మహాభారత కథలు-43: ఏకచక్రపురంలో పాండవులు

0
3

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

ఏకచక్రపురంలో బ్రాహ్మణ వేషంలో ఉన్న పాండవులు

[dropcap]పాం[/dropcap]డవులు ఏకచక్రపురం చేరుకుని చక్కని జడలు, జింకచర్మం, దర్భలు, నారచీరలు ధరించి వేదపఠనం చేస్తూ బ్రహ్మచర్యాన్ని అవలంబించి ఒక బ్రాహ్మణుడి ఇంటిలో ఉంటున్నారు. చక్కగా చదువుకుంటూ ప్రతి ఇంటికీ వెళ్లి మౌనంగా భిక్ష తీసుకుంటూ వినయ విధేయతలతోను, మంచి నడవడికతోను జీవిస్తున్నారు. పాండవుల్ని ఏకచక్రపురంలో ఉన్న బ్రాహ్మణులు చాలా గౌరవంగా చూస్తున్నారు.

“సూర్యుడికి ఉన్నంత తేజస్సు కలిగినవాళ్లు, ధైర్యవంతులు, భూమండలాన్ని ఏలడానికి తగినంత సమర్థత కలిగిన వీళ్లని బ్రహ్మదేవుడు భిక్ష అడుక్కొనేలా ఎందుకు పుట్టించాడో?” అని అక్కడి ప్రజలందరూ బాధపడుతుండేవాళ్లు. పాండవులు అయిదుగురు ప్రతిరోజూ పాయసం, పిండివంటలు, అన్నంతో ఉన్న భిక్ష పాత్రల్ని తెచ్చి తల్లికి ఇచ్చేవాళ్లు. కుంతీదేవి వాళ్లు తెచ్చినదాన్ని మొత్తాన్ని రెండు భాగాలుగా చేసి, ఒక భాగం భీముడికి పెట్టి, తక్కిన భాగాన్ని మిగిలిన కొడుకులకి పెట్టి మిగిలినదాన్ని తను తినేది.

ఏకచక్రపురంలో పాండవులు మారువేషంలో కాలం గడుపుతున్నారు. ఒకరోజు ధర్మార్జున నకుల సహదేవులు భిక్షకి వెళ్లారు. కుంతి, భీముడు మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఆ సమయంలో వాళ్లు నివసిస్తున్న బ్రాహ్మణుడి ఇంట్లోంచి పెద్దగా ఏడుపు వినిపించింది. అది విని కుంతీదేవి బాధపడి భీముడితో “నాయనా! ఇప్పటి వరకు మనవాళ్లకి తెలియకుండా ఇక్కడ వీళ్ల ఇంట్లో సుఖంగా జీవిస్తున్నాం. ఎందుకో ఇప్పుడు ఈ ఇంట్లోంచి ఏడుపు వినిపిస్తోంది.

ఏం జరిగిందో తెలుసుకోవాలి. మనకి ఇంత గొప్ప ఉపకారం చేసిన బ్రాహ్మణ కుటుంబానికి ఏదో కష్టం కలిగినట్టు ఉంది. నాకు చాలా బాధగా ఉంది. అదేమిటో తెలుసుకుని వాళ్ల కష్టాన్ని తీర్చాలి. ఎదుటివాళ్లు తమకి చేసిన ఉపకారాన్ని గుర్తించడం బుద్ధిమంతుల లక్షణం. మంచి మనస్సుతో దానికి సరిపడేలా తిరిగి ఉపకారం చెయ్యడం ఉత్తమమైన పద్ధతి” అంది.

తల్లి చెప్పినది విని భీముడు “అమ్మా! దానికోసం అంత బాధపడడం ఎందుకు? నువ్వు వెళ్లి విషయం తెలుసుకుని రా! ఎంత కష్టమైనా దాన్ని తీరుస్తాను” అన్నాడు. కుంతీదేవి భీముడు చెప్పినట్టు విషయం తెలుసుకుని రావడానికి వెళ్లింది. కాని దుఃఖంలో ఉన్న వాళ్లని చూసి ఏమీ అడగలేక చూస్తూ ఉండిపోయింది.

బకాసురుడికి ఆహారంగా బ్రాహ్మణ కుటుంబం

ఏడుస్తున్న బాహ్మణుడు ఏడుపు ఆపి బంధువులతో “సంసారం ఎండుగడ్డిలా సారం లేకుండా ఉంటుంది. దుఃఖాన్ని, భయాన్ని కలిగిస్తుంది; ఎంతో చంచలమైంది. పండితులైనవాళ్లు ఈ సంసార జీవితం సత్యమైందని ఎలా నమ్ముతారు? యోగికైనా, సామాన్యుడికైనా పూర్వజన్మ కర్మవల్ల కలవడంగాని, విడిపోవడంగాని జరుగుతుంది. నేను నా భార్య బిడ్డలు ఈ ఆపదని దాటడానికి ఉపాయం ఉందా. ఏం చెయ్యాలో తోచట్లేదు. ఇక్కడ ఉండకుండా వేరే ఎక్కడికేనా వెళ్లిపోదామని ఎంత చెప్పినా నా భార్య వినలేదు. ఇంత ఘోరం అనుభవించమని బ్రహ్మ రాసి పెడితే ఎలా వెళ్లగలం? కర్మ ఫలం తప్పించుకోడం ఎవరికీ సాధ్యం కాదు.

వేదమంత్ర పూర్వకంగా వివాహం చేసుకుని నాతో కలిసి ధర్మ మార్గంలో నడుస్తూ వినయంతో నన్ను అనుసరిస్తున్న నా భార్యని రాక్షసుడికి ఆహారంగా ఎలా పంపించగలను? ధర్మం అభివృద్ధి చెయ్యడానికి తగిన వరుణ్ని చూసి వివాహం చెయ్యడానికి నా దగ్గరకు భగవంతుడు పంపించిన ఈ కన్యని రాక్షసుడికి ఆహారంగా ఎలా పంపించగలను? నా పితృదేవతలకి పిండోదకాలు ఇవ్వవలసిన కుమారుణ్ని, వంశాన్ని తరింపచేసేవాడిని పితృదేవతల ఋణం తీర్చే ఈ చిన్నవాడిని ఆ రాక్షసుడి నోటికి ఆహారంగా ఎలా పంపించగలను? నేనే ఆ రాక్షసుడి నోటికి ఆహారంగా వెడతాను. వీళ్లల్లో ఎవరినీ నేను పంపించలేను” అని తనను తాను అర్పించుకోడానికి సిద్ధమయ్యాడు బ్రాహ్మణుడు.

అతణ్ని చూసి అతడి భార్య “తప్పించుకోడానికి వీలులేని ఆపద కలిగినప్పుడు దీన్ని తప్పించుకోలేక పోతున్నాను అని బాధపడకూడదు. ఆ రాక్షసుడికి ఆహారంగా నేను వెడతాను మీరు బాధపడకండి. భార్యగా మీకు సంతానాన్ని ఇచ్చాను. వాళ్లని పెంచి పోషించే బాధ్యత మీది. ఇంక నేను లేకపోయినా ఫరవాలేదు. నేను నా ఋణం తీర్చుకున్నాను. భర్తకి ఆపద వచ్చినప్పుడు భార్య తన ప్రాణాలు ఇచ్చి అయినా రక్షించుకోవాలి. అంతేకాదు, భర్తకంటే ముందు మరణించిన భార్య పుణ్యాత్మురాలవుతుంది. భర్త లేకపోతే పరమ పతివ్రత అయినా కూడా లోకంలో నిందలు భరించాల్సి వస్తుంది. కింద పడిన మాంసపు ముక్కని తినాలని పక్షులు దాని చుట్టూ చేరినట్టు భర్త పోయిన స్త్రీ చుట్టూ నీచులు చేరతారు.

భార్య మరణిస్తే భర్త మరొక స్త్రీని భార్యగా చేసుకోవడానికి శాస్త్రం అంగీకరిస్తుంది. భర్తని పోగొట్టుకున్న భార్య మరొక పురుషుడిని భర్తగా చేసుకుంటే లోకం అంగీకరించదు. కాబట్టి, మీరు లేని జీవితం నాకొద్దు. ఒకవేళ అటువంటి జీవితమే నాకు వస్తే ఈ పిల్లల్ని రక్షించడం నా వల్ల అయ్యే పని కాదు. కులాచారానికి సరిపోని వాళ్లు మన కూతుర్ని అడిగినా, మన కుమారుడి సరైన శిక్షణ ఇప్పించాలన్నా నేను చెయ్యలేను. నేను మరణించినా మీరు మరొక స్త్రీని పెళ్లి చేసుకుని గృహస్థు ధర్మాన్ని, అగ్నిహోత్రాన్ని, సంతానాన్ని రక్షించగలరు” అని చెప్పింది.

అప్పటి వరకు తల్లితండ్రులు సోదరుడు చెప్పిన మాటలు విని బ్రాహ్మణుడి కూతురు “తండ్రీ! నేను ఎంతకాలం మీతో కలిసి జీవించినా నేను మీదాన్ని కాదు. పరాయి సొమ్మునే కదా? ఎలాగయినా నన్ను పరాయి ఇంటికి పంపిచేప్పుడు ఈ రాక్షసుడికే ఆహారంగా పంపించండి. తండ్రి వదిలే నువ్వులు, నీళ్లు మరణించిన కూతురుకి చెందుతాయి. కాని, ధర్మప్రకారం కూతురు చేసే కర్మలు భర్తకేగాని, తల్లితండ్రులకి చెందవు. మీకు నా వల్ల మనుమడు పుట్టిన లాభం కంటే మీరిద్దరు బ్రతికి ఉంటే చాలామంది కొడుకులు, మనుమలు పుడతారు. వాళ్ల వల్ల వంశం నిలబడుతుంది. కనుక, ఆ రాక్షసుడికి నన్ను ఆహారంగా పంపించడమే అన్ని విధాలా మంచిది” అని తల్లికి చెప్పింది.

ఆమె తల్లితండ్రులు ఆమెని కౌగలించుకుని ఏడుస్తున్నారు. ఇంతలో ఒక చిన్న పిల్లవాడు ఒక కర్ర పట్టుకుని వచ్చి “మీరందరు ఏడవకండి, నేను ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్లి మళ్లీ వచ్చేస్తాను” అన్నాడు. అతడి మాటలు విని అందరూ ఏడుపు ఆపి ఆ పిల్లవాడి వైపు చూసారు.

అ సమయంలో కుంతీదేవి వాళ్ల దగ్గరికి వెళ్లి “అసలు విషయమేమిటో చెప్తే మీ బాధని నేను పోగొడతాను” అని మృదువైన మాటలతో అడిగింది

కుంతీదేవికి తన దుఃఖానికి కారణం చెప్పిన బ్రాహ్మణుడు

కుంతి అడిగిన దానికి బ్రాహ్మణుడు “తల్లీ! మానవమాత్రులు తీర్చలేని ఆపద గురించి ఏమని చెప్పను? అయినా వివరంగా చెప్తాను. ఈ పట్టణానికి కొంచెం దూరంలో ఒక అడవి ఉంది. అక్కడ ‘బకుడు’ అనే పేరుగల రాక్షసుడు ఉన్నాడు. అతడు ఈ పట్టణంలో నివసిస్తున్న ప్రజల్ని ఇంటికి ఒకళ్లుగా తినేస్తున్నాడు. సాధువులైన బ్రాహ్మణులు జపాలు, హోమాలు, దానాలు, అనేక మంచి పనులు చేసి అతణ్ని కలిసి ఒక ఒప్పందానికి వచ్చారు. అది కూడా నీకు చెప్తాను.

ప్రతిరోజూ రెండు దున్నపోతుల్ని కట్టిన బండిలో ఒక ఇంటినుంచి ఒక మనిషిని, తినుబండారాలు మాంసం కలిపిన అన్నం నింపుకుని తీసుకుని వెడితే ఆ అన్నాన్ని, మనిషినీ, దున్నపొతుల్నీ తింటాడు. అతడు కానుకగా అనుకుని వాటిని తింటాడు. ఈ పట్టణంలో ఉండేవాళ్లని బయటవాళ్లెవరు బాధపెట్టకుండా కాపాడుతూ ఉంటాడు. ఈ దేశాన్ని పాలించే రాజుకి కూడా బకుణ్ని చంపే ధైర్యం లేక మౌనంగా ఉండిపోయాడు.

వివాహం చేసుకుని, ధనం సంపాదించి భార్యతోను, సంతానంతోను ధర్మాన్ని నెరవేరుస్తూ ధర్మాత్ముడైన, బలవంతుడైన రాజు పరిపాలనలో గృహస్థు జీవించడం సుఖం. కాని, ఇలా అడవిలో జీవిస్తున్నట్టు జీవించడం ఏం సుఖం? రాజులు బ్రాహ్మణుల నుంచి పోకచెక్కని కూడా కప్పంగా తీసుకోరు. కాని, దుర్మార్గుడు, పాపాత్నుడు అయిన ఈ రాక్షసుడు తన తిండి కోసం బ్రాహ్మణుల నుంచి మనిషినే కప్పంగా తీసుకుంటున్నాడు. వరుసగా ప్రతి ఇంటి నుంచి వెడుతున్న భోజనం వంతు ఇప్పుడు మా ఇంటికి వచ్చింది. ఈ పసివాణ్ని అతడికి ఆహారంగా ఇవ్వలేను.. నేనే వెడతాను” అని దుఃఖంతో పూడుకు పోయిన గొంతుతో చెప్పాడు.

బ్రాహ్మణుడి మాటలు విని కుంతీదేవి “అయ్యా! మీరు బాధపడకండి. ఈ ఆపద నుంచి గట్టెక్కే ఉపాయం నేను ఆలోచించాను. మీకు ఒక్కడే కొడుకు. అతడు కూడా పసివాడు. బకుడికి బలిగా తీసుకుని వెళ్లడానికి అర్హుడు కాదు. నాకు అయిదుగురు కొడుకులు. వాళ్లల్లో ఒకడు మీకు బదులుగా బకుడికి ఆహారాన్ని తీసుకుని వెడతాడు” అంది.

అమె మాటలు విని వెంటనే బ్రాహ్మణుడు రెండు చెవులూ మూసుకుని “అమ్మా! మీరు అతిథిగా వచ్చిన బ్రాహ్మణులు. నా జీవితం నిలుపుకోడం కోసం రాక్షసుడికి ఆహారంగా మీ కొడుకుని పంపించడానికి నేను అసలు అంగీకరించను. అసలు బ్రాహ్మణుల్ని అవమానించాలని అనుకోవడమే పాపం! బ్రాహ్మణుడి మరణాన్ని కోరుకోవడం ఇంకెంత పాపమో ఆలోచించు. పాపాలన్నింటిలో బ్రాహ్మణహత్య ఎక్కువ పాపం.

ధైర్యాన్ని పోగొట్టుకుని ప్రార్థించేవాడిని, అతిథిని, అభ్యాగతుడిని, భయంతో ఉన్నవాణ్ని, శరణు అని అడిగి వచ్చినవాణ్ని చంపాలని అనుకునే దుర్మార్గుడికి ఇహలోకంలోను, పరలోకంలోను కూడా సుఖం ఉండదు కదా! మరి ఆత్మహత్య కూడా మహాపాపమే కదా? అని అడుగుతావేమో! తప్పించుకోలేనిది, వేరే మార్గం కనపడనిది, ఇతరులు చేస్తున్నది కనుక నాకు పాపం లేనే లేదు. దాన్ని చేసిన వాళ్లకే మహాపాపం కనుక నాకు పాపం కలగదు. కనుక నీ కొడుకుని పంపించడానికి నేను ఇష్టపడను” అన్నాడు.

అతడి మాటలు విని కుంతీదేవి “అయ్యా! నేను కూడా బ్రాహ్మణుల్ని చంపడానికి అంగీకరించలేను. అందుకే నా కొడుకుని పంపిస్తానని చెప్పాను. ఎందుకంటే, నా కొడుకుని చంపడం ఆ రాక్షసుడికి సాధ్యం కాదు. నా కొడుకు దుర్మార్గుడైన రాక్షసుణ్ని చంపగల బలవంతుడు. పదిమంది కొడుకులున్న వాళ్లు కూడా ఒక కొడుకుని చంపుకోవాలని అనుకోరు కదా. ఇతడు ఇంతకు ముందు చాలా మంది రాక్షసుల్ని చంపాడు. చాలా బలవంతుడు. మంత్రసిద్ధి పొందినవాడు” అని చెప్పింది.

తరువాత భీముణ్ని పిలిచింది “నాయనా! ఈ బ్రాహ్మణుణ్ని ఆపదనుంచి కాపాడితే నాకు చాలా సంతోషంగా ఉంటుంది” అని చెప్పింది. భీముడు తల్లి మాటని గౌరవించి రాక్షసుణ్ని చంపడానికి అంగీకరించాడు. బ్రాహ్మణుడు, అతడి బంధువులు ఎంతో సంతోషించారు.

అంతలోనే ధర్మరాజు, అర్జునుడు, నకులసహదేవులు వచ్చారు. ధర్మరాజు సంతోషంగా ఉన్న భీముడి ముఖాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. తల్లిని చూసి “అమ్మా! భీముడు ఎవరితోనో భయంకరంగా యుద్ధం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నట్టు ఎంతో సంతోషంగా కనిపిస్తున్నాడు. ఇతణ్ని చూస్తే ఎప్పుడూ ఉన్నట్టుగా కనిపించట్లేదు. మీరు ఇతణ్ని ఆజ్ఞపించారా? అతడే తనంతట తను యుద్ధానికి సన్నద్ధమయ్యాడా?” అని అడిగాడు.

ధర్మరాజు మాటలకి కుంతీదేవి ఏకచక్రపురంలో బకాసురుడు బ్రాహ్మణుల్ని బాధిస్తున్నాడని, తమకి ఆతిథ్యమిచ్చిన బ్రాహ్మణుడికి కలిగిన ఆపదని, దాన్ని తీర్చడం కోసం తను భీముణ్ని పంపిస్తున్న విషయాన్ని వివరంగా ధర్మరాజుకి చెప్పింది. కుంతీదేవి మాటలు విన్న ధర్మరాజు బాధపడుతూ “అమ్మా! ఇతరుల కొడుకుల్ని రక్షించడానికి తమ కొడుకుల్ని చంపుకునే వాళ్లు ఉంటారా? ఇది లోక పద్ధతికే విరుద్ధం. భీమసేనుడు లేకపోయినా మీకు ఫరవాలేదా? తమ్ముడి పరాక్రమం వల్లే కదా మనం లక్క ఇంటి నుంచి బయటకు రాగలిగాము. మనం గాఢంగా నిద్రపోతున్నప్పుడు మనకి మెలకువ రాకుండా హిడింబాసురుణ్ని దూరంగా తీసుకుని వెళ్లి చంపలేదా. ఇతడి బలానికి భయపడే కదా కౌరవులు నిద్రపోవడం కూడా మానేసి మనల్ని చంపడానికి అనేక ఉపాయాలు ఆలోచిస్తున్నారు? అమ్మా! ఇంతటి బలవంతుడైన మన భీముణ్ని బకాసురుడికి నోటికి ఆహారంగా ఇచ్చేద్దామా! ఎక్కువ బాధ కలగడం వల్ల మీకు మతి చలించిందేమో” అన్నాడు.

ధర్మరాజు మాటలు విని కుంతీదేవి “నాయనా! భ్రాంతికి, మోహానికి, ఆశకి, భయానికి లోబడి కొడుకుని పోగొట్టుకునేంత వెర్రిదాన్ని కాదయ్యా! భీముడి శక్తి తెలిసే నేను ఈ పని అప్పగించాను. అతడి శక్తి గురించి చెప్తాను విను. మన భీముడు పుట్టిన పదోరోజు నా చేతినుంచి జారి పర్వతం మీద పడ్డాడు. వేగంగా కిందపడడం వల్ల భీముడి శరీరం తగిలి అక్కడి రాళ్లన్నీ పొడి పొడిగా అయిపోయాయి. వజ్రం వంటి దేహం కలిగిన భీముడు వజ్రాయుధం ధరించిన దేవేంద్రుణ్ని కూడా జయించగలిగిన సమర్థత కలవాడు.

బకాసురుణ్ని సులభంగా చంపి ఈ ఊరి బ్రాహ్మణుల బాధ పోగొట్టగలడు. అతడి గురించి బెంగ పడక్కర్లేదు. మనం సుఖంగా జీవించాలని నివాసాన్ని ఏర్పరిచి ఉపకారం చేసిన ఈ బ్రాహ్మణుడికి తిరిగి ఉపకారం చెయ్యడానికి మనకి మంచి అవకాశం కలిగింది” అని చెప్పింది.

ఇతరుల దుఃఖాన్ని పోగొట్టడమే గొప్ప ధర్మము

కుంతీదేవి ధర్మరాజుకి ఇంకా ఇలా చెప్పింది. “నాయనా! ఇతరులకి కలిగిన బాధల్ని పోగొట్టడమే ఉత్తమ క్షత్రియుడి ధర్మం. బ్రాహ్మణుడు మృత్యుభయంతో బాధపడుతున్నాడు అని తెలిసిన వెంటనే అతణ్ని రక్షించినవాడు పుణ్యలోకాలు పొందుతాడు. క్షత్రియుణ్ని రక్షించినవాడు పండితులతో కీర్తించబడతాడు. వైశ్యుల్ని, శూద్రుల్ని రక్షిస్తే భూమి మీద ఉన్న ప్రజలందరి ఆదరాన్ని పొందుతాడు. ఈ విషయాన్ని మహాతపస్వి అయిన వేదవ్యాసుడు చెప్పినప్పుడు విన్నాను. బ్రాహ్మణులకి ఏది కావాలో దాన్ని చెయ్యడం వల్ల గొప్ప పుణ్యం కలుగుతుంది. బ్రాహ్మణులకి అవసరమైన పని పూర్తి చేస్తే నీకు నీ తమ్ముళ్లకి అంతులేని సంపద, సుఖం, ఆయుష్షు, రాజ్యం కలుగుతాయి” అని చెప్పింది.

తల్లి చెప్పింది విని ధర్మరాజు ఆమె దయార్ద్ర బుద్ధికి, బ్రాహ్మణ భక్తికి, ధర్మాన్ని ఆచరించడంలో ఉన్న ఆసక్తికి సంతోషించాడు. తను కూడా భీమసేనుణ్ని ప్రోత్సహించాడు. తరువాత భీముడు బ్రాహ్మణుడితో “అయ్యా! రాత్రి కడుపు నిండక పోవడం వల్ల రాత్రి నిద్రలేదు. బాగా అలిసిపోయి ఉన్నాను. మీరు నాకు ఆహారం పెట్టగలిగితే తిని ఎక్కువ బలాన్ని పొంది పాపాత్ముడైన ఆ రాక్షసుణ్ని చంపి ఈ నగర ప్రజలందరికీ సంతోషాన్ని కలిగిస్తాను” అన్నాడు.

వెంటనే బ్రాహ్మణుడు అతడి బంధువులు రకరకాల పిండివంటలు, అన్నము, పప్పు నేతి కుండలు, పెరుగు కుండలు అన్నీ తీసుకుని వచ్చారు. వాటిని పూర్తిగా తిని భీముడు బాగా బలాన్ని తెచ్చుకుని బకాసురుణ్ని చంపడానికి బయలుదేరాడు.

బకాసురుణ్ని చంపడానికి వెళ్లిన భీముడు

భీముడు కడుపునిండా తిని బండిని ఎక్కి దక్షిణ దిశలో ప్రయాణం చేసి బకాసురుడు ఉండే చోటికి వెళ్లాడు. ఎండిపోయిన పీనుగు గుట్టలు ఉన్న చోటికి వెళ్లకుండా యమునా నదీ తీరంలో బండిని ఆపాడు. అతడు వచ్చేవరకు ఆగకుండా బండి దిగి నదిలోకి వెళ్లి కాళ్లూచేతులూ కడుక్కుని ఆచమనం చేసి బండిలో బకాసురుడి కోసం పంపించిన ఆహారం తనే తినెయ్యడం మొదలుపెట్టాడు.

భీముడి కేకలు విన్న బకాసురుడు ఈ రోజు భోజనం పంపించడమే ఆలస్యమైంది. పైగా ఇక్కడి దాకా రాకుండా ఎక్కడో కూర్చుని నన్నే అక్కడికి రమ్మని పిలుస్తున్నాడు అనుకున్నాడు. అతడికి కలిగిన ఆకలికి అవమానానికి తట్టుకోలేక కోపంతో ఆకాశమంత ఎత్తు ఎగిరి భయంకరమైన ఆకారంతో అరుస్తూ భీముడు ఉండే చోటుకి వచ్చాడు. తను వచ్చినా తనవైపు చూడకుండా బండి మీద కూర్చుని తనకోసం తెచ్చిన ఆహారాన్ని తినేస్తున్న భీముణ్ని చూశాడు.

“ఈ ఏకచక్రనగర ప్రజలకి పొగరు ఎక్కువైంది. నాకోసం పంపించిన ఆహారాన్ని నువ్వెందుకు తింటున్నావు?” అని అడిగాడు. భీముడు జవాబియ్యకుండా బండి మీద నుంచి లేవకుండా తింటూనే ఉన్నాడు. బకాసురుడు భీముడి వీపు మీద గుద్దాడు. భీముడు కొంచెం కూడా భయపడలేదు. బకాసురుడు కోపంతో ఒక పెద్ద చెట్టుని పెళ్లగించి భీముడి దగ్గరికి వస్తున్నాడు. అప్పటికి భీముడు అన్నం తినడం పూర్తి యింది. వెంటనే జబ్బలు చరుచుకుని గర్జిస్తూ లేచి నిలబడ్డాడు.

బకాసురుణ్ని చంపిన భీముడు

వాయుపుత్రుడు భీముడు తను కూడా ఒక మద్ది చెట్టుని పెకిలించి తెచ్చి బకాసురుడు మీద వేశాడు. దాన్ని బకాసురుడు తన చేతిలో ఉన్న చెట్టుతో విరిచేశాడు. ఇద్దరూ చెట్లతోనే చాలా సేపు యుద్ధం చేశారు. అక్కడ ఉన్న చెట్లన్నీ అయిపోవడంతో ఇద్దరూ మల్లయుద్ధానికి దిగారు. భీముడు, బకాసురుడు ఒకళ్ల మీద ఒకళ్లు కలియబడి పట్టుకుంటూ, తోసుకుంటూ, ఈడ్చుకుంటూ ఎవరికి వాళ్లు తనే నెగ్గాలన్న కోరికతో భయంకరంగా యుద్ధం చేస్తున్నారు. వాళ్ల చుట్టూ ఉన్న చెట్లు, తీగలు, మొక్కలు అన్నీ ధ్వంసమయ్యాయి. పెద్ద పెద్ద బండలు పిండిగా మారిపోయాయి.

వాళ్ల హుంకారాలు, భుజాల చప్పుళ్లు, పిడికిళ్లతో కొట్టుకోవడం వల్ల కలిగిన శబ్దానికీ, కాళ్లతో తొక్కడం వల్ల భూమి నుంచి పుట్టిన శబ్దానికీ భయపడి అక్కడికి వచ్చి యుద్ధం చూస్తున్నవాళ్లు అందరూ అక్కడినుంచి పరుగెత్తారు. చివరికి భీముడు బకాసురుణ్ని గట్టిగా పట్టుకుని నేలమీద పడేసి అతడి గుండెమీద ఎడమ కాలితో తన్నాడు. బకాసురుడు మళ్లీ లేచి అమితమైన కోపంతో భీముణ్ని పట్టుకుని అతడి గుండెలమీద పిడికిలితో కొట్టాడు.

బకాసురుడి బలం తగ్గిందని తెలుసుకున్న భీముడు ఏనుగు తొండాల్లా బలంగా ఉన్న తన రెండు చేతులతో బకాసురుడి కంఠం పట్టుకున్నాడు. భీముడు కాలయముడిలా విజృంభించి తన బలమైన మోకాలితో బకాసురుడి వీపు మీద కొట్టాడు. రాక్షసుడి శరీరం నుంచి మాంసంతో పాటు నెత్తురు కూడా ధారలు కడుతూ ప్రవహించింది. బకాసురుడు భీముడి చేతిలో చచ్చేటప్పుడు పెట్టిన కేకలకి అతడి రాక్షస బంధువులు స్నేహితులు పరుగెత్తుకుని వచ్చారు. వాళ్లందరితో భీముడు “ఈ బకాసురుడు తిన్నట్టు ఎవరేనా మనుషుల్ని పట్టుకుని తింటే బకాసురుడికి పట్టిన గతే మీకూ పడుతుంది” అని చెప్పాడు.

వాళ్లు భీముడికి భయపడి అతడి మాటకి కట్టుబడి ఉంటామని చెప్పి వెళ్లిపోయారు. బకాసురుడి చావు నగర ప్రజలకి తెలియాలని భీముడు బకాసురుడి శవాన్ని ఈడ్చుకుని వచ్చి ఏకచక్రపుర ద్వారం దగ్గర పడేశాడు. అది చూసి ఆ నగరంలో నివసిస్తున్న బ్రహ్మణులందరూ ఎంతో సంతోషించారు. భీముడు ఇంటికి వెళ్లి తన తల్లికి సోదరులకి జరిగిన విషయమంతా చెప్పాడు. ఏకచక్రపురంలో ఉన్న బ్రాహ్మణులు, ప్రజలు అందరూ “బలవంతుడు, దుర్మార్గుడు అయిన రాక్షసుణ్ని మంత్రసిద్ధి గల బ్రాహ్మణుడు యుద్ధంలో అతి తేలికగా చంపేశాడు. మనందరం వెళ్లి అతణ్ని చూద్దాము రండి!” అని ఒకళ్లకొకళ్లు చెప్పుకుని భీముణ్ని చూడ్డానికి వచ్చారు.

వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పిన పాండవుల చరిత్రని సూతమహర్షి శౌనకుడు మొదలైన మునులకి చెప్పాడు.

ఆదిపర్వంలోని ఆరవ ఆశ్వాసం సమాప్తం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here