మహాభారత కథలు-14: పరీక్షిత్తు మహారాజుకి శాపము

0
3

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

[dropcap]కౌ[/dropcap]రవవంశం నాశనమవుతున్న సమయంలో అర్జునుడి కుమారుడు అభిమన్యుడు, విరాటమహారాజు కూతురు ఉత్తర దంపతులకి ధర్మస్వరూపుడైన పరీక్షిత్తు జన్మించాడు.

పరీక్షిత్తు మహారాజు కుమారుడు జనమేజయుడు. ఒకరోజు ఉదంకుడు వచ్చి జనమేజయుడితో అతడి తండ్రి పరీక్షిత్తు మహారాజు మరణించాడని చెప్పాడు. జనమేజయ మహారాజు మంత్రుల్ని పిలిచి అది ఎలా జరిగిందో చెప్పమని అడిగాడు. జరిగిన విషయాన్ని మంత్రులు జనమేజయుడికి వివరించారు.

పరీక్షిత్తు మహారాజు ధర్మం, అర్ధం, కామం అనే పురుషార్ధాల్ని అతిక్రమించకుండా.. ప్రజలకి ఏ కష్టమూ కలగకుండా.. భూమి మీద ఉన్న ప్రజలందర్నీ కాపాడుతూ.. అరవై సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. పాండురాజు కొడుకు అర్జునుడు. అర్జునుడి కొడుకు అభిమన్యుడు. అభిమన్యుడి కొడుకు పరీక్షిత్తు. పరీక్షిత్తు కొడుకు జనమేజయుడు. ఆ వంశంలో పాండురాజుకి వేటంటే చాలా ఇష్టం. అలాగే పరీక్షిత్తుకి కూడా వేటంటే చాలా ఇష్టం.

ఒకరోజు అడవికి వెళ్లి పెద్ద పెద్ద జంతువుల్ని వేటాడుతున్నాడు. తన బాణంతో దెబ్బతిన్న ఒక లేడి పారిపోతుంటే దాన్ని తరుముకుంటూ చాలా దూరం వెళ్లిపోయాడు. ఒక చోట శమీకుడు అనే పేరుగల మహర్షి తపస్సు చేసుకుంటూ కనిపించాడు. పరీక్షుత్తు శమీకుడితో “మహర్షీ! నేను బాణంతో కొట్టడం వల్ల లేడికి దెబ్బ తగిలింది. ఆ లేడి ఇటువైపు వచ్చిందా?” అని అడిగాడు. శమీకుడు తపస్సులో ఉండడం వల్ల పరీక్షిత్తు మాటలు వినలేదు. అందుకని అతడి ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. తను అడిగినదానికి బదులు చెప్పలేదని పరీక్షిత్తుకి శమీకుడి మీద కోపం వచ్చి దగ్గర్లో చచ్చి పడి ఉన్న ఒక పాముని తన బాణం కొసతో తీసి శమీకుడి మెడలో వేసి వెళ్లిపోయాడు.

శమీకుడి కుమారుడు ‘శృంగి’. అతడు శివుడి సేవకుడైన భృంగితో సమానమైనవాడు. గొప్ప తపస్సంపన్నుడు. అతడికి కోపం చాలా ఎక్కువ. జరిగినదాన్ని చూసిన ‘కృశుడు’ అనే ముని బ్రహ్మకోసం తపస్సు చేస్తున్న శృంగి దగ్గరికి వచ్చి పరీక్షిత్తు మహారాజు శమీకుడి మెడలో చచ్చిన పాముని వేసి వెళ్లిపోయాడని చెప్పాడు.

మౌనంగా తపస్సు చేసుకుంటున్న ముసలివాడైన తన తండ్రి మెడలో చచ్చిన పాముని వేసి వెళ్లినందుకు పరీక్షిత్తు మహారాజు మీద శృంగికి చాలా కోపం వచ్చింది. “నా తండ్రి మెడలో చచ్చిన పాముని వేసిన పరీక్షిత్తు అనే పేరుగల మహారాజు నేటి నుంచి ఏడు రోజుల్లో తక్షకుడు అనే పాము విషం వల్ల మరణించుగాక!” అని శాపం ఇచ్చాడు.

తరువాత తన తండ్రి దగ్గరికి వెళ్లాడు శృంగి. మెడలో చచ్చిన పాము వేలాడుతున్నా తెలియని స్థితిలో ధ్యానంలో మునిగి ఉన్నాడు శమీకుడు. శృంగి తండ్రి మేడలో ఉన్న పాముని తీసి పారేశాడు. కళ్లు తెరిచి చూశాడు శమీకుడు. శృంగి జరిగిన విషయాన్ని తండ్రికి వివరించాడు. అది విని శమీకుడు చాలా బాధపడి “నాయనా! నువ్వు చేసిన పని చాలా తప్పు. కోపమే తపస్సుని, అణిమ, లఘిమ అనబడే అష్టసిద్ధుల్ని పోగొడుతుంది. ధర్మ కార్యాలు చెయ్యవలసిన మునులకి కోపం ఉండచ్చా? ఓర్పు లేని మహర్షి చేసిన తపస్సు; అహంకారి దగ్గరుండే ధనము; ధర్మం తప్పిన రాజుకి చెందిన రాజ్యము పగిలిన కుండలో పోసిన నీళ్లు బయటికి పోయినట్లు ఎందుకూ పనికి రాకుండా పోతాయి.

మహర్షులకి ఏది ఉండకూడదో అదే కోపంతో నువ్వు ఓర్పు లేకుండా భూమండలం మీద ఉన్న ప్రజలందర్నీ రక్షిస్తున్న ధర్మాత్ముడైన పరీక్షిత్తు మహారాజుని శపించి పొరపాటు చేశావు. రాజులు రక్షిస్తున్నారు కనుకనే మహర్షులు తీవ్రమైన తపస్సు చేస్తూ, వేదాల్లో చెప్పబడిన ధర్మాలు నిర్వర్తిస్తూ గొప్ప శక్తి కలిగి ఉంటున్నారు. అటువంటి రాజులకి కీడు చెయ్యడం కంటే మించిన పాపం ఏదీ ఉండదు. పరీక్షిత్తు మహారాజు అంటే సామాన్యుడు అనుకున్నావా? భూమిని పాలించిన వాళ్లల్లో క్షత్రియ కులానికి చెందిన రాముడు, మాంధాత, రఘుమహారాజు కూడా పరీక్షిత్తు మహారాజు పాలించినట్టు పాలించలేదు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే నాలుగు వర్ణాల ప్రజల్ని తమ ధర్మాలు తప్పకుండా ఉండేలా వాళ్లకంటే ఎక్కువగా కాపాడుకుంటూ వస్తున్నాడు.

వేటపైన ఆసక్తి వల్ల అలిసిపోయి ఆకలి, దప్పికల వల్ల తెలియని స్థితిలో ఉండి నన్ను అవమాన పరిచాడు. అది కావాలని చేసిన పని కాదు. నేను అతడి ప్రశ్న విని కూడా సమాధానం ఇవ్వలేదని పొరపాటు పడ్డాడు. నువ్వు అతడికి ఇచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకో!” అన్నాడు. తండ్రి మాటలు విని శృంగి “తండ్రీ! నా శాపం జరిగే తీరుతుంది. వెనక్కి తీసుకోడం నాకు చాతకాదు!” అన్నాడు.

శమీకుడు మనస్సులో బాధపడుతూ గౌరముఖుడు అనే పేరుగల శిష్యుణ్ని పిలిచి “పరీక్షిత్తు మహారాజు దగ్గరికి వెళ్లి అతడికి శృంగి ఇచ్చిన శాపం గురించి చెప్పి తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పు” అని చెప్పి పంపించాడు.

గౌరముఖుడు రాజు దగ్గరికి వెళ్లి “మహారాజా! మీరు ఏకాగ్రతతో తపస్సు చేసుకుంటున్న మా గురువుగారి మెడలో చచ్చిన పాముని వేసి వచ్చారు. అది చూసిన అయన కుమారుడు శృంగి ఏడు రోజుల్లో మీరు తక్షకుడు అనే పాము విషంతో మరణించాలని శాపమిచ్చాడు. ఆ విషయం తెలిసిన మా గురువుగారు బాధపడి జాగ్రత్తగా ఉండమని మీకు చెప్పి రమ్మని నన్ను పంపించారు” అని చెప్పి వెళ్లిపోయాడు.

గౌరముఖుడు చెప్పినదాన్ని విని పరీక్షిత్తు తను చేసిన ధర్మ విరుద్ధమైన పనికి బాధపడ్డాడు. శమీకుడి ఓర్పుకి మెచ్చుకున్నాడు. శృంగి ఇచ్చిన శాపానికి భయపడి తనను రక్షించుకోడానికి చెయ్యవలసిన కార్యక్రమాల గురించి మంత్రులతో సంప్రదించాడు. భూమికంతటికీ ప్రభువైన పరీక్షిత్తు నేర్పరులైన వడ్రంగుల్ని పిలిపించాడు. ఒంటిస్తంభంతో మేడ కట్టించమని ఆజ్ఞాపించాడు. రాత్రి పగలు తనను విడవకుండా నమ్మకంగా ఉండే ఆప్తులు, సేవకులు, మంత్రులు మొదలయిన వాళ్లని రక్షణకి ఏర్పాటు చేసుకుని ఒంటిస్తంభం మేడలో నివసించాడు. విషాన్ని పోగొట్టే మంత్రాలు తెలిసినవాళ్లని, విషవైద్యుల్ని రప్పించుకున్నాడు. విధిని ఎవరూ తప్పించలేరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here