Site icon Sanchika

మహాభారత కథలు-13: జరత్కారుడి వృత్తాంతము

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

[dropcap]జ[/dropcap]రత్కారుడు అనే పేరుగల మహర్షి ‘యాయావరము’ అనే వంశంలో జన్మించాడు. అతడు గొప్ప కఠినమైన నియమనిష్ఠలు కలవాడు, బ్రహ్మచారి. మళ్లీ మళ్లీ జన్మలు పొందడం ఇష్టం లేక సంసార బంధంలో చిక్కుకోకుండా బ్రహ్మచారిగానే ఉండిపోవాలని నిశ్చయించుకున్నాడు.

తపస్సు చెయ్యడం, వేదాలు చదవడం, బ్రహ్మచర్యం వంటివాటితో ఋషుల ఋణం తీర్చుకుంటున్నాడు. ఒకరోజు నీటి ఒడ్డున తిరుగుతూ ఎలుకలు తినేసి ఒక్క వేరు మాత్రమే మిగిలి ఉన్న చెట్టుని, ఆ చెట్టు కొమ్మకి తలకిందులుగా వ్రేలాడుతూ సూర్యకిరణాల్ని భోజనం చేస్తూ జీవిస్తున్న కొంతమంది ఋషుల్ని చూశాడు. వాళ్లతో “అయ్యా! తలకిందులుగా చెట్టుకొమ్మని పట్టుకుని వేలాడుతూ తపస్సు చేసే విధానం కూడా ఉందా? ఇంత భయంకరమైన తపస్సు గురించి నేను ఎప్పుడూ వినలేదు. దాని గురించి చెప్తే ఆ తపస్సుని కూడా నేను చేస్తాను!” అని అడిగాడు.

“తపస్సంపన్నుడా! మా తరువాత సంతానం లేకపోవడం వల్ల; ఎటువంటి ఆధారం లేక; పాపలోకాలకి వెళ్లలేక; గొప్ప తపసంపన్నులమై ఉండి కూడా ఇటువంటి హీన స్థితిలో ఉన్నాము. మా వంశంలో జరత్కారుడు అనే పేరుతో ఒకడు పుట్టాడు. అతడు పెళ్లి చేసుకుని సంతానం పొందుతేనే గాని మాకు విముక్తి కలగదు. అతడు పెళ్లి చేసుకోడానికి అంగీకరించడు. మేము అతడి తాత తండ్రులం. మేము పట్టుకుని వెళ్లాడుతున్న ఔరుగడ్డి దుబ్బువేళ్లన్నీ యముడి వల్ల తెగిపోతున్నాయి. ఇంక ఒక్క వేరు మాత్రం మిగిలి ఉంది. జరత్కారుడు సంతానం పొందకపోతే ఆ వేరు కూడా తెగిపోతే మేము అధోలోకాలకి వెళ్లిపోతాం. అతడు సంతానం పొందితే మేము పైలోకాలకి చేరుకుని మోక్షాన్ని పొందుతాము. నువ్వు ఎవరివో మాకు తెలియదు కాని, ఓర్పుతో మేము చెప్పినదాన్ని విన్నావు. నీకు మా జరత్కారుడు కనిపిస్తే అతడికి మా బాధ గురించి చెప్పు” అన్నారు.

పితృదేవతల మాటలు విని జరత్కారుడు తను తప్పకుండా పెళ్లి చేసుకోవాలని, తనకు కలిగిన సంతానం వల్ల వాళ్లకి విముక్తి కలిగించాలని నిర్ణయించుకున్నాడు. వాళ్లతో “పితృదేవతలారా! నేనే జరత్కారుడు అనే పేరుగల మీ కొడుకుని. మీరు నా పితృదేవతలు. మిమ్మల్ని నేను పూజించాలి. అది మీ కొడుకుగా నా ధర్మం. ఇంతవరకు నేను పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. ఇలా వేలాడుతున్న మిమ్మల్ని చూశాక నేను చేస్తున్న బ్రహ్మచర్యం వల్ల మీరు ఎంత బాధ పడుతున్నారో అర్థం చేసుకున్నాను. నేను పెళ్లి చేసుకుని మంచి సంతానాన్ని పొంది మీ బాధని పోగొడతాను” అన్నాడు.

అది విని పితృదేవతలు చాలా సంతోషంతో “నాయనా! యోగ్యులైన కొడుకుల్ని పొంది ధర్మమార్గం విడిచి పెట్టకుండా నడుచుకునే ఆ కొడుకుల ద్వారా లోకంలో తమ పేరు నిలబడినప్పుడు పితృదేవతలు మంచి లోకాలు పొందుతారు. అంతేకాని, యజ్ఞాలు చెయ్యడం వల్ల, ఎక్కువగా దక్షిణలు ఇవ్వడం వల్ల పితృదేవతలు మంచి లోకాలకు చేరలేరు. అందుకే నువ్వు పెళ్లి చేసుకుని సంతానాన్ని పొందాలి!” అని చెప్పారు.

జరత్కారుడు-జరత్కారువుల పెళ్లి

పితృదేవతలు చెప్పినది విని జరత్కారుడు పితృదేవతలతో “నా పేరుతో సమానమైన పేరుగల కన్యతో వివాహం జరగాలని ఆశీర్వదించండి!” అని వాళ్లకి నమస్కరించాడు. తరువాత అటువంటి పేరుగల కన్యకోసం భూమండలమంతా తిరిగాడు. కాని తన పేరుతో సమానమైన పేరుగల కన్య అతడికి భూలోకంలో ఎక్కడా దొరకలేదు.

జరత్కారుడు కన్యకోసం వెతుకుతున్న విషయం వాసుకి తెలుసుకున్నాడు. తన చెల్లెలు జరత్కారువుని తీసుకుని తన సేవకులతో కలిసి జరత్కారుడి దగ్గరకి వెళ్లాడు. ఆయన్ని కలిసి “ధర్మాత్ముడా! లోకపూజ్యుడా! బ్రాహ్మణశ్రేష్ఠుడా! జరత్కారు మహర్షీ! మీ వంశం గొప్ప పుణ్యం చేసుకుంది. మీకూ మా చెల్లెలికీ పేర్లు, గుణాలు కలవడం వల్ల మా వంశం కూడా ధన్యమైంది. మా చెల్లెలు జరత్కారువు అనే కన్యని మీకు భిక్షగా ఇస్తున్నాను. ఆమెను ఇష్టంతో స్వీకరించి పెళ్లి చేసుకోండి” అన్నాడు.

వాసుకి చెప్పిన మాటలు విన్న జరత్కారుడు తను కోరుకున్నట్టుగా తన పేరు కలిసిన జరత్కారువుని పెళ్లి చేసుకున్నాడు. మొదటి రోజే అమెతో “నువ్వు నన్ను అగౌరవంగా చూసిన రోజు నేను నిన్ను విడిచిపెట్టి వెళ్లిపొతాను!” అని చెప్పాడు. ఆ రోజు నుంచి జరత్కారువు భయభక్తులతో భర్తకి సేవ చేస్తోంది. ఆమె జీవితం కత్తి మీద సాములా తయారయింది. భర్తకి భక్తితోను ఇష్టంతోను సేవ చేస్తూ కొంతకాలానికి గర్భవతి అయింది.

ఒకరోజు జింకచర్మం మీద కూర్చున్న జగత్కారువు తొడ మీద తల పెట్టుకుని నిద్రపోతున్నాడు జగత్కారుడు. సాయంకాలమయింది. ఆశ్రమంలో ఉన్న ఋషులందరూ సాయంకాలం చెయ్యవలసిన సంధ్యావందన కార్యక్రమాలు చెయ్యడం కోసం బయలుదేరారు. తన భర్తని నిద్ర లేపితే నిద్రాభంగమైందని కోపగిస్తాడేమో.. లేపకపోతే సంధ్యాకాలంలో చెయ్యవలసిన పనులు చెయ్యకపోతే ధర్మానికి భంగమైందని కోపగిస్తాడేమో.. అని భయపడుతూ మనస్సులో కూడా ధర్మానికి భగం కలగకూడదన్న నిశ్చయంతో జరత్కారుణ్ని నిద్ర లేపింది.

నిద్ర నుంచి లేచిన జరత్కారుడు “నాకు నిద్రాభంగం ఎందుకు చేశావు?” అని అడిగాడు కోపంగా. ఆమె చెప్పిన కారణం విని “నేను నిద్ర లేవకుండా సూర్యుడు పడమటి కొండకి వెళ్లడానికి భయపడతాడని నీకు తెలియదా? నన్ను నిద్ర లేపి అవమానం చేశావు కనుక, ఇంతకు ముందు నీకు చెప్పినట్టే నిన్ను విడిచి వెళ్లిపొతున్నాను. సూర్యుడితోను, అగ్నితోను సమానమైన కాంతి కలిగి, మన రెండు వంశాల్ని ఉద్ధరించ కలిగిన శక్తితో నీకు కుమారుడు జన్మిస్తాడు. నువ్వు నీ అన్న దగ్గరే ఉండు, అక్కడ ఏ భయము ఉండదు” అని చెప్పి జరత్కారుడు తపస్సు చేసుకునేందుకు అడవికి వెళ్లిపోయాడు.

జరత్కారువు జరత్కారుడు చెప్పినట్టే వాసుకి దగ్గరే ఉండి పోయింది. కొంతకాలానికి జరత్కారువుకి గొప్ప తేజస్సుతో ‘ఆస్తీకుడు’ జన్మించాడు. అతడు పెరిగి పెద్దవాడై చ్యవన మహర్షి కుమారుడు ప్రమతి దగ్గర వేదవేదాంగాలు నేర్చుకున్నాడు. ప్రశాంతమైన మనస్సుతో అన్ని శాస్త్రాలు తెలుసుకుని పెరిగి పెద్దవాడయ్యాడు.

Exit mobile version