మహాభారత కథలు-26: భరతవంశము కథలు

0
3

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

భరతుడి వృత్తాంతము

[dropcap]భ[/dropcap]రతుడు అపారమైన సామ్రాజ్యానికి చక్రవర్తిగా లోకంలో ప్రసిద్ధికెక్కి గంగ, యమునానదీ పవిత్ర తీర ప్రాంతాల్లో దీక్షతో అనేక యజ్ఞాలు చేశాడు. బ్రాహ్మణులకి ఎక్కువగా దక్షిణలు, మేలిమి బంగారాన్ని, గోవుల్నీ, గుర్రాల్నీ, ఏనుగుల్నీ దానంగా ఇచ్చాడు. తన వంశంలో భవిష్యత్తులో పుట్టబోయే రాజులందరికీ వంశకర్త అయ్యాడు. భరతుడు కేకయరాజు కుమార్తెని పెళ్లి చేసుకున్నాడు.

ఆ దంపతులకి ‘భుమన్యుడు’ అనే పేరుగల కొడుకు కలిగాడు. అతడికి దశార్హుడి కుమార్తె విజయకు ‘సుహోత్రుడు’ జన్మించాడు. అతడికీ ఇక్ష్వాకుడి కుమార్తె సువర్ణకీ ‘హస్తి’ అనే పేరుతో కుమారుడు పుట్టాడు. అతడి పేరు మీదే కౌరవుల రాజధానీ నగరం ‘హస్తినాపురం’ అని పిలవబడింది. హస్తికీ, త్రిగర్తరాజు కుమార్తె యశోధరకూ ‘వికుంఠనుడు’ అనే కుమారుడు కలిగాడు.

వికంఠనుడికీ దశార్హరాజు కుమార్తె వసుదేవకీ ‘అజమీఢుడు’ అనే కుమారుడు జన్మించాడు. అజమీఢుడికీ కేకయి, గాంధారి, ఋక్ష అనే ముగ్గురు స్త్రీలకి పుణ్యాత్ముడు పౌర వంశాన్ని వృద్ధిచెందించేవాడు ‘సంవరుణుడు’ పుట్టాడు. అతడు సూర్యుడి కుమార్తె తపతిని పద్ధతిగా వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులకి వంశకర్త గొప్పవాడైన ‘కురుడు’ జన్మించాడు. అతడి పేరు మీద ‘కురుక్షేత్రం’ అని పిలవబడింది.

కురుడికీ, దశార్హరాజ కుమార్తె శుభాంగికీ ’విదూరథుడు’ కలిగాడు. విదూరథుడికీ, మగధరాజ కుమార్తె సంప్రియకీ ‘అనశ్వుడు’ జన్మించాడు. అనశ్వుడికీ, మగధరాజ కుమార్తె అమృతకీ ‘పరీక్షిత్తు’ పుట్టాడు. పరీక్షిత్తుకీ, బహుదానుడి కూతురు సుయశకీ ‘భీమసేనుడు’ పుట్టాడు. ప్రతీపుడికీ, శిబికుమార్తె సునందకీ దేవాపి, శంతనుడు, బహ్లికుడు అనే పేర్లతో ముగ్గురు కొడుకులు కలిగారు. వాళ్లల్లో దేవాపి చిన్నతనంలోనే తపోవనానికి వెళ్లిపోయాడు. శంతనుడు రాజయ్యాడు. అతడికీ గాంగాదేవికీ దేవవ్రతుడైన భీష్ముడు కలిగాడు.

శంతనుడికీ యోజనగంధి అని పిలవబడే సత్యవతికి ‘చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడ’ అనే ఇద్దరు కొడుకులు కలిగారు. వాళ్లల్లో చిత్రాంగదుడు చిన్నతనంలోనే గంధర్వుడి చేత చంపబడ్డాడు. చిన్నవాడైన విచిత్రవీర్యుడు రాజయ్యాడు. అతడికి భీష్ముడు అంబిక, అంబాలిక అనే వాళ్లని ఇచ్చి వివాహం చేశాడు. రూపంలోను, గుణంలోను యౌవనంలోను అమితమైన సౌందర్యం కలిగిన ఆ ఇద్దరు రాణులతో నిరంతరం భోగాలు అనుభవించాడు. చివరికి క్షయ రోగంతో మరణించాడు.

ఆ సమయంలో భరతవంశం నాశనమయ్యే స్థితికి రావడం వల్ల సత్యవతి కోరికమీద ధర్మాలన్నీ తెలిసిన వేదవ్యాసుడు అంబికకి ‘ధృతరాష్ట్రుణ్ని’, అంబాలికకి ‘పాండురాజుని’, అంబిక యొక్క చెలికత్తెకి ‘విదురిడినీ’ ప్రసాదించాడు. వాళ్లల్లో ధృతరాష్ట్రుడికీ, గాంధారికీ వ్యాసుడి వరం వల్ల దుర్యోధనుడు మొదలుకుని వందమంది కుమారులు జన్మించారు.

పాండురాజు చెప్పగా కుంతీదేవికి యమధర్మరాజు, వాయువు, ఇంద్రుడు; మాద్రికి అశ్వినీదేవతల దయతో వరుసగా ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అనే అయిదుగురు కొడుకులు కలిగారు.

ఆ అయిదుగురికీ పాంచాలి భార్య అయింది. ఆమెయందు ధర్మరాజుకి ప్రతివింధ్యుడు, భీమసేసుడికి శ్రుతసోముడు, అర్జునుడికి శ్రుతకీర్తి, నకులుడి శతానీకుడు, సహదేవుడికి శ్రుతసేనుడు పంచ ఉపపాండవులు పుట్టారు.

ఇంకా ధర్మరాజుకి స్వయంవరంలో లభించిన దేవికయందు ‘యౌధేయుడు’, భీమసేనుడికి జరంధర వల్ల ‘సర్వగుడ’ కలిగారు. అర్జునుడికి సుభద్రకి ‘అభిమన్యుడు’ పుట్టాడు. నకులుడికి చేదివంశ రాజకుమార్తె కరేణ్మతి యందు ‘నిరమిత్రుడు’, సహదేవుడికీ స్వయంవరంలో లభించిన విజయకీ ‘సుహోత్రుడు’ కలిగారు.

అంతేకాకుండా భీమసేనుడికీ హిడింబకీ ‘ఘటోత్కచుడు’ పుట్టాడు. పాండవుల పుత్రులైన పదకొండు మందిలోను వంశాన్ని నిలిపినవాడు అభిమన్యుడు. అభిమన్యుడికీ విరాటరాజ కుమార్తె అయిన ఉత్తరకూ ‘పరీక్షిత్తు’ పుట్టాడు. అన్ని లోకాల్లోను కీర్తింపబడుతున్న జనమేజయుడా! పాండవ వంశానికి ఎప్పటికీ చెదరని కీర్తి కలుగచెయ్యడానికి పరీక్షిత్తు మహారాజుకి పుణ్యవతి అయిన మాద్రవతికీ నువ్వు పుట్టావు.

నీకూ వపుష్టమకూ శతానీకుడు, శంకుకర్ణుడు అనే ఇద్దరు పుత్రులు కలిగారు. వాళ్లల్లో శతానీకుడికి విదేహరాజ కుమార్తె వైదేహికి అశ్వమేధదత్తుడు పుట్టాడు. వీళ్లు ఐలులు, పౌరవులు, భరతులు, కౌరవులు, పాండవులు అని పిలవబడుతూ ప్రసిద్ధికెక్కారు. లోకంలో ప్రసిద్ధికెక్కిన నీ వంశగణం ఇదే!” అని వైశంపాయనుడు జనమేజయుడికి భారతవంశ క్రమం గురించి వివరించాడు.

గంగా వసువుల కలయిక

జనమేజయుడు వైశంపాయనుడికి భక్తితో నమస్కారం చేస్తూ “మహర్షీ! పాండవుల ధృతరాష్ట్ర కుమారుల పుట్టుక గురించి తెలుసుకోవాలని ఉంది” అని అడిగాడు.

వైశంపాయనుడు “మహారాజా! పూర్వం ఇక్షాకు వంశంలో పుట్టిన మహాభిషుడు ఉత్తమమైనవాడు, ధర్మస్వభావం కలిగినవాడు, వెయ్యి అశ్వమేధ యాగాలు చేశాడు. ఇంద్రుడు మొదలైన దేవతల్ని సంతోషపెట్టి స్వర్గలోకానికి వెళ్లాడు. అక్కడ ఋషులందరితో కలిసి బ్రహదేవుణ్ని సేవిస్తున్నాడు. ఆ సమయంలో దేవవనిత రూపంలో గంగాదేవి బ్రహ్మసభకి వచ్చింది.

గంగాదేవి కట్టుకున్న చీర గాలికి ఎగిరింది. అందువల్ల అమె తొడ భాగం కనిపించింది. దేవతలందరు అమె వైపు చూడకుండా మొహాలు పక్కకి తిప్పుకున్నారు. మహాభిషుడు మాత్రం రెప్ప వెయ్యకుండా ఆమెను చూస్తూ ఉండిపోయాడు. బ్రహ్మ దేవుడికి ఆ విషయం అర్థమైంది. కోపంతో అతణ్ని భూలోకంలో మానవ వనితకి పుట్టమని శపించాడు. మహాభిషుడు భయంతో రెండు చేతులు జోడించి భూలోకంలో ఉన్న రాజర్షులందరిలోకి పుణ్యాత్ముడైన ప్రతీపుడికే జన్మించేలా అనుగ్రహించమని బ్రహ్మని అడిగాడు.

అతడి కోరికని బ్రహ్మదేవుడు అంగీకరించాడు. గంగ కూడా మహాభిషుడి గొప్పతనాన్ని, అందమైన రూపాన్ని చూసి.. అతడికి తన మీద ఉన్న ఇష్టాన్ని తెలుసుకుని అతడి గురించే ఆలోచిస్తూ భూలోకానికి వచ్చింది. ఆ సమయంలో ఎనిమిది మంది వసువులు వసిష్ఠ మహర్షి శాపం వల్ల దేవలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వస్తున్నారు. ఎంతో బాధపడుతూ వెడుతున్న ఆ ఎనిమిది మంది వసువుల్ని గంగ చూసింది.

“మహత్ములారా! దిగులుగా ఉన్న మొహాలతో మీరు ఉంటున్న చోటుని వదిలిపెట్టి భూలోకానికి ఎందుకు వెడుతున్నారు?” అని అడిగింది.

“మేము వసిష్ఠమహర్షి శాపం వల్ల భూలోకంలో ఎవరైనా ఒక పుణ్యాత్మురాలి కడుపున పుట్టాలని వెడుతున్నాము. మాకు నీ కుమారులుగా జన్మించాలని ఉంది. మహాభిషుడు ప్రతీపుడికి శంతనుడు అనే పేరుతో కుమారుడుగా పుడతాడు. అతడు మా పుట్టుకకి కారకుడు అవుతాడు. అప్పుడు మీరిద్దరే మాకు తల్లితండ్రులు అవుతారు” అన్నారు వసువులు. వాళ్ల మాటలకి గంగ సంతోషించి “మీరు చెప్పినట్టు జరిగితే నా కోరిక కూడా తీరుతుంది. మీ కోరికని మనస్పూర్తిగా అమలుపరుస్తాను. మీకు మంచి కలుగుతుంది నిశ్చింతగా ఉండండి” అని గంగాదేవి వసువుల మనస్సుకి సంతోషం కలిగించింది.

గంగ మాటలు విని “మేము నీకు ఒకళ్ల తరువాత ఒకళ్లుగా పుడతాము. నువ్వు మాకు ఉపకారం చెయ్యగలిగితే మేము పుట్టగానే మమ్మల్ని తీసుకుని వెళ్లి నీళ్లల్లో పడేస్తూ మేము భూలోకంలో ఉండకుండా చెయ్యి. మాకు వసిస్ఠమహర్షి ఇచ్చిన శాపం కూడా ఇదే” అన్నారు. వాళ్ల మాటలు విని “నేను మీరు అడిగినట్టే చేస్తాను. కాని, నాకు ఒక కొడుకు దీర్ఘాయుష్షుతో కావాలి. మీరందరు స్వర్గానికి చేరుకుంటే అదెలా జరుగుతుంది?” అని అడిగింది.

అది విని వసువులు “మాలో ఒక్కొక్కళ్ల యొక్క నాలుగవ అంశాన్ని ధరించి మంచి చరిత్ర కలవాడు, విశాలమైన భుజాలు కలవాడు, చాలాకాలం జీవించేవాడు మాలో ఎనిమిదవ వసువైన ప్రభాసుడు నీకు కన్న కొడుకుగా భూలోకంలో ఉంటాడు” అని చెప్పారు.

తన కుమారుడికి భార్యగా ఉండమని గంగని అడిగిన ప్రతీపుడు

భరత వంశంలో పుట్టిన వీరుడైన ప్రతీపుడు రాజ్య భోగాలన్నింటినీ తనివితీరా అనుభవించి గంగానదీ తీరంలో దీక్షగా తపస్సు చేసుకుంటున్నాడు. ఒకరోజు గంగాదేవి యమం, నియమం అనే యోగ పద్ధతులు అనుసరిస్తూ తపస్సు చేసుకుంటున్న ప్రతీప మహారాజు కుడి తొడ మీద కూర్చుంది. ప్రతీపుడు ఆశ్చర్యపోయి “ఎవరు నువ్వు? నా తొడమీద ఎందుకు కూర్చున్నావు?” అని అడిగాడు.

“మహారాజా! నేను జహ్నుమహర్షికి కుమార్తెని. నువ్వు ఇంద్రుడితో సమానమైనవాడివి. నీ మంచి గుణాలు విని నిన్ను పెళ్లి చేసుకుందామని వచ్చాను. నన్ను అనుగ్రహించు” అంది. అమె మాటలు విని ప్రతీపుడు “గంగా! అగ్నిసాక్షిగా పెళ్లిచేసుకున్న భార్యను తప్ప ఇతరుల్ని ఎవ్వరినీ భార్యగా మనస్సులో కూడా అంగీకరించను. అమాయకంగా నువ్వు నన్ను ఇలా అడగడం బాగుండ లేదు. అంతేకాదు, నువ్వు స్త్రీలు కూర్చోవలసిన ఎడమ తొడ మీద కూర్చోకుండా కుడి తొడ మీద కూర్చున్నావు. కుడి తొడ మీద పురుషులు గాని, పుత్రులు గాని కూర్చుంటారు. నువ్వు కుడితొడ మీద కూర్చున్నావు కనుక, నా కుమారుణ్ని పెళ్లి చేసుకో” అన్నాడు.

గంగ కూడా అందుకు ఒప్పుకుని మాయమైపోయింది. ప్రతీపుడు తన కుమారుడు కలగాలని తన భార్య సునందా దేవితో కలిసి అన్ని పుణ్యతీర్థాల్లోను వేద ధర్మాల్ని అనుసరించి వ్రతాలు, తపస్సు చేశాడు. పుణ్యదంపతులైన సునందాప్రతీపులకి దేవతలతో సమానమైనవాడు, వీరుడు, గుణసంపద కలిగినవాడు, దానశీలి అయిన శంతనుడు అనే కుమారుడు కలిగాడు. అతడు కౌరవ వంశ ప్రతిష్ఠని ప్రకాశింప చేశాడు. శంతనుడు పెరిగి పెద్దవాడయ్యాడు. అతణ్ని చూసి ప్రతీపుడు తనకు శాశ్వతంగా పుణ్య లోకాలు కలుగుతున్నాయని ఎంతో ఆనందించాడు. శంతనుడికి రాజ్యభారం అప్పగిస్తూ పట్టాభిషేకం చేశాడు.

గంగా శంతనుల వివాహము

ఒకరోజు ప్రతీపుడు శంతనుడితో “నేను గంగ ఒడ్డు మీద ఒక అందమైన అమ్మాయిని చూశాను. అమెకి నీతో పెళ్లి జరిపిస్తానని మాట ఇచ్చాను. మళ్లీ ఆ అమ్మాయి కనిపించి నిన్ను అడిగినప్పుడు అమె కులగోత్రాలు కూడా అడగకుండా పెళ్లి చేసుకో!” అని చెప్పాడు. కొంతకాలం రాజ్యం చేసి ప్రతీపుడు తపస్సు చేసుకునేందుకు వెళ్లిపోయాడు.

శంతనుడు తండ్రి చెప్పినట్టు ధర్మబద్ధంగా రాజ్యాన్ని పాలిస్తున్నాడు. ఒకరోజు శంతనుడు విల్లు తీసుకుని వేటకోసం బయలుదేరాడు. గంగానది ఒడ్డు మీద తిరుగుతూ చల్లటి ఇసుక తిన్నె మీద కూర్చున్నాడు. అక్కడ బంగారు రంగు శరీరంతో విలువైన దివ్యాస్త్రాలు, పూలమాలలు, మణులతో నిండిన హారాలు ధరించిన అందమైన ఒక అమ్మాయిని చూసాడు.

శంతనుడు అమెని చూసి “ఈమె వనదేవతో.. రాక్షసపుత్రికో.. నాగకన్యో.. దేవతామూర్తో.. గంధర్వకన్యో తెలియట్లేదు. కాని, చాలా అద్భుతమైన అందం. మానవకన్య అయితే ఇలా ఒంటరిగా రాదు” అని ఆలోచిస్తూ ఆమె వైపే చూస్తూ ఉండిపోయాడు. ఆమె కూడా రాజకుమారుడి రూపాన్ని, యౌవనాన్ని, సౌందర్యాన్ని, హావభావాల్ని చూసి కన్ను రెప్ప వెయ్యడం మాని అతడి వైపే చూస్తోంది.

శంతనుడు ఆమె వైపు చూస్తూ “నువ్వు ఎవరు?” అని అడుగుదామని అనుకున్నాడు. అంతలోనే అమె “రాజా! నీకు నన్ను పెళ్లి చేసుకోవాలని అనిపిస్తే నేను చెప్పినదానికి నువ్వు అంగీకరించాలి. నా మీద అధికారం చూపించకుండా నేను చేసిన పనికి అడ్డు చెప్పకుండా ఉండాలి. అలా ఉంటానంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. అలా కాకుండా నాకు నచ్చని విధంగా ఉంటే అప్పటికప్పుడే నేను నిన్ను వదిలి వెళ్లిపోతాను” అని చెప్పింది.

శంతనుడు ఆమె చెప్పినదానికి అంగీకరించి అమెను పెళ్లి చేసుకున్నాడు. గంగ కూడా మానవ రూపంలో శంతనుడికి భార్యగా రాజ్యంలోనే ఉండిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here