మహాభారత కథలు-7: భృగువంశము యొక్క గొప్పతనము

0
2

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

[dropcap]మ[/dropcap]హాభారత కథ వింటున్న మహర్షులకి ఒక సందేహం కలిగింది. సూతమహర్షిని అడిగారు “మహర్షీ! పాములకి లోకాలన్నింటినీ భయపెట్ట కలిగినంత పరాక్రమము, అగ్నితో సమానమైన భయంకరమైన విషము ఉంది. సర్పయాగంలో భయంకరమైన అగ్ని జ్వాలల్లో పడి నశించవలసిన అవసరం ఎందుకు వచ్చింది?” అని అడిగారు.

శౌనకుడు మొదలైన మహర్షుల సందేహాన్ని తీర్చడం కోసం సూతమహర్షి చెప్తున్నాడు.. పాముల తల్లి కద్రువ ఇచ్చిన శాపం వల్లే జనమేజయుడు సర్పయాగం చేసినప్పుడు పాములన్నీ అగ్నిలో పడి మరణించాయి. భృగువంశంలో పుట్టిన ‘రురుడు’ చేసిన సర్ప నాశనాన్ని ‘సహస్రపాదుడు’ అనే మహర్షి ఆపించాడు. అదే విధంగా జరత్కారు దంపతుల కుమారుడు ‘ఆస్తీకుడు’ అనే మహర్షి జనమేజయుడు చేసిన సర్పయాగాన్ని మాన్పించాడు. ఆ వృత్తాంతాన్ని మీకు చెప్తాను అని ‘ఆస్తీకుడు’ కథ చెప్తున్నాడు.

భృగు మహర్షి భార్య ‘పులోమ’ గర్భవతి. ఆమెకి హోమానికి అగ్నిని సిద్ధం చెయ్యమని చెప్పి మహర్షి స్నానానికి వెళ్లాడు. అదే సమయంలో పులోముడు అనే భయంకరమైన రాక్షసుడు వచ్చాడు. అతడు అగ్నికి పులోమని చూపించి “ఈమె ఎవరు?” అని అడిగాడు.

అబద్ధం చెప్పకూడదు కనుక అబద్ధం చెప్పలేక, నిజం చెప్తే భృగుమహర్షి శాపం ఇస్తాడు కనుక నిజం చెప్పలేక అగ్ని భయపడ్డాడు. శాపం వల్ల కలిగిన అపద నుంచి తప్పించుకోవచ్చు. అసత్యం చెప్పడం వల్ల కలిగే పాపం నుంచి తప్పించుకోడం కుదరదు. తనలో తను ఆలోచించుకున్న అగ్ని చివరికి “ఆమె మహాపతివ్రత భృగుమహర్షి భార్య” అని రాక్షసుడికి నిజం చెప్పేశాడు. పులోముడు పంది రూపంలో వచ్చి పులోమని ఎత్తుకుని పోయాడు. అతడు పరుగెత్తుకుంటూ వెళ్లేటప్పుడు ఆమె కడుపులో ఉన్న బిడ్డ జారి కింద పడ్డాడు. అతడి పేరు ‘చ్యవనుడు’.

వెయ్యి మంది సూర్యుల తేజస్సుతో సమానమైన తేజస్సు, ప్రళయ సమయంలో అగ్నికి ఉండేంత వెలుగు కలవాడు చ్యవనుడు. భృగుమహర్షి కుమారుడు చ్యవనుడి తేజస్సు చూడగానే రాక్షసుడు పులోముడు కాలి బూడిదయ్యాడు. భృగువంశ కీర్తిని ఇనుమడింప చేసే ఆ బిడ్డని ఎత్తుకుని పులోమ తన ఆశ్రమానికి వచ్చింది.

రాక్షసుడు ఎత్తుకుని పోతున్నప్పుడు ఆమె ఏడ్చింది. ఆ సమయంలో ఆమె కళ్లనుంచి కారిన కన్నీళ్లు ఆశ్రమం దగ్గర పెద్ద నదిగా ప్రవహించాయి. ఆ నదికి బ్రహ్మదేవుడు ‘వధూసర’ అని పేరు పెట్టాడు. భృగుమహర్షి కొడుకుని ఎత్తుకుని వచ్చిన భార్యని “ఆ రాక్షసుడు నిన్ను ఎలా తెలుసుకున్నాడు?” అని అడిగాడు.

పులోమ అగ్నిని చూపించి “ఇతడే నా గురించి చెప్పాడు. నేను పరుగెడుతున్నప్పుడు నా గర్భంలో ఉన్న ఈ కుమారుడు గర్భంలోంచి జారి కింద పడ్డాడు. ఇతడి తేజస్సుని చూసి తట్టుకోలేక రాక్షసుడు చచ్చిపోయాడు. తన తేజస్సుతో రాక్షసుణ్ని చంపి ఈ బిడ్డే నన్ను కాపాడాడు” అని చెప్పింది.

భృగు మహర్షి అగ్నిని చూసి “నువ్వు చాలా తప్పు చేసావు. అన్ని వస్తువుల్నీ తినేసే స్వభావాన్ని పొందు” అని శపించాడు. అగ్ని “మహర్షీ! తనకు తెలిసిన విషయాన్ని తెలియదు అని అబద్ధం చెప్పినవాడు నరకానికి వెడతాడు. అందుకే నేను అబద్ధం చెప్పకుండా నిజమే చెప్పాను. నేను కూడా నీకు శాపం ఇవ్వగలను. కాని, బ్రాహ్మణుల్ని అందరూ గౌరవించాలి. వాళ్లకి హాని చెయ్యకూడదు. నేను బ్రాహ్మణుల్ని భక్తితో పూజిస్తాను కనుక, నేను నిన్ను శపించను.

నాకు శాపమిచ్చి నువ్వు లోకాలకే హాని కలిగించావు. వేదాల్లో చెప్పబడిన వస్తువులతో బ్రాహ్మణులు నా యందు హోమం చేస్తారు. అన్నము మొదలైన వస్తువులు దేవతలకీ, పితృదేవతలకీ నా ద్వారానే అందుతాయి. అటువంటి నేను అన్నీ తింటూ అపవిత్రుణ్ని అయితే కర్మలు సరిగా జరగవు. దానివల్ల లోక గమనం ఆగిపోతుంది” అని చెప్పి అగ్ని దేవుడు అన్ని లోకాల్లోను వ్యాపించిన తన కాంతిమయమైన రూపానికి కాంతి లేకుండా చేశాడు.

ఆహవనీయం, దక్షిణాగ్ని, గార్హపత్యం అనే మూడు అగ్నులు ప్రకాశించక పోవడం వల్ల యాగాలు ఆగిపోయాయి. అగ్నుల్లో ఉదయం సాయంకాలం జరిగే ఉపాసం మొదలైన హోమాలు జరగడం లేదు. భూమి మీద పితృదేవతలకి ఇచ్చే పిండాలు, యజ్ఞకార్యాలు ఆగిపోయాయి.

ప్రజలందరు భయంతో మహర్షుల దగ్గరికి వెళ్లారు. మహర్షులందరూ దేవతల దగ్గరికి వెళ్లారు. దేవతలు, మునులూ కలిసి బ్రహ్మ దగ్గరికి వెళ్లారు. భృగుమహర్షి ఇచ్చిన శాపం వల్ల అగ్నికి తేజస్సు లేకుండా పోయిందని, దాని వల్ల అన్ని లోకాల్లోను కర్మలు లేకుండా పోయాయని బ్రహ్మదేవుడికి చెప్పారు.

ఆయన అగ్నిని పిలిపించి “కనిపించే భూతాలన్నింటికీ నువ్వే అధిపతివి. కదలడం, కదలక పోవడం, లోకాల్ని పవిత్రం చెయ్యడం నీ వల్లే జరుగుతోంది. ఇన్ని మంచి గుణాలు కలిగి ప్రపంచాన్ని రక్షించవలసిన నువ్వు ఆ పనిని లక్ష్య పెట్టకుండా ఉండడం మంచిది కాదు. భృగుమహర్షి శాపం జరగక మానదు. నువ్వు అన్నీ తినేవాడివే అయినా పవిత్రులందరికంటే పవిత్రుడివి; అర్హత కలవాళ్లందరి కంటే అర్హత కలిగినవాడివి; పూజింప తగ్గ వాళ్లందరిలో మొదట పూజింపతగ్గ వాడివి. వేదాల్లో చెప్పినట్లు బ్రాహ్మణులకి కర్మలు చెయ్యడంలో సహాయపడి లోకాలు నడిచేలా చెయ్యి. నీ పవిత్రత ఎప్పటిలాగే ఉంటుంది” అని అగ్నికి చెప్పి మహర్షి శాపాన్ని వ్యర్థం కాకుండా చేశాడు.

తపస్సంపన్నుడైన భృగుమహర్షి తన కుమారుడు చ్యవనుడికి శర్యాతిమహారాజు కుమార్తె ‘సుకన్య’ని ఇచ్చి వివాహం చేశాడు. ఆ దంపతులకి గొప్పవాడైన ‘ప్రమతి’ పుట్టాడు. ప్రమతికీ అమృతంతో పాటు పుట్టిన ఘృతాచి అనే అప్సరసకి వివాహం జరిపించాడు. భృగువంశంలో గొప్పవాడుగా గొప్ప కాంతి కలిగిన ‘రురుడు’ పుట్టాడు. అతడు గొప్ప మహర్షి.

విశ్వావసుడు అనే పేరు గల గంధర్వరాజుకి మేనక అనే అప్సరసకీ పుట్టినవాడు ‘స్థూలకేశుడు’. రూపము, గుణము, సౌందర్యము కలిగిన ‘ప్రమద్వర’ స్థూలకేశమహర్షి ఆశ్రమంలో పెరుగుతోంది. ప్రమద్వరని చూసిన రురుడు ఆమెని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు.

ఒకరోజు ప్రమద్వర తన తోటివాళ్లతో ఆడుకుంటూ చూసుకోకుండా పాముని తొక్కింది. వెంటనే ఆ పాము ప్రమద్వరని కరిచింది. మిగిలినవాళ్లు భయంతో కేకలు పెట్టారు. విషయం తెలుసుకున్న గౌతముడు, కణ్వుడు, కుత్సుడు, విశ్వామిత్రుడు, శంఖుడు, మేఖలుడు, భరద్వాజుడు, వాలఖిల్యులు, ఉద్దాలకుడు, శ్వేతకేతుడు, మైత్రేయుడు, ప్రమతి, రురుడు అనే మహర్షులందరూ స్థూలకేశుడి ఆశ్రమానికి వచ్చి చచ్చిపోయిన ప్రమద్వరని చూసి బాధ పడ్డారు.

రురుడు బాధపడుతూ ఒంటరిగా అడవికి వెళ్లి “దేవతలారా! బ్రాహ్మణులారా! నేను దేవతల్ని పూజించడం, యజ్ఞాలు చెయ్యడం, వేదాలు పఠించడం, వ్రతాలు ఆచరించడం, పుణ్యకార్యాలు చెయ్యడం, గురువుల్ని బ్రాహ్మణుల్ని గౌరవించడం, తపస్సు చెయ్యడం వంటివి ఆచరిస్తున్నవాడినైతే నా ప్రాణంగా అనుకుంటున్న ప్రమద్వరని బ్రతికించండి. మీ దయ వల్ల ఆమె విష ప్రభావం నుంచి బయటపడాలి! మహాత్ములు తమ తపో ప్రభావంతోను, విషతత్త్వాన్ని తెలిసినవాళ్లు మంత్ర తంత్రాలతోను విష ప్రభావం వల్ల ప్రాణాలు పోగొట్టుకున్న నా ప్రమద్వరని తిరిగి బ్రతికించండి. అమెని బతికించిన వాళ్లకి నాకు తపస్సు వల్ల కలిగిన ఫలితాన్ని, వేదాధ్యయనం చెయ్యడం వల్ల కలిగిన ఫలితాన్ని, దానంగా ఇస్తాను” అని చెప్తూ గట్టిగా ఏడుస్తున్నాడు.

అకాశం నుంచి ఒక దేవదూత “మహర్షీ! మరణం కలిగితే దాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదు. అయినా ఒక ఉపాయం చెప్తాను. నీ ఆయుర్దాయంలో సగం భాగాన్ని నువ్వు ఆమెకి ఇయ్యగలిగితే ఆమె బ్రతుకుతుంది” అని చెప్పాడు. ఆ మాటలు విని రురుడు తన ఆయుర్దాయంలో సగ భాగం ప్రమద్వరకి ఇవ్వడానికి సంతోషంగా అంగీకరించాడు. దేవదూత యముడి అనుమతి తీసుకుని ప్రమద్వరని బ్రతికించాడు. రురుడు ప్రమద్వరని పెళ్లి చేసుకుని అనేక భోగాలు అనుభవించాడు.

రురుడు తన భార్యకి హాని చేసిన పాముల మీద కక్ష పెట్టుకున్నాడు. పెద్ద కర్ర పట్టుకుని అడవిలో తిరుగుతూ చెట్లల్లోను, పుట్లల్లోను, పొదల్లోను వెతికి వెతికి కనిపించిన ప్రతి పాముని చంపేస్తున్నాడు. ఒకచోట విషం లేని ‘డుండుబము’ అనే పెద్ద పాము కనిపించింది. దాన్ని కొట్టడానికి కర్రని పైకి ఎత్తాడు.

అది హరినామాన్ని స్మరిస్తూ మనుష్య భాషలో మాట్లాడుతూ “గొప్ప తేజస్సు కలవాడివి, బ్రాహ్మణుడివి. నువ్వు పాముల మీద ఇంత కోపాన్ని ఎందుకు పెంచుకున్నావు?” అని అడిగింది. రురుడు “నేను భార్గవ వంశంలో పుట్టిన రురుడు అనే పేరు కలవాణ్ని. నా భార్యకి పాము హాని చేసింది కనుక చంపుతున్నాను. ఇప్పుడు నిన్ను కూడ వదిలిపెట్టను” అంటూనే కర్రని పైకి ఎత్తాడు. వెంటనే మహర్షి రూపంలో కనిపించిన డుండుబాన్ని చూసి రురుడు “ఇప్పటి వరకు సర్పరూపంలో ఇప్పుడు మహర్షి రూపంలో ఉన్నావు.. ఏమిటిదంతా?” అని అడిగాడు.

డుండుబము మహర్షి రురుడితో “నేను ’సహస్రపాదుడు’ అనే మహర్షిని. ఖగముడు నాతో కలిసి చదువుకున్నాడు. అతడు హోమశాలలో ఉన్నప్పుడు ఒక గడ్డి పాముని చేసి సరదాగా అతడి మీదకి వేశాను. అతడు భయపడి నా మీద కోపగించి ‘నువ్వు శక్తిలేని పాముగా మారు!’ అని శపించాడు. నేను క్షమించమని అడిగాను.

ఖగముడు శాంతించి ‘నా శాపం నువ్వు అనుభవించక తప్పదు. కొంతకాలం విషం లేని పాముగా ఉంటావు. తరువాత భృగువంశంలో భార్గవవంశాన్ని వృద్ధి చేసే రురుడు నీకు కనిపిస్తాడు. అతడు కనిపించగానే నీకు శాప విమోచనం జరుగుతుంది” అని చెప్పాడు. ఇప్పుడు నువ్వు కనిపించగానే నాకు శాపవిమోచనం జరిగింది.

ప్రజలతో కీర్తింపబడే బ్రాహ్మణుడివి, గొప్ప జ్ఞానం కలవాడివి, అందరికీ మంచి జరగాలని కోరుకునే మనస్సు కలవాడివి, శాంతస్వభావుడివి, వేదాల్లో చెప్పబడిన కర్మల్ని క్రమం తప్పకుండా ఆచరించేవాడివి, దయ కలవాడివి, సత్యాన్నే పలికేవాడివి, గొప్పదైన భృగు వంశంలో పుట్టినవాడివి, అన్ని మంచి గుణాలు కలిగిన నువ్వు ఇటువంటి పని ఎందుకు చేస్తున్నావు? ఇటువంటి హింసా స్వభావం క్షత్రియులకి ఉంటుంది. బ్రాహ్మణులకి హింస పనికిరాదు. పూర్వం పాములకి తల్లి అయిన కద్రువ పాములకి శాపం ఇచ్చింది. అందువల్ల జనమేజయుడు చేసిన సర్పయాగంలో పాములకి హాని జరిగింది. ఆ సమయంలో నీ తండ్రికి శిష్యుడైన ఆస్తీకుడు అనే బ్రాహ్మణుడే ఆ యాగాన్ని ఆపించి పాముల్ని రక్షించాడు” అని చెప్పాడు. సహస్రపాదుడు చెప్పిన మాటలు విని రురుడు తను పాములకి చేస్తున్న హింసని ఆపేశాడు అని చెప్పి సూతమహర్షి అక్కడ ఉన్న మహర్షుల సందేహాన్ని తీర్చాడు.

ఇక్కడివరకు మహాభారతకథ ఆదిపర్వం మొదటి ఆశ్వాసం పూర్తయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here