[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]
భీముడి పరాక్రమము
[dropcap]శ[/dropcap]తశృంగ పర్వతం మీద భీమసేనుడు పుట్టి పదిరోజులు అయింది. కుంతి భీమసేనుణ్ని ఎత్తుకుని దేవాలయానికి బయలుదేరింది. మిట్టపల్లాలుగా ఉన్న దారిలో నడుస్తూ వెడుతోంది. పక్కనే ఉన్న గుహలోంచి పులి వచ్చి కుంతిమీద పడబోయింది. పక్కనే ఉన్న పాండురాజు మూడు బాణాలు వేసి దాన్నికొట్టి చంపేశాడు. కుంతి భీమసేనుల్ని రక్షించాడు. పులిని చూసి భయపడిన కుంతీదేవి చేతిలోంచి భీమసేనుడు కిందపడ్డాడు. అతడి కఠినంగా వజ్రంలా ఉండే దేహం తగిలిన చోట కొండరాళ్లు నుగ్గు నుగ్గయ్యాయి.
అది చూసి పాండురాజు పరుగెడుతూ భీమసేనుడి దగ్గరికి వచ్చాడు. ఆశ్చర్యంతో కొడుకుని లేవదీసి ఎత్తుకున్నాడు. కుంతీదేవిని తీసుకుని దేవాలయానికి వెళ్లి దేవుడికి మొక్కుకుని తిరిగి ఆశ్రమానికి వచ్చి సుఖంగా జీవిస్తున్నారు.
అర్జునుడి జననము
పాండురాజు ధృతరాష్ట్రుడికి నూరుగురు కొడుకులు కలిగారని విన్నాడు. ముల్లోకాల్ని జయించగల కొడుకుని పొందాలని అనుకున్నాడు. ఏకాంతంగా కూర్చుని ఏకాగ్రతతో ఇంద్రుడి కోసం తపస్సు చేశాడు. తను ఒంటికాలిమీద నిలబడి తపస్సు చేస్తూ కుంతీదేవిని కూడా ఒక సంవత్సరం వ్రతం చెయ్యమని చెప్పాడు.
పాండురాజుకి దేవేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. పాండురాజుని చూసి “రాజా! నీకు శత్రువుల్ని నాశనం చేసేవాడు, బంధువుల్ని స్నేహితుల్ని ఆదరించేవాడు అయిన కొడుకు పుడతాడు” అని వరమిచ్చాడు. పాండురాజు సంతోషంతో కుంతీదేవి వైపు చూసి “కుంతీ! ఈ లోకంలో ఎవరికేనా ధనము, విద్య, సంతానము ఎంత ఉన్నా తృప్తి ఉంటుందా! నాకు మాత్రం ధర్మ మార్గంలో ఇంకా కొడుకుల్ని పొందాలని ఉంది” దేవతలందరిలో మొదటివాడు దేవేంద్రుడే. అతడు లోకాలన్నింటికీ రాజు. దేవేంద్రుడితో సమానమైనవాడు, ధర్మపరుడు, లోకాలన్నిటినీ రక్షించ కలిగిన సమర్థుడు, వంశ కీర్తిని పెంచేవాడు అయిన ఒక కొడుకు కావాలి” అని అడిగాడు.
కుంతీదేవి దుర్వాసుడు ఇచ్చిన మంత్రంతో దేవేంద్రుణ్ని ప్రార్థించింది. కుంతీదేవికి దేవేంద్రుడి అంశతో ఉత్తరఫల్గునీ నక్షత్ర మొదటి పాదంలో గొప్ప పౌరుషం కలవాడు, లోకానికే కీర్తి తెచ్చేవాడు, గొప్ప తేజస్సు కలవాడు, వంశాన్ని నిలబెట్టేవాడు అయిన కొడుకు కలిగాడు. ఆ సమయంలో ఆకాశవాణి “ఈ బాలుడు కార్తవీర్యుడి కంటే వీరుడు అవుతాడు. ఇతడి పేరు ‘అర్జునుడు’. యుద్ధంలో ఇంద్రాది దేవతల్ని ఓడిస్తాడు. పరాక్రమంతో ఖాండవ వనాన్ని దహిస్తాడు. భూమి మీద ఉన్న రాజులందరినీ జయించి ధర్మరాజు చేత రాజసూయ యాగం చేయిస్తాడు. దేవతల వల్ల దివ్యాస్త్రాలు పొంది శత్రువుల్ని జయిస్తాడు” అని చెప్పింది.
ఆకాశం నుంచి పూలవాన కురిసింది. భూమండలం మొత్తం దద్దరిల్లేట్టు దేవదుందుభులు మ్రోగాయి.
మరీచి మొదలైన తొమ్మిది మంది బ్రహ్మలు (భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి. తొమ్మిదిమంది ప్రజాపతుల్నే నవబ్రహ్మలు అంటారు.), ద్వాదశాదిత్యులు (ఇంద్రుడు, ధాత, పర్జన్యుడు, త్వష్ట, పూషుడు, అర్యముడు, భగుడు, వివస్వంతుడు, విష్ణువు, అంశుమంతుడు, వరుణుడు, మిత్రుడు.), ఏకాదశరుద్రులు (అజుడు, ఏకపాదుడు, అహిర్బుధ్న్వుడు, త్వష్ట, రుద్రుడు, హరుడు, శంభుడు, త్ర్యంబకుడు, అపరాజితుడు, ఈశానుడు, త్రిభువనుడు), ధరుడు మొదలైన అష్టవసువులు, భరద్వాజుడు మొదలైన మహర్షులు, భీమసేనుడు మొదలైన గంధర్వులు, శేషుడు మొదలైన సర్పశ్రేష్ఠులు, గరుత్మంతుడు మొదలైన ఆకాశంలో సంచరించగలిగినవాళ్లు, మేనక మొదలైన అప్సరసలు, అశ్వినీదేవతలు, విశ్వేదేవతలు, ఇంకా స్వర్గంలో ఉన్న రాజులందరూ వచ్చారు.
అర్జునుడు పుట్టిన రోజున శతశృంగ పర్వతం మీదకి మూడులోకాల్లో ఉన్న వాళ్లూ వచ్చెయ్యడం వల్ల బ్రహ్మదేవుడు సృష్టి చేసే రోజు ఎలా ఉంటుందో అలా శతశృంగ పర్వతం పరిపూర్ణమైన ప్రకాశంతో ప్రకాశించింది. అప్సరసలు నాట్యాలు; సిద్ధులు, విద్యాధరులు వీణ, వేణువు, మృదంగము మొదలైన వాద్యాలు; కిన్నెర కింపురుషుల లలితగానాలు; మహర్షులు దేవతలు చేస్తున్న ఆశీర్వచనాల వల్ల కలిగిన శబ్దంతో ఆ ప్రదేశం ఎంతో మనోహరంగా ఉంది.
కుంతీదేవి యందు త్రిమూర్తుల్లా ఉన్న ముగ్గురు కొడుకుల్ని పొందిన పాండురాజు త్రిలోకాలకి ఆధిపత్యం పొందినంత సంతోషాన్ని పొందాడు. కొడుకులతో ఆటపాటలతో సంతోషంగా కాలం గడుపుతున్నాడు. వాళ్లని చూసిన మాద్రి తనలో తను “ఇక్కడ కుంతి తను కోరుకున్నట్టుగా ముగ్గురు కొడుకుల్ని పొందింది. అక్కడ హస్తినాపురంలో గాంధారి వందమంది కొడుకుల్ని పొంది సంతోషంగా ఉంది. తను మాత్రం జీవితాన్ని నిస్సారంగా గడుపుతోంది” అని మాద్రి తనలో తను దు:ఖపడుతోంది.
నకులసహదేవులు జననము
ఒకరోజు ఒంటరిగా ఉన్న భర్త దగ్గర కూర్చుని “కుంతి దయతలిస్తే నేను కూడా కొడుకుల్ని పొందుతాను. అలా జరిగితే నీకు, నాకు, లోకాలకీ కూడా మంచి జరుగుతుంది. నాకు కూడా కొడుకులు కలిగేట్టు చెయ్యమని కుంతీదేవికి చెప్పండి” అని చెప్పింది.
ఆమె మాటలు విని పాండురాజు “మాద్రీ! నువ్వు అనుకున్నట్టే నేను కూడా మనస్సులో అనుకుంటున్నాను. కుంతిని అడిగితే తప్పకుండా నీకు కూడా కొడుకులు కలిగేట్టు చేస్తుంది” అని వెంటనే కుంతీదేవిని పిలిచి మాద్రి మనస్సులో ఉన్న కోరికని చెప్పాడు. లోకానికంతటికీ మంచిని చేసేవాళ్లు అశ్వినీ దేవతలు కనుక అశ్వినీదేవతల్ని ఆరాధించి మాద్రికి సంతానం కలిగేలా చెయ్యమని చెప్పాడు. కుంతి పాండురాజు చెప్పినట్టు చేసింది. సూర్యచంద్రులకి ఉన్నంత తేజస్సుతో ప్రకాశిస్తూ, దేవతల గుణాలతో అశ్వినీదేవతల అంశలతో కవలలు పుట్టారు. ఆకాశవాణి ‘నకులసహదేవులు’ అని నామకరణం చేసింది.
బలవంతులైన యుధిష్టిర భీమార్జున నకులసహదేవులు జ్ఞానంతో సంపాదించిన కీర్తి కలవాళ్లు. దేవతల ప్రసాదంగా పుట్టినవాళ్లు. పాండవులు పుట్టిన సమయంలో ఆకాశవాణి మాట్లాడి పేర్లు కూడ తనే పెట్టింది. అర్జునుడి పుట్టినరోజు త్రిలోకవైభవంగా జరిగింది. పాండవులు దైవాంశల వల్ల పుట్టినవాళ్లే కాదు, దైవ బలం కలిగినవాళ్లు, దేవతల ఆశీర్వాదం పొందినవాళ్లు. పాండురాజు కొడుకులు కనుక పాండవులు అని పిలవబడ్డారు.
కుంతీదేవి అన్న వసుదేవుడు పాండురాజు మృగశాపం వల్ల ఘోరతపస్సు చేసుకుంటూ భార్యలతో కలిసి శతశృంగ పర్వతం మీద ఉన్నాడని, దేవతల వరప్రసాదం వల్ల అతడికి అయిదుగురు కొడుకులు కలిగారని తెలుసుకున్నాడు. అతడు చెల్లెలు కుంతీదేవిని మరిదిని చూసి రమ్మని తమ పురోహితుడు కశ్యపుణ్ని పంపించాడు. అతడితో తన చెల్లెలి పిల్లలకి రత్నాలతో చేసిన ఆభరణాల్ని కానుకలుగా పంపించాడు.
కశ్యపుడు శతశృగం వెళ్లి కుంతి మాద్రిలతో ఉన్న పాండురాజుని చూశాడు. వసుదేవుడు ఇమ్మన్న ఆభరణాలు ఇచ్చి చెప్పమన్న విషయాలు చెప్పాడు. తరువాత చెవులు కుట్టించడం ఉపనయనం వంటి కర్మలు చేయించి వేదవిద్యని అధ్యయనం చేయిస్తున్నాడు. అప్పటికి వసంతమాసం వచ్చింది.
పాండురాజు మరణము
వసంతమాసం రావడం వల్ల అడవి మొత్తం అందంగా కనిపిస్తోంది. మామిడి పూతని, మొగ్గల్ని తింటూ సంతోషంతో కూస్తున్న కోయిలల గుంపుల కూతలు మనోహరంగా వినిపిస్తున్నాయి. మంచిగంధపు చెట్లు, చీకటి చెట్లు, అగరుచెట్లు, అరటితోటలు, లవలీ తీగలు, మామిడి చెట్లు విరగబూసి సువాసనలు వెదజల్లుతున్నాయి. తామరు కొలను విరబూసిన తామర పువ్వులతో తివాచీ పరిచినట్టు కనిపిస్తోంది. వికసించిన పువ్వులమీద ఉన్న తేనెకోసం తుమ్మెదలు పోటీ పడుతున్నాయి. వీటన్నిటికీ మించి వాటి మీదుగా వీస్తున్న గాలి వాతావరణాన్ని ఆహ్లాదంగా మారుస్తోంది.
ఒకరోజు కుంతీదేవి బ్రాహ్మణులకి భోజనం పెట్టడంలో ఉండిపోయింది. మాద్రి బంగారు రంగులో ఉండే సంపెంగల్ని ఆభరణాలుగాను, వావిలి పూలని ముత్యాలుగాను, పొగడదండలు చెవికి ఆభరణాలుగాను ధరించింది. సహజంగానే అందంగా ఉండే మాద్రి పువ్వులన్నీ ధరించి వసంత లక్ష్మిలా మెరిసిపోతోంది. పాండురాజు దృష్టి మాద్రి అందం మీద పడింది. కురువంశంలో గొప్పవాడైన పాండురాజు మనస్సు వశం తప్పింది. మృగశాపాన్ని పాండురాజు ఆ సమయంలో మర్చిపోయి మాద్రి దగ్గరికి వచ్చాడు. మాద్రి శాపం విషయం మర్చిపోలేదు. గట్టిగా కేకలు వేసింది. తన దగ్గరకు రావద్దని బతిమాలింది. పాండురాజు వినిపించుకోలేదు. అందువల్ల పాండురాజు మరణించాడు.
అతణ్ణి పట్టుకుని మాద్రి గట్టిగా ఏడుస్తోంది ఎప్పుడూ వాళ్లిద్దర్నీ కనిపెట్టుకుని ఉండే కుంతీదేవి దగ్గర లేకపోయింది. అందువల్లే ఇంత ఘోరం జరిగి పోయింది. కుంతీదేవి కొడుకులతో సహా పరుగెత్తుకుంటూ వచ్చి భర్త పాదాల మీద పడి ఏడుస్తోంది. శతశృంగ పర్వతం మీద ఉన్న మహర్షులందరూ విషయం తెలుసుకుని పరుగెత్తుకుని వచ్చారు. దుఃఖంతోను, ఆశ్చర్యంతోను నిలబడిపోయారు.
మాద్రితో కుంతి “మాద్రీ! నేను పాండురాజు మనస్సుకి ఇష్టమైన ధర్మపత్నిని. ఆయనని విడిచి నేను ఉండలేను. నేను కూడా ఆయనతో వెళ్లిపోతాను. నువ్వు మన కొడుకుల్ని పెంచు” అంది.