Site icon Sanchika

మహాభారత కథలు-22: శుక్రాచార్యుడు యయాతికి ఇచ్చిన శాపము – తరువాత జరిగిన విషయాలు

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

శుక్రాచార్యుడు యయాతికి ఇచ్చిన శాపము – తరువాత జరిగిన విషయాలు

యయాతి కూడా దేవయానిని ఓదారుస్తూ ఆమె వెంట వెళ్లి శుక్రాచర్యుడికి నమస్కరించాడు. దేవయాని ఏడుపుని దిగమింగుకుంటూ “తండ్రీ! ఈ మహారాజు అధర్మ మార్గంలో నడిచి ధర్మాన్ని అవమానించాడు. రాక్షసుడిలా ప్రవర్తించి రాక్షసకన్య అయిన శర్మిష్ఠతో కుమారుల్ని పొంది గృహస్థ ధర్మాన్ని కించపరిచాడు. ఆ ఇద్దరూ నాకు అవమానం చేశారు” అని చెప్పి వెక్కి వెక్కి ఏడ్చింది. తన కుమర్తె దుఃఖాన్ని చూసి శుక్రాచార్యుడికి చాలా కోపం వచ్చింది. తన కూతురు కళ్లల్లో నీళ్లు చూడలేక పోయాడు. యయాతి వైపు చూస్తూ “యౌవన గర్వంతో నా కుమార్తెకి ఇష్టం లేని పని చేశావు. కనుక, నువ్వు ఇప్పటి నుంచే ముసలితనంతో పీడింపబడతావు!” అని శపించాడు.

శుక్రాచార్యుడిచ్చిన శాపానికి బాధపడి “గురువర్యా! నేను దేవయానితో జీవితాన్ని పూర్తిగా అనుభవించలేదు. భయంకరమైన ముసలితనాన్ని భరించలేను” అని వేడుకున్నాడు.

శుక్రాచార్యుడు దేవయానితో అనే మాట విని కరుణించి “నీకు ఇంద్రియ భోగాలమీద ఆసక్తి ఉంటే నీ ముసలితనాన్ని నీ కొడుకుల్లో ఒకళ్లకి ఇచ్చి వాళ్ల యౌవనాన్ని నువ్వు తీసుకో! నువ్వు ఇంద్రియ భోగాలమీద తృప్తి పొందిన తరువాత నీ ముసలితనాన్ని నువ్వు తీసుకుని నీ కొడుకు దగ్గర తీసుకున్న యౌవనాన్ని నీ కొడుకుకి ఇచ్చెయ్యి. నీ ముసలితనాన్ని ఏ కొడుకు తీసుకుంటాడో అతడికే రాజ్యం చేసే అర్హత, నీ వంశాన్ని అభివృద్ధి చేసే అర్హత ఉంటాయి” అని చెప్పాడు.

యయాతి దేవయానిని తీసుకుని తన పట్టణానికి వచ్చాడు. అప్పటికే అతడికి ముసలితనం ఆవహించింది. తల వణకడం మొదలుపెట్టింది. అవయవాల పటుత్వం తగ్గింది. శరీరం ముడతలు పడింది. జుట్టు నెరిసింది. తలనొప్పి, ఉబ్బసం, పొడిదగ్గు వచ్చాయి. ముసలితనాన్ని పొందిన యయాతి తన కొడుకుల్ని పిలిచి “మీలో ఎవరేనా నా ముసలితనాన్ని తీసుకుని మీ యౌవనాన్ని నాకు ఇవ్వండి. వాళ్లకి నా రాజ్యాన్ని మొత్తాన్ని ఇచ్చి చక్రవర్తిని చేస్తాను” అన్నాడు.

యదువు, తుర్వసుడు, ద్రుహ్వి, అనువు యయాతితో “ముసలితనం, రోగం విధి వశం వల్ల సంక్రమించినప్పుడు ఎవరికి వాళ్లు భరించక తప్పదు కనుక భరించాలి కాని, వాటిని మరొకళ్ల నుంచి తీసుకుని ఎవరు భరిస్తారు. అంత వివేకం లేని వాళ్లు కూడా ఉంటారా? నీ ముసలితనం మాకు వద్దు” అన్నారు.

కొడుకులు తన మాట వినలేదన్న కోపంతో “కొడుకు యదువుని.. యదువంశానికి చెందినవాళ్లు రాజ్యం చెయ్యడానికి అర్హులు కాదనీ; కొడుకు తుర్వసుణ్ని.. తుర్వసు వంశానికి చెందినవాళ్లు ధర్మాధర్మజ్ఞానం లేకుండా సంకర జాతులకి చెందిన అటవికులకి రాజులవుతారనీ; కొడుకు ద్రుహ్విని.. ద్రుహ్వి వంశానికి చెందినవాళ్లు తెప్పలతో తిరిగే జలప్రదేశానికి రాజులవుతారనీ; ముదుసలితనాన్ని నిందించిన కొడుకు అనువుని.. అతడి వంశానికి చెందినవాళ్లు ముసలివాళ్లయ్యేవరకు బ్రతికి ఉండక యౌవనంలోనే మరణిస్తారనీ” శపించాడు.

నలుగురికంటే చిన్నవాడు కొడుకు పూరుడు తండ్రి ఇచ్చే శాపానికి భయపడి ముసలితనాన్ని తను తీసుకుని తన యౌవనాన్ని తండ్రికి ఇచ్చేందుకు అంగీకరించాడు. యయాతి తన కొడుకు పూరుడు ఇచ్చిన నవయౌవనాన్ని పొంది వెయ్యి సంవత్సరాలు భోగాలు అనుభవించాడు. తరువాత తన ముసలితనాన్ని తీసుకున్న పూరుడికి తిరిగి అతడి యౌవనాన్ని అతడికి ఇచ్చేసి తన ముసలితనాన్ని తనే తీసుకున్నాడు. తన ఆజ్ఞని అనుసరించి నడుచుకున్న పూరుడికి నాలుగు సముద్రాల హద్దుగా ఉన్న భూభాగంలో ఉన్న మొత్తం రాజ్యాన్ని అప్పగించాడు.

బ్రాహ్మణులు, క్షత్రియులు, అన్ని వర్ణాల్లో ఉన్న ప్రముఖులు, మంత్రులు, పురోహితులు, సామంతరాజులు మొదలైన ప్రజలందరి ఎదుట తన కుమారుడు పూరుడికి పట్టాభిషేకం చేశాడు. పట్టణంలో ఉన్న ప్రజలు యయాతిని చూసి “మహారాజా! మీరు ఏమీ అనుకోకపోతే ఒక మాట చెప్పాలని అనుకుంటున్నాం. అధికమైన బలపరాక్రమాలు కలిగినవాడు, మొత్తం భూభారాన్ని మొయ్యగలిగినవాడు, రాజ్యపాలనకి తగినవాడు, లోకంలో అందరికీ తెలిసిన రాక్షసగురువు శుక్రాచార్యుడికి మనుమడు, నీ పెద్ద కొడుకు యదువు ఉండగా అందరికంటే చిన్నవాడైన పూరుడికి రాజ్యాన్ని అప్పగించడం బాగుంటుందా?” అని అడిగారు.

పట్టణ ప్రజల మాటలు విని యయాతి “తల్లితండ్రులు చెప్పినట్టు చెయ్యనివాడు, వాళ్ల మాటల్ని హృదయపూర్వకంగా అంగీకరించనివాడు కొడుకు అనిపించుకోడానికి అర్హత ఉన్నవాడు కాదు. అలాగే తండ్రి సంపదలకి తగినవాడు కూడా కాదు. పూరుడు తండ్రిగా నేను చెప్పినవన్నీ చేశాడు. వయస్సులో చిన్నవాడైనా గుణాల్లో పెద్దవాడు, యోగ్యుడు, రాజ్యపాలన చెయ్యగల సహనం ఉన్నవాడు. నా ముసలితనాన్ని తీసుకున్న కొడుకే రాజ్యపాలనకి తగినవాడు, వంశాన్ని వృద్ధి చేసుకునేవాడు అవుతాడని శుక్రాచార్యుడే చెప్పాడు” అని పట్టణ ప్రజలకి చెప్పి ఒప్పించాడు. పూరుణ్ని మొత్తం భూమికి చక్రవర్తిగా చేసాడు. మిగిలిన కుమారుల్ని దగ్గరలో ఉన్న ప్రదేశాలకి రాజులుగా చేశాడు. తను మాత్రం వేదవిదులైన బ్రాహ్మణులతో కలిసి తపస్సు చేసుకునేందుకు వెళ్లిపోయాడు.

యయాతి అడవిలో పళ్లు, దుంపలు, వేర్లు తింటూ.. అడవిలో దొరికే పండ్లు, హవ్యాలతో అగ్నిదేవుణ్ని; కవ్యలతో పితృదేవతల్ని తృప్తి పొందేలా చేశాడు. నియమనిష్ఠలతో వానప్రస్థ ఆశ్రమంలో అరిషడ్వర్గాలు జయించి వెయ్యేళ్లు తపస్సు చేశాడు. తపోబలంతో దేవతావిమానంలో స్వర్గలోకానికి వెళ్లిపోయాడు.

యయాతి పూరుడికి బోధించిన నీతులు

యయాతి స్వర్గలోకంలో దేవర్షులతో పూజింపబడి బ్రహ్మ లోకానికి వెళ్లాడు. బ్రహ్మ లోకంలో బ్రహ్మర్షులతో పూజింపబడి ఇంద్ర లోకానికి వెళ్లాడు. ఇంద్రుడు యయాతిని పూజించి “రాజా! నాలుగు సముద్రాల్ని చుట్టుముట్టి ఉన్న భూభారాన్ని పూరుడికి అప్పగించేప్పుడు పూరుడికి ఏమని చెప్పావు?” అని అడిగాడు.

యయాతి “ఇంద్రా! పూరుడికి నేను చెప్పకుండానే అన్నీ తెలుసు. అయినా తండ్రిగా నేను చెప్పవలసింది చెప్పాను. అడిగావు కనుక నేను పూరుడికి ఏం చెప్పానో దాన్ని నీకు చెప్తాను విను “జ్ఞానవంతుల జీవిత చరిత్రలు పఠించాలి. మంచి నడవడిక కలిగినవాళ్లు మాట్లాడుకునేప్పుడు కదలకుండా అక్కడే కూర్చుని విని, వాళ్లు చెప్తున్న ధర్మం గురించి తెలుసుకోవాలి. తెలుసుకున్నధర్మాన్ని వదిలెయ్యకుండా ఆచరిస్తూ న్యాయమార్గంలో నడవాలి. అర్హత కలిగినవాళ్లకి అవసరమైనంత ధనమివ్వాలి. ఏదయినా సహాయం అడగడానికి దగ్గరకు వచ్చినవాళ్లని ఆదుకోవాలి.

సభలో మాట్లాడేటప్పుడు అందరికీ ఇష్టమైనది, ఉపయోగించేది, అందరూ వినతగినది, నిజమైనది మాత్రమే మాట్లాడాలి. ఎక్కువ మాట్లాడకుండా ధర్మంగా ఉండే మాటలు తక్కువగా మాట్లాడాలి. ఎదుటివాళ్లని బాధ పెడుతూ కఠినంగా మాట్లాడేవాళ్ల దగ్గర ఉండకూడదు. అంటే, మాట్లాడే మాట మితంగా, హితంగా, సత్యంగా ఉండాలి. దయ, మంచి ప్రవర్తన, ఇంద్రియ నిగ్రహం, నిజాన్ని పలకడం, శుభ్రాన్ని పాటించడం తప్పకుండా ఆచరించవలసిన విషయాలు. నిర్మలమైన, ప్రశాంతమైన మనస్సుతో అరిషడ్వర్గాల్ని జయించాలి. గర్వం, కామం, కోపం, అసూయ, పిసినారి తనం, అజ్ఞానం వంటి తనలో ఉండే శత్రువుల్ని జయించాలి. వాటిని మొదట జయించ గలిగితే.. బయట ఉండే శత్రువు ఎటువంటి వాడయినా జయించడం తేలికవుతుంది. ఇవన్నీ నా కుమారుడు పూరుడికి బోధించాను. పూరుడు ఇతరులకి తనే బోధించగల సర్వగుణాలు కలవాడు” అని చెప్పాడు యయాతి.

“ఓ మహారాజా! నువ్వు చేసిన తపస్సు చాలా గొప్పది. వందవేల సంవత్సరాలు చేసిన తపస్సు వల్ల వచ్చిన తేజస్సు నీకు అన్ని లోకాల్లోను సర్వ సౌఖ్యాలు అనుభవించే అదృష్టాన్నికలిగించింది. అంత అసాధారణమైన తపస్సు నీది” అన్నాడు ఇంద్రుడు.

అందుకు యయాతి “దేవతలకి రాజైన ఇంద్రుడా! దేవతలు, రాక్షసులు, యక్షులు, మానవులు, ఆకాశ సంచారులు, సిద్ధులు, మునులు చేసిన తపస్సు కంటే నేను చేసిన తపస్సే గొప్పది” అన్నాడు.

స్వర్గలోకం నుంచి బయటికి వచ్చిన యయాతి

మహామునుల తపస్సుని తక్కువచేసి మాట్లాడిన యయాతిలో అణిగి ఉన్న గర్వాన్ని గ్రహించాడు ఇంద్రుడు. అతడికి చాలా కోపం వచ్చింది. “యయాతీ! నీకు అహంకారం తగ్గలేదు. ఇప్పటి వరకు స్వర్గలోక సుఖాలు అనుభవించావు కనుక నీ పుణ్యం తగ్గింది. నీ గర్వమే అందుకు కారణం. ఇంక నువ్వు అథోలోకాలకి వెళ్లు!” అన్నాడు ఇంద్రుడు.

యయాతి “నేను మానవ లోకానికి వెళ్లలేను. నక్షత్ర లోకంలో నక్షత్రాలతో స్నేహంగా ఉండేలా అనుగ్రహించు!” అని ప్రార్థించాడు. యయాతిని అనుగ్రహించాడు ఇంద్రుడు. ఆకాశంలో దిక్కుల మధ్య భాగంలో తనదైన ప్రత్యేక కాంతితో ప్రకాశిస్తూ తమవైపు వస్తున్న కాంతిని చూసి నక్షత్రాలు ఆశ్చర్యపోయాయి.

తరువాత యయాతి కూతురు కొడుకులైన అష్టకుడు, ప్రతర్దనుడు, వసుమంతుడు, ఉశీనర దేశానికి సంబంధించిన శిబి మొదలైన నక్షత్ర లోకంలో నివసిస్తున్నవాళ్లు తమ వద్దకు గొప్ప తేజస్సుతోను, అంతం లేని పుణ్య రూపంతోను అభ్యాగతిగా వచ్చిన యయాతిని ప్రేమతో పూజించారు. అతడికి సంతోషాన్ని కలగ చేసి “నువ్వు ఎవరివి? ఎక్కడనుంచి వచ్చావు? ఎందుకు వచ్చావు?” అని అడిగారు.

యయాతి “గొప్ప చరిత్ర కలిగిన నహుషుడి కుమారుణ్ని, పూరుడు అనే పేరుతో మర్త్యలోకాన్ని పాలిస్తున్న పూరుడికి తండ్రిని, నా పేరు యయాతి. నేను చేసిన గొప్ప తపస్సు వల్ల బ్రహ్మలోకం మొదలైన దేవ లోకాలన్నీ తిరిగి వరుసగా పుణ్యఫలాల్ని అనుభవించి ఇంద్రుడి దగ్గరికి వెళ్లాను. దేవతలకి రాజైన ఇంద్రుడు నేను చేసిన తపస్సుకి ఆశ్చర్యపడి నా తపస్సు యొక్క మహత్యం చెప్పమని అడిగాడు. నేను దేవతల, సిద్ధుల, మునిశ్రేష్ఠుల చేసిన తపస్సు నా తపస్సుతో సమానం కాదు అన్నాను.

దేవేంద్రుడు నా మాటకి కోపగించి గర్వంతో గొప్పవాళ్లని అవమానించడం తప్పన్నాడు. అతడు అన్నది న్యాయమే. గర్వం ఎంత కొంచెం ఉన్నా కూడా చాలా కాలం కష్టపడి తపస్సు చేసి పొందిన ఫలితాన్ని కూడా నాశనం చేస్తుంది. అందువల్ల ఇంద్రుడి ఆజ్ఞ ప్రకారం ఇక్కడికి వచ్చాను” అని చెప్పాడు.

అష్టకుడు అతడి సోదరుల ప్రశ్నలకి యయాతి సమాధానము

యయాతి కూతురు కొడుకులు యాయాతిని ధర్మం, అధర్మం, మోక్షం, నరకాల స్వభావాలు, జీవులు పిండ రూపంలో పుట్టే విధం, ఆశ్రమ ధర్మాలు, వర్ణాశ్రమ ఆచారాల గురించి చెప్పమని అడిగారు.

యాయాతి “అన్ని జీవులయందు దయ కలిగి ఉండడం, నిజాన్ని పలకడం కంటే మించిన ధర్మం లేదు. ఇతరుల్ని బాధించడం, వాళ్లకి దుఃఖం కలగచెయ్యడం అన్నింటి కంటే అధమం. వేదాల్లో చెప్పబడిన వాటిని అనుసరించడం ఉత్తమ గతికి మార్గం. వేదంలో చెయ్యవద్దు అని చెప్పిన వాటిని చెయ్యడం అధోగతికి మార్గం అని మహర్షులు చెప్పారు. పిండము ఉండే స్త్రీ అవయవంలో, ఋతుకాలానికి సంబంధించిన రజస్సుతో, పురుషుడి వీర్యం గాలితో ప్రేరేపించబడి కలిసినప్పుడు ఆ అవయవంలో శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము అనబడే ఐదు తన్మాత్రలు రూపొందుతాయి. వాటికి క్రమంగా అవయవాలు ఏర్పడి జీవం పొంది జన్మిస్తారు.

తరువాత చెవులతో శబ్దాన్ని, నేత్రాలతో రూపాన్ని, ముక్కుతో వాసనని, నాలుకతో రుచిని, చర్మంతో స్పర్శగుణాన్ని, మనస్సుతో అన్నింటినీ తెలుసుకుంటారు. తరువాత పూర్వజన్మల కర్మల ననుసరించి జీవిస్తారు. చెడ్డ పనులు ఎక్కువగా చెయ్యడం వల్ల పుణ్యాన్ని పోగొట్టుకుని పశు, పక్షులుగా జన్మిస్తారు.

మంచి పనులు చెయ్యడం వల్ల కలిగిన పుణ్యంతో మానవజన్మ పొంది అందుకు తగినట్టుగా నడుచుకుని దైవత్వాన్ని పొంది, నిర్మలమైన జ్ఞానంతో మోక్షాన్ని పొందుతారు. గురువుల సేవచేస్తూ, ప్రతిరోజు వేదాన్ని పఠిస్తూ, అగ్నికార్యాన్ని శాస్త్రోక్తంగా చేస్తూ, ఇంద్రియ నిగ్రహాన్ని పాటిస్తూ, శుభ్రంగా ఉంటూ, బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ, పాపం చెయ్యకుండా ఇతరుల్ని బాధపెట్టకుండా జీవిస్తూ, ధర్మమార్గంలో సంపాదించిన ధనంతో అతిథుల్ని పూజిస్తూ, యజ్ఞాలు చేస్తూ, ఇతరుల ధనాన్ని ఆశించకుండా నిత్యకర్మానుష్ఠానంలో మునిగి ఉండేవాళు ‘గృహస్థులు’.

నియమంతో కూడిన ఆహారం తీసుకుంటూ అన్నిటియందు ఆసక్తిని విడిచిపెట్టి ఇంద్రియాల్ని జయించి అడవిలో నివసిస్తారు ‘వానప్రస్థులు’. గ్రామాల్లో దొరికే వస్తువుల్ని వాడకుండా గ్రామాల్లోనే నివసిస్తూ; దేహపోషణకోసం కొంచేమే ఆహారాన్ని తీసుకుంటూ; పట్టణాలలో ప్రవేశించకుండా; కామం, క్రోధం మొదలైన అరిషడ్వర్గాల్ని వదిలిపెట్టి; శుచిగా ఆచారాల్ని నిర్వర్తిస్తూ; చెయ్యవలసిన పనులు సక్రమంగా చేస్తూ; వేడి, చల్లతనం, దు:ఖం, సంతోషం అన్నింటినీ సమంగా అనుభవిస్తూ; ఏ విషయంలోనూ ఇష్టాన్ని పెంచుకోకుండా ఒంటరిగా తిరుగుతూ; ఇల్లే లేకుండా ఉండే సన్యాసుల్ని ‘యుక్తాచారులు’ అంటారు. వీళ్లు పుణ్యప్రదమైన ఆచారాలు పాటించడం వల్ల పదితరాల పూర్వుల్ని, పదితరాల ముందువాళ్లని, తమ వెనుక వాళ్లని కూడా ఉద్ధరిస్తారు.

గర్వంతో చేసే అగ్నికార్యం; ఆడంబరం కోసం చేసే వేదాధ్యయనం; అహంకారంతో కలిసిన మౌనం; జ్ఞానం లేకపోయినా ఆడంబరం కోసం చేసే యజ్ఞం అనే నాలుగూ భూమి మీద యోగ్యమైనవి కాదు” అని యయాతి తన దౌహిత్రులు అడిగిన ప్రశ్నలకి సమాధానంగా చెప్పాడు.

అష్టకుడు, అతడి సోదరులు “అన్ని ధర్మాలు తెలిసినవాడివి, అన్ని లోకాల ప్రవర్తనలు తెలిసినవాడివి, పుణ్యం చేసినవాడివి మాకు పుణ్యలోకాలు ఉన్నాయా?” చెప్పమని అడిగారు.

“మీకు పుణ్య లోకాలు ఉన్నాయి” అని చెప్పాడు యయాతి. అది విని అష్టకుడు, ప్రతర్దనుడు, వసుమంతుడు, శిబి అనే నలుగురు సంతోషించి “మేము నీ దౌహిత్రులం.. నీ కూతురి కుమారులం” అని తమని తాము పరిచయం చేసుకుని యయాతికి పుణ్యలోకాలు ఇచ్చారు.

సత్పురుషుల సాంగత్యం వల్ల యయాతి తన మనుమలతో కలిసి పైలోకాలకి వెళ్లాడు” అని సాటిలేని పుణ్యం కలవాడు, ఈర్ష్య లేనివాడు, పరీక్షిత్తు మహారాజు జ్యేష్ఠ కుమారుడైన జనమేజయుడికి వైశంపాయన మహర్షి అంతు లేని పుణ్యఫలం దక్కేలా ప్రేమతో వివరించి చెప్పాడు.

ఆదిపర్వంలోని మూడవ ఆశ్వాసం పూర్తి అయినది.

Exit mobile version