మహాభారత కథలు-66: భీష్ముణ్ని అవమానించిన శిశుపాలుడు

0
2

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

భీష్ముణ్ని అవమానించిన శిశుపాలుడు

[dropcap]భీ[/dropcap]ష్ముడు ధర్మరాజుతో మాట్లాడిన మాటలు విని శిశుపాలుడికి కోపం వచ్చింది. “ఈ భీష్ముడు వెర్రివాడు. గుణం లేని శ్రీకృష్ణుణ్ని భగవంతుడని కీర్తిస్తున్నాడు. ధర్మతత్త్వాలు తనకి, పాండవులకే తెలుసునని అనుకుంటున్నాడు. మృదువుగా మాట్లాడుతున్నట్టు నటిస్తూనే అందరినీ అవమానించాడు” అని కురువంశ పితామహుడి వైపు కోపంతో చురచురా చూశాడు.

ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. “ధర్మనందనుడు నువ్వు చెప్పావు కనుక తప్పదనుకుని శ్రీకృష్ణుడికి అర్ఘ్యమిచ్చాడు. ఒక ఓడకి మరొక ఓడని కట్టినట్లు భీష్ముడు చెప్పినట్లు చేసి తన గౌరవాన్ని కూడా పోగొట్టుకున్నాడు.

ఈ సభలో ఉన్న రాజుల్ని నువ్వు బెదిరించావు. నీ వంటి దుర్మార్గులు ఎక్కడా ఉండరు. ఈ రాజులందరూ ధైర్యం లేని వాళ్లని అనుకుంటున్నావా?

పూతన అనే ఆడదాన్ని చంపడం, ప్రాణం లేని బండిని కాలితో పడగొట్టడం, ఏమాత్రం గట్టితనం లేని చెట్లని గర్వంతో విరవడం, పుట్టంత ఉన్న చిన్న కొండని పట్టుకుని పెద్ద బలవంతుణ్నని చెప్పుకుంటూ ఏడు రోజులు ఉండడం, ఎద్దుని చంపడం శ్రీకృష్ణుడు చేసిన గొప్ప పనులని చెప్తున్నావు.

నీ నాలుక చీలికలయితే అతణ్ని ఇంకా బాగా పొగడవచ్చు. శ్రీకృష్ణుడు గురించి నువ్వు చెప్పిన విషయాలన్నీ నాకూ తెలుసు. అసలు ఏ రకంగా అర్ఘ్యం ఇవ్వడానికి అర్హుడో ఆ విషయం నాకు చెప్పు.

ఆడవాళ్లని, గోవుల్ని, బ్రాహ్మణుల్ని, అన్నం పెట్టిన వాళ్లని చంపడం మహాపాపమని పెద్దలు అంటారు. అందులో శ్రీకృష్ణుడు ఆడదాన్ని, గోవుని చంపాడు.

నీకేదో గొప్ప ధర్మాలు తెలిసినట్టు ఇటువంటి పాపాలు చేసిన శ్రీకృష్ణుడికి అర్ఘ్యం ఇప్పించావు. అంతేకాదు మరొకర్ని ప్రేమించిన అంబ అనే కన్యని నువ్వు అపహరించి తెచ్చావు. ఆ సంగతి తెలుసుకుని ధర్మం తెలిసిన నీ తమ్ముడు విచిత్రవీర్యుడు ఆమెని విడిచి పెట్టాడు.

నీ చరిత్రే ధర్మం లేకుండా కనబడుతోంది. సంతానం లేదనే అధర్మం అందరికీ తెలుసుకదా! ధర్మం తెలియని వాడివి నువ్వు చెప్పినట్టు ఎవరు చేస్తారు?

పూర్వం సముద్రతీరంలో ఒక ముసలి హంస నివసిస్తూ ఉండేది. అది ధర్మాధర్మాల్ని గురించి చెప్తూ, ధర్మ మార్గంలో నడుచుకోమని పక్షులకి ఉపదేశిస్తూ ఉండేది. జీవహింస వదిలిపెట్టి తపస్సు చేసుకుంటూ ఉండేది. సముద్రపు నీటిలో తిరిగే పక్షులన్నీఆ ముసలి హంసకి రుచికరమైన ఆహారాన్ని తెచ్చి పెట్టేవి.

ఒకరోజు అవి తమ గుడ్లని దాని దగ్గర దాచి పెట్టి ఆహారం కోసం దూరప్రాంతానికి వెళ్లాయి. ముసలి హంస ఆ గుడ్లని తినడం మొదలు పెట్టింది. అది చేస్తున్న పనిని ఒక పక్షి చూసింది. అది తక్కిన పక్షులకి చెప్పింది. అవి బాధపడి కోపంతో ఆ ముసలి హంసని చంపేశాయి. అలాగే నువ్వు కూడా అధర్మమార్గంలో నడుస్తూ ధర్మబోధ చేసి కౌరవులకి కీడు కలిగిస్తున్నావు.

శ్రీకృష్ణుడు తన బలపరాక్రమాలతో రాజులందర్నీ ఓడించాడని గొప్పగా పొగుడుతున్నావు. అతడి బలం గొప్పతనం నీకు తెలియనివి కాదుగా? రాజులందరికీ భయాన్ని కలిగించే బృహద్రథుడి కుమారుడైన జరాసంధుణ్ని యుద్ధంలో ఎదుర్కోడం చేతకాక భయపడి పదిసార్లు పారిపోలేదా? బ్రాహ్మణ వేషంలో భీమార్జునుల్ని సహాయంగా తీసుకుని వెళ్లి మహాబలసంపన్నుడు, బ్రాహ్మణుల మేలు కోరే జరాసంధుణ్ని చంపాడు.

ఇవన్నీ శీకృష్ణుడి వీరకృత్యాలుగా చెప్తున్నావు. నీకు పొగడాలని ఉంటే మంచి గుణాలు కలిగిన కర్ణుడు, శల్యుడు వంటి వీరులున్నారు. వాళ్లని పొగడచ్చు కదా? గాంగేయా! ఇతరులని పొగడడం, నిందించడం, తనని తాను పొగుడుకోవడం, నిందించుకోవడం, వంటి పనులు పెద్దలు చెయ్యకూడదని పూర్వం మహర్షులు చెప్పారు కదా!” అని అనేక విధాలుగా కఠినమైన మాటలతో భీష్ముణ్ని దూషించాడు శిశుపాలుడు.

సాత్వతికి వరమిచ్చిన శ్రీకృష్ణుడు

భీష్ముణ్ని నిందిస్తున్న శిశుపాలుణ్ని చూసి భీముడికి చాలా కోపం వచ్చింది. భయంకరమైన ఆకారంతో పళ్లు నూరుతూ శిశుపాలుణ్ని చంపడానికి లేచాడు భీముడు. భీష్ముడు కోపంతో లేచిన భీముణ్ని ఆపాడు.

అతడికి శిశుపాలుడి వృత్తాంతం చెప్పాడు. “భీమా! ఈ దుర్మార్గుడైన శిశుపాలుడు చేదివంశంలో సాత్వతీ దమఘోషులకి పుట్టాడు. పుట్టినప్పుడు ఇతడికి నాలుగు భుజాలు, నుదుటి మీద కన్ను ఉండేవి. గాడిద కంఠంతో ఏడుస్తూ పుట్టాడు. అతణ్ని చూసి అతడి తల్లితండ్రులు మొదట భయపడ్డారు. తరువాత ఆశ్చర్యపోయారు.

అప్పుడు ఒక అశరీరవాణి “ఇతణ్ని ఎవరూ చంపలేరు. ఎవరైతే ఇతణ్ని ఎత్తుకోగానే ఎక్కువగా ఉన్న రెండు చేతులూ, కన్ను అణిగిపోతాయో వాళ్లే ఈ బాలుణ్ని చంపగలరు” అని చెప్పింది. శిశుపాలుడి తల్లితండ్రులు ఆ మాటలు విని ఆశ్చర్యపోయారు. అప్పటి నుంచి అతణ్ని చూడడానికి వచ్చిన వాళ్లకి ఆ బాలుణ్ని ఎత్తుకోమని ఇవ్వడం మొదలుపెట్టారు.

ఒకరోజు బలరామ కృష్ణులు వికార రూపంలో పుట్టిన బాలుణ్ని, మేనత్త సాత్వతిని చూడాలని బంధువులు, మిత్రులు, మంత్రులతో కలిసి చేది పట్టణానికి వెళ్లారు. సాత్వతి వాళ్లని ఆదరించి బాలుడు శిశుపాలుణ్ని బలరాముడికి ఎత్తుకోడానికి ఇచ్చింది. తరువాత శ్రీకృష్ణుడికి ఇచ్చింది.

శ్రీకృష్ణుడు ఎత్తుకోగానే శిశుపాలుడికి అధికంగా ఉన్న రెండు చేతులు, కన్ను ఒక్కసారిగా మాయమయ్యాయి. అది చూసిన సాత్వతి ఆశ్చర్యపోయింది. శ్రీకృష్ణుడి వల్లే తన కొడుకుకి మరణం కలుగుతుందని తెలుసుకుంది. శ్రీకృష్ణుడితో “ఈ బాలుడు చెడు మార్గంలో నడుస్తూ నీకు అపకారం చేసినా నీ మేనల్లుడైన ఇతడు చేసిన నూరు తప్పుల్ని దయతో క్షమించు” అని ప్రార్థించింది.

ఇతడి తల్లి జగన్నాయకుడైన శ్రీకృష్ణుణ్ని ప్రార్థించి వరం పొందింది కనుక నూరు తప్పులు పూర్తయ్యే వరకు ఇతడు ఎవరి చేతిలోను చావడు. తరువాత శ్రీకృష్ణుడి చేతిలోనే మరణిస్తాడు. అందువల్లే నేను ఊరుకున్నాను. భీమా! లేకపోతే నా ధనుస్సు నుండి ప్రవాహంలా బాణాలు వదిలి అతణ్ని చంపలేనా? అతడి పొగరు అణగదొక్కలేనా?” అన్నాడు.

శిశుపాలుడు భీష్ముణ్నీ, భీముణ్నీ వదిలి పెట్టి శ్రీకృష్ణుడితో ముఖాముఖీ మాట్లాడుతూ “కేశవా! నువ్వు అవమానించడానికే అర్హుడివి. కురువంశంలో ముసలివాడైన భీష్ముడు చెప్పాడు కనుక, నిండు సభలో నిన్ను గౌరవించి పూజించారు. నీ మీద ఇష్టంతో మతి పోయిన ఈ భీష్ముడూ, నువ్వూ నాతో యుద్ధానికి రండి” అన్నాడు.

అతడి మాటలు విని శ్రీకృష్ణుడు సభలో ఉన్న రాజులందరూ వింటూ ఉండగా “ప్రాగ్జ్యోతిషాధిపతి భగదత్తుడి మీద మేము దండెత్తిన సమయంలో ఈ శిశుపాలుడు బాలురు, వృద్ధులు మాత్రమే ఉన్న ద్వారకా నగరాన్ని తగులబెట్టాడు.

వీరులైన భోజరాజులు తమ భార్యలతో కలిసి రైవతకాద్రి మీద విహరిస్తున్న సమయంలో వాళ్లని క్రూరంగా వధించాడు. దేవతలతో సమానుడైన వసుదేవుడు అశ్వమేధ యజ్ఞం కోసం పూజించిన గుర్రాన్ని దొంగిలించి యాగాన్ని పాడుచేశాడు. బభ్రుడి భార్యని తన భార్యగా చేసుకున్నాడు.

కఠినమైన మాటలతో అనేక అపకారాలు చేశాడు. మా అత్త సాత్వతి ప్రార్థించడం వల్ల ఇతడు చేసిన నూరు తప్పుల్ని సహించాను. ఇప్పుడు మీరందరూ చూస్తూ ఉండగానే తన ప్రవర్తన వల్ల ఇతడు నాకు పరమ శత్రువయ్యాడు” అన్నాడు.

శ్రీకృష్ణుడి మాటలు విని శిశుపాలుడు శ్రీకృష్ణుడితో “నీ స్నేహం, కోపంతో నాకు పనేముంది? మొదట నాకు ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకున్న కన్యని నీదానిగా చేసుకున్నావు. ఇంకా మాట్లాడడానికి నీకు సిగ్గుగా లేదా?” అన్నాడు.

శిశులుపాలుణ్ని సంహరించిన శ్రీకృష్ణుడు

శిశుపాలుడు వదలకుండా శ్రీకృష్ణుణ్ని నిందిస్తూనే ఉన్నాడు. రాజులందరూ ఏ జరుగుతుందో అని భయపడుతూ చూస్తున్నారు. అంతలో శ్రీకృష్ణుడి చక్రాయుధం నిప్పులు కక్కుతూ వచ్చి శిశుపాలుడి తల నరికేసింది. అతడి శరీరం నుంచి రక్తం ధారగా కారుతోంది. శిశుపాలుడి నోరు మూత పడింది. రాజులందరూ ఆశ్చర్యంతో కళ్లు పెద్దవి చేసుకుని చూస్తున్నారు. పర్వతంలా శిశుపాలుడి శరీరం కింద పడింది.

ఆ శరీరం నుంచి ఒక కాంతి వెలుగులు చిమ్ముతూ బయటికి వచ్చి శ్రీకృష్ణుడి శరీరంలో కలిసిపోయింది. శిశుపాలుడి తల తెగి పడగానే మేఘాలు లేకుండా భూమి దద్దరిల్లేలా పిడుగులతో పెద్దవాన కురిసింది. శ్రీకృష్ణపరమాత్మని ప్రజలందరూ జయజయ ధ్వానాలతో పొగిడారు. శ్రీకృష్ణుడు శిశుపాలుడి మృతదేహానికి అంత్యక్రియలు చెయ్యమని ఆజ్ఞాపించాడు. అతడి కుమారుణ్ని చేది రాజ్యానికి రాజుగా చేశాడు.

ముగిసిన రాజసూయయాగం

ఆ విధంగా ధర్మరాజు చేసిన రాజసూయం ఏ ఆటంకం లేకుండా పూర్తయింది. శ్రీకృష్ణుడి రక్షణలో అందరూ తృప్తిగా పంచభక్ష్యాలు, ధనము, దానాలతో తృప్తిపడ్డారు. దేవతల్ని, గురువుల్ని, బ్రాహ్మణుల్ని తృప్తిపరిచి, యాగం ముగిసింది కనుక ధర్మరాజు అవబృథ స్నానం చేశాడు. తను పవిత్రుడై, నిర్మలమైన కీర్తిని పొంది, లోకాన్నంతటినీ పవిత్రం చెయ్యగల ధర్మరాజు సభలో కూర్చున్నాడు.

అతణ్ని చూసి శ్రీకృష్ణుడు మొదలైన స్నేహితులందరూ సంతోషపడ్డారు. దుర్యోధనుడు మొదలైన కౌరవులు అసూయ పడ్డారు. అన్ని దేశాల నుంచి వచ్చిన రాజులు ధర్మరాజు దగ్గరికి వచ్చి “ధర్మరాజా! మంచి గుణాలతో నడుచుకుంటూ, ధర్మప్రవర్తనతో వెలుగుతూ సామ్రాజ్యంలో ఉన్న ప్రజలు అందరి మన్ననలు అందుకుంటూ ఉన్న నీ వల్ల కురువంశానికి మూలపురుషుడైన అజామీఢుడి వంశం గొప్పది అని అనిపించుకుంది.

నువ్వు చేసిన రాజసూయ యాగ మహోత్సవాన్ని చూసి, నీతో గౌరవించబడి ధన్యులమయ్యాం. ఇంక మా దేశాలకి వెళ్లి వస్తాం!” అని ధర్మరాజు దగ్గర సెలవు తీసుకుని బయలుదేరారు.

ధర్మరాజు ఆజ్ఞ తీసుకుని భీమసేనుడు – భీష్మ, ధృతరాష్ట్రుల్ని.. అర్జునుడు – ద్రుపదుణ్ని.. నకులుడు – శల్య సుబలుల్ని, వాళ్ల కుమారుల్ని.. సహదేవుడు – కృప ద్రోణ అశ్వత్థామల్ని.. దృష్టద్యుమ్నుడు – విరాట భగదత్తుల్ని.. అభిమన్యుడు, ఉప పాండవులు – పర్వత దేశాల రాజుల్ని సాగనంపారు. తరువాత బ్రాహ్మణోత్తములందరూ అంతులేని ధనరాశులు పొంది తృప్తితో ధర్మరాజుని ఆశీర్వదించి తమ ఇళ్లకి వెళ్లారు.

శ్రీకృష్ణుడు ద్వారవతీ నగరానికి బయలుదేరాడు. పాండవులందరికీ పేరుపేరునా వీడ్కోలు చెప్పాడు. ధర్మరాజుతో “ప్రాణులన్నీ మేఘాల్ని, పక్షులన్నీపండ్ల చెట్లని, దేవతలు దేవేంద్రుణ్ని ఆశ్రయించి జీవిస్తాయి. అలాగే బంధువులు అందరూ నిన్ను ఆశ్రయించి జీవించే విధంగా నీ జీవితాన్ని గడుపుకో. ప్రజల్ని రక్షించే విషయంలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండు” అని చెప్పాడు.

శ్రీకృష్ణుడు చెప్పింది విని ధర్మరాజు “శ్రీకృష్ణా! నీ దయవల్ల నేను చేసిన యజ్ఞము ఏ ఆటంకమూ లేకుండా చక్కగా పూర్తయింది. లోకంలో ఉన్న రాజులందరూ నమస్కరించడం వల్ల నా కీర్తి పెరిగింది. నా వంశం కూడా మంచి గుణాలకి నిలయంగా నిర్మలంగా ప్రకాశించింది.

శ్రీకృష్ణా! నువ్వు ద్వారకా నగరానికి వెళ్లిపోయాక కూడా నా మంచి చెడులు చూసుకునే బాధ్యత నీదే. నువ్వు దూరంగా ఉన్నా కూడా మాకు దగ్గరివాడివే. నిన్ను విడిచి మేము నిముషం కూడా ఉండలేము” అంటూ ధర్మరాజు బాధపడుతూ తప్పదు కనుక శ్రీకృష్ణుడికి వీడ్కోలు చెప్పాడు.

శ్రీకృష్ణుడు వాయువేగంతో పరుగెత్తే గుర్రాలు; బంగారం, రత్నాలు ఉన్న గరుడధ్వజము, దారుకుడు సారథిగాను ఉన్న బంగారు దివ్య రథాన్ని ఎక్కి ద్వారకకి వెళ్లిపోయాడు.

ధర్మరాజు తమ్ముళ్లతో కలిసి కొంతదూరం నడిచి వెళ్లి శ్రీకృష్ణుణ్ని సాగనంపాడు. రథం కంటికి కనిపించినంత దూరం వరకు చూసి.. తరువాత కొంతసేపు మనస్సుతో చూసి బాధగా వెనక్కి తిరిగి వచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here