[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]
నలదమయంతుల వివాహము
[dropcap]దే[/dropcap]వతలు దమయంతి ప్రార్థన ఆలకించి అమెని కరుణించారు. మూతపడని కనురెప్పలు, చెమట పట్టని దేహాలతో, నేలని తాకకుండా దగ్గరగా నిలబడ్డారు. దిక్పాలకులూ, భూలోకంలో ఉన్న రాజులందరూ చూస్తుండగా దమయంతి పుణ్యవంతుడైన నలుడి మెడలో పూలదండ వేసి అతడిని భర్తగా ఎంచుకుంది.
దేవతల శుభాకాంక్షలు, బ్రాహ్మణుల ఆశీర్వాదాలు, అనేక విధాలైన మంగళవాద్యాల ధ్వనులన్నీ కలిసి సముద్రఘోషలా వినిపించాయి. స్వయంవరంలో తనను వరించిన దమయంతిని నలుడు మహావైభవోపేతంగా వివాహం చేసుకున్నాడు.
ఇంద్రుడు నలుడికి ప్రత్యక్షమై నలుడు చేసే యజ్ఞాల్లో పాల్గొంటానని వరమిచ్చాడు. అగ్ని, వరుణుడు కూడా నలుడు అడిగిన ప్రదేశాల్లో నిప్పు, నీరు ఇస్తామని వరమిచ్చారు. యమధర్మరాజు నలుడి మనసు ధర్మం పైనే లగ్నమయ్యేలా వరమిచ్చాడు. దేవతలు నలుడికి వరాలు ప్రసాదించి స్వర్గానికి బయలుదేరారు.
కొంత దూరం వెళ్లాక వాళ్లకి ద్వాపరపురుషుడితోపాటు వస్తున్న కలి కనిపించాడు. దేవతలు కలిని ఎక్కడికి వెడుతున్నావని అడిగారు. కలి “భూలోకంలో దమయంతీ స్వయంవరం జరుగుతోందని విన్నాను. అందులో దమయంతి నన్ను వరించాలన్న కోరికతో, ఆశతో, ఇష్టంతో వెడుతున్నాను” అన్నాడు.
కలి మాటలు విని దేవతలు నవ్వారు. “స్వయంవరం జరిగిపోయింది. ఇంక నువ్వు అక్కడికి వెళ్లడం అనవసరం. దమయంతి నలమహారాజుని వరించింది” అని చెప్పారు.
కలికి నలమహారాజు మీద కోపం వచ్చింది. నలుడికి రాజ్యసంపదని, భోగబాగ్యాల్ని పోగొట్టాలనీ; నలదమయంతుల్ని విడదీయాలనీ నిశ్చయించుకున్నాడు. నలుడికి జూదమంటే ఇష్టమని కలిపురుషుడికి తెలుసు. పాచికల్లో ప్రవేశించమని ద్వాపరుణ్ని అడిగాడు. తాను నలుడిలో ప్రవేశించాలని సంకల్పించుకున్నాడు. నలుడితో జూదమాడడానికి ఎదురు చూస్తూనే ఉన్నాడు. చాలాకాలం వరకు అతడికి అవకాశం దొరకలేదు.
నలుడు అశ్వమేధం వంటి అనేక యజ్ఞాలు చేసేవాడు. బ్రాహ్మణులకి దక్షిణలు అపారంగా ఇచ్చేవాడు. జపం, తపం, హోమం, దానం, ధర్మ పుణ్యకార్యాలు అతడికి దినచర్యలుగా మారాయి. ఒకరోజు నలుడు మూత్రవిసర్జన చేసిన తరువాత పాదాలు కడుక్కోవడం మర్చిపోయి సంధ్యావందనం చేశాడు.
సమయం కోసం వేచి చూస్తున్న కలిపురుషుడు అపవిత్రంగా ఉన్న నలుడిలో ప్రవేశించాడు. తరువాత పుష్కరుడు అనే రాజు దగ్గరికి వెళ్లి కలి తనను తాను పరిచయం చేసుకున్నాడు. నలుడితో జూదం ఆడి నలుడి రాజ్యాన్ని, సర్వసంపదల్ని దోచుకోమని ప్రోత్సహించాడు. అందుకు పుష్కరుడు అంగీకరించాడు.
కలి బ్రాహ్మణ వేషం వేసుకుని పాచికలు పట్టుకుని పుష్కరుడితో కలిసి నలుడి దగ్గరికి వెళ్లాడు. ఇద్దరూ కలిసి నలుణ్ని జూదమాడడానికి ఆహ్వానించారు. జూదమాడడానికి జూదర్లు పిలిచినప్పుడు ఆడడం తెలిసి కూడా ఆడకపోవడం అధర్మం కనుక, అందుకు అంగీకరించాడు. పుష్కరుడితో జూదమాడడం మొదలుపెట్టాడు.
తనకున్న సంపదలన్నీ పణంగా పెట్టి అలసట లేకుండా ఆపకుండా జూదమాడుతున్నాడు. ఆప్తులు వారించినా వినకుండా చాలా నెలలు వస్తువాహనలన్నీ పణంగా పెట్టి పుష్కరుడితో జూదమాడి వరుసగ ఓడిపోతున్నాడు.
ఒకరోజు పౌరులు, బ్రాహ్మణులు, మంత్రులు దమయంతితో కలిసి వచ్చి జూదం మానమని నలుడిని వారించారు. కలిప్రభావానికి లోబడిన నలుడు వాళ్ల మాటలు వినలేదు. దమయంతి మనస్సులో దుఃఖపడుతోంది. ఓడినకొద్దీ జూదంలో ఆసక్తి, పట్టుదల పెరుగుతాయి. చూసి బాధపడడం తప్ప తానేం చెయ్యగలదు.
జూదంలో నలుడు రాజ్యసంపద మొత్తం పోగొట్టుకున్నాడు. నలుడు బాధపడి దమయంతిని తీసుకుని రాజ్యం నుంచి బయటికి వచ్చేసి మూడురోజులు ఊరి వెలుపల ఉండిపోయాడు.
రాజైన పుష్కరుడికి భయపడి, కలిప్రేరణతో పౌరులు ఎవరూ నలుడి దగ్గరికి వెళ్లలేదు. ప్రజలతో సత్కారాలు పొందడానికి యోగం ఉండి కూడా విధి ప్రభావం వల్ల ఎవరితోను గౌరవింపబడక నీళ్లు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ దమయంతితో కలిసి ఊరి బయట నివసిస్తున్నాడు.
అడవికి వెళ్లిన నలదమయంతులు
ఆకలిబాధ తాళలేక నలుడు ఆకాశంలో విహరిస్తున్న పక్షుల్ని చూసి వాటిని పట్టుకుని తినడానికి తను కట్టుకున్న వస్త్రాన్ని వాటి మీదకి విసిరాడు.
అవి నలుడి వస్త్రాన్ని తీసుకుని ఎగిరిపోతూ “నలమహారాజా! నీ సంపద, నీ రాజ్యం, మోసగించి ఎత్తుకుపోయిన పాచికలం. మేము పక్షులరూపం ధరించి నువ్వు కట్టుకున్న బట్టల్ని కూడ అపహరించాలని వచ్చాము.. తీసుకుని వెళ్లిపోతున్నాము” అని చెప్పి పక్షులు ఆకాశంలో ఎగిరిపోయాయి.
నలుడు పక్షుల మాటలు విని ఆశ్చర్యపోయాడు. దమయంతి కట్టిన వస్త్రంలో కొంత భాగం తనుకూడా చుట్టుకున్నాడు. ఇద్దరూ ఒకే చీర ధరించడం చూసుకుని నలుడు బాధపడ్డాడు. దమయంతితో “ఈ దారి దక్షిణాపథానికి; ఇది విదర్భపట్టణానికి పోయేబాట; ఇది కోసలదేశానికి మార్గం; ఇది ఉజ్జయినీ నగరానికి వెళ్లేతోవ. ఈ దారుల్లో మనం వెళ్లడానికి నీ ఉద్దేశంలో అనువైన మార్గం ఏదో చెప్పు. ఎందుకంటే నువ్వు నాతో అడవుల్లో తిరగలేవు. ఇప్పుడే పుట్టింటికి వెళ్లి నీ బంధువులతో సుఖంగా ఉండు” అన్నాడు.
నలుడు చెప్పింది విని దమయంతి “మహారాజా! మనిద్దరం విదర్భకి వెళ్లి సుఖంగా ఉందాం. క్రూరమృగాలు తిరిగే అడవిలో కష్టాలు అనుభవించడం ఎందుకు?” అంది.
ఆమె చెప్పింది నలుడు “దమయంతీ! నువ్వు చెప్పినట్లు విదర్భ ప్రభువు రాజ్యం కూడా మన రాజ్యంగా అనుకోవచ్చు. కాని, ఇంతకు ముందు సమస్త సంపదలతో తులతూగుతూ విదర్భకి వెళ్లి బంధువులందరికి అపరిమితమైన ఆనందాన్ని కలిగించాను. ఇప్పుడు అన్నీ పోగొట్టుకుని పరమదరిద్రుడిలా అక్కడికి ఎలా వెళ్లగలను? నాకు మొహం చెల్లటం లేదు” అన్నాడు.
“దుఃఖంలో ఉన్నవాడు భార్యతో కలిసి ఉంటే ఎన్ని కష్టాలున్నా అనుభవిస్తున్నట్టు అనిపించవు. విసిగి ఉన్నప్పుడు, బడలిన సమయంలో, ఆకలివేస్తున్న వేళలో, దాహం వేసినప్పుడు, మగవాడికి భార్యే మనసులో దుఃఖాల్ని పోగొడుతుంది. కనుక, నాతో రావడానికి అంగీకరించు” అని ప్రార్థించింది.
నలుడు వస్తానని చెప్పి దమయంతిని ఓదార్చాడు. ఇద్దరూ చాలా దూరం నడిచి ఒక అడవికి చేరుకున్నారు. అక్కడ ఒక మంటపం కనిపించింది. అలిసిపోయి విశ్రాంతికోసం నేలమీదే పడుక్కున్నారు. ఎక్కువ దూరం నడవడం వల్ల అలిసిపోయిన దమయంతి గాఢంగా నిద్రపోయింది.
అమె వైపు చూస్తూ ‘ఈ దమయంతి చెలికత్తెలు ఎంతో మృదువుగా పాదాలు ఒత్తుతుంటే మెత్తటి పరుపుల మీద నిద్రపోయేది. ఇప్పుడు ఈ దుమ్ములో కటిక నేలమీద నిద్రపోతోంది. నన్ను పెళ్లి చేసుకోడం వల్ల ఈమెకి ఇన్ని కష్టాలు వచ్చాయి. ఆమె పడుతున్న బాధని నేను చూడలేను. ఈమెని ఇక్కడే విడిచిపెట్టి వెళ్లిపోతే తన బంధువుల దగ్గరికి వెళ్లి సుఖంగా ఉంటుంది’ అనుకుని దమయంతి చీరలో కొంతభాగం చింపి కట్టుకుని కొన్ని అడుగులు ముందుకి వేశాడు.
నలుడు దమయంతిని విడిచి వెళ్లాలని అనుకున్నాడే కాని, స్నేహబంధం వల్ల విడిచిపెట్టి వెళ్లలేక పోయాడు. చాలాసేపు ఒక నిశ్చయానికి రాలేకపోయాడు. చివరికి కలిప్రభావం వల్ల నిర్దయగా వదిలిపెట్టి వెళ్లిపోయాడు.
దమయంతి శాపానికి మరణించిన కిరాతుడు
నిద్రలేచిన దమయంతికి భర్త కనబడలేదు. అమె నాలుగువైపులా తేరిపార చూసింది. భయంతో దుఃఖంతో “నలమహారాజా! సువిశాలమైన భూమండలాన్ని రక్షించడానికి సామర్థ్యం కలిగిన దక్షిణబహువు కలవాడా! శత్రువులను ఓడించినవాడా! నిషధదేశానికి రాజా! ఇంత దయలేకుండా నన్ను విడిచి వెళ్లడం న్యాయంగా ఉందా.
ధర్మ తప్పనివాడివి, సత్యసంధుడివి, భయపడద్దని ఓదార్చి చెప్పిన మాటలు మర్చిపోయి వెళ్లిపోతే నేను ఎక్కడికి పోగలను. ఈ భయంకరమైన అడవిలో నిన్ను ఎలా వెదకగలను? ప్రాణసమానమైన నన్ను ఎప్పుడూ వదలనని చెప్పావు. అన్న మాట నిలబెట్టుకో!” అంటూ అడవిలో గట్టిగా మాట్లాడుకుంటూ తిరుగుతోంది.
ఆమె తన ఒంటరితనానికి బలహీనతకి బాధపడట్లేదు. నలుడికి తోడుగా ఎవరూ లేరు, ఆకలిదప్పులకి తట్టుకోలేడు, ఎక్కడెక్కడ తిరుగుతూ శ్రమపడుతున్నాడో, ఎలా ఉన్నాడో అని బాధపడుతోంది.
దట్టంగా పెరిగిన పొదలని పక్కకి నెట్టుకుంటూ, ముళ్లు కనిపించగానే దూరంగా వెళ్లిపోతూ, దిక్కులు చూస్తూ, కిందపడుతూ లేస్తూ, భయంతో వణుకుతూ దమయంతి అడవిలో తిరుగుతోంది. అంతలో ఆమెని ఒక కొండచిలువ చుట్టుకుంది. అమె భయంతో “నలమహారాజా! ఇప్పుడైనా వచ్చి కాపాడు!” అని కేకలు వేసింది.
ఆ కేకలు విని ఒక కిరాతుడు వచ్చి కత్తితో కొండచిలువని నరికి ఆమెని ఓదార్చి ఒక కొలను దగ్గరికి తీసుకుని వెళ్లాడు. ఆమె స్నానం చేసి సేదతీర్చుకున్నాక పండ్లు తెచ్చి తినమన్నాడు.
అందమైన దమయంతిని చూసి కిరాతుడికి దుర్బుద్ధి పుట్టింది. తన కోరికని అమెకి తెలియచేశాడు. దమయంతి పరమ పవిత్ర చరిత్ర, అగ్నిజ్వాలవంటిది. ఎవరూ అమె వైపు తేరిపారచూసే ధైర్యం కూడా చెయ్యరు. అటువంటి దమయంతిని తన కోరిక తీర్చమని అడిగాడు.
దమయంతి ఆ కిరాతుడివైపు కోపంగా చూసి “నేను పతివ్రతనైతే దుష్టుడైన ఈ కిరాతుడు ఇప్పుడే ఇక్కడే మరణించాలి!” అని శపించింది.
వెంటనే ఆ కిరాతుడు నిప్పుతో కాల్చబడిన చెట్టులా నేలమీద పడి మరణించాడు. ప్రతి చెట్టుని పుట్టని నలమహారాజుని చూశావా అని అడుగుతూ భయంకరమైన అరణ్యంలో విషసర్పాలకి, క్రూరజంతువులకి భయపడకుండా తిరుగుతోంది.
అడవిలో ఒంటరిగా దమయంతి
కొండ చరియల దగ్గర, కొండ గుహల్లోను వెదుకుతూ దిక్కుతోచకుండా ఆ అడవిలో పడి తిరుగుతూనే ఉంది. దగ్గరలో పవిత్రమైన నది ఒడ్డుమీద, నీరు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ; ఆకులు మాత్రమే తింటూ; గాలి మాత్రమే పీలుస్తూ; ఆకు కూరలు, నివ్వరిగింజలు తింటూ తపస్సు చేస్తూ చెట్లకింద మహానుభావులైన ఋషులు నివసిస్తున్న మునిపల్లె కనిపించింది. అక్కడ ఉన్న వసిష్ఠ, వామదేవ, వాలఖిల్య, భృగు, నారదుల వంటి గొప్ప ఋషులకి దమయంతి భక్తితో నమస్కరించింది.
ఆమె అతిలోక సౌందర్యానికి, తేజస్సుకి ఆశ్చర్యపడిన ఋషులు “అమ్మా! నువ్వు వనదేవతవా? దేవతాస్త్రీవా? ఈ అడవిలో ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు?” అని అడిగారు.
దమయంతి ఋషులతో “పుణ్యచరిత్రుడు, కీర్తిమంతుడు, ఇష్టంగా యజ్ఞాలు చేసేవాడు ఈ భూమండలం మీద గొప్ప పేరుపొందిన నలమహారాజు భార్యని. విధివశాత్తు ఎక్కడికో వెళ్లిపోయాడు. ఆయన కోసం వెతుకుతూ తిరుగుతున్నాను. మీకు కనిపిస్తే చెప్పండి. లేకపోతే నేను ప్రాణాలు వదిలేస్తాను” అని చెప్పి ఏడుస్తోంది.
ఋషులు అమె వివరాలు తెలుసుకుని “అమ్మా! నువ్వు కొన్నిరోజుల్లో నీ భర్త నలుణ్ని కలుసుకుంటావు. అతడు పూర్వంలాగే రాజధానీ నగరంలో రాజ్యవైభవంతో ప్రజలకి నచ్చే విధంగా రాజ్యాన్ని పాలిస్తాడు. మేము మా తపోదృష్టితో చూసి చెప్తున్నాము. నువ్వు బాధపడకు” అని చెప్పి తమ అగ్నిహోత్రాలతోను, ఆశ్రమాలతోను కలిసి మాయమయ్యారు. దమయంతి అది చూసి ఆశ్చర్యపోయింది.
మళ్లీ అడవిలో తిరుగుతోంది. ఆమెకి ఒక వర్తకుల గుంపు కనపడింది. దుమ్ముతో రేగి ఎర్రబడిన జుట్టుతోను, చిక్కి శల్యమైన శరీరంతోను ఆకలి, దప్పిక, నిద్రలకి దూరమై పిచ్చిదానిలా తిరుగుతున్న దమయంతిని చూసి కొంతమంది వర్తకులు ఆమె దెయ్యమనుకుని భయపడి పారిపోయారు.
కొంతమంది ఆమెని హేళనగ మాట్లాడారు. కొంతమంది “అవ్వా! నువ్వు దేనికోసం వెతుకుతున్నావు?” అని అడిగారు. ఇంకా కొంతమంది “దేవీ! నువ్వు సాక్షాత్తూ దివినుంచి భువికి దిగి వచ్చిన దేవతవి!” అని చేతులు జోడించి నమస్కరించారు.
దమయంతి వర్తకుల పెద్దని చూసి “నేను నలమహారాజు భార్య దమయంతిని. మీరు ఇక్కడ ఎక్కడైన నా భర్త నలుణ్ని చూశారా?” అని అడిగింది.
‘శుచు’ అనే వర్తకుడు “ఇక్కడ మేము నలుణ్ని చూడలేదు. భయంకరమైన సింహాలు, ఏనుగులు, ఎలుగుబంట్లు చూశాము. ఇది భయంకరమైన అడవి. ఇందులోకి సూర్యరశ్మి కూడా ప్రవేశించలేదు” అన్నాడు.
“మరి ఈ వర్తకులందరు ఎక్కడికి వెడుతున్నారు?” అని అడిగింది.
శుచు “ఈ వర్తకులు చేదిదేశపు రాజు సుబాహువు రాజధానికి వెడుతున్నారు” అన్నాడు.
దమయంతి కూడా వాళ్లతో బయలుదేరింది. పొద్దేక్కేవరకు నడిచిన వర్తకులు చల్లని నీళ్లతో ఉన్న చెరువు దగ్గర సేదతీర్చుకుని విశ్రమించారు.
అర్ధరాత్రి ఏనుగుల గుంపు నీళ్లు తాగడానికి ఆ చెరువు దగ్గరికి వచ్చింది. మంచి నిద్రలో ఉన్న కొంతమంది ఏనుగుల కాళ్లకింద పడి చచ్చిపోయారు. కొంతమంది ఏనుగుల దంతాలతో చీల్చబడి చచ్చిపోయారు. కొంతమంది భయంతో పరుగెత్తి చెట్లెక్కేశారు.
అదంతా చుస్తున్న దమయంతి “చచ్చిపోవాలని కోరికతో ఉన్న నన్ను చంపడం మరిచిపోయాడు భగవంతుడు. ఏనుగుల గుంపు కూడా దయతలచలేదు. నన్ను కోరి వచ్చిన దేవతల్ని కాదని వాళ్ల ఎదురుగా నలుణ్ని కోరి వరించాను. వాళ్ల కోపం వల్ల నాకు ఇలాంటి కష్టాలు వస్తున్నాయేమో.. ఇంకేం చెయ్యగలను?” అని బాధపడింది.