మహాభారత కథలు-9: సముద్ర మథనము

1
3

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

సముద్ర మథనము

[dropcap]అ[/dropcap]మృతం తాగడం వల్ల మరణం ఉండదని దేవతలకి తెలిసింది. ఏమయినా సరే అది ఎలా దొరుకుతుందో తెలుసుకుని దాన్ని తాగాలని అనుకున్నారు. పాలసముద్రాన్ని చిలికితే అందులోంచి అమృతం వస్తుంది. కాని, అది అంత తేలికైన పని కాదు. రాక్షసులకి కూడా నచ్చచెప్పి తమతో కలుపుకుంటే సముద్రాన్ని చిలకడం తేలిక అవుతుంది.

అమృతం దొరికాక దాన్ని రాక్షసులే తాగేస్తేనో? దేవతలకి సందేహం వచ్చింది. అప్పటి సంగతి అప్పుడు చూసుకోవచ్చు. ముందు పాలసముద్రాన్ని చిలకడానికి రాక్షసుల సాయం అడగాలని అనుకున్నారు. దేవతలకీ రాక్షసులకీ ఎప్పుడూ పడదు. ఒకళ్లతో ఒకళ్లు పోట్లాడుకుంటూనే ఉంటారు. అయినా సరే, అమృతం తాగాలన్న కోరిక దేవతల్ని ఒకచోట నిలబడనియ్యడం లేదు.

ఒకరోజు దేవతలందరూ రాక్షసుల దగ్గరికి వెళ్లారు. అమృతం తాగితే మరణం ఉండదని, ఎప్పుడూ హాయిగా జీవించే ఉండచ్చని నచ్చ చెప్పారు. చివరికి పాలసముద్రాన్ని చిలికి అమృతాన్ని పొందడానికి తాము సహాయం చేస్తామన్నారు రాక్షసులు.

ఇంద్రుణ్ని తీసుకుని అందరూ కలిసి మేరు పర్వతం మీదకి వెళ్లారు. పాలసముద్రాన్ని చిలకడానికి సన్నాహాలు మొదలుపెట్టారు. అంత పెద్ద సముద్రాన్ని చిలకాలంటే దానికి సరిపడినంత కవ్వం కావాలి. కవ్వం దొరికినా దానికి తిరగడానికి తాడు కావాలి. ఈ రెండూ దొరికినా కవ్వం భూమిలో కూరుకుని పోకుండా దానికి కింద ఆధారం కావాలి. ఏం చెయ్యాలా.. అని అనేక విధాలుగా ఆలోచిస్తున్నారు.

ఏదయినా సాధించాలి అనుకుంటే ముందు పట్టుదల ఉండాలి, తరువాత దానికి తగిన జ్ఞానం ఉండాలి, అవసరమైన పరికరాలు ఉండాలి. దేవతలు, రాక్షసులు అమృతం తాగాలన్న పట్టుదలతో ఉన్నారు. ఎలా చేస్తే అమృతాన్ని పొందవచ్చో ముందుగా తెలుసుకున్నారు. పరికరాల కోసం ఆలోచిస్తూ బ్రహ్మ, విష్ణువుల్ని కలిసి సలహా అడిగారు.

అన్ని పర్వతాల్నీ కలిపితే ఎంత పొడవు ఉంటుందో అంత పొడవుతోను, వంకర లేకుండాను, కదలకుండా స్థిరంగాను, తన మీద పెరిగే మూలికల రసంతో దృఢంగాను, అన్ని పర్వతాల కంటే పెద్దదిగాను ఉన్న మంథర పర్వతాన్ని పాలసముద్రం చిలకడానికి కవ్వంగా ఉపయోగించమని సలహా ఇచ్చారు.

భూమి పైకి పదకొండు యోజనాలు, భూమి లోపలికి పదకొండు యోజనాలు ఉన్న మంథర పర్వతాన్ని సర్పరాజు ఆదిశేషుడు పెల్లగించాడు. దేవతలు రాక్షసులు కలిసి దాన్ని మోసుకుని వచ్చి సముద్రంలో పడేశారు. వెంటనే అది సముద్రంలో పైకి నిలవకుండా లోపలికి కూరుకుని పోయింది.

పర్వతం కదలకుండా ఉండడానికి ఏం చెయ్యాలని విష్ణుమూర్తిని సలహా అడిగారు. మంథర పర్వతం సముద్రంలో కూరుకుని పోకుండా దాని అడుగున కూర్మావతారంతో తనే ఆధారంగా ఉంటానన్నాడు.

మంథర పర్వతాన్ని కవ్వంగాను, కూర్మావతారంలో ఉన్న విష్ణుమూర్తిని దానికి ఆధారంగాను ఏర్పాటు చేసుకున్నారు. కాని, కవ్వాన్ని తిప్పాలంటే తాడు కావాలిగా? బాగా ఆలోచించి.. చాలా పొడవుగా ఉండే వాసుకి అనే పేరుగల పాముని తెచ్చి తాడుగా చేసుకున్నారు. వాసుకి మంథర పర్వతాన్ని చుట్టలుగా చుట్టుకున్నాడు.

రాక్షసులు సర్పరాజు తలవైపు బలంగా పట్టుకున్నారు. దేవతలు వాసుకి తోక భాగాన్ని పట్టుకున్నారు. దేవతలు, రాక్షసులు కూడా అమృతాన్ని తాగే తీరాలి అనే పట్టుదలతో పాలసముద్రాన్ని చిలకడం మొదలు పెట్టారు.

వాళ్లు పడుతున్న శ్రమని చూసి వాళ్లకి ఉన్న శక్తి సరిపోదనుకున్నాడు విష్ణుమూర్తి. అందుకని వాళ్లకి ఇంకా కొంత శక్తిని, వేగాన్ని ఇచ్చాడు. ఒకళ్లనొకళ్లు జబ్బలు చరుచుకుంటూ; ఉత్సాహ పరుచుకుంటూ; అంతకు ముందు కంటే ఎక్కువ వేగంతో కవ్వాన్ని తిప్పుతూ; పాలసముద్రాన్ని చిలుకుతున్నారు.

వాళ్ల కష్టానికి ఫలితం దక్కలేదు. ముందు విషం పుట్టి లోకాలన్నింటినీ దహించేస్తూ అన్ని వైపులకీ వ్యాపించించడం మొదలుపెట్టింది. భయపడి పరుగులు పెడుతూ అందరూ శివుడి దగ్గరికి వెళ్లారు.

శివుడు ఆ విషాన్ని తన కఠంలో బంధించి ఉంచాడు. దేవతలు, రాక్షసులు పాలసముద్రం దగ్గరికి వెళ్లి మళ్లీ చిలకడం మొదలు పెట్టారు. వాళ్లల్లో అమృతాన్ని తాగాలన్న పట్టుదల ఇంకా పెరిగిపోయింది.

ఈసారి జ్యేష్టాదేవి, చంద్రుడు, లక్ష్మీదేవి, ఉచ్ఛైశ్రవము అనే పేరుతో తెల్లని గుర్రము, కౌస్తుభమణి, అమృతంతో నిండిన కమండలంతో దేవ వైద్యుడు, ఐరావతమనే పేరుగల తెల్లని ఏనుగు ఇంకా అనేకమంది వ్యక్తులు, వస్తువులు, జంతువులు మొదలైనవన్నీ పుట్టాయి.

వాటిలో ముల్లోకాలతో పూజింపబడుతున్న లక్ష్మీదేవి, సూర్యకిరణాల కాంతి కంటే ఎక్కువ కాంతితో ప్రకాశించే కౌస్తుభమణి విష్ణుమూర్తి వక్షస్థలం మీదకీ; ఉచ్ఛైశ్రమనే గుర్రము, ఐరావతమనే ఏనుగు ఇంద్రుడి దగ్గరికీ చేరుకున్నాయి.

ఇంకా పట్టుదలతో పాలసముద్రాన్ని చిలుకుతూనే ఉన్నారు. చివరికి అమృతాన్ని సాధించారు. వాళ్ల ఆనందానికి అవధులు లేవు. సంతోషంతో ఉప్పొంగిపోయారు.

అమృతం సాధించిన తరువాత దేవదానవుల మధ్య యుద్ధం జరిగింది. దాన్ని గురించి తెలుసుకుందాం..

పాలసముద్రాన్ని చిలికినప్పుడు వచ్చిన అమృతాన్ని రాక్షసులు తీసేసుకున్నారు. దేవతలు ఊరుకుంటారా? ఆ విషయం విష్ణుమూర్తికి చెప్పారు. విష్ణుమూర్తి తక్కువవాడా? వెంటనే అందమైన మోహిని రూపంలో రాక్షసుల దగ్గరికి వచ్చాడు. రాక్షసులు అందంగా ఉన్న మోహినిని చూసి అమృతం గురించి మర్చిపోయి మోహిని వెంట పడ్డారు. అమృతం విష్ణుమూర్తి చేతికి వచ్చింది.

మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి దేవతల్ని ఒకవైపు, రాక్షసుల్ని ఒకవైపు కూర్చోమన్నాడు. తనే స్వయంగా అందరికీ అమృతం పంచుతానని చెప్పాడు. దేవతలు, రాక్షసులు మోహిని చెప్పినట్టే కూర్చున్నారు.

మోహిని దేవతల వైపు అమృతం పంచుతుంటే వాళ్లు తాగుతున్నారు. రాక్షసుడు రాహువు కూడా దేవతల వరుసలో కూర్చున్నాడు. చంద్రుడు, సూర్యుడు అతణ్ని చూసి విషయం మోహినికి చెప్పారు. అప్పటికే మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి రాహువుకి అమృతం పోసేశాడు.

సూర్య చంద్రులు చెప్పింది విని విష్ణుమూర్తి వెంటనే తన చక్రంతో రాహువు తల నరికేశాడు. అతడు తాగుతూ ఉన్న అమృతం అతడి కంఠం దగ్గరే ఉండిపోయింది. అప్పటికి ఇంకా రాహువు అమృతాన్ని మింగలేదు.

రాహువు శరీరం భూమి మీద పడిపోయింది. తల భాగం మాత్రం అమృతం తాకడం వల్ల నాశనం లేకుండా ఉండిపోయింది. అప్పటినుంచే రాహువుకి సూర్య చంద్రులతో విరోధం ఏర్పడింది. అది ఇప్పటికీ నడుస్తూనే ఉంది.

అమృతం తమకి పొయ్యలేదని రాక్షసులకి కోపం వచ్చింది. అందరూ కలిసి తమకు రాజైన బలిచక్రవర్తిని కలుసుకుని జరిగిన విషయం మొత్తం చెప్పుకున్నారు. బలిచక్రవర్తితో సంప్రదించి చివరికి ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ దేవతలతో మనకి స్నేహం వద్దు, యుద్ధం చేసి అమృతాన్ని తెచ్చుకుందామని అనుకున్నారు.

యుద్ధమంటే రాక్షస జాతికి చాలా ఇష్టం. వెంటనే రథాలు, గుర్రాలు, ఏనుగులు, కాలిబలం సిద్ధం చేసుకున్నారు. భయంకరమైన ఆకారాలతో పెద్ద పెద్ద కేకలు వేస్తూ దేవతల మీదకి యుద్ధానికి వెళ్లారు.

దేవతల మీద ఆపకుండా బాణాలు వేశారు. ఆ బాణాలు దేవతల్ని భయంకరంగా చుట్టుముట్టాయి. అది చూసిన దేవతలు విష్ణుమూర్తితో సహా యుద్ధానికి దిగారు. పెద్ద పెద్ద పర్వత శిఖరాల మీద ఎక్కి రాక్షసుల మీద బాణవర్షం కురిపించారు.

పై నుంచి ఆగకుండా మీద పడుతున్న బాణాలకి రాక్షసులు పెద్ద పెద్ద కేకలు వేస్తూ కూలబడి పోతున్నారు. విష్ణుమూర్తి ప్రయోగించిన చక్రానికి రాక్షసుల తలలు తెగి పడుతున్నాయి. యుద్ధరంగం మొత్తం రాక్షసుల రక్తంతో నిండి పోయింది.

సముద్రపు ఒడ్డు దగ్గర జరుగుతున్న యుద్ధంలో రాక్షసులు ఓడిపోయారు. మరణించగా మిగిలిన రాక్షసులు సముద్రం అడుగుకి వెళ్లిపోయారు. అమృతాన్ని జాగ్రత్తగా కాపాడమని ఇంద్రుడికి అప్పగించి దేవతలందరూ తమ ప్రదేశాలకి వెళ్లిపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here