మహాభారత కథలు-36: మాద్రి సహగమనము

0
2

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

మాద్రి సహగమనము

[dropcap]ను[/dropcap]వ్వు ఇక్కడే ఉండి కొడుకుల్ని పెంచు అని చెప్పిన కుంతి మాటలు విన్న మాద్రి “కుంతీ! నువ్వు కురువంశాన్ని తరించేలా చేస్తూ ధర్మ మార్గంలో కొడుకుల్ని పొందావు. పాండురాజుకి సంతోషాన్ని కలుగచేశావు. పుణ్యలోకం చేరడానికి కారణమయ్యావు. అతడి శాశ్వతమైన కోరికని తీర్చావు. పాండురాజు నన్ను కోరిన కోరికని తీర్చడానికి ఈ లోకంలో అవకాశం నాకు దొరకలేదు. కనుక, నేను ఆయనతో సహగమనం చేసి పరలోకంలో అయినా ఆయన కోరికని తీర్చడానికి అయన వెంట వెడతాను. మృగశాపం తెలిసి కూడా జాగ్రత్తగా ప్రవర్తించలేక పోయాను. ఇంక ఈ పిల్లల్ని ఎలా పెంచగలను. ఈ పిల్లల్ని నువ్వే జాగ్రత్తగా కాపాడగలవు” అని చెప్పింది.

తరువాత అక్కడ ఉన్న వెయ్యిమంది మహర్షులకి నమస్కారం చేసి భర్తతోపాటు తను కూడా చితిమీదకి ఎక్కి మంటలలో మాద్రి ప్రాణాలు విడిచింది. మహర్షులు జరుపవలసిన కార్యక్రమాల్ని యథావిధిగా జరిపించారు. కుంతీదేవిని ఆమె కొడుకుల్ని ఓదార్చారు. తరువాత ఏం చెయ్యలో ఒకళ్లతో ఒకళ్లు సంప్రదించుకున్నారు. “పాండురాజు రాజ్యసంపదని, సేవకుల్ని, చుట్టాల్ని, ప్రజల్ని వదిలి తపస్సు చేసుకుంటూ మనల్నే నమ్ముకుని నిశ్చింతగా జీవించాడు. ఇప్పడు తన కొడుకుల్ని మనకి అప్పగించి స్వర్గానికి వెళ్లిపోయాడు. మనం ఆలస్యం చెయ్యకుండా ఈ పాండవుల్ని హస్తినాపురం తీసుకుని వెళ్లి కురువంశంలో ఉన్న పెద్దలకి అప్పగించాలి” అని నిర్ణయించుకున్నారు.

పాండవుల్ని ధృతరాష్ట్రుడికి అప్పగించిన మహర్షులు

పాండురాజు మరణించాక మాద్రి కూడా సహగమనం చేసింది. శతశృంగ పర్వతం మీద ఉన్న మహర్షులు బాగా ఆలోచించి పాండవుల్ని, కుంతీదేవినీ తీసుకుని హస్తినాపురానికి వచ్చారు. ఈ విషయం ప్రజలకి తెలిసింది. పాండురాజు దేవతల అనుగ్రహంతో గొప్ప తేజస్సుతో వెలిగిపోతున్న గుణవంతులైన అయిదుగురు కొడుకుల్ని కన్నాడు. వాళ్లు హస్తినాపురానికి వచ్చారు. అందరం వెళ్లి చూద్దాము రండి అని ఒకళ్లతో ఒకళ్లు చెప్పుకుంటూ, అందరికంటే తామే ముందు చూసెయ్యాలని అనుకుంటూ ఆతృతతో వస్తున్నారు.

సింహపు పిల్లల్లా గొప్ప పరాక్రమం కలిగిన పాండవుల్ని చూశారు. వీళ్లు దైవశక్తి వల్ల పుట్టారు అని వేరే చెప్పక్కర్లేదు. వాళ్ల చుట్టూ పరుచుకుని ఉన్న ఆ కాంతిని చూస్తుంటే దేవతలే అనిపిస్తున్నారు. ఇంత అందమైన రూపము, తేజస్సు సామాన్య మానవులకి ఉంటాయా? అని తమలో తాము చెప్పుకుంటూ సంతోషంగా చూస్తున్నారు.

వెయ్యిమంది మహర్షులతో కలిసి వచ్చిన పాండవులు, కుంతీదేవి రాజమార్గంలో వచ్చి రాజభవన ముఖద్వారం దగ్గరకి చేరుకున్నారు. మంత్రులు, పురోహితులు, బ్రాహ్మణులు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు మొదలైన ధృతరాష్ట్రుడి వందమంది కొడుకులు వాళ్లకి ఎదురు వచ్చారు. అందర్నీ లోపలికి తీసుకుని వెళ్లారు.

భీష్ముడు, విదురుడు, సత్యవతి, ధృతరాష్ట్రుడు, అంబిక, అంబాలిక ముందుగా వచ్చిన మహర్షులకి నమస్కారం చేశారు. తమకి నమస్కరించిన పాండవుల్ని ప్రేమతో ఎత్తుకున్నారు. కుంతిని ఆత్మీయంగా పలకరించారు. పాండురాజు మరణించినందుకు విదురుడు, ధృతరాష్ట్రుడు, గాంధారి పెద్దగా ఏడుస్తుంటే మహర్షులు ఓదార్చారు. అందరిలోకి పెద్దవాడైన ఒక మహర్షి మిగిలిన మహర్షుల అనుమతి తీసుకుని “సూర్యుడితో సమానమైన పాండురాజు శతశృంగ పర్వతం మీద గొప్ప తపస్సు చేసి యమ, వాయు, ఇంద్ర, అశ్వినీదేవతల యొక్క అనుగ్రహంతో వంశాన్ని వృద్ధి చెయ్యడం కోసం సింహానికి ఉన్నంత బలం కలిగిన అయిదుగురు కొడుకుల్ని కన్నాడు.

మాద్రితో కలిసి పాపబంధాలనుంచి విముక్తి పొంది పదిహేడు రోజుల క్రితం స్వర్గానికి చేరుకున్నాడు. వాళ్లిద్దరి అస్థులు తీసుకుని వచ్చాము. శాస్త్రోక్తంగా ఉత్తరక్రియలు జరిపించి వీటిని సంస్కరించండి. ఈ కుంతీదేవి కూడా సహగమనం చెయ్యాలని అనుకుంది. కాని, కొడుకుల్ని రక్షించడం కోసం ఆమెని సహగమనం చెయ్యకుండా మహర్షులు ఆపారు. ఈ పాండవులు కురువంశాన్ని వృద్ధి చేస్తారు. వీళ్లు దేవతా స్వరూపులు. యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అని వీళ్లకి ఆకాశవాణి నామకరణం చేసింది. బ్రహ్మర్షులు వీళ్లకి ఉపనయనం చేశారు. చక్కగా వేదాధ్యయనం చేస్తూ పెరుగుతున్నారు. కురువంశంలో పెద్దలైన మీరు వీళ్లని చేరదీసి రక్షించండి” అని చెప్పి ఆ మహర్షులందరు అప్పటికప్పుడే అంతర్థానమయ్యారు.

తరువాత వ్యాసుడు, భీష్ముడు ధృతరాష్ట్రుల అనుమతి తీసుకుని విదురుడు పితృయజ్ఞం గురించి బాగా తెలిసిన ఉత్తములైన బ్రాహ్మణుల్ని పిలిపించాడు. ఒక గొప్ప పవిత్రమైన స్థలంలో అస్థికలకి సంస్కారం జరిపించాడు. పుణ్యహోమంతోను, నీళ్ల తర్పణాలతోను శ్రాద్ధకర్మని చేయించాడు. సదాచారవంతులైన బ్రాహ్మణులకి అగ్రహారాలు, వస్త్రాలు, ఆభరణాలు, పడకలు, ఆసనాలు, గొడుగులు, గోవులు, గుర్రాలు, ఏనుగులు దానాలుగా ఇచ్చాడు. ప్రజలకి అన్నదానం చేసి పాండురాజుకి ఉత్తరక్రియలు శాస్త్రోక్తంగా జరిపించాడు.

తరువాత కృష్ణద్వైపాయనుడు అందర్నీ ఓదార్చాడు. ఒకరోజు సత్యవతితో “సంసారం ఎండమావుల్లా చంచలమైంది. సంపదలు శాశ్వతమైనవి కాదు. చూస్తుంటే రాబోయే రోజులకంటే జరిగిన రోజులే బాగున్నాయని అనిపిస్తోంది. ధృతరాష్ట్రుడి కొడుకులు పరమ దుర్మార్గులు. కారణం లేకుండానే శత్రుత్వాన్ని పెంచుకుంటారు. వాళ్ల వల్ల కౌరవ వంశానికి కీడు జరుగుతుంది. దాన్ని ధృతరాష్ట్రుడు తనే అనుభవిస్తాడు. మీరు ఈ దారుణాన్ని చూడలేరు. కనుక ఈ బంధాల్ని విడిచి పెట్టి తపస్సు చేసుకునేందుకు వెళ్లిపొండి” అని చెప్పి వెళ్లిపోయాడు.

సత్యవతి వ్యాసుడు తనకు చెప్పిన విషయాన్ని భీష్ముడికి, విదురిడికీ చెప్పింది. అంబని, అంబాలికని, తీసుకుని అడవికి వెళ్లి వాళ్లతో కలిసి గొప్ప తపస్సు చేసింది. కొన్నాళ్లకి శరీరాలు విడిచి ప్రాణాలు వదిలిపెట్టారు.

ధృతరాష్ట్రుడు తన కొడుకుల్ని, పాండురాజు కొడుకుల్ని సమానంగా చూస్తూ ప్రేమతో పెంచుతున్నాడు. ధృతరాష్ట్రుడి ప్రేమతో పెరుగుతున్న పాండవులు కౌరవులతో కలిసి ఆడుకుంటున్నారు. ఆటల్లో గుండ్రంగా తిరిగేప్పుడు, కొట్టేటప్పుడు, పరుగెత్తేటప్పుడు, పోట్లాడుకునేటప్పుడు, బలం ఉపయోగించేటప్పుడు రాజకుమారులు అందరిలో భీముడే గెలుస్తున్నాడు.

పది పదిహేనుమందిని ఒక్కసారిగా పట్టుకుని నేలమీద పడేసి ఈడ్చేవాడు. వాళ్ల వీపు మీద చర్మాలు ఊడిపోయేవి. ఈత కోసం వెళ్లినప్పుడు ధృతరాష్ట్రుడి కొడుకుల్ని ఒక్కొక్క భుజం మీద పదేసి మందిని ఎక్కించుకుని నీళ్లల్లో పూర్తిగా ముంచి తీసేవాడు. వాళ్ల బలమంతా తగ్గాక గట్టుకి చేర్చేవాడు. పళ్లు కోయడానికి చెట్లు ఎక్కినప్పుడు చెట్ల మొదళ్లని వేగంగా కదిపేవాడు. చెట్టు మీదకి ఎక్కిన వాళ్లు పండ్లతోపాటు రాలి కింద పడేవాళ్లు. భీముడు చేసే పనులకి అందరూ బాధపడేవాళ్లు.

భీముడు పెట్టే బాధల్ని తట్టుకోలేక ఒకరోజు దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని మాట్లాడుకున్నారు. పాండవులకి బలము, తనకు శత్రువు భీముడే అన్నాడు దుర్యోధనుడు. అతణ్ని చంపడం సాధ్యం కాదు. రహస్యంగానే చంపాలి. భీముణ్ని చంపేసి, ధర్మరాజుని చెరసాలలో పెడితే ఇంక తనని ఎదిరించే శత్రువులు ఉండరు. మిగిలిన వాళ్లల్లో తనే పెద్దవాడు కనుక రాజ్యం మీద అధికారం తనకే వస్తుంది. భూమండలం మొత్తాన్ని తనే పాలించవచ్చని దుర్యోధనుడి దురాలోచన. అప్పటికి ఇంకా అర్జునుడు, నకులుడు, సహదేవుల బలం గురించి దుర్యోధనుడికి తెలియదు.

భీముణ్ని చంపడానికి ప్రయత్నించిన దుర్యోధనుడు

దుర్యోధనుడు విదురుడికి భీష్ముడికి తెలియకుండా భీముడికి అపకారం చెయ్యాలన్న దురాలోచనలో ఉన్నాడు. అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. ఒకరోజు అందరూ కలిసి ఈతకి వెళ్లారు. వాయుపుత్రుడు భీముడు ఒక్కడే వందమంది కౌరవులతో కలిసి నీళ్లల్లో ఆడి అలిసి పోయిన భీముడు ‘ప్రమాణకోటి’ అనే ప్రదేశంలో చల్లటి గాలి తగులుతుంటే నేలమీద పడుక్కుని నిద్రలోకి వెళ్లిపోయాడు. దుర్యోధనుడు ప్రశాంతంగా కదలకుండా పడుక్కుని ఉన్న భీముణ్ని తీగలతో కట్టించి కోపంగా గంగా నదిలోకి పడేయించాడు. భీముడికి మెలుకువ వచ్చి ఒళ్లు విరుచుకున్నాడు. అతడికి కట్టి ఉన్న తీగలన్నీ ఒక్కసారిగా తెగిపోయాయి. వెంటనే భీముడు నీళ్ల పైకి వచ్చాడు.

మరొక రోజు దుర్యోధనుడు నిద్రపోతున్న భీముణ్ని తన రథ సారథికి చెప్పి నల్లత్రాచు పాములతో కరిపించాడు. మెలుకువ వచ్చిన భీముడు పాముల్ని అన్నింటినీ చంపేసి కోపంతో రథసారథిని కొట్టాడు. అతడు అక్కడికక్కడే చచ్చిపోయాడు. ఇంకో రోజు దుర్యోధనుడు అన్నంలో విషం కలిపి భీముడికి పెట్టించాడు. యుయుత్సుడు అన్నంలో విషముందని ఎంత చెప్పిన వినకుండ ఆకలిగా ఉన్న భీముడు దాన్ని తినేశాడు. వాయుపుత్రుడైన భీముడికి ఆ అన్నం అమృతం తిన్నట్టు ఉపయోగపడింది.

దుర్యోధనుడు భీముడికి ఎంత అపకారం చెయ్యాలని అనుకున్నా అవన్నీ అతడికి ఉపకారంగా మారుతున్నందుకు దుర్యోధనుడు సిగ్గుపడ్డాడు. అయినా అతడి ఆలోచన మారలేదు. ఇప్పుడు ఒక్క భీముడికే కాకుండా పాండవులందరికీ అపకారం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. కౌరవులకి, పాండవులకి విలువిద్య నేర్పించడానికి కృపాచార్యుడు, ద్రోణాచార్యుల్ని నియమించాడు భీష్ముడు. అందరూ ఒకళ్లతో ఒకళ్లు పోటీ పడుతూ విలువిద్య నేర్చుకుంటున్నారు.

వైశంపాయనుడు చెప్తున్నదాన్ని వింటున్న జనమేజయుడు “వైశంపాయనమహర్షీ! కృపాచార్యుడు, ద్రోణాచార్యుల పుట్టుక గురించి, వాళ్లు కురుకుమారులకి గురువులయిన విధానం గురించి చెప్పండి” అని అడిగాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here