[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]
జూదానికి ప్రోత్సహించిన శకుని
[dropcap]దు[/dropcap]ర్యోధనుడు చెప్పినవన్నీ విని శకుని “దుర్యోధనా! బాధపడకు, మాయాజూదం ఆడించి ధర్మరాజుకి ఉన్న ఐశ్వర్యం మొత్తాన్ని నీ దగ్గరికి చేరేలా చేస్తాను. ధర్మరాజుకి జూదమంటే ఇష్టం. అందులో ఉండే మోసం గురించి అతడికి తెలియదు. నేను మాయాజూదం ఆడడంలో చాలా నేర్పు కలవాడిని. ధర్మరాజుని తేలికగా ఓడించి ఆ సంపద మొత్తం నీకు అప్పగిస్తాను. బాదపడకు!” అన్నాడు.
శకుని మాటలు విని దుర్యోధనుడు సంతోషంతో తండ్రి పాదాలమీద పడ్డాడు. “తండ్రీ! శకుని చెప్పినదానికి అంగీకరించు!” అన్నాడు.
దుర్యోధనుడు చెప్పినదాన్ని విని ధృతరాష్ట్రుడు ”విదురుడు గొప్ప మేధావి. ఈ విషయం అతడితో ఆలోచిద్దాం. అతడు నీతి కోవిదుడు, దూరదృష్టి కలవాడు. కురుపాండవ పక్షాల రెండింటి క్షేమాన్ని కోరుకుంటాడు. దేవతల గురువు బృహస్పతి చెప్పిన నీతి శాస్త్ర రహస్యాల్లో అందరి కంటే గొప్ప విద్వాంసుడు విదురుడే!
అతడి బుద్ధి బలంతోను, గంగాదేవి కొడుకైన భీష్ముడి బాహుబలంతోను ఈ హస్తినాపుర రాజ్యతంత్రం నడుస్తోంది. అందువల్ల ఏది చేసినా విదురుడి సమ్మతితోనే చెయ్యాలి” అన్నాడు ధృతరాష్ట్రుడు.
దుర్యోధనుడు “తండ్రీ! విదురుడు ఎప్పుడూ పాండవుల వైపే మాట్లాడుతాడని ఇదివరకే విన్నాను. అతడు శకుని జూదాన్ని ఆపడానికే ప్రయత్నిస్తాడు కాని, అంగీకరించడు. నువ్వు ఈ జూదానికి ఒప్పుకోకపోతే నేను ఈ రోజే.. ఈ క్షణమే ఆత్మహత్య చేసుకుంటాను. తరువాత నువ్వు, నీ విదురుడూ సంతోషంగా ఉండండి!” అని ఏడుస్తూ చెప్పాడు.
దుర్యోధనుడు ఏడుస్తుంటే ధృతరాష్ట్రుడికి కూడా దుఃఖం కలిగింది. అయినా జూదం ఆడడం మంచి పని కాదని మనస్సులో అనుకున్నాడు. దుర్యోధనుణ్ని శాంతపరచడం కోసం గొప్ప నిపుణులైన శిల్పుల్ని వెయ్యిమందిని రప్పించాడు.
బంగారము, రత్నాలు పొదిగిన వెయ్యి స్తంభాలు, చిత్రమైన వందలకొలదీ ద్వారాలు, అనేక రకాల రత్నకాంతులతో ప్రకాశించే ప్రదేశాలు కలిగిన అందమైన ఒక సభని నిర్మించడానికి ఆజ్ఞాపించాడు.
ధృతరాష్ట్రుడు ఒకరోజు విదురుడితో ఒంటరిగా కలిసి శకుని దుర్యోధనుల అభిప్రాయాన్ని చెప్పాడు.
జూదం మంచిపని కాదని చెప్పిన విదురుడు
ధృతరాష్ట్రుడు చెప్పినది విని విదురుడు ఆశ్చర్యపోయాడు. “జూదం ఆడడానికి నేను అంగీకరించను.. ఇది మంచి పని కాదు” అని అనలేదు.
ధృతరాష్ట్రుడితో “పాండవులు, కౌరవులు అందరూ నీ కొడుకులే! నీ కొడుకుల మధ్య విరోధం కలిగించే జూదం ఆడడానికి ఎందుకు ఒప్పుకున్నావు? అందరూ కలిసి మెలిసి ఉండడానికి ఏం చేస్తే బాగుంటుందో ఆ పనే చెయ్యాలి నువ్వు. ఎంత శాంత స్వభావం కలిగినవాళ్లైనా జూదంలో వాదోపవాదాలు జరగడం తరువాత శత్రుత్వం ఏర్పడడం జరిగే తీరుతుంది.
నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. శకుని దుర్యోధనులు చేస్తున్న ఈ చెడ్డ పనిని మాత్రం మాన్పించు. కురుకులానికి హాని జరగకుండా చూడు” అని చెప్పాడు.
విదురుడు చెప్పినది విని ధృతరాష్ట్రుడు “విదురా! నేను, నువ్వు, భీష్ముడు ఉండగా కొడుకుల మధ్య శత్రుత్వం ఎందుకు ఏర్పడుతుంది? దయ చూపించే దేవతలు ఉండగా నా కొడుకుల మధ్య కీడు, భయం, శత్రుత్వం ఎందుకు ఉంటాయి? మిత్రుడా! అనవసరంగా అనుమానం పెంచుకోకు. నువ్వు ఈ జూదానికి అంగీకరించు” అన్నాడు.
విదురుడు ఎంత చెప్పినా ధృతరాష్ట్రుడు వినలేదు. ఇంద్రప్రస్థపురానికి వెళ్లి ధర్మరాజుని వెంటపెట్టుకుని వచ్చే పని విదురుడికే అప్పగించాడు. ఆ విషయాన్ని విదురుడు భీష్ముడికి చెప్పి “జూదమాడడం మంచిపని కాదు” అని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
దుర్యోధనుణ్ని అనునయించిన ధృతరాష్ట్రుడు
విదురుడు వెళ్లిపోయాక ధృతరాష్ట్రుడు దుర్యోధనుడి కోసం తయారవుతున్న సభని చూపించడానికి దుర్యోధనుణ్ని ఒక్కడినీ వెంటబెట్టుకుని వెళ్లాడు. ధృతరాష్ట్రుడు మాట్లాడుతూ “దుర్యోధనా! ఈ జూదం ఆడడం వల్ల మీలో మీకు పోట్లాటలు జరుగుతాయి. మీ మధ్య శత్రుత్వం పెరుగుతుంది. అందువల్ల ప్రజలకి కూడా చాలా హాని కలుగుతుంది.
ఈ రాజ్యాన్ని నువ్వూ పాండవులు ఇంతవరకూ పాలిస్తున్నట్టే ఒకళ్లతో ఒకళ్లు ప్రేమగా ఉంటూ పాలించండి. పాండవుల సంపద మీద అసూయ పెంచుకోకు. ఇతరుల సంపదని దక్కించుకోవాలని అనుకోవడం మహాపాపం.
ఈ ఆలోచన వల్ల ఉన్న సంపద, ధర్మం రెండూ నశిస్తాయి. ధర్మాధర్మాల గురించి బాగా తెలిసిన విదురుడికి ఈ మాయాజూదం మీద ఇష్టం లేదు. ధర్మరాజుకి ఉన్న ధన సంపదకంటే అయిదురెట్లు ధన సంపద నీకు ఉంది.
అతడు చేసిన యజ్ఞం కంటే ఎక్కువ దక్షిణలు ఇచ్చి నీకు ఇష్టమైన యజ్ఞం చెయ్యి. లోకంలో ఉన్న రాజులందరూ నీకు కూడా అనేక సంపదలు తెచ్చి ఇస్తారు” అని అనునయించి చెప్పాడు.
తండ్రి చెప్పిన మాటలు విని దుర్యోధనుడు “మహారాజా! నాకు ధర్మరాజుతో జూదమాడడమే ఒక యజ్ఞం. నేను కోరుకున్నట్టుగా అతడి దగ్గర ఉన్న సంపదలన్నీ నేను పొందాలంటే ఇదే తగిన ఉపాయం. మీరందరు ధర్మరాజు చేసిన రాజసూయ యాగం చూసి తిరిగి హస్తినపురానికి వచ్చేశారు. నేను ఆ మయసభని చూడాలని అక్కడే ఉండిపోయాను. అటువంటి మయసభని గురించి ఎక్కడా వినలేదు, చూడలేదు.
స్వచ్ఛమైన స్ఫటికపు రాళ్లతో కట్టిన ఆ మయసభ చంద్రుడిలా తెల్లగా ప్రకాశిస్తోంది. రత్నాల కాంతులతో వెలుగుతున్న దాని వైభవాన్ని చూడాలని కుతూహలంతో నేను లోపల తిరుగుతున్నాను. ఇంద్రనీలమణులు కూర్చి నునుపుగా కనిపిస్తున్న చోట నీళ్లు ఉన్నాయనుకుని నా వస్త్రాన్ని పైకి పట్టుకున్నాను. అలాగే స్వచ్ఛమైన రాతి నేల మీద నీళ్లు లేవని అనుకుని నడుస్తూ కిందపడి వస్త్రాలు తడుపుకున్నాను. నా పాట్లు చూసి భీముడు నవ్వాడు. తడిసిపోయిన నా బట్టలు చూసి ధర్మరాజు కట్టుకోడానికి బట్టలు పంపించాడు.
అంతేకాదు, తెరిచి ఉన్న తలుపులు మూసి ఉన్నాయని అనుకుని పక్కకి వెళ్లిపోయాను. మూసి ఉన్న తలుపులు తెరిచి ఉన్నాయని అనుకుని అటువైపు వెళ్లాను. స్ఫటికపు రాతికి నా నుదురు తగిలింది. నా స్థితిని చూసి అనేక వేలమంది చెలికత్తెలతో ఉన్న పాంచాలి ఫక్కున నవ్వింది.
నకుల సహదేవులు పరుగెత్తుకుని వచ్చి వాకిలి ఇటు ఉంది రమ్మని పిలిచుకుని వెళ్లారు. ఆ సభలో జరిగింది నాకు అవమానంగాను, మనస్సులో బాణం గుచ్చుకున్నంత బాధగాను ఉంది.
ప్రస్తుతం గొప్ప సంపదలున్నవాళ్లు తగ్గిపోయారు. అల్పులు సంపదలు పొంది గొప్పవాళ్లుగా ఎదిగి పోతున్నారు. వాళ్లు నాకు స్నేహితులు కాదు. వాళ్ల గర్వాన్ని, గొప్పతనాన్ని చూసి నేను సహించలేక పోతున్నాను. మహారాజా! కష్టపడకుండా శత్రువుల సంపదలు పొందడానికి వీలు కలిగితే రాజులకి అంతకంటే కావలసినది ఏముంటుంది? నముచి అనే రాక్షసుడు తపస్సు చేసుకుంటుంటే అతణ్ని దేవేంద్రుడు అన్యాయంగా చంపాడు. శత్రుత్వం ఉంటే దాన్ని ఎలాగైనా నాశనం చెయ్యాలి. మనిషి తక్కువవాడే అయినా ఎక్కువ పరాక్రమంతో అంతకంతకి ఎక్కువగా అభివృద్ధి చెందుతూ తన శత్రువుల్ని నాశనం చెయ్యగలడు.
అభివృద్ధిలోకి వస్తున్న శత్రువుల్ని పట్టించుకోకుండా వదిలెయ్య కూడదు. వాళ్లు మొదట తక్కువగానే కనిపించినా తరువాత పెరుగుతారు.
వైద్యుడికి సాధ్యంకాని వ్యాధి పెరిగి అశ్రద్ధ చేసినవాణ్ని నాశనం చేస్తుంది. శత్రువుని వదిలి పెడితే అతడు కూడా వదిలి పెట్టినవాడిని నాశనం చేస్తాడు. అలాగే పాండవుల ఐశ్వర్యాన్ని అశ్రద్ధగా వదిలెయ్యకూడదు. పాండవుల సంపదల్ని దక్కించుకోక పోతే నా మనస్సుకి ప్రశాంతత ఉండదు” అన్నాడు.
దుర్యోధనుడి మాటలు విని శకుని “దుర్యోధనా! రథ, గజ, తురగ బలాలు లేకుండా.. యుద్ధవ్యూహాలు పన్నకుండా.. రెండు వైపుల సైన్యాల్లో ఉన్న వీరుల చేతి ఆయుధాలు కలిసినప్పుడు వచ్చే శబ్దాలు వినిపించేలా యుద్ధం చెయ్యకుండా.. పాచికలు దొర్లించి ఎదుటి పక్షంలో ఉన్నవాళ్ల సంపదల్ని శ్రమలేకుండా గెలిచి నీకు ఇస్తాను.
చక్కగా ధర్మరాజుని పిలిచి అతడితో జూదం ఆడే ఏర్పాటు చెయ్యి. అంతకంటే సులభంగా పాండవుల సంపదల్ని అపహరించడం ఎవరికీ సాధ్యం కాదు” అన్నాడు.
అది విని ధృతరాష్ట్రుడు కౌరవులు, పాండవులు జూదమాడడం తనకు ఇష్టం లేదన్నాడు. “నేను విదురుడు చెప్పినట్టు నడుచుకుంటాను. అతడికి న్యాయాన్యాయాలు, మంచి చెడ్డలు బాగా తెలుసు. అన్ని పనుల్లోను నేర్పరి. జూదమాడడం వల్ల యుద్ధం చెయ్యవలసి వస్తుందని చెప్పాడు.
బలవంతులతో యుద్ధానికి వెళ్లక పోవడమే మంచిది. నేను ధర్మంగా మాట్లాడుతున్నాను. నేను చెప్పినట్టు విని జూదం గురించి ఆలోచించక ఎప్పటిలా సంతోషంగా సుఖంగా ఉండు. అదే అందరికీ మంచిది” అన్నాడు.
తండ్రి మాటలకి దుర్యోధనుడు “చెయ్యాలని అనిపించిన పనిని ఇతరుల ఇష్టప్రకారం చెయ్యలేము. అందరి అభిప్రాయం ఒకేలా ఉండదు. అలాగని అభిప్రాయాలు కలుస్తాయని చెప్పలేము. విదురుడి ఆలోచన ఎప్పుడూ పాండవుల వైపే ఉంటుంది. అందుకే అతడు చెప్పినట్టు చెయ్యకూడదు. పక్షపాతం చూపించే వాళ్లని ఆప్తులని కూడా అనుకోకూడదు.
జూదం గురించి పురాణాల్లో కూడా ఉంది. జూదమాడడంలో తప్పు లేదు. స్నేహంగా ఆడుకునే జూదం వల్ల దేవతలు దైవత్వాన్ని పొందుతారు. ఈ జూదం నడిపించడానికి శకునికి అనుమతి ఇవ్వండి. ధర్మరాజుని ఇక్కడికి రప్పించండి” అన్నాడు.
ధృతరాష్ట్రుడు చాలా సేపు ఆలోచించాడు. చివరికి విదురుణ్ని పిలిపించాడు. “విదురా! మన సభ కూడా పూర్తయింది. పాండవులు ఇక్కడికి వచ్చి ఈ సభని చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది. నువ్వు వెళ్లి బ్రాహ్మణులకి, బంధువులకి, పండితులకి సంతోషాన్ని కలిగించే ధర్మరాజుని వెంటబెట్టుకుని రా. విలువైన రత్నాలతో అందంగా తయారయిన ఈ సభలో ధర్మరాజు దుర్యోధనుడితో స్నేహంగా జూదమాడుతాడు” అని చెప్పాడు.
ధర్మరాజుని తీసుకుని వచ్చిన విదురుడు
ధృతరాష్ట్రుడి మాటలు విని విదురుడు జూదమాడడం వల్ల హాని కలుగుతుందనీ, మానేస్తే అందరికీ మంచిదనీ చాలాసార్లు చెప్పాడు. ఎంత చెప్పినా కొడుకు మీద ఉండే మమకారంతో ధృతరాష్ట్రుడు వినలేదు.
ఈ అధర్మాన్ని ఆపడం తన వల్ల కాదని తెలుసుకుని, ధృతరాష్ట్రుడు మాటకి కట్టుబడి బృహస్పతితో సమానమైన బుద్ధి కలిగిన విదురుడు ఇంద్రప్రస్థపురానికి వెళ్లాడు.
దేవేంద్రుడితో సమానంగా, చంద్రుడిలా ప్రకాశిస్తున్న తమ్ముళ్లతో కలిసి ఉన్న ధర్మరాజుని చుశాడు. ధర్మరాజు విదురుణ్ని తగిన విధంగా పూజించి వచ్చిన కారణం చెప్పమన్నాడు. విదురుడు ధర్మరాజు క్షేమసమాచారాలు అడిగి తెలుసుకున్నాడు. తరువాత తను వచ్చిన పని గురించి చెప్పాడు.
విదురుడు చెప్పింది విని ధర్మరాజు “కుమారులంటే స్నేహభావం ఉన్నవాడు, విచిత్రవీర్యుడి కొడుకు, పూజ్యుడు అయిన ధృతరాష్ట్రమహారాజు నన్ను పిలుచుకుని రమ్మని నిన్ను పంపించాడు. ప్రేమతో నువ్వు నా దగ్గరికి వచ్చావు.
అందమైన, అపూర్వమైన సభని చూడడానికి వస్తాను. కాని అందులో జూదమాడడం మంచి పని కాదు. ఈ జూదం వల్ల మాలో మాకు శత్రుత్వం కలగకుండా ఉండదు. నీ ఆజ్ఞని నేను ఎలా దాటలేనో నువ్వు కూడా ధృతరాష్ట్రుడు ఆజ్ఞని దాటలేవు” అన్నాడు.
చంద్రవంశానికి రాజైన ధర్మరాజు జూదమాడడం తప్పని తెలిసినా విధికి లోబడి, పినతండ్రి ఆజ్ఞకి కట్టుబడి, తన కోసం అంతదూరం వచ్చిన విదురుడి వెంట వెళ్లడానికి అంగీకరించాడు. తమ్ముళ్లు, ద్రౌపది, ముఖ్యులైన సేవకులు, ధౌమ్యుడు మొదలైన పండితులు వెంట రాగా సూర్యుడి తేజస్సు వంటి తేజస్సుతో ధర్మరాజు హస్తినాపురానికి వెళ్లాడు.
దుర్యోధనుడు, దుశ్శాసనుడు మొదలైన వందమంది కొడుకులతోను, భీష్మ, శల్య, శకుని, సైంధవ, కర్ణ, కృప, ద్రోణ, అశ్వత్థామ, సోమదత్తులతోను కలిసి ధృతరాష్ట్రుడికి; భానుమతి మొదలైన కోడళ్లతో కలిసి నక్షత్రాల మధ్య రోహిణిలా ఉన్న గాంధారీదేవికి; కురుకులంలో ఉన్న పెద్దలకి ధర్మరాజు తమ్ముళ్లతో కలిసి వినయంగా నమస్కరించాడు.
ద్రౌపది కూడా గాంధారీదేవికి మొక్కింది. గాంధారి కోడళ్లు ద్రౌపది అందం చూసి ఆశ్చర్యపోయారు. బ్రహ్మదేవుడు సమస్త సౌందర్య కాంతి మొత్తాన్ని ద్రౌపదిగా సృష్టించి ఉంటాడు. అందుకే ఇంక ఏ స్త్రీలోనూ కాంతి కనపడట్లేదు అనుకుని అసూయపడ్డారు.
కౌరవపాండవులు ఆ రోజంతా ప్రేమతో కలిసి మెలిసి సంతోషంగా గడిపారు. మర్నాడు ఉదయం దుర్యోధనుడు కొత్తగా కట్టించిన సభని పాండవులకి చూపించాడు. వాళ్లు ఆ సభని మెచ్చుకున్నారు. అందమైన ఆ సభలో మణులతో నిర్మించిన వేదిక మీద కూర్చుని అందరూ సంతోషంగా మాట్లాడుకుంటున్నారు.
ఆ సమయంలో దుర్యోధనుడు “ధర్మరాజా! ఇక్కడ మనం అందరం స్నేహంగా జూదం ఆడుకుందాం. కాలక్షేపం కూడా అవుతుంది. పాచికలాడేవాళ్లు చాలామంది నీకు ఈ ఆట అంటే ఇష్టమనీ, బాగా ఆడగలవని చెప్తే విన్నాను” అన్నాడు.
అతడి మాటలు విని ధర్మరాజు “మోసము, జూదము క్షత్రియులకి తగిన పని కాదు. ఎప్పుడూ ధర్మమార్గంలో నడిచేవాళ్లు ఈ రెండింటినీ వదిలెయ్యాలి. జూదమాడడం అధర్మ మార్గంలో నడిచేవాళ్లు చేసే పని. మోసపు మార్గాలు అనుసరించే నీచమైన జూదగాళ్లతో జూదం ఆడకూడదు.
దాని వల్ల ఎటువంటి వాళ్లయినా ధనాన్ని, ధర్మాన్ని పోగొట్టుకుంటారు. అంతేకాదు, మోసంగా ఆడే జూదంలో గెలవడం మహాపాపం. ధర్మంగా ఆడిన జూదంలో గెలవడం ధర్మంగా చేసిన యుద్ధంలో గెలిచినంత పుణ్యమని దేవలుడు చెప్పాడు” అన్నాడు.
ధర్మరాజు మాటలు విని శకుని “జూదమాడడం ఒక కళ. నేర్పు, లోకజ్ఞానం ఉన్నవాడు, గొప్ప మేధావి, కీర్తికలవాడు, గొప్ప రాజనీతి తెలిసినవాడు జూదాన్ని నిందించకూడదు. బలంలేనివాళ్లు బలవంతుల్ని ఓడించడానికి ఎన్నో మోసాలు చేస్తూ ఉంటారు. ఎలాగయినా జయించడమేగా అందరూ చేసే పని. నీకు జూదమాడడానికి భయంగా ఉంటే ఆడడం మానెయ్యి” అన్నాడు.