మహాభారత కథలు-61: జరాసంధుడి దగ్గరికి చండకౌశికుడు

0
2

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

జరాసంధుడి దగ్గరికి చండకౌశికుడు:

[dropcap]పె[/dropcap]రిగి పెద్దవాడవుతున్న జరాసంధుణ్ని చూడాలని చండకౌశిక మహర్షి బృహద్రథుడి రాజ్యానికి వచ్చాడు. బృహద్రథుడు కొడుకు, భార్యలు, మిత్రులు, సేవకులు, మంత్రులతో ఆనందంగా ఎదురువెళ్లి నమస్కరించి మహర్షిని ఆదరంగా తీసుకుని వచ్చి తగిన పీఠం మీద కూర్చోబెట్టాడు. కాళ్లు కడిగి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి పూజించాడు. తన రాజ్యంతో సహా సర్వస్వాన్ని సమర్పించి, ఆయన అనుగ్రహం వల్ల కలిగిన  తన కుమారుణ్ని ఆయనకి చూపించాడు.

మహర్షి జరాసంధుణ్ని చూసి సంతోషించాడు. “మహారాజా! జర అనే రాక్షసి నీకు గొప్ప మేలు చేసింది. ఈ సంగతి యోగదృష్టితో తెలుసుకున్నాను. ఇతడు కుమారస్వామికి ఉన్నంత శక్తి కలవాడు అవుతాడు. పరమేశ్వరుణ్ని ప్రత్యక్షం చేసుకుంటాడు. ఎంత బలవంతులైనా శత్రువులైనా ఇతణ్ని ఓడించలేరు. ఇతడితో సమానమైన పరాక్రమం కలవాళ్లు ఎవరూ ఉండరు. మహారాజుల్లో గొప్పవాడుగా ప్రకాశిస్తాడు. దివ్యాస్త్రాలు కూడా ఇతడి దేహానికి హాని చెయ్యలేవు. ఇతర రాజుల సంపదలన్నీ తనే చేజిక్కించుకుంటాడు” అని చండకౌశిక మహర్షి జరాసంధుడి సామర్థ్యాన్ని గురించి చెప్పాడు.

“ధర్మరాజా! యౌవనంలో ఉన్న వీరుడైన తన కుమారుడికి పట్టాభిషేకం చేసాడు బృహద్రథుడు. తన రాజ్యాన్ని అతడికి అప్పగించి భార్యలతో కలిసి తపోవనానికి వెళ్లిపోయాడు” అని చెప్పాడు.

శ్రీకృష్ణుడితో భీమార్జునులు

ఆయుధాలతో చావులేని హంసడిభకులు ఇప్పుడు జరాసంధుడికి తోడు లేరు. అందువల్ల అతడు ఆయనలు లేని సూర్యుడు ఎలా ఉంటాడో.. రెక్కలూ రెండూ తెగిన గరుత్మంతుడు పౌరుషం లేకుండా ఎలా నీరసపడిపోతాడో అలా తనకి ఏం జరుగుతుందో అనే భయంతో ఉన్నాడు.

జరాసంధుడి బాహుబలం చాలా గొప్పది. అతణ్ని ఆయుధ యుద్ధంలో ఎవరూ ఓడించలేరు. ప్రేమతో పరమేశ్వరుడే అతడికి ఆ వరం ఇచ్చాడు. మల్లయుద్ధంలో అతడికి ఆ వరం ఇవ్వలేదు. జరాసంధుడి వధ జరిగితే మల్లయుద్ధంలోనే జరగాలి.

అది భీముడి చేతిమీదుగానే జరగాలి. కనుక, అతి భయంకరమైన మల్లయుద్ధంలో గొప్ప బాహుబలం కలిగిన మన భీముడే అతణ్ని ఓడిస్తాడు.

ధర్మరాజా! పార్థుడి రక్షబలం, భీముడి భుజబలం, నా నీతిబలం నీకు అండగా ఉండగా నీకు అసాధ్యం ఏముంది? కాబట్టి, ఇంక ఆలస్యం చెయ్యకుండ నేను అర్జునుడు, భీముడు కలిసి వెళ్లి యుద్ధంలో జరాసంధుణ్ని ఎదుర్కుని జయించి వస్తాము. నా మీద నీకు నమ్మకం ఉంటే నీ తమ్ముళ్లని నాకు అప్పగించు” అన్నాడు

తన నిర్ణయాన్ని వివరంగా చెప్పిన శ్రీకృష్ణుణ్ని, విజయం సాధించి వచ్చినంత గొప్పతేజస్సుతో  ప్రకాశిస్తున్న తమ్ముళ్లు భీమార్జునుల్ని చూసి ధర్మరాజు “శ్రీకృష్ణా! ప్రేమ చూపించేవాడివి, ఇష్టుడివి, నిజం చెప్పే వాడివి, శత్రువులకి భయం కలిగించేవాడివి నువ్వు చెప్పినట్టే నడుచుకునే మాకు అపజయం ఎందుకుంటుంది?

జరాసంధుడి చెరసాలలో బందీలుగా ఉన్న రాజులందరికి విముక్తి కలిగిస్తే రాజసూయ యాగం కూడా పూర్తయినట్టే. భూమిని ధరించేవాడివి, అన్ని సుగుణాలకి స్థానమైనవాడివి, దయగలవాడివి, మొత్తం కార్యభారాన్ని జరిపించేవాడివి, గొప్ప పరాక్రమవంతుడివి నువ్వు మాకు అండగా ఉన్నప్పుడు మాకు పొందలేనివి ఏముంటాయి?

భీమార్జునులు నాకు కళ్లు, కృష్ణుడు మనస్సు. ప్రియమైన మీ ముగ్గుర్నీ వదిలి ఒక్క నిముషమైనా ఉండలేను. అయినా కూడా నా మనస్సు చాలా సంతోషంగా ఉంది. కృష్ణార్జునుల్ని స్మరిస్తేనే చాలు కలిమి, గెలుపు కలుగుతాయని అంటారు. ఈ మహాత్ములిద్దర్నీ సహాయంగా పొందిన భీమసేనుడికి ఐశ్వర్యం విజయం కలుగుతాయి అనడంలో సందేహం లేదు. మీరు వెళ్లిన పని నెరవేరుతుంది. వెళ్లిరండి!” అని ధర్మరాజు వాళ్లని సాగనంపాడు. భయంకరమైన శత్రువు జరాసంధుణ్ని చంపడానికి బయలుదేరిన సింహాలవంటి శ్రీకృష్ణభీమార్జునుల్ని చూసి ధర్మరాజు సంతోషించాడు.

జరాసంధుడి దగ్గరికి శ్రీకృష్ణభీమార్జునులు

బ్రహ్మచారి వేషంతో శ్రీకృష్ణభీమార్జునులు ఒకే పర్వతం నుంచి పుట్టిన కాలకూట, శోణ, గండకీ, సదానీర అనే  నదుల్ని దాటారు. సరయూనది, పూర్వకోసల, మిథిలాదేశాల్ని, గంగానదిని దాటారు. తూర్పువైపుకి తిరిగి ఆగకుండా ప్రయాణం చేసి మగధదేశంలోకి ప్రవేశించారు.

గోరథం అనే పర్వతాన్ని ఎక్కారు. ఎత్తుగా వరుసగా ఉన్న మేడలు, కొత్త సువాసనలు వెదజల్లే పువ్వులతో ఉన్న తోటలతో; ఎవరికీ ఎక్కడానికి వీలులేనంత ఎత్తైన వజ్రాలతో నిండిన ప్రాకారాలు, అందమైన గోపురాలు కలిగి; ఐశ్వర్యంలో కుబేరుడి పట్టణమైన అలకాపురాన్ని తలపించే గిరివ్రజమనే పేరుగల పట్టణాన్ని చూశారు.

ఆ పట్టణాన్ని, అపూర్వమైన దాని సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపడి శ్రీకృష్ణుడు భీమార్జునులతో “గోరథం, ఋషభం, వైహారం, ఋషిగిరి, చైత్రకాద్రి అనే పేర్లున్న అయిదు పెద్ద పర్వతాలు ఈ పట్టణానికి చుట్టూ ఉండి వీరులైన భటుల్లా రక్షణ కల్పిస్తున్నాయి. ఆ అయిదు కొండలూ చుట్టూ ఉండడం వల్లనే ఈ పట్టణానికి ‘గిరివ్రజం’ అనే పేరు వచ్చింది.

పూర్వం గౌతమ మహర్షి ‘ఔశీనరి’ అనే శూద్ర వనిత యందు కాక్షీపుడు మొదలైన వాళ్లని సృష్టించాడు.  గౌతమమహర్షి అనుగ్రహం వల్ల, ఈ పర్వతానికి ఉన్న బలం వల్ల మగధరాజ్యాన్ని ఎవరూ జయించలేరని చెప్పాడు” అని గిరివ్రజపురం గురించి చెప్పాడు. తరువాత శ్రీకృష్ణుడు నగరద్వారం నుంచి లోపలికి వెళ్లడానికి ఇష్టపడక చైత్యకము అనే కొండమీదకి వెళ్లాడు.

అక్కడ ఉన్న మూడు పెద్ద ఢక్కలని భీమార్జునులకి చూపించాడు. పూర్వం మగధరాజులు  ‘మానుషాదము’ అనే ఎద్దుని చంపి దాని చర్మంతో ఆ ఢక్కలని తయారుచేశారని, కొత్తవాళ్లు ఎవరేనా పురంలోకి ప్రవేశిస్తుంటే గౌతమ మహర్షి మహిమ వల్ల అవి మోగుతాయని చెప్పాడు.

మొదట తమ బాహుబలంతో ఆ భేరులు మూడింటిని పగులగొట్టారు. తరువాత చైత్యకపర్వతం యొక్క విశాలమైన మధ్య భాగాన్ని పగులకొట్టి ద్వారంలేని వైపు నుంచి గిరివ్రజపురంలోకి ప్రవేశించారు. శ్రీకృష్ణభీమార్జునులు ముగ్గురూ పూలమాలలు కట్టేవాళ్ల ఇళ్లకి, సుగంధ ద్రవ్యాలు అమ్మేవాళ్ల ఇళ్లకి వెళ్లి బలవంతంగా పువ్వులు, గంధము తీసుకున్నారు.

యాదవ పాండవ సింహాలైన  శ్రీకృష్ణభీమార్జునులు సిగల్లో పువ్వులు అలంకరించుకుని, చేతులకి గంధము అగరు పూసుకున్నారు. రాజమార్గానికి దగ్గరగా వెడుతున్న ముగ్గుర్నీ మగధదేశ ప్రజలు ఆశ్చర్యంగా చూస్తుండగానే హిమాలయం నుంచి వచ్చిన సింహాలు గోశాలలోకి వెళ్లినట్టు బ్రాహ్మణులకి ప్రవేశమున్న మార్గం నుంచి జరాసంధుడి మందిరంలోకి వెళ్లారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here