Site icon Sanchika

మహాభారత కథలు-30: కురువంశాన్ని నిలబెట్టిన వ్యాసుడు

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

కురువంశాన్ని నిలబెట్టిన వ్యాసుడు

[dropcap]భీ[/dropcap]ష్ముడు సత్యవతికి ఎన్నో ధర్మబద్ధమైన విషయాలు వివరించి చెప్పాడు. మనో నిగ్రహం కలవాడు, లోకపావనుడు, ధర్మపరుడైన బ్రాహ్మణ శ్రేష్ఠుణ్ని ప్రార్థిస్తే అతడు విచిత్రవీర్యుడి భార్యలకి సంతానం అనుగ్రహిస్తాడు అని సలహా చెప్పాడు.

అతడు చెప్పిన ధర్మసూక్ష్మాలు విని సత్యవతి సంతోషపడింది. పూర్వం తను కన్యగా ఉన్నప్పుడు పరాశర మహర్షి తనను కోరడం.. ఆ మహర్షి వరం వల్ల యమునా నదీ ద్వీపంలో కన్యగా ఉన్న తనకు వ్యాసుడు కుమారుడుగా పుట్టడం.. తనకు ఎప్పుడైనా అవసరమైతే తలుచుకుంటే వస్తానని చెప్పడం.. అతడు అప్పుడే తపస్సు చేసుకోడానికి వెళ్లి పోవడం అన్ని విషయాలు భీష్ముడికి వివరంగా చెప్పింది. కృష్ణద్వైపాయనుడు తన తపస్సు వల్ల అగ్నిహోత్రంలా ప్రకాశిస్తుంటాడు. అన్ని ధర్మాలు తెలిసినవాడు, ఎప్పుడూ సత్యమే పలికేవాడు. అతడు మన వంశానికి పుత్రుల్ని ప్రసాదిస్తాడు అని కూడా చెప్పింది.

ఆ మహర్షి గొప్పతనాన్ని విని భీష్ముడు వ్యాసమహర్షి ఉన్న దిక్కు వైపు తిరిగి నమస్కారం చేసి “పూర్వం లోకాల్ని సృష్టించిన మొదటి బ్రహ్మదేవుడికి ఉన్నంత సామర్థ్యం కలిగిన వేదవ్యాసుడే ఈ కురువంశాన్ని నిలబెట్టాలి. ఇది ఇక్కడున్నవాళ్లందరికీ అంగీకారమే!” అన్నాడు.

సత్యవతి కురువంశాన్ని ఉద్ధరించడానికి వేదవ్యాసుణ్ని మనసులో తలుచుకుంది. పవిత్రమైన నల్లటి కొండ శిఖరం మీద నిజమైన బంగారు తీగల పోగుల్లా గోరోజినం రంగుతో ఉన్న జడలతో ప్రకాశిస్తూ మృదువైన మాటలతో ఇంద్రనీలమణిలా ప్రకాశిస్తూ తల్లి ముందర నిలబడ్డాడు. చాలాకాలం తరువాత వచ్చిన మొదటి కొడుకుని చూసి సత్యవతి అమితమైన ఆనందంతో కౌగలించుకుని కన్నీటి ధారలతో అభిషేకించింది. తల్లి కన్నీళ్లు తుడిచి నమస్కారం చేశాడు వ్యాసమహర్షి. నియమాన్ని అనుసరించి భీష్ముడు వ్యాసమహర్షిని పూజించాడు. విశ్రాంతి తీసుకుంటున్న మహర్షిని క్షేమసమాచారాలు అడిగింది సత్యవతి.

తరువాత “నాయనా! ఆజ్ఞాపించే అధికారం తండ్రికి ఉన్నట్టే తల్లికి కూడా ఉంటుంది. కనుక, నీకు పని చెప్పి చెయ్యమని అడిగే అర్హత నాకు ఉంది. అంతులేని ఈ రాజ్య సంపదకి అర్హుడైనవాడు, వంశాన్ని వృద్ధి చెయ్యగల ఉత్తమమైన ప్రవర్తన కలవాడు, పాపమే లేనివాడు అయిన ఇతడు భీష్ముడు. తన తండ్రి సంతోషం కోసం మొత్తం సామ్రాజ్యాన్ని త్యాగం చేసి బ్రహ్మచర్య వ్రతాన్ని జీవిత కాలం ఆచరిస్తానని ఘోర ప్రతిజ్ఞ చేశాడు.

ఈ వంశం ఇంతటితో ఆగిపోవడం అన్ని కాలాలు తెలుసుకోగలిగిన నీకు తెలియనిది కాదు. నీ తమ్ముడిగా చెప్పబడిన విచిత్రవీర్యుడి భార్యలకి కుమారుల్ని అనుగ్రహించు. ఈ వంశం ఎప్పుడూ అంతులేని సంతానంతో తులతూగుతూ ఉండేలా అనుగ్రహించు. నీ వల్ల భరత వంశం చెదిరి పోకుండా స్థిరంగా ఉంటుంది. నాకు, భీష్ముడికి సంతోషంగా ఉంటుంది” అంది.

ఆమె మాటలు విని వ్యాసుడు “తల్లీ! నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఈ ధర్మం పురాణాల్లోను, వేదాల్లోను, ప్రజా జీవితంలోను వినబడుతూనే ఉంది. కాశీరాజు పుత్రికలకి ధర్మ నియమం ప్రకారం కుమారులు కలిగేలా చేస్తాను. నేను చెప్పిన ఈ వ్రతాన్ని ఒక సంవత్సరం పవిత్రమైన మనస్సుతో ఆచరిస్తే ఉత్తమమైన సంతానం కలుగుతుంది” అని చెప్పాడు.

వ్యాసమహర్షి చెప్పినది విని సత్యవతి “రాజ్యంలో రాజు లేకపోతే రాజ్య ప్రజల్లో ధర్మాలేవీ మిగలవు. దేవతలు, ఋషిశ్రేష్ఠులు రాజ్యాన్ని వదిలి వెళ్లిపోతారు. క్రమంగా వానలు కురవడం ఆగిపోతుంది. వస్తువుల విలువలు కూడా పడిపోతాయి. కనుక అలస్యం చెయ్యకుండా వెంటనే రాజ్యం నిలబడేట్టు చెయ్యి. నీ అనుగ్రహం వల్ల కలిగిన కుమారులు పెరిగి రాజ్యం చెయ్యగల నేర్పు వచ్చే వరకు భీష్ముడే తన సామర్థ్యంతో రాజ్యకార్య భారాన్ని నిర్వహిస్తాడు” అని చెప్పింది.

సత్యవతి అంబిక దగ్గరికి వెళ్లి “న్యాయమైన పద్ధతిలో రాజ్యభారాన్ని మొయ్యగల సమర్థుడైన కుమారుణ్ని పొందు. ధర్మాలన్నింటిలోకి వంశాన్ని నిలబెట్టడం ఉత్తమమైన ధర్మం” అని కోడలు అంగీకరించేలా నచ్చచెప్పింది. తరువాత బ్రాహ్మణులకి, దేవతలకి, మహర్షులకి తృప్తిగా విందు భోజనం పెట్టింది.

ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుల పుట్టుక

అతి సుకుమారమైన శరీరం కలిగిన అంబిక తనకు ఎప్పుడు కొడుకు పుడతాడో అని ఎదురు చూస్తోంది. అదే సమయంలో వ్యాసుడు అంబిక దగ్గరికి వచ్చాడు. గోరోజనం రంగులో ఉన్న మహర్షి గడ్డాన్ని, జడల్నీ, కళ్లనీ, సన్నగా నల్లగా పొడుగ్గా ఉన్న శరీరాన్ని చూసి అంబిక భయంతో కళ్లు మూసుకుంది. వ్యాసుడు ఆమెకి కొడుకు కలిగేట్టు అనుగ్రహించాడు. దేహబలం, పరాక్రమం కలిగిన కొడుకు పుడతాడు కాని, తల్లి పొరపాటు వల్ల అతడు గ్రుడ్డివాడుగా పుడతాడని చెప్పాడు.

ఆ మాటలు విని సత్యవతి చాలా బాధపడింది. వ్యాసుణ్ని బతిమాలి అంబాలికకి కూడా పుత్ర సంతానాన్ని అనుగ్రహించమని వేడుకుంది. అంబాలిక కూడా మహర్షిని చూడగానే తెల్లబోయి అతడి వైపు చూస్తూ ఉండిపోయింది. వ్యాసుడు అమెకు కూడా కొడుకుని ప్రసాదించాడు. అంబాలికకి గొప్ప దేహబలం, పౌరుషం, మంచి గుణలు కలవాడు, వంశాన్ని నిలిపే కుమారుడు కలుగుతాడని చెప్పాడు. తల్లి పొరపాటు వల్ల పాండు వర్ణం కలిగిన దేహంతో ఉంటాడని చెప్పాడు.

అంబికకి పదివేల ఏనుగుల బలంతో సమానమైన బలం కలవాడు, బుద్ధితో గ్రహించ గలిగినవాడు కురువంశంలో గొప్పవాడుగా జన్మించాడు. అంబాలికకి కూడా సముద్రంలో ఉండే రత్నాలవంటి గుణాలు కలిగినవాడు, తెల్లటి రంగుతో ప్రకాశించే శరీరం కలవాడు, కురువంశాన్ని స్థిరంగా నిలబెట్టడానికి, అన్ని ధర్మాలు తెలిసినవాడు, ‘పాండురాజు’ జన్మించాడు.

ధృతరాష్ట్రుడికి, పాండురాజుకి జాతకర్మ మొదలైన సంస్కారాలు చేయించాడు భీష్ముడు. సత్యవతి అంబికకి పుట్టిన ధృతరాష్ట్రుడు పుట్టు గుడ్డివాడుగా ఉండడం చూసి బాధపడుతూ మళ్లీ వ్యాసుణ్ని తలుచుకుంది సత్యవతి. వ్యాసుడు వచ్చి పిలిచిన కారణం అడిగాడు. రూపవంతుడైన మరొక కుమారుణ్ని అంబికకి ప్రసాదించమని అడిగింది. నిగ్రహం కలిగిన మనస్సుతో ఉంటే మంచి కుమారుడు కలుగుతాడని చెప్పాడు వ్యాసుడు. సత్యవతి అంబికని పిలిచి చెప్పింది. ఆమె మహర్షి యొక్క స్వరూపాన్ని గుర్తు తెచ్చుకుని తన దాసిని బంగారు ఆభరణాలతో అలంకరించి తన బదులు పంపించింది. అంబిక పంపంచిన దాసికి పుత్రుణ్ని ప్రసాదించాడు వ్యాసుడు.

ఆమెకు పుట్టిన వాడి పేరు విదురుడు. ఎక్కువ కోప స్వభావం కలిగిన మాండవ్య మహర్షి ఒకసారి యముణ్ని శపించాడు. ఆ కారణం వల్ల యముడు భూలోకంలో జన్మించవలసి వచ్చింది. యముడు వేదవ్యాసుడి వల్ల గొప్ప బలపరాక్రమవంతుడు, ధర్మశాస్త్రపండితుడుగా ‘విదురుడు’ అనే పేరుతో అంబిక దగ్గర పనిచేసే దాసికి జన్మించాడు.

మాండవ్యమహర్షి వృత్తాంతము

వైశంపాయనుడు చెప్పినదాన్ని విని జనమేజయుడు “మహర్షీ! అన్ని జీవరాశులు చేసుకునే పుణ్యపాపాల ఫలితాల్ని తెలుసుకుని వాటికి తగినట్టు ధర్మాన్ని నడిపే యమధర్మరాజుకి మాండవ్య మహర్షి ఎందుకు శాపం ఇచ్చాడు. అది కూడా శూద్ర వనితకు పుట్టే పరిస్థితి ఎందుకు కలిగింది?” అని అడిగాడు.

జనమేజయుడి సందేహాన్ని తీరుస్తూ వైశంపాయన మహర్షి “జనమేజయమహారాజా! పూర్వం మాండవ్యుడు అనే పేరు గల మహర్షి ఒంటరిగా భూమండలంలో ఉన్న పుణ్యతీర్థాలన్నీ తిరుగుతున్నాడు. చివరికి పట్టణానికి దగ్గరలో ఉండేలా అడవిలో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు. ఆశ్రమ ద్వారంలో ఉన్న ఒక పెద్ద చెట్టు కింద చేతులు పైకి ఎత్తి మౌనవ్రతంతో తపస్సు చేసుకుంటున్నాడు.

అదే సమయంలో కొంతమంది దొంగలు రాజుగారి ధనాన్ని దొంగిలించారు. వాళ్లని తరుముకుంటూ తలారులు వెంటపడ్డారు. దొంగలు పరుగెత్తుకుంటూ వచ్చి మాండవ్యుడి ఆశ్రమంలో దాక్కున్నారు. తలారులు మహర్షి దగ్గరికి వచ్చి “రాజు ధనం దొంగిలించి వచ్చిన దొంగలు ఇటువైపే వచ్చారు. వాళ్లు ఎక్కడ ఉన్నారో చెప్పు” అని అడిగారు.

మౌనవ్రతంలో ఉన్న మహర్షి తలారులకి సమాధానం ఇవ్వలేదు. తలారులు ఆశ్రమం మొత్తం వెతికి దొంగల్ని పట్టుకున్నారు. దొంగే ముని వేషంలో ఉన్నాడని అనుకుని దొంగలతో పాటు మహర్షిని కూడా తాళ్లతో కట్టి రాజుగారికి అప్పగించారు. రాజు దొంగల్ని చంపించి మహర్షిని ముని వేషంలో ఉన్న దొంగ అనుకుని నగరానికి బయట ఉన్న ఇసుప శూలానికి కొరత (మహర్షి కంఠంలో ఇనుప శూలం గుచ్చారు) వేయించాడు. మహర్షుల్లో గొప్పవాడైన మాండవ్యుడు ఆహారం, నీళ్లు లేకపోయినా, శూలం గుచ్చడం వల్ల బాధ కలిగినా మౌనంగా తపస్సు చేసుకుంటూనే ఉన్నాడు.

మహర్షి చేస్తున్న గొప్ప తపస్సుకి ఆశ్చరపడి, బాధపడి మిగిలిన మహర్షులు పక్షుల రూపంలో వచ్చి రాత్రి వేళ మాండవ్యుడికి సేద తీరుస్తున్నారు. ఒకరోజు మాండవ్యమహర్షి “మహర్షీ! ఇంత గొప్ప తపస్సంపన్నులైన మీకు ఇటువంటి శిక్ష వేసినవాళ్లు ఎవరు?” అని అడిగారు.

మాండవ్యుడు “పూజ్యులారా! మీ ప్రశ్నకి సమాధానం మీకు తెలిసి కూడా నన్నెందుకు అడుగుతున్నారు? మనిషి తన పూర్వ పుణ్యపాప కర్మల ఫలితంగానే సుఖ దుఃఖాలు అనుభవిస్తాడు. కనుక, మనిషి తన కర్మఫలాలకి తనే కర్త అవుతాడు కాని, ఇతరులు ఎవరూ కారణం అవరు కదా!” అన్నాడు.

నగరాన్ని రక్షించే భటులు మాండవ్యుడి మాటలు విన్నారు. ఆ విషయాన్ని రాజుకి చెప్పారు. అది విన్న రాజు వెంటనే బయలుదేరి మాండవ్యమహర్షి దగ్గరికి వచ్చాడు. శూలానికి గుచ్చబడి ఉన్న మహర్షికి నమస్కారం చేసి తను చేసిన తప్పుకి క్షమించమని అడిగాడు. మహర్షిని శూలం నుంచి తియ్యాలని ప్రయత్నించాడు. దాని మొదలు భాగాన్ని నెమ్మదిగా నరికి బయటకి తీశారు. శూలంలో కొంత భాగం మహర్షి కంఠ భాగంలోనే ఉండిపోయింది. అప్పటి నుంచి మాండవ్యుడు ‘ఆణి మాండవ్యుడు’ అని పిలవబడ్డాడు.

గొప్ప తపస్సంపన్నుడైన మాండవ్యుడు లోకాలన్నీ దాటుకుంటూ యముడి నగరానికి వెళ్లి యముణ్ని కలిసి “యమధర్మరాజా! ఇటువంటి భయంకరమైన శిక్షని అనుభవించడానికి నేను చేసిన తప్పు ఏమిటి? నేను బ్రాహ్మణుణ్ని కదా.. నాకు వెయ్యకూడని శిక్ష వేసి ఇంత బాధ పెట్టడం న్యాయంగా ఉందా?” అని అడిగాడు.

మాండవ్యుడి మాటలకి యముడు “నువ్వు చిన్నతనంలో తూనీగల్ని ఎగరనీయకుండా పట్టుకుని ముళ్లకి గుచ్చావు. దాని ఫలితాన్నే ఇప్పుడు అనుభవించావు. హింస చేసినప్పుడు దాని ఫలితాన్ని అనుభవించాలి కదా?” అన్నాడు.

యమధర్మరాజు మాటలు విని మాండవ్యుడికి కోపం వచ్చింది. “పుట్టినదగ్గర్నుంచీ పధ్నాలుగు సంవత్సరాలు దాటేవరకు పురుషుడు బాలుడు అనే పిలవబడతాడు. అతడు చేసిన పనికి పాపాన్ని అనుభవించడు. ఇతరులు అతడికి కీడు చేస్తే వాళ్లే పాపాన్ని పొందుతారు. ఇది నేను ఇప్పుడు చెప్తున్నాను. ఇంక ఎప్పటికీ ఇదే విధంగా జరగాలి. నేను చేసిన చిన్న తప్పుకి నన్ను బ్రాహ్మణుడు అని కూడా చూడకుండా నాకు వెయ్యకూడని కఠినమైన శిక్షని వేశావు. కనుక, నువ్వు మానవ లోకంలో శూద్ర వనితకి జన్మిస్తావు” అని శపించాడు. అందువల్ల యమధర్మరాజు దాసికి విదురుడుగా పుట్టాడు. అని సత్యవ్రతుడు, పుణ్యప్రదుడు అయిన వైశంపాయనమహర్షి మాండవ్యమహర్షి కథని మంచి ప్రవర్తన కలిగిన జనమేజయ మహారాజుకి ప్రేమగా వివరించాడు.

ఆదిపర్వంలోని నాలుగవ ఆశ్వాసం సమాప్తం

Exit mobile version