Site icon Sanchika

మహాభారత కథలు-51: దుర్యోధనుడికి బుద్ధి చెప్పిన భీష్మద్రోణులు

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

దుర్యోధనుడికి బుద్ధి చెప్పిన భీష్మద్రోణులు

[dropcap]భీ[/dropcap]ష్ముడు, ద్రోణుడు, విదురుడు మొదలైనవాళ్లని పిలిపించి ధృతరాష్ట్రుడు జరిగిన విషయం చెప్పాడు. భీష్ముడు దుర్యోధనుడి వైపు చూసి “మంచి గుణాలు కలవాళ్లు, ధైర్యవంతులు, గొప్ప కీర్తిని పొందిన ధ్రుతరాష్ట్రుడు, పాండురాజు ఇద్దరూ నాకు ఒకటే. గాంధారి కొడుకులు, కుంతికొడుకులు నాకు సమానమే. వాళ్లు వీళ్లు అనే భేదభావం నాకు ఎప్పుడూ లేదు. పాండవులతో యుద్ధం చెయ్యడానికి నేను ఎప్పుడూ ఇష్టపడను.

తండ్రితాతల రాజ్యానికి మీలాగే వాళ్లకి కూడా అర్హత ఉంది. వాళ్లకి సగం రాజ్యం ఇస్తే నీకూ, నీ చుట్టాలకీ, లోకాలకి కూడా సంతోషం కలుగుతుంది లేకపోతే అపకీర్తి కలుగుతుంది. కీర్తిని నిలబెట్టుకోవడమే రాజులకి అన్ని విధాలా మంచిది. కీర్తి లేని రాజు బ్రతుకు వ్యర్థమే. భూమి మీద కీర్తే శాశ్వతమైన ధనం. దాన్ని పొందడం చాలా కష్టం. కీర్తి నిలిచి ఉన్నంతకాలం కీర్తిని పొందిన పుణ్యాత్ముల పేరు కూడా భూమి మీద నిలిచే ఉంటుంది. కీర్తి లేనివాడికి గౌరవం ఉండదు. స్వర్గానికి చేరడానికి కూడా ఇది ఉపయోగ పడుతుంది. అపకీర్తి మనిషిని నరకానికి చేరుస్తుంది. కీర్తి కలిగేలా నడుచుకుని కీర్తిని నిలబెట్టుకోండి. వంశపారంపర్యంగా వచ్చిన రాజ్యంలో సగ భాగాన్ని పాండవులకి కూడా ఇవ్వండి” అన్నాడు.

భీష్ముడు చెప్పిన మాటలకి సంతోషపడిన ద్రోణుడు “దుర్యోధనా! మీ తాత భీష్ముడు చెప్పినది చాలా బాగుంది. ఆయన మాట ధర్మబద్ధమైంది. మంచిని కలిగించి, శత్రుబలం లేకుండా చేసి లాభం కలగ చేస్తుంది. ఆయన చెప్పినట్టు చేయండి. కౌరవులు, శకుని, కర్ణుడు చెప్పే మాటలు విని నువ్వు పాండవులతో యుద్ధం చెయ్యడం మంచిది కాదు. ధార్మికులు, వృద్ధులు, బుద్ధిబలం కలవాళ్లు, పక్షపాతం లేనివాళ్లు, ఏది చెయ్యాలో నిర్ణయం తీసుకోడంలో సమర్థులు, కోపం, అసూయ లేనివాళ్లు చెప్పే మాటల్ని విని అచరించాలి.

రాజుకి ఆప్తులు, స్నేహితులు వివేకం లేని వాళ్లయితే రాజుని పాడుచేయడమే కాకుండా తాము కూడా చెడిపోతారు. దైవయోగం వల్ల ప్రకాశిస్తూ ధర్మాన్ని, సత్యాన్ని తప్పని పుణ్యాత్ములైన పాండవుల తండ్రి సంపాదించిన రాజ్య భాగాన్ని ఊరికే తీసుకోవడం వజ్రాయుధుడైన దేవేంద్రుడికి కూడా సాధ్యంకాదు. దుర్యోధనా! పాండవులు సుఖంగా జీవించి ఉన్నారని తెలిసినప్పుడు, వాళ్లని సంతోషంగా ఉంచడం ధర్మం కదా? పాండవులతో యుద్ధం చెయ్యడం మంచి పని కాదు. కాబట్టి, పాండవులకి, ద్రుపదుడికి, ధృష్టద్యుమ్నుడికి, కుంతీదేవికి, ద్రౌపదికి స్నేహపూర్వకంగా తగిన ఆభరణాల్ని, బట్టల్ని వేరు వేరుగా ఇచ్చి పంపిస్తూ దుశ్శాసనుడు, వికర్ణుడు మొదలైన వాళ్లని కూడా వెంట పంపించండి” అని చెప్పాడు.

ద్రోణుడు చెప్పిన మాటలకి కర్ణుడు “ముసలివాళ్లు తమకి అనుకూలంగా ఉండేట్టు చెప్తారు కాని, రాజులకి మంచి జరిగేటట్లు చెప్పరు. శత్రువులైన పాండవుల్ని దగ్గరికి చేర్చుకోవడం ధర్మం అంటున్నారు కాని, అది అధర్మం కాదా? మంత్రులు తమ మనస్సులో ఉన్న చెడు పైకి కనిపించకుండా మాట్లాడుతారు. వాళ్లు మంచివాళ్లో, చెడ్డవాళ్లో తెలుసుకోగలగాలి.

పూర్వం నియంతుడు అనే పేరుగల మగధరాజు శక్తి లేక రాజ్యపాలన చెయ్యలేక బాధపడుతున్నాడు. ఆ సమయంలో అతడి మంత్రి తనే రాజ్యపాలన చేస్తూ రాజ్యాన్ని తన వశం చేసుకున్నాడు. నియంతు మహారాజుని రాజ్యం నుంచి బయటకి పంపించి రాజ్యసంపదల్ని దోచుకున్నాడు. చివరికి ఆ మంత్రి కూడా తన బలాన్ని పోగొట్టుకుని రాజ్యాన్ని కూడా పోగొట్టుకున్నాడు. మంత్రులు మంచి చేస్తున్నట్టు పైకి కనిపిస్తూనే కీడు చేస్తారు. ఈ ఇద్దరూ చెప్పినట్టు చేస్తే మాకు కీడే కలుగుతుంది” అన్నాడు.

కర్ణుడి మాటలు విని ద్రోణుడు కోపంతో “అంటే మేము చెడు చేసేవాళ్లము, నువ్వు మంచి చేసే వాడివా? కౌరవుల మంచిని కోరేవాళ్లల్లో మా కంటే నువ్వే ముందున్నావా? నీ సలహాల వల్ల ఈ కురుకులం బాధలు పడినా ఆశ్చర్యం కలగదు. శాంతమంటే ఏమిటో తెలియనివాళ్ల మాటలు సలహాలు కీడునే కలిగిస్తాయి” అన్నాడు.

కర్ణుడు ఇంకా ఏదో అనబోతూ ఉండగా విదురుడు ఆ ఇద్దర్నీ ఆగమని చెప్పి ధృతరాష్ట్రుడితో “ధర్మాలు తెలిసినవాళ్లల్లో పెద్దలు, ఉన్నది ఉన్నట్టుగ చెప్పేవాళ్లు, వయస్సులో పెద్దవాళ్లు, పక్షపాతం లేని మంచి బుద్ధి కలవాళ్లు, పుణ్యాత్ములు అయిన భీష్మద్రోణులు నీకు ఏది చెప్పారో ఆ విధంగా చెయ్యి. నీ మేలు కోరేవాళ్లు అంతకంటే ఎవరు ఉన్నారు?

దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని వివేకం లేనివాళ్లు. ఏది ధర్మమో.. ఏది అధర్మమో వాళ్లకి తెలియదు. అటువంటి వాళ్ల మాటలు వినకుండా వెంటనే పాండవుల్ని రప్పించి వాళ్లకి అర్ధరాజ్యాన్ని ఇయ్యి. పాండవుల్ని జయించడం ఎవరి వల్లా కాదు. ఇప్పుడు రాజులందరినీ జయించిన పాంచాలరాజు వాళ్లకి బంధువు. అతడి కుమారుడు ధృష్టద్యుమ్నుడు పాండవులతో సమానమైన పరాక్రమం కలవాడు. బంధువయ్యాడు కనుక పాండవులకి ఇంకా దగ్గరయ్యాడు.

శ్రీకృష్ణుడు, బలరాముడు, సాత్యకి పాండవులకి స్నేహితులు, మంచి సలహాలు ఇస్తుంటారు. అటువంటి దైవబలం, మానవబలం, నిశ్చలత్వం కలిగినవాళ్లు, నీ మీద దుర్యోధనుడు మొదలైనవాళ్ల కంటే కూడా ఎక్కువ భక్తి వినయం చూపించే పాండవులు నీకు కొడుకులు కాదా? వాళ్లని దూరం చెయ్యడం ధర్మమా? ధృతరాష్ట్రమహారాజా! యుద్ధభూమిలో శత్రువులు ఎంత వీరులైనా పార్థుడు శత్రువుల్ని చీల్చి చెండాడుతున్నప్పుడు దేవేంద్రుడు కూడా అతణ్ని ఏమీ చెయ్యలేడు. ఇంకా ఎక్కువమంది ఉన్నా ధైర్యం, వీరత్వం, సాహసం ఉత్సాహం లేనివాళ్లు ద్రోహబుద్ధితో వాళ్లని ఎదుర్కుని బతుకుతారో చస్తారో నువ్వే ఆలోచించుకో.

ఇంక అర్జునుడి అన్న భీముడు గొప్ప వీరుడు. యుద్ధం అంటే తనే ముందుంటాడు. వెయ్యి ఏనుగుల బలం కలవాడు. అతడు విజృంభిస్తే ప్రళయకాలంలో యముడిలా కనిపిస్తాడు. భీమార్జునుల వీరత్వమే కాదు, దేవతలతో సమానమైన నకుల సహదేవుల్ని కూడా యుద్ధంలో జయించడం ఎవరికి సాధ్యం కాదు. అటువంటి తమ్ముళ్లు, ధర్మం, ధైర్యం, సత్యం, దయ తనకే సొంతమైన ధర్మరాజుకు తిరుగేముంది?

వాళ్ల బలపరాక్రమాలు ఇదివరకు అందరూ చూశారు. అటువంటి వాళ్లతో యుద్ధం చెయ్యాలని అనుకునే అజ్ఞానులు ఎక్కడా ఉండరు. నీ పుణ్యం వల్ల ఆ మహాత్ములు తల్లితో కలిసి లక్క ఇంట్లో జీవించారు. పురోచనుడి వల్ల నీకు కలిగిన అపకీర్తి అనే బురదని, దయ అనే నీళ్లతో కడుక్కో. దుర్యోధనుడు చేసే తప్పు పనుల వల్ల ప్రజలందరికీ అపాయం కలుగుతుందని ఇంతకు ముందే నీకు చెప్పాను. ప్రజలు ఇబ్బందులు పడకుండా చూసి వాళ్లని రక్షించు” అన్నాడు.

పాండవుల దగ్గరికి వెళ్లిన విదురుడు

విదురుడి మాటలు విన్న ధృతరాష్ట్రుడు “నువ్వు, భీష్ముడు, ద్రోణుడు ప్రజలందరితో ప్రశంసలు అందుకున్నవాళ్లు. గొప్ప ధర్మ ప్రవర్తన కలిగిన మీ మాటని ఎలా కాదంటాను. అంత వివేకం లేనివాణ్ని కాదు. మీరు చెప్పినట్టే పాండవులకి అర్ధరాజ్యం ఇస్తాను” అని భీష్ముడు, ద్రోణుడు, విదురుడు, మొదలైన బంధువులు, మంత్రులు, దుర్యోధనుడు మొదలైన కొడుకులు అందరు ఉన్న సమయంలో చెప్పాడు. పాండవుల్ని దగ్గరుండి తీసుకుని రమ్మని విదురుణ్ని పంపించాడు.

విదురుడు ధృతరాష్ట్రుడు చెప్పినట్టు ద్రుపదరాజు నగరానికి వెళ్లి కొడుకులతోను, తోబుట్టువులతోను కలిసి ఉన్న ద్రుపదుణ్ని, శ్రీకృష్ణుడితో కలిసి ఉన్న పాండవుల్ని చూశాడు. ధృతరాష్ట్రుడు పంపించిన కానుకల్ని ఎవరివి వాళ్లకి ఇచ్చాడు. వాళ్లందరు విదురుణ్ని పూజించారు. శ్రీకృష్ణుడు, పాండవులు అందరూ ఉన్న సమయంలో ద్రుపదుడితో “కీర్తి, ఐశ్వర్యం కలిగిన ద్రుపద మహారాజా! నువ్వు గొప్ప వంశం కలిగినవాడివి, ధర్మస్వభావం కలవాడివి. నీతో మాకు ఏర్పడిన బంధుత్వం చాలా గొప్పది, ఇష్టమైనది, లోకులందరూ మెచ్చేది అని భీష్ముడు, ధృతరాష్ట్రుడు, కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు చాలా సంతోషపడ్డారు.

మంచి నడవడిక కలిగిన కుంతీదేవి, పాండవులు లక్క ఇంటిలో దహనమయ్యారని విని చాలా బాధపడ్డారు. ఇప్పుడు వాళ్లు క్షేమంగా నీ దగ్గర ఉన్నారని తెలిసి మొత్తం బంధువులు, ప్రజలు అందరు నీ అల్లుళ్లైన పాండవుల్ని చూడాలని ప్రేమతో ఎదురు చూస్తున్నారు. గుణవంతులైన కొడుకుల్ని, కురువంశానికి వెలుగునిచ్చే కోడలు ద్రౌపదిని, పరమ పతివ్రత అయిన కుంతీదేవిని ధృతరాష్ట్రమహారాజు హస్తినాపురానికి తీసుకుని రమ్మన్నాడు. నువ్వు అనుమతి ఇస్తేనే పాండవులు వస్తారు. కనుక, వాళ్లని నాతో పంపించు” అన్నాడు

విదురుడి మాటలు విని ద్రుపదుడు “సూర్యుడి తేజస్సుతో సమానమైన తేజస్సు కలిగిన ధృతరాష్ట్రుడు పంపించడం, పెద్ద మనస్సుతో నువ్వు రావడం చూస్తుంటే సందేహం లేకుండా పాండవులకి కావలసింది దొరుకుతుంది. శ్రీకృష్ణుడు, నువ్వు ఎప్పుడూ ప్రేమతో పాండవుల మంచినే కోరతారు కదా? నువ్వు, ద్రోణుడు, శ్రీకృష్ణుడు, భీష్ముడు, ధృతరాష్ట్రుడు మంచి అభిప్రాయంతో ఏది చెయ్యాలని అనుకుంటున్నారో దాని వల్ల పాండవులకి మంచే జరుగుతుంది. మంచిని కోరే విదురుడు ఉండగా వాళ్లని ఎవరూ ఏమీ చెయ్యలేరు. పాండవులకి అనుకున్నది దొరుకుతుంది” అన్నాడు.

ద్రుపదమహారాజు చెప్పినది విని ధర్మరాజు “కురువంశానికి గొప్పవాళ్లైన ధృతరాష్ట్రుడు, విదుర, భీష్ములు మాకు పెద్దలేకాదు పూజ్యులు. ద్రుపదమహరాజు కూడా పెద్దలే. ఇంక శ్రీకృష్ణుడు లోకానికే పెద్ద. వీళ్లందరూ ఉండగా మాకు అంతా మంచే జరుగుతుంది” అన్నాడు.

హస్తినాపురానికి వచ్చిన పాండవులు

ధర్మరాజు హస్తినాపురానికి వెళ్లడానికి తన తమ్ముళ్ల అంగీకారం తీసుకున్నాడు. ద్రుపదుడి దగ్గర సెలవు తీసుకుని ప్రయాణానికి సిద్ధమయ్యాడు. విదురుడు పాండవుల్ని, ద్రౌపదిని, కుంతీదేవిని తీసుకుని హస్తినాపురానికి బయలుదేరాడు. శ్రీకృష్ణుడు ధృష్టద్యుమ్నుడు తమ సైన్యంతో వాళ్లని అనుసరించారు.

విదురుడు పాండవుల్ని తీసుకుని వస్తున్నాడన్న వార్త హస్తినపురంలో ధృతరాష్ట్రుడికి తెలిసింది. వికర్ణుడు, చిత్రసేనుడు, ద్రోణుడు, కృపాచార్యుడు మొదలైన వాళ్లని పాండవులకి ఎదురు వెళ్లమని పంపించాడు. పాండవులకి ఏ అపాయం జరుగ కూడదని అపారమైన సైన్యంతో, ఎనలేని సంపదలతో, వాసుదేవుడు ధృష్టద్యుమ్నులు వెంట వచ్చారు. వాళ్ల అండదండలతో ఉత్సవం జరుగుతుంటే ఊరేగింపుగా వచ్చినట్టు అపారమైన సైన్యము, సంపదలతో పాండవులు హస్తినాపురంలో ప్రవేశించారు.

పట్టణంలో ఉన్న ప్రజలందరు పాండవుల వైపు ప్రేమతోను సంతోషంతోను చూశారు. “ధర్మానికి ప్రతిరూపమైన ధర్మరాజు తమ్ముళ్లతో కలిసి ఇక్కడికి వచ్చాడు. పాండురాజే మనల్ని కాపాడడం కోసం మళ్లీ బ్రతికి వచ్చినట్టుగా కనిపిస్తోంది. మనకి మంచి రోజులు వచ్చాయి. గొప్పవాళ్లైన పాండవులకి దైవబలం, మానవబలం కూడా ఉంది. అందువల్ల ఇప్పటికి కలిగిన ఆపదలు పోయాయి. కాని, రాజ్యం స్థిరంగా ఉంటుందా? మనం చేసుకున్న దానాలు, జపాలు, హోమాల వల్ల మనకి ఏదయినా పుణ్యం ఉండి ఉంటే దాన్ని పాండవులకే ధారపోస్తాము. ధర్మరాజు ఈ హస్తినాపురంలోనే ఉండి మొత్తం భూమండలాన్ని పరిపాలించాలి” అని ఆశీర్వదించారు.

పూరువంశ రాజకుమారులు పాండవులు కురువంశపు పెద్దలైన భీష్ముడు, ధృతరాష్ట్రుడు మొదలైన పెద్దలకి నమస్కారం చేశారు. దుర్యోధనుడు మొదలైనవాళ్లతో కలిసి రాజ్యవిద్యకి సంబంధించిన వినోదాలతో గడిపి ప్రజలందరికి సంతోషం కలిగించారు. అప్పటికి అయిదు సంవత్సరాలు పూర్తయ్యాయి. ఒకరోజు భీష్ముడు, ద్రోణుడు, దుర్యోధనుడు మొదలైన పెద్దలంతా సభలో కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో ధృతరాష్ట్రుడు పాండవులతో “ప్రజలందరి కర్మకి సాక్షి అయిన శ్రీకృష్ణుడి సాక్షిగా పెద్దలందరి ఎదురుగా రాజులందరు చూస్తుండగా మీకు అర్ధరాజ్యాన్ని ఇచ్చాను. పాండురాజు సంపదని మొత్తాన్ని మీరు అనుభవించండి. మీరందరు ఖాండవప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని అందరితో స్నేహంగా ఉంటూ సంతోషంగా ఉండండి!” అని చెప్పి ధర్మరాజుని అర్ధరాజ్యానికి రాజుగా అభిషేకం చేశాడు.

ధృతరాష్ట్రుడి ఆజ్ఞప్రకారం భీష్ముడు మొదలైన పెద్దల ఆశీర్వాదం తీసుకుని పాండవులు శ్రీకృష్ణుడితో కలిసి ఖాండవప్రస్థానికి వెళ్లారు.

Exit mobile version