించి పోయాయి. చెట్టు మీద నివసిస్తున్న పక్షుల గుంపులు భయంతో పారిపోయాయి. సూర్యకిరణాలని ఆహారంగా తీసుకుంటూ వాలఖిల్యులు అనే మహర్షులు అదే కొమ్మని ఆధారంగా చేసుకుని తలకిందులుగా ఉండి తపస్సు చేసుకుంటున్నారు. ఆ కొమ్మ భూమి మీద పడితే మహర్షులకి బాధ కలుగుతుంది. అందువల్ల గరుత్మంతుడు ఆ కొమ్మని నోటికి కరుచుకుని, ఏనుగుని తాబేలుని పాదాలతో పట్టుకుని ఆకాశంలోకి ఎగిరాడు.

తను నిలబడడానికి ఎక్కడేనా చోటు దొరుకుతుందేమోనని ఎంత వెతికినా ఎక్కడా కనిపించ లేదు. గంధ మాదన పర్వతం మీద తపస్సు చేసుకుంటున్న తన తండ్రి దగ్గరికి వెళ్లి నమస్కరించాడు. మేరుపర్వతంతో సమానమైన శరీరము, వాయువునే జయించ కలిగినంత గొప్ప వేగము, ఊహించలేనంత శక్తి, వెలుగుతున్న అగ్నికి ఉండేంత తేజస్సు కలిగిన వినత కుమారుడు గరుత్మంతుణ్ని, అతడి నోటిలో ఉన్న చెట్టు కొమ్మని, దానికి అతుక్కుని తలకిందులుగా వేలాడుతున్న పవిత్రులైన వాలఖిల్యులు అనే మహర్షుల్ని చూశాడు కశ్యపబ్రహ్మ.

వాలఖిల్య మహర్షుల్ని చూసి “మహానుభావులారా! ఈ గరుత్మంతుడు లోక రక్షకుడు, గొప్ప బలవంతుడు. మీకు బాధ కలగకూడదని ఈ చెట్టుకొమ్మని వదలి పెట్టకుండా నోటికి కరుచుకుని తిరుగుతున్నాడు. దయతలచి మీరే ఈ కొమ్మని వదిలి వేరొక చోటికి వెళ్లి అతణ్ని అనుగ్రహించండి!” అని వేడుకున్నాడు. వాలఖిల్యమునులు కశ్యపుడి ప్రార్థన విని ఆ చెట్టు కొమ్మని వదిలి పెట్టి హిమాలయ పర్వతానికి వెళ్లిపోయారు.

గరుత్మంతుడు చెట్టు కొమ్మ నోటిలో ఉండడం వల్ల మాటలు సరిగా పలక లేక పలుకుతూ “తండ్రీ! ఈ చెట్టుకొమ్మ నా నోటికి అడ్డుగా ఉంది. బ్రాహ్మణులు లేని అడవి ప్రాంతం ఎక్కడ ఉందో చెప్పండి. అక్కడకి వెళ్లి దీన్ని వదిలి పెట్టాలి!” అని అడిగాడు. అతడి మాటలు విన్న కశ్యపబ్రహ్మ “నాయనా! హిమాలయాల్లో ‘నిష్పురుష’ అనే కొండ ఉంది. అక్కడికి వెళ్లడం ఈశ్వరుడికి కూడా కష్టమే. ఆ కొండ గంధమాదన పర్వతానికి లక్ష ఆమడల దూరంలో ఉంది. ఈ చెట్టు కొమ్మని అక్కడ విడిచిపెట్టు!” అని చెప్పాడు. తండ్రి మాటలు విని గరుత్మంతుడు మనో వేగం కంటే మించిన వేగంతో ఎగురుతూ వెళ్లి ఆ చెట్టు కొమ్మని నిష్పురుషం అనే పర్వతం మీద విడిచి పెట్టాడు. తరువాత హిమాచల పర్వతం మీదకి వెళ్లి ఏనుగుని, తాబేలుని తిని బలాన్ని పెంచుకుని తన పని మీద స్వర్గలోకానికి బయలుదేరాడు. అతడు రెక్కలు విదిలించగానే రెక్కల వేగం నుంచి వచ్చిన గాలికి ఆ పర్వతం మీద ఉన్న వృక్షాలకు పూసిన పువ్వులన్నీ జయం కలగాలని ఆశీర్వదిస్తూ జలజలా గరుత్మంతుడి మీద వర్షంలా పడ్డాయి.

వాలఖిల్య మహర్షుల వృత్తాంతము

గరుత్మంతుడు ఆకాశమార్గంలో ఇంద్రుడి రక్షణలో ఉన్న అమృతం తీసుకుని రావడం కోసం బయలుదేరాడు. ఆ సమయంలో స్వర్గలోకంలో అనేక దుశ్శకునాలు కనిపించాయి. వాటిని చూసి ఇంద్రుడు దేవతల గురువైన బృహస్పతిని కలుసుకుని “మహర్షీ! ఇటువంటి దుశ్శకునాలు కలగడానికి కారణం ఏమిటి?” అని అడిగాడు. బృహస్పతి ఇంద్రుడితో “గరుత్మంతుడు బ్రహ్మజ్ఞానం కలిగిన కశ్యప ప్రజాపతి ఇచ్చిన వరం వల్ల వినతకి పుట్టిన కొడుకు. ఇతడు వాలఖిల్యులు అనే మహర్షుల దయతో పక్షి జాతికి రాజుగా ప్రసిద్ధి పొందాడు. సముద్రం లోపల నివసించే అతి భయంకరులైన బోయల్ని పూర్తిగా తినేసిన వీరుడు. ఏనుగుని, తాబేలుని, రోహిణమనే వృక్షం యొక్క కొమ్మని ఒకేసారి పట్టుకుని ఆకాశంలో ఎగరకలిగిన బలము, వాయువేగము కలవాడు.

తన తల్లి యొక్క దాసితనాన్ని పోగొట్టడం కోసం అమృతాన్ని తీసుకుని వెళ్లడానికి సాహసంతో వస్తున్నాడు. తనకిష్టమైన రూపాన్ని ధరించగలడు, ఇష్టమైన ప్రదేశానికి వెళ్లగలడు. అతణ్ని నువ్వు జయించలేవు. గరుత్మంతుడి గొప్పతనం నీకు కూడా తెలుసు. పూర్వం కశ్యప ప్రజాపతి సంతానం పొందడం కోసం పుత్రకామేష్టి చేశాడు. అప్పుడు నీతో సహా అందరు దేవతలు, వాలఖిల్యులు అనే మహర్షులు ఆయనకి సహాయపడ్డారు. ఆ యజ్ఞం జరుగుతున్న సమయంలో నువ్వు నీ బలానికి తగినట్టు సమిధల్ని వీపుమీద మోసుకుని వచ్చావు. అదే సమయంలో బొటనవేలంత ఆకారంలో బలహీనులుగా ఉన్న వాలఖిల్యులు అనే మహర్షులు మోదుగ కట్టెల మోపుల్ని, దర్భల మోపుల్ని మొయ్యలేక, శ్రమతో వణుకుతూ తీసుకుని రావడం చూసి నువ్వు నవ్వావు.

ఆ మహర్షులు కోపంతో “ఎప్పుడూ యుద్ధంలో విజయాన్నే పొందేవాడు, అగ్నికి ఉన్నంత తేజస్సు కలవాడు, అణిమాది గుణాలు కలిగినవాడు, వీరులకే వీరుడైనవాడు, ఇంద్రుడికంటే వంద రెట్లు ఎక్కువ బలం కలవాడు, ఎవరితోను జయింపబడనివాడు అయిన బలవంతుడు జన్మిస్తాడు. అతడు రెండవ ఇంద్రుడుగా ప్రకాశిస్తాడు” అని అగ్నిహోత్రంలో హోమం చేశారు. అది తెలుసుకున్న నువ్వు అలా జరగకుండ ఉండేలా చూడమని కశ్యప ప్రజాపతిని ప్రార్థించావు. వాలఖిల్య మహర్షులతో కశ్యపుడు “మహర్షులారా! తన బాహుబలంతో అన్ని జీవరాసుల్నీ కాపాడడం కోసం బ్రహ్మ ఇంద్రుణ్ని నియమించాడు. రెండవ ఇంద్రుడు ఏర్పడితే అన్నీ తారుమారవుతాయి. ఇలా చెయ్యడం తగిన పని కాదు.

మీరు అన్న మాటలు జరిగే తీరతాయి. కనుక, నాకు పుట్టబోయే కుమారుడు పక్షి జాతికే ఇంద్రుడు (రాజు) అవుతాడు!” అని చెప్పి వాలఖిల్య మహర్షుల్ని అంగీకరించేలా చేశాడు. ఇంద్రుడు ఒక్కడే ఉండేట్లు చేశాడు.

కశ్యప ప్రజాపతి చేసిన పుత్రకామేష్టి యాగ ఫలితంవల్ల, వాలఖిల్యుల చేసిన తపస్సు యొక్క ఫలితం వల్ల జన్మించినవాడు గరుత్మంతుడు. పక్షులకు రాజైన ఆ గరుత్మంతుడే ఇప్పుడు అమృతాన్ని తీసుకుని వెళ్లడానికి వస్తున్నాడు. అందువల్లనే స్వర్గలోకంలో ఇన్ని దుశ్శకునాలు కనిపిస్తున్నాయి” అని చెప్పాడు. బృహస్పతి చెప్పింది విని ఇంద్రుడు అమృతాన్ని రక్షిస్తున్న వాళ్లని అందర్నీ రప్పించి అమృతాన్ని జాగ్రత్తగా కాపాడమని ఆజ్ఞాపించి పంపించాడు. అనేక రకాల రూపాలు కలిగిన వీరులు, పదునైన కత్తులు మొదలైన ఆయుధాలు, నలుపు, ఎరుపు, తెలుపు, పసుపు మొదలైన రంగుల్లో ఉన్న కవచాలు ధరించి అమృతానికి కాపలాగా ఉన్నారు. వాళ్లందరూ రాత్రి, పగలు కంటిమీద కునుకు లేకుండా అమృతం చుట్టూ ఉండి కాపలా కాస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here