మహాభారత కథలు-75: పాండవుల దగ్గరికి వచ్చిన శ్రీకృష్ణుడు

0
1

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

పాండవుల దగ్గరికి వచ్చిన శ్రీకృష్ణుడు

[dropcap]రా[/dropcap]జ్యాన్ని పోగొట్టుకుని ముని వేషాల్లో కామ్యకవనంలో నివసిస్తున్న పాండవుల దగ్గరికి శ్రీకృష్ణుడు వచ్చాడు. అతడి వెనక పాంచాలులు, యాదవులు, వృష్ణులు, భోజులు, అంధకులు మొదలైన తెగల ప్రజలందరు వచ్చారు.

వచ్చినవాళ్లందరు కౌరవుల్ని నిందించారు. “యుద్ధంలో కర్ణుడు, శకుని, దుర్యోధనుడు, దుశ్శాసనుల శరీరాల నుంచి కారే కొత్త రక్తంతో రాక్షసులు, కాకులు, గ్రద్దలు ఆనందపడుతుంటే భూదేవికి కూడా తృప్తి కలుగుతుంది. అవినీతితో సంచరిస్తూ కౌరవ వంశాన్ని మలినం చేస్తున్న దుష్టులు దుర్యోధనుడు, అతడి అనుచరులు. వాళ్లు యుద్ధంలో చంపదగినవాళ్లు. వాళ్లని సంహరించి కౌరవ రాజ్యానికి ధర్మరాజుని పట్టాభిషిక్తుణ్ని చేద్దాం” అన్నారు.

కోపంగా ఉన్న శ్రీకృష్ణుడిని “నువ్వు అవతారమూర్తివి. దేవతలతో, మునులతో స్తుతించబడతావు. నీకు ఎవరు సాటి? అసత్యం, అసూయ, గర్వం, కోపం వంటి మనోవైకల్యాలు నీ దగ్గరికి కూడా రావు” అని నమస్కరిస్తూ శాంతపరిచాడు అర్జునుడు.

శ్రీకృష్ణుడు అర్జునుడివైపు చూస్తూ “అర్జునా! నువ్వు, నేను నరుడు, నారాయణుడు అనే పేర్లతో ప్రాచీన ఋషులం. నువ్వు నరుడివి, నేను నారాయణుడిని. మనం గొప్ప శక్తితో ఇక్కడ జన్మించాం” అని చెప్పాడు. స్నేహితులైన శ్రీకృష్ణుడు అర్జునుడు ఒకళ్లతో ఒకళ్లు అన్యోన్యంగా కబుర్లు చెప్పుకుంటున్నారు.

తన పరాభవం గురించి చెప్పిన ద్రౌపది

శ్రీకృష్ణుణ్ని అందరూ చుట్టూ చేరి ఆరాధిస్తున్నారు. ఆ సమయంలో ద్రౌపది అక్కడికి వచ్చింది. శ్రీకృష్ణుడికి నమస్కరించి “దేవా! మొదటి సృష్టి సమయంలో నువ్వే బ్రహ్మదేవుడివని దేవలుడు అనే ఋషి; నిత్యసత్యమయుడవైన యజ్ఞపురుషుడివని కశ్యపమహర్షి; సర్వ వ్యాపివని, నీ అవయవాల్లో విశ్వసృష్టి అమరి ఉందని నారదమహర్షి; తరగని జ్ఞానానికి గనివని మహర్షులు అందరు పొగిడారు.

దయామయా! యుద్ధంలో వెనక్కి తిరిగి రాకుండా పోరే వీరులకి, గొప్ప శీలము కలవాళ్లకి, ఆధ్యాత్మిక జ్ఞానం కలిగినవాళ్లకి, అన్ని ధర్మసూక్ష్మాలు తెలిసినవాళ్లకి, రాజర్షి శ్రేష్ఠులకి, యోగీశ్వరులకి, మంచివాళ్లకి నువ్వే దిక్కు! నీకు తెలియనిది ఏదీ లేదు. అయినా కూడా నేను అనుభవించిన పరాభవాన్ని నీకు చెప్పుకుంటాను.

నేను చక్రవర్తి పాండురాజుకి కోడలిని; వీరాధివీరులైన పాండవుల భార్యని; గొప్ప బలవంతుడైన దృష్టద్యుమ్నుడికి సహోదరిని; నీకు చెల్లెలిని. ఇటువంటి నన్ను నిండు సభలో దుశ్శాసనుడు జుట్టు పట్టి ఈడ్చాడు. వస్త్రాలు ఒలిచి దారుణంగా అవమానించాడు. అప్పుడు పాండవులు మాట్లాడలేదు. భీష్ముడివంటి వృద్ధులు బంధువులు కూడా ఊరుకున్నారు. నన్ను రక్షించమని మొరపెట్టుకున్నా ఎవరూ నన్ను రక్షించలేదు.

ఇంక భీమార్జునుల భుజబలం ఎందుకు? నాకు ఎంతమంది బంధువులు ఉన్నా లేనిదాన్నయ్యాను. ఆ సమయంలో కర్ణుడు నన్ను చూసి నవ్వాడు. కృష్ణా! దుశ్శాసనుడి దుష్టచేష్ట కంటే కర్ణుడు నన్ను చూసి నవ్విన నవ్వు నన్ను దహించేస్తోంది.

వేదాలు చదువుకుంటూ పిల్లలతో ఆడుకుంటున్న కాలంలో భీముడు ఒకరోజు ప్రమాణకోటి ప్రదేశంలో గాఢ నిద్రలో మునిగి ఉన్నప్పుడు ప్రమాణకోటి అనే పేరుగల అగాధమైన గంగమడుగులోకి తోయించారు. విషం తినిపించారు. విషసర్పాలతో కరిపించారు; తల్లితోపాటు పంచపాండవుల్ని వారణావతంలో లక్క ఇంట్లో పెట్టి కాల్పించడానికి ప్రయత్నించారు.

ఇప్పుడు మోసపు జూదంలో రాజ్యం లాక్కున్నారు. అయినా అవమానాలన్నీ భరించి పాండవులు శౌర్యం లేకుండా ఉన్నారు. నేను పొందిన పరాభవాన్ని ఎలా పోగొట్టగలరు?” అని ద్రౌపది వెక్కివెక్కి ఏడ్చింది.

శ్రీకృష్ణుడు ద్రౌపదిని చూసి “నీ హృదయంలో రేగుతున్న బాధ కారణంగా అర్జునుడు తన శక్తివంతమైన బాణాలతో కౌరవుల్ని యముడి దగ్గరికి పంపిస్తాడు. ఏడు సముద్రాలు ఇంకిపోయినా పగలు, రాత్రి తారుమారైనా నా మాట నిజంగా జరిగి తీరుతుంది, నన్ను నమ్ము!” అన్నాడు.

అర్జునుడు ద్రౌపదితో “పురుషోత్తముడైన శ్రీకృష్ణుడు మన యోగక్షేమాలు చూస్తున్నాడు. మన శత్రువులందరు నశించిపోతారు. మూడు లోకాల్ని జయించగల శ్రీకృష్ణుడి అండ మన దగ్గర ఉండగా బాధపడతావెందుకు?” అన్నాడు.

దృష్టద్యుమ్నుడు “ద్రౌపదీ! భీముడు-దుర్యోధన దుశ్శాసనుల్ని; అర్జునుడు-కర్ణుణ్ని; నేను-ద్రోణుణ్ని యుద్ధంలో చంపుతాం. నువ్వు బాధపడకు” అని అనునయించాడు.

అందరూ ద్రౌపదిని ఊరడించారు. శ్రీకృష్ణుడు ధర్మరాజుతో “ఇక్కడ జరిగినదాన్ని గురించి ద్వారకలో ఉండగా యుయుధానుడు చెప్పాడు. చాలా బాధపడ్డాను. వెంటనే మిమ్మల్ని కలవాలని వచ్చాను. మహిళ, మద్యం, వేట, జూదం అనే నాలుగూ పెద్ద వ్యసనాలు. అనర్థాలకి మూలమైన జూదం వదిలిపెట్టకపోతే పాపం చుట్టుకుంటుంది.

ఆ జూదం జరిగినప్పుడు నేను ఉండి ఉంటే అనేక కారణాలు నిదర్శనాలు చూపించి పెద్దలయిన కృప, ద్రోణ, విదుర, భీష్ముల సహాయంతో ధృతరాష్ట్రుడిని ఒప్పించి జూదాన్ని ఆపి ఉండేవాడిని.

నేను దగ్గర ఉంటే మీకు ఎప్పటికీ కీడు కలగదు. నేను పది నెలలు సముద్రతీరంలో సాల్వుడితో యుద్ధం చేయవలసి వచ్చింది. అందుకే జూదం జరిగే సమయంలో దూరంగా ఉండి పోయాను” అన్నాడు.

సౌంభకాఖ్యానం చెప్పిన శ్రీకృష్ణుడు

ధర్మరాజు శ్రీకృష్ణుణ్ని సాల్వుడితో చేసిన యుద్ధం గురించి చెప్పమని అడిగాడు. శ్రీకృష్ణుడు “ధర్మరాజా! నువ్వు చేసిన రాజసూయయాగంలో నాకు పూజచేసి అర్ఘ్యం ఇవ్వడాన్ని ఓర్వలేక నా చేతిలో మరణించిన శిశుపాలుడి తమ్ముడే సాల్వుడు. ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లగల శక్తి కలిగిన ‘సౌంభకము’ అనే నగరంతో వచ్చి ద్వారకాపురాన్ని ముట్టడించాడు.

‘శత్రువులకి యముడివంటివాడు శిశుపాలుడు. అతణ్ని చంపి మహాగర్వంతో సంచరిస్తున్న వృష్ణివంశంవాడు శ్రీకృష్ణుడు ఎక్కడ ఉన్నాడు… వాడిని జయిస్తాను’ అని చెప్పి చతురంగ బలాలతో వచ్చి ద్వారకాపురిని ముట్టడించాడు. అతడి సేనలో ఉన్న ఏనుగులు ద్వారకాపట్టణానికి బయట ఉండే ఉద్యనవనాల్లో ఉన్న చెట్లన్నీ పీకేసాయి.

చారుదేష్ణుడు, ప్రద్యుమ్నుడు, సాంబుడు శత్రువుల్ని సంహరించాలన్న కోరికతో మహోత్సాహంతో ద్వారకాపురి కోట లోపలి నుంచి బయటికి వచ్చారు. వీరులైన ఆ యువకులు బలవంతులు, విధ్యాధరులవంటివాళ్లు, యుద్ధనిపుణులు. శ్రీరాముడివంటి పరాక్రమం కలవాడు, శత్రువుల ఏనుగుల్ని చీల్చిచెండాడడంలో సింహంవంటివాడు సాంబుడు.

సాల్వసేనాధిపతి క్షేమవృద్ధిని ఎదుర్కున్నాడు. సాంబుడి ధాటికి తట్టుకోలేక క్షేమవృద్ధి యుద్ధభూమిని వదిలి వెళ్లిపోయాడు. వేగవంతుడు అనే మరొక వీరుడు సాంబుడి మీద అనేక బాణాలు వేశాడు. సాంబుడిని పక్కకి తప్పించి చారుదేష్ణుడు వేగవంతుడితో పోరాడి తన గదతో అతడి తల పగిలేట్టు కొట్టాడు. వేగవంతుడు తల పగిలి నెత్తురు ప్రవహించింది.

విచింత్యుడు అమితమైన పరాక్రమంతో చారుదేష్ణుడితో పోరాటానికి దిగాడు. విచింత్యుడు వేసిన బాణాలని తప్పించుకుంటూనే చారుదేష్ణుడు ఆగ్నేయాస్త్రాన్ని వదిలాడు. దాంతో విచింత్యుడు నేలకొరిగాడు. అతడి మరణం చూసి సాల్వుడి సేనలు భయపడ్డారు.

సాల్వుడు ఆయుధాలన్నీ తీసుకుని తనే స్వయంగా యుద్ధభూమికి వచ్చి తన సేనకి ధైర్యం చెప్పాడు. సాల్వుడు ప్రద్యుమ్నుల మధ్య భీకరంగా పోరు జరుగుతోంది. ద్వారకాపట్టణంలో ఉన్న ప్రజలు, సౌంభకపురిలో ఉన్న ప్రజలు కూడా భయపడ్డారు.

ప్రద్యుమ్నుడి ధాటికి తట్టుకోలేక సాల్వుడు మూర్ఛపోయాడు. కొంతసేపటికి తెప్పరిల్లి ప్రద్యుమ్నుడిమీద అనేక బాణాలు ఒకేసారి ప్రయోగించాడు. ప్రద్యుమ్నుడు మూర్ఛపోయాడు. అతడి రథ సారథి అయిన దారుకుడి కుమారుడు సూతుడు రథాన్ని యుద్ధభూమికి దూరంగా తెచ్చి ఆపాడు.

ప్రద్యుమ్నుడు కొంతసేపటికి తేరుకున్నాడు. తను ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని బాధపడుతూ సారథిని ‘భయంకరంగా యుద్ధం జరుగుతున్నప్పుడు నన్ను యుద్ధభూమినుంచి దూరంగా తీసుకుని రావడం తగిన పనేనా? ఎదుటి వీరుల పరాక్రమం చూసి భయపడ్డావా? యుద్ధం నుంచి వెనుతిరిగిపోవడం, రణరంగంలో వెన్నుజూపి పారిపోయేవాళ్లని చంపడం, శరణన్నవాళ్లని రక్షించకుండా ఉండడం యాదవ వంశంలో ఉన్నాయా?

యుద్ధభూమి నుంచి పరాక్రమం పోయిన వాడిలా వచ్చేస్తే నన్ను చూసి బలరామకృష్ణులు, రాజకుమారులు, అక్రూరుడువంటి పెద్దలు నవ్వరా? నువ్వు నన్ను ఇలా తీసుకుని రావడం తప్పు. ఇప్పటికేనా నన్ను సాంబుడు, చారుదేష్ణుడు యుద్ధం చేస్తున్న చోటికి సాల్వుడికి ఎదురుగా మన రథాన్ని నడిపించు’ అన్నాడు.

ప్రద్యుమ్నుడి మాటలు విని సారథి ‘వీలు, చాలు కానివేళ రథికుడిని సంరక్షించే బాధ్యత సారథి పైన ఉంటుంది. అదే విధంగా సారథిని కాపాడే బాధ్యత రథికుడిది. సారథి, రథికులు ఇద్దరూ ఒకళ్లకొకళ్లు రక్షించుకోవాలి. సాల్వుడి బాణాలతో నీ బలం తగ్గింది. అందుకే ఇక్కడికి తీసుకుని వచ్చాను. ఇంక నా రథాన్ని, రథానికి కట్టిన గుర్రాల పటుత్వాన్ని చూస్తావు’ అన్నాడు.

సూతుడు రథాన్ని విచిత్రంగా నడుపుతూ సాల్వుడికి అప్రదక్షిణంగా తీసుకుని వచ్చాడు. అది చూసి సాల్వుడు తనకు అవమానం జరిగినట్టు అనుకుని సారథిని, ప్రద్యుమ్నుడిని అనేక బాణాలు ఒకేసారి ప్రయోగించి బాధించాడు. అతడు వేసిన బాణాల్ని ఆపుతూ ప్రద్యుమ్నుడు సాల్వుడి మీదకి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు.

సాల్వుడు మూర్ఛపోయాడు. ప్రద్యుమ్నుడు మరొక దివ్యబాణాన్ని సంధించాడు. దేవతలు చెప్పగా నారదుడు వాయుదేవుడు ప్రద్యుమ్నుడి దగ్గరికి వచ్చి సాల్వుణ్ని శ్రీకృష్ణుడే చంపాలి కనుక బాణం వదలద్దన్నారు. ప్రద్యుమ్నుడు బాణం వదలకుండా ఆపేశాడు.

ద్వారక వదిలి వెళ్లిన సాల్వుడు

సాల్వుడు ద్వారకానగరాన్ని వదిలిపెట్టి సౌంభకం ఎక్కి వెళ్లిపోయాడు. రాజసూయయాగం పూర్తయ్యాక నేను ద్వారకకి వెళ్లాను. అక్కడ శత్రుసేనలవల్ల ఉద్యనవనాలన్నీ నాశనమయ్యాయి. ప్రవేశద్వారాలు గుర్తుపట్టలేనట్లు అయిపోయాయి. బ్రాహ్మణుల ఇళ్లనుంచి వేదపారాయణ వినిపించలేదు. యజ్ఞయాగాదులు జరగడం లేదు. స్వాహాకారాలు వినబడలేదు. ఆడవాళ్ల శరీరాలమీద ఆభరణాలు కనబడలేదు.

సాల్వుడిని చంపిగాని తిరిగి ద్వారకానగరానికి రానని శపథం చేసి బయలుదేరాను. పురాన్ని రక్షించడానికి బలరాముడు మొదలైనవాళ్లని నియమించి; పురోహితుడు బ్రాహ్మణుల ఆశీస్సులు అందుకుని; శైబ్య, సుగ్రీవ అనే పేరుగల గుర్రాల్ని కట్టిన రథాన్నిఎక్కి; పాంచజన్యమనే పేరుగల శంఖాన్ని పూరించాను. దాని నుంచి పంచ మహావాద్యాల ధ్వనులు అన్ని దిక్కులకూ వ్యాపించాయి. ప్రజలందరు ఆశీర్వదించారు.

చతురంగబలాలతో కొండలు, అడవులు, సరస్సులు నదులు దాటి మర్తికావత దేశానికి వెళ్లాను. అప్పటికే సాల్వుడు సౌంభకాన్ని ఎక్కి సముద్రగర్భంలోకి వెళ్లిపోయాడు. నేను కూడా వాడి వెనకే వెళ్లి వాడి సేనాసమూహంతో యుద్ధం చేశాను. వాళ్లు కూడా గొప్ప యుద్ధం చేశారు. ధర్మరాజా! నేను ఎక్కుపెట్టిన శారంగమనే వింటి నుంచి వెళ్లిన బాణాలకి ముక్కలు ముక్కలైన రాక్షసుల దేహాలు సముద్రం మధ్యలో పడిపోయాయి.

నా సైన్యంలో వీరభటులు చేసే సింహనాదాలు సముద్రపు హోరుని మించిపోయాయి. సాల్వుడి సేన బలహీనపడిందని తెలుసుకుని సాల్వుడు మాయా యుద్ధం ప్రారంభించాడు. ఆగ్నేయాస్త్రం అన్ని మాయల్ని పోగొడుతుంది. అందుకే అగ్నేయాస్త్రంతో ఆ రాక్షసుడు కల్పించిన మాయని పోగొట్టాను. ఇలా అతడు మాయల్ని కల్పించడం నేను వాటిని పోగొట్టడం జరుగుతోంది.

అప్పుడు నా సారథి నాతో ‘యుద్ధనీతి తెలిసిన మహావీరులు పోరాటంలో అల్పుడైన శత్రువుని కూడా విడిచిపెట్టరుకదా! వీడు మాయలమారి, పరాక్రమశాలి. వీడిని నిర్లక్ష్యంగా వదిలి పెట్టడం మంచిదికాదు కదా!’ అని హితోపదేశం చేశాడు.

సారథి మాటలు విని నేను ప్రతికూలురైన రాక్షసుల్ని, గంధర్వుల్ని, యక్షుల్ని, దైత్యుల్ని, దానవుల్ని మండించి బుగ్గి చెయ్యడంలో గొప్పదైన సుదర్శన చక్రాన్ని మంత్రించి సౌంభకం మీదకి వేశాను. సౌంభకం సుదర్శనచక్రంతో కాల్చబడి భూమి మీద పడింది. సాల్వుడు తీవ్రమైన చక్ర వేగానికి రెండు ముక్కలై క్రింద పడ్డాడు.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here