మహాభారత కథలు-82: నలుణ్ని గుర్తించిన పర్ణాదుడు

0
3

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

నలుణ్ని గుర్తించిన పర్ణాదుడు

[dropcap]వి[/dropcap]దర్భకి వెళ్లిన దమయంతి బంధువుల మధ్య ఉన్నా కూడా శరీరసౌఖ్యాలు వదిలిపెట్టేసింది. మాసిన సగం చీరనే ధరించింది. దుమ్ము పేరుకుపోయిన శరీరంతోనే జీవిస్తూ తన భర్తని చూడడం కోసం ఎదురుచూస్తోంది.

ఒకరోజు తల్లి దగ్గరికి వెళ్లి “అమ్మా! నా దుఃఖాన్ని పోగొట్టడానికి పుణ్యచరిత్ర కలిగిన నలుణ్ని వెదకడానికి ఎవరినైనా పంపించు. అతణ్ని చూడకపోతే ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోతాను” అంది.

కూతురు ఉద్దేశాన్ని తల్లి భీమరాజుకి చెప్పింది. మంచి ప్రవర్తన కలిగిన బ్రాహ్మణులని భీమరాజు నలుణ్ని వెదకడానికి నియోగించాడు.

దమయంతి నలుణ్ని వెదకడానికి బయలుదేరుతున్న బ్రాహ్మణులతో “నిషధరాజ్యానికి రాజైన నలుడు ప్రస్తుతం పదవిని కోల్పోయి అసమర్థుడుగా ఉన్నాడు. ఇతరులు తనను గుర్తించకుండా అజ్ఞాతవాసం చేస్తూ ఉంటాడు.

మీరు వెళ్లిన ఊళ్లలో – ‘నువ్వు సత్యవ్రతుడివి. నీ భార్యని మోసం చేసి ఆమె చీరని సగం చింపి కట్టుబట్టగా చేసుకువెళ్లడం న్యాయంగా ఉందా? భరింపబడేది భార్య అని కదా అర్థం. ఆ ధర్మాన్ని నువ్వు ఆచరించలేదు. ఇటువంటి కఠినమైన బుద్ధిని వదిలి ఆ పతివ్రతాశిరోమణిని అనుగ్రహించు!’ అని చెప్పండి.

ఈ మాటలకి రోషం వచ్చి ఎవరు ఎదురు సమాధానం చెప్తాడో అతడిని నలుడిగా గుర్తించి ఇక్కడికి తీసుకుని రండి. ఒకవేళ అతడు మీతో రాకపోతే అతడిని మీరు గుర్తుపెట్టుకుని రండి” అని చెప్పింది. బ్రాహ్మణులు దమయంతి చెప్పిన మాటలు అన్ని సభలలోను చెప్పి నలుడు కనిపించక తిరిగి వచ్చారు.

‘పర్ణాదుడు’ అనే బ్రాహ్మణుడు దమయంతితో “నేను అయోధ్యకి వెళ్లి అక్కడ ఋతుపర్ణుడి సభలో నువ్వు చెప్పమన్న మాటలు చెప్పాను. ఒక కురూపి, పొట్టి చేతులు కలవాడు ఋతుపర్ణుడి దగ్గర పనిచేసే సేవకుడు, వంటలు చెయ్యడంలో నేర్పరి, వేగంగా ప్రయాణం చెయ్యడంలో దిట్ట, బాహుకుడు అనే గుర్రాల శిక్షకుడు నా మాటలు విని నన్ను రహస్యంగా కలుసుకున్నాడు.

అతడు నాతో “భర్తయందు తప్పులుంటే తెలిసినా భార్య ఓర్పుపడుతుంది. ఆ భార్య ఇహలోకంలో భర్త నుంచి తను కోరిన సౌఖ్యం పొందుతుంది. అలాగే ఆ పుణ్యం వల్ల మరుజన్మలో ధర్మం పట్ల ప్రీతిని పొందుతుంది అని మాత్రమే చెప్పి తన నివాసానికి వెళ్లిపోయాడు” అని చెప్పాడు.

ఆ మాటలు విని దమయంతి ఆలోచనలో పడింది. అతడు నలుడు కాకపోతే ఎదురు సమాధానం ఎందుకు చెప్తాడు? అతడి సంగతి పూర్తిగా తెలుసుకోడానికి ఇంకెవరినైనా పంపించాలి అనుకుంది. తల్లి అనుమతి తీసుకుని సుదేవుడిని రప్పించింది.

సుదేవుడితో “విద్వాంసులతో కీర్తించబడేవాడా! సుదేవా! నువ్వు సకల సద్గుణాల సంపద కలవాడివి. నువ్వే కదా నన్ను గుర్తించి తెచ్చావు. అలాగే గొప్పవాడైన నలమహారాజుని కూడా నీ నేర్పుతో వెతికి తీసుకునిరా! అయోధ్యకి విదేశాలనుంచి వచ్చిన బ్రాహ్మణుడిలా వెళ్లు. ఉత్తరకోసలపతి, గొప్పవాడు, పుణ్యాత్ముడు, దేవతలతో సమానమైన ఋతుపర్ణుడిని దర్శించు.

విదర్భప్రభువు భీముడు నలుడిని వెతకడానికి అనేకమందిని అన్ని వైపులకి పంపించి, ఎక్కడా అతడి జాడ తెలియక దమయంతికి ద్వితీయ స్వయంవరాన్ని ఏర్పాటు చేశాడనీ, అందుకు భూమండలంలో రాజులందరు వస్తున్నారనీ, వెంటనే ఋతుపర్ణుణ్ని బయలుదేరి రమ్మనీ చెప్పు” అని దమయంతి సుదేవుడికి చెప్పి పంపించింది.

సుదేవుడు అయోధ్యానగరానికి చేరుకుని ఋతుపర్ణుడిని దర్శించుకుని విదర్భా నగరంలో దమయంతికి మరునాడు స్వయంవరం జరుగుతోందని చెప్పాడు.

ఋతుపర్ణుడు బాహుకుడిని పిలిచి “నాకు దమయంతీ స్వయంవరం చూడాలని ఉంది. ఒక్క రోజులో మనం విదర్భకి చేరాలి. నీ అశ్వశిక్షా చాతుర్యాన్ని చూపించు” అన్నాడు. బాహుకుడు అలాగే చూపిస్తానన్నాడు.

కాని, ఆ వార్త విని మనసులో బాధపడుతూ ‘నేను ఆమెని అడవిలో ఒంటరిగా వదిలేసి వెళ్లాను. అదే నామీద కోపం. అదే రెండో స్వయంవరానికి కారణం. ఋతుపర్ణుడితో వెళ్లి మొత్తం తెలుసుకుని వస్తాను’ అనుకున్నాడు.

బాహుకుడు ఇదివరలో వార్ష్ణేయుడు అయోధ్యకి తెచ్చి ఉంచిన తన రథానికి మనోవేగం, వాయువేగం, సమస్త శుభలక్షణాలు కలిగిన గుర్రాల్ని కట్టి రథాన్ని తెచ్చాడు.

ఋతుపర్ణుడు రథం ఎక్కుతుండగా గుర్రాలు కొంచెం వంగాయి. అది చూసి ఋతుపర్ణుడు “బాహుకుడితో ఈ బడుగు గుర్రాలు అంతదూరం ఎలా వెళ్లగలవు? వేరే గుర్రాలు కట్టి తీసుకునిరా!” అని ఆదేశించాడు.

బాహుకుడు “రాజా! ఈ గుర్రాలు వాయువేగంతో పరుగెత్తుతాయి. పొద్దుకుంకే సమయానికి విదర్భ చేరుస్తాయి” అన్నాడు.

అతడి మాటలకి మెచ్చుకుని ఋతుపర్ణుడు “అలా ఈ రోజు పొద్దుకుంకే లోపే విదర్భకి చేరగలిగితే గుర్రాల స్వభావం తెలుసుకోవడంలోను, వాటికి శిక్షణ ఇవ్వడంలోను నీకు ఉన్న నైపుణ్యానికి గుర్తింపుగా బహుమతి ఇస్తాను” అన్నాడు.

అక్షహృదయం ఉపదేశించిన ఋతుపర్ణుడు

ఋతుపర్ణుడు బాహుకుడితోను, వార్ష్ణేయుడితోను కలిసి బయలుదేరాడు. ఎక్కడో దూరంగా కనిపించిన రూపాలు క్షణంలో దగ్గరగా కనిపించి వెంటనే వెనక్కి వెళ్లి చాలా దూరంలో కనిపించేవి.

ఋతుపర్ణుడు ‘ఇది సూర్యుడి రథమా! రథసారథి బాహుకుడా.. అసురుడా!’ అని ఆశ్చర్యపోయాడు. వార్ష్ణేయుడు కూడా బాహుకుడు రథాన్ని తోలే విధానం చూసి ఈ బాహుకుడు అశ్వశాస్త్రాన్ని రాసిన శాలిహోత్రమహర్షా.. దేవేంద్రుడి రథసారథి మాతలా.. నలుడా..? ఈ భూలోకంలో రథాలని గురించి, గుర్రాలని గురించి తెలిసినవాళ్లు ఇంతకంటే ఎవరూ లేరు.

ఈ బాహుకుడు వయస్సుకీ, చదువుకీ సంబంధించిన గొప్పతనంలో నలుడితో సమానంగా ఉన్నాడు. ఆకారంలో పోలికలేదు. రూపం మార్చడానికి వేరే కారణం ఏదైనా ఉందేమో.. మహాపురుషులు కరణాంతరాల వల్ల మారురూపంలో ఇతరులకి తెలియకుండా ఉండడం జరుగుతుంది’ అని మనస్సులో అనుకుంటున్నాడు.

ఇంతలో ఋతుపర్ణుడి ఉత్తరీయం జారి నేలపైన పడింది. “బాహుకా! రథం అపు! వార్ష్ణేయుడు దిగి ఉత్తరీయం తెస్తాడు” అన్నాడు.

బాహుకుడు “మహారాజా! మీ ఉత్తరీయం పడిపోయిన చోటు ఇక్కడికి ఆమడదూరంలో ఉంది. వార్ష్ణేయుడు అంతదూరం నడిచివెళ్లి ఉత్తరీయం ఎలా తెస్తాడు?” అని అడిగాడు. అంత వేగంగా రథాన్ని నడుపుతున్నాడు బాహుకుడు.

ఒకచోట దారిలో ఒక పెద్ద తాండ్రచెట్టు దట్టమైన ఆకులతో లెక్కపెట్టడానికి శక్యం కానన్ని రెమ్మలతో కొమ్మలతో పండ్లతో కనిపించింది. ఋతుపర్ణుడు బాహుకుడితో “అందరికీ అన్ని విషయాలు తెలియవు కదా! జ్ఞాన నైపుణ్యాల్లో అందరు వేరు వేరు విషయాల్లో గొప్పవాళ్లవుతారు. నేను చూడగానే వస్తు సమూహాల సంఖ్యని తప్పులేకుండా చెప్పగలను.

ఈ తాండ్రచెట్టులో ఉండే మొత్తం పండ్లు, ఆకులు లెక్క చెప్తాను. ఈ రెండు కొమ్మల్లో ఉన్న ఆకులు పండ్లు కలిపి పదివేల ఒకటి. తక్కిన కొమ్మల్లో ఉన్నవి మొత్తం రెండువేల తొంభై అయిదు” అన్నాడు.

అది విని బాహుకుడు “వాటిని లెక్కపెడితేగాని నిజమని నమ్మలేను” అని రథాన్ని ఆపాడు. లెక్కపెట్టడానికి వీలుగా ఆ చెట్టుని కిందపడేశాడు. అన్ని కొమ్మల్లో ఉండే ఆకుల్ని పండ్లని లెక్కపెట్టాడు.

ఋతుపర్ణుడు చెప్పిన సంఖ్యతో సరిపోయాయి. బాహుకుడు ఋతుపర్ణుడి గొప్పతనానికి ఆశ్చర్యపోయి తనకు ఆ విద్యని ఉపదేశించమమని ప్రార్థించాడు.

ఋతుపర్ణుడు “ఇది ‘అక్షహృదయం’ అనే ప్రసిద్ధికెక్కిన విద్య. దీన్ని శాస్త్రీయంగా నేర్చుకున్న మనిషి సంఖ్యావేత్త అవుతాడు. పాపాలనుంచి, దుర్గుణాలనుంచి, విషప్రభావంనుంచి విముక్తుడవుతాడు. ఈ విద్యని పొందిన వ్యక్తి అన్ని గుణాల్లోను గొప్పవాడై, విశ్వానికి మంచిని తలపెట్టేవాడవుతాడు”. అనిచెప్పాడు.

ఋతుపర్ణ మహారాజు ప్రశాంతతతో, నిండు హృదయంతో, వేగంగా విదర్భకి వెళ్లాలన్న కుతూహలంతో, పూర్తి ఇష్టంతో బాహుకుడికి ‘అక్షహృదయం’ అనే గణితవిద్యని శాస్త్రీయంగా ఉపదేశించాడు.

నలుడు ఋతుపర్ణుడి ద్వారా అక్షహృదయం అనే విద్యని ఉపదేశం పొంది సంతోషంగా ఉన్నాడు. ఋతుపర్ణుడితో “మహారాజా! నీకు అశ్వహృదయం ఉపదేశిస్తాను తీసుకో!” అన్నాడు.

ఋతుపర్ణుడు “నాకు అవసరమైనప్పుడు తీసుకుంటాను. అప్పటివరకు నీ దగ్గరే ఉండనియ్యి” అన్నాడు.

కలినుంచి విముక్తుడయిన నలుడు

అక్షహృదయం అనే విద్య యొక్క మహిమవల్ల అప్పటి వరకు నలుణ్ని ఆవహించి ఉన్న కలిపురుషుడు కర్కోటకుడి విషాన్ని కక్కుతూ నలుడి శరీరం నుంచి బయటికి వచ్చి గజగజ వణికిపోతూ తనను పరిచయం చేసుకున్నాడు. నలుడు కోపంతో కలిని శపించబోయాడు.

ఆ సంగతి తెలుసుకుని కలి “మహారాజా! నిన్ను ఆవహించడం వల్ల కర్కోటకుడి విషం వల్ల తగులబడిపోతూనే ఉన్నాను. ఇంక దండించవద్దు. నిన్ను నీ భార్య దమయంతిని ధ్యానించిన వాళ్లకి కలిదోషం ఉండదు. దయచేసి నా మీద ఉన్న కోపాన్ని వదిలిపెట్టు” అని ప్రార్థించాడు. అతడి అభ్యర్థన విని నలుడు శాంతించాడు.

కలిపురుషుడు విభీతవృక్షము లేదా తాండ్రచెట్టుని ఆవహించాడు. అప్పటి నుంచి తాండ్రచెట్టు మంచిదికాదు అనే మాట నిలిచి పోయింది. బాహుకుడు వికృతమైన రూపం తప్ప మిగిలిన పాపాలనుంచి విముక్తుడయ్యాడు.

రథాన్ని ఎక్కి అమితమైన వేగంతో నడుపుతూ ఋతుపర్ణుడు, వార్ష్ణేయులతో కలిసి పొద్దుకుంకే వేళకి విదర్భకి చేరాడు.

భీమరాజు అనుమతితో ఋతుపర్ణుడు గొప్ప వైభవంతో విదర్భాపురంలో ప్రవేశించాడు. అతడు నగరంలోకి వస్తుంటే అతడి రథ శబ్దం ఆకాశంలో మేఘాలు గర్జించినట్టు వినిపించింది. ఆ రథఘోష విని దమయంతి అది నలుడి రథమని గుర్తుపట్టింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here