Site icon Sanchika

మహాభారత కథలు-47: రాక్షస నాశనం కోసం సత్రయాగం చేసిన పరాశరుడు

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

రాక్షస నాశనం కోసం సత్రయాగం చేసిన పరాశరుడు

[dropcap]ప[/dropcap]రాశరుడు తన కోపాన్ని తగ్గించుకున్నాక రాక్షసుల్ని నాశనం చెయ్యడానికి సత్రయాగం చెయ్యాలని అనుకున్నాడు. శక్తిమహర్షి రాక్షసుడితో చంపబడ్డాడన్న విషయాన్ని మర్చిపోయినట్టు పైకి కనిపిస్తున్నా ఆ బాధని వసిష్ఠుడు ఇంకా మర్చిపోలేదు. అందుకే పరాశరుడు రాక్షస నాశనానికి సత్రయాగం చేస్తానని చెప్పినప్పుడు వద్దని అడ్డుపెట్టలేదు. పరాశరుడు ప్రారంభించిన యాగంలో దుర్మార్గులైన రాక్షసులు భయంకరంగా హాహాకారాలు చేస్తూ పిల్లలు, ముసలివాళ్లతో సహా మండుతున్న అగ్నిజ్వాలల్లో పడిపోతున్నారు.

పరాశరుడు చేస్తున్న సత్రయాగంలో జరుగుతున్న రాక్షస నాశనాన్ని చూసి పులస్త్యుడు, పులహుడు, క్రతువు మొదలైన మహర్షులందరు వసిష్ఠాశ్రమానికి వచ్చారు. రాక్షసులందర్నీ అగ్నిలో పడేలా చేస్తూ మూడు అగ్నుల మధ్య నాలుగవ అగ్నిలా ప్రకాశిస్తున్న మహాతపస్సంపన్నుడు, వెయ్యిమంది సూర్యుల కాంతి కలిగినవాడు, శక్తి మహర్షి కొడుకు పరాశరుణ్ని చూసి రాక్షస నాశనం చెయ్యడం మానెయ్యమని చెప్పారు.

పరాశరుడు కూడా మహర్షులు చెప్పిన మాటని గౌరవించి యాగాన్ని ఆపేశాడు. తరువాత తన యాగాగ్నిని హిమాలయానికి ఉత్తరం వైపు వేసాడు. అది పర్వదినాల్లో చెట్లని, తీగల్ని, పొదల్ని, శిలల్ని భక్షిస్తూ ఉంది” అని గంధర్వుడు తపతి, వశిష్ఠుడు, ఔర్వుడు కథల్ని చెప్పాడు.

అతడు చెప్పినదంతా విని అర్జునుడు అంగారపర్ణుడితో “నువ్వు మాకు చాలా ఇష్టమైనవాడివి, అన్నీ తెలిసినవాడివి, లోకంలో జరుగుతున్న వ్యవహారాలకి తగిన వ్యక్తుల్ని తెలిసినవాడివి. ధర్మతత్వం బాగా తెలిసిన బ్రాహ్మణుడు ఎవరో.. ఎవర్ని పురోహితుడిగా పెట్టుకోమంటావో.. అతడు ఎక్కడ ఉంటాడో నువ్వే చెప్పు” అన్నాడు.

అర్జునుడు అడిగిన దానికి గంధర్వుడు కొంతసేపు ఆలోచించి “ఇక్కడికి దగ్గరగా ‘ఉత్కచం’ అనే పుణ్యతీర్థం ఉంది. అక్కడ తపస్సు చేసుకుంటున్న ధౌమ్యుడు అనే బ్రాహ్మణుణ్ని మీకు పురోహితుడుగా ఉండమని ప్రార్థించండి. ఆ మహాత్ముడు పురోహితుడుగా ఉంటే మీకు అన్ని పనులు నెరవేరుతాయి” అని చెప్పాడు.

గంధర్వుడు చెప్పింది విని సంతోషంతో అర్జునుడు తన దగ్గర ఉన్న ఆగ్నేయాస్త్రాన్ని అతడికి ఇచ్చాడు. అతడు తమకి ఇచ్చిన గుర్రాల్ని కొంతకాలం అతడి దగ్గరే ఉంచమని అవసరమైనప్పుడు తీసుకుంటామని చెప్పారు. తరువాత గంధర్వుడికి వీడ్కోలు చెప్పి గంగానదిని దాటి ఉత్కచము అనే పుణ్య తీర్థానికి వెళ్లారు పాండవులు.

ధౌమ్యుణ్ని పురోహితుడుగా స్వీకరించిన పాండవులు

ఉత్కచము అనే పుణ్య తీర్థానికి వెళ్లిన పాండవులు పాపములేనివాడు, తపోబలం కలవాడు, ప్రసిద్ధమైనవాడు, లోకంలో పవిత్రమైన చరిత్ర కలవాడు, మంచివాళ్లతో పూజింపబడేవాడు, ధార్మికుడు, మహాత్ముడు, మంచి కలిగించే మాటలు మాట్లాడేవాడు, బ్రాహ్మణవంశానికి అలంకారమైనవాడు, దేవలుడి తోబుట్టువుల్లో గొప్పవాడు అయిన ధౌమ్యుణ్ని తమకి పురోహితుడిగా పాండవులు స్వీకరించారు. ధౌమ్యుడు పాండవుల్ని ప్రేమతో పూజించి పౌరోహిత్యాన్ని స్వీకరించాడు. తేజస్సు, రూపం, బుద్ధి, గొప్పతనంలో బృహస్పతితో సమానమైన, వేదవేదాంగాలు పూర్తిగా తెలిసిన ధౌమ్యుణ్ని పురోహితుడిగా పొందిన పాండవులు భూమండలం మొత్తాన్ని పొందినంత సంతోషపడ్డారు.

ధౌమ్యుడి ఆశీర్వచనం తీసుకుని తల్లితో కలిసి దక్షిణ పాంచాలదేశానికి బయలుదేరారు. దారిలో వాళ్ల ముందు నడుస్తున్న బ్రాహ్మణుల్ని పలకరించి “ఎక్కడికి వెడుతున్నారు?” అని అడిగారు. బ్రాహ్మణులు పాండవులతో “ద్రుపదరాజు చేసిన యజ్ఞసమయంలో యజ్ఞవేదిక నుంచి కవచము, ధనుస్సు, ఖడ్గము, బాణాలు, రథము మొదలైనవాటితో మహారథుడైన ధృష్టద్యుమ్నుడు ఉద్భవించాడు. అతడితోపాటు కృష్ణ అనే పేరుతో కూతురు కూడా జన్మించింది. ఆమెని ద్రౌపది అని కూడా పిలుస్తారు. ఆమె నల్లని అందమైన దేహంతో మెరుపు తీగలా ప్రకాశిస్తూ నల్లకలువల సుగంధంతో ఉంటుంది. ఆమెకి స్వయంవరం జరుగుతోంది. ఆ ఉత్సవాన్ని చూడడానికి ద్రుపద నగరానికి వెడుతున్నాము.

ఆ ఉత్సవం చూడాలని అందమైనవాళ్లు, యవ్వనంలో ఉన్నవాళ్లు, ఎక్కువగా దక్షిణలు ఇచ్చి యజ్ఞాలు చేసినవాళ్లు, అనేక శస్త్రాస్త్రాలు తెలిసినవాళ్లు, వివిధ దేశాల రాజులు ఇప్పటికే అక్కడికి చేరిపోయారు. వాళ్లు బ్రాహ్మణులకి అంతులేని ధనం ఇస్తున్నారుట. మీరు కూడా అక్కడికి వస్తానంటే మాతో కలిసి రండి. మీలో నల్లనివాడు, ఎత్తైన భుజాలతో పొడవైన చేతులు కలిగినవాడు. ఇతణ్ని ద్రౌపది చూడగానే వరిస్తుంది” అంటూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వెడుతున్నారు.

జింకచర్మాన్ని ధరించి మధ్యాహ్న సూర్యుడికి ఉండే కాంతి వంటి కాంతితో ప్రకాశిస్తూ బ్రహ్మదేవుడితో సమానుడైన వేదవ్యాస మహర్షి పాండవులకి కనిపించాడు. ఆయనకి చేతులు జోడించి వినయంగా నమస్కారం చేసి నిలబడ్డారు. వాళ్లని ఆశీర్వదించి శుభాలు కలుగుతాయి వెళ్లిరమ్మని చెప్పి వెళ్లిపోయాడు. కొన్ని రోజులు ప్రయాణం చేసి పాండవులు ద్రుపదనగరానికి చేరుకున్నారు.

నాలుగు దిక్కుల్లోను నాలుగు సముద్రాలు ఘోషపెడుతున్నట్టు వినిపిస్తున్న కలకలంతో వివిధ దేశాలనుంచి వచ్చిన రాజుల సైన్యాలు విడిది చేసిన ప్రదేశాల్ని చూసుకుంటూ నగరంలోకి వెళ్లారు. అక్కడ ఒక కుమ్మరి ఇంట్లో విడిది చేశారు. ఎవరూ గుర్తించ కూడదని బ్రాహ్మణ వేషాల్లోనే ఉండిపోయారు.

ద్రౌపదీస్వయంవరము

స్వయంవరానికి వచ్చిన రాజకుమారులు

పాంచాలరాజు తన కుమార్తెని అర్జునుడికి ఇవ్వాలని అనుకుని, పాండవుల కోసం వెతికించి ఎక్కడా కనిపించక చివరికి స్వయంవరం ప్రకటించాడు. ఆకాశంలో కట్టిన మత్స్యయంత్రాన్ని అక్కడే పెట్టిన విల్లుని ఎక్కుపెట్టి అయిదు బాణలతో ఎవరు పడగొట్టగలరో అతడికి తన కుమార్తెని ఇచ్చి వివాహం జరిపిస్తాను అని చాటింపు వేయించాడు. ఆ చాటింపు విని రాజులందరూ ఎంతో సంతోషంగా ఆభరణాలు ధరించి, పైపూతలు పూసుకుని, మంచి బట్టలు కట్టుకుని, తమ తమ ధ్వజాల మీద ఐశ్వర్య చిహ్నాలు స్పష్టంగా కనబడేలా చేసుకుని వెడుతున్నారు.

సైన్యాల కాళ్ల తాకిడికి భూమండలం మొత్తం కంపిస్తోంది. ఒకళ్ల కంటే ఒకళ్లు ముందుగా వెళ్లాలని కంగారు పడుతూ ఇష్టంగా ద్రౌపదీ స్వయంవర మండపానికి చేరుకుంటున్నారు. ద్రౌపదీ స్వయంవర రంగం నగరానికి ఈశాన్య దిక్కులో మంచిగంధం నీళ్లతో తడిపి, చదరంగా చెయ్యబడిన స్థలంలో, లోతైన అగడ్తలతో, ఎత్తైన ప్రాకారాలతో, విశాలమైన ద్వారాలు కలిగిన వెలుపలి వాకిళ్లతో, కైలాస నగారానికంటే ఎక్కువ ప్రకాశంతో, ఆకాశాన్నంటే శిఖరాలతో, అందమైన భవనాలు కలిగిన ప్రదేశాలతో, అనేక రకాల మంచెలతో అలంకరించబడింది.

అందులో వివిధ దేశాల రాజులకి ఎవరికి తగినట్టు వాళ్లకి విడిది కల్పించారు. ద్రుపదుడు వాళ్లందరినీ గౌరవించాడు. ఉత్తములైన బ్రాహ్మణులతో కలిసి ఉన్న పాండవులు బ్రాహ్మణ సమూహంతో ఉంటూనే పాంచాలరాజు ఐశ్వర్యాన్ని సంతోషంగా చూస్తున్నారు. పాంచాలరాజు కుమార్తె ద్రౌపది అందమైన సన్నని నడుము, తెల్లని కళ్లు కలిగి, తెల్లటి ఆభరణాలు అలంకరించుకుని, పూదండతో, మైపూతతో, నిర్మలమైన శరీర కాంతితో, చేతిలో తెల్లటి పూదండ పట్టుకుని అందరూ తన్మయత్వంతో చూస్తుండగా స్వయంవర రంగం మధ్యలో నిలబడింది.

బ్రాహ్మణుల పుణ్యాహధ్వని, ఆశీర్వచనాలు మారుమోగాయి. ద్రుపద పురోహితుడు అగ్ని చుట్టూ దర్భలు పేర్చి హోమాన్ని ప్రారంభం చేసి వివాహానికి తగిన వస్తువులతో హోమం చేయించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ సమయంలో ప్రజల్ని మాట్లాడ వద్దని, వాద్య ధ్వనిని కూడా తగ్గించమని ద్రుపదమహారాజు కొడుకు ధృష్టద్యుమ్నుడు అక్కడ కూర్చున్న రాజ సమూహానికి మొదట అగ్నిహోత్రం దగ్గర గంధం, పుష్పాలు, ధూపం, దీపాలతో పూజించి ఉంచిన ధనుస్సుని, బాణాల్ని, ఆకాశంలో ఉన్న మత్స్య యంత్రాన్ని చూపించాడు.

తరువాత “ఈ విల్లుని ఎక్కుపెట్టి ఐదు బాణాలతో యంత్రంలో ఉన్న చేపని కొట్టినవాడు ఈ కన్యకి భర్త అవుతాడు. ఈ మత్స్య యంత్రం ముని శక్తితో పొందిన విద్య. ఇప్పుడు మీలో ఎవరైనా సరే ప్రయత్నించవచ్చు. విలువిద్యలో సామర్థ్యం, గొప్ప బలం, కీర్తి కలవాళ్లు ప్రయత్నించి ద్రుపదరాజ పుత్రిక కృష్ణని భార్యగా పొందడానికి ఇదే సరైన సమయం” అని అక్కడున్న రాజకుమారులందరికీ చెప్పాడు ధృష్టద్యుమ్నుడు.

తరువాత ద్రౌపదిని చూసి “ ద్రౌపదీ! భూమండలంలో ఉన్న రాజకుమారులు అందరూ నీ స్వయంవరానికి వచ్చారు. వరుసగా అందరినీ చూడు. వీళ్లు దుర్యోధనుడు, దుశ్శాసనుడు మొదలైన ధృతరాష్ట్రుడి కుమారులు నూరుగురు. ఆ సమీపంలో ఉన్నవాళ్లు కర్ణుడు, అశ్వత్థామ, సోమదత్తుడు, భూరిశ్రవుడు, శ్రుతసేనుడు మొదలైనవాళ్లు. వీళ్లు కొడుకులతో కూతుళ్లతో ఉన్న శల్య, విరాట, జరాసంధ, గాంధార రాజులు. అక్రూరుడు, సారణుడు, సాత్యకి, సాంబ, సంకర్షణ, ప్రద్యుమ్న, కృష్ణ, కృతవర్మ, అనిరుద్ధ, యుయుధాన మొదలైన యదు, వృష్ణి, భోజ, అంధక, వంశాల్లో గొప్పవాళ్లు.

వీళ్లు సుమిత్ర, సుకుమార, సుశర్మ, సుదక్షిణ, సుషేణ, సేనాబిందు, చంద్రసేన, సముద్రసేన, ఔశీనర, చేకితాన, శిశుపాల మొదలైవాళ్లు. జనమేజయ, జయద్రథ, బృహద్రథ, సత్యవ్రత, చిత్రాంగద, శుభాంగద, భగీరథ, భగదత్త, పౌండ్రక వాసుదేవ, వత్సరాజ మొదలైన వివిధ దేశాల రాజులు” అని ఒక్కొక్కరిగా అందర్నీ చూపించి వివరంగా చెప్తూ వేదధ్వనితో ప్రకాశిస్తున్న బ్రాహ్మణ సమూహాన్ని కూడా చూపించాడు.

మత్స్యయంత్రాన్ని భేదించబోయి భంగపడ్డ రాజపుత్రులు

ధృష్టద్యుమ్నుడు పేరుపేరునా స్వయంవరానికి వచ్చిన వాళ్లందరినీ చూపించడం పుర్తయ్యాక. “ద్రౌపదీ! వీళ్లల్లో మత్స్యయంత్రాన్ని పడగొట్టినవాణ్ని ప్రేమతో వరించు” అని చెప్పాడు.

తరువాత రాజకుమారులు అందరు విల్లు ఎక్కుపెట్టి మత్స్యయంత్రాన్ని పడగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. దేవతలు, ఆకాశంలో సంచరించేవాళ్లు, గరుడులు, గంధర్వులు, కిన్నరలు ద్రౌపదీ స్వయంవర మహోత్సవాన్ని చూడాలని వచ్చి తమ విమానాల్లో ఆకాశంలో నిలిచి చూస్తున్నారు.

మద్దెలలు, వీణలు, పిల్లనగ్రోవుల మధురమైన ధ్వనితో కలిసిన సంగీతం అన్ని వైపులా వ్యాపించింది. అన్ని వాద్యాల ధ్వనుల హోరు ఒక్కటిగా కలిసి సముద్రపు హోరులా వినిపించింది. పూలదండలు, గంధపు వాసలతో కలిసి వీస్తున్న గాలి స్వయంవర రంగం మధ్యలో కూర్చున్న వాళ్లకి సుఖాన్ని కలిగిస్తోంది.

పోగుగా ఉన్న బూడిద మధ్య మిగిలిపోయిన నిప్పుకణాలు కనిపించినట్టు బ్రాహ్మణుల గుంపులో కూర్చున్న పాండవులు అయిదుగురూ స్పష్టంగా ప్రకాశిస్తూ కనిపిస్తున్నారు. యాదవులకి రాజైన శ్రీకృష్ణుడు పాండవుల్ని గుర్తించి సంతోషపడ్డాడు. అర్జునుడు తప్పకుండా ఈ స్వయంవరంలో ద్రౌపదిని వరిస్తాడని అనుకున్నాడు. రాజకుమారులు తమకి ఉన్న పరాక్రమం ఎంతో తెలుసుకోలేక ఒక్కొక్కరే వెళ్లి విల్లు ఎక్కుపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. పెదవిని పళ్లతో బిగపెట్టి, కుడిచేతిని చాచి, వింటికొప్పుని పట్టుకుని వింటిని వంచలేక తమ బలం బయటపడిందన్న సిగ్గుతో ప్రయత్నాన్ని విరమించుకుని నెమ్మదిగా వెళ్లిపోతున్నారు. అలా వెళ్లిపోతున్న వాళ్లని చూసి కొంతమంది అసలు వింటి వరకు వెళ్లనేలేదు.

అసలు ద్రౌపదికి వరుడే దొరకడు. విల్లు ఎక్కుపెట్టడమే కష్టంగా ఉంటే ఆకాశంలో కట్టిన మత్స్యయంత్రాన్ని భేదించడం ఎవరి వల్ల అవుతుంది. అమెను పుట్టించిన బ్రహ్మ వల్ల కూడా సాధ్యపడదు అనుకుని మరి కొంతమంది రాజులు వెనక్కి తిరిగి తమ రాజ్యానికి వెళ్లిపోయారు.

మత్స్యయంత్రాన్ని భేదించిన అర్జునుడు

రాజకుమారులు ఒక్కొక్కళ్లుగా వెనక్కి తిరిగి వెళ్లిపోతున్నారు. యదు, వృష్టి, భోజ అంధక రాజులు శ్రీకృష్ణుడు చెప్పడం వల్ల అసలు ప్రయత్నమే చెయ్యలేదు. శిశుపాల, జరాసంధ, శల్య, కర్ణులు విల్లు తీసి అల్లెత్రాటిని ఎక్కించినా ధనుస్సుని ఎక్కుపెట్టే బలం లేక వెనక్కి తిరిగి వెళ్లిపోయారు.

అర్జునుడు తన అన్న ధర్మరాజు అనుమతి తీసుకుని బ్రాహ్మణ సమూహం నుంచి ధనుస్సు వైపు వెళ్లాడు. అతడి ఉత్సాహం చూసి కొంతమంది బ్రాహ్మణులు “పొడవైన, దృఢమైన బాహువులు, బలపరాక్రమాలు కలిగిన రాజకుమారులు ఈ విల్లుని ఎక్కుపెట్టలేక పోయారు. ఇతడు తన బలం గురించి తెలుసుకోలేక అవివేకంతో వెడుతున్నాడు. తప్పకుండా బ్రాహ్మణుల పరువు తీసే తీరతాడని” అనుకున్నారు. మరికొంతమంది “ఇతడు బలవంతుడే అయి ఉంటాడు. అంత చాతకాని వాడైతే అంతా చూస్తూ కూడా ఎందుకు బయలుదేరుతాడు. సామాన్యుడైతే కదలకుండా మనం కూర్చున్నట్టే కూర్చునేవాడు కదా!” అనుకున్నారు.

ఈ బ్రాహ్మణుడు అంతులేని ఉత్సాహంతో పొడవైన, బలమైన బాహువులు, గొప్ప తేజస్సు, వినయము, మంచితనము, మంచి నడవడిక, బ్రాహ్మణుల యందు భక్తి కలవాడుగా కనిపిస్తున్నాడు. బ్రాహ్మణుల అందరి ఆశీస్సులతో పని సాధించుకుని వచ్చి మన గౌరవం పెంచుతాడు అంటూ వెడుతున్న అర్జునుడి వైపు ప్రేమ, అభిమానం, ఆత్మీయతలతో చూస్తున్నారు.

అర్జునుడు ఉత్సాహంగా ధనుస్సు దగ్గరికి వచ్చాడు. మనస్సులో గురువులకి నమస్కారం చేసుకున్నాడు. ధనుస్సుకి ప్రదక్షిణ నమస్కారాలు చేసాడు. తనకు అలవాటైన ధనుస్సుని సంధించినట్టు సంధించి అయిదు బాణాలతో మత్స్యయంత్రాన్ని పడగొట్టాడు. క్షత్రియకుమారులు, బ్రాహ్మణులు కూడా ఆశ్చర్యపోయారు.

బ్రాహ్మణులు పండ్లు, గాలి, నీరు భోంచేసి, పుణ్యవ్రతాలు చేస్తూ ఉంటారు కనుక, చూడానికి బలహీనులుగా కనిపించినా తపస్సు అనే సంపద చేత బలవంతులు. సకల చరాచర ప్రపంచంలో సద్బ్రాహ్మణులకి సాధ్యం కానిది ఏమీ ఉండదని అనుకున్నారు. ఒక్క క్షణంలోనే మత్స్యయంత్రాన్ని పడగొట్టడం సాధ్యమయ్యే పనేనా. అసలు ఇతడు దేవేంద్రుడో, శివుడో, సూర్యుడో, కుమారస్వామో అంటూ అక్కడ ఉన్న ప్రజలందరూ పొగుడుతున్నారు. ఆకాశంలో దేవతల భేరీధ్వనులు మ్రోగుతున్నాయి. బ్రాహ్మణోత్తములు తమ ఉత్తరీయాల్ని ఎగరేస్తూ కేకలు వేస్తున్నారు. అర్జునుడి మీద పూలవాన కురిసింది.

ఆ సమయంలో ధర్మరాజు నకులసహదేవులతో కలిసి ఇంటికి వెళ్లిపోయాడు. ద్రుపదుడు అతడి కుమారుడు ధృష్టద్యుమ్నుడు అర్జునుడి దగ్గరికి వెళ్లారు.

అర్జునుణ్ని వరించిన ద్రౌపది

రాజకుమారులందరు చూస్తుండగా తామర రేకుల్లాంటి అందమైన కళ్లు గల ద్రౌపది నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి దేవేంద్రుడితో సమానుడు, ఇంద్రనీలం వంటి శరీరకాంతి, అందమైన రూపంతో ప్రకాశిస్తున్న అర్జునుణ్ని తన చేతిలో ఉన్న తెల్లని పూదండతో వరించింది. ఆ ఉత్సవాన్ని చూసి ఓర్వలేక దుర్యోధనుడు మొదలైన రాజులు కోపగించారు. “ఈ మాత్రానికి రాజుల్ని ఎందుకు రప్పించాడు? చుట్టాలకి చేసినట్టు అందరి ముందు సన్మానాలు ఎందుకు చేశాడు? ఇంతమంది గొప్ప వీరులు ఇక్కడ ఉండగా కూతుర్ని ఒక బ్రాహ్మణుడికి ఎందుకిచ్చాడు? ద్రుపదుడు మోసగాడు. ఇప్పుడే యుద్ధం చేసి అతడి గర్వాన్ని అణిచేద్దాం” అన్నాడు.

“ఈ బ్రాహ్మణుడు ధనుర్విద్యలో పండితుడు కనుకనే ద్రౌపదిని పొందగలిగాడు. అందులో బ్రాహ్మణుడి తప్పు ఏదీ లేదు. ఏ తప్పు చేసినా బ్రాహ్మణుణ్ని చంపకూడదు. మన రాజ్యం, సంపద కూడా బ్రాహ్మణుల కోసమే కనుక ఈ బ్రాహ్మణుడితో మనకు పనిలేదు. ఈ ద్రుపదుడి పని పడదాం” అని రాజులందరూ ద్రుపదుడి మీదకి దండెత్తారు.

ద్రుపదుడు భయపడి బ్రాహ్మణుల వెనక్కి వెళ్లి దాక్కున్నాడు. భయపడద్దని ద్రుపదుడికి చెప్పి బ్రాహ్మణులు తమ చేతిలో ఉన్న దండాలు, జింకచర్మాలు రాజుల మీదకి విసురుతున్నారు. అర్జునుడు చిరునవ్వుతో వాళ్లని ఆపి, “నా దగ్గరున్న మంత్రాలతో కూడిన అస్త్రాలతో వీళ్ల పని పడతాను. మీరందరు దూరంగా ఉండి చూడండి” అని బ్రాహ్మణులందరిని పక్కన నిలబెట్టాడు.

Exit mobile version