Site icon Sanchika

మహాభారత కథలు-56: మయుడు నిర్మించిన సభ

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

సభాపర్వము – మొదటి ఆశ్వాసము

మయుడు నిర్మించిన సభ:

[dropcap]ఉ[/dropcap]గ్రశ్రవసుడు అనే మహర్షి నైమిశారణ్యంలో శౌనకుడు మొదలైన మహర్షులకి ఖాండవ వన దహనం జరిగే వరకు కథని వినిపించాడు. తరువాత జరిగిన కథని వివరిస్తున్నాడు.

ఖాండవ వన దహనం పూర్తయ్యాక శ్రీకృష్ణుడు, అర్జునుడు ధర్మరాజు దగ్గరికి వచ్చారు. మయుడు అదే సమయంలో అర్జునుడి దగ్గరికి వచ్చి సంతోషంగా నమస్కారం చేశాడు. “అర్జునా! నువ్వు నా ప్రాణాలు కాపాడి నాకు గొప్ప ఉపకారం చేశావు. బదులుగా నీకు ఉపకారం చెయ్యగలిగినంత గొప్పవాణ్ని కాదు కాని, కృతజ్ఞతతో నీకు ఇష్టమైనది ఏదేనా చెయ్యాలని ఉంది. నేను రాక్షస శిల్పిని. అన్ని కళల్లోనూ నేర్పు కలవాడిని. మీకు ఏది ఇష్టమో చెప్తే దాన్ని నిర్మించి ఇస్తాను” అన్నాడు.

మయుడి మాటల్లో ఎంతో వినయము, అంతులేని ఆనందము, కృతజ్ఞతాభావము కనిపిస్తున్నాయి. అతడి మాటలు విని శ్రీకృష్ణుడు “ధర్మరాజు కురువంశానికి రాజు. అంతేకాదు, రాజులందరితో గౌరవించబడుతున్న అంతులేని వైభవం కలిగిన ప్రభువు. నీ శిల్పకళా నైపుణ్యానికి ప్రతీకగా అనేక విధాలైన రత్నాలతో నిండినది, అపూర్వమైంది, మరెక్కడా లేనంత అందంగా ఉండేలా ఒక మహాసభని నిర్మించి ఇయ్యి!” అని చెప్పాడు.

శ్రీకృష్ణుడు చెప్పినది విని మయుడు “ఈ భూమి మీద ఉన్న ధర్మరాజు సంపదల్లోను, భోగాలు అనుభవించడంలోను రాక్షస, దేవతల ప్రభువులకంటే గొప్పవాడు. దేవతల మేడలు కూడా ఇంత బాగుండవేమో అని ప్రజలు చెప్పుకునేంత అద్భుతంగా ఆయన గొప్పతనానికి తగినట్టుగా మణుల కాంతితో మెరిసే మహాసభని నిర్మించి ఇస్తాను.

పూర్వం వృషపర్వుడనే రాక్షసరాజుకి ఒక సభని నిర్మించి ఇవ్వాలనుకున్నాను. అందుకోసం అనేక రత్నాలతో సామగ్రిని సమకూర్చుకున్నాను. దాన్ని ‘బిందిసరము’ అనే సరోవరంలో భద్రంగా దాచి ఉంచాను. ఇప్పుడు ఆ సామగ్రిని తెచ్చి చిత్ర విచిత్రమైన సభని నిర్మించి ధర్మరాజుకి బహుమానంగా ఇస్తాను.

అంతేకాదు, భౌమాదిత్యుడు అనే రాజర్షికి సంబంధించిన గద, శంఖము నా అధీనంలోనే ఉన్నాయి. శత్రువులందర్నీ నాశనం చెయ్యడానికి ఉపయోగించే గదని భీమసేనుడికి ఇస్తాను. మహాభయంకరంగా దివ్యధ్వని చేసే దేవదత్త శంఖాన్ని అర్జునుడికి ఇస్తాను” అని చెప్పాడు.

ధర్మరాజు మయుణ్ని సన్మానించి పంపించాడు. శ్రీకృష్ణుడు తన తండ్రిని చూడాలన్న కోరికతో పాండవుల దగ్గర సెలవు తీసుకుని ద్వారవతికి వెళ్లాడు.

మయుడు ఈశాన్యం వైపుకి వెళ్లి కైలాసపర్వతానికి ఉత్తరం వైపు ఉన్న మైనాకపర్వతం మీద హిరణ్య శిఖరాన్ని చేరుకున్నాడు. ఎక్కడయితే పరమేశ్వరుడు సకల చరాచర వస్తువులు కలిగిన లోకాలన్నింటినీ పుట్టేటట్లు చేశాడో.. ఎక్కడయితే గంగని ప్రత్యక్షం చేసుకోడానికి సగరుడి మునిమనుమడు భగీరథుడు నివాసం ఏర్పరుచుకున్నాడో.. ఎక్కడయితే రత్నాలకి ఉన్న రంగురంగుల కాంతులతో విశాలంగా ఉన్న యజ్ఞశాలలు ఉన్నాయో.. ఎక్కడయితే బలిపశువుని బంధించడానికి విశాలమైన బంగారంతో చెయ్యబడిన స్తంభాలు నాటబడి ప్రకాశిస్తుండగా బ్రహ్మ, నరుడు, నారాయణుడు, శివుడు, ఇంద్రుడు మొదలైన ముఖ్యులైన దేవతలు యజ్ఞాలు చేశారో.. అటువంటి బిందుసరం అనే సరోవరంలో ఉన్న అనేక విధాలైన రత్నాలతో ఉన్న సాధనాలన్నింటినీ తీసుకున్నాడు. తన పని చెయ్యడానికి ముందు మయుడు దేవతల్ని, బ్రాహ్మణుల్ని పూజించాడు.

తరువాత భూదేవికి అందమైన అలంకారంగా ఉండేలా సభని నిర్మించడం మొదలుపెట్టాడు. మణులతో తయారయిన దూలాలు, స్తంభాలు, గోడలు, అరుగులు, రాతికట్టడపు ప్రదేశాలతోను, ప్రహారీగోడలతోను ఎంతో అందంగా ఉన్న సభని కట్టించడం పూర్తి చేశాడు.

గొప్ప కాంతులు కలిగిన ఇంద్రనీలమణుల కిరణాలు అనే నీళ్లు; పద్మరాగమణులతో చెక్కిన ఎర్రని పద్మాలు; వెండితో చేసిన తెల్లతామరలు; రాజహంసలు; మేలిమి బంగారంతో పోత పోసిన తాబేళ్లు; వైడూర్యాలతో మలిచిన కలువలు; వజ్రాలతో చేసిన చేపలు; ముత్యాలతో కల్పించిన కొత్త కొత్త నురుగులు; నాచులు అనిపించేలా మరకతాలతో తయారు చెయ్యబడిన మణులతో నిండిన ప్రదేశాలు నీటిమడుగులుగాను; స్ఫటికపు రాళ్ల గోడల కాంతులు కప్పడం వల్ల నీళ్లు ఉండే చోటుని నీళ్లు లేవని భ్రమపడేట్లుగాను మయుడు సభని నిర్మించాడు.

అపురూపమైన ఆ సభా భవనంలో మయుడు మనోహరమైన అనేక యంత్రాలు అమర్చాడు. పూలతో, పండ్లతో ఎప్పుడూ కళ్లకి ఆనందం కలిగించేట్లుగా కనిపించే ఉద్యానవనాల్ని, అరవిచ్చిన తామరలతోను, పూచిన కలువలతోను కళకళలాడే కొలనుల్ని కల్పించాడు. వ్రేలాడే రకరకాలైన పతాకాల తోరణాలతో కలిసి గువ్వల గూళ్లు ఉన్న ప్రదేశాల్ని కూడా చూడ్డానికి ముచ్చటగా ఉండేలా ఏర్పాటు చేశాడు.

బిందుసరం దగ్గర పధ్నాలుగు నెలలు శ్రమించి పదివేల మూరల చుట్టుకొలతలతో సువిశాలంగా, సూర్యకిరణాలు ప్రసరించేలా, వైభవోపేతంగా, వివిధరత్నాల కాంతులతో గొప్పగా ప్రకాశించేలా ఆ సభాభవనాన్ని నిర్మించాడు. పెద్ద శరీరము, అమితమైన వేగము, అత్యంత బలము, ఆకాశంలో సంచరించగలిగిన నేర్పు కలిగిన ఎనిమిదివేలమంది రాక్షస భటులతో ఆ సభాభవనాన్ని మోయించి తీసుకుని వచ్చి ధర్మరాజుకి ఇచ్చాడు. భీముడికి గదని, అర్జునుడికి శంఖాన్ని అందించాడు. ధర్మరాజు మయుణ్ని తగిన విధంగా సత్కరించాడు. మయుడు తన ప్రదేశానికి వెళ్లిపోయాడు.

మయసభలో ప్రవేశించిన ధర్మరాజు

విశేషమైన కీర్తి కలిగిన ధర్మరాజు పదివేలమంది బ్రాహ్మణులకి భక్తితో ఆరు రుచులతోను, పిండివంటలతోను భోజనాలు పెట్టాడు. ఒక్కొక్కళ్లకి వెయ్యి గోవుల్ని; మణులు పొదిగిన ఆభరణాల్ని, సన్నని వస్త్రాల్ని, పువ్వులు పండ్లు గంధాలతో కలిసి ధర్మపరంగా దానంగా ఇచ్చాడు. తమ్ముళ్లతో కలిసి ధౌమ్యుడు మొదలైన బ్రాహ్మణుల ఆశీర్వచనము, పుణ్యాహవాచన మంత్రాల ధ్వనుల మధ్య జ్యోతిశ్శాస్త్ర నిపుణులతో నిర్ణయింపబడిన శుభ ముహూర్తంలో మయసభలోకి ప్రవేశించాడు.

బ్రాహ్మణులందర్నీ భక్తితో పూజించాడు. ఎవరు ఏది అడిగినా లేదనకుండా దానం చేసి అందర్నీ తృప్తిపరిచాడు. అంతులేని ఐశ్వర్యంతో బంధుమిత్రులకి ఆనందాన్ని కలిగించాడు. గొప్ప పరాక్రమము, ఐశ్వర్యము, కీర్తి కలిగి మయసభలో కొలువు తీరిన ధర్మరాజుని నాలుగు దిక్కుల్లో ఉన్న రాజులు వచ్చి సంతోషంతో దర్శించుకున్నారు. పుణ్యాత్ముడైన ధర్మరాజు తన కీర్తిని అన్ని దిక్కులకీ వ్యాపించేలా చేసుకున్నాడు.

మహాభారత కథ చెప్తున్న ఉగ్రశ్రవసుడు సబలుడు, మార్కండేయుడు, శునకుడు, మౌంజాయనుడు, మాండవ్యుడు, సువ్రతుడు మొదలైన మహర్షులతో కలిసి తను కూడా ఎంతో అందమైన ధర్మరాజ సభకి వెళ్లామని; ధర్మరాజు వచ్చిన మహర్షుల్ని భక్తితో పూజించి వాళ్ల ఆశీర్వచనాలు అందుకున్నాడని; ఆ మహర్షులు చెప్పిన ధర్మపరమైన కథలు వింటూ తమ్ముళ్లతో కలిసి సంతోషంగా ఉన్నాడని శౌనకుడు మొదలైన మహర్షులకి చెప్పాడు.

Exit mobile version