మహాభారత కథలు-31: ధృతరాష్ట్రుడు పాండుకుమారుల కథలు

0
2

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

అయిదవ ఆశ్వాసము – ధృతరాష్ట్రుడు పాండుకుమారుల కథలు

ధృతరాష్ట్రుడు పెళ్లికి వధువు ఎంపిక

[dropcap]ఉ[/dropcap]గ్రశ్రవసుడు చెప్తున్న కథల్ని శౌనకుడు మొదలైన మహర్షులు శ్రద్ధగా వింటున్నారు. ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు భీష్ముడి పోషణలో పెరుగుతున్నారు. వాళ్లకి భీష్ముడు ఉపనయనం చేయించి, రాజవిద్యలన్నీ నేర్పించాడు. భీష్ముడు పరిపాలిస్తున్నప్పుడు కౌరవరాజ్యం గొప్ప కీర్తితో వెలిగిపోయింది. ఉత్తర కురుదేశాలు అన్నింటి కంటే కురుదేశం ఎక్కువ సంపదలతో తులతూగింది. బీష్ముడి ధర్మ రక్షణ వల్ల దేశ ప్రజలకి అభివృద్ధి కలిగింది.

అవసరమైన సమయంలో వానలు కురవడం వల్ల పంటలు బాగా పండాయి. పాడి కూడా సమృద్ధిగా పెరిగింది. చెట్లన్నీ పువ్వులతోను, పండ్లతోను నిండి ఉండేవి. ప్రజలు కూడా ధర్మం చెయ్యడం మీద మక్కువ పెంచుకుని ఒకళ్లకి ఒకళ్లు సహాయపడుతూ జీవించేవాళ్లు. రాజు మంచి మార్గంలో నడిస్తే ప్రజలు కూడా మంచి మార్గంలోనే జీవిస్తారు అన్నది అక్షరాలా జరిగింది.

భీష్ముడి ధర్మబద్ధమైన పరిపాలన వల్ల సదాచార సంపన్నులైన బ్రాహ్మణుల ఇళ్లల్లో వేద కర్మలు, లౌకిక కర్మలు నిత్యమూ జరుగుతూ ఉండేవి. చదవడం, బోధించడం, నిత్యమూ చేసే యజ్ఞాలు, శుభకార్యాలు, ఆశీర్వచనాలు, మంగళ వాయిద్యాలు ఎప్పుడూ వినిపిస్తూ ఉండేవి. సదాచారులైన బ్రాహ్మణులు పెరుగుతూ.. ప్రజలు అభివృద్ధిలో ఎదుగుతూ.. పంటలు సమృద్ధిగా పండుతూ.. ధర్మబద్ధంగా పరిపాలన జరుగుతున్న రాజ్యానికి అంబిక కొడుకు ధృతరాష్ట్రుణ్ని రాజుగా పట్టాభిషేకం చేశాడు భీష్ముడు.

భీష్ముడి అస్త్రబలం, విదురుడి బుద్ధిబలం కౌరవ రాజ్య రక్షణలో ధృతరాష్ట్రుడికి ఎంతగానో సహకరించాయి. కుమారస్వామికి ఉన్నంత శక్తి కలిగిన ధృతరాష్ట్రుడు సామంతరాజుల అండతోనూ; భీష్ముడి భుజబలం సహాయంతోనూ; శత్రురాజుల్ని సంహరించి, హస్తినాపురాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యాన్ని పాలిస్తూ గొప్ప కీర్తిని పొందాడు.

భీష్ముడు ధృతరాష్ట్రుడికి పెళ్లి చెయ్యాలని అనుకున్నాడు. గొప్ప వంశంలో జన్మించిన గాంధార రాజు సుబలుడి కూతురు ‘గాంధారి’ అందమైనది, మంచి తేజస్సు, నడవడిక కలిగినదని బ్రాహ్మణులు చెప్పగా విన్నాడు. ఒకరోజు భీష్ముడు విదురుడితో “ఒక సమయంలో కురువంశం నశిస్తుందని అనుకుంటూ ఉండగా సత్యవతీదేవి అడగడం వల్ల బ్రహ్మతో సమానుడైన వ్యాసమహర్షి ఈ వంశాన్ని నిలబెట్టాడు. కురువంశం ఇంకా వృద్ధిపొందాలన్నది నా ఆశ. గాంధార రాజు కూతురు ‘గాంధారికి’ నూరుమంది కొడుకులు, ఒక కూతురు కలిగేలా శివుడు వరమిచ్చాడట. ధృతరాష్ట్రుడి వివాహం గాంధారితో జరిపిద్దాం. గాంధార దేశపు రాజు కూడా చాలా మంచివాడని విన్నాము” అన్నాడు.

ఇద్దరూ మాట్లాడుకుని యోగ్యులైన పెద్దల్ని ఆ సంబంధం గురించి మాట్లాడడానికి గాంధారదేశం పంపించారు. గాంధార దేశపు రాజు సుబలుడు అందుకు అంగీకరించాడు. ధృతరాష్ట్రుడికి గాంధారిని ఇస్తానని వాగ్దానం చేశాడు.

గాంధారి కళ్లు కలువరేకుల్లా అందంగా ఉంటాయి. ఆమె పెళ్లి పుట్టుగుడ్డి వాడితో జరుగుతోంది. గాంధారదేశ రాజు సుబలుడు గాంధారికి ధృతరాష్ట్రుడే తగిన భర్త అని అమెకి ధృతరాష్ట్రుడితో పెళ్లి నిశ్చయించాడు. సుబలుడు చండశాసనుడు. అతడి మాటకి ఎవరూ ఎదురు చెప్పలేరు. ఆ విషయం గాంధారికి కూడా తెలుసు. ధృతరాష్ట్రుడితో తన పెళ్లి ఖాయమని అర్థం చేసుకుంది. బంధువులు మాత్రం సుబలుడు గుడ్డివాడికి పిల్లనిస్తున్నాడని తెలుసుకుని గుసగుసలాడుకుంటున్నారు.

గాంధారితో ధృతరాష్ట్రుడు వివాహము

గాంధార దేశంలో ప్రజలు, బంధువులు “మనిషికి అవయవాలన్నింటిలో శిరస్సు ప్రధానమైంది. శిరస్సులో కళ్లే ప్రధానమైనవి. ఆ కళ్లే ధృతరాష్ట్రుడికి లేవు. అయినా మంచి గుణాలు కలవాడు కనుక ఫర్వాలేదంటూ అందమైన మన గాంధారిని ధృతరాష్ట్రుడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు” అని ఒకళ్లతో ఒకళ్లు చెప్పుకుంటున్నారు.

ప్రజలు మాట్లాడుకుంటున్న మాటలు, తండ్రి తీసుకున్న నిర్ణయం గాంధారికి తెలుస్తూనే ఉన్నాయి. తన తండ్రి గురించి కాబోయే భర్త గురించి వాళ్లు మాట్లాడుకునే మాటలు బాధ పెట్టాయి. అందుకని, మహా పతివ్రతలు పర పురుషుణ్ని చూడరు. తనకు కాబోయే భర్తకి కళ్లు లేవు కనుక, తను కూడా కళ్లులేనిదానిగా ఉండాలని నిశ్చయించుకుని కళ్లకి అడ్డంగా గుడ్డ కట్టుకుంది. ఆమె అలా చెయ్యడం వల్ల ఆమెకి తండ్రి మీద, భర్తమీద ఉన్న భక్తి గౌరవాలు తెలుసుకున్న బంధువులు తమ ఇష్టం వచ్చినట్టు మాట్లాడ్డం మానేశారు.

ఆమె సోదరుడు శకుని అమితమైన సంపదలతో ఆమెని హస్తినాపురానికి తీసుకుని వచ్చాడు. హస్తినాపురంలో ధృతరాష్ట్రుడికి గాంధారితోను, అమె చెల్లెళ్లు పదిమందితోను వైభవంగా పెళ్లి జరిపించారు. కురు వంశానికి వంశోద్ధారకులు లేరు అనే మాట ఎవరి నోటా వినబడకూడదని అనుకున్న భీష్ముడు కులం, రూపం శీలం ఉన్న వందమంది కన్యల్ని తీసుకుని వచ్చి ధృతరాష్ట్రుడికి ఇచ్చి పెళ్లి జరిపించాడు.

ధృతరాష్ట్రుడి సోదరుడు పాండురాజు వేదాలు, శాస్త్రాలు అన్నీ నేర్చుకుని కత్తి, ఈటె, ధనుస్సు మొదలైన ఆయుధ విద్యల్లో ఆరితేరాడు. ఏనుగులు ఎక్కి స్వారీ చెయ్యడంలో గొప్ప నేర్పరి. సౌందర్యంతోను, కొత్తగా వచ్చిన యౌవనంతోను మచ్చలేని చంద్రుడు ప్రకాశిస్తున్నట్టు ప్రకాశిస్తున్నాడు. అతణ్ని చూసి అతడి వల్ల వంశానికి గొప్ప పేరు ప్రతిష్ఠలు వస్తాయని సంతోషంగా అనుకున్నాడు భీష్ముడు. పాండురాజుకి కూడా పెళ్లి చెయ్యాలని అనుకుని భీష్ముడు విదురుడితో సంప్రదించాడు.

కుంతీదేవి చరిత్ర

యాదవ వంశ రాజు శూరుడికి మేనత్త కొడుకు కుంతిభోజుడు. అతడి మీద ఉన్న అభిమానంతో తన పెద్ద కుమార్తె పృథని కుంతిభోజుడుకి కుమార్తెగా ఇచ్చాడు. అమె కుంతిభోజుడి ఇంట్లో ఉంటూ తన తండ్రి చెప్పినట్టు అనేక మంది బ్రాహ్మణులకి, అతిథులకి ఎప్పుడూ అన్నదానం చేస్తూ ఉండేది.

ఒక రోజు దుర్వాసుడు అనే మహర్షి అతిథిగా వచ్చి ఆమెని భోజనం పెట్టమని అడిగాడు. కుంతి మహర్షికి ఇష్టమైన పదార్ధాలతో భోజనం పెట్టింది. ఆయన సంతోషపడి కుంతికి ఒక దివ్య మంత్రాన్ని ఉపదేశించాడు. “అమ్మా! నువ్వు ఈ మంత్రం చదివి ఏ దేవతల్ని ఆరాధిస్తావో ఆ దేవతలు నువ్వు కోరుకున్నట్టు ఉండేలా కొడుకుల్ని ప్రసాదిస్తారు” అని చెప్పి వెళ్లిపోయాడు.

ఒక రోజు కుంతి దుర్వాస మహర్షి ఇచ్చిన మంత్రాన్ని పరీక్షిద్దామని అనుకుంది. మనస్సులో మంత్రాన్ని జపించి సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి “సూర్యదేవా! నాకు నీలా ఉండే కొడుకుని ప్రసాదించు” అని వేడుకుంది. రెండు చేతులు జోడించి అడుగుతున్న కుంతిని చూసి సూర్యుడు తన వేడిని తగ్గించుకుని నిర్మలమైన చల్లటి కాంతితో కుంతి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. కుంతీదేవి కాంతివంతమైన సూర్యుడి రూపాన్ని చూసి భయంతో వణుకుతూ నిలబడింది. సూర్యుడు ఆమెతో “భయపడకు నువ్వు కోరుకున్న వరం ఇవ్వడానికి వచ్చాను” అన్నాడు.

కుంతి సిగ్గుతో తలవంచుకుని “సూర్యదేవా! ఒక బ్రహ్మజ్ఞాని ఈ మంత్రాన్ని నాకు ఉపదేశించాడు. దాని శక్తిని తెలుసుకోవాలని లోకాలన్నింటికీ వెలుగుని ఇచ్చేవాడివి, త్రిమూర్తుల స్వరూపం కలవాడివి (సూర్యుడు ఉదయం బ్రహ్మస్వరూపుడు, మధ్యాహ్నం శివ స్వరూపుడు, సాయంత్రం విష్ణు స్వరూపుడు), మూడు వేదాల ఆకారాన్ని ధరించినవాడివి (సూర్యుడు ఉదయం ఋగ్వేదస్వరూపుడు, మధ్యాహ్నం యజుర్వేద స్వరూపుడు, సాయంత్రం సామవేద స్వరూపుడు) అయిన నిన్ను అజ్ఞానంతో రప్పించాను. నేను చేసిన తప్పుకి మన్నించు! స్త్రీలు అజ్ఞానంతో తప్పులు చేస్తారు. తప్పులు చేసిన స్త్రీలని అందరూ మన్నిస్తారు” అని కుంతి సూర్యుడికి నమస్కారం చేసింది.

కుంతి మాటలు విని సూర్యుడు “నీకు దుర్వాస మహర్షి ఈ మంత్రాన్ని వరంగా ప్రసాదించాడని నాకు తెలుసు. నీ కోరిక తీరుస్తాను” అన్నాడు.

సూర్యుడి మాటలు విని కుంతి “ సూర్యదేవా! దుర్వాసమహర్షి ఇచ్చిన మంత్రానికి ఇంత శక్తి ఉందని నాకు తెలియదు. పెళ్లికాని స్త్రీ కోరుకో కూడదని కూడా తెలియక నిన్ను అడిగాను. ఇప్పుడు నాకు గర్భం వస్తే నా తల్లితండ్రులు, బంధువులు నన్ను చూసి అవహేళన చేస్తారు. దయతో నన్ను క్షమించు” అంది.

ఆమె మాటలకి సూర్యుడు “ఇప్పటికిప్పుడు నీ గర్భం నుంచి కొడుకు పుడతాడు. నీ కన్యాత్వానికి ఎటువంటి అపకారం జరుగదు” అని చెప్పి కుంతి కోరుకున్నట్టుగా ఆమెకి కొడుకుని ప్రసాదించి వెళ్లిపోయాడు. ఆ క్షణంలోనే సూర్యుడి అంశతో కుంతికి కుమారుడు కలిగాడు.

సూతగృహం చేరిన కుంతి కుమారుడు కర్ణుడు

సహజకుండలాలతో ప్రకాశిస్తూ, అందంగా సూర్యుడే భూమి మీద ప్రకాశిస్తున్నాడేమో అనిపించేంత కాంతితో కుంతీదేవికి కర్ణుడు పుట్టాడు. తరువాత సూర్యుడు ఆకాశంలోకి వెళ్లిపోయాడు. కర్ణుణ్ని చూసిన కుంతికి ఏం చెయ్యాలో తెలియలేదు. ఇతడు తన కొడుకా! అనుకుని ఆశ్చర్యంతో చూసుకుంటూ ఉండిపోయింది.

‘అసలు దుర్వాసుడు నాకు ఈ మంత్రాన్ని ఎందుకు ఉపదేశించాడో తెలియదు. మంత్ర ప్రభావాన్ని తెలుసుకోవాలని అజ్ఞానం వల్ల కలిగిన కోరికతో నేను సూర్యుణ్ని జపించాను. వెంటనే వచ్చిన సూర్యుడు పెళ్లికాని నాకు ఈ గర్భాన్ని ఇచ్చాడు. ఇప్పటికిప్పుడే ఈ పుత్రుడు నాకు ఎలా కలిగాడో తెలియదు. లోకులందరూ నా గురించి చెడుగా అనుకుంటారేమో? ఇప్పటికే ఈ విషయం ప్రజలందరికీ తెలిసిపోయి ఉంటుంది. ఈ పిల్లవాణ్ని ఎత్తుకుని తిరిగితే బంధువులందరూ నన్ను నిందిస్తారు. బలసూర్యుడిలా ప్రకాశిస్తున్న ఈ బాలుణ్ని వదిలేసి వెడదామంటే మనస్సు అంగీకరించడం లేదు’ అని రకరకాలుగా ఆలోచిస్తూ బాధతో పసివాడి వైపు చూస్తూ కూర్చుంది కుంతి.

అమూల్యమైన రత్నాలతోను, బంగారంతోను నిండిన సూర్యుడు పంపించిన ఒక పెట్టె కుంతీ దేవి దగ్గరకి వచ్చింది. కుంతీదేవి తన కొడుకుని ఆ పెట్టెలో పెట్టి నదీప్రవాహంలో వదిలిపెట్టేసి తన ఇంటికి వెళ్లిపోయింది. ప్రవాహంలో కొట్టుకు పోతున్న ఆ రత్నాల పెట్టె ఒక సూతుడికి దొరికింది. దాన్ని ఇంటికి తీసుకుని వచ్చి తెరిచి చూశాడు. అందులో ఒక అందమైన పసివాడు కనిపించాడు. ఆనందంతో ఆ బాలుణ్ని చేతుల్లోకి తీసుకుని వెళ్లి తన భార్య రాధకి ఇచ్చాడు.

ఆమె సంతోషంగా ఆ బాలుణ్ని ఎత్తుకుని ముద్దాడి పెంచుకుంటోంది. బంగారంతోను, రత్నాలతోను వచ్చిన ఆ బాలుడికి ‘వసుషేణుడు’ అని పేరు పెట్టాడు. సూర్యుడి వల్ల కుంతికి పుట్టిన కర్ణుడు రాధ కొడుకుగా పిలవబడుతూ సూతుడి ఇంట్లో వసుషేణుడు అనే పేరుతో పెరుగుతున్నాడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here