Site icon Sanchika

మహాభారత కథలు-62: జరాసంధుడు, శ్రీకృష్ణభీమార్జునుల సంభాషణ

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

జరాసంధుడు, శ్రీకృష్ణభీమార్జునుల సంభాషణ:

[dropcap]అ[/dropcap]ర్ధరాత్రి సమయంలో కూడా అభ్యాగతులు, బ్రాహ్మణులు, బ్రహ్మచారులు ఎవరు వచ్చినా అమితమైన భక్తితో ఆదరిస్తాడు జరాసంధుడు. స్నాతకవ్రతుల్లా వచ్చిన శ్రీకృష్ణభీమార్జునులకి ఎదురు వెళ్లాడు. వాళ్లకి ప్రేమతో మధుపర్కాలు, పెరుగు, తేనె కలిపిన తియ్యని పదార్థము ఇవ్వబోయాడు. వాళ్లు జరాసంధుడు ఇచ్చేవాటిని తీసుకోలేదు. బుద్ధిమంతుడైన జరాసంధుడికి వచ్చినవాళ్ల స్వభావం కొంత అర్థమైంది.

“మీరు స్నాతకవ్రతులే అయితే పువ్వులు, గంధము బలవంతంగా తీసుకుని అలంకరించుకోరు. మీ భుజబలాన్ని ప్రదర్శిస్తూ.. చైత్యక పర్వతాన్ని పగలకొట్టి ద్వారం కాని మార్గం నుంచి సులభంగా గిరివ్రజపురం లోపలికి ప్రవేశించరు. అంతేకాకుండా నేను ఇస్తున్న మధుపర్కాన్ని కూడా మీరు తీసుకోలేదు.

అసలు మీరు స్నాతక బ్రహ్మచారులేనా లేక ఆ వేషంలో వచ్చారా? మీ వేషం చూస్తే బ్రాహ్మణులే అనిపిస్తున్నారు. బలమైన మీ బాహువులు, విశాలమైన వక్షస్థలం చూస్తే క్షత్రియుల్లా కనిపిస్తున్నారు” అన్నాడు జరాసంధుడు.

అతడి మాటలు విని శ్రీకృష్ణుడు “జరాసంధా! పుణ్యకర్మలు చెయ్యడం వల్ల ప్రాచీనులయిన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య జాతి స్నాతకుల్లో మేము క్షత్రియజాతి స్నాతకులం. ద్వారం నుంచి మిత్రుడి ఇంటికి, వెళ్లకూడని మార్గంలో శత్రువు ఇంటికి వెళ్లడం భుజబలం కలిగిన క్షత్రియులు చెయ్యతగిన పని. గంధంలోను, పువ్వుల్లోను లక్ష్మి ఉంటుంది కాబట్టి మేము వాటిని బలాత్కారంగా తీసుకున్నాము. నీతో మాకు వేరే పని ఉంది కనుక నువ్వు ఇచ్చే అర్ఘ్యాన్ని తీసికోవడం లేదు” అన్నాడు.

శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు విని జరాసంధుడు “ఇంతకు ముందు ఎప్పుడూ మీరు నాకుగాని, నేను మీకుగాని ఏ అపకారమూ చెయ్యలేదు. నేను ఏ తప్పూ చెయ్యని మంచి గుణాలు కలవాణ్ని. ఏ కారణం వల్ల నేను మీకు శత్రువుని అయ్యాను? దేవతలు, మహర్షులు, బ్రాహ్మణులు అంటే నాకు భక్తి ఎక్కువ. ఉత్తముడైన క్షత్రియుడు ఆచరించవలసిన ధర్మాలన్నింటినీ కూడా నేను ఆచరిస్తాను” అన్నాడు.

జరాసంధుడు చెప్పినది విని శ్రీకృష్ణుడు “క్షత్రియ కులాల్ని అన్నిటినీ ఉద్ధరిస్తున్న ధర్మరాజు ఆజ్ఞాపించడం వల్ల క్షత్రియకులాన్ని రక్షించడానికి ఇక్కడికి వచ్చాము. అపజయమంటే ఏమిటో తెలియని శత్రువుల్ని అంతం చెయ్యడానికి, దుర్మార్గుల్ని దూషించడానికి ఇక్కడికి వచ్చాము.

నువ్వు ఉత్తమమైన క్షత్రియుడిలా జీవితాన్ని గడుపుతున్నానని చెప్పావు. ఎప్పుడూ ఎవరికీ కీడు చెయ్యలేదని అన్నావు. ఈ భూమి మీద ఉత్తమ క్షత్రియులు నీలాగ క్రూరంగా రాజుల్ని చెరబట్టి బలి ఇస్తూ శివుణ్ని పూజించినవాళ్లని ఎవరినయినా నువ్వు చూశావా? ఇంతకు మించిన కీడు ఇంకేముంటుంది?

అకారణంగా మంచివాళ్లని బాధపెట్టే దుర్మార్గుడు అందరికీ శత్రువేకదా? మన మధ్య ఇంతకంటే శత్రుత్వం ఇంకేముంటుంది? ఏ తప్పూ చెయ్యని తన కులంవాణ్నే చంపడం కంటే పాపం మరొకటి ఉంటుందా? నీ వంటి పాపపు పనులు చేసేవాళ్లని పట్టించుకోకుండా వదిలేస్తే అన్ని ధర్మాల్ని రక్షించడానికి సమర్థత ఉన్న మాకు ఆ పాపం చుట్టుకుంటుంది.

ఆ పాపభయంతోనే నిన్ను దండించాలని వచ్చాము. నన్ను మించిన క్షత్రియుడు లేడు అనే అహంకారంతో ఇతరుల్ని అవమానించి మాట్లాడవద్దు.

పూర్వం జయద్రథుడు, దంభోద్భవుడు, కార్తవీర్యుడు మహాబలవంతులే అయినా అవినీతిపరులై మహాత్ముల్ని అవమానించడం వల్లే ఇతరుల చేతిలో ఓడిపోయారు. పరాక్రమము అనే గొప్ప సంపదతో యజ్ఞం చేస్తున్నట్టు దీక్షపట్టి శత్రువుల్ని ఓడించిన వీరులు, గొప్ప తపస్సంపన్నులు స్వర్గాన్ని పొందుతారు. నీలాగ సాటి రాజుల్ని క్రూరంగా హింసిస్తూ గర్వంతో శివపూజ చేస్తే మోక్షం వస్తుందా?

నువ్వు చెడిపోకుండా ఉండాలంటే నేను చెప్పినట్టు చెయ్యి. నీ దగ్గర బందీలుగా ఉన్న రాజులందర్నీ విడిచిపెట్టు. మేము ఎవరమో చెప్తున్నాను విను. నేను కృష్ణుణ్ని, వీళ్లిద్దరూ భీమార్జునులు కురువంశంలో గొప్పవాళ్లు, మహాబల పరాక్రమవంతులు. నువ్వు రాజుల్ని చెరనుంచి విడిపించకపోతే ఈ భీమార్జునులు తమ భుజబలంతో నీ పొగరు అణుస్తారు. తరువాత నీ దగ్గర బందీలుగా ఉన్న రాజుల్ని విడిపిస్తారు” అన్నాడు.

శ్రీకృష్ణుడు మాటలు విన్న జరాసంధుడు కోపంతో “నాకున్న బలపరాక్రమాలతో ఇతర రాజుల మీద దండెత్తి వాళ్లని జయించి గర్వపడడం తప్పు కాదు. ఇది ఉత్తములైన క్షత్రియ ధర్మమే. ఎప్పుడూ పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ జీవించాలన్నదే నా వ్రతం.

నా దగ్గర బందీలుగా ఉన్న రాజులందర్నీ యుద్ధంలో ఓడించి తీసుకుని వచ్చాను. పరమేశ్వరుడికి బలి ఇవ్వడానికి తెచ్చిన రాజుల్ని ఎందుకు వదిలి పెడతాను? నా సంగతి నీకు ఇదివరకే తెలుసు కదా?” అని అడిగాడు.

భీమసేనుడు జరాసంధుల మల్లయుద్ధము

శ్రీకృష్ణుడి మాటలు విని జరాసంధుడు యుద్ధానికి సన్నద్ధమయ్యాడు. “సైన్యం సైన్యంతోగాని, మీ ముగ్గురితోగాని, మీలో ఇద్దరితోగాని, ఒంటరిగా మీలో ఒక్కరితోగాని యుద్ధం చెయ్యడానికి నేను సిద్ధంగా ఉన్నాను. బాహుబలంతోగాని, ఆయుధంతోగాని, ఏ విధంగా నాతో యుద్ధం చెయ్యడం మీకు ఇష్టమో అలాగే నాతో యుద్ధానికి రండి!” అన్నాడు.

అతడి మాటలు విని శ్రీకృష్ణుడు “బలవంతులు ఎక్కువమంది విజృంభించి ఒక్కడితో యుద్ధం చెయ్యడం ధర్మం కాదు. గొప్ప బలపరాక్రమవంతులమైన మాలో ఒక్కరిని యుద్ధానికి నువ్వే ఎంచుకో. అతడే నిన్ను ఎదుర్కుంటాడు. భయంకరమైన మల్లయుద్ధంలో నిన్ను ఓడిస్తాడు” అన్నాడు.

శ్రీకృష్ణుడి మాటలకి జరాసంధుడు గర్వంతో “మల్లయుద్ధంలో నాకు సరిజోడు వాయుపుత్రుడైన భీముడే!” అని చెప్పి భీముడితో మల్లయుద్ధానికి సిద్ధమయ్యాడు. యుద్ధం చెయ్యడానికి ముందు జరాసంధుడు మగధరాజ్యానికి తన కొడుకు సహదేవుణ్ని రాజుగా పట్టాభిషేకం చేశాడు. తరువాత పురోహితుల దగ్గర మంగళాశీర్వచనాలు పొందాడు.

బలవంతుడైన జరాసంధుడు తన జుట్టుని వెనక్కి కట్టి ముడి వేసుకున్నాడు. వీరావేశంతో విజృంభించాడు. మల్లయుద్ధానికి అవసరమైనవి అలంకరించుకుని భీముడికి ఎదురుగా నిలబడ్డాడు. భీమసేనుడు కూడ జరాసంధుడితో మల్లయుద్ధానికి సిద్ధంగా అతడితో సరిసమానంగా ఎదురుగా నిలబడ్డాడు.

సమానమైన బలం కలిగిన భీముడు, జరాసంధులు ఇద్దరూ పెల్లుబికిన పరాక్రమంతో బ్రహ్మాండమంతా వినిపించేలా తమ బాహువుల్ని చరుచుకుంటూ మితిమీరిన కోపంతో ఒకళ్లనొకళ్లు అవలీలగా ఎదుర్కున్నారు.

శత్రువులయిన భీమ జరాసంధులు ఒకళ్లతో ఒకళ్లు మహాభయంకరంగా యుద్ధం చేస్తున్నారు. వ్యాయామం వల్ల గట్టి పడి కఠినంగా మారిన ఇనుపగుదియల్లా కఠినంగా పొడవుగా ఉన్న వాళ్ల బాహుదండాల దెబ్బలతో చూడ్డానికి మహాభయం కలిగిస్తోంది.

సాటిలేని భయము, ఒకళ్ల నొకళ్లు జయించాలన్న కోరిక కలిగిన గొప్ప రాజులు, యుద్ధంలో వీరులు అయిన భీముడు, జరాసంధుడు.. సింహము గజేంద్రుడు; ఇంద్రుడు వృత్రాసురుడు చేసినట్టు మహాభయంకరంగా యుద్ధం చేస్తున్నారు.

వాళ్లిద్దరు కార్తీక శుద్ధ పాడ్యమి రోజు మొదలు పెట్టి ఒకళ్లనొకళ్లు పట్టి, కొట్టి, పొడిచి, తన్ని, త్రోసి ఎడతెగని మహాయుద్ధం చేశారు. త్రయోదశి రోజు మల్లయుద్ధం భీకరంగా జరిగింది. ఆ రోజు జరాసంధుడు అలిసిపోవడాన్ని గుర్తించాడు శ్రీకృష్ణుడు.

జరాసంధుణ్ని వథించిన భీముడు

అలిసిపోయిన జరాసంధుణ్ని చూసి శ్రీకృష్ణుడు “భీమసేనా! వాయుపుత్రా! నీ శత్రువు జరాసంధుడు బలహీనంగా కనిపిస్తున్నాడు. రాజులందరికీ అపకారం చేసిన దుర్మార్గుడైన ఇతణ్ని సంహరించి నీ బాహుబలాన్ని, నీ తండ్రి వాయుదేవుడి బలాన్ని లోకంలో ప్రకాశించేలా చెయ్యి!” అన్నాడు.

శ్రీకృష్ణుడి మాటలు విని భీముడు తన తండ్రి వాయుదేవుణ్ని మనస్సులో ధ్యానించాడు. ఆయన అనుగ్రహంతో వీరులైన శత్రువుల్ని సునాయాసంగా సంహరించగల వాయుపుత్రుడు జరాసంధుణ్ని పైకి ఎత్తి పట్టుకుని విసిరేశాడు. అతడి ముక్కు, నోరు, చెవుల్లోంచి రక్తం ధారలుగా కారుతోంది. పెద్దగాలికి అటు ఇటు తిరిగి పడే గడ్డిపరకలా మగధరాజైన జరాసంధుణ్ని అదేవిధంగా పైకెత్తి వందసార్లు విసిరేశాడు.

జరాసంధుణ్ని పట్టుకుని భీమసేనుడు అరచేత్తో కొట్టి, కీళ్ల మధ్య కొట్టి కీళ్లు విరిచేశాడు. చివరికి జరాసంధుణ్ని చంపిన భీమసేనుడు భూమండలం మొత్తం ప్రతిధ్వనించేలా గట్టిగా అరిచాడు. భీముడు పెట్టిన కేకకి భూమండలం బ్రద్దలయిందో, హిమాచల శిఖరం ముక్కలైందో అని గిరివ్రజపురంలో ఉన్న ప్రజలు భయంతో వణికిపోయారు. జరాసంధుడి సైన్యం కూడా చాలా వరకు నాశనమయింది.

భీమసేనుడు జరాసంధుణ్ని సంహరించాక అతడి చావు గురించి లోకంలో అందరికీ తెలియాలని అతడి కళేబరాన్ని ఏకచక్రపుర ద్వారం దగ్గర పడేశాడు. దాన్ని చూసి ప్రజలందరూ భయపడ్డారు.

ఇంద్రప్రస్థపురానికి చేరిన శ్రీకృష్ణ భీమార్జునులు

మహాబలపరాక్రమవంతుడైన వాయుపుత్రుడు భీమసేనుడు జరాసంధుణ్ని వధించాక శ్రీకృష్ణుడు అతడి దగ్గర బందీలుగా ఉన్న రాజులందర్నీ విడిపించాడు. ఆ రాజులందరూ శ్రీకృష్ణుణ్ని భక్తితో పూజించారు. జరాసంధుడి కుమారుడు సహదేవుడికి ధైర్యం చెప్పాడు. అతణ్ని మగధ రాజ్యానికి రాజుగా చేశాడు.

అనేక రత్నాలు పొదిగి గొప్ప కాంతితో ప్రకాశిస్తున్న జరాసంధుడి రథాన్ని తెప్పించాడు. దానివైపు ఆశ్చర్యంగా చూస్తున్న భీమార్జునులతో “పూర్వం తారకాసురుడితో యుద్ధం చేసినప్పుడు ఇంద్రుడు ఈ రథాన్ని ఎక్కాడు. తరువాత ఈ రథాన్ని ఇంద్రుడి నుంచి వసుమహారాజు, అతడి నుంచి జరాసంధుడి తండ్రి బృహద్రథుడు దీన్ని తీసుకున్నాడు” అని ఆ దివ్యరథం గురించి వివరంగా చెప్పాడు.

తరువాత భీమార్జునులతో కలిసి ఆ రథాన్ని ఎక్కి అక్కడ బంధింపబడిన రాజులందరితో కలిసి ఇంద్రప్రస్థపురానికి వెళ్లాలని అనుకుని శ్రీకృష్ణుడు గరుత్మంతుణ్ని మనస్సులో తలుచుకున్నాడు. వెంటనే వినత కుమారుడైన గరుత్మంతుడు అగ్నిలా ప్రకాశించే తేజస్సుతో శ్రీకృష్ణుడి ఎదురుగా వేగంగా వచ్చి తలవంచుకుని వినయంగా నిలబడ్డాడు.

అతణ్ని ఆ దివ్యరథానికి సారథిగా నియమించి మనోవేగ వాయువేగాలతో శ్రీకృష్ణ భీమార్జునులు ఇంద్రప్రస్థపురంలో ప్రవేశించారు. “శ్రీకృష్ణుడు ప్రోత్సహించడం వల్ల లోకానికే భయాన్ని కలిగించే పరమదుర్మార్గుడయిన జరాసంధుణ్ని భీమసేనుడు మల్లయుద్ధంలో సంహరించి వచ్చాడు. ఈ పని మరెవరికీ సాధ్యం కాదు. అక్కడ బందీలుగా ఉన్న రాజులందర్నీ కూడా విడిపించుకుని తీసుకొచ్చారు” అని అనుకుంటూ ఇంద్రప్రస్థపురంలో ఉన్న ప్రజలందరు ఆశ్చర్యంతోను, ప్రేమతోను, ఆసక్తితోను గుంపులు గుంపులుగా వచ్చి శ్రీకృష్ణ భీమార్జునుల్ని ప్రేమతో చూశారు.

“ఇంక నాలుగు సముద్రాలు హద్దులుగా ఉన్న ఈ భూమండలం మొత్తానికి మన ధర్మరాజే పాలకుడు” అని ప్రజలందరూ ఆనందంతో పొంగిపోయారు.

విజయకాంతితో వెలుగుతూ వచ్చిన శ్రీకృష్ణభీమార్జునులు ధర్మరాజుకి మొక్కారు. జరాసంధుడి చెరనుంచి విడిపించుకుని వచ్చిన రాజుల్ని ధర్మరాజుకి చూపించారు. కురువంశంలో గొప్పవాడైన ధర్మరాజు వినయంగా శిరస్సువంచి తనకు నమస్కరించిన రాజులందరినీ ఎవరికి తగినట్టు వాళ్లని ప్రేమతో గౌరవంతో పూజించి వాళ్లని వాళ్ల దేశాలకి సాగనంపాడు.

శ్రీకృష్ణుడు ధర్మరాజు దగ్గర సెలవు తీసుకుని తన దివ్యరథాన్ని ఎక్కి ద్వారకానగరానికి వెళ్లిపోయాడు.

Exit mobile version