కాజాల్లాంటి బాజాలు-29: మహాభోగి పంకజంపిన్ని

0
3

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]ఇ[/dropcap]వాళ మా పంకజంపిన్ని గురించి మీకు చెప్పాల్సిందే!

అప్పుడు నాకు పదేళ్ళుంటాయి. మా నాన్నగారికి  సాధారణంగా యేడాదికోసారి  బదిలీలు అవుతూండేవి. ఆ రకంగా మేం చాలా ఊళ్ళు తిరగవలసొచ్చేది. కొత్త ఊరు, కొత్త స్కూలు, కొత్త ఫ్రెండ్స్‌తో పాటు కొత్త రకాల మనుషులు కూడా పరిచయమవుతుండేవారు.

అలా పరిచయమైన వారిలో పంకజంపిన్ని ఒకరు. ఆవిడ మా పక్కింటి పిల్లలకి పిన్ని అవుతుంది. వాళ్లతోపాటే మాకు కూడా పంకజంపిన్నే. బలే తమాషాగా వుండేది ఆవిడ ప్రవర్తన. నెలలో మూడు నాలుగు సార్లైనా మొగుణ్ణి తీసుకుని అక్కగారింటికి వచ్చేస్తుండేది. వస్తూనే ముందరి అరుగుమీదున్న బెంచీ మీద కూర్చునేది. పక్కసందులో టూరింగ్ టాకీస్‌లో యే బొమ్మ ఆడుతోందో చూసి రమ్మని రాగానే మొగుణ్ణి అక్కడికి పంపించేది. అక్కడ కూర్చునే మాచేత రాందాసు మిఠాయికొట్టునుంచి తీబూందీ తెప్పించేసుకునేది. పద్దనాబం కొట్లో కొత్తగుడ్డలేవొచ్చేయో కనుక్కు రమ్మని యిటు పక్క వాటాలోని వరలక్ష్మిని పంపేది.

అన్నంలోకి కారపప్పడాలకోసం ఎత్తరుగులయిల్లున్న వెంకటరత్నం దగ్గరికి ఐదేళ్ళ సూరిగాణ్ణి పరిగెత్తించేది. దేశవాళీ కూరలు తిననంటూ వాళ్ల బావని, అంటే అక్కమొగుణ్ణి  గట్టుమీదున్న కూరలకొట్టుకి పంపించి కేబేజీ, టమాటాలాంటి ఇంగ్లీషు కూరలు తెప్పించుకునేది. వాళ్ళక్కని ప్రత్యేకంగా ఫిల్టర్ కాఫీ కోసం పురమాయించేది. భోజనం కూడా అక్కగారు కంచంలో పెట్టి ఆ అరుగుమీదున్న బెంచీ దగ్గరికి తేవాల్సిందే. అలా వేలు కూడా కదిలించకుండా అన్నీకాళ్ల దగ్గరికే రప్పించుకునేది.

అప్పటివరకూ మగవాళ్ళు పనులు చెపుతూ పెత్తనం చేస్తుంటే ఆడవాళ్ళు విధేయంగా పనులు చేసుకుపోవడం చూసిన నేను ఆవిణ్ణి తమాషాగా చూసేదాన్ని. చూస్తున్నకొద్దీ ఆవిడ ప్రవర్తన మరీ మితిమీరిపోయేది. చదువుకుంటున్న కాంతాన్ని పనిమాలా పిలిచి జుట్టుకి కొబ్బర్నూని రాయించుకునేది. తినేసి పక్కనే పడేసిన ఆవిడ కంచం వైపు కుక్క వస్తే ఎదురింట్లోని నల్లసుబ్బడిని గట్టిగా అరిచి, కేకేసి “కుక్కొచ్చింది కొట్టరా వెధవా..” అంటూ వాణ్ణి తిట్టి కుక్కని కొట్టించేది తప్పితే ఆవిడ కొట్టేదికాదు. అలాగ కేవలం నోటికే పని చెప్పేది తప్పితే వేలు కూడా కదిల్చేది కాదు.

ఆవిడ అలా ఆ బెంచీ వదలకపోవడం వల్ల మా నేలాబండా ఆట, స్కూలాట ఆడ్దం కుదరక మాకందరికీ మాచెడ్డ చిరాగ్గా ఉండేది.

అందుకని మేం పిల్లలం మాలో మేము ‘ఎవరైతే పంకజంపిన్నిని బెంచీమీంచి కదిలిస్తారో వాళ్ల పుస్తకాలు వారంరోజులపాటు స్కూల్‌కి వెళ్ళేటప్పుడు మిగిలినవాళ్లం మోస్తా’మని పందెం వేసుకున్నాం.. అందరికీ యెక్కడలేని పిచ్చి అవిడియాలూ వచ్చేసేయి. బొద్దింకని పట్టుకొచ్చి ఆవిడ మీద పడేద్దామని ఒకరంటే, కాదు, తేలుని తెద్దాం అని ఇంకొకరూ. వడ్రంగాణ్ణి పిల్చి, బెంచీ కాళ్ళు కోయించేద్దాం అని మరోడూ. అదంతా యెందుకూ.. పొలిమేరల్లోకి పులి వచ్చిందంటే పరిగెత్తుకుని వెళ్ళిపోతుందని ఇంకోరూ.. యిలా యిలా చాలా చాలా ఆలోచించాం.

ఊహు.. ఇవన్నీ కాదు. .. యేమాట వింటే ఆవిడ చటుక్కున ఆ బెంచీమీంచి లేచి పరిగెడుతుందో ఆ మాట చెప్పాలని దానికోసం అందరం బుర్రలు బద్దలు కొట్టేసుకున్నాం. ఎలాగయితేనేం.. ఆఖరికి అందరం ఒక అభిప్రాయానికి వచ్చేం.

బొత్తిగా లోకజ్ఞానం లేనివాళ్లం. అప్పటివరకూ వరసగా వచ్చే పతివ్రతల సినిమాలు చూసి ఆడవాళ్ళందరికీ మొగుడే దేవుడు అనుకునే అమాయకత్వంలో వుండేవాళ్లం. అందుకని అందరం కలిసి ఆవిడ మొగుడు దెబ్బలు తగిలి ఆస్పత్రిలో వున్నాడని చెపితే ఆవిడ గబుక్కున లేచి మొగుడికోసం పరిగెడుతుందని మహా ఆనందపడిపోయేం.

అంత గొప్పగా ఆలోచించుకున్నందుకు అందరం మహా సంబరపడిపోయేం. అనుకున్నట్టె ఆ కబుర్లూ ఈ కబుర్లూ చెప్పి పంకజంపిన్ని మొగుణ్ణి ఎత్తుదారబంధాల పెద్దింట్లో సామాన్లగదికి పనుందని తీసికెళ్ళి, ఆయన చేతిలో ఓ అరటిపళ్ల అత్తం పెట్టేసి, ఆయన వాటి పని పడుతుంటే మేం ఒక్కొక్కళ్ళం నెమ్మదిగా ఆ గదిలోంచి బైటకొచ్చేసి, తలుపు గడ వేసేసేం.

ఇంకేముంది.. పరిగేఠుకుని పంకజంపిన్ని దగ్గరకొచ్చేసి, “పిన్నీ, పిన్నీ.. బాబాయ్ బస్సు కింద పడిపోయేట్ట.. ఆస్పత్రికి తీసికెళ్ళేరు.. నీతో చెప్పమన్నారు పరంబాబయ్యగారు..” అన్నాం. అంతే.. పాపం పంకజంపిన్ని, తింటున్న పనసతొనలని మరింత తొందరగా నోట్లో కుక్కేసుకుని, “అక్కోయ్.. నీ మరిది బస్సుకింద పడ్దాడటే.. కాస్త పెసరపప్పు యెక్కువేసి ఉప్పిండి చేయించి బావ చేత ఆస్పత్రికి అంపించు. అక్కా, నీ మరిది మాగాయేసుకుని తింటాడ్లే కానీ, తర్వాత నాకు అందులోకి కాస్త అల్లప్పచ్చడి చెయ్యవే.. బొత్తిగా నోరు చచ్చిపోయింది..” అంటూ ఎడంచేతి పక్కనున్న బఠానీల పొట్లం అందుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here