Site icon Sanchika

మహాభారత కథలు-18: మత్స్యగంధి, వ్యాసుల పుట్టుక

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

[dropcap]ఒ[/dropcap]కరోజు ఉపరిచరుడు తన భార్య గిరికకి మృగమాంసం పెట్టాలని వేటకోసం అడవికి వెళ్లాడు. గిరికని తలుచుకుంటూ తిరుగుతూన్న ఉపరిచరుడి వీర్యం కింద పడింది. తన వీర్యాన్ని ఆకుదొప్పలో పెట్టి ఒక డేగ మెడకి కట్టాడు. దాన్ని తీసుకుని వెళ్లి గిరికకి ఇమ్మని డేగకి చెప్పాడు.

డేగ ఆకాశంలో ఎగురుతుండగా దాని దగ్గర ఉన్నది మాంసమని అనుకుని మరొక డేగ అడ్డుపడింది. ఆ రెండింటి మధ్య పోట్లాట జరిగింది. డేగ తీసుకుని వెడుతున్న వీర్యం యమునానది నీళ్లల్లో పడిపోయింది. ‘అద్రిక’ అనే అప్సరస ఆ నదిలో బ్రహ్మ ఇచ్చిన శాపం వల్ల చేపగా మారి తిరుగుతూ నదిలో పడిన వీర్యాన్ని తాగి గర్భవతి అయింది. పది నెలలు గడిచాక ఒకరోజు ఆ చేప జాలరులకి దొరికింది. ఇంటికి తీసుకుని వెళ్లి దాని పొట్ట చీల్చారు. దాని కడుపులో మనిషి రూపంలో కనిపించిన ఇద్దరు పిల్లల్ని జాగ్రత్తగా బయటకి తీసి తమ ప్రభువు దాశరాజుకి ఇచ్చారు.

అప్సరసకి శాపం తీరిపోయి దివ్యలోకాలకి వెళ్లిపోయింది. చేప కడుపులోంచి పుట్టిన కుమారుడు ‘మత్స్యరాజు’ అనే పేరుతో మత్స్యదేశానికి రాజయ్యాడు. ఆడపిల్లని దాశరాజు ‘సత్యవతి’’ అని పేరు పెట్టి తన కుమర్తెగా పెంచుకున్నాడు. ఆమె ‘మత్స్యగంధి’ అనే పేరుతో పెరిగి పెద్దదయింది. దాశరాజు మాట ప్రకారం యమునా నదిలో ఓడ నడుపుతోంది.

అసూయాద్వేషాలు లేనివాడు, ముల్లోకాలతో పూజింపబడేవాడు, అందరి పాపాల్ని నశింపచేసేవాడు, వశిష్ఠమహర్షికి మనుమడు, శక్తిమహర్షికి కొడుకు అయిన పరాశరుడు అనే మహర్షి తీర్థయాత్రకి వెడుతూ మధ్యలో యమునానది దాటడానికి రేవుకి వచ్చాడు. మత్స్యగంధిని చూసి ఇష్టపడి తన కోరికని ఆమెకి తెలియచేశాడు. కాదంటే తనను శపిస్తాడేమో అని భయపడింది. అయినా తనకు చేతనైనట్లుగా ఆయనకి నచ్చచెప్పింది.

ఆమె మాటలు విని “మత్స్యగంధీ! నువ్వు దాశరాజు కుమార్తెవు కాదు. సూతవంశంలో జన్మించలేదు. వసుమహారాజు వంశానికి చెందినదానివి” అని ఆమె జన్మవృత్తాంతాన్ని వివరించి చెప్పాడు పరాశరుడు. ఆమె శరీరం నుంచి వచ్చే చేపల వాసన పోయి చాలా దూరం వరకు మంచి సువాసన వచ్చేటట్లు అనుగ్రహించాడు. అప్పటినుంచి ఆమె ‘గంధవతి’, ‘యోజనగంధి’ అని పిలవబడింది. పరాశరుడు ఆమెకి అనేక దివ్యమైన వస్త్రాలు, ఆభరణాలు కానుకగా ఇచ్చాడు.

బ్రహ్మతో సమానమైన పరాశర మహర్షి తపోమహిమ వల్ల సత్యవతికి సూర్యుడితో సమానమైన వేదమయుడు, ఆదిముని, జ్ఞానవంతుడు వ్యాసుడు కొడుకుగా పుట్టాడు. పరాశరుడు సత్యవతి కోరుకున్న వరాలు అనుగ్రహించి వెళ్లిపోయాడు. వ్యాసుడు ‘నల్లనివాడు, మంచి వాక్కు కలవాడు, కృష్ణద్వైపాయనుడు’ అనే పేరుతో ప్రసిద్ధికెక్కాడు. కృష్ణద్వైపాయనుడు జింకచర్మం, ఎర్రని జడలు, దండకమండలాలు ధరించి తల్లి ఎదురుగా నిలడ్డాడు. ఆమెకి నమస్కారం చేసి “తల్లీ! నావల్ల మీకు ఏ అవసరం కలిగినా నన్ను పిలవండి, క్షణంలో వచ్చేస్తాను” అని చెప్పి తపస్సు చేసుకునేందుకు వెళ్లిపోయాడు.

పరాశర మహర్షి వల్ల సత్యవతికి బ్రహ్మ అంశతో జన్మించిన వ్యాసుడు, ప్రపంచ శ్రేయస్సుకోసం వేదాల్ని విభజించి, పంచమవేదమనే మహాభారతాన్ని రచించి వేదవ్యాసుడుగా ప్రసిద్ధికెక్కాడు.

భీష్ముడు ఇతర వీరుల పుట్టుక

దేవతలు, రాక్షసులు, యక్షులు, పక్షులు, మునులు, గంధర్వులు మొదలైనవాళ్ల అంశలతో భీష్ముడు మొదలైన మహావీరులు అనేకమంది భారతయుద్ధం చెయ్యడానికి జన్మించారు. వాళ్ల బలాబలాల గురించి అనేక వేల ముఖాలతో, అనేక వేలమంది, అనేక వేలసార్లు, అనేక వేల సంవత్సరాలు చెప్పినా పూర్తవదు” అని వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పాడు.

జనమేజయుడు “మహర్షీ! దేవదానవుల అంశలతో పుట్టిన రాజులు అందరూ ఒకేసారి మహాభారత యుద్ధంలో మరణించడానికి కారణం ఏమిటి?” అని అడిగాడు.

వైశంపాయనుడు చెప్తున్నాడు “పరశురాముడు క్షత్రియుల మీద కోపంతో ఇరవై ఒక్క సార్లు దండెత్తి రాజులందర్నీ చంపేశాడు. రాజుల భార్యలు సంతానం కోసం శ్రేష్ఠులైన బ్రాహ్మణుల్ని ఆశ్రయించారు. వాళ్ల అనుగ్రహంతో ధర్మబద్ధంగా సంతానాన్ని పొందారు. రాజుల వంశాలు మళ్లీ వృద్ధి చెందాయి. ఆ రాజులందరు ధర్మమార్గంలో నడిచి ప్రజలకి బాధ కలగకుండా రాజ్యాల్ని పాలించారు.

బ్రాహ్మణుల అనుగ్రహంతో జన్మించిన రాజుల ధర్మబద్ధమైన పరిపాలనలో వర్ణాశ్రమ ధర్మాలు మళ్లీ స్థిరపడ్డాయి. ధర్మం పెరగడం వల్ల బ్రాహ్మణులకి క్షత్రియులకి ఆయుర్దాయం కూడా పెరిగింది. యజ్ఞాలు ఆగకుండా జరుగుతూ ఊండడం వల్ల దేవేంద్రుడు సంతోషించి అవసరమైన సమయాల్లో వర్షాలు కురిపించాడు. అందువల్ల భూమి మీద సారవంతమై పంటలు బాగా పండాయి. జనసాంద్రత కూడా పెరిగింది.

ప్రజల భారం మొయ్యలేక భూదేవి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల దగ్గరికి వెళ్లి “మహానుభావులారా! ప్రజల భారాన్ని మొయ్యలేక పోతున్నాను. దీనికి ఏదేనా మార్గం చూడండి!” అని ప్రార్థించింది.

బ్రహ్మదేవుడి అంగీకారంతో విష్ణుదేవుడు గొప్పదైన తన ఆంశ ఎక్కువగా ఉండేలా, ఇంద్రాది దేవతలు తమ అంశలతో భూమి మీద పుట్టేలా చేశాడు. దేవతలు, రాక్షసులు, యక్షుల అంశలతో శిశుపాలుడు మొదలైన గర్వంతో ఉన్న రాజులు జన్మించారు. వాళ్లల్లో కొంతమంది ప్రజలకి సన్నిహితంగాను, మరికొంతమంది ప్రజలకి దూరంగాను, కాఠిన్యంగాను ఉన్నారు. దేవతల అంశలతో సాటిలేని పరాక్రమంతో పుట్టిన వాళ్లందరూ పాండవుల పక్షాన ఉన్నారు. రాక్షసాంశలతో పుట్టిన వాళ్లందరూ దుర్మార్గుడు, ఉన్మాదుడు అయిన దుర్యోధనుడి పక్షాన ఉన్నారు.

వీళ్లంతా గొప్ప పరాక్రమం కలవాళ్లు. ఒకళ్లతో ఒకళ్లు పోట్లాడుకుని భారత యుద్ధంలో వీరమరణం పొందారు.

Exit mobile version