Site icon Sanchika

మహాభారత కథలు-21: యయాతి-దేవయాని – శర్మిష్ఠ

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

యయాతి-దేవయాని – శర్మిష్ఠ

[dropcap]న[/dropcap]హుషుడి కుమారుడు యయాతి మహారాజు వేట కోసం అడవికి వెళ్లాడు. తిరుగుతూ తిరుగుతూ అడవి మధ్యలో దేవయాని పడి ఉన్న బావి దగ్గరికి వచ్చాడు. దాహంతో ఉన్న యయాతి నీటి కోసం బావిలోకి చూశాడు. అందులో ఒక లతను పట్టుకుని వేలాడుతూ ఉన్న అందమైన ఒక యువతి కనిపించింది. ఏడుస్తూ ఉన్న ఆమెని చూసి ఆశ్చర్య పోయి “ఎవరు నువ్వు? ఈ బావిలో ఎలా పడ్డావు?” అని అడిగాడు.

దేవయాని “బలవంతులైన రాక్షసులు యుద్ధంలో మరణించినప్పుడు సంజీవని విద్యతో బ్రతికించే రాక్షస గురువు శుక్రాచార్యుడు నా తండ్రి. నా పేరు దేవయాని. పొరపాటున ఈ బావిలో పడి పైకి రాలేకపోతున్నాను రక్షించండి!” అని అడిగింది. యయాతి దేవయాని బ్రాహ్మణ కన్య అని తెలుసుకున్నాడు. ఆమె మీద జాలిపడి అతి సుకుమారంగా ఉన్న ఆమె చేతిని అందుకుని బావినుంచి పైకి తీసాడు. వేట ముగించుకుని తన పట్టణానికి వెళ్లిపోయాడు.

అంతలో దేవయాని చెలికత్తె ఘూర్ణిక ఆమెకోసం వెతుక్కుంటూ వస్తోంది. దేవయాని ఘూర్ణికని చూసి “నేను వృషపర్వుడి పట్టణంలో అడుగుపెట్టను. నన్ను శర్మిష్ఠ అవమానించింది. నా తండ్రినే ఇక్కడికి రమ్మని చెప్పు!” అని చెప్పింది. ఘూర్ణిక పరుగెత్తుకుంటూ వెళ్లి శర్మిష్ఠ చెప్పమన్న విషయం శుక్రాచార్యుడికి చెప్పింది. ఆయన వెంటనే బయలుదేరి దేవయాని దగ్గరికి వచ్చాడు. కోపంతో ఎర్రబడ్డ ముఖము, కళ్లనిండ నీళ్లు నింపుకుని కూర్చున్న కుమార్తెని చూశాడు.

“దేవయానీ! గొప్ప దక్షిణలు ఇచ్చి వేలకొద్దీ యజ్ఞాలు చేసినవాళ్ల కంటే కోపం లేనివాళ్లే గొప్పవాళ్లు తెలుసా? ఇతరులు మనమీద కోపగించినా, మనమీద నిందలు వేసినా వాటిని విననట్టే ఏమీ మాట్లాడకుండా ఉండాలి. అవమానం పొందినా కూడా మనస్సులో దాన్ని అవమానంగా భావించకుండా ఉన్నవాళ్లే ధర్మాత్ములు అనిపించుకుంటారు. బుద్ధిమంతులకి కోపం ఉండకూడదు. తల్లీ! శర్మిష్ఠ రాజకుమారి, పైగా చిన్నపిల్ల. ఆమె మాటలు పట్టించుకోకూడదు. ఇంటికి వెడదాం రా!” అని పిలిచాడు.

“ఇతరుల గొప్పతనాన్ని లక్ష్యపెట్టక నిందలు వేసే జ్ఞానహీనుల దగ్గరకు నేను రాను. వృషపర్వుడి పట్టణంలో నేను ఉండను. ఎక్కడికైన వెళ్లిపోతాను” అంది దేవయాని. ఆమె మాటలు విని శుక్రాచార్యుడు “నాకు నువ్వు తప్ప ఎవరు ఉన్నారు. నాకు నువ్వు, నీకు నేనే కదా! నేను కూడ నీతోనే వస్తాను!” అని దేవయానిని ఓదారుస్తున్నాడు శుక్రాచార్యుడు. దేవయానితో కలిసి శుక్రాచార్యుడు కూడా రాజ్యాన్ని వదిలి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు.

దేవయానికి దాసిగా శర్మిష్ఠ

శుక్రాచార్యుడు రాజ్యం వదిలి వెళ్లిపోవాలనుకున్నాడని అప్పటికప్పుడే చారుల వల్ల రాక్షస రాజు వృషపర్వుడికి తెలిసింది. రాజు వెంటనే వచ్చి శుక్రాచార్యుడికి నమస్కారం చేసి “గురువర్యా! నీ గొప్పతనం, సహకారం వల్లే దేవతల్ని జయించగలిగాను, అనేక సంపదలు పొందాను. రాక్షసులు గర్వంతో బలిసి అది తెలుసుకోలేక పోతున్నారు.

నీ సంజీవనీ విద్య లేకపోతే అందరూ యముడి దగ్గరకు చేరి ఉండేవాళ్లు. దేవతల ఆయుధాల దెబ్బలతో సముద్రంలో పడి ఉండేవాళ్లు. నాకు సంబంధించిన సైన్యము, రాక్షసులు అన్నీ మీవే! నాకు చెందిన సంపదలన్నీ మీ సంపదలే! దేవయానికి ఇష్టమైనట్లే చేద్దాము” అన్నాడు వినయంగా. వెంటనే దేవయాని సంతోషంతో శుక్రాచార్యుడికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా “అయితే శర్మిష్ఠ తన చెలికత్తెలతో కలిసి నాకు దాసిగా ఉండాలి. ఇదే నాకు ఇష్టం, దీన్నే నాకు ఇవ్వండి” అంది.

వృషపర్వుడు వెంటనే శర్మిష్ఠని అమె చెలికత్తెల్ని రప్పించాడు. వాళ్లని దేవయానికి దాసిగా ఉండమన్నాడు. దేవయాని అడిగినదాన్ని చేస్తే శుక్రాచార్యుడు సంతోషపడతాడని వృషపర్వుడుకి తెలుసు. గురువుగారి ఇష్టాన్ని తెలుసుకుని ప్రవర్తించాడు. ఆ రోజు నుంచి శర్మిష్ఠ తన చెలికత్తెలతో కలిసి దేవయానికి దాసిగా సేవలు చెయ్యడం మొదలుపెట్టింది. దేవయాని తన కోరిక తీరినందుకు సంతోషంగా ఉంది. శర్మిష్ఠ, ఆమె చెలికత్తెలు ప్రతి రోజు వచ్చి దేవయానికి సపర్యలు చేస్తున్నారు.

ఒకరోజు దేవయాని తన చెలికత్తెలతో కలిసి ఆడుకోడానికి ఎప్పుడూ వెళ్లే వనానికి వెళ్లింది. వాళ్లు కొండకి ఆనుకుని ప్రవహిస్తున్న నది పక్కన చెట్లకి పూసిన పువ్వులు కోసుకుంటున్నారు. మామిడిచెట్లు, పొగడ, అశోక, గోరంట, మద్ది మొదలైన చెట్ల నీడల్లో పాడుకుంటూ తిరుగుతున్నారు. ఇసుక తిన్నెల మీద ఆడుకుంటూ సంతోషంగా గడుపుతున్నారు.

అదే సమయంలో వీరుడైన యయాతి మహారాజు వేటకోసం అడవికి వచ్చాడు. అలిసిపోయి విశ్రాంతి తీసుకుందామని అనుకుంటూ వాళ్ల మాటలు విని అటువైపు వచ్చాడు. అతడికి దేవయాని ముందే తెలుసు. శర్మిష్ఠని చూస్తూ అందరి గురించి చెప్పమన్నాడు. వెంటనే దేవయాని “రాజా! నన్ను గురించి ముందే తెలుసుకున్నావు. ఈమె నాకు సేవకురాలు. రాక్షసరాజు వృషపర్వుడి కుమార్తె శర్మిష్ఠ. ఎప్పుడూ నా దగ్గరే ఉండి నాకు సేవ చేస్తూ ఉంటుంది” అని చెప్పింది.

“ఓ రాజా! నన్ను బావి నుంచి బయటకు తీసిన రోజు నీ పొడవైన కుడి చేతితో నా కుడి చేతిని పట్టుకున్నావు. కాబట్టి ఇంతకు ముందే సూర్యుడి సాక్షిగా నన్ను పెళ్లిచేసుకున్నావు. ఈ విషయం మర్చిపోవడం న్యాయం కాదు. నహుషుడి కుమారుడవైన యయాతీ! నన్ను పెళ్లి చేసుకుని దేవకన్యలకు కూడా సాటి రాని అందమైన శర్మిష్ఠ మొదలైన నా సేవకులతో సేవ చేయించుకో. ఇంద్రుడు అనుభవించినట్లు, మానవ లోకంలోనే అనేక భోగాలు అనుభవించు!” అని చెప్పింది.

దేవయాని యయాతికి అన్ని ధర్మాలు చెప్పడానికి కారణం కూడా ఉంది. ఆమెకి యయాతి మహారాజు శర్మిష్ఠని పెళ్లి చేసుకుంటాడేమో అని అనుమానం.. అతడు తననే పెళ్లిచేసుకోవాలన్న పట్టుదల. ఆమె మాటలు విని యయాతి “దేవయానీ! క్షత్రియుల కుమార్తెల్ని బ్రాహ్మణులు పెళ్లి చేసుకుంటారు. కాని బ్రాహ్మణుల కుమార్తెల్ని క్షత్రియ కుమారులు పెళ్లి చేసుకోరు. నీ మాటలు ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నాయి. అదీకాక, అన్ని వర్ణాలవాళ్ల ఆశ్రమ ధర్మాల్నీ కాపాడుతున్న నేను అధర్మానికి ఒడిగడితే లోకమంతా దాన్నే పాటిస్తుంది” అన్నాడు.

అతడి మాటలు విని దేవయాని “రాజా! ధర్మాల గురించి, అధర్మాల గురించి నిర్ణయాలు చేసే నా తండ్రి నిన్ను ఆజ్ఞాపిస్తే నన్ను పెళ్లి చేసుకుంటావా?” అని అడిగింది.

యయాతి “మహర్షి శుక్రాచార్యుడు వచ్చి మన పెళ్లి ధర్మానికి విరుద్ధం కాదని చెప్తే నిన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను!” అన్నాడు. వెంటనే దేవయాని తన తండ్రిని అక్కడికి రప్పించింది. భృగుకుమారుడు, గొప్ప తపస్సంపన్నుడైన శుక్రాచార్యుడు అక్కడికి వచ్చాడు. ఆయన రాగానే అడవి మొత్తం కాంతితో నిండి పోయింది. తపశ్శక్తిలో బ్రహ్మతో సమానమైన దేవయాని తండ్రి శుక్రాచార్యుణ్ని చూడగానే రాజు యయాతి తత్తరపడుతూ లేచి నిలబడి భక్తితో నమస్కరించాడు.

దేవయాని, శర్మిష్ఠ అమె చెలికత్తెలు లేచి శుక్రాచార్యుడికి భక్తితో నమస్కరించారు. “పరబ్రహ్మ స్వరూపుడవైన తండ్రీ! గొప్పవాడైన ఈ రాజు ఇంతకు పూర్వమే నా చేతిని పట్టుకున్నాడు. ఇప్పుడు నేను ఇతణ్ని కాదని ఇంకొకళ్లని పెళ్లి చేసుకోవచ్చా? ఈ జన్మలో యయాతే నాకు భర్త. ఈ రాజు ధర్మానికి వ్యతిరేకమైన పని చెయ్యడానికి ఇష్టపడట్లేదు. మా పెళ్లి ధర్మానికి వ్యతిరేకం కాకుండా ఉండేట్టుగా మీరు అనుగ్రహించండి!” అని తండ్రిని అడిగింది.

శుక్రుడు తన కుమార్తె మీద ప్రేమతో “యయాతికీ నీకూ జరిగే ఈ పెళ్లిలో అధర్మ దోషం లేకుండా ఉండుగాక!” అని వరమిచ్చాడు. తరువాత వాళ్లిద్దరికీ అత్యంత వైభవంగా పెళ్లి జరిపించాడు. కచుడు శపించినట్టు దేవయానికి బ్రాహ్మణ వరుడితో వివాహం జరగలేదు. శర్మిష్ఠని చూపించి శుక్రాచార్యుడు “రాజా! ఈమె వృషపర్వుడనే రాక్షసరాజు కూతురు. ఈమెకి భోజనము, పానీయాలు, అలంకారాలు, వస్త్రాలు, దండలు, శరీరానికి పూసుకునే లేపనాలు మొదలైనవి ఇచ్చి సంతోషంగా ఉండేలా చూడు. కాని, భార్య స్థానం మాత్రం ఇవ్వద్దు!” అని ఆజ్ఞాపించాడు.

కుమార్తె దేవయానిని, అల్లుడు యయాతిని కొన్ని రోజులు తన దగ్గర ఉంచుకున్నాడు. తరువాత యయాతి శుక్రాచార్యుడి దగ్గర సెలవు తీసుకుని దేవయానిని, శర్మిష్ఠని ఆమె చెలికత్తెల్ని తీసుకుని తన పట్టణానికి వెళ్లిపోయాడు. అక్కడ ఒక అందమైన భవనంలో దేవయానితో కలిసి జీవిస్తున్నాడు.

శర్మిష్ఠని ఆమెతో వచ్చిన చెలికత్తెల్ని అశోకచెట్ల వనంలో ఉన్న ఇంట్లో ఉండమన్నాడు. దేవయాని, యయాతి అనేక సుఖాలు అనుభవిస్తూ ఆనందంగా ఉన్నారు. దేవయానికి యదువు, తుర్వసుడు అనే కుమారులు కలిగారు.

శర్మిష్ఠకి సంతానాన్ని ప్రసాదించిన యయాతి

శర్మిష్ఠ ఆలోచిస్తోంది “స్త్రీలు భర్తని, సంతానాన్ని కోరుకుంటారు. అలాగే దేవయాని కూడా భర్తని సంతానాన్ని కోరుకుంది. అదృష్టవంతురాలు! అనుకున్నదాన్ని సాధించింది. ఇంత అదృష్టం ఇంకెవరికి ఉంటుంది? నాకు కూడా ఎప్పుడూ యయాతి రాజు మీదకే మనస్సు పోతోంది. ఆ రాజు నా వైపు చాలా ప్రేమగాను, దయగాను చూస్తుంటాడు. దేవయాని తను కోరుకున్నట్టుగా ఎలా పెళ్లి చేసుకుందో అదే విధంగా నేను కూడా ఇతరుల మేలు కోరేవాడూ, ధర్మాన్ని అనుసరించేవాడూ, చక్రవర్తి, నహుషుడి కుమారుడైన యయాతి వల్ల సంతానాన్ని పొందుతాను!” అని ఒక నిర్ణయానికి వచ్చింది.

శర్మిష్ఠ అలోచిస్తూ ఉండగానే ఆమె పుణ్యం ఫలించిందా అన్నట్టు యయాతి మహారాజు అక్కడికి వచ్చాడు. యయాతికి అందమైన అశోకవనాన్ని చూడాలనిపించి ఒక్కడే అక్కడికి వచ్చాడు. ఒంటరిగా కూర్చుని అలోచిస్తున్న శర్మిష్ఠ అతడికి కనిపించింది. యయాతిని చూసిన శర్మిష్ఠ ఆశ్చర్యంతో లేచి నిలబడింది.

తనవైపే దయతో చూస్తున్న యయాతికి వినయంగా నమస్కారం చేసి “మహారాజా! నాకు యజమనురాలైన దేవయానికి భర్తవైన నువ్వు నాకు కూడా భర్తవే! ధర్మాన్ని కాపాడే రాజా! నేను చెప్పేది ధర్మమార్గం, యథార్థం. ఈ లోకంలో భార్య, సేవకురాలు, కుమారుడు అనేవి విడిచిపెట్టలేని ధర్మాలు. మీరు దేవయానిని పెళ్లి చేసుకున్నప్పుడే ఆమె సొత్తునైన నేను కూడా మీకు భార్యనయ్యాను. కాబట్టి దయతలచి నాకు సంతానాన్ని ప్రసాదించండి” అని వేడుకుంది.

ఆమె మాటలు విని “శర్మిష్ఠా! రుచిగల భోజన పానీయాలు, అనేక రకాల అలంకారాలు తప్ప మరేదీ ఇవ్వద్దని, దేవయానికి ఇష్టం కాని పని చెయ్యద్దని శుక్రాచార్యుడు నన్ను ఆజ్ఞాపించాడు. గొప్ప తపస్సంపన్నుడైన ఆ మహర్షికి నేను మాట కూడా ఇచ్చాను. ఇప్పుడు అధర్మం ఎలా చేస్తాను?” అన్నాడు.

అందుకు శర్మిష్ఠ “రాజా! ప్రాణాలకి ఆపద కలిగినప్పుడు, మొత్తం ధనాన్నిఎవరేనా దొంగిలిస్తున్నప్పుడు, బ్రాహ్మణుణ్ని ఎవరేనా చంపేస్తుంటే రక్షించవలసినప్పుడు, పెళ్లి విషయంలోను అబద్ధం చెప్పవచ్చు. ఈ విషయాల్లో అబద్ధం చెప్పడం వల్ల పాపం కలగదని మహర్షులు చెప్పినట్టు ప్రమాణం కూడా ఉంది. నువ్వు నీ పెళ్లి సమయంలో దేవయాని దాసినైన నా బాధ్యతలు కూడా స్వీకరించావు” అని ప్రాధేయపడింది.

యయాతి ఆమె ప్రార్థన అంగీకరించాడు. కొంతకాలానికి శర్మిష్ఠ గర్భవతి అయింది. అమెకు ఒక కుమారుడు కలిగాడు. శర్మిష్ఠకి కుమారుడు కలిగిన విషయం దేవయానికి తెలిసింది. “శర్మిష్ఠా! గొప్ప శీలవతివి, స్థిరమైన మనస్సు కలదానివి. వినయంగా, గౌరవంగా ప్రవర్తించే నీకు కుమారుడు ఎలా కలిగాడు?” అని అడిగింది. శర్మిష్ఠ సిగ్గుపడి తల దించుకుని “సమస్త వేదాల్ని చదివిన ఒక గొప్ప మహర్షి నాకు కుమారుణ్ని ప్రసాదించాడు” అని చెప్పింది. శర్మిష్ఠ వరుసగా ద్రుహ్వుడు, అనువు, పూరుడు అనే ముగ్గురు కుమారుల్ని పొందింది.

ఒకరోజు విలువైన ఆభరణాలు, తలమీద సిగలు పెట్టుకున్నట్టు ఒత్తైన నల్లటి జడలు, నిర్మలమైన తేజస్సు కలిగిన శరీరకాంతితో ప్రకాశిస్తున్న శర్మిష్ఠ కుమారులు యాయాతి దగ్గర కూర్చుని ఆడుకుంటున్నారు. అదే సమయంలో రాక్షస రాజు వృషపర్వుడి కుమార్తె శర్మిష్ఠ, ఆమె చెలికత్తెలు వెంట నడుస్తుండగా పట్టమహిషి అయిన దేవయాని అక్కడికి వచ్చింది. గొప్ప తేజస్సుతో యయాతి పోలికతో కనిపిస్తున్న ఆ పిల్లల్ని చూసి “ఈ పిల్లలు ఎవరు? ఎక్కడనుంచి వచ్చారు?” అని అడిగింది దేవయాని.

యయాతి సమాధానం చెప్పలేదు. అందుకని ఆ పిల్లల వైపు చూసి “మీ తల్లితండ్రులు ఎవరు?” అని అడిగింది. ఆ పిల్లలు శర్మిష్ఠ యయాతి వైపు వేలు చూపించి “వీళ్లే మా తల్లితండ్రులు” అన్నారు. శర్మిష్ఠ తనకు తెలియకుండానే తన భర్త ద్వారా సంతానాన్ని పొందిందని తెలుసుకున్న దేవయాని తట్టుకోలేక పోయింది. తనను మోసం చేసి తనకు తెలియకుండా తన భర్త, తన దాసి ఇంతకు తెగించారని అవమానంతోను, బాధతోను, దుఃఖంతోను తండ్రి శుక్రాచార్యుడి దగ్గరకి పరుగెత్తింది. ఆయన పాదాలమీద పడి ఏడ్చింది. తరువాత..

Exit mobile version