[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]
ఆదిపర్వము – ఆరవ ఆశ్వాసము
రాజకుమారుల అస్త్ర విద్యా సందర్శనము
కృపాచార్యుల వృత్తాంతము
[dropcap]శౌ[/dropcap]నకుడు మొదలైన మహర్షులకి మహాభారత కథని చెప్తున్నాడు రౌమహర్షణి మహర్షి. మిగిలిన మహర్షులు అందరు శ్రద్ధగా వింటున్నారు.
ద్రోణాచార్యుడు రాజకుమారులకి శస్త్రాస్త్ర విద్యలు చక్కగా నేర్పిస్తున్నాడు. వ్యాసుడు, భీష్ముడు, విదురుడు, కృపుడు, శల్యుడు, శకుని సోమదత్తుడు మొదలైన పెద్దలకి రాజకుమారులు ఎంత చక్కగా నేర్చుకున్నారో చూపించాలని అనుకున్నాడు. ద్రోణాచార్యుడు ధృతరాష్ట్రుడితో “మహారాజా! కౌరవులు, పాండవులు శస్త్రాస్త్ర విద్యల్ని చాలా బాగా నేర్చుకున్నారు. వాళ్ల విద్యానైపుణ్యాన్ని మీరు సభలో తెలుసుకోవాలి” అన్నాడు.
ద్రోణాచార్యుడు చెప్పినదానికి ధృతరాష్ట్రుడు అంగీకరించాడు. వెంటనే విదురుణ్ని పిలిచి శస్త్రాస్త్రవిద్యల్లో కురువంశ రాజకుమారులు ఎంత ప్రావీణ్యత సంపాదించారో తెలుసుకునేందుకు వీలుగా ఉండేలా రంగస్థలం సిద్ధం చెయ్యమని చెప్పాడు. విదురుడు శాస్త్రప్రకారం రంగస్థలాన్ని సిద్ధం చేయిస్తున్నాడు. చుట్టుకొలత, పొడవు, వెడల్పు ఎంత కావాలో అంత ప్రదేశాన్ని ఎంచుకున్నాడు. దాంట్లో ఉన్న చెట్లని, పొదల్ని, పుట్టల్ని తీయించాడు. తూర్పు భాగంలోను, ఉత్తర భాగంలోను వాటంగా ఉండేలా పల్లపు ప్రదేశాల్ని ఏర్పాటు చేయించాడు.
ఎత్తు పల్లాల్ని చదును చేయించాడు. ముళ్లని, రాళ్లని, ఎముక ముక్కల్ని, ఏరి పారేయించాడు. దుమ్ము లేకుండా చేసి ప్రేక్షకులు కూర్చోడానికి అనువుగా గదుల్ని, మంచెల్ని మణులతో నిర్మించి అలంకరించమని చెప్పాడు. లోపల, బయట ఉన్న వాకిళ్లని జెండాలతోను, కొత్త చిగుళ్లతోను, అరటి స్తంభాలతోను, పూలమాలలతోను అలంకరించమన్నాడు. అన్ని దిక్కుల్లోను శాంతి పూజలు చేయించమన్నాడు. రంగస్థలాన్ని అతి సుందరంగా తీర్చిదిద్దించాడు.
పంచాంగం చూసి మంచి ముహూర్తం నిర్ణయించాడు. ఆ శుభముహూర్తం రానే వచ్చింది. ధృతరాష్ట్రుడు గాంధారీదేవి ముందు నడుస్తున్నారు. మిగిలిన వందమంది భార్యలు, అనేకమంది అంతఃపుర స్త్రీలు వాళ్లని అనుసరించారు. పెద్ద పెద్ద ముత్యాల దండలు, రకరకాల మణులు, బంగారంతో అలంకరించబడి ఇంద్రధనస్సులా వెలిగిపోతున్న రంగస్థలంలోకి ప్రవేశించారు. పాండవుల తల్లి కుంతీదేవి తన కుమారుల విద్యా ప్రదర్శన కళ్లారా చూడాలని వచ్చి ధృతరాష్ట్రుడు, గాంధారుల దగ్గర సంతోషంగా కూర్చుంది.
వ్యాసమహర్షితో కలిసి బ్రాహ్మణులు; కృపాచార్యుడు, శల్యుడు, శకుని, భీష్ముడు, విదురుడు, సోమదత్తుడు మొదలైన గురువులు, బంధుమిత్రులు; లెక్కపెట్టలేనంతమంది మంత్రులు, సామంతరాజులు; గాయకులు, వైతాళికులు వంటివాళ్లు అందరు ఎవరికి నియమించిన స్థలాల్లో వాళ్లు కూర్చున్నారు. పెద్ద శబ్దం చేస్తూ భేరులు మ్రోగించారు.
అస్త్రవిద్యా ప్రదర్శన చూడడానికి వచ్చిన క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు మొదలైన అన్ని రకాల జాతులవాళ్లు ఒక చోట చేరారు. వాళ్లల్లో వాళ్లు మాట్లాడుకుంటుంటే వస్తున్న శబ్దం సముద్రంలో అలలు లేచినప్పుడు వచ్చే భయంకరమైన శబ్దంలా వినబడుతోంది.
అదే సమయంలో ద్రోణాచార్యుడు తెల్లటి బట్టలు, ఆభరణాలు ధరించి, మెడలో పూలదండలు, జందెముతోను; నెరిసిన తల, మీసము, గడ్డముతోను; గంధం పూసుకుని గొప్ప తేజస్సు కలిగిన శరీరంతోను కొడుకు అశ్వత్థామతో కలిసి వచ్చాడు. రంగస్థలం మధ్యలో మేఘాలు లేని ఆకాశం ఎంత నిర్మలంగా ఉంటుందో అంత నిర్మలంగా అంగారక గ్రహంతో కలిసి ప్రకాశించే సూర్యుడిలా రాజకుమారుల గురువు ద్రోణాచార్యుడు ప్రకాశిస్తున్నాడు. బ్రాహ్మణులు వచ్చి పుణ్యహవచనం చేశారు.
బలమైన చేతులతో అల్లెతాటి వల్ల దెబ్బలు తగలకుండా ఉడుము తోలుతో కుట్టిన కవచాల్ని వేళ్లకి తొడుక్కుని, బాణాలతో నిండుగా ఉన్న అమ్ములపొదులతో, ధనుస్సులు కవచాలు ధరించి గుణవంతులైన కౌరవులు, పాండవులు ద్రోణాచార్యుడి వెనక, ధర్మరాజు పక్కన వయస్సు తేడాలతో వచ్చి రంగస్థలం మధ్యలో నిల్చున్నారు.
పాండవులు, కౌరవులు ఇతర రాజ్యాల నుంచి వచ్చిన రాజకుమారులతో కలిసి కత్తి, డాలు విన్యాసాల్లో తమకి ఉన్న నేర్పరితనాన్ని; తమ పేర్లు పొదిగిన బాణాలతో లక్ష్యాన్ని ఛేదించడంలో తమకి ఉన్న సామర్థ్యాన్ని; గుర్రాల్ని, మదపుటేనుగుల్ని, రథాల్ని ఎక్కడంలో గల ప్రావీణ్యాన్ని; ఈటె వంటి ఆయుధాల్ని ప్రయోగించడంలో కౌశలాన్ని ప్రదర్శించారు. వారి ప్రదర్శన చూసి అక్కడ ఉన్న పెద్దలు, రాజులు రాజకుమారుల్ని అభినందించారు.
భీమదుర్యోధనుల గదాకౌశలము
అంతులేని బలపరాక్రమాలు కలిగిన భీముడు, దుర్యోధనుడు తమ గదా నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ముందుకి వచ్చారు. ఒకే శిఖరం మీద ఎత్తుగా ఉన్న రెండు శిఖరాలు, కోపంతో రెండు మదపుటేనుగులూ డీకొన్నట్టు ఒకళ్లనొకళ్లు తాకుతూ, కుడి నుంచి ఎడమకి; ఎడమనుంచి కుడికి వలయాకారంలో చిత్రంగా తిరుగుతూ గదా యుద్ధంలో తమకు కలిగిన నైపుణ్యాన్ని ప్రదర్శించారు.
కాళ్ల కదలికలతో భూమి బద్దలవుతుందేమో అన్నట్టుగాను, వాళ్లు చేస్తున్న హుంకార ధ్వనులకి ఆకాశం బద్దలవుతుందేమో అన్నట్టుగాను అనిపించింది. వాళ్ల గదల రాపిడికి ముందు ముందు రాబోయే కురుక్షేత్ర మహా యుద్ధం కనిపిస్తున్నట్టయింది. గొప్ప విద్వాంసుడైన విదురుడు అక్కడ జరుగుతున్న రాజకుమారుల విద్యానైపుణ్యము, వాళ్ల ప్రదర్శన గురించి ధృతరాష్ట్రుడికి వివరించి చెప్తున్నాడు.
భీముడు దుర్యోధనుడు ప్రదర్శిస్తున్న గదా కౌశలాన్ని చూస్తున్న ప్రజల మధ్య కూడా కోపావేశాలు పెరిగిపోయాయి. ఒకళ్ల మీద ఒకళ్లు విసురుకుంటున్న మాటలు, పక్షాలుగా విడిపోవడం, అరుపులతో కేకలతో క్రోధావేశాలతో రెచ్చకొట్టుకోవడం మొదలైంది. అది చూసిన ద్రోణాచార్యుడు రంగస్థలం మీద జరుగుతున్న విద్యాప్రదర్శనకి భంగం కలుగుతుందేమో అని భయపడ్డాడు.
అశ్వత్థామని పంపించి భీమదుర్యోధనుల గదా ప్రదర్శనని ఆపించాడు. తరువాత తన ప్రియ శిష్యుడు అర్జునుడి ధనుర్విద్యా నైపుణ్యాన్ని చూడమని ప్రకటించాడు. మిసమిసలాడే నల్లకలువ రంగులా ఉన్నవాడు, పాండవులలో మధ్యవాడు అయిన అర్జునుడు అందమైన రంగురంగుల బంగారు కవచాన్ని తొడుక్కుని, పొడవైన తన చేతులకి అందాన్ని చేకూరుస్తున్న ఎత్తైన ధనుస్సుని పట్టుకుని, బాణాలతో నిండుగా ఉన్న అమ్ములపొదిని ధరించి కాంతులు చిమ్ముతున్న మేఘంలా రంగస్థలం మధ్యకి వచ్చి నిలబడ్డాడు.
ఇంద్రుడి కుమారుడు, శ్రీకృష్ణుడికి స్నేహితుడు, వీరుడు, పాండవుల్లో గొప్పవాడు, దనుస్సుని ధరించి వచ్చిన అర్జునుణ్ని చూసిన ప్రజలు తమలో తాము మాట్లాడుకుంటున్నారు. “అస్త్రవిద్యల్లో అందరికంటే గొప్ప వీరుడు, ధర్మాలు తెలిసినవాడు, భరత వంశానికి కీర్తి కలిగించడం కోసం కుంతీదేవికి పుట్టినవాడు, భుజబల పరాక్రమవంతుడు ఈ అర్జునుడు” అని చెప్పుకుంటున్న వాళ్ల మాటలు కుంతీదేవి వింది.
ఆనందంతో విప్పారిన కళ్లతో రాజకుమారుల్లో ఉన్న తన కుమారుడు అర్జునుణ్ని చూసి ఎంతో సంతోషపడింది. అందరూ తన కొడుకుని పొగుడుతుంటే ఆమె కళ్లనుంచి అనందబాష్పాలు ధారలు కట్టాయి. అర్జునుణ్ని గురించి ప్రజలు పొగుడుతుంటే వస్తున్న ధ్వనుల్ని విని ధృతరాష్ట్రుడు అదేమిటని విదురుణ్ని అడిగాడు. విదురుడు “రాజా! పాండవ మధ్యముడు అర్జునుడు తన ధనుర్విద్యా ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తుంటే ప్రజలు అతణ్ని పొగుడుతున్నారు” అన్నాడు.
ధృతరాష్ట్రుడు సంతోషంతో విదురుడితో “ఎంత మంచి మాట చెప్పావు. ఇన్నాళ్లకి నా చెవులకి సంతోషం కలిగించే మాట వింటున్నాను. పాండవ కుమారుల విద్యాశక్తుల్ని గురించి వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది” అన్నాడు.
అర్జునుడు అస్త్రవిద్యా కౌశలము
అర్జునుడు ద్రోణాచార్యుడి అనుమతి తీసుకుని మంత్రమే ప్రధానంగా కలిగిన అస్త్రాల్ని ప్రదర్శించడం మొదలుపెట్టాడు. వీరుడైన అర్జునుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించి భయంకరమైన జ్వాలలతో ఉన్న అగ్నిని సృష్టించాడు. వారుణాస్త్రాన్ని ఉపయోగించి ఆకాశం చిల్లులు పడి వాటిలోంచి కిందకి ప్రవహిస్తుందేమో అన్నంతగా నీటిని; వాయవ్యాస్త్రంతో అన్నింటినీ కింద పడేసేంత బలంతో వీచే గాలిని; మేఘాస్త్రంతో భయంకరంగా ఉరుముతూ మెరుస్తూ కనిపించే మేఘాల్ని సృష్టించాడు. ఇంకా భౌమాస్త్రంతో భూమిలోకి వెళ్లిపోయాడు. శైలాస్త్రం మంత్రించి తనే పర్వతాకారం ధరించాడు. అదృశ్యాస్త్రం ప్రయోగిస్తూనే ఎవరికీ కనిపించకుండా మాయమయ్యాడు. అప్పటికప్పుడే పొట్టిగాను, పొడుగ్గాను, సన్నగాను, మారిపోతూ రంగస్థలంలో కూర్చుని చూస్తున్న వాళ్లందరినీ ఆశ్చర్యంలో ముంచాడు.
ఎవరికీ అర్థంకాని మహావేగంతో రథం మీదకి వెళ్లి కూర్చున్నాడు. అంతే వేగంతో రథం మీద నుంచి కిందకి దిగి నిలబడ్డాడు. పరుగెడుతున్న సింహం, పెద్దపులి, పంది మొదలైన అడవి జంతువుల నోళ్లలో ఒక్కొక్కబాణాన్ని ఎలా వేస్తారో అదే విధంగా ఐదేసి బాణాల్ని ఒకేసారి వేశాడు. తాడుకి వేలాడేలా కట్టి ఉంచిన ఆవు కొమ్ముకి గుచ్చుకునేలా వరుసగా ఇరవై ఒక్క బాణాలు గుచ్చాడు. చిత్రవిచిత్రమైన పద్ధతుల్లో అర్జునుడు తన అస్త్రవిద్యా కౌశలాన్ని చూపించాడు. అస్త్ర విద్యే కాకుండా కత్తి, గద మొదలైన ఆయుధ విద్యల్లో తనకి కలిగిన నైపుణ్యాన్ని ప్రదర్శించి అక్కడున్న వాళ్లందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేశాడు.
అర్జునుణ్ని గేలిచేసిన కర్ణుడు
తన విద్యానైపుణ్యాన్ని ప్రదర్శించడానికి రంగస్థలం మధ్యకి వచ్చిన కర్ణుడు భుజం చరిచి నిలబడ్డాడు. కర్ణుడు భుజం చరస్తుంటే భయంకరమైన శబ్దం వచ్చింది. ఆ శబ్దాన్ని విని పాండవులు ద్రోణాచార్యుడి దగ్గరికి, కౌరవులందరూ దుర్యోధనుడి చుట్టూ చేరిపోయారు. కర్ణుడు చాలా బలపరాక్రమాలు కలవాడు. మద్దిచెట్టులా బాగా ఎత్తైన శరీరం కలవాడు. పుట్టుకతోనే ఏర్పడిన కవచకుండలాలు ఉండడం వల్ల గొప్ప తేజస్సుతో ప్రకాశిస్తుంటాడు. బాలసూర్యుడు ఎలా ఉంటాడో అలా ఉంటాడు.
ఎప్పుడూ చేతిలో ధనుస్సు, మొలలో భయంకరమైన కత్తి, గొప్ప శౌర్యము, బంగారు రంగు కలిగిన శరీరంతో కనిపిస్తాడు. ప్రజలందరితో మంచివాడు అని పొగడ్తలు అందుకుంటున్న చాలా గొప్పవాడైన కర్ణుణ్ని ప్రజలందరూ ఆశ్చర్యంతో చూశారు. కర్ణుడు ప్రజలు బెదిరిపోయేలా నడుస్తూ రంగస్థలం మధ్యకి వచ్చాడు. మొదట కృపాచార్యుడు, ద్రోణాచార్యులకి నమస్కారం చేశాడు. గంభీరమైన కంఠంతో అర్జునుడితో “విలువిద్య నీకే బాగా తెలుసునని అనుకోకు. మేము కూడా చాలా విద్యలు నేర్చుకున్నాం. నువ్వు చూపించిన విద్యలన్నీ ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా చాలా బాగున్నాయని పొగిడేలా మేము కూడా ప్రదర్శించగలం” అన్నాడు.
రంగస్థలం మధ్యలో నిలబడి అంత ధైర్యంగా కర్ణుడు అంటుంటే.. తనకంటే వీరుడు లేడని భావిస్తున్న అర్జునుడికి కోపం, సిగ్గు కలిగాయి. అర్జునుడి వంటి గొప్ప వీరుడు తమలో లేరని బాధ పడుతున్న దుర్యోధనుడికి సంతోషం కలిగింది. కర్ణుడి విద్యాప్రదర్శనకి ద్రోణాచార్యుడు అనుమతి ఇచ్చాడు. కర్ణుడు వెంటనే అర్జునుడు చూపించిన నేర్పరితనాన్ని తను కూడా చూపించాడు. అది చూసిన దుర్యోధనుడు, అతడి తమ్ముళ్లు కర్ణుడి దగ్గరికి వచ్చి ప్రేమతో అతణ్ని కౌగలించుకున్నారు. దుర్యోధనుడు “కర్ణా! నువ్వు నాతో స్నేహం చేసి నాకు నా బంధువులకి కష్టం కలగకుండా చూస్తూ మాతో కలిసి నువ్వు కూడా రాజ్యభోగాలు అనుభవించు” అన్నాడు.
కర్ణుడు దుర్యోధనుడితో స్నేహం చెయ్యడానికి అంగీకరించాడు. మళ్లీ దుర్యోధనుడు “కర్ణా! ఇక్కడ ఉన్న రాజులందరూ చూస్తూ ఉండగా నువ్వు అర్జునుడితో ద్వంద్వ యుద్ధం చెయ్యాలి” అన్నాడు.
కౌరవుల మధ్య ఉన్న అర్జునుడు కర్ణుణ్ని చూసి “బలముందికదా అని పిలవకుండానే సభలకి వెళ్లడం, నోటికి వచ్చినట్లు మాట్లాడ్డం చేస్తే నరకానికి వెళ్లవలసి వస్తుంది. ఎదుటివాళ్ల గురించి మాట్లాడేటప్పుడు ముందు నీ గురించి నువ్వు తెలుసుకుని మాట్లాడు!” అన్నాడు.
అర్జునుడి మాటలు విని కర్ణుడు “ఇవన్నీ బలహీనులతో మాట్లాడే మాటలు. వీరులతో మాట్లాడేటప్పుడు బాణాలతోనే మాట్లాడాలి. అయినా ఇది రంగభూమి కనుక ఇక్కడ అస్త్రవిద్యావేత్తలైన వాళ్లందరికి సమానమైన గౌరవం ఇవ్వబడుతుంది. వీళ్లు రావచ్చు, వీళ్లు రాకూడదు అనే నియమం ఉండదు కదా!” అన్నాడు. దుర్యోధనుడికి కర్ణుడి మాటలు నచ్చాయి. అందుకు కర్ణుడు గర్వపడ్డాడు. దుర్యోధనుడి అనుమతి తీసుకుని అర్జునుడితో ద్వంద్వయుద్ధం చెయ్యడానికి రంగంస్థలం మధ్యలో సిద్ధంగా ఉన్నాడు.
కర్ణుడు అర్జునుల ద్వంద్వయుద్ధము
కర్ణుడు రంగంలోకి దిగగానే కురువంశపు రాజకుమారులు రెండు పక్షాలుగా విడిపోయారు. కర్ణుడికి స్నేహితుడు, గురువు, దైవము అన్నీ దుర్యోధనుడే. అర్జునుడికి గురువులు, మార్గాన్ని చూపించే సోదరులు ఉన్నారు. పాండవులకి చాలామంది పెద్దలున్నారు.
దుర్యోధనుడికి పెద్దలతో పనిలేదు.. తనకు తనే పెద్ద. అర్జునుడి నిర్ణయం ధర్మనిర్ణయం. కర్ణుడి నిర్ణయం కర్ణుడిది. దుర్యోధనుడి నిర్ణయం స్వయం నిర్ణయం.
అర్జునుడు కూడా రంగస్థలం మధ్యలోకి వచ్చి ప్రళయాగ్నిలా విజృంభించాడు. కర్ణుడు కోపంతో అర్జునుడి మీద మేఘాస్త్రాన్ని ప్రయోగించాడు. మేఘసమూహాలు అంతు లేకుండా వచ్చి భుమికి ఆకాశానికి మధ్య ఉన్న ప్రదేశాన్ని కప్పేశాయి. ఆ చీకటిలో అర్జునుడు కనిపించలేదు. సూర్యుడు సంతోషంతో తన కుమారుడు కర్ణుడి మీద తన కాంతిని ప్రసరించేలా చేశాడు.
ద్వంద్వయుద్ధం జరుగుతుండగా దుర్యోధనుడితో కలిసి ధృతరాష్ట్రుడి కొడుకులు అందరూ కర్ణుడి పక్షంలో నిలబడ్డారు. మరో వైపు భీష్ముడు, ద్రోణుడు, పాండవులు అర్జునుడి పక్షంలో నిలబడ్డారు. కర్ణార్జునుల మధ్య జరుగుతున్న ద్వంద్వ యుద్ధాన్ని చూస్తున్న కుంతీదేవి భయపడింది. మేఘాస్త్రం కప్పెయ్యడం వల్ల అర్జునుడు కనిపించక తల్లడిల్లి మూర్ఛపోయింది. వెంటనే విదురుడు అమె మీద చల్లటి గంధపు నీళ్ళు చల్లి సేద తీర్చాడు. అప్పుడు అర్జునుడు వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించి మేఘాల్ని దూరం చేసి సూర్యుడిలా వెలుగుతూ నిలబడ్డాడు. విదురుడు కుంతికి కర్ణార్జునుల్ని చూపించాడు. ఆమె చాలా సంతోషించింది.
ద్వంద్వయుద్ధాల గురించి బాగా తెలిసినవాడు, ధర్మబద్ధంగా వ్యవహరించేవాడు అయిన కృపాచార్యుడు కర్ణార్జునుల మధ్య నిలబడి కర్ణుడితో “కర్ణా! అర్జునుడు కురురాజ వంశంలో పుట్టినవాడు. కుంతీదేవి పాండురాజులకి కలిగిన కుమారుడు. రాజధర్మాలన్నీ తెలుసుకుని కీర్తితో ప్రకాశిస్తున్నవాడు. నువ్వు అర్జునుడితో యుద్ధం చెయ్యాలని అనుకుంటే నీ వంశం గురించి, నీ తల్లితండ్రుల గురించి చెప్పు. అతడితో ద్వంద్వయుద్ధం చెయ్యడానికి నీకు అర్హత ఉంటే నిన్ను ఎదిరించి తన భుజబలాన్ని చూపిస్తాడు” అన్నాడు.
కృపాచార్యుడి మాటలు విని కర్ణుడు తన తల్లితండ్రుల గురించి చెప్పడానికి సిగ్గుపడి తలవంచుకుని నిలబడ్డాడు. అతణ్ని చూసిన దుర్యోధనుడు కృపాచార్యుడితో “కులము, శౌర్యము, ఎక్కువ సేనాబలము అనే లక్షణాలు కలిగినవాళ్లు కూడా రాజులుగా చెప్పబడతారు” అన్నాడు.
రాజుల్లో గొప్పవాడైన అర్జునుడితో “కర్ణుడు రాజు కాదు కనుక ద్వంద్వ యుద్ధంలో పాల్గొనడానికి అర్హుడు కాడని అనుకుంటే, నేను అందరి ఎదురుగా ఇతడికి అంగరాజ్యం ఇచ్చి రాజుగా ప్రకటిస్తాను” అన్నాడు.
అంగరాజ్యానికి రాజుగా కర్ణుడు
దుర్యోధనుడు భీష్మధృతరాష్ట్రుల అనుమతి తీసుకుని అప్పటికప్పుడే వెయ్యిమంది బ్రాహ్మణులకి కోటి గోవుల్ని దానంగా ఇచ్చాడు. ఆ బ్రాహ్మణులు కర్ణుడు అంగరాజ్యానికి అర్హుడని ఆశీర్వదించారు. బంగారు సింహాసనం మీద కర్ణుణ్ని కూర్చోబెట్టి అంగరాజుగా పట్టాభిషేకం చేశాడు. మణులు పొదిగిన బంగారు కిరీటం, భుజకీర్తులు, హారాలే కాకుండా అనేక రకాల ఆభరణాలతో, అన్ని రాజలాంఛనాలతో, గొప్ప సూర్యకాంతితో ప్రకాశించాడు కర్ణుడు.
అతడు అమితమైన సంతోషంతో దుర్యోధనుణ్ని చూసి “భూమండలం మొత్తంలో ఉన్న గొప్ప గొప్ప రాజులందరూ కూర్చుని ఉండగా నన్ను రాజుని చేసి గౌరవించావు. నువ్వు నాకు చేసిన ఈ గొప్ప ఉపకారానికి బదులుగా నీకు నేను ఏమి చెయ్యగలను?” అని అడిగాడు.
కర్ణుడి మాటలకి దుర్యోధనుడు “కర్ణా! లోకంలో అందరూ మెచ్చుకునేంత గొప్ప స్నేహితుడిగా నాతో ఉండు” అన్నాడు. కర్ణుడు దుర్యోధనుడికి ఇష్టమైన స్నేహితుడిగా ఉండడానికి సంతోషంగా అంగీకరించాడు. కర్ణుడు అంగరాజ్యానికి రాజుగా అభిషిక్తుడవడం చూసి అతడి తండ్రి అతిరథుడు ఆనందంతో కర్ణుడి దగ్గరికి పరుగెత్తుకుని వచ్చాడు. తండ్రి రావడం చూసి కర్ణుడు గౌరవంగా లేచి వినయంగా వంగి నమస్కారం చేశాడు. అతిరథుడు ప్రేమతో కర్ణుణ్ని కౌగలించుకున్నాడు. అతడి తలని ముద్దాడి, రాజ్యాభిషేకంతో తడిసిన అతడి తలమీద ఆనందం వల్ల కలిగిన కన్నీళ్లతో మళ్లీ అభిషేకించాడు. కర్ణుణ్ని అతిరథుడు కౌగలించుకోడం చూసి అతడు సూత కులంలో పుట్టాడని తెలుసుకున్న భీముడు హేళనగా నవ్వాడు.
కర్ణుడితో “నీ కులానికి తగినట్టు నువ్వు మునికోల పట్టుకుని రథం నడపాలి గాని, రాజధర్మంలో పుట్టిన అర్జునుడితో యుద్ధ చెయ్యడం నీకు తగిన పని కాదు” అన్నాడు.
భీముడి మాటలు విని బాధపడిన కర్ణుడు ముఖం పైకెత్తి సూర్యుడి వైపు చూస్తూ ఉండిపోయాడు. బాధపడుతున్న కర్ణుణ్ని చూసిన దుర్యోధనుడు కోపంతో మదపుటేనుగులా బయటకి వచ్చాడు. భీముడితో “భీమా! ఇలా ఆలోచించడం, మాట్లాడడం నీకు మంచిది కాదు. లేడి కడుపు నుంచి పులి పుట్టదు కదా? ఇంత గొప్ప కాంతి, భుజబలము, పరాక్రమము కలిగినవాడు నీచ కులంలో ఎందుకు పుడతాడు? గొప్పవాళ్ల పుట్టుక, దేవతల పుట్టుక, నదుల పుట్టుకల గురించి తెలుసుకోవడం సాధ్యమైన పని కాదు.
దేవేంద్రుడి దగ్గర ఉన్న వజ్రాయుధం దధీచి ఎముకలనుంచి పుట్టలేదా? గంగాదేవికి, కృత్తికలకి, అగ్నికి, రుద్రుడికి కొడుకుగా కుమారస్వామి రెల్లు పొదల్లో పుట్టలేదా? ధర్మం తెలిసిన కృపాచర్యుడు రెల్లుగడ్డి దుబ్బుల్లో పుట్టలేదా? కీర్తివంతుడు, గొప్పవాడు అయిన ద్రోణుడు కుండ నుంచి పుట్టలేదా? భూమిని కాపాడడానికి పుట్టిన క్షత్రియులు ఉత్తమమైన బ్రాహ్మణులవల్ల పుట్టలేదా? అందరూ చెప్తున్నదాన్ని బట్టి మీ పుట్టుకలు కూడా ఇటువంటివే కదా? అయినా ఈ పుట్టుకలతో ఏం పని? కర్ణుడు సహజమైన కవచకుండలాలతో పుట్టినవాడు, గొప్ప తేజస్సు కలవాడు. ఇతడు సామాన్యుడు కాదు, తన భుజబల పరాక్రమాలతో ఈ భూమండలాన్ని మొత్తాన్ని పాలించగల సమర్థత కలవాడు” అన్నాడు.
అంతలో సూర్యాస్తమయం అవడంతో దుర్యోధనుడు అస్త్రవిద్యరంగాన్ని విడిచిపెట్టి వెయ్యి దివిటీలు వెలుగుతుండగా కర్ణుణ్ని వెంటబెట్టుకుని ఇంటికి వెళ్లిపోయాడు. పాండవులు కూడా భీష్మ, ద్రోణ, విదుర, కృపాచార్యులతో కలిసి తమ తమ ఇళ్లకి వెళ్లిపోయారు.
కుంతీదేవి సహజకుండలాలతో సూర్యుడిలా వెలిగిపోతున్న తన కుమారుణ్ని గుర్తు పట్టింది. కాని, తన ప్రేమని మాత్రం బయట పెట్టలేదు.
విలువిద్యలో నేర్పరుడైన కర్ణుడు స్నేహితుడిగా దొరకడం వల్ల దుర్యోధనుడు చాలా సంతోషించాడు. అర్జునుడి వల్ల ఇంక తనకి భయం లేదని అనుకుని నిశ్చింతగా నిద్రపోయాడు.