[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]
విదర్భాపురం చేరిన నలుడు
[dropcap]ని[/dropcap]షధదేశానికి రాజు, లోకం మెచ్చే చరిత్ర కలవాడు, పుణ్యవంతుడు, లోకానికి ఉపకారం చేసేవాడు, పరాక్రమవంతుడు అయిన నలుడు విదర్భాపురానికి చేరాడు. అతణ్ని చూడగలుగుతున్నందుకు దమయంతి సంతోషించింది. రథం రావడం కోసం ఎదురు చూసింది.
ఆ రథం మీద ఋతుపర్ణుడు కూర్చుని కనిపించాడు. దమయంతి అతడిని చూసి మళ్లీ దుఃఖంలో మునిగిపోయింది. ఋతుపర్ణుడు భీమరాజుని దర్శించడానికి వచ్చాడు. భీమరాజు ఋతుపర్ణుడికి అతిథి సత్కారాలు చేసి ఒక పెద్ద మేడలో విడిది ఏర్పాటు చేశాడు.
ఆ పట్టణంలో స్వయంవరానికి సంబంధించిన సందడి ఏదీ కనిపించలేదు. ఋతుపర్ణుడు తనలో తను “భూమండలంలో రాజులు ఎవరూ ఇక్కడికి రాలేదు. విదర్భరాజపుత్రిక దమయంతి మరొక వరుణ్ని వరించేంత అధర్మ ప్రవర్తన కలదికాదు కదా” అని ఆలోచిస్తూ ఉండిపోయాడు.
బాహుకుడు రథశాలలో గుర్రాలని కట్టి రథానికి దగ్గరలో సేద తీర్చుకుంటున్నాడు. దమయంతి బాహుకుణ్ని, వార్ష్ణేయుణ్ని చూసి నిరాశపడింది.
అయినా వదలక కేశిని అనే దాసిని పిలిచి “ఋతుపర్ణుడు అయోధ్యకి రాజు. వార్ష్ణేయుడు సూతపుత్రుడిగా నేను గుర్తుపట్టాను. బాహుకుణ్ని చూడగానే నా హృదయంలో సంతోషం కలుగుతోంది. అతడు ఎవరో తెలియట్లేదు.
అయోధ్యకి పంపించిన బ్రాహ్మణుడు పర్ణాదుడికి బదులిచ్చినవాడు బాహుకుడు. అతడి దగ్గరికి వెళ్లి అతడి గురించి సమాచారం తెలుసుకునిరా!” అని పంపించింది.
కేశిని బాహుకుడి దగ్గరికి వెళ్లి “అయ్యా! దమయంతి నీ యోగక్షేమాలు తెలుసుకుని రమ్మని నన్ను పంపించింది. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు?” అని అడిగింది.
బాహుకుడు “దమయంతికి తిరిగి స్వయంవరం సంకల్పించారు కదా! అందుకు అందరు క్షత్రియవీరులను ఆహ్వానించి రప్పించారు కదా! అందువల్ల మహారాజు ఋతుపర్ణుడు ఇష్టంగా ఒక్క రోజులోనే వచ్చాడు.
ఋతుపర్ణమహారాజు అయోధ్యనుంచి నేరుగా ఇక్కడికి నూరు ఆమడలమేర ఒక రోజులో వచ్చి చేరిన సంగతి నువ్వు వినలేదా? నేను కూడా మనోవేగంతో అతడితోపాటు వచ్చాను” అన్నాడు.
కేశిని “మూడవ వ్యక్తి ఎవరు వచ్చారు?” అని అడిగింది.
కేశినితో బాహుకుడు “అతడు ఇదివరకు నలుడికి రథసారథి. అతడి పేరు వార్ష్ణేయుడు, గౌరవించదగిన వ్యక్తిత్వం కలవాడు” అన్నాడు.
అతడి మాటలు విని కాశిని “అయితే వార్ష్ణేయుడికి నలుడి జాడ తెలియకుండా ఉంటుందా?” అని అడిగింది.
అప్పుడు బాహుకుడు “వార్ష్ణేయుడు నిషధ నుంచి నలుడి పిల్లల్ని తీసుకుని వెళ్లి విదర్భరాజు దగ్గర వదిలిపెట్టి తాను వెళ్లిపోతూ మార్గ మధ్యంలో నలుడు జూదంలో రాజ్యాన్ని పోగొట్టుకున్న విషయం తెలుసుకుని ఋతుపర్ణుడి కొలువులో చేరాడు.
అందువల్ల వార్ష్ణేయుడికి కూడ నలుడి విషయాలు తెలియవు. నలుడి గురించిన విషయాలు భీమరాజు కూతురు దమయంతికే తెలియాలి. లేదా నలుడికి తెలియాలి. ఇతరులకి తెలిసే అవకాశాలు లేవు కదా?” అన్నాడు.
అతడు చెప్పింది విని కేశిని “ఆడవిలో ఆ రోజు భార్య చీరలో సగభాగం తీసేసుకుని కనికరం లేకుండా తనమీదే ప్రాణాలు పెట్టుకుని తనతోపాటు అడవికి వచ్చిన ఆమెని వదిలిపెట్టి నలుడు వెళ్లిపోయాడు. దమయంతి ఆ నాటి నుంచీ ఇప్పటివరకు సగం చీరనే కట్టుకుని ఉంది.
ఆమె శరీరం దుమ్ము దూగరతో మలినంగా ఉంది. అమె జుట్టు జడలుగా అల్లుకుపోయింది. నేలమీదే పడుకుని నిద్రపోతోంది. పతివ్రత అయిన దమయంతి ఇంత కఠోరమైన పవిత్ర వ్రతం చేస్తోంది” అని కేశిని నిందిస్తుంటే నలుడి కళ్లనుంచి ఆగకుండా కన్నీరు ప్రవహించింది. తన ముఖం కేశినికి కనిపించకుండ మరోవైపుకి తిప్పుకున్నాడు.
కేశిని చెప్పిన విషయాలు విని బాహుకుడిచ్చిన సమాధానం విని బాహుకుడే నలుడు కావచ్చని దమయంతి సందేహించింది. కేశినితో “బాహుకుడు ఋతుపర్ణుడికి వంటలవాడని చెప్తారు. వంట చేసేటప్పుడు అతడి ప్రవర్తన పూర్తిగా పరిశీలించిరా!” అని పంపించింది.
కేశిని వెంటనే వెళ్లి వచ్చి బాహుకుడిలో చూసిన అద్భుత విషయాలు దమయంతికి చెప్పింది. “ఆ బాహుకుడి పనులు వర్ణించలేనివి. అతడి శక్తి లోకోత్తరం, మానవాతీతం, ప్రయాస లేనిది. ఇంతకు ముందు జరిగినట్లుగా ఎవరూ చూడలేదు. ఇటువంటిది ఇంతకు ముందు జరిగినట్లుగా ఎవరూ చెప్పగా వినలేదు. అయినా కూడా ఇది నిజం. అతడిని దేవతాపురుషుడు అని చెప్పక తప్పదు.
అమ్మా! అతడి అద్భుత చర్యలు చెబుతాను విను. అతడు గడ్డి పిడికిలితో పట్టుకుని వీచగానే అక్కడ నిప్పు పుట్టింది. అతడి వంట పూర్తయ్యేవరకు కట్టెలు లేకుండా ఆ మంట ఆరిపోకుండ వెలుగుతూనే ఉంది. పాత్రలు కడగాలని అనుకున్న వెంటనే నీరు ఉద్భవించి కడవలు నిండిపోయి నీటి వెల్లువ పెల్లుబుకుతూనే ఉంటుంది.
అతడి చేతుల రాపిడికి నలిగిపోయిన పువ్వుల గుత్తులు కందిపోయినా పరిమళాలు వెదజల్లుతూనే ఉంటాయి. అతడి తేజస్సు చాలా గొప్పది” అని చెప్పింది.
కేశిని చెప్పిన బాహుకుడి అద్భుత చర్యలు విని దమయంతి కేశినిని పంపించి అతడు చేసిన కూరలు తెప్పించుకుని రుచి చూసింది. అతడిలో నలుడి లక్షణాలు ఉండడం గమనించింది. అంతటితో తృప్తి పడక కేశినిని తోడిచ్చి తన కూతురిని, కొడుకుని బాహుకుడి దగ్గరికి పంపించింది.
ఆ పిల్లల్ని చూసి బాహుకుడు వశం తప్పి కన్నీరు కారుస్తూ కొడుకుని, కూతుర్ని వాత్సల్యంతో ఎత్తుకున్నాడు. సంతోషంతో పులకరిస్తున్న శరీరంతో వాళ్లని ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు.
కేశిని వైపు చూసి “ఈ పిల్లలు నా పిల్లల పోలికతో ఉండడం వల్ల వాళ్లు గుర్తొచ్చి బాధపడ్డాను. వీళ్లని ఎత్తుకున్నానని వేరుగా అనుకోకు” అని ఆమె తనను గుర్తుపట్టకుండా ఉండేలా చెప్పాడు.
తరువాత “కేశినీ! నువ్వు ఇంక ఏ పని మీద నా దగ్గరికి రావద్దు. నువ్వు ఇక్కడికి వస్తూ పోతూ ఉంటే చూసేవాళ్లు వేరేవిధంగా అనుకుంటారు. మేము వేరేదేశం నుంచి వచ్చిన అతిథులం. మీకు మాతో ఏం పని ఉంటుంది” అని గట్టిగా కసురుకున్నాడు.
కేశిని తిరిగి వచ్చి దమయంతికి చెప్పింది. దమయంతి తల్లి దగ్గరికి వెళ్లి “అమ్మా! ఇంక సందేహించవలసిన అగత్యం లేదు. సమస్త సద్గుణ సంపదలోను బాహుకుడు తప్పనిసరిగా ప్రజలతో నమస్కారాలు అందుకునే నిషధదేశాధిపతి నలుడే! నా మనస్సు చాలా అనందపడుతోంది. అతడు ఇక్కడికి రావడమా? నేను అక్కడికి వెళ్లడమా? వెంటనే జరగాలి” అని చెప్పింది.
నలదమయంతుల కలయిక
దమయంతి చెప్పిన మాటలు విని ఆమె తల్లి భీమరాజు అనుమతి తీసుకుని బాహుకుణ్ని దమయంతి దగ్గరికే రప్పించింది. నలుడి దేహం వికారంగా ఉన్నా అతడి పరపురుషుడిగా ఎంచలేదు దమయంతి.
స్నేహంతోను, సిగ్గుతోను, తత్తరపాటుతోను అడిగింది “జనాలు తిరగని అడవిలో నిద్రపోతున్నదాన్ని, బలహీనురాలిని, స్త్రీని, సహధర్మచారిణిని, వెంట అడవికి వచ్చినదాన్ని, మృదు ప్రవర్తనకలదాన్ని, అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్నదాన్ని కఠినమైన మనస్సుతో నలుడిలా అడవిలో విడిచిపెట్టి వెళ్లిపోయినవాళ్లు ఇంకెవరూ ఉండరు.
దేవతల్నే వదిలిపెట్టి మిమ్మల్ని కోరుకుని పెళ్లి చేసుకున్నాను, పిల్లల తల్లిని ఎందుకు వదిలి వెళ్లారు? అంత దయలేకపోడానికి నేను చేసిన అపచారం ఏమిటి? నిన్ను నేను ఎప్పటికి విడిచిపెట్టను అని ఎన్నోసార్లు చెప్పిన మాటలు మర్చిపోయారు కదా” అని దమయంతి కన్నీరు కారుస్తోంది.
అమె బాధ చూసి నలుడు దమయంతితో “నన్ను కలి ఆవహించడం వల్ల నా బుద్ధి చెడి అన్ని కష్టాలు పడవలసి వచ్చింది. ఇప్పుడు నన్ను కలి విడిచి వెళ్లిపోయాడు. నేను ఇక్కడికి వచ్చింది నీ విషయం తెలుసుకోవాలనే.
నేను నీ మీద ప్రేమకలవాడిని. సహధర్మచారిణివి, నన్ను మర్చిపోయి మళ్లీ స్వయంవరం ఏర్పరచడం కులస్త్రీకి ధర్మం కాదు. రాజులందరిని ఆహ్వానించడం వల్లనే ఋతుపర్ణుడు ఇప్పుడు విదర్భకి వచ్చాడు” అన్నాడు.
దమయంతి భయంతో నమస్కరించి “నిన్ను వెతకడానికి అనేకమంది బ్రాహ్మణుల్ని అనేక చోట్లకి పంపించాను. పర్ణాదుడనే బ్రాహ్మణుడు నీ సమాధానం విని నిన్ను గుర్తించాడు. తరువాత నిన్ను రప్పించడానికి రేపే దమయంతికి రెండవ స్వయంవరం అని ఒక్క ఋతుపర్ణుడికి మాత్రమే వార్తని తెలియచెయ్యడానికి సుదేవుడనే బ్రహ్మణుడిని పంపించాను.
ఒక్క నలమహారాజు తప్ప వేరెవ్వరు ఒక్క రోజులో నూరు ఆమడల దూరం నుంచి రాలేరు అని ఆలోచించాను. మహారాజా! నేను నీ పాదాలసాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను. నాకు ఏ పాపపు అలోచన లేదు” అని చెప్పింది.
అదే సమయంలో సమస్త భూతాలలో ఉండే వాయుభట్టారకుడు అందరూ వినేట్లు ఆకాశం నుంచి నలుడికి “నలమహారాజా! ఈ దమయంతి నిర్మలమైన ప్రవర్తన కలది, పతివ్రతాశిరోమణి. ఈమెని నేను సూర్యుడు, చంద్రుడు కలిసి మూడు సంవత్సరాలు కాపాడాము. ఈమెకి నీ మీద అపారమైన ప్రేమ. నువ్వు దమయంతిని పరిగ్రహించు” అని చెప్పాడు.
వెంటనే దేవతలు పుష్పవర్షం కురిపించారు. దేవదుందుభులు మోగాయి. వాయుదేవుడు సువాసనలతో కలిసిన గాలిని పంపించాడు.
అందరూ ఆశ్చర్యపోయేలా వాయుదేవుడు తను ఎవరో చెప్పుకుంటూ దమయంతి పతివ్రతా లక్షణాలని, ఆమెకి భర్త యందు గల స్వచ్ఛమైన ప్రేమని చెప్పడం విని నలుడు సంతోషాన్ని పొందాడు. అదే సమయంలో కర్కోటకుణ్ని తలుచుకుని అతడు ఇచ్చిన వస్త్రాన్ని తన మీద కప్పుకున్నాడు.
అంతకు ముందు తనకు ఉండే అందమైన రూపాన్ని పొందాడు. ఆజానుబాహుడు, మేలిమి బంగారు రంగు శరీరం కలవాడు, గొప్ప తేజస్సు కలవాడు, నిషధదేశానికి రాజైన నలుడు తన నిజస్వరూపంతో కనిపించగానే దమయంతి సంతోషంతో పొంగిపోయింది.
చుట్టాలు, స్నేహితులు సంతోషించారు. భూమి పంటమొక్కలు మొలిచినప్పుడు వానపడితే ఆనందపడినట్టు అజ్ఞాతవాసంలో ఉన్న భర్తని కలుసుకుని పరమనందాన్ని పొందింది.
భీమరాజు నగరంలో ప్రత్యేక పూజలు చేయించాడు. పండుగ వేడుక జరుగుతోందని తెలుసుకుని ఋతుపర్ణుడు నలుడి దగ్గరికి వచ్చి “నువ్వు నా దగ్గర బాహుకుడివిగా ఉన్నావు కనుక నిన్ను పోల్చుకోలేక పోయాను. తక్కువ పనులకి నిన్ను నియోగించాను. నన్ను క్షమించు” అని ప్రార్థించాడు.
నలుడు ఋతుపర్ణుణ్ని సత్కరించాడు. ఋతుపర్ణుడు నలుడి దగ్గర్నుంచి అశ్వహృదయం అనే విద్యని పొంది తిరిగి అయోధ్యకి వెళ్లిపోయాడు.
నలుడు విదర్భలో దమయంతితోను, పిల్లలతోను కలిసి ఒక నెల రోజులు సుఖంగా గడిపాడు. తరువాత ఒక్కడే ఒక రథం, పదహారు ఏనుగులు, యాభై గుర్రాలు, ఆరువందలమంది కాలిభటుల్ని తోడుగా తీసుకుని నిషధదేశం రాజధానికి వెళ్లాడు.
అక్కడ పుష్కరుణ్ని కలిసి “పుష్కరమహారాజా! నీకు జూదమాడడం ఇష్టమైతే నేను దమయంతిని పణంగా పెట్టి నీతో జూదమాడడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు నీ రాజ్యాన్ని పణంగా పెట్టి సిద్ధంగా ఉండు. రాజ్యాన్ని అనుభవించవలసింది వీరులు కనుక నువ్వు నేను రథాల మీద కూర్చొనే యుద్ధం చేద్దాం.
యుద్ధంలో గెలిచినవాడే ఈ సమస్త భూరాజ్యాన్ని వీరపురుషుడిగా ఏలుకుంటాడు. నీకు జూదమాడడం ఇష్టమో.. యుద్ధం చేయడం ఇష్టమో.. రెండింటిలో ఒకటి నువ్వే తేల్చుకో!” అని నలుడు పుష్కరుణ్ని అడిగాడు.
అంతకుముందు పుష్కరుడు నలుడి చేతిలో ఓడిపోయాడు. కనుక జూదంలో దమయంతిని గెలుచుకుందామని ఆశపడ్డాడు. పుష్కరుడు నలుడితో “మనం జూదమే ఆడుదాము. నువ్వు నెగ్గితే ఈ సమస్త భూరాజ్యము నీదే. నేను నెగ్గితే దమయంతి నాది” అన్నాడు. ఇద్దరూ జూదమాడారు. పుష్కరుడు ఓడిపోయాడు.
జంబూద్వీపంలో ప్రజలందరికి తెలిసేటట్లుగా నలుడు పుష్కరుడితో రెండోసారి జూదమాడి సమస్త భూరాజ్యాన్ని పొందాడు.
నలుడు పుష్కరుడితో “ఇంతకు ముందు నేను కలితో ఆవహించబడి బలం నశించి నీతో జూదంలో ఓడిపోయాను. అటువంటి నా ఓటమిని నీ బలం వల్ల వచ్చిన విజయంగా అనుకుని గర్వంతో విర్రవీగవద్దు. నువ్వు నా పినతండ్రి కొడుకువి. నీకు నేను ఎటువంటి హాని చెయ్యను” అని చెప్పాడు.
నలుడు పుష్కరుణ్ని విడిచి పెట్టి అన్ని విధాలా సమృద్ధి కలిగిన తన రాజ్యాన్ని తాను ఏలుకున్నాడు. భీమరాజు సౌందర్యవంతురాలయిన దమయంతిని, పిల్లల్ని గొప్ప ఐశ్వర్యంతో నలమహారాజు దగ్గరకు పంపించాడు.
నలమహారాజు భార్య దమయంతితో కలిసి శాస్త్రాల్లో చెప్పబడినట్లు యధావిధిగా అనేక యాగాలు చేశాడు. సకల భూమండలాన్ని దేవేంద్రవైభవంతో పాలించాడు. కనుక నువ్వు జూదంలో ఓడిపోయానని బాధపడకు.
నువ్వు కూడా దైవసహాయంతోను, పురుష సహాయంతోను విరోధుల్ని జయించి సకల భూమండల సామ్రాజ్యాన్ని పాలించగలవు” అని బృహదశ్వుడు ధర్మరాజుకి అక్షహృదయం అనే విద్యని ఉపదేశించాడు.
ధర్మరాజా! ఈ నలుడి కథని శ్రద్ధతో వినేవాళ్లు, సమావేశాలలో చదివి వినిపించేవాళ్లు కలివలన సంభవించే దోషాలనుంచి విముక్తులవుతారు. పుణ్యకార్యాలు చెయ్యడం వల్ల పొందే ఫలితాలు పొందుతారు. బహుపుత్రలాభం, పౌత్రవృద్ధి, ఆయురారోగ్య ధనసంపత్తులు కలుగుతాయి.
అన్ని విషాలకి, చెడు విషయాలకి దూరమవుతారు. ధర్మాత్ములవుతారు. ఈ కథ భూలోకంలో ప్రాచీనమైంది. పుణ్యశ్లోకుడైన నలుడిని, ఋజుచరిత్ర కలిగిన ఋతుపర్ణుణ్ని ధ్యానించి, కీర్తిస్తే కలి భయాలు పోతాయి.