మహాభారత కథలు-50: ద్రుపదరాజపురంలో భోగాలు అనుభవిస్తున్న పాండవులు

0
1

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

ఆదిపర్వము – ఎనిమిదవ ఆశ్వాసము

ద్రుపదరాజపురంలో భోగాలు అనుభవిస్తున్న పాండవులు

ద్రౌపదిని దీవించిన కుంతీదేవి

[dropcap]శౌ[/dropcap]నకుడు మొదలైన మహర్షులకి ద్రౌపదీపాండవుల వివాహమహోత్సవాన్ని వర్ణించి చెప్పాడు ఉగ్రశ్రవసుడు. తరువాత పాండవులు ద్రుపదరాజ పురంలో ఎలా ఉన్నారో చెప్తాను వినమన్నాడు.

ద్రుపదుడు పాండవులు అయిదుగురికి వేరువేరుగా విలువైన మణులు పొదిగిన ఆభరణాలు, బంగారంతో చేసిన పరుపులు, పీటలు, ఇతర వస్తువులు, వంద మదపుటేనుగులు వెయ్యి కాంభోజ దేశపు గుర్రాలు, విలువైన బట్టలు ధరించిన పదివేలమంది దాసదాసీ జనాలు, లక్ష పాడి ఆవులు మొదలైనవాటిని కట్నంగా ఇచ్చాడు. నాలుగు సముద్రాలు చుట్టుకుని ఉన్న మొత్తం భూమండల సామ్ర్యాజ్యంలో ఉన్న సంపదలకి అధికారిణి అయిన మహా పతివ్రత ద్రౌపది అయిదుగురు భర్తలకి సమానంగా సేవచేసి సంతోషాన్ని కలిగించింది.

కోడలు ద్రౌపది మంచి గుణాలకి కుంతీదేవి సంతోషించింది. “ద్రౌపదీ! విష్ణుమూర్తికి లక్ష్మీదేవిలా, చంద్రుడికి రోహిణిలా, ఇంద్రుడికి శచీదేవిలా, వశిష్ఠుడికి అరుంధతీదేవిలా నీ భర్తలమీద ప్రేమ గలిగి చక్కటి సంతానాన్ని పొందు. గురువుల్ని, వృద్ధుల్ని, బంధువుల్ని, రోగుల్ని, పూజ్యుల్ని, అతిథుల్ని, ఎప్పుడూ సేవిస్తూ ఉండు. ఉత్తములైన బ్రాహ్మణులకి అన్నదానం చెయ్యి. భూమి మీద ఉన్న ప్రజలందరినీ దయతో ఆదరించు. నీ భర్తలు తమ పరాక్రమంతో భూమి మీద ఉన్న రాజులందర్నీ జయించారు. వీరులై, తొమ్మిది దీవుల్లో ఉన్న భూమండలం మొత్తాన్ని పరిపాలిస్తూ రాజసూయ యాగం వంటి యాగాలు చేస్తూ ఉంటారు. అటువంటప్పుడు నీ భర్తలకి నువ్వు ధర్మపత్నిగా మసులుకో. ద్రౌపదీ! నిన్ను కోడలిగా పొందిన నేను ఎలా సంతోషపడుతున్నానో అలాగే నువ్వు కూడా మంచి నడవడిక కలిగిన సంతానాన్ని, మనుమల్ని పొంది సంతోషంగా జీవించు” అని దీవించింది.

పాండవులు అయిదుగురుకి ద్రౌపదితో వివాహం జరిగిందని విని శ్రీకృష్ణుడు చాలా సంతోషించాడు. వజ్రాలు, వైడూర్యాలు, మరకతాలు, ముత్యాలు పొదిగిన ఆభరణాలు, వివిధ దేశాలకు సంబంధించిన చిత్రవిచిత్రాలైన బట్టలు, ఎన్నో ఏనుగులు, గుర్రాలు, రథాలు, పల్లకీలు, సేవకులు మొదలైనవాటిని ప్రేమతో పాండవులు అయిదుగురుకి పంపించాడు.

సుగుణవంతులు, పరాక్రమవంతులు అయిన పాండవులు తోడుగా ఉండడం వల్ల దేవతల నుంచి కూడా కష్టాలు లేకుండా ద్రుపదుడు సుఖంగా ఉన్నాడు. రాజ్యంలో ఎక్కడా దొంగతనాలు దోపిడీలు వంటి బాధలు లేకపోవడంతో ద్రుపద రాజ్యంలో ఉన్న ప్రజలందరూ సుఖంగాను, సంతోషంగాను జీవిస్తున్నారు.

పాండవుల అభివృద్ధికి బాధపడిన దుర్యోధనుడు

ద్రుపదమహారాజు నగరంలో ఒక సంవత్సరంపాటు సుఖంగా గడిపారు పాండవులు. దుర్యోధనుడి దూతలు ఈ విషయాన్ని తెలుసుకుని హస్తినాపురానికి వెళ్లారు. ఆ సమయంలో కర్ణుడు, దుశ్శాసనుడు, శకుని, సోమదత్తుడు మొదలైనవాళ్లందరూ దుర్యోధనుడి దగ్గర కూర్చుని ఉన్నారు.

దూతలు దుర్యోధనుడితో “మహారాజా! మహాబలవంతులు, అస్త్రవిద్యను నేర్చుకున్నవాళ్లు, అహంకారులైన కర్ణుడు, శల్యుడు మొదలైన రాజులెవరూ ఎక్కుపెట్టలేని ధనుస్సుని సులభంగా ఎక్కుపెట్టి.. ఆకాశంలో తిరిగే మత్స్యయంత్రాన్ని పడగొట్టి.. అన్ని దేశాల రాజకుమారుల ఎదుట ద్రౌపదిని చేపట్టి.. ద్వంద్వయుద్ధంలో తన పరాక్రమం అందరికీ తెలిసేట్టు కర్ణుణ్ని ఓడించి విజయాన్నిపొందినవాడు అర్జునుడు. గొప్ప భుజబలంతో శల్యుణ్ని ఓడించి.. గొప్ప బలపరాక్రమాలు కలిగినవాళ్లందర్నీ తరిమి కొట్టిన మహాభయంకరమైన బలవంతుడు భీముడు. మహారథులు, బలవంతులైన ధృతరాష్ట్ర కుమారుల గర్వాన్ని అణిగించినవాళ్లు నకుల సహదేవులు” అని వివరంగా చెప్పారు.

ఆ మాటలు విన్న దుర్యోధనుడు వెలవెలబోయిన ముఖంతో ఏడ్చాడు. “అయ్యో! పురోచనుడు ఒక్కడే లక్కయింటిలో మాడిపోయి ఉంటాడు. మనిషి ఎంత ప్రయత్నించినా భగవంతుడి అనుగ్రహం లేకపోతే ఏ పనీ జరగదు. పాండవులకి దైవానుగ్రహం ఉంది కనుక ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. ఇప్పుడు ద్రుపదుణ్ని పాండవుల నుంచి వేరు చెయ్యాలి. యాదవ, వృష్టి, భోజ కులంలో ఉన్న ప్రముఖులు అందరూ పాండవపక్షపాతులు. చేదిరాజు శిశుపాలుడు కూడా వాళ్ల పక్షంలోవాడే. వీళ్లందరూ తమ అభివృద్ధి కోసం కంటే పాండవుల అభివృద్ధి కోసమే ఎక్కువగా పాటుపడతారు. వాళ్ల మధ్య విభేదాలు తీసుకుని రావాలి” అని అలోచించిన దుర్యోధనుడు ద్రుపదుణ్ని పాండవుల నుంచి ఎలా వేరు చెయ్యాలా.. అని అలోచిస్తున్నాడు.

విదురుడు పాండవుల అభివృద్ధినీ, ద్రౌపదీస్వయంవరాన్నీ, దుర్యోధనుడు భంగపడడాన్ని విని సంతోషపడ్డాడు. పాండవులు ద్రౌపదిని పెళ్లి చేసుకుని ద్రుపదుడి నగరంలో సుఖంగా ఉన్నారని ధృతరాష్ట్రుడికి కూడా చెప్పాడు. అది విని ధృతరాష్ట్రుడు విదురుడితో “యజ్ఞవేదికనుంచి పుట్టిన ద్రౌపదిని పెళ్లి చేసుకోడం వల్ల పాండవులకి చాలా మంది మిత్రులయ్యారు. పాండవులు సుఖంగా ఉన్నారని తెలిశాక నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మన కురువంశం రాజులందరినీ ఓడించి భుజబలంతో గొప్పగా ప్రకాశిస్తోంది” అని విదురుడి మనస్సుకి సంతోషం కలిగేలా మాట్లాడాడు.

తరువాత తన అంతఃపురంలోకి వెళ్లే వరకు తన మనస్సులో ఉన్న దుఃఖాన్ని బయటకు తెలియనివ్వకుండా చేసుకున్నాడు.

ద్రుపదుణ్ని, పాండవుల్ని విడదీయమని తండ్రిని కోరిన దుర్యోధనుడు

కర్ణుడు, దుర్యోధనుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్లారు. “తండ్రీ! విదురుడు ఎప్పుడూ నీ దగ్గరే ఉంటున్నాడు. అందువల్ల మా మనస్సులో మాటని మీకు ఇంతవరకు చెప్పలేక పోయాము. మిమ్మల్ని కలవడానికి ఇంతకాలం పట్టింది. విదురుడు పాండవుల మంచిని కోరేవాడని తెలిసి కూడా మీరు అతడి మాటలే వింటారు. మీకు విదురుడంటేనే బాగా ఇష్టం” అన్నారు.

వాళ్ల మాటలు విని ధృతరాష్ట్రుడు “నాయనా! నేను మాటల్లోను, చేతల్లోను పాండవుల మీద ప్రేమ ఉన్నట్టు కనిపిస్తాను. కాని నా మనస్సు ఎప్పుడూ విదురుడికి తెలియనివ్వలేదు. మీ అభిప్రాయంతో నేను ఎప్పుడూ ఏకీభవిస్తున్నాను. పాండవులకి దైవబలం ఉంది. అందుకే మన ప్రయత్నం ఫలించలేదు. ఇప్పుడు మీరు ఏం చెయ్యాలని అనుకుంటున్నారో చెప్పండి” అన్నాడు.

ఎప్పుడూ దుర్మార్గపు ఆలోచనలే చేసే దుర్యోధనుడు “తండ్రీ! ప్రస్తుతం పాండవులు పాంచాలరాజు దగ్గర ఉండకూడదు. ఎందుకంటే, ద్రుపదమహారాజుకి పుత్రులు, మిత్రులు, బంధువులు ఎక్కువగా ఉన్నారు. పాండవులు కూడా అక్కడే ఉంటే వాళ్లకి తోడుగా యదు, వృష్టి, భోజ, అంధక వర్గాలతో కలిసి శ్రీకృష్ణ బలరాములు కూడా వచ్చి కలుస్తారు. ఇంక పాండవుల్ని జయించడం ఎవరికీ సాధ్యపడదు. కనుక ద్రుపదుడు పాండవుల్ని వదిలెయ్యడమో.. కుంతి కొడుకులమధ్య, మాద్రి కొడుకుల మధ్య శత్రుత్వం వచ్చేట్టు చెయ్యడమో జరగాలి.

ఆ పని చేసేందుకు తగిన వాళ్లని నియమించాలి. అలా జరగదని అనుకుంటే అందమైన ఆడవాళ్లని పాండవుల దగ్గరికి పంపించాలి. వాళ్లకి ద్రౌపది మీద ప్రేమ లేకుండా చెయ్యాలి. అదీ కాకపోతే పాండవులు అయిదుగురికీ ఒక్కతే భార్య అని అదేపనిగా చెప్తూ ఉంటే ద్రౌపదికి పాండవుల మీద ప్రేమ లేకుండా పోతుంది. చాటుగా భీముణ్ని చంపేస్తే పాండవుల బలం తగ్గిపోతుంది. భీముడు సహాయంగా ఉంటే వీరుడైన అర్జునుణ్ని దేవతలు కూడా ఏమీ చెయ్యలేరు. భీముడు లేకపోతే అర్జునుణ్ని కర్ణుడు ఒక్కడే జయించగలడు. ఇటువంటి ఉపాయాలెన్నో ఉన్నాయి. సులభంగా తక్కువ సమయంలో పాండవుల్ని బలహీనపరచ గలిగిన ఒక ఉపాయాన్ని ఎంపిక చెయ్యండి” అన్నాడు.

దుర్యోధనుడి మాటలు విన్న కర్ణుడు “ద్రుపదుడికి మంచి నడవడిక, రాజులందరికీ ఇష్టమైన, గుణవంతుడైన కొడుకు ఉన్నాడు. వినయసంపన్నులైన పాండవుల్ని ఎందుకు వదిలేస్తాడు? పాండవులందరికీ ద్రౌపదంటే చాలా ప్రేమ. ద్రౌపది వల్ల వాళ్ల మధ్య ఎప్పటికీ కలహం రాదు. స్త్రీలు ఎప్పుడూ ఎక్కువమంది భర్తల్ని కోరుకుంటారు. కనుక, అందమైన ద్రౌపది పాండవుల్ని మనసారా ప్రేమిస్తుందే కాని వాళ్లల్లో ఒక్కళ్లని కూడా వదులుకోదు. అంతేకాదు, ఇంతకు ముందు మీరు రహస్యంగా చేసిన ప్రయత్నాల్లో భీముడికి ఏం జరిగింది? ఇప్పుడు కూడా అదే జరుగుతుంది.

ఉపాయాలు పక్కన పెట్టండి.. పాండవుల మీద పరాక్రమాన్ని ప్రయోగించండి. అదే సరయిన పద్ధతి. దేవేంద్రుడు తన పరాక్రమంతోనే కదా జయించాడు. భరతుడు కూడా భూమండలం మొత్తాన్ని తన పరాక్రమంతోనే జయించాడు. రాజకుమారులకి శత్రువుల్ని వధించి గొప్ప కీర్తిని పొందాలనుకుంటే వాళ్లకి పరాక్రమమే సాధనం. మనం చతురంగ బలాలతో వెళ్లి ద్రుపదుణ్ని యుద్ధంలో ఓడించి పాండవుల్ని మళ్లీ వేరే చోట ఉండమని చెప్పకుండా మనతో తీసుకుని వద్దాము” అన్నాడు.

కర్ణుడి మాటలు విని ధృతరాష్ట్రుడు “ద్రుపదుణ్ని, పాండవుల్ని విడదీయచ్చు కాని, ఆ పని ఎలా చెయ్యాలన్నది అనుభవజ్ఞనులతో ఆలోచించి చేద్దాము” అన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here