[dropcap]శౌ[/dropcap]నకుడు మొదలైన మహర్షులు అడిగినదాన్ని విని రోమహర్షణుడి కుమారుడు ‘ఉగ్రశ్రవసుడు’ అనే పేరు గల సూతమహర్షి సంతోషంతోను, వినయంతోను మొదట తపస్సంపన్నులైన ఆ మహర్షులకి నమస్కారం చేసాడు. తరువాత వ్యాసుడు మొదలైన గురువుల్ని మనస్సులో స్మరించాడు. వాగ్దేవి అయిన సరస్వతిని, విఘ్న నాశకుడైన వినాయకుణ్ని స్తుతించాడు. పవిత్రము, పంచమ వేదమైన మహాభారత కథ గొప్పతనాన్ని భక్తితోను వినయంతోను ప్రశంసించాడు.
అనేక ఉపాఖ్యానాలతో; వేదాల్లో ఉండే అర్థంతో; గొప్పవైన నాలుగు పురుషార్థాలతో; కృష్ణార్జునుల మంచి గుణాల్ని కీర్తించడం వల్ల కలిగిన ప్రయోజనంతో; వ్యాసుడు రచించిన, కవిత్రయం అనువాదం చేసిన మహాభారత ఇతిహాసము ఇప్పటికీ అందరితో పూజింపబడుతోంది.
చాలా రకాలైన శబ్దాలు, అర్థాలతో.. నూరు ఉపపర్వాలతో.. పద్ధెనిమిది మహాపర్వాలతో.. ప్రకాశించేదాన్ని, చిన్నా పెద్దా ద్వీపాలతో.. ఉన్న ప్రపంచాన్ని బ్రహ్మ సృష్టించినట్లు.. కృష్ణద్వైపాయనుడు అనే వ్యాసమహర్షి అన్ని లోకాల ప్రజలకి మంచి జరగాలని నిశ్చలమైన మనస్సుతో మూడు సంవత్సరాలు రచించాడు.
ఆ మహాభారతాన్ని స్వర్గలోకంలో ఉన్న వాళ్లకి చెప్పడానికి నారదమహర్షిని; పితృలోకంలో ఉన్న వాళ్లకి చెప్పడానికి ‘అసితుడు’ అనే దేవలమహర్షిని; గరుడ, గంధర్వ, యక్ష రాక్షస లోకాల్లో చెప్పడానికి తన కుమారుడు శుకమహర్షిని; సర్పలోకమైన పాతాళ లోకంలో చెప్పడానికి తన శిష్యుడైన సుమంతుణ్ని; మానవ లోకంలో పరీక్షిత్తు కుమారుడైన జనమేజయుడికి చెప్పడానికి మరొక శిష్యుడు వైశంపాయనుణ్ని పంపించాడు.
వైశంపాయన మహర్షి నాకు ఈ మహాభారత కథ చెప్పాడు. ఆ కథ విని ఇక్కడికి వచ్చాను. కృతయుగం చివరలో దేవతలకీ, రాక్షసులకీ; త్రేతా యుగంలో రాముడికీ, రావణుడికీ యుద్ధాలు జరిగాయి. అదే విధంగా ద్వాపర యుగం చివర కూడా పాండవులకీ కౌరవులకీ మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది.
పద్ధెనిమిది రోజులు జరిగిన ఆ కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు పదిరోజులు, గురువైన ద్రోణాచార్యుడు అయిదు రోజులు, కర్ణుడు రెండు రోజులు, అమితమైన పరాక్రమం గల శల్యుడు ఒకరోజులో సగభాగం సేనానాయకులుగా ఉన్నారు. మిగిలిన సగం రోజులో గదాయుద్ధంలో గొప్ప వీరులైన భీముడు దుర్యోధనుల మధ్య గదాయుద్ధం జరిగింది.
ఆ మహా భయంకరమైన యుద్ధంలో పాండవుల సేన ఏడు అక్షౌహిణులు.. కౌరవసేన సంఖ్య పదకొండు అక్షౌహిణులు. ఈ రెండు సేనలు రెండు వైపుల ఉన్న రథాల్ని, ఏనుగుల్ని, వీరుల్ని చంపుకుంటూ వెనక్కి తగ్గకుండా భయంకరంగా పద్ధెనిమిది రోజులు యుద్ధం చేశారు. అందువల్ల ‘శమంతపంచకము’ అనే ప్రదేశంలో భూమి కంపించింది.
కృష్ణద్వైపాయనుడు లేక వ్యాసమహర్షితో రచింపబడి పూజలందుకుంటున్న ఈ మహాభారతాన్ని నిశ్చలమైన మనస్సుతో వింటూ లేదా చదువుతూ ఉంటే ధర్మప్రవర్తనతో జీవిస్తారు. నాలుగు వేదాలు, ప్రధానమైన పద్ధెనిమిది పురాణాలు, వాటితో నిరూపించబడిన ధర్మాన్ని బోధించే శాస్త్రాలు, మోక్షమార్గాన్ని తెలియచేసే శాస్త్రాల అసలు స్వరూపం గురించి తెలుసుకున్న ఫలితం కలుగుతుంది.
దానాలు, వివిధ యజ్ఞాలలో చెయ్యబడే హోమాలు, జపాలు, బ్రహ్మచర్య వ్రతం ఆచరించడం వల్ల కలిగే ఫలితం దక్కుతుంది. పాపాలన్నీ నాశనమవుతాయి. అంతా మంచే కలుగుతుంది” అని సూతమహర్షి మహాభారతం గొప్పతనాన్ని వివరిస్తున్నాడు.
మహర్షులందరు ఉత్సాహంగా వింటూ.. ముందుగా మాకు శమంతకపంచకం గురించి కూడా వివరించమని అడిగారు. “అక్షౌహిణి అంటే ఏమిటో.. అక్షౌహిణి అనే సైన్య విభాగంలో రథాలు, గజాలు మొదలైన సైన్యం ఎంత ఉంటుందో.. ఆ సంఖ్యని తెలియ చెయ్యండి. తరువాత మహాభారతంలో కథ పుట్టడానికి గల కారణము, దానిలో ఉన్న మాటల గొప్పతనము, పాండవులు విజృంభించిన విధానము, భీష్ముడు మొదలైన కురువంశ వీరుల గొప్పతనము గురించి తెలియచెయ్యండి!” అని అడిగారు.
సూతమహర్షి చెప్తున్నాడు మిగిలిన మహర్షులు, మహారాజు జనమేజయుడు వింటున్నారు. “త్రేతాయుగము, ద్వాపర యుగాల మధ్య కాలంలో గొప్ప పరాక్రమం కలిగిన పరశురాముడు కోపంతో వజ్రాయుధం వంటి తన గండ్ర గొడ్డలితో క్షత్రియుల మీద యుద్ధం చేశాడు. ఇరవై ఒక్క సార్లు యుద్ధం చేసి కనిపించిన క్షత్రియులందర్నీ చంపేశాడు.
యుద్ధంలో చంపబడిన క్షత్రియుల రక్తంతో అయిదు మడుగులు ఏర్పరిచాడు. క్షత్రియుల రక్తంతో తర్పణాలు ఇచ్చి పితృదేవతల్ని తృప్తి పరిచాడు. పితృదేవతలు అతడి కోపాన్ని తగ్గించి శాంతపరిచారు. క్షత్రియుల రక్తంతో ఐదు మడుగులు ఏర్పరిచి, ఆ రక్తంతో పితృతర్పణం చేసిన ప్రదేశాన్ని శమంతక పంచకం అన్నారు” అని చెప్పాడు.
తరువాత అక్షౌహిణి అనే సేనావిభాగంలో ఉన్న రథాలు, గుర్రాలు మొదలైన వాటి సంఖ్య చెప్పడం మొదలుపెట్టాడు. “ఒక గొప్పదైన రథము, ఒక ఏనుగు, మూడు గుర్రాలు, అయిదుగురు కాలిబంట్లు గలిగిన సేనా విభాగాన్ని ‘పత్తి’ అంటారు.
పత్తికి మూడురెట్లు ఉన్నసేనని ‘సేనాముఖం’ అని, సేనాముఖానికి మూడురెట్లు ఉండే సేనని ‘గుల్మం’ అని, గుల్మానికి మూడు రెట్లు ఉండే సేన ‘గణం’ అంటారు. గణానికి మూడు రెట్లు ఉంటే దాన్ని ‘వాహిని’ అని పిలుస్తారు. వాహినికి మూడు రెట్లు ఉంటే ఆ సేన ‘పృతన’ అనబడుతుంది. పృతనకి మూడురెట్లు ఉండే సేనని ‘చమువు’ అంటారు.
చమువుకి మూడు రెట్లు ఉంటే ‘అనీకిని’ అని, అనీకినికి పదిరెట్లు ఉండే పెద్ద సేనని ‘అక్షౌహిణి’ అని పిలుస్తారు. కౌరవుల పాండవుల మధ్య జరిగిన యుద్ధం శమంతక పంచకంలోనే జరిగింది. అందువల్ల ఆ ప్రదేశానికి ‘కురుక్షేత్రము’ అని పేరు వచ్చింది.
శత్రువుల పరాక్రమాన్ని అరికట్టినవాడు, పాండవ వంశాన్ని వృద్ధి చేసినవాడు, పుణ్యకార్యాలు నిష్ఠగా చేసినవాడు, పరీక్షిత్తుకి కుమారుడు, పాపపు పనులు చెయ్యనివాడు, అనేక యజ్ఞాలు చేసి కీర్తిని పెంచినవాడు, మంచివాళ్లతో బుద్ధిమంతుడు అనిపించుకున్నవాడు, ఓటమి ఎరుగనివాడు ‘జనమేజయుడు’ అనే రాజు తనకి, ప్రజలకి, దేశానికి మంచి జరగాలన్న కోరికతో ఎక్కువ కాలం జరిగే యజ్ఞాన్ని చేశాడు.
జనమేజయుడు యజ్ఞం చేస్తున్నాడు. దేవతల కుక్క సరమ కొడుకు ‘సారమేయుడు’ ఆడుకుంటూ అక్కడ తిరుగుతున్నాడు. జనమేజయుడి తమ్ముళ్లు శ్రుతసేనుడు, భీమసేనుడు, ఉగ్రసేనుడు కోపంతో దాన్ని కొట్టారు. అది ఏడుస్తూ వెళ్లి తన తల్లి ‘సరమ’కి చెప్పింది.
సరమ కోపంతో జనమేజయుడి దగ్గరికి వెళ్లింది. “ఓ రాజా! నీ తమ్ముళ్లు ఏ తప్పు చెయ్యని నా కొడుకుని చిన్నవాడని కూడా చూడకుండా కొట్టారు. తను చేస్తున్న పని మంచిదా కాదా అని ఆలోచించకుండా బీదవాళ్లకి, శక్తిలేనివాళ్లకి, మంచివాళ్లకి బాధ కలిగిస్తే వాళ్లకి ఏదో విధంగా ఆపదలు కలుగుతాయి” అని చెప్పి మళ్లీ కనిపించకుండా వెళ్లిపోయింది.
జనమేజయుడు తను అనుకున్న యజ్ఞాన్ని పూర్తిచేసి హస్తినాపురానికి వెళ్లి సుఖంగా జీవిస్తున్నాడు. కాని ఒకరోజు అతడికి దేవతల కుక్క సరమ తనతో చెప్పిన మాటలు గుర్తుకి వచ్చాయి. నిజంగానే ఆపదలు కలుగుతాయేమో అనే భయంతో శాంతి కర్మలు చేయించాలని అనుకున్నాడు. అందుకు తగిన పురోహితుల కోసం మునులు నివసించే ఆశ్రమాలకి వెళ్లాడు.
అక్కడ ఒక మునిపల్లెలో ‘శ్రుతశ్రవసుడు’ అనే ఒక మహర్షిని చూసి ఆయనకి నమస్కారం చేసి “మహర్షీ! తపస్సంపన్నుడు, పవిత్రుడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు మీ కుమారుడు ‘సోమశ్రవసుణ్ని’ నాకు పురోహితుడిగా పంపించండి” అని వినయంగా అడిగాడు.
ఆయన అనుమతి తీసుకుని సోమశ్రవసుణ్ని పూజించి, సత్కరించి తనకు పురోహితుడుగా చేసుకున్నాడు. జనమేజయుడు దేవతల్ని అహూతులతోను, బ్రాహ్మణుల్ని విశేషమైన దక్షిణలతోను తృప్తి కలిగిస్తూ అనేక యాగాలు చేస్తూ పురోహితుడి మాటల్ని గౌరవిస్తూ రాజ్యపాలన చేస్తున్నాడు.
సూతమహర్షి మహాబారత కథ చెప్పడానికి ఉద్యుక్తుడై ముందుగా మాహాభారతాన్ని, మహాభారత యుద్ధాన్ని, మహాసైన్యాన్ని కీర్తించి తరువాత మహాభారత కథ చెప్పడం మొదలుపెట్టాడు.