[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]
పాండవుల్ని వారణావతానికి పంపించిన ధృతరాష్ట్రుడు
[dropcap]ధృ[/dropcap]తరాష్ట్రుడు పాండవుల్ని, ఆప్తుల్ని పిలిపించాడు. అందరి ఎదురుగా పాండురాజుని తలుచుకుని కన్నీరు పెట్టుకున్నాడు. “పాండురాజు కీర్తిని కోరుకునే మీ అందరూ నేను చెప్తున్న విషయం గురించి కొంచెం ఆలోచించండి. పవిత్రమైన గంగానదికి దగ్గరలో ప్రసిద్ధమైన వారణావత నగరం అన్ని సుఖాలు అందించగల నగరమని అందరూ అంటూ ఉంటారు. మీరందరు కుంతీదేవిని, పరివారాన్ని, మంత్రుల్ని, సేవకుల్ని రాజ్య వైభవంతో అక్కడకి వెళ్లి పండుగలు చేసుకుంటూ ఉత్సాహంగాను, హాయిగాను ఎప్పుడూ పొందనంత సంతోషాన్ని పొందండి. పరమేశ్వరుడికి నివాస స్థానమైన ఆ నగరంలో మీరు పాండురాజు కోసం అనేక భూదానాలు, గోదానాలు, సువర్ణదానాలు మొదలైన దానాలు ఇచ్చి బ్రాహ్మణుల్ని సత్కరిస్తూ అక్కడే కొంతకాలం ఉండి తిరిగి రండి!” అని ఆజ్ఞపించాడు.
అందుకు పాండవులు సంతోషంగా అంగీకరించారు. గాంధారీధృతరాష్ట్రులకి నమస్కరించారు. వాళ్ల దగ్గర ఆశీర్వాదం తీసుకుని దుర్యోధనుడు మొదలైన వాళ్లకి వీడ్కోలు చెప్పారు. వృద్ధులైన బ్రాహ్మణులకి నమస్కారం చేసి వాళ్ల దగ్గర్నుంచి దీర్ఘమైన ఆయుర్దాయం, ఆరోగ్యం, శుభం కలగాలని ఆశీర్వచనాలు తీసుకున్నారు. తల్లితో కలిసి పాండవులు వారణావతం వెళ్లడానికి బయలుదేరారు.
దుర్యోధనుడు తను అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతున్నందుకు ఆనందించాడు. పురోచనుణ్ని పిలిపించి అతడితో స్నేహపూర్వకంగా మాట్లాడాడు. “ధృతరాష్ట్ర మహారాజు గుణవంతులు, తేజస్సు కలవాళ్లు అయిన పాండవుల్ని వారణావతం అనే నగరంలో ఉండమని పంపించాడు. నువ్వు నీ నేర్పు చూపించి వాళ్లకి అందమైన ఇళ్లు నిర్మించాలి. నువ్వు నాకు స్నేహితుడివి. ఈ పని నువ్వు తప్ప ఇంకెవరూ చెయ్యలేరు. ఎక్కువ వేగంగా వెళ్లే కంచరగాడిదల్ని కట్టిన రథం ఎక్కి ఈ రోజే వారణవతం వెళ్లు. అక్కడ లక్క, మద్దిబంక కలిపిన నెయ్యి, నూనెలతో తడిపిన మట్టితో నాలుగు ఇళ్లు కలిగిన భవనాన్ని నిర్మించు.
ఆ గృహం ఆయుధశాలకి దగ్గరగా తెల్లటి సున్నంతో అందంగా ఉండాలి. పాండవుల్ని అందులో ఉంచి, కొంతకాలం నమ్మకంగా వాళ్లతోనే ఉండు. తరువాత ఆ ఇంటికి నిప్పు పెట్టి, నాకు శత్రువులైన పాండవులు చచ్చిపోయారన్న వార్త నాకు చెప్పాలి. ఈ పని సక్రమంగా జరిగితే నేనే యువరాజుని అవుతాను. అప్పుడు నా స్నేహితుడవైన నువ్వు కూడా అనేక సుఖాలు అనుభవించవచ్చు” అని చెప్పాడు.
ధర్మరాజుకి విదురుడి ఉపదేశము
దుర్యోధనుడు అజ్ఞాపించినట్టు పురోచనుడు వారణావతం వెళ్లి పాండవుల కోసం ఇళ్లు నిర్మిస్తున్నాడు. శతశృంగ పర్వతం నుంచి హస్తినాపురం చేరిన సమయానికి ధర్మరాజుకి పదహారు, భీముడికి పదిహేను, అర్జునుడికి పధ్నాలుగు, నకులసహదేవులకి పదమూడు సంవత్సరాల వయస్సు. హస్తినాపురంలో పదమూడు సంవత్సరాలు ఉండి అస్త్ర విద్యలన్నీ నేర్చుకున్నారు. ధృతరాష్ట్రుడి ఆజ్ఞప్రకారం గొప్ప వేగం, బలం కలిగిన గుర్రాలతో ఉన్న రథాలు ఎక్కి, చేతిలో ధనస్సులు పట్టుకుని వారణావతానికి బయలుదేరారు.
వాళ్లని చూసిన నగర ప్రజలు “ధృతరాష్ట్రుడు పాండవుల్ని ఒంటరివాళ్లని చేసి హస్తినాపురం నుంచి పంపెయ్యాలని ఆలోచన చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇది ధర్మం కాదని తెలిసి కూడా భీష్ముడు మొదలైన పెద్దలు ఎందుకు అడ్డగించలేదో తెలియట్లేదు. తండ్రి తాతల నుంచి వచ్చిన రాజ్యాన్ని పాండవుల్లో పెద్దవాడు, భరత వంశంలో గొప్పవాడు అయిన ధర్మరాజుకి అప్పగించకుండా వృద్ధులైన రాజులందరు కలిసి ధర్మం తప్పి ఎందుకు ప్రవర్తిస్తున్నారో తెలియట్లేదు. ధర్మరాజు ఎక్కడికి వెడితే అక్కడికే మనం కూడా వెళ్లిపోదాం. మనమందరం ఈ హస్తినాపురంలో ఉండడం ఎందుకు? పాండవులతోనే కలిసి ఉందాం” అనుకుని అందరూ పాండవుల వెంట బయలుదేరారు.
ధర్మరాజు తన వెంట వస్తున్న వాళ్లని చూశాడు. ప్రేమగా ఓదార్చి పెదతండ్రి ఆజ్ఞ ప్రకారం వారణావతం వెడుతున్నామని, పెదతండ్రి మాట వినకపోవడం అధర్మమని, వాళ్లని అక్కడే ఆగిపొమ్మని అనునయించి వెనక్కి పంపించాడు. విదురుడు మాత్రం కొంచెం దూరం వాళ్లతో వెళ్లి అక్కడ చెయ్యవలసిన పనుల గురించి ఎవరికీ అర్థం కాకుండా ధర్మరాజుకి వివరించాడు. పాండవుల్ని కౌగలించుకున్నాడు. కుంతీదేవికి నమస్కరించాడు. పాండురాజుని తల్చుకుని దుఃఖించాడు. అందరికి వీడ్కోలు చెప్పి వెనక్కి వెళ్లిపోయాడు.
తరువాత కుంతీదేవి ధర్మరాజు దగ్గరికి వచ్చి “నాయనా! విదురుడు ఎవరికీ అర్థం కాకుండా నీకు ఏదో సలహా చెప్పాడు. నేను వినచ్చు అనుకుంటే దాన్ని నాకు చెప్పు” అంది. తల్లి మాటలకి ధర్మరాజు నవ్వి “అమ్మా! విదురుడు మీరు అన్ని పనులూ చెయ్యగల సమర్థులు. అయినా నాకు తెలిసినంత వరకు మీకు నేను చెప్పవలసినవి చెప్తున్నాను. ఏ పనీ లేకుండా మిమ్మల్ని వారణావతం పంపిస్తున్న ధృతరాష్ట్రుడు మీకు పైకి మంచి చేసేవాడిలా కనిపిస్తాడు. కాని, తరువాత మీకు మేలు చెయ్యడు. కనుక, మీరు విషం వల్ల, అగ్నివల్ల కలిగే ప్రమాదాలు పసిగట్టి ప్రవర్తించండి. దుర్యోధనుడు మీకు చెయ్యబోతున్న హాని ఏమిటో నేను తెలుసుకుని మీకు తెలియ పరుస్తాను. దాన్నుంచి తప్పించుకునే ఉపాయం కూడా నేను మీకు చెప్తాను. జాగ్రత్తగా ఉండండని సలహా ఇచ్చాడు” అని చెప్పాడు.
పాండవులు, కుంతీదేవి విదురుడికి తమయందున్న అభిమానానికి సంతోషించారు. కొన్ని రోజులు ప్రయాణం చేసి వారణావతం చేరుకున్నారు.
తల్లితో కలిసి వారణావతం చేరిన పాండవులు
పాండవులు వస్తున్నారన్న వార్త విని వారణావతంలో నివసిస్తున్న ప్రజలు చాలా ఆనందించారు. చతురంగ బలాలతో ఎదురు వెళ్లారు. ఇళ్ల దగ్గర ఉన్న ధ్వజ స్తంభాలకి బంగారంతో చేసిన కలువపూల దండలు కట్టారు. వాటి నుంచి ప్రసరించే బంగారు కాంతి ఆకాశమంతా వ్యాపించినట్లు ప్రకాశిస్తూ కనిపిస్తోంది. మంచిగంధం కస్తూరి కలిపిన నీళ్లు చల్లి, కర్పూరంతో వేసిన ముగ్గులు రాజమార్గాల్లో కళ కళలాడాయి. నగరంలోకి ప్రవేశిస్తున్న పాండవుల్ని చూడడానికి ఆడవాళ్లందరూ చక్కగా అలంకరించికుని మేడల పైకి ఎక్కి సిద్ధంగా ఉన్నారు.
ఎంతోమంది బ్రాహ్మణులు పాండవులకి ఎదురు వచ్చి ఆశీర్వదించారు. వారణావతం చేరిన పాండవులు అందమైన రాజమందిరంలోకి ప్రవేశించారు. దుర్యోధనుడి స్నేహితుడు పురోచనుడు వచ్చి నాలుగు ఇళ్లున్న భవనాన్ని చూపించాడు. తమకి భవనాన్ని కట్టిన పురోచనుణ్ని పాండవులు సత్కరించారు. బ్రాహ్మణుల పుణ్యాహవచనాలతో ఇంటిలోకి గృహాప్రవేశం చేశారు. తరువాత తనకు హితులు చెప్పిన విషయాలు గుర్తొచ్చి మాయోపాయ ప్రయోగాలు తెలిసిన ధర్మరాజు ఆ భవనాన్ని పూర్తిగా పరిశీలించాడు.
భీముడితో “భీమా! ఈ ఇంటి గోడలు లక్కతో చెయ్యబడ్డాయి. వాటి లోపల నుంచి నెయ్యి, నూనె వాసనలు వస్తున్నాయి. ఈ భవనం ఆయుధాలు ఉండే చోటుకి దగ్గరగా కూడా ఉంది. ఇది నిప్పుతో దహించబడేలా కట్టబడింది. ఇందులో ఏదో మోసం కనిపిస్తోంది. ఈ విషయం ముందే తెలుసుకున్నాడో ఏమో కాని.. మనం వస్తున్నప్పుడు గొప్ప మేధావి అయిన విదురుడు మన మీద ఉన్న వాత్సల్యంతో నిప్పుతోను, విషంతోను జాగ్రత్తగా ఉండమని నన్ను హెచ్చరించాడు. ఈ ఇంటి వల్ల మనకి అగ్ని భయం ఉన్నట్టుగా కనిపిస్తోంది. కనుక, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి!” అన్నాడు.
ధర్మరాజు చెప్పింది విని భీముడు “అయితే మనం ఇక్కడెందుకు ఉండడం? ఇంతకు ముందు ఉన్న ఇంటికే వెళ్లిపోదాం. ఈ ఇంట్లో దీన్ని కట్టి ఇచ్చిన పురోచనుణ్ని కాల్చేసి వెళ్లిపోదాం” అన్నాడు.
భీముడి తొందరపాటు ఆలోచనకి అడ్డుపడ్డాడు ధర్మరాజు. భీముడితో “మనకి ఇప్పుడే కదా ఈ ఇంటి గురించి సందేహం వచ్చింది. పురోచనుడు చేసిన మోసం గురించి పూర్తిగా తెలుసుకునేదాకా ఓర్పుగా ఇక్కడే ఉందాం. ఈ విషయం మనకు తెలిసినట్టు పురోచనుడికి తెలిస్తే దుర్యోధనుడు పురోచనుడి మీద కోపగిస్తాడు. మనం తొందరపడి ఈ ఇంటిని దహించేస్తే హస్తినాపురంలో ఉన్న భీష్మ విదురులకి కోపం వచ్చి కురువంశంలో గొడవలు రావచ్చు.
ఇల్లు కాలుతుందేమో అని భయపడి మనం వేరే చోటికి వెడితే దుర్యోధనుడు ఏదో విధంగా మళ్లీ మనకి అపకారం చేస్తాడు. రాజ్యాధికారం, ఇతరుల సహాయం, గొప్ప సంపద కలిగిన దుర్యోధనుడు వాటిని అన్నింటినీ పోగొట్టుకుని వచ్చిన మనల్ని సమయం చూసి తుదముట్టిస్తాడు. కనుక, మనం ఏమీ తెలియనట్టు ఉంటూనే జగ్రత్తగా ఉందాం!” అన్నాడు. పాండవులు పగలు వేటలో గడుపుతూ, రాత్రి పూట ఆయుధాలు చేత్తో పట్టుకుని జాగ్రత్తగా ఉంటున్నారు.
లక్షాగృహ దహనము
హస్తినాపురంలో దుర్యోధనుడు చేస్తున్న దురాలోచన గురించి విదురుడు పూర్తిగా తెలుసుకున్నాడు. విశ్వాసం, సమర్థత ఉన్న దూతని పిలిచి పాండవుల దగ్గరికి పంపించాడు. అతడు వెళ్లి ఒక రహస్య ప్రదేశంలో పాండవుల్ని కలిసి తనని తాను పరిచయం చేసుకుని “రాబోయే కృష్ణచతుర్దశి నాటి రాత్రి పురోచనుడు లక్క ఇంటిని తగులపెడుతున్నాడని విదురుడు చెప్పమని చెప్పాడు. మీరు సురక్షితంగా బయటకు వెళ్లడానికి మార్గం ఏర్పాటు చెయ్యమని నన్ను పంపించాడు” అని చెప్పాడు.
తరువాత లక్క ఇంటి నుంచి బయటకి వెళ్లేందుకు వీలుగా రహస్యంగా ఒక సొరంగాన్ని తవ్వాడు. దాన్ని భీముడు పరిశీలించి ఆ మార్గం గురించి తెలుసుకుని వచ్చాడు. బాహ్మణులకి తృప్తిగా భోజనం పెడుతూ, ధనాన్ని దానం చేస్తూ పాండవులు వారణావతంలో ఆరు నెలలు గడిపారు. కృష్ణచతుర్దశి రోజు కుంతీదేవి పూజ చేసి బ్రాహ్మణ ముత్తైదువలందరికీ భోజనం పెట్టింది. ఆమెకి సహాయంగా ఉండేందుకు పురోచనుడు ఒక బోయ స్త్రీని పంపించాడు. ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్న విషయాలన్నీ ఆమె పురోచనుడికి చెప్పేది.
కృష్ణచతుర్దశినాడు ఆ బోయ తన కొడుకులతో కలిసి బాగా కల్లు తాగి లక్క ఇంటికి దగ్గరే నిద్రపోయింది. పురోచనుడి కంటే ముందే భీముడు అతడు పడుక్కునే ఇంటికి నిప్పు పెట్టాడు. తరువాత తన తల్లిని, అన్నని, తమ్ముళ్లని సొరంగంలోకి పంపించాడు. ఆయుధాలున్న ఇంటితో సహా లక్క ఇంటికి నిప్పు పెట్టాడు. విదురుడు పంపించిన దూతకి తమ క్షేమం గురించి చెప్పి పంపించేశాడు. తర్వాత తల్లిని అన్నదమ్ముల్ని తీసుకుని సొరంగ మార్గంలో నడుచుకుంటూ బయలుదేరాడు.
రాత్రివేళ కావడం వల్ల నిద్రతో తూలుతూ వేగంగా నడవలేని తల్లిని వీపుమీద వేసుకుని, ధర్మరాజుని, అర్జునుణ్ని భుజాల మీద, నకులసహదేవుల్ని చేతులతో ఎత్తుకుని నడుస్తున్నాడు. అతడు నడుస్తున్న వేగానికి పెద్ద పెద్ద చెట్లు వరుసగా పడిపోతున్నాయి. అతడి పాదాల కింద పడిన రాళ్లు నలిగి పొడిగా మారిపోతున్నాయి. రాత్రివేళ అని అనుకోకుండా, ముళ్లు, రాళ్లు, పగుళ్లు ఉన్నా పట్టించుకోకుండా పగలు నడిచినట్టు వేగంగా నడుస్తూ వెళ్లిపోతున్నాడు.
సత్యవంతులు, వినయం కలిగినవాళ్లు, ధర్మస్వరూపులు అయిన పాండురాజు కొడుకులు కుంతీదేవితో సహా వారణావత నగరంలో లక్షాగృహంలో కాలి బూడిదైపోయారని అవినీతి పరులు, ధర్మం తప్పి ప్రవర్తించిన దుర్యోధనుడు, అతడి స్నేహితులు, కొడుకులు, బంధువులు అనుకున్నారు. మరునాడు తెల్లవారగానే ఆయుధాగారంతో సహా కాలి బూడిదైన లక్క ఇంటిని చూడడానికి ప్రజలందరు అమితమైన దుఃఖంతో ఏడుస్తూ వచ్చేశారు. కుప్పగా పడి ఉన్న బూడిదని పక్కకి తోసి అందులో ఒక స్త్రీని, అయిదుగురు కొడుకుల్ని చూసి వాళ్లే కుంతీదేవి పాండుకుమారులు అనుకుని ప్రజలందరూ ఏడ్చారు.
బలవంతులు, భరతవంశాన్ని నిలబెట్ట కలిగిన వీరులు, భుజబలంతో శత్రువులే లేకుండ జీవించేవాళ్లు, భూభారాన్ని మొత్తాన్ని మొయ్యకలిగిన పాండవులు.. దుర్యోధనుడి మోసంతో నిప్పుమంటల్లో పడి కాలిపోయారు అని ఒకళ్లకొకళ్లు చెప్పుకుంటూ దుఃఖిస్తున్నారు. విదురుడు పంపించిన దూత నగర ప్రజల్లో కలిసిపోయాడు. కాలిన బూడిదని పక్కకి తోస్తున్నవాడిలా తోస్తూ తను తవ్విన సొరంగ మార్గాన్ని కప్పేశాడు.
బోయవనిత తన అయిదుగురు కొడుకులతో కలిసి చచ్చిపోయిందని పాండవులు తప్పించుకున్నారని విదురుడికి చెప్పాడు. వారణావత ప్రజలు జరిగిన అగ్ని ప్రమాదం దుర్యోధనుడి దురాలోచన వల్లే జరిగిందని అర్థం చేసుకున్నారు. దాన్ని గురించి హస్తినాపురంలో ఉన్న ధృతరాష్ట్రుడికి కబురు పంపించారు.
పాండవుల మరణవార్త విని దుఃఖించిన ధృతరాష్ట్రుడు
ఆ వార్త విని సభలో ఉన్న ధృతరాష్ట్రుడు బాధతో గట్టిగా ఏడ్చాడు. గాంధారితో సహా అంతఃపుర కాంతలు, భీష్ముడు మొదలైన కురువంశపు పెద్దలు దుఃఖించారు. విదురుడికి జరిగిన విషయం తెలిసినా అందరి ఎదురుగా తను కూడా విచారాన్ని వెలిబుచ్చాడు. ధృతరాష్ట్రుడు కుంతీదేవికి, పాండవులకి గంగాతీరంలో పరలోక క్రియలు జరపడానికి యోగ్యులైన బ్రహ్మణులకి ధనమిచ్చి పంపించాడు. దుర్యోధనుడు పాండవులు మరణించినందుకు సంతోషించాడు. తన మేలుకోరే పురోచనుడు మరణించాడని తెలుసుకుని బాధపడ్డాడు.
వారణావతం నుంచి దక్షిణం వైపు వెళ్లిన పాండవులు
పాండవులు గంగానదిని దాటి దక్షిణం వైపుకి నడుస్తూ సూర్యుడు, గాలి కూడా ప్రవేశించలేని దట్టమైన అడవిలోకి చేరుకున్నారు. ఆకలి దాహం వల్ల నడవలేక పోతున్న వాళ్లని నలుగుర్నీ భీముడు ఎత్తుకుని వేగంగా నడుస్తున్నాడు. సాయంకాలానికి ఒక మర్రిచెట్టుకింద ఉన్న చల్లటి రాతి ప్రదేశంలో వాళ్లని దింపాడు. భీముడు మర్రిచెట్టు చిటారు కొమ్మ ఎక్కి ఎక్కడైనా నీళ్లు కనిపిస్తాయేమో అని వెతికాడు. మంచి సువాసనలతో ఉన్న పద్మాలు, తామరపూలు, తుమ్మెదల గుంపులు, చక్రవాక పక్షులు, కొంగలు, క్రౌంచపక్షులు చేస్తున్న ధ్వనులతో మంచి నీటితో నిండిన సరోవరం కనిపించింది.
భీముడు వెంటనే చెట్టు దిగి ఆ సరోవరం వైపు వెళ్లాడు. దానిలో స్నానం చేసి కడుపునిండా నీళ్లు తాగాడు. తామర డొప్పలు చిరగనివి తీసుకుని వాటి నిండా నీళ్లు నింపుకుని తీసుకుని వస్తున్నాడు. అప్పటికి సూర్యాస్తమయ సమయం అయింది. అన్ని జీవరాశులు తమ తమ ప్రదేశాలకి చేరుకుంటున్నాయి. ఆ సమయంలో ఏనుగుల గుంపు చీకట్ల గుంపులా ఆహారం కోసం కొండ గుహల్లోంచి బయటికి వచ్చాయి.
తల్లిని, సోదరుల్ని చూసి బాధపడుతున్న భీముడు
ఎక్కువ దూరం నడవడం వల్ల అలిసిపోయిన తన సోదరులు, తల్లి తమ పై గుడ్డలు కింద పరుచుకుని తలలు చేతుల మీద పెట్టుకుని ఆదమరిచి నిద్రపోతున్నారు. వాళ్లని ఆ స్థితిలో చూసిన భీముడు చాలా బాధపడ్డాడు. మనస్సులో అనుకున్నాడు ‘భూమండలం మొత్తానికి రాజైన ధర్మరాజు సామాన్య మానవుడు నిద్రపోతున్నట్టు నేలమీద పడుక్కుని ఇలా నిద్రపోతున్నాడు.
మెత్తటి పక్కమీద కూడా పడుక్కోలేనంత పువ్వుకంటె సుకుమారమైన శరీరం కలిగిన కుంతిభోజుడి కూతురు, వసుదేవుడికి చెల్లెలు, విచిత్రవీర్యుడికి కోడలు, పాండురాజుకి పట్టపురాణి, గొప్ప ధర్మాత్మురాలు నా తల్లి కుంతీదేవి అలిసిపోయి కటిక నేల మీద నిద్రపోతోంది. ఆమె కంటే గాఢంగా నిద్రపోతున్నారు నా సోదరులు’. వాళ్లని చూసి బాధపడుతూ నిద్ర పాడుచెయ్యడానికి ఇష్టం లేక తను తీసుకొచ్చిన నీళ్లు భద్రంగా దాచాడు.
మళ్లీ మనస్సులో అనుకున్నాడు ‘పెదతండ్రి ధృతరాష్ట్రుడు దుర్మార్గుడు కాబట్టే దుర్యోధనుడితో కలిసి మమ్మల్ని ఇంటికి దూరం చేసి లక్క ఇంటిలో ఉంచాడు. అపకారం తలపెట్టే దుర్మార్గుల్ని పుణ్యాత్ముడు దగ్గరకి రానీయడు. గ్రామంలో ఉండే ఒకే ఒక పెద్ద వృక్షం ఉన్నట్టు వంశ నాశనం కలగకుండా వాళ్లని దూరంగా ఉంచుతాడు. ఇతరుల మేలు కోరుతూ, స్థిరంగా తమ దగ్గర ఉన్న మూలధనంతో, పాపం చేద్దామన్న ఆలోచన లేకుండా, అడవిలో ఒకదానితో ఒకటి కలిసి పెనవేసుకుని పెరిగే వృక్షాల్లా జీవిస్తారు’ అని ధృతరాష్ట్రుడికి తమకి మధ్య ఉన్న బంధుత్వాన్ని తల్చుకుంటున్నాడు.
చీకటిపడ్డాక ప్రజలు అటు ఇటు తిరుగుతున్న శబ్దం దూరం నుంచి వినబడింది. దగ్గరలో ఏదో నగరం ఉండచ్చని అనుకున్నాడు. తల్లీ సోదరులూ నిద్ర లేచేవరకు జాగ్రత్తగా ఉండాలని నిశ్చయించుకున్నాడు. గొప్ప పరాక్రమం కలిగిన పాండవుల్ని వజ్రంతో చేసిన ప్రహారీ గోడవంటి భీముడు రక్షిస్తూ రాత్రి మొత్తం మేలుకునే ఉన్నాడు.
అడవి మధ్య పాండవులున్న ప్రదేశానికి దగ్గరలోనే మద్దిచెట్ల మధ్య హిండింబుడు అనే రాక్షసుడు ఉన్నాడు. అతడు పాండవుల్ని చూశాడు. తన శరీరాన్ని బాగా పెద్దదిగా పెంచాడు. బలంగా సూదుల్లా ఉండే వెంట్రుకల్ని విదిలించాడు. ఒళ్లు విరుచుకుని, ఆవులించి లేచి నిలబడ్డాడు. ఇంతకాలం రుచిగాలేని అడవి జంతువుల మాంసం తిని చిరాకు పుట్టింది. చాలా కాలం తర్వాత నరమాంసం తినే అవకాశం కలిగింది అని సంతోషంగా ఉన్నాడు.
తన చెల్లెలు హిడింబని పిలిచాడు. “సోదరీ! ఇక్కడికి ఈ రోజు వచ్చినట్టు ఎప్పుడూ మనుషులు రానేరారు. వచ్చినా ఇలా నిర్భయంగా నిద్రపోరు. కుందేలు సరాసరి వంటింట్లోకే వచ్చేసినంత ఆనందంగా ఉంది నాకు. నువ్వు వెంటనే వెళ్లి వాళ్లని చంపి ఆ మాంసంతో నాకు రుచిగా వండి పెట్టు” అన్నాడు.