మహాభారత కథలు-45: అంగారపర్ణుణ్ని జయించిన అర్జునుడు

0
3

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

అంగారపర్ణుణ్ని జయించిన అర్జునుడు

[dropcap]ఒ[/dropcap]కరోజు అర్ధరాత్రి పాండవులు గంగానదిలో ‘సోమశ్రవము’ అనే తీర్థంలో స్నానం చెయ్యాలని అనుకున్నారు. అర్జునుడు వెలుగు ఉంటుందని ఒక కొరివిని పట్టుకుని అందరికంటే ముందు నడుస్తున్నాడు. మిగిలినవాళ్లు అతణ్ని అనుసరిస్తున్నారు. అదే సమయంలో అంగారపర్ణుడు తన భార్యలతో స్నానం చెయ్యడానికి గంగానదికి వచ్చాడు. పాండవులు నడుస్తున్నప్పుడు వస్తున్న శబ్దాన్ని విని ధనుస్సు చేత్తో పట్టుకుని అల్లెతాడు శబ్దం చేశాడు.

పాండవుల్ని చూసి “అర్ధరాత్రి సమయంలోను, పొద్దున్న, సాయంత్రం, సంధ్యా సమయాల్లోను భూతాలు, రాక్షసులు, యక్షులు, గంధర్వులు తిరుగుతూ ఉంటారు. ఆ సమయాల్లో మనుషులు తిరగడానికి భయపడతారు. ఎంత బలవంతులైనా, గొప్ప రాజులైనా ఆ సమయంలో మమ్మలి జయించలేరు. ఇటువైపు రాకుండా దూరంగా వెళ్లిపొండి. నేను అంగారపర్ణుడు అనే పేరు గల గంధర్వుణ్ని, కుబేరుడికి స్నేహితుణ్ని. నేను ఎప్పుడూ ఇక్కడే విహరిస్తూ ఉంటాను. ఈ అడవి, ఈ గంగాతీరం అంగారపర్ణుడివే అని ప్రపంచంలో అందరికీ తెలుసు. మీకు తెలియదా? ఈ ప్రాంతంలో తిరగడానికి అందరూ భయపడతారు” అన్నాడు.

అంగారపర్ణుడి మాటలు విని అర్జునుడు “సామాన్య మానవులైతే సంధ్యాసమయంలోను, అర్ధరాత్రి నడవడానికి భయపడతారు. మా వంటి బలవంతులు ఎందుకు భయపడతారు? ఎప్పుడైనా ఎక్కడైనా తిరగడానికి మాకు భయం లేదు. అయినా పవిత్రమైన ఈ గంగానది భూమి మీద నివసిస్తున్న ప్రజలందరికీ చెందుతుంది. దీన్ని అందరూ సేవిస్తారు. ఈ నది హిమాలయంలో ఎత్తైన శిఖరం నుంచి భూమి మీదకి వచ్చి, ‘గంగ’ అనే పేరుతో సముద్రంలో కలుస్తోంది. ఇది మూడు మార్గాల్లో ప్రయాణం చేస్తోంది. మందాకిని అనే పేరుతో దేవతలు, సిద్ధులు, మహర్షులు మొదలైన ఆకాశంలో సంచరించేవాళ్లు సేవిస్తారు. పాతాళంలో ‘భోగవతి’ అనే పేరుతో ఉంది. మూడు లోకాలకి పవిత్రతని కలగచేసే ఈ పుణ్యమూర్తికి శివుడి జటాజూటంలో ఉచితమైన స్థానం ఉంది. ఈ గంగానదిలో స్నానం చెయ్యాలని వచ్చినవాళ్లం. నీ మాటలు విని భయపడి వెనక్కి వెళ్లిపోతామని అనుకుంటున్నావా?” అన్నాడు. మాట్లాడుతూనే తల్లితోను సోదరులతోను ముందుకి వస్తున్న అర్జునుడి మీద అంగారపర్ణుడు పదునుగా ఉన్న బాణాల్ని వేశాడు. అర్జునుడు కోపంతో తన చేతిలో ఉన్న కొరివితో వాటిని విదిల్చాడు.

“వెర్రివాడా! నీ మాయలు బెదిరింపులు నన్నేమీ చెయ్యవు. ఇప్పుడు నేను వేస్తున్న బాణాలు చూడు. ఇది ఆగ్నేయాస్త్రం. దీన్ని పూర్వం అగ్నిదేవుడు బృహస్పతికి ఇచ్చాడు. అతడు దాన్ని భరద్వాజ మహర్షికి ఇచ్చాడు. ఆయన పరశురాముడికి ఇచ్చాడు. పరశురాముడు ద్రోణుడికి, ద్రోణుడు దాన్ని నాకు ఇచ్చాడు” అని చెప్తూనే దాన్ని అంగారపర్ణుడి మీదకి ప్రయోగించాడు. వెంటనే అతడి రథం కాలిపోయి కళ్లు తిరిగి కింద పడిపోయాడు. అతణ్ని జుట్టుపట్టుకుని ఈడ్చుకుని వెళ్లి ధర్మరాజు కాళ్లమీద పడేశాడు.

అంగారపర్ణుడి భార్య ‘కుంభీనసి’ భయంతో ఏడుస్తూ వచ్చి “మీరు ధర్మాత్ములు, దయతో నాకు పతిదానం చెయ్యండి” అని వేడుకుంది.

ఏడుస్తున్న కుంభీనసిని చూసి ధర్మరాజు అర్జునుడితో “ఈ అంగారపర్ణుడు యుద్ధంలో ఓడిపోయినవాడు, క్రుంగినవాడు, శౌర్యం కోల్పోయినవాడు కనుక అతణ్ని విడిచిపెట్టు” అన్నాడు.

అర్జునుడు ధర్మరాజు చెప్పినట్టు అంగారపర్ణుణ్ని విడిచిపెడుతూ “గంధర్వుడా! కురువంశ ప్రభువు, శరణన్నవాళ్లని రక్షించేవాడు ధర్మరాజు దయతో నిన్ను విడవమని నన్ను ఆజ్ఞాపించాడు కనుక విడిచిపెడుతున్నాను” అన్నాడు.

అర్జునుడితో అంగారపర్ణుడు స్నేహము

యుద్ధంలో ఓడిపోయిన అంగారపర్ణుడు “అర్జునా! యుద్ధంలో నీ చేతిలో ఓడిపోయాక ఇంక అంగారపర్ణుడు అని పిలిపించుకోవాలంటే నాకు సిగ్గుగా ఉంది. యుద్ధంలో ఓడిపోయి గర్వభంగం జరిగాక కూడా మొదటి పేరుతోనే గొప్పతనాన్ని, గర్వాన్ని అనుభవించ కూడదు. అలా చెయ్యడం వల్ల సభల్లో ఉన్న గొప్పవాళ్లు అవమానం చేస్తారు. నీ ఆగ్నేయాస్త్రంతో నా రథం కాలిపోయినా నేను గంధర్వుణ్ని కనుక అనేక రత్నాలు పొదగబడిన మరో రథాన్ని పొందగలను. ఇప్పటి నుంచి నా పేరు ‘చిత్రరథుడు’ గా మార్చుకుంటాను.

నీ పరాక్రమం నన్ను సంతోషపెట్టింది. నీతో స్నేహం చెయ్యాలని ఉంది. నేను తపస్సు చేసి పొందిన ‘చాక్షుసీ’ విద్యని నీకిస్తాను. ఈ విద్యని పూర్వం వసువు నుంచి చంద్రుడు, అతడి నుంచి గంధర్వ రాజైన విశ్వావసుడు పొందారు. అతడి నుంచి నేను పొందాను. ఈ విద్య నేర్చుకోవడం వల్ల మూడులోకాలు చూడడానికి వీలుకలుగుతుంది. మేము ఈ విద్య నేర్చుకోవడం వల్లే మానవులకంటే గొప్పవాళ్లమై దేవతల చెప్పుచేతల్లో ఉండకుండా మా జీవితాన్ని మేము జీవించ గలుగుతున్నాము.

ఈ విద్యని దుర్మార్గులు నేర్చుకుంటే ఫలితం ఉండదు. నువ్వు తపతికి సంబంధించిన వంశాన్ని వృద్ధిచేసేవాడివి. నీకివ్వడం వల్ల ఫలితం ఉంటుంది. అందుకే ఈ విద్యని నీకు ఇస్తాను తీసుకో! ఈ విద్యని నేర్చుకోడానికి ముందు ఆరు నెలలు వ్రతం చెయ్యాలి. నువ్వు నాకు ఆగ్నేయాస్త్రాన్ని ఇవ్వు. నేను మీ అయిదుగురికి గొప్ప వేగం, బలం కలిగిన గంధర్వ గుర్రాల్ని ఒక్కొక్కళ్లకి వంద చొప్పున ఇస్తాను.

ఒకసారి దేవేంద్రుడు వృతుడు అనే రాక్షసుడి మీద కోపం వచ్చి తన వజ్రాయుధాన్ని విసిరాడు. అది వజ్రాయుధం కంటె కఠినమైన అతడి పెద్ద తల మీద పడి ముక్కలైంది. ఆ ముక్కల పోగు వరుసగా బ్రహ్మణులలో వేదశక్తిగాను, క్షత్రియుల్లో ఆయుధశక్తిగాను, వైశ్యుల్లో నాగలి శక్తిగాను, శూద్రుల్లో సేవాశక్తిగాను, గుర్రాల్లో వేగ శక్తిగాను రూపొందింది. వాటిలో వేగం ఉండడం వల్ల లోకాలన్నింటినీ రక్షిస్తున్న రాజులకి ఇష్టమైన సాధనంగా మారింది. అందువల్ల గుర్రం కూడా ఉత్తమ సాధనంగా మారింది” అని చెప్పాడు.

అంగారపర్ణుడు చెప్పినది విని అర్జునుడు “ఎంత స్నేహితులైనా విద్యని, విజయాన్ని, ధనాన్ని ఇతరుల నుంచి తీసుకోడానికి నేను ఇష్టపడను. నువ్వు నాకు ఇవ్వదలుచుకుంటే ఈ అగ్నేయాస్త్రాన్ని తీసుకుని, ఆ గుర్రాల్ని నాకు ఇయ్యి. నేను నీతో స్నేహం చేస్తాను. మేము ఎక్కువగా బ్రాహ్మణుల మంచిని కోరుకుంటాము. ధర్మబుద్ధి కలిగి ఉంటాము. మమ్మల్ని అవమానించి ఎందుకు మాట్లాడావు?” అని అర్జునుడు గంధర్వుణ్ని అడిగాడు.

“ముల్లోకాల్లోను వ్యాపించిన మీ మంచి గుణాల గురించి నారదుడు మొదలైన మునులు, సిద్ధులు, సాధ్యులు చెప్పగా వింటూ ఉంటాను. మేరుపర్వతాన్ని సిగలో బంతిపువ్వులా అలంకరించుకున్న భూమండలాన్ని మొత్తాన్ని పరిపాలిస్తూ, మంచి గుణాలు, ధ్యైర్యము కలిగి భరతవంశానికి కీర్తి తెచ్చిన పాండవుల్ని తెలియనివాళ్లు ఎవరూ లేరు. నాకు మీరెవరో తెలిసినా మీతో అగ్నిహోత్రం, బ్రాహ్మణుడు లేరు కనుక కఠినంగా మాట్లాడాను.

అంతేకాదు, స్త్రీలు పక్కన ఉన్నప్పుడు మాట్లాడేవాడు జ్ఞానం కలవాడయినా అహంకారంగానే మాట్లాడుతాడు. ధర్మం తప్పి వ్యవహరిస్తాడు. ప్రేమగా పలకరించలేడు. నేను వివేకవంతుణ్నే కాని నా పక్కన భార్యలు ఉండడం వల్ల నిగ్రహం కోల్పోయి అలా మాట్లాడాను. ఇది అసహజం కాదు.” అన్నాడు.

పురోహితుడి అవసరం గురించి చెప్పిన అంగారపర్ణుడు

అంగారపర్ణుడు అర్జునుడితో “బ్రాహ్మణుణ్ని ముందు ఉంచుకున్న పవిత్రమైన మనస్సు గల రాజులకి దేవతలు, గరుడులు, నాగులు, యక్షులు, రాక్షసులు, పిశాచులు, భూతాలు, గంధర్వులు కూడా ఎదురు చెప్పలేరు. అంతేకాదు, గొప్ప వంశంలో జన్మించిన అర్జునా! ఏ లోపం లేనివాడు, వేదవేదాంగాలు అధ్యయనం చేసినవాడు, జపాలు హోమాలు చేసిన గొప్పవాడు, నిజాన్నే పలికేవాడు, ధర్మార్థకామ మోక్షాల్ని సాధించడంలో మిత్రుడిగా వ్యవహరించేవాడు, మంచి నడవడిక గలవాడైన ఉత్తముడైన బ్రాహ్మణుణ్ని పురోహితుడిగా చేసుకున్న రాజు ఈ లోకంలో ఉన్న మొత్తం భూమండలాన్ని పరిపాలిస్తాడు. పరలోకంలో పుణ్యగతులు పొందుతాడు.

యయము, స్వర్గము, రాజ్యము అన్నీ పొందగలుగుతాడు. అటువంటి ఫలితాన్ని పొందడానికి రాజుకి పురోహితుడు లేకుండా వంశము పరాక్రమము మాత్రమే ఉంటే సరిపోదు. మీరు యమ, వాయు, దేవేంద్ర, అశ్వినీ దేవతల వరాలతో పాండురాజుకి కుంతీమాద్రులకి పుట్టారు. ధర్మం తెలిసినవాళ్లు, ద్రోణాచార్యుడికి శిష్యులు, అన్ని లోకాలకి మేలు కలగాలని కోరుకుంటారు. కనుక, మీకు పురోహితుడు తప్పకుండా ఉండాలి.

అర్జునా! నువ్వు బ్రహ్మచర్యంలో ఉన్నావు కనుక కామసుఖాలు అనుభవిస్తున్న నన్ను రాత్రివేళ యుద్ధం చేసి ఓడించగలిగావు. కామభోగాలు అనుభవించేవాడైనా పవిత్రుడైన పురోహితుణ్ని తనతో ఉంచుకుంటే అన్ని యుద్ధాల్లోను జయించగలడు. పరాక్రమవంతుడవైన అర్జునా! వేదము, యజ్ఞవేదిక కలిగిన బ్రాహ్మణుడు గొప్ప పుణ్యాన్ని సంపాదిస్తాడు. అటువంటి బ్రాహ్మణుడు పురోహితుడుగా ఉంటే ఆ రాజుకి పాపమే అంటదు. అందువల్ల మీ గుణాలకి తగినవాణ్ని, ధర్మతత్వం గురించి బాగా తెలిసినవాణ్ని, మంచి నడవడిక కలవాణ్ని గొప్ప బ్రాహ్మణుణ్ని ఇప్పటికైనా పురోహితుడిగా పెట్టుకోండి” అన్నాడు.

తపతీసంవరణుల వృత్తాంతము

తపతికి వరుణ్ని వెతుకుతున్న సూర్యుడు

అర్జునుడు అంగారపర్ణుడితో “పుణ్యాత్ముడవైన గంధర్వా! నువ్వు మమ్మల్ని తపతి సంతతి వాళ్లమని సంతోషంగా చెప్తున్నావు. మేము కుంతీదేవికి పుత్రులం కదా! తపతి సంతతివాళ్లం ఎలా అయ్యాము?” వివరంగా చెప్పమని అడిగాడు.

అంగారపర్ణుడు అర్జునుడితో “అర్జునా! తపతి సూర్యుడికి కూతురు. సావిత్రికి చెల్లెలు. మంచి లక్షణాలు, నిర్మలమైన శరీరము, తెల్లటి కళ్లు కలిగిన యవ్వనవతి, రూపవతి. అటువంటి తన కూతురికి మంచి లక్షణాలు, మంచి వంశానికి చెందిన వాడిని భర్తగా వెతికి తేవడం సూర్యుడికి కష్టంగా అనిపించింది.

సంవరణుడు భరతవంశపు రాజకుమారుడు ధర్మం తెలిసినవాడు, అన్ని మంచి గుణాలు కలిగినవాడు. అతడు జపం, తపం, ఉపవాసం మొదలైన నియమాలతో తపస్సు చేస్తున్నాడు. సూర్యుడు ఆకాశంలో గొప్ప కాంతితో ఎలా ప్రకాశిస్తున్నాడో అలాగే సంవరణుడు భూమండలమంతా తన గుణగణాలతో ప్రకాశిస్తున్నాడు. ఆ విషయం తెలుసుకున్న సూర్యుడు తన కుమార్తెకి సంవరణుడే తగిన వరుడు అని నిర్ణయించుకున్నాడు.

ఒకరోజు సంవరణుడు వేటకోసం అడవికి వెళ్లాడు. ఎక్కువగా తిరగడం వల్ల అతడి గుర్రం దాహం, ఆకలితో పడిపోయింది. సంవరణుడు ఒక్కడే నడుస్తూ వెళ్లి ఒక కొండ మీద ఎత్తైన ప్రదేశంలో ఉన్న అడవిలోకి చేరుకున్నాడు.

తపతిని వరించిన సంవరణుడు

సంవరణుడు తను వెళ్లిన అడవిలో ఒక కన్యని చూశాడు. చంద్రబింబంలా అందమైన ముఖంతో, సుకుమారంగా, బంగారు రంగు శరీరంతో అందంగా ఉన్న ఆమె అడవిలో ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. ‘సూర్యకాంతి ఆకాశం నుంచి భూమి మీదకి వచ్చిందా! బ్రహ్మదేవుడు మొత్తం సద్గుణాల్ని, అందాల్ని ఈమెకే ఇచ్చాడా! ఈమె అలంకరించుకున్న ఆభరణాలు ఎంత పుణ్యం చేసుకున్నాయో! ఈమె దేవకన్యో, యక్షకన్యో, సిద్ధకన్యో? గొప్ప కాంతితోను, సకల శుభలక్షణాలతోను కనిపిస్తున్న ఈమె దేవకన్యే అయి ఉంటుంది. ఇంత అందగత్తెని నేను ఎక్కడా చూడలేదు’ అని తనలో తనే అనుకున్నాడు.

నెమ్మదిగా అమె దగ్గరికి వెళ్లి “నువ్వు ఎవరివి? క్రూరజంతువులు తిరుగుతున్న ఈ ఎగుడు దిగుడుగా ఉండే ప్రదేశంలో ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు?” అని ప్రశ్న మీద ప్రశ్న వేసాడు.

తపతి ఆ రాజకుమారుడి ప్రశ్నలకి సమాధానం చెప్పలేదు. అతడికి కనిపించకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది. తపతి సమాధానం చెప్పకుండా వెళ్లిపోయినందుకు సంవరణుడు చాలా బాధపడ్డాడు. ఇంతలోనే తపతి మళ్లీ వచ్చి “నువ్వెవరివి?” అని అడిగింది.

ఆమె అడిగినదానికి సంవరణుడు “ఈ భూమి మీద గొప్ప బలగర్వపరాక్రమాలు కలవాడిని. ఎప్పుడూ ఎవరికీ భయపడనివాడిని. ఇప్పుడు నిన్ను చూడాగానే పెళ్లి చేసుకోవాలన్న కోరిక కలిగినవాడిని. గాంధర్వ పద్ధతిలో నన్ను పెళ్లి చేసుకునేందుకు అంగీకరిస్తావా?” అని అడిగాడు.

రాజకుమారుడి మాటలు విని తపతి “రాజా! నేను లోకాలకి వెలుగునిచ్చే సూర్యుడి కూతుర్ని. సావిత్రికి చెల్లెల్ని. తపతి అనే పేరుగల దేవకన్యని. నీకు నా మీద ప్రేమ ఉంటే నా తండ్రిని అడుగు. స్త్రీలకి వివాహ విషయంలో స్వేచ్ఛ లేదని నీకు తెలుసుకదా. ప్రతిరోజూ జపాలతోను, నియమాలతోను, నమస్కారాలతోను సూర్యుణ్ని ఆరాధించు” అని చెప్పి సూర్యలోకానికి వెళ్లిపోయింది.

తపతీ సంవరణుల వివాహం జరిపించిన వశిష్ఠుడు

సంవరణుడు మూర్ఛపోయాడు. అతడి మంత్రి వచ్చి ఉపచారాలు చేశాడు. తేరుకున్న రాజకుమారుడు అదే కొండ మీద ఉండి సూర్యుణ్ని భక్తితో ఆరాధించాడు. సంవరణుడు కోరికలు లేనివాడు, కోపము, భయము లేనివాడు, బ్రహ్మదేవుడితో సమానమైనవాడు, పాపంలేనివాడు, మహర్షుల్లో గొప్పవాడు. తన పురోహితుడైన వశిష్ఠ మహర్షిని భక్తితో తలుచుకున్నాడు.

అతడి కోరికని తెలుసుకున్న వశిష్ఠుడు సంవరణుడు తలుచుకున్న పన్నెండవరోజు ప్రశాంతమైన మనస్సుతో రాజకుమారుణ్ని చూడడానికి వచ్చాడు. వ్రతాలతోను, ఉపవాసాలతోను చిక్కి శల్యమై ఉన్న అతణ్ని చూశాడు. తన యోగదృష్టితో సూర్యుడి కుమార్తె తపతిని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాడని గ్రహించాడు.

సంవరణుడి కోరిక తీర్చాలని నిర్ణయించుకుని అప్పటికప్పుడే పదివేల ఆమడలు ప్రయాణం చేసి సూర్యలోకం చేరాడు. లోకాలకి కన్నువంటివాడు, పగటిపూటకి రాజైనవాడు, వేలకొద్దీ కిరణాలు కలిగిన సూర్యుణ్ని చూసి అనేక వేదమంత్రాలతో స్తోత్రం చేశాడు. సూర్యుడు కూడా వశిష్ఠ మహర్షిని పూజించి ఆయన వచ్చిన కారణం చెప్పమని అడిగాడు.

వశిష్ఠుడు సూర్యుడితో “గొప్పవాడు, పురూరవుడి వంశానికి పేరు తెచ్చినవాడు, భూలోకమంతా కీర్తితో ప్రకాశిస్తున్నవాడు, ధర్మార్థాలు బాగా తెలిసినవాడు, రాజకుమారుడు సంవరణుడు నీ కుమార్తెకి అన్ని విధాలా తగినవాడు. తపతిని అతడికి ఇచ్చి వివాహం చెయ్యి. కుమార్తెని మంచిగుణాలు కలిగిన వరుడికి ఇస్తేనే కదా తగిన ఫలితం ఉంటుంది” అన్నాడు.

అది విన్న సూర్యుడు “మహర్షీ! మీరు చెప్పినట్టు చంద్ర వంశాన్ని నిలిపే సంవరణుడే నా కుమార్తెకి తగిన వరుడు. నా కుమర్తెని మీతో పంపిస్తున్నాను” అని చెప్పి తపతిని వశిష్ఠుడితో పంపించాడు. వశిష్ఠ మహర్షి నిముషానికి మూడువందల అరవై నాలుగు ఆమడలు పరుగెత్తే సూర్యరథం మీద తపతిని వెంటబెట్టుకుని సంవరుణుడి దగ్గరికి వచ్చి సంవరణుడికి తపతిని ఇచ్చి శాస్త్రోక్తంగా వివాహం జరిపించాడు.

సంవరణుడు తపతిని వివాహం చేసుకున్నాక రాచకార్యాల్ని, ధర్మాల్ని వదిలిపెట్టి పన్నెండు సంవత్సరాలు తపతితో కలిసి కొండల్లోను అడవుల్లోను ఉండిపోయాడు. అందువల్ల భూమండలంలో వర్షాలు లేక కరువు ఏర్పడింది. అది తెలుసుకున్న వశిష్ఠుడు సంవరణుడికి నచ్చ చెప్పి తనతో హస్తినాపురానికి తీసుకుని వెళ్లాడు. ప్రజలందరూ తమ రాజు తిరిగి రావడం చూసి ఆనందించారు. వర్షాలుపడి కరువు కూడా తగ్గి పోయింది. తరువాత తపతికి వంశకర్త అయిన ‘కురుడు’ పుట్టాడు. మీరందరు తపతి వంశంవాళ్లు కనుక తాపత్యులయ్యారు” అని గంధర్వుడు వివరించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here