Site icon Sanchika

మహాభారత కథలు-48: కర్ణుడితో యుద్ధం చేసి గెలిచిన అర్జునుడు

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

కర్ణుడితో యుద్ధం చేసి గెలిచిన అర్జునుడు

[dropcap]అ[/dropcap]ర్జునుడు బ్రాహ్మణులందరిని ఆపి రాజుల మీద యుద్ధం ప్రకటించి శత్రువుల మీద అనేక బాణాలు వేశాడు. భీముడు ఒక పెద్ద చెట్టుని తీసుకుని దండాయుధాన్ని ధరించిన యముడిలా అర్జునిడికి సహాయంగా వెళ్లాడు. వాళ్లిద్దరూ విజృంభించడం చూసిన శ్రీకృష్ణుడు బలరాముడితో “తాటిచెట్టులా ఉన్న పెద్ద విల్లు ధరించి శత్రువుల్ని తరుముతున్నవాడు అర్జునుడు, అతడి పక్కనే పెద్ద చెట్టు పట్టుకుని ఉన్నవీరుడు భీముడు. అర్జునుడు మత్స్యయంత్రాన్ని కొట్టగానే సభలోంచి లేచి వెళ్లిపోయిన గోధుమరంగులో ఉన్నవాడు ధర్మరాజు. అతడి వెంట వెళ్లిన సూర్యుడితో సమానమైన తేజస్సు కలవాళ్లు ఇద్దరూ నకుల సహదేవులు” అన్నాడు.

అది విని బలరాముడు “లక్క ఇంటిలో కాలి దహనమయ్యారని అనుకున్నాం. వాళ్లు అయిదుగురు బ్రతికే ఉన్నారా? వాళ్లని చూడగలిగినందుకు ఈరోజు నిజంగా మంచిరోజు” అన్నాడు సంతోషంగా.

కౌరవరాజు దుర్యోధనుడు చూస్తుండగా అర్జునుడు కర్ణుణ్ని ఎదుర్కున్నాడు. వెంటనే వేగంగా శల్యుడు భీముణ్ని ఎదుర్కున్నాడు. అది చూసిన ప్రజలు, బ్రాహ్మణులు, దేవతలు ఆశ్చర్యపోయారు. కర్ణార్జునులు భయంకరంగా పోరాడుతున్నారు. వాళ్లు వదిలిన బాణాలతో భూమి ఆకాశం నిండిపోయాయి. దిక్కులు పగిలి పోయాయి. వీరుడైన అర్జునుడు వేస్తున్న బాణాలని అడ్డుకోలేక కర్ణుడు అర్జునుడితో “నా ఎదుట నిలబడి యుద్ధం చెయ్యడం పరశురాముడికి, ఇంద్రుడికి, అర్జునుడికి మాత్రమే సాధ్యమవుతుంది. బ్రాహ్మణుడవైనా నీకు విలువిద్యలో గొప్ప ప్రావీణ్యత ఉంది. నీ నైపుణ్యానికి చాలా సంతోషంగా ఉంది” అన్నాడు.

కర్ణుడి మాటలు విని అర్జునుడు “నువ్వు చెప్పిన వాళ్లల్లో నేను ఎవరినీ కాదు. కాని, శస్త్రాస్త్ర విద్యల్లో ఆరితేరినవాడిని. లోకం చెప్పడం వల్ల బ్రహ్మతేజస్సుతో గొప్పవాడిని. నిన్ను యుద్ధంలో ఓడించడానికి సిద్ధంగా ఉన్న వీరుడిని. మాటలెందుకు? నిలబడి నాతో యుద్ధం చెయ్యి” అన్నాడు.

అది విని కర్ణుడు బ్రాహ్మణ తేజస్సుని జయించడం కష్టమని తెలుసుకుని యుద్ధాన్ని ఆపి వెళ్లిపోయాడు. శల్యుడు, భీముడు మల్లయుద్ధంలోకి దిగారు. భీముడు శల్యుణ్ని పట్టుకుని పడేశాడు. శల్యుడు నేల మీద నుంచి లేచి శరీరాన్ని దులుపుకుని వెళ్లిపోయాడు. బ్రాహ్మణులందరూ శల్యుడి వైపు చూసి నవ్వుతూ భీముణ్ని ప్రశంసించారు. పరశురాముడు, ఇంద్రుడు, అర్జునుడు తప్ప ఇతరులు ఎవరూ కర్ణుణ్ని ఓడించలేరు. భీముడు, బలరాముడు తప్ప ఇతరులు శల్యుణ్ని ఓడించలేరు. అసలు వీళ్లు ఎవరో ఎక్కడ ఉంటారో తెలుసుకోవాలి అని దుర్యోధనుడు మొదలైన రాజకుమారులు అనుకుంటున్నారు.

వాళ్లని చూసి శ్రీకృష్ణుడు “ఎవరికీ సాధ్యం కాని గొప్పపని చేసిన ఈ బ్రాహ్మణుడు స్వయంవరంలో ద్రౌపదిని ధర్మమార్గంలో భార్యగా పొందాడు. ఈ పరాక్రమవంతుణ్ని జయించడం ఎవరికీ సాధ్యం కాదు. వాళ్లు ఎవరో తెలుసుకునే ప్రయత్నాన్ని వదిలిపెట్టండి” అని రాజకుమారులకి నచ్చ చెప్పాడు. భీమార్జునులు బ్రాహ్మణులందరితో కలిసి ద్రౌపదిని తీసుకుని బయలుదేరారు.

కుంతీదేవి “కొడుకులందరూ స్వయంవరాన్ని చూడ్డానికి వెళ్లి చాలా సేపయింది. ఇంకా రాలేదు. ఎక్కడ ఉన్నారో.. ఎందుకు ఆలస్యమైందో.. ఎప్పుడూ శత్రుత్వంతోనే ఉండే దుర్మార్గులైన కౌరవులు ఆ హడావిడిలో ఏదైనా అపకారం చేసారేమో.. బ్రహ్మ సమానుడైన వేదవ్యాస మహర్షి అబద్ధం చెప్పి ఉంటాడా? దేవతలారా! బ్రాహ్మణోత్తములారా! నా కొడుకులు వెంటనే నా దగ్గరికి వచ్చేట్టు చెయ్యండి” అని అందర్నీ ప్రార్థిస్తూ బాధ పడుతోంది.

ద్రౌపదిని తెచ్చి కుంతికి ఇచ్చిన అర్జునుడు

బాధ పడుతున్న తల్లి దగ్గరికి ధర్మరాజు నకుల సహదేవులు ముందుగా వచ్చారు. తరువాత కొంత సేపటికి భీమార్జునులు ద్రౌపదిని కూడా తీసుకుని వచ్చి “అమ్మా! మేము ఒక భీక్ష తీసుకుని వచ్చాము” అన్నారు. ఆమె భిక్ష ఏమిటో అడక్కుండానే అందరూ తిరిగి వచ్చినందుకు సంతోషించి ఎప్పట్లాగే “ఆ భిక్షని మీ అయిదుగురూ తీసుకోండి” అంది.

అంతలోనే రాజ్యలక్ష్మిలా ఉన్న ద్రౌపదిని చూసి అధర్మంగా మాట్లాడినందుకు సిగ్గుపడి ధర్మరాజుతో “ధర్మరాజా! ఈ కన్యని తీసుకుని వచ్చి నీ తమ్ముళ్లు ఇద్దరూ సంతోషంగా వచ్చి ఈ భిక్షని తీసుకోమని చెప్పినప్పుడు మీ అయిదుగురు ఉపయోగించుకోండి అన్నాను. ఇంతవరకు నేను చెప్పిన విధంగానే జరుగుతోంది. మీరు ఎప్పుడూ నా మాట కాదనలేదు. కాని, ఇది లోకవిరుద్ధం!” అని చెప్పి బాధ పడుతోంది.

ధర్మరాజు తల్లిని ఓదార్చి “అర్జునా! స్వయంవరంలో గెలిచి తెచ్చుకున్న ఈమెని నువ్వే అగ్నిసాక్షిగా వివాహం చేసుకో!” అన్నాడు. అది విని అర్జునుడు “పెద్దవాడు ఉండగా చిన్నవాడు పెళ్లిచేసుకోవడం ధర్మ విరుద్ధం! అందుకని నువ్వే ఈమెని పెద్ద భార్యగా స్వీకరించు. ఇది మా నలుగురికీ సమ్మతమే” అన్నారు.

కాని విధివశాత్తూ అయిదుగురికీ ద్రౌపదిని పెళ్లి చేసుకోవాలన్న కోరిక కలిగింది. ద్రౌపదికి కూడా పాండవులు అయిదుగురికీ భార్యగా ఉండాలన్న కోరిక కలిగింది. విషయాన్ని అర్థం చేసుకున్న ధర్మరాజు వేదవ్యాసుడి మాటలు తల్చుకుని తన తమ్ముళ్లతో “పెద్దలు చెప్పిన మాట ప్రకారం ద్రౌపది మన అయిదుగురికీ భార్య అవడం ధర్మమే. ఇంక ఆలోచించకుండా ఈమెని మనం అయిదుగురం వివాహం చేసుకుందాము” అన్నాడు.

పాండవుల దగ్గరికి వచ్చిన శ్రీకృష్ణబలరాములు

గొప్ప కీర్తి కలిగిన బలరామకృష్ణులు వచ్చి అజామీఢుని వంశంలో పుట్టినవాడు, శత్రువులు లేనివాడు, రాజులతో సేవించతగ్గవాడు, గొప్ప గుణాలు కలవాడు, మేనత్త కొడుకు, బాలసూర్యుడితో సమానమైన తేజస్సు కలవాడు నలుగురి తమ్ముళ్ల మధ్యలో కూర్చుని ఉన్నవాడు, కుంతీదేవికి పెద్ద కొడుకు అయిన ధర్మరాజుని చూశారు. తమని తాము పరిచయం చేసుకుని ధర్మరాజుకి కుంతీదేవికి నమస్కారం చేశారు. భీమార్జున నకులసహదేవుల్ని కౌగలించుకున్నారు.

ధర్మరాజు సంతోషంతో వాళ్లని కుశలప్రశ్నలు అడిగి “కృష్ణా! మేము విరోధంతో కౌరవులకి దూరమై మమ్మల్ని ఎవరూ గుర్తించకుండా ఉండాలని బ్రాహ్మణ వేషాలు ధరించి ఇలా మారుమూల జీవిస్తున్నాం. మమ్మల్ని మీరు ఎలా తెలుసుకో గలిగారు?” అని అడిగాడు.

శ్రీకృష్ణుడు నవ్వుతూ “సూర్యుణ్ని మేఘాలు ఎంత కప్పినా అతడి తేజస్సుని లోకంలో ఉన్న జనాలకి కనిపించకుండా ఆపగలవా? అలాగే మీరు రహస్యంగా మారు వేషంలో ఉన్నా, అడ్డగించడానికి శక్యంకాని మీ తేజస్సు లోకంలో ఉన్న ప్రజలకి తెలిసినదే. దాన్ని కనపడకుండ ఎవరూ చెయ్యలేరు. ఎంతోమంది రాజులు చెయ్యలేని ఇటువంటి అద్భుతమైన పనిని ఒక్క అర్జునుడే చెయ్యగలడు. మీ పరాక్రమమే మిమ్మల్ని తెలుసుకోడానికి సహాయపడింది. ధర్మం తప్పిన ధృతరాష్ట్ర దుర్యోధనులు చేసిన లక్షాగృహ దహనం నుంచి తప్పించుకున్నారు. ఇంక మీకు అంతా మంచే జరుగుతుంది” అని చెప్పి బలరామ కృష్ణులు వెళ్లిపోయారు.

పాండవుల దగ్గరికి వచ్చిన ధృష్టద్యుమ్నుడు

ద్రుపదుడు ధృష్టద్యుమ్నుడితో “స్వయంవరంలో ద్రౌపదిని వరించినవాడు ఏ వంశానికి చెందినవాడో.. అతడి చరిత్ర ఏమిటో.. అసలు అతడెవరో కనుక్కునిరా!” అని చెప్పి పంపించాడు.

ద్రౌపదిని తీసుకుని భీమార్జునులు బయలుదేరాక ధృష్టద్యుమ్నుడు వాళ్ల వెనకే వెళ్లి ఎవరూ చూడకుండా కుమ్మరి ఇంట్లో ఉండి వాళ్లు మాట్లాడుకున్నది విని వెళ్లాడు. ద్రుపదుడితో “తండ్రీ! ఆ ఇద్దరూ ద్రౌపదిని తీసుకుని వెళ్లి ఒక ముసలి అవ్వకి నమస్కారం చేశారు. ద్రౌపదిచేత కూడా మొక్కించారు. మొదటివాడు చెప్పినట్టు మిగిలిన నలుగురూ వాళ్లు తెచ్చిన భిక్షని అవ్వకి ఇచ్చారు.

ఆమె ద్రౌపదిని ప్రేమగా పిలిచి “ఈ భిక్షలో కొంత బలివిధానాలకి, కొంత బ్రాహ్మణాతిథులకి, కొంత అన్నం కోసం వచ్చే బాటసారులకి వేరుగా ఉంచు. మిగిలినదాన్ని రెండు భాగాలుగా చెయ్యి. అందులో ఒక భాగం విశలమైన వక్షస్థలం, సన్నని పొట్ట, దృఢమైన శరీరం ఉన్న ఇతడికి పెట్టు. అతడు పదివేల ఏనుగుల బలం కలవాడు. రెండవభాగం మిగిలిన నలుగురికీ పెట్టు. వాళ్లు తిన్నాక మిగిలినది మనమిద్దరం తిందాము” అని చెప్పింది. ద్రౌపది ఆమె చెప్పినట్టే అందరికీ పెట్టి తను కూడా తింది.

దర్భగడ్డిపోచలు విదిలించి పక్క వేసి వాటి మీద జింకచర్మం పరిచింది. వాళ్లు పడుకున్నాక వాళ్ల కాళ్ల భాగం వైపు పడుక్కుంది. భిక్ష అడిగి తీసుకుని వచ్చిన అన్నం, దర్భగడ్డి పరుపుల్ని ద్రౌపది అసహ్యించుకోలేదు. పుట్టుకతోనే ధనికురాలైన ద్రౌపది చాలా సంతోషంగా అనుభవిస్తోంది. జింకచర్మాలు, దండాలు, చినిగిన గుడ్డలే వాళ్లకి ధనాలు. వాటిని చూసిన ద్రౌపది తన జీవితాన్ని తలుచుకుని ఏడవలేదు, అసహ్యించుకోలేదు.

తరువాత ఆ అయిదుగురు రథాలు, ఏనుగులు, గుర్రాలకి సంబంధించిన విషయాల్ని, మహాయుద్ధ వ్యూహాల్ని భేదించే ఉపాయాల్లో సున్నితమైన పద్ధతుల్ని, ఆయుధాలు రహస్యంగా ప్రయోగించడాన్ని గురించి మాట్లాడుకున్నారు. వాళ్ల మాటలు వింటుంటే వాళ్లు గొప్ప రాజవంశానికి చెందిన వాళ్లులా ఉన్నారు. ప్రవర్తన చూస్తుంటే బ్రాహ్మణ వంశస్థుల్లా ఉన్నారు. వాళ్లెవరో తెలుసుకోవడం చాలా కష్టం. సందేహం లేకుండా క్షత్రియులో, బ్రాహ్మణులో అయి ఉంటారు తప్ప వైశ్య, శూద్ర, హీన జాతులవాళ్లు మాత్రం కాదు” అని చెప్పాడు.

ధృష్టద్యుమ్నుడు చెప్పిన మాటలు విని ద్రుపదుడు వాళ్ల గురించిన వివరాలు మొత్తం తెలుసుకుని రమ్మని తమ పురోహితుణ్ని పాండవుల దగ్గరికి పంపించాడు. ఆ పురోహితుడు బ్రాహ్మణ సమూహంతో కలిసి పాండవుల దగ్గరికి వచ్చాడు. భీమసేనుణ్ని పిలిచి ధర్మరాజు వాళ్లకి అర్ఘ్యపాద్యాలు ఇప్పించి పూజించాడు. తరువాత పురోహితుడు ధర్మరాజుతో “ద్రుపదమహారాజు మీ కుల గోత్రాలు, పేర్లు తెలుసుకుని రమ్మని నన్ను పంపించారు. ఎవరూ భేదించలేని మత్స్యయంత్రాన్ని పడగొట్టిన ఆ మహావీరుణ్ని చూడాలని మారాజు అనుకుంటున్నాడు” అని చెప్పాడు.

పురోహితుడి మాటలు విని ధర్మరాజు “మత్స్యయంత్రాన్ని పడగొట్టిన వీరుడు ద్రౌపదికి భర్త అవుతాడు” అని మీ ద్రుపదమహారాజు చెప్పాడు. ఆయన చెప్పినట్టే ఈ వీరుడు మత్స్యయంత్రాన్ని పడగొట్టి రాజులందరి సమక్షంలోనే ద్రౌపదిని తెచ్చుకుని వచ్చాడు. ఇప్పుడు మీ రాజు ఆ వీరుడు ఎవరో తెలుసుకుని ఏం చేస్తాడు? ఆ విల్లుని ఎక్కుపెట్టి లాగడం బలహీనుడి వల్ల కాదు. కులహీనుడికీ అస్త్రవిద్య నేర్చుకోనివాడికీ లక్ష్యాన్ని అంత సులభంగా కొట్టడం చేతకాదు కదా? మీ రాజు అనుకున్నట్టు చక్కగా జరిగింది. ఇంక మీ రాజుకు ఇతర ఆలోచనలు అవసరం లేదు” అన్నాడు పురోహితుడితో.

ద్రుపదమహారాజు ఇంటికి వెళ్లిన పాండవులు

పురోహితుడు ధర్మరాజు చెప్పిన మాటలన్నీ ద్రుపదమహారాజుకి చెప్పాడు. ద్రుపదుడు ధృష్టద్యుమ్నుణ్ని చూసి నాలుగు జాతులవాళ్లకి తగిన నాలుగు రథాల్ని తీసుకుని వెళ్లి వాళ్లని తీసుకుని రమ్మన్నాడు. వెంటనే ధృష్టద్యుమ్నుడు బయలుదేరి వెళ్లి పాండవుల్ని పిలిచి “ఈ రథాలెక్కి రమ్మని మా రాజు పంపించాడు బయలుదేరి మా రాజ్యానికి రండి!” అని చెప్పాడు.

పాండవులు రాజులకి తగిన బంగారు రథాలు ఎక్కి కుంతీదేవిని, ద్రౌపదిని ఒక రథం మీద కూర్చోబెట్టి ధృష్టద్యుమ్నుడి వెంట ద్రుపదమహారాజు దగ్గరికి వెళ్లారు. ద్రుపదమహారాజు వచ్చిన వాళ్లకి అనేక విధాలైన వస్తువులు పంపించాడు. వాళ్లు అన్ని వస్తువులు తీసుకోకుండా యుద్ధసంబంధమైన కత్తులు, డాలులు, ధనస్సులు, బాణాలు, అమ్ముల పొదులు, రథాలు, రథాలమీద ఉండే కప్పులు, గుర్రాలు, ఏనుగులు మొదలైన సామాను మాత్రమే తీసుకున్నారు.

తరువాత తన దగ్గరికి వస్తున్న జింకచర్మాన్ని ఉత్తరీయంగా ధరించి గొప్పదైన బ్రహ్మతేజస్సుతో, ఉదయించిన సూర్యుడితో సమానమైన కాంతితో, మోకాళ్లవరకు వ్రేలాడే బలిష్టమైన చేతులతో, చాలా ఎత్తైన భుజాలతో, అతి విశాలమైన వక్షస్థలంతో, వ్యాయామంతో గట్టిపడిన అవయవాలతో, ఆబోతుకు ఉండే కళ్లవంటి కళ్లతో ఉన్న భరతవంశరాజులు, గొప్పవాళ్లు అయిన పాండవుల్ని చూసి వాళ్లు బ్రాహ్మణులు కాదని ఉత్తమ క్షత్రియ కులంలో పుట్టారని తెలుసుకున్నాడు.

కొడుకులు, తమ్ముళ్లు, మిత్రులు, మంత్రులు, బంధువులు, గొప్ప పండితులైన బ్రాహ్మణులతో కలిసి ఉన్న ద్రుపదుడు ఎదురు వెళ్లి వాళ్లని చూసి చాలా సంతోషించాడు. తన దగ్గరికి వచ్చి భయం లేకుండ క్షత్రియులు కూర్చునే గొప్ప ఆసనాల మీద కూర్చున్న బ్రాహ్మణ వేషంలో ఉన్న పాండవుల్ని రాజకుమారులే అని తెలుసుకున్నాడు. అయినా తనకి కలిగిన సందేహాన్ని తీర్చుకోడానికి ద్రుపదుడు ధర్మరాజుతో “అయ్యా! మీరు క్షత్రియులో, బ్రాహ్మణులో, మాయవేషంలో తిరుగుతున్న మంత్రసిద్ధులో, ద్రౌపదిని పెళ్లి చేసుకోవాలనే కోరికతో దేవలోకం నుంచి వచ్చిన దేవతలో తెలియట్లేదు. మీ అసలు స్వరూపం తెలిస్తే ఆ పద్ధతిలో మా కుమార్తె ద్రౌపదిని ఇచ్చి వివాహం చేస్తాము” అన్నాడు.

ద్రుపదుడి మాటలకి ధర్మరాజు “మేము క్షత్రియులం. పాండురాజు కొడుకులమయిన పాండవులం. నేను పెద్దకొడుకుని ధర్మరాజుని. వీళ్లు లోకంలో ఉన్న ప్రజలందరితో పొగడబడిన భీమార్జున నకులసహదేవులు, మంచి నడవడిక కలవాళ్లు. ఎటువంటి శత్రువులనయినా జయించగలవాళ్లు. ఈమె మా తల్లి కుంతీదేవి” అని అందర్నీ పరిచయం చేశాడు.

ధర్మరాజు చెప్పింది విని ద్రుపదమహారాజు పట్టలేని ఆనందంతో పొంగిపోయాడు. ఆనందబాష్పాలతో నిండిన కళ్లతో “నా పుణ్యం వల్ల మీరందరు లక్కాగృహం దహనం నుంచి తప్పించుకున్నారు.” అని సంతోషాన్ని ప్రకటించాడు. జరిగిన విషయాన్ని గురించి వివరంగా అడిగి తెలుసుకున్నాడు. దుర్యోధన ధృతరాష్టుల్ని నిందించాడు. ప్రేమగా వాళ్లని ఆదరించాడు.

ఒకరోజు ద్రుపదుడు కొడుకులతోను, స్నేహితులతోను, మంత్రులతోను, బంధువులతోను, బ్రాహ్మణులతోను కలిసి కూర్చుని పాండవులతో “ఇంద్రుడి కుమారుడు, పాండువంశానికి తగినవాడు, విచిత్రవీర్యుడి మనుమడు, మంచి నడవడిక కలవాడు అయిన ఈ అర్జునుడు నా కుమార్తెకి భర్త అయ్యాడు. ఇదంతా నా భాగ్యం. స్వయంవరంలో పొందిన నా కుమార్తెని అర్జునుడు ధర్మ పద్ధతిలో వివాహం చేసుకుంటాడు” అన్నాడు.

ద్రుపదుడి మాటలు విని ధర్మరాజు “అలా జరగదు. అందరికంటే పెద్దవాణ్ని ముందు నా పెళ్ళి జరగాలి. తరువాత భీమసేనుడి పెళ్లి జరగాలి. తరువాతే అర్జునుడి పెళ్లి. ముందు అర్జునుడి పెళ్లి ఎలా జరుగుతుంది?” అన్నాడు. ద్రుపదుడు ధర్మరాజుతో “అయితే నువ్వే ద్రౌపదిని పెళ్లి చేసుకో. ధర్మ మార్గాన్ని వదలక్కర్లేదు కదా?” అన్నాడు. ద్రుపదుడి మాటలకి ధర్మరాజు “నేను మాత్రమే కాదు, మేము అయిదుగురు అన్నదమ్ములం కలిసి ద్రౌపదిని పెళ్లి చేసుకుంటాం. ఇది మా తల్లి ఆజ్ఞ. మేము మా తల్లి మాటని అతిక్రమించం” అన్నాడు.

ధర్మరాజు మాటలకి ద్రుపదుడు “ఒక స్త్రీకి ఎక్కువమంది భార్యలు ఉండడం ఏ యుగాల్లోను, ఏ కథల్లోను, ఎక్కడా వినలేదు. నువ్వు లోకంలో జరుగుతున్న, వేదాల్లో చెప్పబడిన ధర్మాలన్నీ తెలిసినవాడివి. ధర్మదేవత కుమారుడివి. నువ్వు చెప్పింది ధర్మవిరుద్ధమని చెప్పడానికి మేము భయపడతాము. అయినా ఇది లోకంలో ఎప్పుడూ వినలేదు. దీన్ని గురించి నువ్వు, నేను, కుంతీదేవి, ధృష్టద్యుమ్నుడు మళ్లీ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుందాము” అన్నాడు.

Exit mobile version