మహాభారత కథలు-12: తల్లి శాపానికి బాధపడిన శేషుడు – వాసుకి

0
1

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

[dropcap]పా[/dropcap]ములకి తెలియకుండా ఇంద్రుడు అమృతాన్ని తీసుకుని వెళ్లిపోయాడు. అమృతం తాగే యోగం పాములకి లేకుండా పోయింది. జరిగినదానికి శేషుడు బాధపడ్డాడు. తన తల్లి, తమ్ముళ్లు ధర్మవిరుద్ధమైన పనులు చెయ్యడం వల్ల ఇంత అవమానాన్ని పొందవలసి వచ్చింది.

దుఃఖంతో ఇల్లు వదిలి తపస్సు చేసుకోడానికి గంధమాదన పర్వతానికి వెళ్లిపోయాడు. గోకర్ణక్షేత్రం, పుష్కరారణ్యం, హిమాచలం మొదలైన పుణ్యక్షేత్రాల్లో అనేక వేల సంవత్సరాలు బ్రహ్మ గురించి తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. ఏ వరాలు కావాలో కోరుకోమన్నాడు.

“బ్రహ్మదేవా! నా తల్లి కద్రువ, తమ్ముళ్లు కలిసి, నా సవతి తల్లి వినతని, సోదరుడు గరుత్మంతుణ్ని అనేక విధాలుగా అవమానించారు. వాళ్లు ఎప్పటికీ మారరు. ఇవన్నీ చూస్తూ వాళ్లతో కలిసి ఉండడం నాకు ఇష్టం లేదు. తపస్సు చేస్తూ ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తాను!” అన్నాడు.

అతడి మాటలు విని బ్రహ్మ “నాయనా! నువ్వు ఎప్పుడూ సత్యాన్ని మాట్లాడతావు. ధర్మబద్ధంగా జీవిస్తావు. దేన్నైనా భరించగల శక్తి, ఓర్పు కలవాడివి. ఈ భూమి మొత్తం భారాన్ని నువ్వే పద్ధతిగా మొయ్యాలి. వినత కుమారుడు గరుత్మంతుడు చాలా గొప్ప పరాక్రమవంతుడు. కశ్యపుడు, వాలఖిల్యులు మొదలైన మునులతో వరాలు పొందిన పక్షిరాజు. ఇంద్రుణ్ని కూడా ఓడించి అందరితో పొగడ్తలు అందుకున్నాడు. నువ్వు తెలివిగా ఉండి అతడితో స్నేహంగా ఉండడం నీ విధిగా అనుకో!” అని నచ్చ చెప్పాడు బ్రహ్మ.

శేషుడు బ్రహ్మ చెప్పినట్టుగా భూమి యొక్క సమస్త భారాన్ని మోస్తున్నాడు. గరుత్మంతుడితో స్నేహంగా మెలుగుతూ ప్రశాంతంగా జీవిస్తున్నాడు.

తమ తల్లి కద్రువ ఇచ్చిన శాపం వల్ల జనమేజయుడు సర్పయాగం చెయ్యబోతున్నాడని పాముల్లో ముఖ్యుడైన వాసుకి అనే పేరుగల పాము తెలుసుకున్నాడు. సర్పయాగంలో తమకు కలగబోయే వినాశనాన్ని తలుచుకుని బాధపడుతున్నాడు. చుట్టాలందర్నీ పిలిపించాడు. ఐరావతుడు అనే పేరు గల తన సోదరులందరినీ కూడా పిలిచి తన బాధ చెప్పుకున్నాడు.

“శేషుడు చాలాకాలం తపస్సు చేసి విశాలమైన భూమిని మొయ్యడం అనే గొప్ప పనిలో ఉండిపోయాడు. మనతో స్నేహాన్ని బంధుత్వాన్ని విడిచి పెట్టి తనంతట తాను ఒంటరిగా ఉండిపోయాడు. మనందరికీ ఆపద రాబోతోందని తెలిసి కూడా మన భయాన్ని పోగొట్టే పని ఏదయినా చెయ్యాలన్న ఆలోచనే అతడి మనసుకి కలగడం లేదు.

అమృతం కోసం సముద్రాన్ని చిలికినప్పుడు మంథర పర్వతానికి అల్లెత్రాడుగా ఉండి నేను పడిన కష్టానికి అందరూ మెచ్చుకుని నాకు ఏ భయమూ లేకుండా ఉండేట్టు వరం ఇచ్చారు. నా గురించి నాకు భయం లేదు.

కాని, మన తల్లి కద్రువ ఇచ్చిన శాపం వల్ల మన నాగజాతికే వినాశనం కలుగబోతోంది. అందుకే నేను చాలా దుఃఖపడుతున్నాను. మన జాతికి కలగబోయే ఉపద్రవాన్ని ఆపడానికి ఏదైనా ఉపాయం ఉందా? ఇప్పుడు మనం ఏం చెయ్యాలి?” అని వాసుకి మిగిలిన పాముల్ని సలహా అడిగాడు.

వాసుకి కంటే చిన్నవైన పాములు కొన్ని “అంత భయమెందుకు? జనమేజయుడు యాగం మొదలుపెట్టినప్పుడు అది జరగకుండా అడ్డు పడదాం. జనమేజయుడు ధర్మపరుడు కనుక మనం బ్రాహ్మణ రూపాల్లో వెళ్లి ఈ యాగాన్ని ఆపమని చెప్తే వింటాడు. ఈ యాగం చెయ్యడం వల్ల ఇహపర సౌఖ్యాలకి అనేక ఆటంకాలు కలుగుతాయని నచ్చచెప్దాం.

మనమందరం ఒకే మాట మీద ఉండి ఋత్విక్కులు కూడా యాగాన్ని వదిలి పారిపోయేలా చేద్దాం. యాగానికి వచ్చిన వాళ్లందరికీ పెట్టే భక్ష్యాలు, భోజ్యాలు, లేహ్యాలు, పానీయాలు అనబడే నాలుగు రకాలైన ఆహార పదార్థాల మీద విషాన్ని చిమ్ముదాం. సభలో ఉండే బ్రాహ్మణుల మీద పరుగులు పెడదాం. ఋత్విక్కులు యాగం చెయ్యడం మానేసి భయంతో పారిపోయేలా చేద్దాం!” అన్నాయి.

వాళ్ల మాటలు విన్న పెద్ద పాములు “అది అంత తేలికైన పని కాదు. బ్రాహ్మణులు మంత్రాలు చదువుతూ అగ్నిలో నెయ్యి వేసేటప్పుడు పైకి లేచే అగ్ని జ్వాలలు ఎంత ఎత్తున లేస్తాయో మనం ఊహించలేం. ఆ సమయంలో మనం అనుకున్నట్టు జరుగుతుందని ఊహించవద్దు!” అన్నాయి.

వాటిలో ఏలాపుత్రుడు అనే నాగ కుమారుడు “కద్రువ పాములకి శాపం ఇచ్చే రోజున నేను ఆమె ఒడిలో నిద్ర రాకపోయినా నిద్రపోతున్నట్టు కళ్లు మూసుకుని ఉన్నాను. అప్పుడు గొప్ప గొప్ప దేవతలు, బ్రహ్మ ఒకళ్లతో ఒకళ్లు మాట్లాడుకున్న మాటలు విన్నాను. అవి మీకు వివరంగా చెప్తాను వినండి.”

తల్లి కద్రువ పాములకి శాపం ఇచ్చిన వెంటనే దేవతలందరూ బ్రహ్మతో ‘తండ్రీ! కద్రువ ఎంతో బలపరాక్రమాలు కలిగిన తన కుమారుల్ని భయంకరంగా శపించింది. దాన్ని ఎవరూ అడ్డుకోలేదు. ఈ శాపానికి వేరే మార్గం ఏమైనా ఉందా?’ అని అడిగారు.

వాళ్లు అడిగినదానికి బ్రహ్మ ‘లోకానికి హాని కలిగించే క్రూరమైన పాములు భూమాతకి బరువుగా అనిపిస్తున్నాయి. అందుకే భూమికి భారం తగ్గించడం కోసం సర్పయాగం చెయ్యడం వల్ల పాములకు కలిగే నాశనానికి అంగీకరించ వలసి వచ్చింది.

వాసుకి చెల్లెలైన జరత్కారువుకీ, జరత్కారుడు అనే గొప్ప మహర్షికీ వివాహం జరగాలి. వాళ్లిద్దరికీ గొప్ప తేజస్సుతో పుట్టే ఆస్తీకుడు అనే మహర్షి జనమేజయుడి యాగాన్ని ఆపగలడు. అలా జరిగినప్పుడు లోకానికి మంచిని చేసే ప్రముఖులైన నాగులు రక్షింపబడతారు’ అని దేవతలకి చెప్పిన విషయాన్ని చెప్పాడు.

నాగులందరు అది విని సంతోషంతో ఏలాపుత్రుణ్ని ఎత్తుకుని పొగిడారు. ఎప్పుడు జరత్కారుడు వస్తాడో ఎప్పుడు తన చెల్లెలు జరత్కారువుని భార్యగా స్వీకరిస్తాడో అని వాసుకి ఎదురు చూస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here